గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కుటుంబాల ఆదాయమే ఎక్కువ
వ్యవసాయేతర కుటుంబాల ఆదాయం రూ.11,348
ఆదాయం పెరుగుదలలోనూ వ్యవసాయ కుటుంబాలదే పైచేయి
ఏపీలో గ్రామీణ కుటుంబాల ఆదాయంలో పెరుగుదల రూ.5,195
ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజివ్ సర్వే వెల్లడి
రైతు కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం రూ.13,661
సాక్షి, అమరావతి: భారత దేశంలో వ్యవసాయ రంగానిదే అగ్రస్థానం. గ్రామాల్లో రైతే రాజు. గ్రామీణులకు అధిక ఆదాయాన్ని సమకూరుస్తోంది వ్యవసాయమే. పంట పండించిన వాడికే ఎక్కువ ఆదాయం వస్తోంది. మిగతా రంగాల వారి ఆదాయం రైతు కుటుంబాలకంటే తక్కువే. నాబార్డు విడుదల చేసిన ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజివ్ సర్వే–2021–22 ఈ విషయాన్ని వెల్లడించింది.
2021–22 సంవత్సరంలో దేశంలోని రైతు కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం రూ.13,661గా ఈ సర్వే తేల్చింది. వ్యవసాయేతర కుటుంబాల ఆదాయం రూ.11,348గా తెలిపింది. 2016–17తో పోలిస్తే 2021–22లో వ్యవసాయ కుటుంబాల నెలవారీ ఆదాయం రూ. 4,558 పెరిగింది. వ్యవసాయేతర కుటుంబాల ఆదాయం రూ.4,488 పెరిగింది.
అన్ని కుటుంబాల్లో సగటు ఆదాయం రూ. 4,616 పెరిగింది. గ్రామీణ ప్రాంతాల కుటుంబాల నెలవారీ మొత్తం వ్యయంలో 47 శాతం ఆహార వస్తువులపైనే ఉందని, 53 శాతం ఆహారేతర వస్తువులపై ఉందని సర్వే తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో..
ఆంధ్రప్రదేశ్‌లో 2021–22లో వ్యవసాయ కుటుంబాల సగటు నెలవారీ ఆదాయం రూ.12,294 అని ఈ సర్వే తెలిపింది. ఈ ఆదాయం 2016–17తో పోల్చితే 2021–22లో రూ. 5,195 పెరిగింది. 2016–17లో రాష్ట్రంలో గ్రామీణ కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం రూ.5,842 కాగా నెలవారీ ఖర్చు రూ.5,746 ఉంది.
నెలవారీ మిగులు కేవలం 96 రూపాయలు మాత్రమే. 2021–22లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం 11,037 రూపాయలుండగా నెలవారీ వినియోగ వ్యయం 10,448 రూపాయలు ఉంది. నెలవారీ మిగులు 589 రూపాయలుగా ఉంది.
సర్వేలో తీసుకున్న అంశాలివీ..
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ, వ్యవసాయేతర, మొత్తం కుటుంబాల నెలవారీ ఆదాయం, వినియోగ వ్యయంపై తొలిసారి 2016–17లో ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజివ్ సర్వే జరిగింది. మళ్లీ 2021–22లో సర్వే చేసినట్లు నాబార్డు తెలిపింది.
ఈ వివరాలను ఇటీవల విడుదల చేసింది. వ్యవసాయ కుటుంబాలతో పాటు వ్యవసాయేతర కుటుంబాలు, గ్రామాల్లోని మొత్తం కుటుంబాల నెలవారీ ఆదాయాన్ని లెక్కించింది. సాగుతో పాటు పశువుల పెంపకం, తోటల పెంపకం, కూలీ, ఇతర వాణిజ్య, వ్యాపారాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు, అటవీ ఉత్పత్తులు, తయారీ కార్యకాలపాలు, ఉపాధి హామీ, వ్యవసాయ కార్మికులు తదితర కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. నెలవారీ వినియోగ వ్యయాన్ని ఆహార, ఆహారేతర వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment