
సర్వే ఆధారంగా నిర్ణయం: సీఎం
లబ్ధిదారుల నుంచి పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తంకావాలి
కార్యక్రమాల అమలులో లబ్ధిదారుల నుంచి సేకరించిన సమాచారంపై సమీక్ష
సాక్షి, అమరావతి: వర్క్ ఫ్రం హోంపై సర్వే నివేదిక ఆధారంగా నూతన పాలసీ తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విద్యార్హతలు ఉండి, పనిచేసే సామర్థ్యం ఉన్నవారికి శిక్షణ ఇవ్వడం ద్వారా ఇంటి నుంచి పనిచేసే అవకాశాలు కల్పించేందుకు ఆయా సంస్థలతో మాట్లాడాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, కార్యక్రమాల నిర్వహణపై సోమవారం సీఎం సమీక్ష చేశారు. వివిధ కార్యక్రమాల అమల్లో లబ్ధిదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అధికారులతో అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో సమీక్షించారు.
ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవల్లో 100 శాతం నాణ్యత కనిపించాలని, లబ్ధిదారుల నుంచి పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తంకావాలని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెంచడం, ప్రజలు సంతృప్తి చెందేలా కార్యక్రమాలు అమలుచేయడంపై అన్ని స్థాయిల్లో దృష్టిపెట్టాలని సూచించారు. పదేపదే ఫిర్యాదులు వస్తున్న విభాగాల్లో బాధ్యులను గుర్తించి మార్పు వచ్చేలా చూడాలని ఆదేశించారు. కిందిస్థాయి ఉద్యోగులు, అధికారులకు కౌన్సెలింగ్ నిర్వహించడం ద్వారా ఉన్నతాధికారులు సేవలు మెరుగుపరచాలని సూచించారు.
ప్రభుత్వ శాఖల్లో అవినీతి విషయంలో ఏమాత్రం సహించొద్దన్నారు. ‘ఆస్పత్రుల్లో అందించే సేవలపై రోగుల నుంచి ప్రభుత్వం అభిప్రాయం సేకరించగా.. 68.6శాతం మంది డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు. డాక్టర్ల ప్రవర్తనపై 71.7 శాతం, సిబ్బంది ప్రవర్తనపై 65.6 శాతం మంది సంతృప్తి వ్యక్తంచేశారు. మందులు ఆస్పత్రుల్లో ఇస్తున్నారా, ప్రభుత్వాస్పత్రిలో పరిశుభ్రత ఎలా ఉందన్న ప్రశ్నలకు 65 శాతం సంతృప్తి వ్యక్తంకాగా.. దీన్ని మరింత మెరుగుపరుచుకోవాలి’ అని సీఎం సూచించారు.
‘ఎప్పటికప్పుడు చెత్త సేకరిస్తున్నారా... అన్న ప్రశ్నకు 67 శాతం మంది అవునన్నారు. రెవెన్యూ సేవలకు సంబంధించి పాసు పుస్తకానికి అదనపు చార్జీలు తీసుకుంటున్నారని.. సర్వే దరఖాస్తుపై దరఖాస్తు రుసుము కాకుండా అదనపు చార్జీలు తీసుకుంటున్నారని ప్రజలు బదులిచ్చారు. రెవెన్యూ సేవల్లో మార్పు కనిపించాలి’ అని సీఎం చెప్పారు. కాగా, ‘పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలప్‌మెంట్’పై మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో జరిగే సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.
అమరావతికి డీప్ టెక్నాలజీ
ప్రభుత్వ క్యాన్సర్ సలహాదారునిగా డాక్టర్ నోరి
డీప్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతికి తేవడానికి కృషిచేస్తానని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రముఖ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. ప్రముఖ క్యాన్సర్ వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు జీవిత ప్రయాణానికి సంబంధించిన ‘మంటాడ టూ మ్యాన్‌హ్యాటన్’ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు సోమవారం విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నోరి దత్తాత్రేయుడు పేద కుటుంబంలో పుట్టి, అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రపంచస్థాయి వైద్యులుగా ఎదిగారని కొనియాడారు.
50 ఏళ్ల పాటు క్యాన్సర్ వైద్యసేవల్లో నిమగ్నమయ్యారన్నారు. నోరి ఫౌండేషన్ పెట్టి ప్రజాసేవ చేస్తున్నారన్నారు. ‘నోరి’ని ఏపీ ప్రభుత్వ క్యాన్సర్ సలహదారుగా నియమిస్తున్నామని ప్రకటించారు. హైదరాబాద్‌లోని బసవతారకం తరహాలోనే అమరావతిలోనూ ఓ క్యాన్సర్ ఆస్పత్రి నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. వచ్చే నాలుగైదేళ్లలో రాష్ట్రంలో ప్రకృతి సాగును 50 లక్షల ఎకరాలకు విస్తరిస్తామన్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment