‘గ్రహణం’లో మీడియా | is it political decision to make restrictions on the media ? | Sakshi
Sakshi News home page

‘గ్రహణం’లో మీడియా

Published Wed, Oct 8 2014 2:35 AM | Last Updated on Wed, Oct 17 2018 4:54 PM

‘గ్రహణం’లో మీడియా - Sakshi

‘గ్రహణం’లో మీడియా

డేట్‌లైన్ హైదరాబాద్:  రాజకీయ పార్టీల కార్యకలాపాలను గురించి తెలుసుకునే పూర్తి స్వేచ్ఛ, అధికారం ప్రజలకు ఉన్నాయి. రాజకీయ పార్టీల నిర్వహణ ప్రైవేట్ వ్యవహారం కాదు. ఈ వ్యవహారంలో కూడా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జోక్యానికంటే ముందు ముఖ్యమంత్రి స్వచ్ఛందంగా ఆ నిషేధాన్ని కూడా తొలగిస్తారని ఆశిద్దాం. పత్రికలు చదవాలా వద్దా అనే విషయాన్ని ప్రజలు నిర్ణయించుకుంటారు. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతీయ పార్టీలు, ఉప ప్రాంతీయ పార్టీలు రాజకీయాలు తమ ప్రైవేట్ వ్యవహారం అనుకుంటూ ఉంటాయి.
 
 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మానసపుత్రిక ‘జన్మభూమి’ కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించడానికి గత వారం విజయవాడ వెళ్లినప్పుడు మీడియా స్వేచ్ఛ అంటే తనకు ఎంత గౌరవమో విలేకరుల గోష్టిలో వివరించారు. ‘నేను భావ ప్రకటనా స్వేచ్ఛను, పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తాను కాబట్టి మీరు నన్ను ఇన్ని ప్రశ్నలు వేయగలుగుతున్నా’రని ఉదాహరణ కూడా చూపించారు. ఆయన విజయవాడలో విలేకరులతో ఈ మాటలు చెబుతున్న ప్పుడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తలుపులు సాక్షి దినపత్రిక, సాక్షి న్యూస్ చానల్ విలేకరులకు, కెమెరామాన్‌కు నో ఎంట్రీ పలుకుతూనే ఉన్నాయి. ఒక సంవత్సర కాలం పైగా సాక్షి  మీద ఈ నిషేధం కొనసాగుతూనే ఉన్నది.
 
మీడియా మీద ఆంక్షలు రాజకీయ నిర్ణయమా?

 మొన్న జూన్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చంద్రబాబు పత్రికా గోష్టులకు తన ఇంటి వద్ద కానీ, క్యాంపు కార్యాలయం అయిన లేక్‌వ్యూ అతిథి గృహానికి కానీ సాక్షి గ్రూపుతో బాటు నమస్తే తెలంగాణ దినపత్రిక, టీ న్యూస్ చానళ్ల విలేకరులను అనుమతించడంలేదు. మరీ అవమానకరమైన విషయం - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార శాఖ కమిషనర్ నుంచి ఈ మీడియా సంస్థలకు ముఖ్యమంత్రి పత్రికా గోష్టికి ఆహ్వానం అందుతుంది. అక్కడికి వెళ్లిన విలేకరు లను మాత్రం సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని వెనక్కు పంపిస్తారు. ఇదీ నాలుగు రోజుల క్రితం వరకూ నడుస్తూ వచ్చిన తతంగం. జన్మభూమి కార్యక్రమం కోసం విజయవాడ వెళ్లే ముందురోజు మంత్రివర్గ సమావేశ వివరాలను తెలిపేందుకు నిర్వహించిన పత్రికా గోష్టికి మాత్రం ఈ నాలుగు మీడియా సంస్థల ప్రతినిధులను అనుమతించారు. చంద్రబాబు మనసు మార్చుకున్నం దుకు అభినందించాల్సిందే.
 
 ఈ నిర్ణయం కొనసాగుతుందని ఆశిద్దాం. ఆయన ఎందుకు తన నిర్ణయాన్ని మార్చుకున్నారనే వివరాలలోకి మళ్లీ వెళదాం. ఏడాదికి పైగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు, నాలుగు మాసాలుగా ముఖ్యమంత్రి పత్రికా గోష్టులకు సాక్షి బృందాన్ని, మరి కొన్ని మీడియా సంస్థలను ఎందుకు అనుమతించడం లేదు? అన్న విషయం ముందు తెలుసుకోవాలి కదా. ఆయనే స్వయంగా చెప్పిన కారణం ఏమిటంటే ‘ఇది నా రాజకీయ నిర్ణయం’ అని. ఇది సంపా దకులతో జరిపిన గోష్టిలో చెప్పారాయన. మీడియా మీద ఆంక్షలు విధించడం రాజకీయ నిర్ణయం ఎట్లా అవుతుందని నివ్వెరపోయి ఉంటారు సంపాదకులు. తనకు నచ్చని వార్తలు రాసే పత్రికలనూ, ప్రసారం చేసే చానళ్లనూ కట్టడి చేయడానికో, దారికి తెచ్చుకోవడానికో రకరకాల మార్గాలు అనుసరించిన పాలకులను గతంలో అనేక మందిని చూశాం.  అటువంటి వాళ్లు అన్ని వేళలా విజయం సాధించిన దాఖలాలు లేవు. అటువంటిది సమాచార సేకరణను అడ్డుకుని ఇది నా రాజకీయ నిర్ణయం అని చెప్పుకోవడాన్ని ఏ విధంగా చూడాలి? కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులను తన పార్టీ కార్యక్రమాలకు, ముఖ్య మంత్రిగా తన అధికారిక పత్రికా గోష్టులకు అనుమతించకపోవడానికి చంద్ర బాబు చూపుతున్న కారణం రాజకీయంగా తమకు వ్యతిరేక వార్తలను రాస్తు న్నారనీ, ప్రసారం చేస్తున్నారనీ.
 
 ఇతర రాజకీయ పక్షాలకు వ్యతిరేకంగా, అధి కార పక్షానికి అనుకూలంగా వార్తలు రాసే,  వ్యాఖ్యలు చేసే మీడియా సంస్థలను వాళ్లూ నిషేధిస్తే ఏం జరుగుతుంది? అందుకే చంద్రబాబు వాదన సబబు కాదు. సబబే అని ఆయన అనుకుంటే పక్క రాష్ట్రం తెలంగాణలో రెండు తెలుగు చానళ్ల మీద నాలుగు మాసాలుగా కొనసాగుతున్న అప్రకటిత నిషేధాన్ని వ్యతిరేకించ కూడదు. మీడియా స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్‌లో ఒక విధంగా, తెలంగాణలో మరో విధంగా,  ఢిల్లీలో ఇంకో విధంగా ఉండదు కదా. సరే, తెలంగాణ వ్యవహారానికి వెళ్లే ముందు చంద్రబాబు మనసు ఎందుకు మారిందో చూద్దాం.
 
 భావ ప్రకటనా స్వేచ్ఛంటే ఇద్దరికీ చులకనే!
 రాష్ర్ట విభజన అనంతరం ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే రీతిలో జరిగిన సంఘటనలు ప్రజాస్వామ్య ప్రియులను ఆందోళనలో పడేశాయి. ప్రభుత్వాలకు నివేదించినా  ఫలితం కనిపించక జాతీయ స్థాయిలో ఇండియన్ జర్నలిస్టుల యూనియన్, నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్టుల అభ్యర్థన మేరకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముగ్గురు సీనియర్ పాత్రికేయులతో ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పర్యటనకు ఒక రోజు ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన అధికార పత్రికా గోష్టులకు ఈ నాలుగు మీడియా చానళ్ల ప్రతినిధులను అనుమతించకూడదనే నిర్ణయాన్ని వాపసు తీసుకున్నారు. కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర ఈ నిషేధం కొనసాగుతూనే ఉన్నది. సంపాదకులతో సమావేశం అయిన రోజు చంద్రబాబు దగ్గర ఈ ప్రస్తావన కూడా వచ్చింది. ప్రభుత్వ కార్య క్రమాలకు ఆహ్వానం వెళుతున్నది కదా ఇంకేమిటి! పార్టీ కార్యక్రమాలకు మాత్రం అనుమతించం. ఇది నా రాజకీయ నిర్ణయం అన్నారాయన.
 
 పత్రికలపై తీర్పు చెప్పేది ప్రజలే
 రాజకీయ పార్టీల కార్యకలాపాలను గురించి తెలుసుకునే పూర్తి స్వేచ్ఛ, అధికా రం ప్రజలకు ఉన్నాయి. రాజకీయ పార్టీల నిర్వహణ ప్రైవేట్ వ్యవహారం కాదు. ఈ వ్యవహారంలో కూడా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జోక్యానికంటే ముందు ముఖ్యమంత్రి స్వచ్ఛందంగా ఆ నిషేధాన్ని కూడా తొలగిస్తారని ఆశిద్దాం. పత్రి కలు చదవాలా వద్దా అనే విషయాన్ని ప్రజలు నిర్ణయించుకుంటారు. దేశవ్యా ప్తంగా కొన్ని ప్రాంతీయ పార్టీలు, ఉప ప్రాంతీయ పార్టీలు రాజకీయాలు తమ ప్రైవేట్ వ్యవహారం అనుకుంటూ ఉంటాయి. భావ ప్రకటనా స్వేచ్ఛ పట్ల గౌరవం ఉండదు. జనం మాకు ఓట్లు వేశారు కాబట్టి ఏం చేసినా చెల్లుతుందనే ధోరణిని కొన్ని ప్రాంతీయ పార్టీలు ప్రదర్శించాయి.
 
 ఉద్యమ నేతలైనా ఇంతేనా?
 ఇక తెలంగాణలో భావ ప్రకటనా స్వేచ్ఛ విషయం కూడా ఆందోళన కలిగించేదే. రెండు తెలుగు న్యూస్ చానళ్ల ప్రసారాలు నిలిచిపోయి నాలుగు మాసాలు కావస్తున్నది. చానళ్ల ప్రసారానికి వెసులుబాటు కల్పించే ఎమ్మెస్వోలు హైదరా బాద్ సహా,  పది జిల్లాలలో ప్రసారాలు నిలిపివేశాయి. వాళ్లు చూపుతున్న కారణం ఈ చానళ్లు తెలంగాణ వ్యతిరేకమైనవని. మీడియా సంస్థలు చేసే తప్పులను ఎవరూ వెనకేసుకు రావలసిన పనిలేదు. ఏ తప్పుకైనా  తగిన శిక్ష ఉంటుంది. అయితే అది చట్టానికి లోబడి జరగాలి. ఒక చానల్ ప్రసారం చేసిన అటువంటి కార్యక్రమం మీద చట్టపరమైన చర్యలు జరుగుతూనే ఉన్నాయి. అయినా ప్రసారాలు పునరుద్ధరణకు మాత్రం నోచుకోలేదు. తెలంగాణ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మద్దతుతోనే కేబుల్ ఆపరేటర్‌లు ఈ చానళ్ల ప్రసారాల నిలిపివేత కొనసాగిస్తున్నారన్నది వాస్తవం.
 
  ప్రజాకవి కాళోజీ నారాయణరావు శతజయంతి సభలో ముఖ్యమంత్రి ఎమ్మెస్వోలకు సెల్యూట్ చేసి మీడియా మెడలు విరిచేస్తానని, పది కిలోమీటర్ల లోతున పాతర వేస్తానని స్పష్టం చేశారు. ఆనాటి సభలో ఉన్న కొద్ది వందల మంది చప్పట్లు మొత్తం తెలంగాణ సమాజం ఆమోదంగా చంద్రశేఖర్‌రావు భావిస్తూ ఉంటారని అనుకోవడానికి వీల్లేదు. ఆయనది 30 ఏళ్లకు పైబడిన రాజకీయ అనుభవం. ఓ పదమూడేళ్ల ప్రత్యక్ష ఉద్యమ అనుభవం. పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న ఆనందంలో నుంచి ఇంకా బయటికి రాని కారణంగా ఇలా జరుగుతున్నదా? ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతమని ఏలికలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.
 
 అప్పుడలా! ఇప్పుడిలా!
విభజనకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగరంలో జరిగిన జీవ వైవిధ్య అంతర్జాతీయ సదస్సుకు ఒక సెక్షన్ మీడియాకు అనుమతి ఇవ్వనందుకు పెద్ద ఎత్తున నిరసన తెలిపిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇవ్వాళ అదే హైదరాబాద్‌లో తన ప్రభుత్వ హయాంలో జరుగుతున్న మెట్రో పొలిస్ ప్రపంచ సదస్సుకు మీడియాను దూరంగా ఉంచింది. కారణం ఏమిటంటే కొందరు మీడియా వారు అక్కడ నిరసన తెలిపే అవకాశం ఉందని నిఘా వర్గాలు నివేదిక ఇచ్చాయని. ఉద్యమాలు చేసిన సందర్భంలో నిరసనే ఊపిరిగా జీవించిన సంస్థలు అధికారంలోకి వస్తే ఎంత నిరంకుశంగా వ్యవహరించగల వో చెప్పడానికి ఇదో ఉదాహరణ. నాలుగు సంవత్సరాల విరామం తరువాత డేట్ లైన్ హైదరాబాద్‌లో మళ్లీ సంభాషణ ప్రారంభం మీడియా మీద దాడులకు సంబంధించే కావడం విచారకరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement