
ప్రపంచంలోనే అతిపెద్ద వివాహ పరిశ్రమగా భారత్
దేశంలో వైభవంగా పెళ్లిళ్లు
సగటు వివాహ వ్యయం రూ.29.60 లక్షలు
కుటుంబ వార్షిక ఆదాయం కంటే మూడు రెట్లు అధికం
ఒక్క పెళ్లి మండపానికే 20 శాతానికి పైగా ఖర్చు
అతిథి సత్కారాలకు వెనుకాడకుండా ప్రణాళిక
వెడ్డింగ్‌వైర్ ఇండియా సర్వేలో వెల్లడి
సాక్షి, అమరావతి: దేశంలో వివాహ ఖర్చు భారీగా పెరుగుతోంది. సగటు కుటుంబ వార్షిక ఆదాయం కంటే మూడు రెట్ల అధిక వ్యయం జరుగుతోంది. ఆభరణాల కొనుగోలు నుంచి దుస్తులు, పెళ్లి మండపాలు, అతిథి సత్కారాలకు వెనుకడుగు వేయకుండా భారీ వ్యయాలు చేస్తున్నారు. దీనికి తోడు వధూవరుల ప్రత్యేక కోర్కెలు సైతం వివాహ ఖర్చులను అమాంతం పెంచేస్తున్నాయి. ఔట్‌ఫిట్స్, ఫస్ట్‌లుక్, మెహందీ, హల్దీ, ఫొటోషూట్, వినోద కార్యక్రమాలను యువత అమితంగా ఇష్టపడుతోంది.
ఈ నేపథ్యంలో భారతీయ వివాహాలు ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమగా రూపాంతరం చెందడం ఆసక్తి కలిగిస్తున్న అంశం. దేశ వివాహ మార్కెట్ విలువ రూ.11 లక్షల కోట్లుగా మార్కెట్ వర్గాల అంచనా. ఏటా దేశంలో దాదాపు కోటి వివాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ‘వెడ్డింగ్‌వైర్ ఇండియా’ సర్వే వివాహాల ఖర్చుపై ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ఆకాశమంత పందిరి... భూదేవంత పీట
భారతీయ కుటుంబ వివాహాల్లో విలాసానికి ప్రాధాన్యం పెరుగుతోంది. సగటున పెళ్లిళ్ల కోసం రూ.29.60 లక్షలకుపైగా ఖర్చవుతోంది. ఇందులో వివాహ వేదికకే 20 శాతానికిపైగా వెచ్చిస్తుండటం విశేషం. 2023లో ఒక వేదికకు సగటున రూ.4.70 లక్షలు ఖర్చు చేస్తే, ఇప్పుడు రూ.6 లక్షలకుపైగా కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ఒక్కోసారి రూ.7.50 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెరుగుతున్నట్లు సర్వే నివేదిక పేర్కొంది. ఆ సందర్భాల్లో మొత్తం వివాహ వ్యయం రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఉండడం విశేషం.
తగ్గేదేలే..
భారతీయ వివాహ వేడుకలు కనీసం మూడు, నాలుగు రోజులు కొనసాగుతున్నాయి. భారీగా వివాహ వ్యయం ధోరణి గ్రామాల్లోకీ విస్తరిస్తోంది. అవసరమైతే అప్పుచేసి మరీ భారీగా శుభ కార్యాన్ని నిర్వహిస్తున్నారు తప్ప, ఖర్చుకు వెనుకాడని పరిస్థితి కనబడుతోంది. అతిథులకు చిరస్మరణీయ ఆతిథ్యం ఇవ్వాలని యువత భావిస్తోంది.
ఇందులో భాగంగా ఆహారం, పానీయాలపై దృష్టి పెడుతున్నారు. క్యాటరింగ్, వినోద కార్యక్రమాలపై ఖర్చులు పెరుగుతున్నాయి. శుభ లేఖలూ ‘వైభవంగా’ ఉండాల్సిందే. అయితే వివాహ ఆహ్వానాలు డిజిటల్ రూపంలోకి మారుతుండడం కొత్త ట్రెండ్.
రెండో అతిపెద్ద మార్కెట్
2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశీయ రిటైల్ మార్కెట్‌లో వివాహ పరిశ్రమ రూ.11 లక్షల కోట్లతో ఆహారం, నిత్యావసరాల తరువాత రెండో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. కొన్ని కీలక విభాగాల మార్కెట్ విలువలు ఇలా...