సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం జాతీయ స్థాయిని మించి నమోదైంది. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన గృహ వినియోగ వ్యయ సర్వే 2022–23 వెల్లడించింది.
వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత ఆహార, ఇతర వస్తువులతోపాటు ఆహారేతర వస్తువుల వినియోగం ఆధారంగా 2022–23 గృహ వినియోగ వ్యయ సర్వే కోసం క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సేకరించినట్టు సర్వే నివేదిక వెల్లడించింది.
ఆహార పదార్థాలైన బియ్యం, గోధుమలు, మొక్కజొన్న రాగులు, పప్పులు, చక్కెర, వంట నూనెలు, ఆహారేతర వస్తువులైన ల్యాప్‌టాప్, పీసీ, టాబ్లెట్, మొబైల్, సైకిల్, మోటార్ సైకిల్, స్కూటీ, స్కూల్ యూనిఫాం, స్కూల్ షూ తదితర వస్తువులను పరిగణనలోకి తీసుకుని నెలవారీ తలసరి వినియోగ వ్యయాన్ని లెక్కించినట్టు సర్వే నివేదిక తెలిపింది.
రాష్ట్రంలో తలసరి వ్యయం ఇలా..
జాతీయ స్థాయిలో గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.3,860 ఉండగా.. పట్టణాల్లో ఆ వ్యయం రూ.6,521 ఉన్నట్టు సర్వే పేర్కొంది. ఏపీ విషయానికి వస్తే గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.4,996 ఉండగా.. పట్టణాల్లో రూ.6,877 ఉన్నట్టు సర్వే వెల్లడించింది. పొరుగు రాష్ట్రం తెలంగాణ గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉంది. తెలంగాణలో తలసరి వినియోగ వ్యయం రూ.4,959గా ఉంది.
అత్యల్పంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.2,257 రూపాయలు ఉండగా.. పట్టణాల్లో రూ.4,557 ఉందని సర్వే తెలిపింది. కేంద్రపాలిత ప్రాంతాల్లో చూస్తే ఛండీగఢ్‌లో గ్రామాల్లో అత్యధికంగా నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.7,467 ఉండగా.. పట్టణాల్లో రూ.12,577 ఉంది. అత్యల్పంగా లడ్హాక్‌లో గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.4,062 ఉండగా.. పట్టణాల్లో రూ.5,511 ఉందని సర్వే నివేదిక తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment