సర్వే లీకులు మభ్యపెట్టే ఎత్తుగడే!
వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేయకముందే సంతృప్తా?
* మాఫీ పేరుతో మంజూరు చేసిన నిధులు వడ్డీకే సరిపోలేదు
* ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో సర్వేలు..
* అందుకే ‘సంతృప్తి’ పేరిట సర్వే లీకులిచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు
* ప్రజల్ని మరోసారి మభ్యపెట్టేందుకే అంటున్న విశ్లేషకులు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో అలవికాని హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి గద్దెనెక్కిన చంద్రబాబు.. ఏడాదైనా ఎన్నికల ప్రణాళికలోని ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
రైతులకు వ్యవసాయ రుణ మాఫీ, డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీ, ఇంటింటికో ఉద్యోగం, నిరుద్యోగులకు భృతి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, బెల్టుషాపుల రద్దు, అవినీతి రహితపాలన, మహిళలకు భద్రత... లాంటి అనేక హామీలను నెరవేర్చుతానంటూ చంద్రబాబు ఇబ్బడిముబ్బడిగా ఊరూరా ఎలుగెత్తి ప్రచారం చేశారు. ఇందులో ఏ ఒక్కటీ నెరవేర్చకపోవడంతో ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడలో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు సర్వేల పేరుతో లీకులు ఇస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శనివారం విజయవాడలో నిర్వహించిన టీడీపీ రాష్ట్రస్థాయి సమావేశంలో రుణమాఫీ తదితర పథకాలపై తాను చేయించిన సర్వేలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని వెల్లడించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
రుణమాఫీ వడ్డీలకే సరిపోలేదు..
చంద్రబాబు అధికారంలోకి వచ్చేనాటికి వ్యవసాయ రుణాలు రూ.87,675 కోట్లు ఉండగా.. ఆ రుణాలు ఇప్పుడు రూ.95,597 కోట్లకు పెరిగాయని అధికార వర్గాలు గుర్తుచేస్తున్నాయి. రుణమాఫీ చేసి ఉంటే వ్యవసాయ రుణాల బకాయిలు తగ్గాల్సింది, కానీ, ఎలా పెరిగాయని ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ పేరుతో తొలివిడతగా ఇచ్చిన రూ,4,600 కోట్లు రైతుల రుణాలపై వడ్డీకి కూడా సరిపోలేదనే విషయాన్ని ఉన్నతాధికారి ఒకరు గుర్తు చేశారు. 2013 సంవత్సరానికి సంబంధించిన పెట్టుబడి రాయితీ రూ.2,100 కోట్లు ఎగనామం, సహకార సంఘాల్లో, వాణిజ్య బ్యాంకుల్లో ఈ ఖరీఫ్‌లో పైసా రుణం పుట్టకుండా చేయడంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితుల్లో రుణమాఫీ పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పడం బాబు నైజానికి అద్దం పడుతోంది.
అసలు అమలేకాని హామీపై సర్వేలో 27.65 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారంటూ ప్రచారం చేసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఇతర హామీలదీ అదే పరిస్థితి..
డ్వాక్రా మహిళల రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి, మహిళల భద్రత.. తదితర ఏ ఒక్క హామీని పట్టించుకున్న పాపానపోలేదు. అమలే చేయని పథకాలపై అబద్దపు సర్వేలు చేసి.. దాంట్లో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మభ్యపెట్టడంపై విస్మయం వ్యక్తమవుతోంది. బూటకపు సర్వేలు చేయించడంలో ఆయన ఆరితేరిన వారేనని రాజకీయ పార్టీలు ఉటంకిస్తున్నాయి.