Political Party
-
ఉచితాలపై సుప్రీం కోర్టు సీరియస్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, సాక్షి:ఉచితాలపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో ఉచితాలను ప్రకటించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. రాజకీయ పార్టీలు ప్రజలను పరాన్న జీవులుగా మార్చేస్తున్నాయని మండిపడింది.పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన ఓ పిటిషన్‌ను జస్టిస్ గవాయ్, జస్టిస్ ఆగష్టీన్ జార్జ్ మసీహ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఉచితాలపై వ్యాఖ్యానించింది. ఉచితంగా రేషన్, ఉచితంగా నగదు అందుతున్నందున ప్రజలు పని చేయడానికి ఇష్టపడం లేదని వ్యాఖ్యానించింది. ఉచితాలతో ఏ పని చేయకుండా ప్రజలు ఆహారం, డబ్బు సంపాదిస్తున్నారని పేర్కొంది.‘‘ఇలా అంటున్నందుకు క్షమించాలి. ఇలాంటి వ్యక్తులను(ఉచితాలను అందుకుంటున్న వాళ్లను) సమాజ పురోగతిలో భాగం చేయకుండా.. పరాన్నజీవుల తరగతిని మనం సృష్టించడం లేదా?. ఎన్నికల సమయంలో ఉచితాలను ప్రకటించడం వల్ల.. పని చేసేందుకు జనం ఇష్టపడడం లేదు. ఎలాంటి పనులు చేయకుండానే ఉచితంగా రేషన్ వాళ్లకు అందజేస్తున్నారు’’ అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు.అయితే పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కలిపించే అంశం కేంద్రం పరిశీలనలో ఉందని అటార్నీ జనరల్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు. ఈ అంశం పరిశీలనకు కేంద్రం ఎంత సమయం తీసుకుంటుందో వివరణ ఇవ్వాలని ఆటార్నీ జనరల్‌ను ఆదేశించిన బెంచ్.. పిటిషన్ విచారణను ఆరువారాల పాటు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. ఉచితాల(freebies)పై దేశ సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేయడం ఇదేం కొత్త కాదు. కిందటి ఏడాది డిసెంబర్‌లోనూ ఇదే తరహాలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేశంలో 81 కోట్ల మంది ఉచితంగా రేషన్, సబ్సిడీల కింద రేషన్ అందుకుంటున్నారనే విషయం కోర్టు దృష్టికి వెళ్లింది. ‘‘ఇలా ఎంత కాలం ఉచితాలు ఇస్తూ పోతారు? వాళ్లకు ఉపాధి కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేమా?’’ అని జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఆనాడు వ్యాఖ్యానించింది. ‘సుప్రీం’కే వెళ్లండి: ఢిల్లీ హైకోర్టుఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌లు పోటాపోటీగా ఉచితాల హామీలు ఓటర్లపై గుప్పించాయి. అయితే ఇది అవినీతి చర్యల కిందకే వస్తుందని మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ ధింగ్రా ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)లో ఓ పిటిషన్ వేశారు. అయితే బుధవారం ఈ పిటిషన్‌ను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం.. సుప్రీం కోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది.ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం.. ఉచితాలు ప్రకటించడం అవినీతి కిందకే వస్తుందని మాజీ న్యాయమూర్తి ధింగ్రా తన పిటిషన్లో పేర్కొన్నారు. మూడు పార్టీలు పోటాపోటీగా ప్రజలకు లంచం ఎర వేశాయి. ఈ వ్యవహారంపై ఈసీని దర్యాప్తునకు ఆదేశించాలని, అలాగే అలాంటి ప్రకటనలు చేసిన వాళ్లు రాజ్యాంగం ప్రకారం అనర్హులుగా ప్రకటించాలని ఆయన కోరారు. అదేవిధంగా.. ఓటర్ల వివరాలను సేకరించడం, వాటిని థర్డ్ పార్టీకి ఇవ్వడం అడ్డుకోవాలని ఆయన తన పిటిషన్లో ప్రస్తావించారు. అయితే.. పిటిషన్‌ను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు.. సుప్రీం కోర్టులో ఇదే తరహా పిటిషన్‌పై విచారణ జరుగుతున్నందున అక్కడికే వెళ్లాలని ఆయనకు సూచించింది. -
కలెక్టర్ గారూ.. మీకిది తగునా!
ఈ ఫొటోలో మంత్రి నారాయణ పక్కన ఉన్నది వాకాటి విజయ్‌కుమార్‌రెడ్డి. ఆయన గతంలో ప్రైవేట్ విద్యాసంస్థకు అధిపతిగా ఉండేవారు. తర్వాత విద్యాసంస్థను వదిలేసి నారాయణకు ఆప్తుడయ్యారు. ఆ క్రమంలోనే 2024 ఎన్నికల్లో పలుచోట్ల బహిరంగ సభల్లో నారాయణతో పాల్గొన్నారు. ఫొటోలు దిగారు. ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలతో మాట్లాడి ఒకచోట సభను పెట్టించారు. ఈ క్రమంలో తనకున్న అనుభవంతో ప్రైవేటు విద్యాసంస్థల వారిని నారాయణకు ఓటు వేసేలా కృషి చేశారు. నారాయణ గెలుపు కోసం వాకాటి విజయకుమార్‌రెడ్డి పాంప్లెట్స్ వేయించారు. వాటిలో తన వ్యక్తిగత ఫోన్ నంబర్‌ను ప్రింట్ చేయించారు. ఆయన గెలుపు కోసం బహిరంగంగా పని చేశారు. నా విజయానికి నీవు సహకరిస్తే.. నీకు రెడ్‌క్రాస్ చైర్మన్ పదవి కట్టబెడతా.. ఇలా ముందస్తుగా అనుకున్న పథకం ప్రకారమే పదవి వాకాటి విజయకుమార్‌రెడ్డిని వరించిందా అంటే అవుననే విశ్లేషకులు అంటున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేయాలని ప్రత్యక్ష రాజకీయాలు చేసిన వాకాటికి కలెక్టర్ ఆనంద్ రెడ్‌క్రాస్ ఎన్నికల్లో సహకారమందించారనేది నగ్నసత్యం. మంత్రి నారాయణ ఒత్తిడి పెట్టినంత మాత్రాన కలెక్టర్ ఒక పార్టీకి కొమ్ము కాయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రెడ్‌క్రాస్ అంటే సేవ చేసే సంస్థ అని ఇందులో రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న వారు ఉండకూడదని నిబంధనల పేరిట కలెక్టర్ ఆనంద్ రెడ్‌క్రాస్ చైర్మన్‌గా ఉన్న పర్వతరెడ్డి చంద్రశేకర్రెడ్డితో పాటు మరో నలుగురు ఎంసీ మెంబర్లకు నోటీçసులు ఇచ్చారు. వారు అందుకు తగిన వివరణ కూడా ఇచ్చారు. అయినప్పటికీ సంతృప్తి చెందని కలెక్టర్ రెడ్‌క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు వైఎస్సార్సీపీకి అనుకూలురంటూ ముద్రవేసి మిగతా మేనేజింగ్ కమిటీ సభ్యులు గంధం ప్రసన్నాంజనేయులు, మలిరెడ్డి కోటారెడ్డి, నేతాజి సుబ్బారెడ్డి తదితరులను తొలగించడమే కాకుండా ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా తీసేశారు. అయితే కోర్టుకెళ్లి తిరిగి విజయాన్ని సాధించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోన్‌రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరులు, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఇప్పటికీ రెడ్‌క్రాస్ సభ్యులుగా కొనసాగుతున్నప్పటికీ వారి ప్రాథమిక సభ్యత్వాన్ని కలెక్టర్ రద్దు చేయలేదు. చట్టబద్ధంగా గెలిచినా.. రెడ్‌క్రాస్‌లో ఉన్న 8వేల ఓట్లలో 6వేల ఓట్లు సాధించి రెడ్‌క్రాస్ చైర్మన్, ఎంసీ పదవులు దక్కించుకున్నప్పటికీ కలెక్టర్ ఆనంద్ వారిని తొలగించారు. మంత్రి అనుచరుడిగా ఉన్న వాకాటి విజయకుమార్‌రెడ్డిని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రెడ్‌క్రాస్ చైర్మన్‌గా ఎన్నికయ్యేందుకు సహకరించారు. మరి మంత్రి నారాయణతో ఫొటోలు దిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొని, వ్యక్తిగత నంబర్ కూడా పాంప్లెట్స్‌లో ఇచ్చిన వాకాటి విజయకుమార్‌రెడ్డి మాత్రం కలెక్టర్‌కు ఎలా రాజకీయేతరుడుగా కనిపించారో తెలియడం లేదు. పాలకులు వస్తుంటారు.. పోతుంటారు. అధికారులు ఎక్కడికెళ్లినా శాశ్వతం. మరి అలాంటి అధికారులు ఒత్తిడికి తలొగ్గితే ప్రజాస్వామ్యం మనుగడ సాగించడం సందేహమే. -
ఏఐ కంటెంట్‌కు లేబులింగ్ తప్పనిసరి: ఈసీ
న్యూఢిల్లీ: ఓటర్ల అభిప్రాయాలను ప్రభావితం చేసే ఏఐ జనరేటెడ్ కంటెంట్ వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏఐ సాంకేతికతతో రూపొందించిన చిత్రాలు, వీడియోలు, ఆడియోలపై ‘ఏఐ జనరేటెడ్/డిజిటల్లీ ఎన్హాన్స్డ్/ సింథటిక్ కంటెంట్ వంటి లేబుల్స్ జతచేయాలంటూ నిబంధనను విధించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌ఫేక్(Deepfake) కారణంగా తప్పుడు సమాచారం ప్రచారంలోకి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్ ఇటీవల హెచ్చరించడం తెల్సిందే. తప్పుడు సమాచారం ఎన్నికల ప్రక్రియపై నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గతేడాది లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియా(Social Media) వేదికల వినియోగంపై ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. ఫిబ్రవరి 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ(Delhi Assembly Elections) ఎన్నికలకు అన్ని పార్టీలు డిజిటల్ ప్రచారకులను నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల డిస్కైమర్లను ఎన్నికల సంఘం తప్పనిసరి చేసింది.ఇదీ చదవండి: శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ -
ఇది మాయ కాక మరేమిటి?
నిరూపించ లేనంత మాత్రాన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా (ఈవీఎం)ల వినియోగ ప్రక్రియలో తప్పులే లేవనో, తప్పిదాలకు ఆస్కారమే లేదనో ధ్రువీకరించినట్టు కాదు. అభియోగాలు మోపేవారు అందుకు హేతువును, తమ సందేహాలకు కారణాలను, తగు సాక్ష్యాధారాలను సంబంధిత వ్యవస్థల దృష్టికి తీసుకు రావాలి. వాటిని స్వీకరించి బాధ్యులైన వ్యక్తులు, సంస్థలు లోతుగా పరిశీలన జర పాలి. అభియోగాలకు ఆధారాలున్నాయో లేదో, అవి తప్పో, కాదో తేల్చాలి. ఈ మొత్తం ప్రక్రియలో పారదర్శకత, జవాబు దారీతనం ముఖ్యం. అది జరగటం లేదు.అయిందానికి, కానిదానికి నిత్యం పరస్పరం విమర్శించుకునే రాజకీయ పార్టీలు ఈవీఎంల విషయంలో అనుసరించే ద్వంద్వ వైఖరి వారి ఆరోపణలకు పస లేకుండా చేస్తోంది. దాంతో వివాదం ప్రాధాన్యత లేకుండా పోతోంది. కానీ, కొన్ని రాజకీయేతర తటస్థ సంఘాలు, సంస్థలు కూడా అభ్యంతరాలు లేవనెత్తాయి. పోలింగ్ శాతాల సమాచారంలో వ్యత్యాసాలను ఎత్తిచూపుతూ, బహిరంగ ప్రజాభిప్రాయానికి విరుద్ధ ఫలితాలనూ... ఈవీఎంల దుర్వినియోగానికి గల ఆస్కారాన్నీ అవి ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చినా... తగిన స్పందన లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఓట్ ఫర్ డెమాక్రసీ (వీఎఫ్‌డీ), అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), సిటిజన్ కమిషన్ ఆన్ ఎలక్షన్ (సీసీఈ) వంటి పౌర సంఘాలు నిర్దిష్టంగా ఫిర్యాదులు చేసినా వాటిని పరిగణనలోకి తీసుకుంటున్న దాఖలాలు లేవు. రాజకీయ పక్షాల నుంచే కాక ప్రజాసంఘాలు, సంస్థల నుంచి నిర్దిష్ట ఆరోపణలు చేసినపుడు కూడా ‘నిరాధారం’, ‘దురుద్దేశ పూర్వకం’ అంటూ, కనీస విచారణైనా జరుపకుండానే ఎన్నికల సంఘం కొట్టిపారేస్తోందన్నది వారిపై ప్రధాన అభియోగం!ఓటు వ్యత్యాసాల పైనే సందేహాలుసాయంత్రం వరకు పోలింగ్ సరళి ఒక విధంగా ఉండి, ముగింపు సమయాల్లో అనూహ్య, అసాధారణ ఓటింగ్ శాతాలు నమోదు కావడం, అలా ఎన్నికల అధికారి రాత్రి ఇచ్చిన గణాంకాలకు భిన్నంగా ఓట్ల లెక్కింపు ముందరి ‘లెక్క’తేలడం పట్ల సందేహాలున్నాయి. కొన్ని నియోజక వర్గాల్లో ఈ ఓట్ల వ్యత్యాసం భారీగా ఉంటోంది. ఇది సార్వ త్రిక ఎన్నికల్లోనే కాకుండా హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీల ఎన్నికల సందర్భంగానూ వెల్లడయిందనేది విమర్శ. గణాంకాలు వారి వాదనకు బలం చేకూర్చేవిగానే ఉన్నాయి. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా, ఆఖరు నిమి షపు ఓట్ల వ్యత్యాసం పది శాతానికి పైగా ఉన్న పది జిల్లాల్లోని 44 అసెంబ్లీ స్థానాల్లో 37 ఎన్డీయే పక్షాలు గెలిచాయి. కానీ వ్యత్యాసం 10 శాతం కన్నా తక్కువగా ఉన్న 12 జిల్లాల్లోని 46 సీట్లలో ఎన్డీయే కూటమి 11 సీట్లు మాత్రమే గెలువగలిగింది. ఇటువంటి పరిస్థితి సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ ప్రతిబింబించిందని విమర్శకులంటారు. ఆఖరు నిమిషపు పోలింగ్ శాతపు పెరుగుదల వరుసగా ఐదు విడతల్లో 0.21%, 0.34%, 0.23%, 0.01%, 0.25% నామ మాత్రంగానే ఉండ టంతో ఎన్డీయే కూటమికి రాజకీయంగా ఇదేమీ లాభించ లేదనేది విశ్లేషణ! అందుకే, అక్కడ లోక్ సభ స్థానాల సంఖ్య 62 నుంచి ఈ సారి 36కి పడిపోయింది. జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తొలివిడతలో ‘ఆఖరు నిమిషపు ఓటింగ్ శాతం’ పెరుగుదల 1.79% నమోదుకాగా బీజేపీ 43లో 17 అసెంబ్లీ స్థానాలు నెగ్గింది. కానీ, రెండో విడత పోలింగ్ సందర్భంగా ఓటింగ్ శాతం పెరుగుదల 0.86%కి పరిమితమైనందునేమో, 38లో 7 సీట్లు మాత్రమే గెలువగలిగింది. ఇదంతా ఈవీఎంల మాయా జాలమే అని విమర్శకులంటారు.కళ్లకు కట్టినట్టు గణాంకాలుమహారాష్ట్రలోని అకోట్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర ఎన్నికల ముఖ్యాధికారిచ్చిన సమాచారం ప్రకారం, పోలింగ్ ప్రక్రియ అన్ని విధాలుగా ముగిసేటప్పటికి ఈవీఎం ద్వారా 2,12,690 ఓట్లు పోలయ్యాయి. లెక్కింపు రోజున ఈవీఎం నుంచి రాబట్టిన ఓట్ల సంఖ్య 2,36,234. అంటే, వ్యత్యాసం 23.544 ఓట్లు. గెలిచిన బీజేపీ అభ్యర్థికి దక్కిన ఆధిక్యత 18,851 ఓట్లు! ఇలా రాష్ట్రవ్యాప్తంగా గమనిస్తే, పోలింగ్ రోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎన్నికల సంఘం వారి ‘యాప్’ ద్వారా వెల్లడైన గణాంకాల కన్నా ఓట్ల లెక్కింపు రోజున రమారమి పెరిగిన సంఖ్య ఉన్న నియోజకవర్గాలు తక్కువలో తక్కువ 95 ఉన్నాయనేది వారి వాదన. ఒకే విడత పోలింగ్ జరిగిన నవంబరు 20, సాయంత్రం 6.15 గంటలకు ఒకసారీ, రాత్రి 11.45 గంటలకు ఒకసారీ ఎన్నికల సంఘం అధికారికంగా ఓటింగ్ శాతాలను వెల్లడించింది. సాయంత్రం సమాచారం వెల్లడించే సమయానికి ఇంకా కొన్ని పోలింగ్ స్టేషన్లలో గడువు లోపల ‘క్యూ’లో చేరిన వారందరూ ఓటు వేసే వరకు, ఎంత సమయమైనా ఓటింగ్ ప్రక్రియ కొనసాగు తుందని పేర్కొన్నారు. ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది గణాంకాలు రాత్రి ప్రకటించిన సమాచారంలో పేర్కొన్నారు. 288 నియోజకవర్గాల్లో సాయంత్రానికి 58.22% (5,64,88,024 ఓట్లు) పోలయినట్టు తెలిపిన అధికారులు రాత్రి అయ్యేటప్పటికి 65.02% (6,30,85,732 ఓట్లు) నమోదైనట్టు చెప్పారు. అంటే, వ్యత్యాసం 65,97,708 ఓట్లన్న మాట! నవంబరు 22న ఓట్ల లెక్కింపునకు కొన్ని గంటలు ముందు, ‘యాప్’ వెల్లడించిన సమాచారం ప్రకారం, రాష్ట్ర మంతటా నమోదైన ఓట్ల సంఖ్య 6,40,85,095. అప్పుడు పోలింగ్ శాతం 66.05%కి చేరింది. ఏమిటీ వ్యత్యాసాలన్న ప్రశ్న ఈవీఎంలపై శంకకు తావిస్తోంది. 288 నియోజక వర్గాల్లోని 1,00,186 పోలింగ్ బూత్‌లలో సగటున 76 ఓట్ల చొప్పున 76 లక్షల ఓటర్లు, ఎలా గడువు తర్వాత ‘క్యూ’ల్లో నిలుచొని ఓటు వేసి ఉంటారనే ప్రశ్న తలెత్తడం సహజం!సందేహాలను నివృత్తి చేసేవిధంగా ఎన్నికల సంఘం సమా ధానం ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. చైతన్యమే దారిదీపం మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా మాల్శిరాస్ తాలూకా మార్కడ్వాడి అనే చిన్న గ్రామంలో జనం తిరగబడ్డారు. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని, ఓట్ల లెక్కింపు తర్వాత ఆరోపిస్తూ గ్రామస్థులు బ్యాలెట్ ద్వారా ‘మళ్లీ పోలింగ్’ జరపాలని వారికి వారే నిర్ణయించారు. కానీ పోలీస్ ఆంక్షలు విధించి సదరు రీపోల్ను అధికారులు జరుగనీయ లేదు. 13 వేల ఓట్ల ఆధిక్యతతో ఎన్సీపీ (శరద్ పవార్) అభ్యర్థి ఉత్తమ్రావ్ జన్కర్ ఎమ్మెల్యేగా ఎన్నికయి కూడా... ఆ గ్రామంలో ఈవీఎం అవకతవకలతో నష్టం జరిగిందని ఆరో పించారు. కులాల వారిగా, విధేయత పరంగా చూసినా... గ్రామంలో తనకు ఆధిక్యత ఉండగా, తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రామ్ సత్పతే (బీజేపీ)కి 160 ఓట్లు ఎక్కువ రావటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. రీపోల్ నిర్వహణకు ప్రేరణ కల్పించారు. తమ ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించనందునే రీపోల్ ఆలోచనని గ్రామ ముఖ్యులు పేర్కొన్నారు. రాజకీయ పార్టీల కార్యకర్తలు పోలింగ్ ఏజెంట్లుగా పోలింగ్ ముగిసే సమయంలో, కౌంటింగ్ ఏజెంట్లుగా ఓట్ల లెక్కింపు మొదలెట్టేప్పుడు ఆ యా కేంద్రాల్లో ఉంటారు. వారీ లెక్కలు సరి చూసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదనే వాదనొకటుంది. ఈవీఎంలలో మాయ ఉందంటే... దానికి సాక్ష్యాలు, ఆధారాలు కావాలి. అనుమానాలు, గణాంకాల్లో సందేహాలు న్నాయంటే దానికి బాధ్యుల నుంచి సమాధానాలు రావాలి. ప్రజలకు కావాల్సింది... పారదర్శక పాలనా వ్యవస్థలూ, పాలకుల నుంచి జవాబుదారీతనం... దట్సాల్!దిలీప్ రెడ్డి వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రీసెర్చి సంస్థ డైరెక్టర్ -
మహారాష్ట్రలో మాటల యుద్ధం.. తుది దశకు ఎన్నికల ప్రచారం
-
నా ఫీజు రూ. 100 కోట్లు: ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి అందరికీ తెలిసిందే. గతంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో వివిధ పార్టీలకు సలహాలు వ్యూహకర్తగా పనిచేసిన ఆయన.. ఇటీవల బిహార్‌లో జనసూరజ్ పార్టీని స్థాపించి పూర్తి రాజకీయ నేతగా అవతరించారు. మరికొన్ని రోజుల్లో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీకి తమ అభ్యర్థులను నిలబెట్టారు.ఈ సందర్భంగా బెలగంజ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వద్ద ప్రచారానికి కూడా డబ్బులు లేవని ఇతర పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పి కొట్టారు. తనది కొత్త పార్టీ కావొచ్చు కానీ తనకు నిధుల సమస్య లేదని అన్నారు.తాను వ్యూహకర్తగా పనిచేసిన సమయంలో ఒక్క ఎన్నికల సమయంలో ఒక్క రాజకీయ పార్టీకి సలహాలిస్తే రూ. వంద కోట్లు తీసుకుంటాననిప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. ఇది స్టార్టింగ్ మాత్రమేనని, తన పనిని బట్టి ఇంకా ఎక్కువ కూడా తీసుకుంటానని తెలిపారు. ఒక రాజకీయ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తే.. ఆ డబ్బుతో రాబోయే రెండేళ్లపాటు తన పార్టీ ప్రచారాన్ని కొనసాగించవచ్చని పేర్కొన్నారు. పది రాష్ట్రాల ప్రభుత్వాలు తన వ్యూహాలను అనుసరిస్తున్నాయని చెప్పారు.‘నా ప్రచారానికి టెంట్లు, గొడుగులు వేయడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండవని, సరిపోదని అనుకుంటున్నారా? నేను అంత బలహీనుడిని అని భావిస్తున్నారా? బీహార్లోనే కాదు నా ఫీజుల గురించి ఇంతవరకు ఎవరూ వినలేదు. నేను ఒక్క ఎన్నికల్లో ఎవరికైనా సలహా ఇస్తే నా ఫీజు రూ. 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువే వసూలు చేశాను. అలాంటి ఒక ఎన్నికల సలహాతో నా ప్రచారానికి నిధులు సమకూర్చుకోగలుగుతున్నాను.కాగా బీహార్‌లో త్వరలో జరిగే నాలుగు ఉప ఎన్నికల్లో జన సురాజ్ పార్టీ తరఫున ఆయన నలుగురు అభ్యర్ధుల్ని నిలబెట్టారు. బెలగంజ్ నుంచి మహ్మద్ అమ్జాద్, ఇమామ్‌గంజ్ నుంచి జితేంద్ర పాశ్వాన్, రామ్‌గఢ్ నుంచి సుశీల్ కుమార్ సింగ్ కుష్వాహా, తరారీ నుంచికిరణ్ సింగ్ ఉన్నారు. నవంబర్ 13న ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న ప్రకటిస్తారు. -
మనం కూడా మంచి వ్యూహకర్తను పెట్టుకుందాం సార్!
మనం కూడా మంచి వ్యూహకర్తను పెట్టుకుందాం సార్! -
ప్రశాంత్ కిశోర్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు
పట్నా: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్.. ‘జన్ సురాజ్’ పేరిట కొత్త పార్టీని ప్రకటించారు. బుధవారం పట్నాలో ప్రముఖుల సమక్షంలో తన రాజకీయ పార్టీ ‘జన్ సూరాజ్ పార్టీ’ని ప్రారంభించారు. మరోవైపు.. జన్ సురాజ్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రశాంత్ కిషోర్ బుధవారం వెల్లడించారు.ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు. ‘‘కార్యకర్తలు, ప్రజలు, అభిమానులంతా ‘జై బీహార్’ అని గట్టిగా నినాదించాలి. ఇకనుంచి మిమ్మల్ని మీ పిల్లలను ఎవరూ ‘బీహారీ’ అని పిలవరు. అలా పిలవటం దుర్భాషలాగా అనిపిస్తుంది. మీ వినిపించే గళం ఢిల్లీకి చేరాలి. బీహార్‌కు చెందిన విద్యార్థులను దాడి చేసిన బెంగాల్‌కు కూడా మీ గళం చేరుకోవాలి. బీహారీ పిల్లలను ఎక్కడ వేధించినా, దాడి చేసినా.. అది తమిళనాడు, ఢిల్లీ, బొంబాయికి ఎక్కడికైనా మీ గళం అక్కడికి చేరాలి’ అని అన్నారు. ఇటీవల బెంగాల్‌లోని సిలిగురికి పరీక్ష రాయడానికి వెళ్లిన ఇద్దరు బిహార్ యువకులను వేధించిన ఘటనలో ఇద్దరు బెంగాల్ వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఇవాళ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.ఇదిలా ఉండగా.. ప్రశాంత్ కిశోర్ ఇటీవల మాట్లాడుతూ.. ‘‘ గత 25 నుంచి 30 ఏళ్లలో లాలూ ప్రసాద్‌కు భయపడి బీజేపీకి ఓట్లు వేసిన రాజకీయ నిస్సహాయతను అంతం చేయడమే ‘జన్ సూరాజ్’ ప్రచారం ముఖ్య ఉద్దేశం. దీని కోసం బీహార్ ప్రజలు మెరుగైన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలి. ఆ ప్రత్యామ్నాయం బిహార్ ప్రజలందరూ కలిసి ఏర్పాటు చేయాలనుకునే పార్టీగా ఉండాలి’ అని అన్నారు.చదవండి: బద్లాపూర్ ఎన్కౌంటర్: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం -
‘ఉచిత హామీ’లపై విచారణ జరుపుతాం
న్యూఢిల్లీ: రాజకీయ పారీ్టలు ఎన్నికల వేళ ఇస్తున్న ఉచిత హామీలపై తప్పకుండా విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు బుధవా రం స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు ఉచితాలపై హామీలు గుప్పించడం.. అత్యంత ము ఖ్యమైన అంశమని, వాటిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జే.బి.పారి్థవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఉచితాలను సవాల్ చేస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ బుధవారం బిజినెస్ లిస్టులో ఈ పిటిషన్లు ఉన్నాయని, వాటిని విచారణకు స్వీకరించాలని కోరారు. తమ పిల్ బుధవారం విచారణకు వచ్చే అవకాశం లేదని, దీన్ని మరో తేదీన విచారించడానికి వీలుగా జాబితాలో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీజేఐ చంద్రచూడ్ స్పందిస్తూ.. ఇది అత్యంత ముఖ్యమైన అంశం. దీన్ని కాజ్ లిస్టులో నుంచి తొలగించబోం’అని చెప్పారు. -
‘పంచాయతీ’ రిజర్వేషన్లు మారుతాయి
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు మారుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలకు స్పష్టం చేసింది. వాస్తవానికి రెండు టర్మ్‌ల వరకు రిజర్వేషన్లు మారకుండా గత ప్రభుత్వం చట్టం చేసిన విష యం తెలిసిందే. అయితే కొత్త ఓటర్ల జాబితాలకు అనుగుణంగా మళ్లీ రిజర్వేషన్లు మారుతాయని, సామాజికవర్గాల రిజర్వేషన్లు మాత్రం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. 50 శాతం మించరాదనే విషయంలో స్పష్టత ఉందని చెప్పింది. అయితే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది అని, ప్రభుత్వపరంగా ఇచ్చే రిజర్వేషన్లను తాము అమలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. క్షేత్రస్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా దామాషాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలన్న ట్రిపుల్ టెస్ట్ పేరిట సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ల మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పింది. శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాల యంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధు లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా పార్థ సారథి మాట్లాడుతూ రాష్ట్రంలోని 12,966 గ్రామ పంచాయతీలు, వాటి పరిధిలోని 1,14,620 వార్డుల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా ఎలాంటి మార్పులు లేకుండా గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను వార్డుల వారీగా తయారు చేసి సెప్టెంబర్ 6న ముసాయిదా జాబితాను గ్రామపంచాయతీల్లో ప్రకటిస్తారని వెల్లడించారు. 7వ తేదీ నుంచి 13 వరకు ముసా యిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి, 19వతేదీ లోగా జిల్లా పంచాయతీ అధికారి పరిష్కరించి.. 21న గ్రామ పంచాయతీ తుది ఓటర్ల జాబితాను వార్డుల వారీగా ప్రకటిస్తారని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రచురణకు ఇచ్చిన ప్రకటనలో పేర్కొన్న విధంగా 9న జిల్లా స్థాయిలో, 10న మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఓటరు ముసాయిదాలో లోపాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తారని చెప్పారు.కిలోమీటర్ పరిధిలోనే పోలింగ్ కేంద్రాలు ఉండాలి : పార్టీల ప్రతినిధులు పోలింగ్స్టేషన్లు ఒక కిలోమీటర్ పరిధిలో ఉండేలా చూడాలని, ఓటర్ల జాబితాను గ్రామపంచాయతీలోని వార్డులుగా విభజించేటప్పుడు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఒకే వార్డులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు సూచించారు. అనుబంధ ఓటర్ల జాబితాలోని ఓటర్లను సంబంధిత వార్డుకు మాత్రమే అనుసంధానిస్తామని, కానీ చివరివార్డుకు కాదని కమిషనర్ తెలిపారు. గ్రామ, మండల స్థాయిలోని ప్రజాప్రతినిధులు ఓటర్లకు తగిన సూచనలు, సలహాలు చేసి వారితో అభ్యంతరాలు క్లెయిమ్ చేయించి.. వారిని ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా అవగాహన కల్పించాలని కోరారు.రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ రాజకీయపార్టీ ప్రతినిధుల సందేహాలపై వివరణ ఇచ్చారు. ఈ సమావేశంలో గోపిశెట్టి నిరంజన్, పి.రాజేశ్‌కుమార్(కాంగ్రెస్), భరత్‌కుమార్ గుప్తా, పి.శశిధర్‌రెడ్డి, దుదిమెట్ల బాలరాజ్యాదవ్ (బీఆర్ఎస్) చింతల రామచంద్రారెడ్డి, రామారావు (బీజేపీ), పల్లా వెంకటరెడ్డి, ఎన్.బాలమల్లేష్ (సీపీఐ), ఎన్.నర్సింహారెడ్డి, నర్సింగరావు (సీపీఎం) బండ సురేందర్‌రెడ్డి (ఏఐఎఫ్బీ), ఇతర పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
టీవీకే జెండాను ఆవిష్కరించిన హీరో విజయ్
చెన్నై: తమిళగ వెట్రి కళగం పార్టీ చీఫ్, స్టార్ హీరో విజయ్ ఆ పార్టీ పార్టీ జెండా, గుర్తును ఆవిష్కరించారు. ఇటీవల తమిళగ వెట్రి కళగం పార్టీని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం చెన్నైలో ఎరుపు, పసుపు రంగులో ఏనుగులతో ఉన్న పార్టీ జెండా, గుర్తును ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రంలో ఆయన తల్లిండ్రులు, మద్దతుదారులు, ఫ్యాన్స్ పాల్గొన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ కసరత్తు చేస్తున్నారు. త్వరలో తిరుచ్చిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.#WATCH | Chennai, Tamil Nadu: Actor and Tamilaga Vettri Kazhagam (TVK) chief Vijay unveils the party's flag and symbol today.(Source: ANI/TVK) pic.twitter.com/J2nk2aRmsR— ANI (@ANI) August 22, 2024 #WATCH | Chennai, Tamil Nadu: Actor and Tamilaga Vettri Kazhagam (TVK) chief Vijay takes pledge along with party workers and leaders at the party office in Chennai "We will always appreciate the fighters who fought and sacrificed their life for the liberation of our country… pic.twitter.com/amiti3rBC2— ANI (@ANI) August 22, 2024 -
అక్టోబర్ 2న ప్రశాంత్‌కిశోర్ కొత్త పార్టీ
పట్నా: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడి అవతారమెత్తనున్నారు. బిహార్‌లో ఆయన ప్రారంభించిన జన్‌సురాజ్ అభియాన్ సంస్థ గాంధీజయంతి సందర్భంగా అక్టోబర్ 2న రాజకీయ పార్టీగా మారనుంది. రాజకీయ పార్టీగా మారేముందు ప్రశాంత్‌కిశోర్ పెద్దఎత్తున కసరత్తు చేయనున్నారు.అక్టోబర్ 2కు ముందు జన్‌సురాజ్ తమ నేతలతో ఎనిమిది రాష్ట్రస్థాయి సమావేశాలు నిర్వహించనుంది. ప్రశాంత్‌కిశోర్ పాదయాత్ర కోసం పనిచేసిన లక్షన్నర మంది కార్యకర్తలతో రాష్ట్రవ్యాప్త సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలన్నింటిలో పార్టీ సంస్థాగత నిర్మాణం ఎలా ఉండాలి.. విధి విధానాలు ఏంటి..పార్టీ ప్రాధాన్యాలేంటన్న విషయాలపై చర్చించి ఫైనల్ చేయనున్నారు.జన్‌సురాజ్ పేరు మీద బిహార్‌లో ప్రశాంత్‌కిశోర్ సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన సభల్లో విద్య, వైద్యం, యువతకు ఉద్యోగ అవకాశాలపైనే ఎక్కువ ఫోకస్ చేసి ప్రసంగించారు. కాగా, ఇటీవల తమ కార్యకర్తలెవరూ జన్‌సురాజ్‌తో సంబంధాలు నెరపొద్దని బిహార్ ప్రతిపక్షపార్టీ ఆర్జేడీ ఒక అంతర్గత సర్కులర్ జారీ చేసింది. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బిహార్‌లో అత్యంత బలమైన పార్టీ అని చెప్పుకునే ఆర్జేడీ తమను చూసి భయపడుతోందని జన్సురాజ్ఎద్దేవా చేసింది. -
దాయాది శత్రుత్వం
భారత యుద్ధం దాయాదుల పోరే. అయితే ఒకరిని ధర్ములని, మరొకరిని అధర్ములని అంటాం. సామ్రాజ్యవాద యుద్ధోన్మాదులెవరు? ప్రజాకంటకులెవరు? స్త్రీలను విధవలను, పిల్లలను అనాథలను చేసిందెరు? ఈ దృష్టితో రాజకీయనాయకులను విశ్లేషించాలి. బంధుమిత్ర, రాజకీయాధికార దాయాదులుంటారు. కొన్నిసార్లు రెండు దాయాదిత్వాలు కలుస్తాయి.కాంగ్రెస్‌కు పిల్ల కాంగ్రెస్‌లు కొంత నష్టంచేశాయి. ఇందిర చతురత, అవసర వామపక్ష సమర్థక చర్యలు కాంగ్రెస్‌ను బలోపేతం చేశాయి. ఆమెకు పాతతరం కాంగ్రెస్‌వాళ్ల వలన జరిగిన నష్టం కంటే, వారికి ఆమెతో నష్టం ఎక్కువ జరిగింది. మోదీ దాయాదిత్వంతో ఆడ్వాణి, మురళి మనోహర్ జోషి, జస్వంత్ సింగ్, యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి వగైరాల రాజకీయ జీవితాలు మాయమయ్యాయి. బీజేపీ అగ్రనాయక ద్వయం గడ్కరీ ఓటమికి విఫలయత్నం చేసిందట. మహారాష్ట్ర శివసేన, నేషనల్ కాంగ్రెస్‌లు దాయాదిత్వంతో చీలాయి.తెలుగు దేశంలో ఎన్టీఆర్ –చంద్రబాబు, చంద్ర బాబు–కేసీఆర్‌ల రాజకీయ దాయాది ద్వేషాలు తెలుగు రాష్ట్రాలకూ, దేశానికీ నష్టం చేశాయి. ఆంధ్ర తాజా పూర్వ ముఖ్యమంత్రికి బంధుమిత్ర దాయాదులతో నష్టం జరిగింది. ప్రతిపక్ష కూటమికి ఊహించని విజయం దక్కింది. వామపక్షాల నుండి పెట్టుబడిదారి పార్టీలకు మారినవారి దాయాదిత్వం వామపక్ష వ్యతిరేక విమర్శలకు తావిచ్చింది. వారికి భావజాల నష్టం కలిగించింది. ప్రతి పార్టీలో కుల మత లింగ వివక్షతలున్నాయి. మహిళా రిజర్వేషన్‌కు పెట్టుబడిదారీ పార్టీల మగ దాయాదిత్వమే అడ్డంకి.సంకీర్ణ పక్షాలే నేడు మోదీకి దాయాదులు. మిత్రులుగా విడిపోగానే, పాత పొత్తును మర్చి ఉక్రోషంతో తిట్టుకున్నారు. పలుమార్లు కలిసి విడిపోయి కలిసిన మోదీ, అమిత్, నితీశ్, బాబు తీవ్రంగా తిట్టుకున్నారు. అధికార కాంక్షతో కలిసినపుడు పాత తిట్లు గుర్తుకురావా? సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలకు నేరుగా చేరాలి. దళారీలకు, కార్పొరేట్లకు లాభం చేయరాదు. అర్హులందరికీ కులమతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రయోజనాలు అందాలి. సమాజాన్ని వర్గ, వర్ణ రహితానికి చేర్చాలి. ఈ ఉన్నత దశకు చేరిన పౌరులు రెండు తరాల వరకు ఆ పాలకులను మరువరు.ఓట్ల కోసమే ఐనా సంక్షేమ పథకాలను తరతమ భేదాలతో అన్ని పార్టీలు ప్రకటిస్తాయి. బెంగాల్లో వామపక్ష ప్రభుత్వం కల్పించిన ప్రజాసౌకర్యాలను తృణాముల్ కాంగ్రెస్ రద్దుచేయలేదు. మరింత మెరుగుపరచింది. స్కాండినేవియన్ దేశాల్లో గత వామపక్ష, సోషలిస్టు ప్రభుత్వాల సంక్షేమ రాజ్య పథకాలను నిన్నటి మధ్యేమార్గ పాలకులు కాని, నేటి మతవాద పాలకులు కాని రద్దుచేయలేకున్నారు. సామ్రాజ్యవాద అమెరికా ఉచ్చులో పడి ప్రపంచీకరణ పథకాలను అనుమతించారు. బహుళజాతి సంస్థలకు సాయపడుతున్నారు. కాని, ప్రజాసంక్షేమాన్ని తగ్గించలేదు. మన రాజకీయులు పోటీపడి అవసరాలను, అమలు అవకాశాలను పరిశీలించకుండా, ఎన్నికల ఎత్తుగడతో కొత్త పథకాలను, పాత పథకాల లబ్ధిని పెంచుతున్నారు. కాని మరో రూపాల్లో ప్రజల నుండి డబ్బు వసూలు చేస్తున్నారు. ఆస్తులు, అధికారాలు వెంటరావు. గుణగణాలు చరిత్రలో నిలుస్తాయి. విభేదాలకు, కలహాలకు... కలిసి మాట్లాడుకోడం, చర్చలే ఏ సమస్యకైనా పరిష్కారం చూపుతాయి.- వ్యాసకర్త ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి, నాగపుర్ నుండి ‘ 94902 04545-సంగిరెడ్డి హనుమంత రెడ్డి -
ఆప్ పార్టీకి సుప్రీం కోర్టులో ఊరట
ఢిల్లీ: ఆప్ పార్టీ ఆఫీసు ఖాళీ చేసే గడువును సుప్రీం కోర్టు పొడిగించింది. సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ఖాళీ చేసే గడువును అత్యున్నత న్యాయస్థానం ఆగస్టు 10 వరకు పొడగిస్తున్నట్లు తెలిపింది. అయితే ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ పార్టీ ఆఫీసు జూన్ 15 లోగా ఖాళీ చేయాల్సి ఉండగా.. ఆప్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కాగా.. ఆప్ కార్యాలయం ఉన్న భూమిని ఢిల్లీ హైకోర్టుకు కేటాయించినట్లు మార్చిలో సుప్రీం కోర్టు పేర్కొంది. మరోవైపు అన్ని రాజకీయ పార్టీ మాదిరిగా దేశ రాజధాని ఢిల్లీలో ఆప్‌కు పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ఆశించింది. ఈ విషయంపై ఆరు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కూడా కేంద్రానికి హైకోర్టు సూచించింది. జూన్ 15న ఆప్ ప్రస్తుత ఆఫీసును ఖాళీ చేయాల్సి ఉండగా వీలైనంత త్వరగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్క్లోని మంత్రిత్వ శాఖల వద్ద కొంత భాగాన్ని తాత్కాలిక ఆఫీసు కోసం కేటాయించాలని ఆప్ హైకోర్టును కోరింది. -
ఎన్నికల్లో పోటీకి.. పోటీపడిన పార్టీలు
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ ఒకటిన జరిగే ఆఖరి విడత పోలింగ్‌తో ఎన్నికలు ముగియనున్నాయి. తాజాగా ఎన్నికల హక్కుల సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) తెలిపిన వివరాల ప్రకారం 2009తో పోలిస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీల సంఖ్య 104 శాతం పెరిగింది.ఏడీఆర్ విశ్లేషణ ప్రకారం 2024లో 751 రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో నిలవగా, 2019లో 766, 2014లో 464, 2009లో 368 పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. 2009 నుంచి 2024 మధ్య ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీల సంఖ్య 104 శాతం పెరిగింది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దిగిన 8,337 మంది అభ్యర్థుల అఫిడవిట్లపై ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ సమగ్ర విశ్లేషణ చేశాయి.2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం 8,360 మంది అభ్యర్థుల్లో 1,333 మంది జాతీయ పార్టీల నుంచి, 532 మంది రాష్ట్ర స్థాయి పార్టీల నుంచి, 2,580 మంది రిజిస్టర్డ్ కాని పార్టీల నుంచి, 3,915 మంది స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బలిలోకి దిగారు. జాతీయ పార్టీలకు చెందిన 1,333 మంది అభ్యర్థుల్లో 443 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 295 మంది అభ్యర్థులు పలు క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. రాష్ట్ర స్థాయి పార్టీలకు చెందిన 532 మంది అభ్యర్థుల్లో 249 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. -
రాజకీయ పార్టీల హామీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోల్లో ఇచ్చే హామీలు అవినీతి కిందకు రావని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హామీలు ఇవ్వడం అంటే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఓటర్లకు ఆర్థిక సాయం చేసినట్లే అవుతుందని, ఇది అవినీతేనని పిటిషనర్ చేసిన వాదనతో సుప్రీం ఏకీభవించలేదు. పిటిషనర్ వాదన వింతగా ఉందని జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ వీకే విశ్వనాథన్‌లతో కూడిన బెంచ్ అభిప్రాయపడింది. కాగా, రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలకు సంబంధించిన మరో కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారంటీలు అవినీతి కిందకే వస్తాయని, అందుకే ఆ పార్టీ నుంచి గెలుపొందిన అభ్యర్థిని పక్కన పెట్టాలని ఒక ఓటరు స్థానిక హైకోర్టును ఆశ్రయించాడు. -
ఢిల్లీలో ఢిపరెంట్ రాజకీయం.. ప్రచార వ్యూహం మారిందా?
బహుళ భాషలు, బహుళ ప్రాంతాల్లో ప్రజలున్న ఢిల్లీలో విభిన్న రీతుల్లో పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మినీ ఇండియాలాంటి ఢిల్లీని దక్కించుకునేందుకు బీజేపీ, ఇండియా కూటమి శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఢిల్లీలో హ్యాట్రిక్ క్లీన్‌స్వీప్ కోసం బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది.బీజేపీ ఏకంగా వివిధ రాష్ట్రాల సీఎంలను ఎన్నికల ప్రచార రంగంలోకి దింపింది. అన్ని రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్న దేశరాజధానిలో ఆయా ప్రాంతాలకు సీఎంలను పంపుతూ ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. క్యాపిటల్‌లో ఓట్లు క్యాష్ చేసుకునేందుకు పార్టీలు డిఫరెంట్ క్యాంపైన్ చేయడమే ఢిల్లీ ఎన్నికల ప్రత్యేకత..ఢిల్లీలో ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరడంతో చివరి నిమిషం వరకు ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ, ఇండియా కూటమి అన్ని వనరులను ఉపయోగిసస్తున్నాయి. ఢిల్లీలో ప్రధానంగా యూపీ, బీహార్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల ప్రజలు అధిక సంఖ్యలో నివసిస్తుండగా, పరిమిత సంఖ్యలో దక్షిణాది ప్రజలున్నారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల సీఎంలను పార్టీలు రంగంలోకి దింపాయి.రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ రాజస్థాన్ ప్రజలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో.. అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రజలు అధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో సీఎం పుష్కర్ ధామి విస్తృతంగా ప్రచారం చేశారు. ఓపెన్ టాప్ జీపుల్లో అభ్యర్థులతో కలిసి ప్రజలకు అభివాదం చేస్తూ తమ పార్టీకి మద్దతివ్వాలని అభ్యర్థించారు. తమ తమ రాష్ట్రాల మాండలికంలో మాట్లాడుతూ వారితో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించారు. రాష్ట్రాలలో తాము అందిస్తున్న పథకాలు, మోదీ గ్యారంటీలు ప్రచారం చేశారు. దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తోందని, ఈసారి కేంద్రంలో హ్యాట్రిక్ ఖాయమని వారు చెబుతున్నారు.ఇటు బీజేపీ మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా తమ ఇతర రాష్ట్రాల నేతలను ప్రచారంలోకి దింపాయి. రాజస్థాన్ సీఎంగా పనిచేసిన అశోక్ గెహ్లట్, సచిన్ పైలట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థలకు మద్దతుగా ఢిల్లీలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ్‌లను ఢిల్లీలోని రాజస్థాన్వాసులకు వివరించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సైతం ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా ప్రచారంచేశారు. ఇటు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి సైతం ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అభ్యర్థించారు.చోటా భారత్‌ను తలపించే ఢిల్లీలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం ఒక్క నాయకుడి వల్లే అయ్యేది కాదు. అందుకే ఆయా రాష్ట్రాల, భాషల ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలలో వారి భాష మాట్లాడే నాయకుడిని పంపి తమకు మద్దతివ్వాలని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఓటరు దేవుళ్లు ఎవరిని కరుణిస్తారో.. ఏ భాషలో సమాధానమిస్తారో చూడాల్సి ఉంది. -
పొలిటికల్ పార్టీలపై కోట్లలో బెట్టింగ్
-
Lok sabha elections 2024: స్లోగన్ పేలింది
సినిమాల్లో ‘పంచ్’ పడితే కలెక్షన్ల సునామీ! అదే పొలిటికల్ ‘పంచ్’ పేలితే? గెలుపు గ్యారంటీ! రాజకీయ పార్టీలు అదిరిపోయే నినాదాలతో జనాల్లోకి వెళ్తున్నాయి. సూటిగా, సుత్తి లేకుండా ఉండే ఈ స్లో‘గన్స్’ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. విపరీతంగా వైరలై ప్రజల మనసులతో పాటు ఓటు బ్యాంకులనూ కొల్లగొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో ‘రావాలి జగన్, కావాలి జగన్’ ఎలా ఊపేసిందో తెలిసిందే. భారత ఎన్నికల చరిత్ర తిరగేస్తే లాల్ బహదూర్ శాస్త్రి మొదలుకుని ఇందిరాగాందీ, వాజ్‌పేయి, మోదీ, కేజ్రీవాల్ దాకా ప్రతి ఒక్కరి జమానాలోనూ ఆయా పార్టీల విజయాలకు దన్నుగా నిలిచి, రాజకీయాలను మలుపు తిప్పిన నినాదాలెన్నో... జై జవాన్, జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన ఈ నినాదం ఇప్పటికీ మార్మోగుతూనే ఉంది. 1964లో నెహ్రూ మరణంతో ప్రధాని పదవి చేపట్టిన శాస్త్రికి యుద్ధం స్వాగతం పలికింది. 1965 భారత్–పాక్ వార్‌లో పోరాడుతున్న సైనికుల్లో జోష్ నింపేందుకు, మరోపక్క దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశంలో తిండిగింజల ఉత్ప త్తిని పెంచేలా రైతుల్లో స్థైర్యాన్ని పెంచేందుకు ఆయన ఈ నినాదమిచ్చారు. హరిత విప్లవానికి కూడా ఇది దన్నుగా నిలిచింది. తాషె్కంట్‌లో శాస్త్రి మరణానంతరం 1967లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిర సారథ్యంలో కాంగ్రెస్‌కు మళ్లీ విజయం సాధించిపెట్టిందీ ఇదే నినాదం! గరీబీ హటావో 1971లో ప్రతిపక్షాలు, సొంత పార్టీ చీలిక వర్గం ఏకమై ఎన్నికల పోరుకు దిగినా కూడా ఒంటిచేత్తో కాంగ్రెస్(ఆర్)ను గెలిపించుకున్నారు ఇందిరా గాం«దీ. పేదరికాన్ని నిర్మూలిద్దామంటూ ఆ ఎన్నికల సందర్భంగా ఆమె ఇచ్చిన ఈ స్లోగన్ జనాల్లోకి బలంగా వెళ్లింది. ఇందిర హటావో, దేశ్ బచావో ఎమర్జెన్సీలో అష్టకష్టాలు పడ్డ ప్రతిపక్షాలన్నీ జనతా పార్టీ పేరిట ఏకమై ఇచ్చిన సమైక్య నినాదం. ఇందిరను తొలగించి దేశాన్ని కాపాడాలన్న పిలుపు ఓటర్లను ఆలోచింపజేసింది. దాంతో 1977 సార్వత్రిక ఎన్నికల్లో జనతా పార్టీ ఘనవిజయం సాధించింది. ఇందిరతోపాటు ఆమె తనయుడు సంజీవ్ గాంధీ కూడా ఓటమి చవిచూశారు. దాంతో కాంగ్రెస్ మళ్లీ చీలింది. కాంగ్రెస్(ఐ) సారథిగా 1978 ఉప ఎన్నికలో కర్నాటకలోని చిక్మగుళూరు లోక్‌సభ స్థానం నుంచి ఇందిర ఘన విజయం సాధించారు. ఆ సందర్భంగా ‘ఏక్ షేర్నీ, సౌ లంగూర్; చిక్‌మగళూరు భాయ్ చిక్‌మగళూరు’ (ఇటు ఒక్క ఆడపులి, అటు వంద కోతులు) స్లోగన్ మారుమోగింది. జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా, ఇందిరా తేరా నామ్ రహేగా 1984లో ఇందిర హత్యానంతరం రాజీవ్ ప్రధాని అయ్యారు. వెంటనే లోక్‌సభను రద్దు చేసి ముందస్తుకు వెళ్లారు. కాంగ్రెస్(ఐ)కి దేశవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తింది. ‘సూర్యచంద్రులు ఉన్నంతదాకా ఇందిర పేరు నిలిచి ఉంటుంది’ అంటూ ప్రజల్లోకి వెళ్లిన రాజీవ్ ఏకంగా 413 సీట్లతో క్లీన్ స్వీప్ చేసి మళ్లీ ప్రధాని అయ్యారు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ 1996 సార్వత్రిక ఎన్నికల్లో ‘బారీ బారీ సబ్ కీ బారీ, అబ్ కీ బారీ అటల్ బిహారీ’ (అందరి వంతూ అయింది, ఈసారి అటల్ బిహారీ వంతు) అంటూ బీజేపీ పిలుపునిచ్చింది. దీనికి మచ్చలేని వాజ్‌పేయి ఇమేజ్ తోడై బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి అధికారం దక్కింది. తొలిసారి 16 రోజుల్లో పడిపోయిన వాజ్‌పేయి ప్రభుత్వం రెండోసారి 13 నెలలకే పరిమితమైంది. దేశాన్ని వృద్ధి బాటన నడిపేందుకు వైజ్ఞానిక రంగంలో స్వయం ప్రతిపత్తి సాధించాలంటూ 1998లో పిలుపునిచ్చిన ‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్’ నినాదం 1999లో బీజేపీకి విజయాన్ని అందించింది. మూడోసారి ఎన్డీఏ సర్కారును విజయవంతంగా నడిపారు వాజ్‌పేయి. కొంప ముంచిన ‘ఇండియా షైనింగ్’ దేశంలో సెల్ ఫోన్లను ప్రవేశపెట్టడం నుంచి ‘స్వర్ణ చతుర్భుజి’ హైవేల ప్రాజెక్టు తదితరాలతో ప్రగతికి పెద్దపీట వేసిన వాజ్‌పేయి సర్కారు 2004 ఎన్నికల్లో అతి విశ్వాసంతో బొక్క బోర్లా పడింది. ధరాభారం తదితరాలతో తాము సతమతమవుతుంటే ‘ఇండియా షైనింగ్ (భారత్ వెలిగిపోతోంది)’ నినాదంతో ఊరూవాడా ఊదరగొట్టడం జనానికి అస్సలు నచ్చలేదు. దాంతో బీజేపీ కొంప మునిగింది. వాజ్‌పేయి సర్కారు ఇంటిబాట పట్టింది. కాంగ్రెస్ కా హాత్, ఆమ్ ఆద్మీ కే సాత్ దాదాపు ఎనిమిదేళ్ల పాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్‌కు 2004లో పూర్వ వైభవం తీసుకొచ్చిన స్లోగన్. వాజ్‌పేయి సర్కారు పేదలను విస్మరించిందని, తాము సంక్షేమ పథకాలతో వారిని ఆదుకుంటామని చెప్పిన తీరు జనాలకు కనెక్టయింది. కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ సర్కారు గద్దెనెక్కింది. సోనియాగాంధీ విదేశీయత వివాదంతో మన్మోహన్ సింగ్ ప్రధానిగా పదేళ్లు కొనసాగారు. అచ్చే బీతే 5 సాల్, లగే రహో కేజ్రీవాల్ నయా రాజకీయ సంచలనంగా దూసుకొచ్చిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను 2020లో ఢిల్లీ పీఠంపై మరోసారి బంపర్ మెజారిటీతో కూర్చోబెట్టిన స్లోగన్. ‘ఐదేళ్లు బాగా గడిచాయి. సాగిపో కేజ్రీవాల్’ అన్న ప్రచారం ఓటర్లను ఆకర్షించింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 70 సీట్లకు ఏకంగా 67 దక్కించుకున్న కేజ్రీవాల్ 2020లోనూ 62 సీట్లతో ప్రత్యర్థులపై ‘చీపురు’ తిరగేశారు. అబ్ కీ బార్ మోదీ సర్కార్ పదేళ్లపాటు ప్రతిపక్షంలో కూర్చున్న కమలనాథులకు 2014లో మళ్లీ అధికారం కట్టబెట్టిన స్లోగన్. నరేంద్ర మోదీని ప్రధాని అభ్యరి్థగా ప్రకటించి, ‘ఈసారి మోదీ ప్రభుత్వం’ నినాదంతో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది. ఇది కార్యకర్తల్లో జోష్ నింపడమే గాక దేశవ్యాప్తంగా మార్మోగి బీజేపీని గెలిపించింది. తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కూడా ‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్’ నినాదంతో ఇండో–అమెరికన్ ఓటర్లను ఆకట్టుకున్నారు. అలాగే ‘అచ్చే దిన్ ఆయేంగే (మంచి రోజులొస్తాయ్)’, ‘చాయ్ పే చర్చ’, సబ్ కా సాత్ సబ్ కా వికాస్ వంటి నినాదాలూ ఆ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ (మరోసారి మోదీ ప్రభుత్వం)’, ‘మోదీ హై తో ముమ్కిన్ హై (మోదీతో సాధ్యం)’ నినాదాలు వైరలయ్యాయి. ఈసారి కమలనాథులు ‘తీస్రీ బార్ మోదీ సర్కార్’ (మూడోసారీ మోదీ సర్కారు), ‘అబ్ కీ బార్ 400 పార్’ (ఈసారి 400 పై చిలుకు)’ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగారు. ఎన్నికల్లో పేలిన మరికొన్ని నినాదాలు... ► జన్‌సంఘ్ కో వోట్ దో, బీడీ పీనా చోడ్ దో; బీడీ మే తంబాకు హై, కాంగ్రెస్‌వాలా డాకూ హై (1967లో భారతీయ జనసంఘ్ నినాదం) ► ప్రోగ్రెస్ త్రూ కాంగ్రెస్ (కాంగ్రెస్‌తోనే అభివృద్ధి. 1960ల్లో నినాదమిది. అయితే, ‘ప్రోగ్రెసా, కాంగ్రెసా’ అంటూ శివసేన ఇచ్చిన కౌంటర్ అప్పట్లో బాగా పేలింది) ► వోట్ ఫర్ కాఫ్ అండ్ కౌ; ఫర్గెట్ అదర్స్ నౌ (ఆవుదూడ గుర్తుకు ఓటేయండి, మిగతా పార్టీలను మర్చిపోండి అంటూ ఇందిరా కాంగ్రెస్ ఇచ్చిన నినాదం. కానీ ఆ గుర్తు ఇందిర, సంజయ్‌లకు ప్రతీక అంటూ వ్యంగ్యా్రస్తాలు పేలాయి) ► జబ్ తక్ రహేగా సమోసా మే ఆలూ, తబ్ తక్ రహేగా బిహార్ మే లాలూ (సమోసాలో ఆలూ ఉన్నంతకాలం బిహార్‌లో లాలూ ఉంటారు) ► జాత్ పర్ నా పాత్ పర్, మొహర్ లగేగీ హాత్ పర్ (కులమతాలకు అతీతంగా హస్తం గుర్తుకు ఓటేద్దామంటూ 1996 ఎన్నికల్లో పీవీ ఇచ్చిన నినాదం) ► సోనియా నహీ, యే ఆంధీ హై; దూస్రీ ఇందిరాగాంధీ హై (సోనియా కాదు, తుఫాను; మరో ఇందిర అంటూ 2009లో కాంగ్రెస్ ఇచ్చిన నినాదం) – సాక్షి, నేషనల్ డెస్క్ -
సెక్యులరిజం ఒక పాడియావు?
ఏదైనా రాజకీయ పార్టీ ఒక సిద్ధాంతాన్ని ప్రకటించినపుడు అందుకు త్రికరణశుద్ధిగా కట్టుబడాలి. ఎటువంటి సమస్యలు ఎదురైనా, అధికారం ఉన్నా పోయినా, ఆ సిద్ధాంతంపై రాజీ పడకూడదు. అందుకు బహిరంగంగా గానీ, పరోక్ష రీతిలో గానీ వెసులుబాట్లు చూపరాదు. అప్పుడే ప్రజలకు ఆ పార్టీ పట్ల, ఆ సిద్ధాంతం పట్ల అచంచలమైన విశ్వాసం ఏర్పడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ నెహ్రూ తర్వాత కాలం నుంచి నేటి వరకు కూడా సెక్యులరిజం విషయమై అటువంటి రాజీలేనితనాన్ని చూపలేదు. ఇందిరాగాంధీ సాఫ్ట్ హిందూత్వ ఎత్తుగడల నుంచి, ప్రస్తుతం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై విధానం వరకు సెక్యులరిజంతో కాంగ్రెస్ దోబూచులలో కనిపించేది అంతా అధికారం కోసం సాగించే ద్వంద్వ నీతే. రాహుల్ గాంధీ ఈనెల 17న కర్ణాటకలోని మాండ్యా సభలో మాట్లాడుతూ, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య పోరాటమని అన్నారు. ఇండియా కూటమి సిద్ధాంతం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటం కాగా, బీజేపీ సిద్ధాంతం ఆ రెండింటినీ కూలదోయట మన్నారు. సరిగా అదే 17వ తేదీన అదే ఇండియా కూటమిలో భాగస్వామి అయిన సీపీఎం పార్టీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తమ రాష్ట్రంలోని పాలక్కాడ్‌లో ప్రసంగిస్తూ, పౌరసత్వ చట్టం (సీఏఏ) వివాదంపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉన్నాయని సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రశ్న కాంగ్రెస్‌కు సహజంగానే ఇబ్బందికరంగా మారింది. దానితో విజయన్‌పై ఎదురు దాడి జరిపింది. మరునాడు 18న కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్స్‌లో ఒకరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేరళ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ ఎన్నికల సభలో పాల్గొంటూ, విజయన్ పైకి కమ్యూనిస్టు అయినా అంతర్గతంగా మతతత్వవాది అనీ, ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీతో రహస్య ఒప్పందం ఉందనీ ఆరోపించారు. అక్కడ అది విన్న వారికీ, కేరళ ప్రజలకూ అదెంత రసవత్తరంగా తోచి ఉంటుందో మనకు తెలియదు. దానినట్లుంచి రాహుల్, విజయన్‌ల మాటలకు వద్దాము. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటం అవసరమని, బీజేపీ వల్ల అందుకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందనే భావన దేశంలో విస్తృతంగా ఏర్పడటం నిజం. వాటి పరిరక్షణకు కాంగ్రెస్ గానీ,ఇండియా కూటమి గానీ నిజంగానే కట్టుబడి ఉంటే దానిని స్వాగతించవలసిందే. కానీ, ఇండియా కూటమికి నాయకత్వ స్థానంలోగలకాంగ్రెస్ పార్టీయే అట్లా కట్టుబడి లేదనే సందేహం, కూటమిలో ఒక ముఖ్య భాగస్వామ్య పార్టీకి కలుగుతున్నదంటే మామూలు విషయం కాదు. సీఏఏ గానీ, దాని అమలుకు తదుపరి చర్యగా భావిస్తున్న యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) గానీ సెక్యులరిజంతో ముడిబడిన అంశాలనే భావన విస్తృతంగా ఉంది. వీటిపై తీవ్రమైన చర్యలు కొన్ని సంవత్సరాలుగా సాగుతున్నాయి. మోదీ ప్రభుత్వం సీఏఏను ఇటీవల అమలుకు కూడా తెచ్చిన దరిమిలా, ప్రస్తుత ఎన్నికలలో అది వివాదంగా మారింది. దానిని తాము అమలుపరచబోమని బెంగాల్, కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు ప్రకటించాయి. కనుక దాని ప్రాముఖ్యత ఎంతో వేరుగా చెప్పనక్కర లేదు. అటువంటి స్థితిలో సీఏఏపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, వారి ఎన్నికల మేనిఫెస్టో విధానమేమిటో ప్రకటించాలని ఎవరైనా కోరుతారు. కానీ అటునుంచి ఇంతవరకుఅంతా మౌనమే. మరొక విశేషం గమనించండి. రాహుల్ గాంధీ ఇటీ వల భారత్ జోడో యాత్రలు నిర్వహించారు. దేశంలో బీజేపీ, మోదీ విద్వేషాన్ని వ్యాపింప జేస్తుండగా తాము ప్రేమను సృష్టిస్తున్నామని అడుగడుగునా ప్రకటించారు. మోదీ విద్వేషం ప్రధానంగా అల్పసంఖ్యాక వర్గాలపై అన్నది విమర్శ. ఆ వర్గాల భయం. వారి భయ కారణాలలో ఒకటి సీఏఏ. కానీ రాహుల్ గాంధీ తన యాత్రలో ఒక్కచోటనైనా ఆ ప్రస్తావన చేయలేదు. ఎందుకన్న ప్రశ్నలు చాలా వచ్చాయి. అయినా తను ఎటువంటి వివరణా ఇవ్వలేదు. ఇవన్నీ గమనించినపుడు కలిగే అభిప్రాయం ఏమిటి? రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కలిపి చూపుతూ వాటి పరిరక్షణ తమ సిద్ధాంతమన్నారు. భారత రాజ్యాంగం సెక్యులరిజాన్ని ప్రవచిస్తున్నది. సమాజంలోని అన్ని వర్గాల పరిరక్షణ ప్రజాస్వామ్యపు మౌలిక లక్షణాలలో ఒకటి. అటువంటప్పుడు, రాహుల్ గాంధీ ఈ విధమైన వైఖరిని తీసుకుంటూ తమ సిద్ధాంతం ఫలానాది అని ప్రకటించటంలో రెండింటికి పొసగేది ఏమైనా ఉందా, లేక అందులో పరస్పర వైరుధ్యం కనిపిస్తుందా? ఇది మర్యాదగా అంటున్న మాట. నిర్మొహమాటంగా అడగాలంటే ఇది కపట నీతి కాదా? ఇది నిస్సందేహంగా కపట నీతే అవుతుంది. ఎందుకీ కపట నీతి అన్నది తర్వాత ఎదురయే ప్రశ్న. ప్రస్తుత పరిస్థితి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, కాంగ్రెస్ పార్టీ కొంత కాలంగా రెండు పరిస్థితుల మధ్య చిక్కుకుని తనతో తానే యుద్ధం చేసుకుంటున్నది. ఆ పార్టీ ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని, వివిధ వర్గాల ప్రజలను తానే చెప్తున్న రాజ్యాంగం ప్రకారం, చట్టాల ప్రకారం, మేనిఫెస్టోల ప్రకారం అభివృద్ధి చేయటంలో అనేక దశాబ్దాల నుంచి విఫలమవుతున్నది. ఆ కారణంగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి, ఓట్లు, సీట్లు, అధికారాలను పోగొట్టుకుంటూ అసలు తన ఉనికి ఏమవుతుందోననే భయానికి గురవుతున్నది. ఆ స్థితి నుంచి బయట పడేందుకు పేదలు, మధ్యతరగతి, రైతులు, కూలీలు, వృత్తిపరులు, బడుగు వర్గాలు, మైనారిటీల ఓట్లు ఆధారమన్నది సంప్రదాయికంగా మొదటినుంచి ఉండిన ఆలోచన. కానీ తన అసమర్థ పాలనవల్ల ఒక్కొక్క వర్గమే దూరమవుతూ రాగా, ఒక దశ వచ్చే సరికి, జనరంజక పాలన ద్వారా ఓట్ల సాధన అనే దృష్టి సహజ మరణం చెందుతూ రాగా, కుల–మత ఆధారిత వ్యూహాలు మొదలయ్యాయి. అందు లోనూ పలు కులాలు ఆయా కుల పార్టీలపట్ల ఆకర్షితం కావటం ఒక సమస్యగా మారింది. ఇందిరాగాంధీ సాఫ్ట్ హిందూత్వ ప్రధానంగా జమ్మూ–కశ్మీర్‌కు పరిమితం కాగా, రాజీవ్ గాంధీ కాలం నుంచి అది జాతీయమై పోయింది. ఆ ప్రకారం ఆయన ఏమేమి చేశారన్న వివరాలలోకి ఇక్కడ వెళ్లలేము. ఆయన తర్వాత పీవీ నరసింహారావు కూడా అదే పని చేశారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ తనతో తాను చేసుకుంటున్న యుద్ధం ఏమంటే, పరిపాలనా వైఫల్యాలవల్ల ప్రజాసమూహాలు దూరమై ఎన్నికలలో పరాజయాలు ఎదురవుతుండిన స్థితిలో, కొత్త వ్యూహం ప్రకారం తనకు ఇటు ముస్లిముల ఓట్లు, అటు హిందువుల ఓట్లు కావాలి. అద్వానీ రథయాత్ర, బాబ్రీ మసీదు కూల్చివేతతో ఆరంభించి బీజేపీ వేగంగా బలపడుతుండటంతో కాంగ్రెస్ కూడా ఈ చట్రంలో చిక్కుకుపోయింది. ఆ ప్రకారం అటు హిందువుల కోసం, ఇటు ముస్లి ముల కోసం రెండు చేతులా కత్తిసాములు చేసినా, రెండు సాము లలోనూ ఓడిపోవటం మొదలైంది. అయితే అందులో ఆశ్చర్యం ఎంతమాత్రం లేదు. ఎందుకన్నది జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన విషయం. హిందువుల విషయంలో ఓడటం పొలిటికల్ సోషియాల జీకి సంబంధించినది. సూటిగా చెప్పాలంటే, హిందూవాదాన్ని 1925 నుంచే చేపట్టిన సంస్థలు, వాటికి వారసులైన బీజేపీ, ఇవన్నీ అందుకు అనుగుణంగా చేపడుతున్న కార్యకలాపాలు నిరంతరం తమ ఎదుట ఉన్న స్థితిలో, హిందూ సమాజం అందుకు కాపీరైట్‌ను బీజేపీకి మాత్రమే ఇస్తుంది. కాంగ్రెస్ సాఫ్ట్ హిందూత్వకు గానీ, అంత కు మించిన మరే వైఖరులకుగానీ విలువ ఉండదు. పోతే, ముస్లిములు కూడా కాలం గడిచేకొద్దీ, కాంగ్రెస్ పార్టీ తమను ఓటుబ్యాంకుగా ఉపయోగించుకోవటం తప్ప, తమ అభివృద్ధికి, భద్రతకు నిజంగా చేసింది చాలా తక్కువనే అభిప్రాయానికి వచ్చారు. దానితో కాంగ్రెస్‌ను తిరస్కరించి ఇతర పార్టీల వైపు చూడటం మొదలైంది. ఆ విధంగా కాంగ్రెస్, తనతో తాను యుద్ధం చేసుకుంటూ ఈ రెండు కత్తిసాములలోనూ ఓడి పోతున్నది. ఈ రోజున కాంగ్రెస్‌ది ఒక దిక్కుతోచని స్థితి. అందుకే, రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, ముహబ్బత్ కీ దుకాన్ ఖోల్ నా అని యాంత్రికంగా వల్లెవేయటమైతే చేయగలరు గానీ, సీఏఏపై మాట్లాడలేరు, ఆ మాట మేనిఫెస్టోలో పెట్టలేరు. ఎందుకని అడిగేవారిపైనే ఎదురుదాడి చేస్తారు. ఎంతటి దయనీయమైన స్థితి. ఒకప్పటి పాడియావు అయిన సెక్యులరిజం క్రమంగా వట్టిపోయిన ఆవుగా మారుతున్నది. - వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -టంకశాల అశోక్ -
ఇవేం పేర్లు బాబోయ్!.. రాజకీయ పార్టీలకు గమ్మత్తైన పేర్లు
ట్వంటీ20. హైటెక్. సాఫ్. సూపర్ నేషన్. జాగ్తే రహో... ఇవన్నీ ఏమిటా అనుకుంటున్నారా? రాజకీయ పార్టీల పేర్లు! వినడానికి చిత్రంగా ఉన్నా ఇది నిజం. మన దేశంలో ఆరు జాతీయ పార్టీలు, 57 రాష్ట్ర పార్టీలున్నాయి. వీటి పేర్లు మనం తరచూ వినేవే. వీటితో పాటు భారత్‌లో ఏకంగా 2,597 గుర్తింపు లేని రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. వీటిలో వినడానికే గమ్మత్తైన, ఆసక్తికరమైన, పేర్లున్న పార్టీలకు కొదవ లేదు. కాకపోతే వీటిలో చాలావరకు ఎన్నికల సమయంలో తప్ప పెద్దగా తెరపైకే రావు. పార్టీ పెట్టడం యమా ఈజీ మన దేశంలో పార్టీ పెట్టడం సులువైన పని. రూ.10 వేలు డిపాజిట్, 100 మంది సభ్యుల మద్దతుంటే చాలు... పార్టీ పెట్టేయొచ్చు. ఏ మతాన్నో, కులాన్నో, ప్రాంతాన్నో కించపరిచేలా లేకపోతే చాలు. దాంతో దేశవ్యాప్తంగా ఇలా వేలాది పార్టీలు పుట్టుకొచ్చాయి. వాటిలో గమ్మత్తైన పేర్లకూ కొదవ లేదు. ఇండియన్ లవర్స్ పార్టీ, ఇండియన్ ఓషియానిక్ పార్టీ, లైఫ్ పీస్ఫుల్ పార్టీ, హోలీ బ్లెస్సింగ్ పీపుల్స్ పార్టీ, లేబర్ అండ్ జాబ్ సీకర్స్ పార్టీ, అఖిల భారతీయ భారత్‌మాతా–పుత్రపక్ష, భారతీయ మొహబ్బత్ పార్టీ, మినిస్టీరియల్ సిస్టం అబాలిషన్ పార్టీ, ఆల్ పెన్షనర్స్ పార్టీ, తమిళ్ తెలుగు నేషనల్ పార్టీ, ఇండియన్ విక్టరీ పార్టీ, ఇంటర్నేషనల్ పార్టీ, చిల్డ్రన్ ఫస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, చాలెంజర్స్ పార్టీ, స్వచ్ఛ భారత్ పార్టీ, సత్యయుగ్ పార్టీ, ఇన్సానియత్ పార్టీ, నేషనల్ టైగర్ పార్టీ, మర్యాదీ దళ్... ఇలా ఈ జాబితా చాంతాడును మించిపోతుంది. ప్రధాని మోదీ ఇటీవల పదేపదే ప్రస్తావిస్తున్న నారీ శక్తి పేరుతో కూడా ఒక పార్టీ ఉంది! ఆమ్ ఆద్మీ పార్టీని తలపించేలా గరీబ్ ఆద్మీ పేరుతో కూడా ఒక పార్టీ ఉంది. ఇక, ద రిలిజియన్ ఆఫ్ మ్యాన్ రివాల్వింగ్ పొలిటికల్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీ పేరునైతే వీటికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు! అయితే ఈ పార్టీల్లో చాలావరకు వ్యవస్థపై తమ అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసేందుకు, ఆదర్శ సమాజ స్వప్నానికి రూపమిచ్చేందుకు వాటి వ్యవస్థాపకులు చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది. రైట్ టు రీకాల్! ...అంటే తమకు నచ్చని ప్రజాప్రతినిధిని చట్టసభ నుంచి తప్పించే హక్కు. భారత్‌లో లేకున్నా చాలా దేశాల్లో ఈ హక్కుంది. కాకపోతే యూపీలో రాకేశ్ సూరి అనే 42 ఏళ్ల కంప్యూటర్ ఆపరేటర్ ఈ పేరుతో ఏకంగా పార్టీయే పెట్టారు. హామీలు నెరవేర్చని ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే ప్రతిపాదనపై పౌరులకు అవగాహన కల్పించడమే ఆయన లక్ష్యమట. అన్నట్టూ, ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఘాజియాబాద్ నుంచి ఆయన పోటీ కూడా చేస్తున్నారు! యూపీలో ఇలాంటి భిన్నమైన పేర్లతో కూడిన పార్టీలకు కొదవ లేదు. సబ్ సే అచ్ఛీ అనే పార్టీ కూడా అక్కడ ఉనికిలో ఉంది. తొలుత దీని పేరు ఇస్లామిక్ డెమోక్రటిక్ పార్టీ. మతపరమైనదిగా ఉందంటూ అభ్యంతరాలు రావడంతో ఇలా మార్చేశారన్నమాట! ఆప్ కీ అప్నీ పార్టీ (పీపుల్స్), సుభాష్ వాదీ భారతీయ సమాజ్‌వాదీ పార్టీ వంటి పార్టీలు కూడా యూపీలో ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Election Commission: హోర్డింగులు, పోస్టర్లపై ప్రింటర్, పబ్లిషర్ పేర్లు ముద్రించాల్సిందే
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు నియమ నిబంధనలు కచి్చతంగా పాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. హోర్డింగులు సహా ఎన్నికల ప్రచారంలో ఉపయోగించే ఇతర సామగ్రిపై ప్రింటర్, పబ్లిషనర్ పేర్లు స్పష్టంగా కనిపించేలా ముద్రించాలని ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో జవాబుదారీతనం, పారదర్శకత కోసమే ఈ నిబంధన విధించినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన హోర్డింగులపై ప్రింటర్, పబ్లిషర్ పేర్లు లేవంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సహా పలువురు ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హోర్డింగుల సహా కరపత్రాలు, పోస్టర్లపై ప్రింటర్, పబ్లిషర్ పేర్లను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. -
Election 2024: ప్రధాని మోదీ బిగ్ ప్లాన్!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటికే ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు వంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే అధికార బీజేపీ ఎన్నికల్లో ప్రచారం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ ఎన్నికల్లో అమలు చేసే వ్యూహాలు, ప్రచార సరళిని క్షేత్రస్థాయిలో చూపించేందుకు ప్రపంచంలోని పలు దేశాలకు సంబంధించి అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలకు ఆహ్వానాలు పంపింది. సుమారుగా 25 విదేశాలకు చెందిన పార్టీలకు ఇప్పటికే ఆహ్వానాలను పంపిచినట్లు తెలుస్తోంది. అయితే అందులో 13 పార్టీల ప్రతినిధులు భారత్‌కు రావడానికి ఆసక్తి చూపినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అయితే 13 పార్టీల ప్రతినిధులు ఏయే దేశాలకు చెందినవారనే పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. బీజేపీ ఆహ్వానించిన విదేశీ పార్టీలు.. అమెరికాలోని అధికార డెమోక్రటిక్ పార్టీ, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీకి బీజేపీ ఆహ్వానం పంపింది. ‘‘అమెరికాలో అధికార, ప్రతిపక్ష పార్టీలు అధ్యక్ష ఎన్నికలు కోసం తలమునకలై ఉంది. అయితే యూఎస్ పార్టీ ఇండియా, యూరప్‌లోని ఎన్నికల విధానానికి భిన్నంగా ఉంటుంది. యూఎస్ పార్టీ కార్యకర్తకు ఆ పార్టీ చీఫ్ తెలియని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడ అధ్యక్ష కార్యాలయం, యూఎస్ కాంగ్రెస్ (చట్ట సభ)కు అక్కడ చాలా ప్రాముఖ్యం ఉంటుంది’’అని ఓ బీజేపీ నేత తెలిపపారు. యూఎస్‌తో పాటు యూకేలోని కన్జర్వేటివ్, లేబర్ పార్టీల ప్రతినిధులను ఆహానం పంపారు. జర్మనిలో క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ, సోషల్ డెమోక్రటిక్ పార్టీని ఆహ్వానించారు. అయితే పొరుగు దేశం పాకిస్తాన్ నుంచి ఒక్కపార్టీని కూడా పిలువకపోవటం గమనార్హం. భారత్‌తో పాక్‌కు సరైన సంబంధాలు సరైన సంబంధాలు లేని విషయం తెలిసిందే. అదేవిధంగా సరిహద్దు వివాదంతో తరుచు కవ్వించే చైనా పార్టీలకు కూడా బీజేపీ ఆహ్వానం పంపించలేదు. మరోవైపు పొరుదేశమైన బంగ్లాదేశ్‌లో కేవలం అధికార అవామీ లీగ్‌ను మాత్రమే ఆహ్వానించింది. ఇటీవల అక్కడి ప్రతిపక్ష పార్టీ బీఎన్బీ.. ‘ఇండియా అవుట్’ అనే నినాదంతో భారతీయ ఉత్పత్తులను బాయ్‌కాట్ చేసిన విషయం తెలిసిందే. నేపాల్, శ్రీలంకకు చెందిన అన్ని ప్రముఖ పార్టీలను బీజేపీ ఆహ్వానించింది. ఇక.. తాము ఆహ్వానించిన విదేశీ పార్టీల ప్రతినిధులు లోక్‌సభ ఎన్నికల మూడో లేదా నాలుగో దశ పోలిగ్ సమయం(మే రెండో వారం)లో భారత్‌ను సందర్శిస్తారని బీజేపీ భావిస్తోంది. విదేశి పార్టీకు చెందిన ప్రతినిధులు, పరిశీలకులు ముందుగా ఢిల్లీ చేరుకొని భారత్ రాజీకీయ వ్యవస్థ, ఎన్నికల విధానం గురించి తెలుసుకుంటారు. 5-6 మంది ప్రతినిధుల బృందం నేరుగా క్షేత్రస్థాయిలో 4-5 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ నేతలను కలుస్తారు. ప్రధాని మోదీ, హోం మంత్రి వంటి నేతల ర్యాలీల్లో విదేశీ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు. బీజేపీ ప్రాముఖ్యత తెలపటమే లక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా బీజేపీ పార్టీ ప్రాముఖ్యత తెలియచేయటంలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఆయన విదేశీ పార్టీలకు చెందిన సుమారు 70 మంది ప్రతినిధులను కలువనున్నారు. ఇప్పటికే.. నేపాల్ ప్రధాని పుష్పకుమార్ దహాల్ ప్రచండను బీజేపీ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించింది. గతేడాది జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సైతం విదేశీ పార్టీలకు చెందిన 4-5 మంది ప్రముఖుల బృందం పలు చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. ఇక.. ప్రపంచం దేశాల్లో ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు చేరువకావటమే లక్ష్యంగా బీజేపీ ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘ప్రజాస్వామ్యానికి ఇండియా తల్లి వంటిది. ప్రపంచంలోనే అతి పెద్దపార్టీ బీజేపీ. బీజేపీ ఎన్నికల విధానం, ఎన్నికల ప్రచారం, అమలు చేసే వ్యూహాలను ప్రపంచ దేశాలు తెలుసుకోవాలి’’అని బీజేపీ విదేశీ వ్యవహారాల విభాగం నేత విజయ్ చౌతైవాలే తెలిపారు. -
ఎన్నికల వేడి.. కరువు దాడి
సిద్దిపేట జిల్లాలో మల్లన్నసాగర్ జలాల విడుదలపై రాజుకున్న వివాదానికి మంగళవారం తెరపడింది. కొన్ని రోజులుగా కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు నిలిపివేయడంతో ఆ వాగు ఆయకట్టు ప్రాంతంలోని వరి పొలాలు ఎండిపోతున్నాయని, ప్రభుత్వం ఇదే నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తే తామే మల్లన్నసాగర్ గేట్లను తెరుస్తామని ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో యంత్రాంగం చర్యలు చేపట్టింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత మల్లన్నసాగర్ గేట్లను ఎత్తి కొండపోచమ్మ సాగర్ కాల్వలోకి నీటిని వదిలారు. సాయంత్రం గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద కొండపోచమ్మ సాగర్ కాల్వ నుంచి కూడవెల్లిలోకి గోదావరి జలాలను వదిలారు. – గజ్వేల్ సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు రైతాంగ సమస్యలే ఎజెండాగా మారాయి. కరువు పేరిట రాజకీయ యుద్ధానికి తెరలేపుతున్నాయి. రైతు సంబంధిత అంశాలను అ్రస్తాలుగా మార్చుకుంటున్నా యి. విపక్షాలు, అధికార పక్షం ఒకదానిపై మరొకటి మాటల దాడులు చేసుకుంటున్నాయి. రైతు సంక్షేమానికి పాటు పడేది తామేనంటూ ఏకరువు పెడుతున్నాయి. ఎండిన పంటల పరిశీలన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో చేసిన పర్యటనతో కరువు రాజకీయం ముదురు పాకాన పడింది. కాంగ్రెస్ తెచ్చిన కరువన్న కేసీఆర్ జిల్లాల పర్యటనలో కేసీఆర్ కాంగ్రెస్ పాలనపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత కారణంగానే పంటలు ఎండిపోతున్నాయని, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువని ధ్వజమెత్తారు. అంతేకాకుండా రైతుల పక్షాన కార్యాచరణలో భాగంగా మంగళవారం బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాన్ని చేపట్టింది. రైతాంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆ పార్టీ నేతలు వినతిపత్రాలు అందజేశారు. మరోవైపు ఈనెల 5వ తేదీన కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల పర్యటనలకు సైతం కేసీఆర్ సిద్ధమవుతుండగా, 6వ తేదీన వరి పంటకు బోనస్ డిమాండ్ చేస్తూ దీక్షలు చేపట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. మరోవైపు రిజర్వాయర్ల నుంచి తక్షణమే నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. భరోసా పేరిట బీజేపీ బీజేపీ కూడా రైతుల పక్షాన ఆందోళనలకు దిగింది. రాష్ట్ర రైతాంగానికి భరోసా ఇవ్వడం కోసమంటూ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మంగళవారం కరీంనగర్ వేదికగా రైతుదీక్ష చేపట్టారు. ఇదే క్రమంలో ఈనెల ఐదో తేదీన రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షకు కమలనాథులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎదురుదాడికి దిగుతూ విపక్షాలపై విమర్శలు ఎక్కుపెడుతోంది. సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, ఇతర మంత్రులు ధీటుగా కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. -
ఈ కూడలిలో ఎవరి ప్రభావం ఎంత?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పట్టున్న సీపీఎం, సీపీఐ పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు కోసం వేచిచూస్తున్నాయి. బీఆర్ఎస్తో వెళ్లేది లేదని ఖరాఖండిగా చెబుతూనే కాంగ్రెస్ స్నేహ హస్తం కోసం ఎదురుచూస్తున్నాయి. ఉభయ పార్టీల ప్రతిపాదనపై ఇప్పటివరకు కాంగ్రెస్ స్పందించకపోవడంతో కామ్రేడ్స్ అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. సీపీఎం ఇప్పటికే నిరీక్షణను పక్కనపెట్టి భువనగిరి అభ్యర్థిని ప్రకటించడమే కాక మిగతా స్థానాల్లో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై సమాలోచనలు చేస్తోంది. సీపీఐ మాత్రం దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో ఉన్నందున రాష్ట్రంలో ఒక్క ఎంపీ స్థానమైనా తమకు ఇవ్వాలని పట్టుబడుతోంది. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ చర్చలకు పిలవకపోవడంతో ఈనెలాఖరు నాటికి ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేశాయి. సీపీఎం నల్లగొండ, ఖమ్మం స్థానాల్లో.. సీపీఐ మహబూబాబాద్, భువనగిరిలో పోటీ చేసినా ఫలితం దక్కలేదు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఉమ్మడి జిల్లాలో ఒంటరిగా, సీపీఐ కాంగ్రెస్‌తో జత కట్టాయి. ఆ ఎన్నికల్లో నమోదైన ఓట్ల ఆధారంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పార్టీల ప్రభావం ఎంత మేరకు ఉంటుందన్న అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ అభ్యర్థిని ప్రకటించగా.. నేడో, రేపో ఖమ్మం అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశముంది. దీంతో సీపీఎం భువనగిరి ఒక్క స్థానానికే పరిమితవుతుందా, ఖమ్మంలోనూ పోటీ చేస్తుందా అన్నది తేలాల్సి ఉంది. పోటీలో ఆ పార్టీ అభ్యర్థిని పెట్టకపోతే కాంగ్రెస్‌కు ఎన్ని ఓట్లు కలిసొస్తాయన్న చర్చ జరుగుతోంది. ఇక సీపీఐ నేతలు జాతీయ నాయకత్వం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ఒక్క స్థానంలోనైనా పోటీ చేయకపోతే కేడర్ బలహీనమవుతుందన్న ఆలోచనలో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా బీజేపీని నిలువరించడమే లక్ష్యంగా తమ అడుగులు ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇవి చదవండి: ఈ రెండుస్థానాల్లో పోటీ ఎవరు..? -
తగ్గిన ‘జాతీయ’ ప్రభ
ఎన్నికల కుంభమేళాలో దేశవ్యాప్తంగా వేలాది రాజకీయ పార్టీలు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 2,500కు పైగా రాజకీయ పార్టీలున్నాయి. కానీ 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 53 పార్టీలు బరిలో నిలిచాయి. అందులో 14 మాత్రమే జాతీయ పార్టీలు. మిగతావి రాష్ట్ర పార్టీలు. దేశవ్యాప్తంగా కోట్లాది ఓటర్లను ఆకర్షించి అత్యంత ప్రజాదరణ పొందిన పార్టీలుగా ఖ్యాతికెక్కిన జాతీయ పార్టీలు నెమ్మదిగా ప్రభ కోల్పోతున్నాయి. సత్తా చాటలేక చతికిలపడుతూ తమ ‘జాతీయ’ హోదాను కోల్పోతున్నాయి. అలా ఈ ఏడు దశాబ్దాల కాలంలో ఎనిమిది పార్టీలు ‘జాతీయ’ హోదా కోల్పోయాయి. డెభై ఏళ్లలో కొన్ని జాతీయ పార్టీలు విలీనం కాగా కొత్తవి ఉద్భవించాయి. తాజాగా 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి జాతీయ పార్టీల సంఖ్య ఆరుకు పరిమితమైంది. దేశంలో ఎన్నికల పర్వాన్ని అక్షరబద్దం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రచురించిన ‘లీప్ టు ఫెయిత్’ పుస్తకంలో పలు ఆసక్తికర విషయాలున్నాయి. జాతీయ పార్టీ ట్యాగ్‌లైన్ తమకూ కావాలని 1951 లోక్‌సభ ఎన్నికలకు ముందు 29 రాజకీయ పార్టీలు పట్టుబట్టాయి. అయితే వాటిలో 14 పార్టీలకే ఆ హోదా దక్కింది. అయితే మెజారిటీ పార్టీలు దాన్ని నిలబెట్టుకోలేకపోయాయి. కేవలం నాలుగు పార్టీలు.. కాంగ్రెస్, ప్రజా సోషలిస్ట్ పార్టీ, సీపీఐ, జనసంఘ్ ఆ హోదాను నిలుపుకున్నాయి. అఖిల భారతీయ హిందూ మహాసభ, ఆలిండియా భారతీయ జనసంఘ్, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఆలిండియా షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్(మార్కిస్ట్), ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్(రూకర్), కృషికార్ లోక్‌పార్టీ, బొల్‡్షవిక్ పార్టీ ఆఫ్ ఇండియా, రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ హోదా కోల్పోయాయి. దీంతో 1957 ఎన్నికలనాటికి పార్టీల సంఖ్య 15కు పడిపోయింది. వాటిలో నాలుగింటికే జాతీయ హోదా కొనసాగింది. అయితే 1962 ఎన్నికలనాటికి జాతీయ పార్టీల సంఖ్య ఆరుకు, అన్ని పార్టీల సంఖ్య 29కి పెరిగింది. సోషలిస్ట్ (ఎస్ఓసీ), స్వతంత్ర (ఎస్‌డబ్ల్యూఏ) పార్టీలు జాతీయ హోదా పొందాయి. 1951 ఎన్నికల తర్వాత సీపీఐ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగి పుష్కర కాలం ఆ హోదాలో కొనసాగింది. కానీ 1964లో పార్టీలోని సోవియట్, చైనా కమ్యూనిస్ట్ వర్గాలు వేరు కుంపటి పెట్టాయి. దీంతో సీపీఐ (మార్కిస్ట్) పురుడుపోసుకుంది. 1992లో 7 జాతీయ పార్టీలు 1992 లోక్‌సభ ఎన్నికల్లో ఏడు నేషనల్ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, జనతాదళ్, జనతా పార్టీ, లోక్‌దళ్ పోటీలో ఉన్నాయి. 1996 సాధారణ ఎన్నికల్లో మొత్తం 209 పార్టీలు అధికారం కోసం పోటీపడ్డాయి. కాంగ్రెస్, ఆలిండియా కాంగ్రెస్ (తివారీ), బీజేపీ, సీపీఐ, సీపీఎం, జనతా పార్టీ, సమతా పార్టీ, జనతాదళ్ రూపంలో ఎనిమిది పార్టీలకు జాతీయ హోదా దక్కింది. 1998 ఎన్నికలకొచ్చేసరికి పార్టీల సంఖ్య 176కు పడిపోయింది. ఈ దఫా కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, జనతాదళ్, సీపీఐ, సీపీఎం, సమతా పార్టీ జాతీయ హోదాతో పోటీపడ్డాయి. 1999లో పార్టీల సంఖ్య 160కి పడిపోయింది. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, జేడీ(ఎస్), జేడీ(యూ) జాతీయ పార్టీలుగా అదృష్టం పరీక్షించుకున్నాయి. 2014లో 464 పార్టీలు 2014 ఎన్నికల్లో ఏకంగా 464 పార్టీలు రంగంలోకి దూకాయి. జాతీయ పార్టీల సంఖ్య ఆరుకు తగ్గింది. ఆనాడు బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, బీఎస్పీలకు మాత్రమే జాతీయ హోదా ఉంది. 2016లో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా జాతీయ హోదా సాధించి ఎన్నికల్లో పోటీ చేసింది. 2019లోనూ ఎక్కువ సీట్లు సాధించేందుకు శ్రమించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 674 పార్టీలు పోటీ చేయగా వాటిలో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, తృణమూల్ రూపంలో ఏడు జాతీయ పార్టీలుగా నిలిచాయి. తర్వాత తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ జాతీయ హోదా కోల్పోయాయి. జాతీయ హోదా ఇలా... నిబంధనావళి ప్రకారం కనీసం మూడు రాష్ట్రాల నుంచి కనీసం రెండు శాతం ఎంపీ సీట్లను గెలిచిన పార్టీకే జాతీయ పార్టీ హోదా దక్కుతుంది. లేదంటే నాలుగు రాష్ట్రాల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు ఆ పార్టీకి పడాలి. కనీసం నాలుగు రాష్ట్రాల్లో అప్పటికే రాష్ట్ర పార్టీ హోదా ఉండాలి. ► జాతీయ పార్టీ దేశవ్యాప్తంగా పోటీ చేస్తే ఆ పార్టీ అభ్యర్థులకు ఒకే ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. ► దేశ రాజధానిలో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు ప్రత్యేకంగా స్థలం కేటాయిస్తారు. జేపీ.. జనతా ప్రయోగం జయప్రకాశ్ నారాయణ్ (జేపీ), రామ్ మనోహర్ లోహియా, ఆచార్య నరేంద్ర దేవ్ ఏర్పాటుచేసిన సోషలిస్ట్ పార్టీ మూలాలు కాంగ్రెస్ వామపక్ష విభాగమైన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ (సీఎస్పీ)లో ఉన్నాయి. జేపీ సోషలిస్ట్ పార్టీని జేబీ కృపలానీ సారథ్యంలోని కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీలో విలీనం చేసి ప్రజా సోషలిస్ట్ పార్టీ (పీఎస్పీ)ని ఏర్పాటుచేశారు. ఆ తర్వాత పీఎస్పీ నుంచి జేపీ బయటికొచ్చారు. ► 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో జేపీ మళ్లీ జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. జేపీతో పాటు విపక్షాలు నేతలందరూ జైలు పాలయ్యారు. ► జేపీ విడుదలయ్యాక కొందరు పీఎస్పీ నేతలతో కలిసి భారతీయ లోక్‌దళ్‌ను స్థాపించారు. ► ఎమర్జెన్సీకారణంగా దేశంలోని విపక్ష పార్టీలపై నిషేధం కత్తి వేలాడటంతో ఇందిరను ఢీకొట్టేందుకు అంతా కలిసి జనతా పార్టీకి ప్రాణం పోశారు. 1977లో ఇందిరను ఓడించి జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచి్చంది. జాతీయ పార్టీగా ఆప్ తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ జాతీయ పార్టీ హోదాను కోల్పోయాక గతేడాది కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ హోదా సాధించడం విశేషం. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఎం, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఆప్ మాత్రమే జాతీయహోదాలో తలపడుతున్నాయి. 543 లోక్‌సభ స్థానాలకు మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Nitin Gadkari: విరాళాల్లేకుండా పార్టీలు మనలేవు
అహ్మదాబాద్: ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దుచేశాక ఈ పథకంపై ప్రజాక్షేత్రంలో చర్చోపచర్చలు జరుగుతున్న వేళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన మనసులో మాట చెప్పారు. ‘‘ అసలు విరాళాలు తీసుకోకుండా ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించలేదు. సదుద్దేశంతోనే ఎలక్టోరల్ బాండ్ల పథకం తెచ్చాం. పథకాన్ని సుప్రీంకోర్టు రద్దుచేయకుండా అందులోని లోటుపాట్లను సరిచేయాలని సూచనలు చేస్తే బాగుండేది. సూచనల మేరకు అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూర్చుని చర్చించుకునే అవకాశం దొరికేది. ఏకాభిప్రాయంతో సవరణలు చేసేవాళ్లం’ అని అన్నారు. శుక్రవారం గాంధీనగర్‌లోని ‘గిఫ్ట్ సిటీ’లో జరిగిన ఒక కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు. ‘గతంలో అరుణ్ జైట్లీ కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ఇలాంటి పథకం ఒకటి ఉంటే మంచిదని చర్చ జరిగినప్పుడు నేను అందులో పాల్గొన్నా. వనరులు లేకుండా రాజకీయ పార్టీల మనుగడ అసాధ్యం. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే పార్టీలకు నిర్వహణ నిధులిస్తాయి. భారత్‌లో అలాంటి పద్ధతి లేదు. అందుకే పార్టీలకు ఆర్థిక అండగా నిలబడే ఇలాంటి పథకాలను రూపొందించుకున్నాం. నేరుగా పార్టీలకు విరాళాలు చేరేలా చూడటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. విరాళాల అందజేతకు ముందు, తర్వాత అధికారంలో ఉన్న పార్టీ మారిపోతే దాతలకు సమస్యలు వస్తాయి. అందుకే దాతల వివరాలు రహస్యంగా ఉండేలా పథకంలో నిబంధనలు పెట్టాం. ఏదైనా మీడియా సంస్థ తన ఒక కార్యక్రమానికి నిధులు అవసరమైతే స్పాన్సర్‌ను చూసుకుంటుంది. పార్టీ నిర్వహణ, కార్యకలాపాలకు నిధులు అవసరమే కదా’ అని గడ్కరీ ఉదహరించారు. ప్రతిదీ పారదర్శకంగా ఉండాలనే పార్టీలకు విరాళాలు పారదర్శకంగా వచ్చేలా చూశామన్నారు. -
Lok sabha elections 2024: ఉచిత వాగ్దానాలపై పిల్
న్యూఢిల్లీ: ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత వాగ్దానాలను తప్పుబడుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని స్వీకరించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. ‘ఓటర్ల నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు పార్టీలు చేస్తున్న ఈ ఉచిత తాయిలాల ప్రకటనలు, వాగ్దానాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. వీటిపై నిషేధం విధించేలా కేంద్ర ఎన్నికల సంఘం తగు చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వండి’ అంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ పిల్‌ను దాఖలుచేశారు. ఈయన తరఫున సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా బుధవారం సుప్రీంకోర్టులో వాదించారు. ‘ ఉచిత వాగ్దానాలిచ్చే రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసి, ఆయా పార్టీల ఎన్నికల గుర్తులను స్తంభింపజేయాలి’ అని కోరారు. ‘ ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈ పిటిషన్‌ను వీలైనంత త్వరగా విచారిస్తాం. ఏ తేదీన విచారించాలన్న దానిపై గురువారం బోర్డ్‌లో చర్చిస్తాం’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజే ఉచితాలపై పిల్ దాఖలవడం గమనార్హం. ‘‘ప్రజాధనంతో నిర్హేతుకమైన ఉచిత పథకాలు ప్రకటించడంతో ఓటర్లు ఎన్నికల ప్రక్రియలో ప్రభావితమయ్యే అవకాశం చాలా ఎక్కువ. పోటీ పార్టీల విజయావకాశాలనూ ఇవి దెబ్బతీస్తాయి. పారదర్శకమైన ఎన్నికల క్రతువుకు ఇది విఘతం. ఉచితాలు ప్రజాస్వామ్య విలువల మనుగడనే ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. ప్రజాస్వామ్య స్పూర్తికి గొడ్డలిపెట్టు’’ అని పిటిషనర్ పేర్కొన్నారు. ‘‘ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న ఈ ఉచితాలు ఒక రకంగా ఓటర్లకు లంచాలు ఇవ్వడం లాంటిదే. అధికార పార్టీ మళ్లీ అధికారంలో కొనసాగడానికి ఇది ఒక మార్గంలా పనికొస్తోంది. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఇలాంటి ధోరణులకు చెక్ పెట్టాల్సిందే. ఇందులోభాగంగా ఎన్నికల గుర్తుల(రిజర్వేషన్, అలాట్మెంట్) ఉత్తర్వు, 1968లోని సంబంధిత పేరాలో అదనపు షరతులను ఈసీ జతచేయాలి. ఎన్నికలకు ముందు ప్రజాధనంతో నిర్హేతుక ఉచితాల వాగ్దానాలు చేయొద్దని పార్టీలకు షరతు విధించాలి’ అని పిటిషనర్ కోర్టును కోరారు. -
కోడ్‌కు విరుద్ధమైన రాజకీయ ప్రచారాన్ని అనుమతించొద్దు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించవద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జాతీయ, ప్రధాన రహదారుల పక్కనున్న హోర్డింగులను అన్ని రాజకీయ పార్టీలకు సమాన ప్రాతిపదికన కేటాయించాలని, నూతన హోర్డింగులకు అనుమతులను మాత్రం ఇవ్వద్దని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు తీరును అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్బంగా మీనా మాట్లాడుతూ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోనున్న నేపథ్యంలో రాజకీయ ప్రకటనలు, పోస్టర్లు, హోర్డింగులు, బ్యానర్ల ప్రదర్శన విషయంలో జిల్లా ఎన్నికల అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎటువంటి రాజకీయ ప్రచారాన్ని అనుమతించవద్దని సూచించారు. సరిహద్దుల్లో లిక్కర్ రవాణాను నియంత్రించాలి ప్రైవేటు భవనాలపై వాల్ పెయింట్లకు ఎటువంటి అనుమతిలేదని, ఇప్పటికే ఉన్నవాటిని వెంటనే చెరిపించేయాలని ఆదేశించారు. ప్రభుత్వ అనుమతితో ప్రైవేటు భవనాలపై ఇప్పటికే ఉన్న పెద్ద హోర్డింగులు, కటౌట్ల భద్రతను, నిర్మాణ స్థిరత్వాన్ని పరిశీలించాలని, ఏమాత్రం దృఢత్వం లేకపోయినా ప్రకటనలకు అనుమతించ వద్దన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి లిక్కర్, ఓటర్లను ప్రభావితం చేసే పలు రకాల వస్తువులు అక్రమ రవాణాను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా సరిహద్దు ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన చెక్ పోస్టులు ఉన్న చోట వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణను పెంచాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలు ఉద్యోగులకు, ఓటర్లకు నగదు, బహుమతులు వంటి తాయిలాలు పంపిణీ చేసే అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని, అటు వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల ప్రణాళికలు వెంటనే ఇవ్వాలి సి విజిల్ ఫిర్యాదులను నిర్ణీత సమయంలో నూరు శాతం పరిష్కరించాలని, ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ వ్యవస్థను పెద్ద ఎత్తున వినియోగించుకునేలా ఎన్ఫోర్స్మెంట్ ఏజన్సీలపై ఒత్తిడి పెంచాలని మీనా అన్నారు. ఇంకా కొన్ని జిల్లాల నుంచి జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళికలు అందలేదని, వాటిని వెంటనే తమకు అందజేయాలని ఆదేశించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోపే ఎన్నికల సిబ్బందికి మరోసారి లేదా రెండు సార్లు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే అంశంపై జిల్లా ఎన్నికల అధికారులు దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, ఎమ్.ఎన్.హరేంధిర ప్రసాద్, డిప్యూటీ సీఈవో కె. విశ్వేశ్వరరావు, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఇదేమీ తేలికైన ప్రశ్న కాదు!
రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించటానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధం అంటూ ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. ఆ సందర్భంలోనే – భారతీయ స్టేట్ బ్యాంకు ఇంతవరకు తాను కోనుగోలు చేసిన బాండ్ల వివరాలను నిర్ణీత గడువులోపు ఎన్నికల సంఘానికి వెల్లడించాలని ఆదేశించింది. ఆ ఆదేశాలను ఉల్లంఘించడంతో బ్యాంకు పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం, కోర్టు ఆదేశాల ప్రకారం బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. దాంతో భారతీయ స్టేట్ బ్యాంక్ కొంతమేరకైనా వివరాలు వెల్లడించాల్సి వచ్చింది. అయితే, ప్రశ్నేమిటంటే... ఎంతో ప్రతిష్ఠాత్మకమైన బ్యాంకు చేత ఇంతకాలంగా వివరాలు వెల్లడించనివ్వకుండా చేయిస్తున్నది ఎవరు అని! అయితే ఇదేమీ తేలికైన ప్రశ్న కాదు! నా తొలి బ్యాంకు ఖాతా ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్‌లోని భారతీయ స్టేట్ బ్యాంకు శాఖలో ఉండేది. నా పేరిట నాన్న దానిని తెరిచినప్పుడు నా వయసు 16 ఏళ్లు. మా పూర్వీకుల భూములను విక్రయించటం ద్వారా నా వాటాగా వచ్చిన మొత్తాన్ని జమ చేసేందుకు ఉద్దేశించిన ఖాతా అది. ఆ ఖాతాను ప్రతి నెలా వడ్డీ వచ్చేలా ఫిక్స్డ్ డిపాజిట్‌కు జత కలిపారు. ఆ వడ్డీ పెద్ద మొత్తమేమీ కాదు కానీ, నేనొక డబ్బు గల ఆసామినన్న భావన నాలో కలిగించింది. నాన్న సొంత ఖాతా గ్రిండ్లేస్ బ్యాంకులో ఉండేది. ఆ బ్యాంకు ఇప్పుడు ఉనికిలో లేదు. నాన్న నా కోసం ఆ రోజు ఎస్.బి.ఐ. బ్యాంకును ఎందుకు ఎంచుకున్నారో నాకు గుర్తులేదు కానీ, ఆ సంస్థ పట్ల ఆయన ఉన్నతమైన అభిప్రాయాన్ని కలిగి ఉండేవారని అనుకుంటాను. డెబ్బయ్‌లలో బ్యాంకింగ్ చాలా భిన్నంగా ఉండేది. నగదు లావాదేవీల టెల్లర్ కౌంటర్ల వద్ద పొడవైన క్యూలు ఉండేవి. సొంత చెక్కులకు డబ్బు ఇవ్వడానికి కూడా వారి ఖాతాలను తనిఖీ చేసేవారు. అదంతా కూడా అమిత ప్రయాసతో కూడిన దుర్భరమైన తతంగంలా ఉండేది. ఆ దశలో అకస్మాత్తుగా ఎస్.బి.ఐ. మన ఖాతాలో సరిపడా నిధులు ఉన్నాయా, లేవా అన్నది కూడా నిర్ధారణ చేసుకోకుండానే సెల్ఫ్–చెక్కులను ఒక నిర్ణీత పరిమితి వరకు నగదుగా మార్చుకునే అవకాశం కల్పించిన మొదటి బ్యాంకుగా అవతరించింది. ఆ దెబ్బతో, అరగంట పట్టే పని... నిమిషాల్లో అయిపోవడం మొదలైంది. ఆఖరికి నాగర్వాలా నగదు కుంభకోణం కూడా ఎస్.బి.ఐ. దేదీప్యాన్ని చెక్కుచెదర్చలేక పోయింది. ఎగతాళిగా నవ్వినవారు లేకపోలేదు కానీ, బ్యాంకు నుంచి తమ ఖాతాలను ఉపసంహరించుకున్న వారు చాలా తక్కువ. అలాంటి కుంభకోణాలు ఊహించినవే. అయినా అవి నేరారోపణలు వచ్చేంతగా పరిగణన పొందనివి. ఆ రోజుల్లో మా అమ్మ 50 పైసలు, 1 రూపాయి నాణేలను పొదుపు చేసేవారు. ఒక పాత టప్పర్‌వేర్ బ్రెడ్ బాక్సులో వాటిని ఆమె భద్రంగా దాస్తూ ఉండేవారు. అలా కూడబెట్టిన ఆ అపురూపమైన నాణేలను ఎస్.బి.ఐ.కి తీసుకెళ్లి ఆమె ఖాతాలో జమ చేసి రావడం అనే బాధ్యత నాపై పడుతుండేది. కౌంటర్లో ఉండే టెల్లర్ ఆ నాణేలను తూకం వేసి చూసి, మా అమ్మలోని ఇలా పోగేసే గృహిణి నైజాన్ని ప్రశంసించేవారు. ‘‘మేరీ బీవీ భీ యహీ కర్తీ హై’’ (మా ఇంటావిడ కూడా ఇలాగే చేస్తుంటుంది) అనే అతడి మాట నాలోని టీనేజ్ బిడియాన్ని పోగొట్టేది. ఆయన అలా అనేవరకు కూడా నన్ను నేను మురికి నాణేలను సంచిలో మూట కట్టుకుని బ్యాంకుకు వెళ్లే వ్యాపారిలానే భావించుకున్నాను. స్టో లేదా కేంబ్రిడ్జి నుండి సెలవులకు వచ్చినప్పుడు పార్లమెంటు స్ట్రీట్ బ్రాంచి నిరంతరం నాకు పని కల్పించేది. నాకు మాత్రమే కాదు, ఇంట్లో అందరికి! ఎందుకు అని నన్నడక్కండి. అనుకోకుండా ఎందుకో వెళ్లేవాళ్లం. వెళ్లిన ప్రతిసారీ ఇలా వెళ్లి అలా వచ్చేయటం అన్నట్లుగా ఉండకపోయే వాళ్లం. కనుక, ఆ ప్రదేశంపై నాకు మక్కువ ఏర్పడటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. తరచుగా ఏం జరిగేదంటే, గ్రౌండ్ ఫ్లోర్లో నా పని పూర్తి అయినప్పుడు పై అంతస్థులకు కూడా వెళ్లి, నా చిన్న మొత్తాల పొదుపుపై సలహాలు అడుగుతుండేవాడిని. 20 ఏళ్ల యువకుడిలోని ఆ అతిక్రమణను ఐదవ అంతస్థులోని మేనేజర్లు గొప్ప సంసిద్ధతతో క్షమించేసేవారు. నా ప్రశ్నల్ని వారు స్వాగతించారని కూడా నాకు గట్టిగా అనిపించేది. ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. నాకు తెలిసిన బ్యాంకు ఎప్పుడూ కూడా గత వారం ఎస్.బి.ఐ. వ్యవహరించిన విధంగా అయితే లేదు. సుప్రీంకోర్టు మందలింపుతో బహుశా ఆ బ్యాంకు సిబ్బంది ముడుచుకుపోయి ఉండొచ్చు. మనకున్న అత్యుత్తమ సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో ఒకరైన మదన్ లోకూర్, ‘‘బ్యాంకుకు ఇది చెంపపెట్టు’’ అని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తిగా ఆయన పని చేసిన ఇన్నేళ్లలోనూ ఇలా ఒక బ్యాంకు మందలింపునకు గురైన సంఘటనను ఆయన గుర్తు చేసుకోలేదు. గత సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి అడిగిన ఒక ప్రశ్న ఎస్.బి.ఐ.ని నెలల తరబడి, కాదంటే ఏళ్ల తరబడి వేధిస్తుందా అని నా ఆందోళన. ‘‘ఆదేశాలను పాటించటం మీకు కష్టంగా ఉందని మీరు చెబుతున్నారా?’’ అని ఆయన అడిగారు. ‘‘గత 26 రోజులలో మీరు తీసుకున్న చర్యలు ఏమిటి? ఆ విషయంలో మీరు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఎస్.బి.ఐ. నుంచి ఒక స్థాయి నిజాయితీని మేము ఆశిస్తున్నాం’’ అన్నారు. నా బ్యాంకు ఇంతగా తక్కువ కావటం – ఇప్పటికీ అది నా బ్యాంకులలో ఒకటి కావటం – నాకు బాధను కలిగిస్తోంది. ఎందుకు అలా అనిపిస్తోందని అడక్కండి. బహుశా ఇది అర్ధ శతాబ్దం పాటు సాగిన బాంధవ్య పరిణామం కావచ్చు. లేదా, నాకు అలా అనిపిస్తుండొచ్చు. నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఇది తప్ప వేరొక వివరణ నాకు తోచటం లేదు. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే – సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ఎస్.బి.ఐ. ఉద్దేశపూర్వకంగా తనకు అవసరమైన రీతిలో తప్పుగా అన్వయించుకోవటం ద్వారా, కోర్టు ఆదేశించిన ఒక సాధారణమైన పనిని కావాలనే క్లిష్టతరం చేసి, ఆ ఆదేశాన్ని పాటించలేకపోవటానికి తిరిగి ఆ సంక్లిష్టతనే ఒక నెపంగా చూపిందా అన్న అనుమానానికి ఆస్కారం కలగడం. ఒక గౌరవప్రదమైన బ్యాంకు నుంచి మీరు ఇలాంటిది ఊహించలేరు. దీర్ఘకాలంగా మీరు అనుబంధం కలిగి ఉన్న ఒక బ్యాంకు విషయంలో ఇలా జరిగినప్పుడు భ్రమలు తొలిగినట్లుగా అనిపిస్తుంది. ప్రభుత్వమే వెనుక ఉండి ఇలా జరిపించిందా? ఇదేమీ తేలికైన ప్రశ్న కాదు. అయినప్పటికీ మీలోని లక్షల మందికి, ఆ లక్షల్లో ఎక్కువ మందికి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు. కానీ ఈ ప్రశ్న అడగటం వెనుక ఉన్న వాస్తవం బాధను కలిగిస్తుంది. ఆ బాధ అందరికంటే ఎక్కువగా ఆ బ్యాంకు ఉన్నతాధికారులలో ఉంటుందని నేను ఆశిస్తున్నాను. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఐదేళ్లలో 22,217 ఎలక్టోరల్ బాండ్లు
న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ పారీ్టలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సమకూరిన నిధుల వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సుప్రీంకోర్టుకు తెలియజేసింది. 2019 ఏప్రిల్ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15 దాకా.. ఐదేళ్లలో 22,217 ఎలక్టోరల్ బాండ్లు జారీ చేశామని, వీటిని వ్యక్తులు/సంస్థలు కొనుగోలు చేసి, రాజకీయ పారీ్టలకు విరాళం రూపంలో అందజేశారని వెల్లడించింది. ఇందులో 22,030 బాండ్లను రాజకీయ పారీ్టలు నగదుగా మార్చుకున్నాయని వివరించింది. నిబంధనల ప్రకారం.. జారీ చేసిన తేదీ నుంచి 15 రోజుల్లోగా నగదుగా మార్చుకోకపోవడం వల్ల మిగిలిపోయిన 187 బాండ్లకు సంబంధించిన డబ్బును ప్రధానమంత్రి సహాయ నిధికి అందజేసినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్బీఐ చైర్మన్ దినేశ్‌కుమార్ ఖరా బుధవారం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఇప్పటికే ఎన్నికల సంఘానికి అందజేశామని అఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రతి బాండ్‌ను కొనుగోలు చేసిన తేదీ, కొనుగోలుదార్ల పేర్లు, బాండ్లను రాజకీయ పారీ్టలు నగదుగా మార్చుకున్న తేదీ వంటి అన్ని వివరాలను ఎన్నికల సంఘానికి డిజిటల్ రూపంలో అందజేశామని తెలిపారు. -
హామీలపై సమాచారం.. ఓటర్ల హక్కు: సీఈసీ
చెన్నై: ఎన్నికల సమయంలో రాజకీయ పారీ్టలు ఇచ్చే హామీలు ఆచరణ సాధ్యమేనా? అనేది తెలుసుకొనే హక్కు ఓటర్లకు ఉందని ముఖ్య ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ చెప్పారు. అయితే, ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని గుర్తుచేశారు. మేనిఫెస్టోలో హామీలను పొందుపర్చే హక్కు రాజకీయ పారీ్టలకు ఉన్నట్లే.. ఆయా హామీల్లో నిజమెంత? వాటిని అమలు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి ఎలా సేకరిస్తారో తెలుసుకునే హక్కు ఓటర్లు ఉందని పేర్కొన్నారు. ఈ అంశంపై న్యాయస్థానం విచారణ కొనసాగిస్తోందని వెల్లడించారు. రాజీవ్ కుమార్ శనివారం చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీలు, వాటిని అమలు చేసే విధానం, నిధుల సేకరణ మార్గాలను రాజకీయ పారీ్టలు తప్పనిసరిగా వెల్లడించేలా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఒక ‘ప్రొఫార్మా’ సిద్ధం చేశామని తెలిపారు. -
Actor Vijay: విజయ్ పార్టీ కోసం పని చేస్తారా?
చెన్నై: స్టార్ హీరో విజయ్ కొత్త పార్టీ ప్రకటన తర్వాత.. తమిళనాడు రాజకీయాలపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు టైం ఉంది. ఈలోపే విజయ్ ‘‘తమిళగ వెట్రి కళగం’’ TVK ఎవరితో చేతులు కలుపుతుంది? ఏ మేర ప్రభావం చూపెడుతుందంటూ డిబేట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రవేశంపై విజయ్ ప్రశాంత్ కిషోర్‌తో సైతం చర్చలు జరిపినట్లు వార్తలు వినవచ్చాయి. ఓ తమిళ ఛానెల్ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్‌కు దీనికి సంబంధించి ప్రశ్న ఎదురైంది. విజయ్ అడిగితే ఆయన పార్టీ కోసం పని చేస్తారా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘‘విజయ్ నాతో టచ్‌లో లేరు. ప్రస్తుతం ఎన్నికల వ్యహకర్త వ్యవహారాలను నేను చూడడం లేదు. ఒకవేళ ఆయన నన్ను అడిగినా.. ఆ పని చేయలేను. కానీ, ఆయన కోరుకుంటే మాత్రం సలహాలు ఇచ్చి సాయం చేయగలను. ఎందుకంటే.. నన్ను గౌరవించే వాళ్లకు సలహాలు ఇవ్వడం నాకు అలవాటు’’ అని పీకే క్లారిటీ ఇచ్చారు. ఇక.. ఇదే ఇంటర్వ్యూలో తమిళనాడు రాజకీయాలపై స్పందించిన పీకే.. అక్కడి రాజకీయాల్లో విజయ్ ప్రభావంపైనా మాట్లాడారు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశాన్ని తేలికగా తీసుకోవద్దని ఇతర పార్టీలకు సూచించారు. ముఖ్యంగా ద్రవిడ పార్టీల ఓటు బ్యాంకు 60 నుంచి 65 శాతం తగ్గిపోయే అవకాశం ఉందని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. -
యూపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ‘ఆర్ఎస్ఎస్పీ’
సమాజ్‌వాదీ పార్టీలో నిర్లక్ష్యానికి గురయ్యానని ఆరోపిస్తూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన స్వామి ప్రసాద్ మౌర్య కొత్త పార్టీని స్థాపించనున్నారు. ఇందుకోసం ఆయన కొత్త పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు. ఫిబ్రవరి 22న ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో జరిగే ర్యాలీలో ఆయన ప్రసంగించనున్నారు. స్వామి ప్రసాద్ మౌర్య కొత్త పార్టీ పేరు రాష్ట్రీయ శోషిత్ సమాజ్ పార్టీ (ఆర్ఎస్ఎస్పీ). పార్టీ జెండా నీలం, ఎరుపు, ఆకుపచ్చ రంగులతో కూడి ఉంటుంది. అయితే ప్రసాద్ మౌర్యను బుజ్జగించి, ఆయన ప్రయత్నాలను విరమింపజేసేందుకు ఎస్పీ సీనియర్ నేత రామ్ గోవింద్ చౌదరి ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం. ఇది కూడా చదవండి: అఖిలేష్‌పై అలిగి.. ప్రసాద్ మౌర్య కొత్త పార్టీ? -
జేకేలోనూ ‘ఇండియా’ కూటమికి ఎదురు దెబ్బ!
జమ్ముకశ్మీర్‌లో ‘ఇండియా’ కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) తర్వాత ఇప్పుడు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) కూడా లోక్‌సభ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించింది. పార్టీ పార్లమెంటరీ కమిటీ త్వరలో అభ్యర్థుల పేర్లను ప్రకటించనుందని సమాచారం. గతంలోనే ఎన్సీ తాము లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి చర్చించేందుకు సెంట్రల్ కశ్మీర్లో జరిగిన పీడీపీ సమావేశంలో పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలకు తమ పార్టీ సిద్ధమైందని, త్వరలో రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నామన్నారు. మహ్మద్ సర్తాజ్ మదానీ నేతృత్వంలోని పార్టీ పార్లమెంటరీ బోర్డు త్వరలో అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ మెహబూబ్ బేగ్, గులాం నబీ లోన్ హంజురా తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఎన్సీకి ప్రస్తుతమున్న సీట్లు మినహా మిగిలిన స్థానాల్లో పొత్తును గురించి పరిశీలిస్తామని ప్రకటించారు. అయితే ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. -
పార్టీ పేరు మార్చిన స్టార్ హీరో విజయ్.. ఎందుకంటే?
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌కి తెలుగులోనూ బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. గతేడాది 'వారసుడు', 'లియో' సినిమాలతో అలరించిన విజయ్.. ప్రస్తుతం 'ద గోట్' అనే మూవీతో బిజీగా ఉన్నాడు. అయితే కొన్ని రోజుల ముందు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2026లోని తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పనిచేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు పార్టీ పేరులో స్వల్ప మార్పు చేశారు. (ఇదీ చదవండి: సీక్రెట్‌గా రెండోసారి నిశ్చితార్థం చేసుకున్న స్టార్ హీరోయిన్) దళపతి విజయ్ పెట్టిన రాజకీయ పార్టీ పేరు 'తమిళగ వెట్రి కళగం'. ఇందులోనే తప్పు దొర్లినట్లు తమిళ మేధావుల సూచించారు. ఈ మేరకు స్వల్ప మార్పు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తమిళంలో అదనంగా 'క్' అనే అక్షరాన్ని జోడించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఎన్నికల కమిషన్‌లో ఇదే పేరుతో రిజిస్టర్ చేశారు. కానీ తమిళగ వెట్రి కళగంని ఇంగ్లీష్‌లో టీవీకే అని పిలుస్తున్నారు. దీనిపై పలు పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. తమిళగ వాల్వురిమై కట్చి తదితర కొన్ని చిన్న పార్టీల పేర్లు కూడా ఇంగ్లీష్‌లో టీవీకే అని పిలుస్తున్నారు. ఇదే టైంలో విజయ్ పార్టీని కూడా ఇదే పేరుతో పిలుస్తుండటం వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే మేధావుల నిర్ణయం మేరకు.. తమిళగ వెట్రి కళగం పేరులో 'క్' అనే అక్షరాన్ని జోడించారు. దీంతో ఇకపై 'తమిళగ వెట్రిక్ కళగం' అని పిలవాలని పార్టీ వర్గాలు నిర్ణయించాయి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'హనుమాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
ఏమిటీ ఎలక్టోరల్ బాండ్లు..!
ఎన్నికల బాండ్లు. పార్టిలకు విరాళాలిచ్చేందుకు ఉద్దేశించిన ప్రామిసరీ నోట్ల వంటి పత్రాలు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశానికి చెందిన వ్యక్తులు/సంస్థలు ఎవరైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాలూకు ఎంపిక చేసిన శాఖల్లో వీటిని కొనుగోలు చేసి తమకు నచి్చన పార్టికి విరాళంగా ఇవ్వవచ్చు. ఇవి రూ.1,000, రూ.10 వేలు, రూ.లక్ష, రూ.కోటి ముఖవిలువతో ఉంటాయి. జారీ అయిన 15 రోజుల్లోపు వీటిని నగదుగా మార్చుకోవాలి. లేదంటే ఆ మొత్తం ప్రధాని జాతీయ రిలీఫ్ ఫండ్‌కు వెళ్తుంది. బాండ్ల కొనుగోలుపై సంఖ్య పరిమితేమీ లేదు. ఒక్కరు ఎన్ని బాండ్లైనా కొనవచ్చు. పైగా తమ వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచవచ్చు. బాండ్లపై వారి పేరు తదితర వివరాలేవీ ఉండవు. బ్యాంకు వాటిని ఎవరికీ వెల్లడించదు. పార్టీలు రూ.20 వేలకు మించిన నగదు విరాళాల వివరాలను విధిగా బయట పెట్టాల్సి ఉంటుంది. కానీ ఈ బాండ్ల విషయంలో అలాంటి నిబంధనేదీ లేదు. ఎంత పెద్ద మొత్తం విరాళంగా అందినా వివరాలను ఈసీతో పాటు ఎవరికీ వెల్లడించాల్సిన పని లేదు. ఇది పారదర్శకతకు పాతరేయడమేనన్నది ప్రజాస్వామ్యవాదుల ప్రధాన అభ్యంతరం. గుర్తింపు పొందిన రాజకీయ పార్టిలన్నింటికీ బాండ్లు సేకరించే అవకాశమున్నా ఇది ప్రధానంగా అధికార పార్టిలకే బాగా ఉపయోగపడుతుందన్న వాదనలున్నాయి. ఎన్నికల బాండ్ల పథకం నిబంధనలు పౌరుల సమాచార హక్కు చట్టానికే విరుద్ధమని సుప్రీంకోర్టులో హోరాహోరీగా వాదనలు జరిగాయి. చివరికి ఈ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఇవీ అభ్యంతరాలు ► బాండ్ల కొనుగోలుదారులతో సహా అన్ని వివరాలూ గోప్యంగా ఉంటాయి. ఇది పారదర్శకతకు గొడ్డలిపెట్టు. ► భారీగా విరాళాలిచ్చే కార్పొరేట్ సంస్థలు సదరు పార్టీ అధికారంలోకి వచ్చాక దాని నుంచి భారీగా అనుచిత లబ్ధి పొందే ఆస్కారం చాలావరకు ఉంటుంది. ఇది క్విడ్ ప్రొ కోకు దారి తీస్తుంది. ► పైగా ఈ బాండ్లతో అధికార పార్టిలకే అధిక ప్రయోజనం. దేశవ్యాప్తంగా అత్యధిక బాండ్లు వాటికే అందుతుండటమే ఇందుకు నిదర్శనం. ► మొత్తం ప్రక్రియలో ఎవరి పేరూ బయటికి రాదు గనుక వ్యక్తులకు, సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చేందుకు అధికార పార్టిలు ఇలా బాండ్ల ముసుగులో లంచాలు స్వీకరించే ఆస్కారం కూడా పుష్కలంగా ఉంది. ► పైగా ఈ నిధులను ఎన్నికల కోసమే వాడాలన్న నిబంధనేమీ లేదు. దాంతో వాటిని పార్టిలు తమ ఇష్టానికి ఖర్చు చేసుకోవచ్చు. ► దేనిపై వెచి్చంచాయన్న వివరాలు కూడా ఎవరికీ చెప్పాల్సిన అవకాశం లేదు. ► ఈ పథకం నల్లధనాన్ని మార్చుకునే పరికరంగా కూడా మారింది. ► దీనికి తోడు బాండ్ల కొనుగోలుదారుల వివరాలను తెలుసుకునే అవకాశం అధికార పార్టిలకు ఉంటుంది. ► తద్వారా సదరు వ్యక్తులను, కంపెనీలను వేధించే ప్రమాదమూ ఉంది. అత్యధిక వాటా బీజేపీదే ఎన్నికల బాండ్ల పథకం ద్వారా 2018 మార్చి నుంచి 2024 జనవరి దాకా రూ.16,518.11 కోట్ల విలువైన 28,030 బాండ్లు జారీ అయ్యాయి. వీటిలో పార్టిలన్నింటికీ కలిపి రూ.12,000 కోట్లకు పైగా విరాళాలందాయి. ఎన్నికల సంఘం, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) గణాంకాల ప్రకారం ఇందులో ఏకంగా సగానికి పైగా, అంటే 55 శాతం బీజేపీ వాటాయే కావడం విశేషం. బాండ్ల ద్వారా ఆ పార్టికి రూ.6,566 కోట్లు సమకూరాయి. బీజేపీ మొత్తం ఆదాయంలో సగానికి పైగా బాండ్ల రూపేణా సమకూరినదే. బాండ్ల ద్వారా కాంగ్రెస్ పార్టికి రూ.1,123 కోట్లు రాగా ఇతర పార్టిలన్నింటికీ కలిపి రూ.5,289 కోట్లు అందాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వాగ్దానాల అమలే పాలనకు గీటురాయి
ఎన్నికల మేనిఫెస్టో అనేది కేవలం ఎన్నికల సందర్భంగా ఇచ్చే అహేతుకమైన హామీల పత్రం కాదు. అలవికాని హామీలు గుప్పించడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా తప్పించుకోవడానికి కొన్ని పార్టీలు తమ శక్తియుక్తులను ఉపయోగించడం కనిపిస్తుంది. అయితే ప్రజలు ఇటువంటి పార్టీలను గమనిస్తూనే ఉంటారు. సమయం వచ్చినప్పుడు ఓటు ద్వారా బుద్ధి చెబుతారు. ఇందుకు మంచి ఉదాహరణ 2014లో తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన విధానాన్ని గమనించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీకి అధికారం కట్టబెట్టడమే. దీన్ని సద్వినియోగం చేసుకొని వైసీపీ 99 శాతం హామీలను నెరవేర్చి మరో విజయం వైపు దూసుకుపోతోంది. ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు తాము ఏం చేస్తామో చెబుతూ ఒక రాజకీయ పార్టీ తన సిద్ధాంతాలు, ఉద్దేశాలు, విధానాలను ప్రతిబింబిస్తూ ఇచ్చే హామీ పత్రమే ఎన్నికల మేనిఫెస్టో. దీని ఆధారంగా, తమ అంచనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా, ఏ పార్టీ మేనిఫెస్టో ఉందో ప్రజలు నిర్ణయించుకొని ఓటువేయడానికి వీలవుతుంది. అందువల్ల, రాజకీయ పార్టీ హామీలు స్పష్టంగా ఉండాలి. అమలులో ఎలాంటి అస్పష్టతకు ఆస్కారం ఇవ్వకూడదు. భారత ఎన్నికల సంఘం 2013 సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా, రాజకీయ పార్టీలకు ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ కింద మార్గదర్శకాలను రూపొందించడానికీ, వారు చేసిన వాగ్దానాలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించిన విషయాలపై చర్చించడానికీ, రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కానీ వాటిపై స్పష్టత రాలేదని చెప్పాలి. చట్ట ప్రకారం, ఎన్నికల మేనిఫెస్టోలోని వాగ్దానాలు అవినీతి అక్రమాల కిందకు రావని అందరికి తెలిసిన విషయమే. కానీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పార్టీల మధ్య సమాన పోటీ స్థాయిని నిర్ధారించ డానికీ, ఎన్నికల స్వచ్ఛతనూ, ప్రజలకు చేసిన వాగ్దానాలనూ కాపా డటం కోసం మాత్రమేనని నిర్ధారించడమైనది. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేయడం సర్వసాధారణం. అమెరికాలో, ఇది ఆర్థిక, విదేశీ విధానాలు, ఆరోగ్య సంరక్షణ, పాలనా సంస్కరణలు, పర్యావరణ సమస్యలు, వలసలు వంటివాటిపై వారు చేయబోయే పనులను తెలియచేస్తుంది. అనేక పశ్చిమ ఐరోపా దేశాలలో, మేనిఫెస్టోలు మరింత నిర్దిష్ట విధాన ఎంపికలు, బడ్జెట్ చిక్కులను ప్రస్తావిస్తాయి. 2022లో ఆర్జేడీ ఎంపీ మనోజ్ కె. ఝా రాజ్యసభలో మాట్లా డుతూ, ఎన్నికల మేనిఫెస్టోకు చట్టబద్ధత కల్పించాలని, ఎన్నికల తర్వాత, రాజకీయ పార్టీలు తాము చేసిన వాగ్దానాలను మరచిపోయి ఆడంబరమైన వాదనలు చేయకుండా చట్టం ఉండాలని చెప్పిన విష యాలను గుర్తు చేసుకోవడం సముచితం. మేనిఫెస్టో ఔచిత్యం తగ్గు తోందని వారు ఆవేదన పడుతూ, 1952, 1957, 1962 ఎన్నికలప్పుడు విడుదల చేసిన మేనిఫెస్టోలను ఉటంకించారు. పార్టీలు చేయదగిన అంశాలను మాత్రమే ఆ యా మేనిఫెస్టోల్లో చేర్చేవారని పేర్కొన్నారు. తెలుగు దేశం పార్టీ 2014లో విడుదల చేసిన మేనిఫెస్టోను, ‘దశ–దిశ చూపించే ఒక పవిత్ర పత్రం’గా అభివర్ణించారు ఆ పార్టీవారు. దీనిలో ‘కష్టాలలో ఉన్న రైతులను రుణ మాఫీతో ఆదుకొంటాం’ అని చెప్పారు. రుణమాఫీ గురించి ఇంతకు మించి వివరణ మేనిఫెస్టోలో కనపడదు. అనగా ఏ తారీఖు వరకున్న రుణాలు, ఎంత మేరకు మాఫీ చేస్తారనే విషయం ఎక్కడా లేదు. ఈ విషయమై ఆ పార్టీ అధ్యక్షులు బహిరంగ సభలలో చెప్పిన వాగ్దానాలు మేనిఫెస్టోలో లేవు. గెలిచిన తర్వాత ఈ వాగ్దానం అమలును ‘మమ’ అనిపించడానికి పార్టీ పెద్దలు చాలా శ్రమించారు. ప్రొఫెసర్ కె.వి. రమణారెడ్డి, ఇదే పత్రికలోనూ, డెక్కన్ క్రానికల్ ఆంగ్ల పత్రికలోనూ తెలుగుదేశం పార్టీ ఈ విషయమై రైతులను ఏవిధంగా మభ్య పెట్టిందో తన పరిశోధన ద్వారా విశదంగా వివరించారు. ‘వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, రూ 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రైతువారి ఇన్సూరెన్స్’ వంటి హామీలనూ ఇదే మేనిఫెస్టోలో పెట్టారు. కానీ గెలిచాక, వీటి ఊసే లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ‘రైతుభరోసా కేంద్రా’లను ఏర్పాటు చేసి, రైతుకు కావలసినవన్నీ ఒకే చోట అందుబాటులో ఉంచడంతో బాటు, నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయడం, ధరల స్థిరీకరణ నిధి ద్వారా గిట్టుబాటు ధర అందించడం, పంటనష్ట నివారణకు ఇన్సూరెన్స్ అమలుచేసి రైతుకు అండగా నిలవడం వంటి నిర్మాణాత్మక పనులు చేసింది. తెలుగుదేశంవారు ‘మహిళా సాధికారత కోసం డ్వాక్రా రుణాల రద్దుతో బాటు, వారి అభివృద్ధికి, భద్రతకు పెద్దపీట వేయాలని నిర్ణ యించారు.’ కాని, వాస్తవానికి ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక ఐదు సంవత్సరాలలో ఏమి జరిగిందో మహిళలకు తెలుసు. ౖవైసీపీ ప్రభుత్వం వచ్చినాక, డ్వాక్రా రుణాలను వడ్డీతో బాటు మాఫీ గావించారు. ఇలా ఎన్నికల వాగ్దానాలను పార్టీలు మరచిపోతే, ప్రజలు మరచిపోతారు లేదా క్షమిస్తారనుకోవడం పెద్ద పొరబాటు. తెలుగు దేశం తన పార్టీ మేనిఫెస్టోలో, ‘రానున్న అయిదేళ్ళలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం/ ఉపాధి అవకాశం కల్పిస్తా’మని మాటిచ్చింది. కానీ దాని గురించి ఏమీ పట్టనట్లు ఐదేళ్లు గడిపేసింది. యువత 2019లో జరిగిన ఎన్నికల్లో, ఎలా గుణపాఠం చెప్పారో అందరికీ తెలిసిందే. ‘గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్, ప్రతి గ్రామానికీ తారు రోడ్డు, ప్రతి వీధికి సిమెంటు రోడ్డు, ప్రతి ఇంటికి ఉచితంగా మరుగుదొడ్డి నిర్మించి ఇచ్చుట’ వంటి హామీలూ తెలుగుదేశం ఇచ్చింది. అయిదేళ్లు ప్రభు త్వంలో ఉండి, ఎన్ని ఇండ్లు కట్టించారో, మిగతా హామీలు ఏమిచేశారో తెలిసిన విషయమే. ఈ విషయమై ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న పనులు, కట్టిస్తున్న కాలనీల గురించి, పచ్చ పత్రికలకు కనబడక పోయినా, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా తెలుస్తూనే ఉంది. అలాగే పేద పిల్లలకు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామనీ, హెల్త్ కార్డ్ ద్వారా అన్నిరకాల వ్యాధులకు కార్పొరేట్, ప్రభుత్వ ఆసు పత్రులలో ఉచిత వైద్యం అందిస్తామనీ మాటిచ్చి గెలిచాక టీడీపీ అమలు చేయలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం పదహారు ప్రభుత్వ ఆసు పత్రులను నిర్మించడంతో బాటు డాక్టర్ల నియామకాలు గావించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యానికి ఇస్తున్న ప్రాధాన్యతను కేంద్రం సైతం కొనియాడింది. ఈ మధ్యకాలంలో ప్రారంభించిన ఇంటింటికి వెళ్లి వైద్యపరీక్ష చేయడంతో పాటు ఇతర సేవలందించడం వంటి కార్య క్రమం ఇండియాలోనే ఆరోగ్యరంగంలో ఒక విప్లవం లాంటిది. పేద లకు చదువే ఒక స్థిరమైన ఆస్తిగా గుర్తించి ‘నాడు–నేడు’ ద్వారా చదు వులో తీసుకొచ్చిన సంస్క రణలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. తెలుగుదేశం 2012లో ప్రకటించిన బీసి డిక్లరేషన్ ప్రకారం 100 శాసనసభ స్థానాలు వారికి కేటాయించడం, వారికి ప్రత్యేక బడ్జెట్, బీసీ సబ్–ప్లాన్ పెట్టి అమలు చేస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రక టించారు. గెలిచాక ఇవన్నీ మూలబడ్డాయి. బీసీలకు ప్రస్తుత ప్రభుత్వం ఏమి చేస్తున్నదో అందరికీ తెలుసు. వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయాల ద్వారా అందిస్తున్న అనేక సేవలు గుర్తుకు వస్తే, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్‌లో అమలు అవుతున్నదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగుదేశం తన మేనిఫెస్టోలో, ‘ప్రతి ఒక్క హామీనీ, పథకాన్నీ, చిత్తశుద్ధితో అమలు చేస్తాం, ఆచరణలో ఆదర్శంగా నిలుస్తాం’ అని చెప్పింది. కానీ ఏ ఒక్క హామీనీ సంపూర్ణంగా అమలు చేయలేక పోయింది. కానీ వైసీపీ నాయకత్వం 2019లో ప్రకటించిన మేని ఫెస్టోను ప్రజలకిచ్చిన ‘బాండు పేపరు’గా పరిగణించి నూటికి 99 శాతం అమలుచేసి... చిక్కుముడులు విప్పి, ఆ ఒక్కశాతం కూడా అమ లుకు ప్రయత్నిస్తామని ప్రజలకు చెబుతోంది. సహజంగా అటువంటి నాయకులను ప్రజలు ఆదరిస్తారు, చిరకాలం గుర్తుపెట్టుకొంటారు. ఎన్నికైన ప్రభుత్వానికి వారిచ్చిన మేనిఫెస్టో కీలకంగా ఉండాలి. వాస్తవిక ఎన్నికల మేనిఫెస్టో కోసం, రాజకీయాలను మరింత జవాబు దారీగా, పారదర్శకంగా చేయడానికి ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ అఫ్ కండక్ట్‌కు పదును పెట్టి ప్రజలికిచ్చిన హామీలను కనీసం మూడు వంతులైనా పాటించేట్లుగా నిబంధనలు పెట్టాలి. లేని పక్షంలో, ప్రజల కిచ్చిన మాట తప్పినట్లుగా పరిగణించి తగిన శిక్ష విధించాలి. అలా కానిచో పార్టీల మధ్య సమాన పోటీ స్థాయి ఉండదు. ఓటర్ల నమ్మ కాన్ని వమ్ము చేసినట్లవుతుంది. డా‘‘ పి. పృథ్వీకర్ రెడ్డి వ్యాసకర్త హైదరాబాద్‌లోని ‘సెస్’(సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్) సీనియర్ పరిశోధకుడు ‘ prudhvikar@cess.ac.in -
గుండెల్లో గూడుకట్టుకున్న అందరికీ..
సాక్షి, చైన్నె : ‘నా గుండెల్లో గూడు కట్టుకున్న ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు’ అని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ వ్యాఖ్యానించారు. ఆయన ఇటీవల తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారంతా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కసరత్తుల్లో నిమగ్నమయ్యారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం విజయ్ రాష్ట్ర పర్యటనకు సైతం సిద్ధమవుతున్నారు. అదే సమయంలో విజయ్ రాజకీయ ప్రవేశంపై పలు పార్టీ నేతలు, సినీ రంగ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు స్పందించారు. శుభాకాంక్షలు తెలుపుతూ ఆహ్వానం పలికారు. వీరందరికీ కృతజ్ఞతలు తెలిపే విధంగా విజయ్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడి హోదాలో తొలిసారి విజయ్ ఈ ప్రకటనను చేశారు. ఇందులో ‘నా గుండెల్లో గూడు కట్టుకుని ఉన్న అభిమానులు, శ్రేయోభిలాషులు అందరికీ అంటూ వ్యాఖ్యలను విజయ్ మొదలెట్టారు. తమిళ ప్రజల అశేషాభిమానం, పిలుపు మేరకే కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటన చేశానని గుర్తు చేశారు. ఈ సందర్భంగా తనను ఆదరించే విధంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. తన రాజకీయ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తోడ్పాటు అందిస్తున్న మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అభిమాన నీరాజనం పార్టీని ప్రకటించిన విజయ్‌కు అడుగడుగునా అభిమానులు నీరాజనాలు పడుతున్నారు. పుదుచ్చేరిలోని ఓ ప్రాంతంలో ఆయన తాజా చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సమాచారంతో తమిళనాడు, పదుచ్చేరి నుంచి వేలాదిగా అభిమానులు ఆ షూటింగ్ ప్రాంతం వద్దకు ఆదివారం సాయంత్రం పోటెత్తారు. ఎటు చూసినా జనం అన్నట్లుగా అభిమానులు చేరడంతో ఆ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో దీంతో షూటింగ్‌కు విరామం ఇచ్చి అక్కడున్న ఓ బస్సు మీదకు వచ్చి అభిమానులను పలకరించారు. అయితే అభిమానుల తాకిడి భారీగా పెరగడంతో గట్టి భద్రత నడుమ ఆయన అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లి పోయారు. -
2026 అసెంబ్లీ ఎన్నికలే మా టార్గెట్ : విజయ్
-
Vijay Political Party: రాజకీయ పార్టీ ప్రకటించిన హీరో విజయ్
తమిళనాడులో హీరో విజయ్ పార్టీ ప్రకటించాడు. 'తమిళగ వెట్రి కళగం'Tamizhaga Vetri Kazhagam పేరుతో ఆయన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. గత మూడేళ్లుగా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతుండగా నేటితో దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. తమిళగ వెట్రి కళగం పేరును రిజస్టర్ చేసినట్లు ప్రకటన రావడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. గత కొద్ది నెలలుగా ఆయన ఎక్కువగా ప్రజల్లోనే కనిపించడమే కాకుండా పలు సేవా కార్యక్రామాల్లో పాల్గొంటు ఉన్న విషయం తెలిసిందే. పార్టీ ప్రకటన అయితే వచ్చేసింది కానీ అందుకు సంబంధించిన గుర్తును త్వరలో ప్రకటించనున్నారు. పార్టీ ఎజెండాను కూడా త్వరలో ప్రకటిస్తామాని విజయ్ నుంచి ఒక నోట్ వెలువడింది. తమిళనాడులో అవినీతి పాలన సాగుతోందని దానిని నిర్మూలించడమే తన ధ్యేయం అని విజయ్ అన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన టార్గెట్ అని విజయ్ పేర్కొన్నారు. హీరో విజయ్ తన రాజకీయ రంగప్రవేశం ఒకరోజుతో అనుకుని జరగలేదు. పక్కా ప్లాన్‌తోనే ఆయన అడుగులు వేశారు. పొలిటికల్ రంగంలోకి దిగిన తర్వాత తన లక్ష్యాన్ని ఎలా ఛేదించాలి అనే దృఢ సంకల్పంతోనే టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో పక్క తన విజయ్ మక్కళ్ ఇయక్కుమ్ ద్వారా పలు సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరవయ్యారు. ఈ సంఘం ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆపై అనేక రక్తదాన శిబిరాలతో పాటు ఉచిత విద్య కేంద్రాలు, ఉచిత న్యాయ సలహా కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ ఏర్పాటు చేశారు. గతేడాది తమిళనాడులోని 234 నియోజకవర్గాలకు చెందిన పదవ తరగతి, ప్లస్‌టూ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను ముగ్గురు చొప్పున తన కార్యాలయానికి రప్పించి వారికి ప్రశంసాపత్రాలతో పాటు కానుకలను అందించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ వారితో ముఖ్యంగా నోటుకు ఓటు విధానం సరికాదని, దీన్ని అందరూ పాటించాలని హితవు పలికారు. నెలరోజుల క్రితం తమిళనాడులో తుపాను దెబ్బకు వేలాది మంది ప్రజలు రోడ్డున పడ్డారు. వారందరికి తనవంతుగా సాయం అందించి వారికి అండగా నిలిచాడు. ఇలా తన పొలిటికల్ ఎంట్రీ కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం తమిళనాడులో సినిమా పరిశ్రమ నుంచి కమల్ హాసన్, ఖుష్బూ, నమిత వంటి వారు మాత్రమే రాజకీయాల్లో ఉన్నారు. విజయ్ రాకతో ఆయన పార్టీలోకి మరికొంత మంది చేరనున్నారని సమాచారం. View this post on Instagram A post shared by Vijay (@actorvijay) -
Actor Vijay: త్వరలో తమిళనాట కొత్తపార్టీ?
తమిళనాట సినిమా వాళ్ల రాజకీయాలు చాలా టిపికల్‌గా ఉంటాయి. యాక్టర్ పొలిటీషియన్లుగా సక్సెస్ అయిన రేటు ఎక్కువే. ఫెయిల్యూర్స్ వేళ్ల మీద చెప్పొచ్చు. అయితే మాస్ స్టార్డమ్ ఉన్న రజనీకాంత్ ఆ ప్రయత్నంలో వెనుకంజ వేయగా.. మరో సీనియర్ కమల్‌హాసన్ మాత్రం ఘోరంగా తడబడ్డారు. ఇక.. వీళ్లిద్దరి తర్వాత ఆ స్థాయి అభిమానం సంపాదించుకున్న విజయ్ రాజకీయాల్లోకి వస్తే.. ఆదరణ ఎలా ఉండబోతుందా? అనేది చర్చనీయాంశంగా మారిందక్కడ. చెన్నై: తమిళనాట మరో రాజకీయ పార్టీ.. అదీ ప్రముఖ నటుడి నుంచే రాబోతుందన్న వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలయ దళపతిగా తమిళనాట అశేష అభిమానం సంపాదించుకున్న విజయ్ త్వరలో కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా జరిగిన విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన ఓ నిర్ణయం తీసుకోగా.. సభ్యులు పొలిటికల్ పార్టీ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. తమిళ చిత్రసీమలో నటనతోపాటు సేవా కార్యక్రమాలతో విజయ్ అక్కడి ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. ఈ మధ్యే వరద బాధితులకు స్వయంగా ఆయనే నిత్యావసరాలు అందించారు. అలాగే.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 10, 12 తరగతుల్లో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన విద్యార్థులకు గతేడాది జూన్‌లో నీలాంగరైలో ప్రశంసాపత్రాలు, ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఆ సమయంలో ఓపికగా కొన్ని గంటలపాటు స్టేజ్‌పైనే ఆయన నిల్చుని ఉన్నారు కూడా. మరోవైపు విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ తరఫున గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల కోసం రాత్రి పాఠశాలలు ప్రారంభించారు. గ్రంథాలయాలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గురువారం చెన్నై సమీప పనయూర్లోని తన కార్యాలయంలో విజయ్ మక్కల్ ఇయక్కం నిర్వాహకులతో సంప్రదింపులు సమావేశం నిర్వహించారు. చెన్నై, కోవై, తిరుచ్చి, మధురై సహా అన్ని జిల్లాల నుంచి 150 మంది నిర్వాహకులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీ ప్రారంభించాలని సమావేశంలో పలువురు డిమాండు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలపై విజయ్ చర్చించినట్లు సమాచారం. మరో నెలరోజుల్లో కొత్తపార్టీ విషయమై ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ పేరు ఖరారు చేసి నమోదు చేసిన తర్వాత.. లోక్‌సభ ఎన్నికల్లో ఎవరికైనా మద్దతివ్వాలా లేక ఒంటరిగా పోటీ చేయాలా అనే అంశలపై మరోసారి నిర్వాహకులతో సంప్రదింపులు జరపనున్నట్లు చెబుతున్నారు. గతంలో విజయ్ తండ్రి.. ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ చంద్రశేఖర్ విజయ్ అభిమాన సంఘాన్ని రాజకీయాల వైపు అడుగులు వేయించే యత్నం చేశారు. అయితే ఆ సమయంలో రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తికనబర్చని విజయ్.. తండ్రితో విబేధించారు కూడా. అయితే ఇప్పుడు విజయ్ పీపుల్స్ మూమెంట్ పేరిట సహాయక కార్యక్రమాలు చేస్తున్న ఆయన.. దానిని పార్టీగా మార్చేందుకు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. விஜய் அரசியல் பிரவேசம்.. டெல்லியில் முகாம்#Vijay | #PoliticalEntry | #VMI | #VijayMakkalIyakkham | #NewsTamil24x7 pic.twitter.com/Deirtywxla — News Tamil 24x7 | நியூஸ் தமிழ் 24x7 (@NewsTamilTV24x7) January 25, 2024 తమిళనాట సినిమా వాళ్ల రాజకీయాలు చాలా టిపికల్‌గా ఉంటాయి. యాక్టర్ పొలిటీషియన్లుగా మారి సక్సెస్ అయిన రేటు ఎక్కువే. ఫెయిల్యూర్స్‌ను వేళ్ల మీద చెప్పొచ్చు. అయితే స్టార్డమ్ ఉన్న రజనీకాంత్ ఆ ప్రయత్నంలో వెనుకంజ వేయగా.. కమల్‌హాసన్ మాత్రం ఘోరంగా తడబడ్డారు. ఇక.. వీళ్లిద్దరి తర్వాత ఆ స్థాయి అభిమానం ఉన్న విజయ్ రాజకీయాల్లోకి వస్తే.. ఆదరణ ఎలా ఉండబోతుందా? అనేది చర్చనీయాంశంగా మారిందక్కడ. -
Maharashtra politics: షిండే వర్గమే అసలైన శివసేన
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన రాజకీయ పార్టీ అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నర్వేకర్ బుధవారం తేల్చేశారు. ఏడాదిన్నరగా కొనసాగుతున్న అనిశి్చతికి తెరదించారు. శివసేన పార్టీ 2022 జూన్‌లో రెండుగా విడిపోయిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు రెండు పక్షాలుగా చీలిపోయారు. ఒక వర్గానికి నేతృత్వం వహిస్తున్న ఏక్నాథ్ షిండే బీజేపీ, ఎన్సీపీ మద్దతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. మరో వర్గానికి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వం వహిస్తున్నారు. తమ వర్గమే అసలైన శివసేన అంటూ ఇరువురు నేతలు వాదిస్తున్నారు. అవతలి వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ షిండే, ఉద్ధవ్ ఠాక్రే అసెంబ్లీ స్పీకర్‌కు విజ్ఞాపనలు సమరి్పంచారు. వీటిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ తన నిర్ణయం ప్రకటించారు. షిండే వర్గమే అసలైన శివసేన అని స్పష్టం చేశారు. ఉద్ధవ్ వర్గానికి చెందిన సునీల్ ప్రభును విప్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. ఈ తొలగింపు 2022 జూన్ 21 నుంచి వర్తిస్తుందన్నారు. షిండే వర్గానికి చెందిన భరత్ గోగావాలేను అధికారికంగా విప్‌గా గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. ఏ ఒక్క ఎమ్మెల్యేపై కూడా అనర్హత వేటు వేయడం లేదన్నారు. పార్టీ నుంచి నేతలను బహిష్కరించే అధికారం శివసేన చీఫ్‌కు లేదని పేర్కొన్నారు. 2018 నాటి శివసేన రాజ్యాంగాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఉద్ధవ్ వర్గం కోరగా, స్పీకర్ అంగీకరించలేదు. 1999 నాటి రాజ్యాంగాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నామని చెప్పారు. శివసేన ఎన్నికల సంఘం సైతం ఈ రాజ్యాంగాన్నే గుర్తించిందని పేర్కొన్నారు. మొత్తం 54 మంది ఎమ్మెల్యేలకు గాను 37 మంది ఎమ్మెల్యేలు షిండే వర్గంలోనే ఉన్నాయని గుర్తుచేశారు. స్పీకర్ నిర్ణయంపై షిండే వర్గంసంబరాలు చేసుకుంది. సీఎం ఏక్నాథ్ షిండే కూడా దీనిపై హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంను ఆశ్రయిస్తాం: ఉద్ధవ్ వర్గం స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని శివసేన(ఉద్ధవ్) ప్రకటించింది. స్పీకర్ నిర్ణయాన్ని అంగీకరించబోమని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. ఇదంతా బీజేపీ కుట్ర అని పార్టీ నేతలు ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్ మండిపడ్డారు. బాల్ ఠాక్రే స్థాపించిన శివసేనను ఎవరూ అంతం చేయలేరన్నారు. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారమని ఆరోపించారు. షిండే వర్గమే అసలైన శివసేన అయితే తమ వర్గం ఎమ్మెల్యేలపై ఎందుకు అనర్హత వేటు వేయలేదని ప్రశ్నించారు. స్పీకర్ నిర్ణయాన్ని ప్రజాస్వామ్య హత్యగా ఉద్ధవ్ ఠాక్రే అభివరి్ణంచారు. -
‘శ్రీరాముడు మాంసాహారి’: ఎన్సీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
హిందువులు ఆదర్శపురుషునిగా భావించే శ్రీరామునిపై మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత డాక్టర్ జితేంద్ర అవద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని షిర్డీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేత డాక్టర్ జితేంద్ర అవద్ మాట్లాడుతూ శ్రీరాముడు శాకాహారి కాదని, మాంసాహారేనని అన్నారు. 14 ఏళ్ల పాటు అడవిలో వనవాసం ఉన్న వ్యక్తి శాకాహారం కోసం ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. ఇది నిజమో కాదో ప్రజలే గ్రహించాలన్నారు. దేశ స్వాతంత్ర్యం గురించి ప్రస్తావించిన ఆయన ఎవరెన్ని చెప్పినా గాంధీ, నెహ్రూల కారణంగానే మనకు స్వాతంత్య్రం వచ్చిందన్నది వాస్తవమన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ నేత గాంధీజీ ఓబీసీ అనే విషయాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌వారు గుర్తుంచుకోవాలన్నారు. గాంధీజీ హత్యకు అసలు కారణం కులతత్వమేనని జితేంద్ర అవద్ వ్యాఖ్యానించారు. త్వరలో జరిగే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ముందు కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో వివాదం తలెత్తింది. 31 ఏళ్ల క్రితం రామమందిర ఆందోళనల్లో పాల్గొన్న శ్రీకాంత్ పూజారిని తాజాగా అరెస్ట్ చేయడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని బీజేపీ ఆరోపించింది. అయితే ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని, రామాలయ ప్రారంభోత్సవానికి ముందు ఇలా అరెస్ట్ చేయడం యాదృచ్ఛికమేనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. శ్రీకాంత్ పూజారి మద్యం అక్రమ విక్రయాలు, జూదంతో సహా 16 సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని సీఎం తెలిపారు. అలాంటి వారిని అరెస్టు చేయకపోతే రాముడు కూడా క్షమించడని పేర్కొన్నారు. ఇదిలావుండగా ఇటీవల సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర కూడా కొత్త వివాదం సృష్టించారు. భారత్ హిందూ దేశంగా మారితే అది ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్లా మారుతుందని వ్యాఖ్యానించారు. -
సమయం.. సరిపోవట్లే! రోజుకు 28గంటలు ఉంటే బాగుండు!
సాక్షి, మహబూబ్‌నగర్: ‘ప్రచారంలో అటు తిరిగి ఇటు వచ్చే లోగా రోజు గడిచిపోతుంది. ఏ రోజు అనుకున్న పనులు ఆ రోజు అవట్లేదు. సమయం సరిపోవడం లేదు. పోలింగ్ సమయమేమో దగ్గరపడుతోంది. రోజుకు 28గంటలు ఉంటే బాగుండు.’ ఇటీవల ఓ నాయకుడు తన అనుచరుల వద్ద చేసిన వ్యాఖ్య ఇది. ఈ ఒకట్రెండు రోజులు చెమటోడ్చి కష్టపడితే ఐదేళ్ల పాటు హాయిగా వీఐపీ హోదాలో దర్జాగా ఉండవచ్చు. శాసనసభలో ప్రధాన ప్రాత వహిస్తూ అధికార దర్పంతో హాయిగా బతకవచ్చు. కాలం కలిసి వస్తే మంత్రి పదవి రావొచ్చు. అలాంటి రాజకీయ జీవితం కోసం అభ్యర్థులు ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఓవైపు ఉష్ణోగ్రతలు పడిపోయి గ్రామాలన్నీ మంచుదప్పటి పరచుకుని ఉంటే.. అభ్యర్థులు చలిని సైతం లెక్క చేయకుండా తెల్లవారుజామునే ప్రచారం మొదలుపెడుతున్నారు. ఉదయం ఇంటి నుంచి బయల్దేరి రాత్రికి ఎప్పుడో తిరిగొస్తున్నారు. అభ్యర్థుల దినచర్య అత్యంత బిజీ షెడ్యూల్‌తో ప్రారంభమవుతోంది. అలసట, విశ్రాంతి అనే పదాలకు చోటులేకుండా ముందుకు సాగుతున్నారు. సహాయకుల పరిస్థితి అంతే.. ఒక్క నిమిషం కూడా వృథా కాకుండా అభ్యర్థులు తమ షెడ్యూల్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. కేవలం నిద్రించే సమయం తప్ప మిగతా సమయాన్ని మొత్తం ప్రచార పర్వానికే అంకితం చేస్తున్నారు. కాలంతో పరుగెడుతూ ఎన్నికల కుస్తీ పడుతున్నారు. బిజీ షెడ్యూల్‌తో అభ్యర్థులకు నెలరోజుల నుంచి కంటినిండ నిద్ర కరువైంది. గ్రామీణ ప్రజలు ఉదయమే వ్యవసాయ పనులకు వెళ్తుండటంతో వారిని కలిసేందుకు వీలైనంత త్వరగా ఇంటి నుంచి బయల్దేరుతున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వేలాది మందిని ప్రత్యక్షంగా పలకరిస్తున్నారు. ఈ సమయంలో వారి వ్యక్తిగత సహాయకుల పాత్ర కీలకమవుతుంది. నిర్దేశించుకున్న పనులను నిర్ణీత సమయానికి గుర్తు చేయడం, అందరినీ సయన్వయం చేయడం వంటి బాధ్యతలు వీరు నిర్వరిస్తున్నారు. అలా అభ్యర్థులకు సహకారం అందిస్తూ సమయాభావ సమస్యను ఎదుర్కొంటున్నారు. నెలరోజులుగా జనంలోనే.. అభ్యర్థుల ఇళ్ల వద్ద నిత్యం జనంతో కోలహలం కనిపిస్తోంది. ఉదయం నుంచే వందలాది మంది నాయకులు, కార్యకర్తలు ఆయా పార్టీల అభ్యర్థులతో మాట్లాడేందుకు క్యూ కడుతున్నారు. దీంతో నిద్రలేచింది మొదలు ప్రచారతంతు ప్రారంభమవుతోంది. కిందిస్థాయి నేతలతో మాట్లాడుతూ గ్రామాలు, మండలాల్లో పరిస్థితిపై ఆరా తీసేందుకు కొంత సయమం కేటాయించాల్సి వస్తోంది. రోజు ఏదో ఒక చోటకు వెళ్లడం దిన చర్యలో తప్పనిసరిగా మారింది. నియోజకవర్గం మొత్తం చుట్టి రావడమే లక్ష్యంగా రోజువారీ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాలకు రాకపోకల సమయంలోనూ ముఖ్యనేతలతో ఎప్పటికప్పుడు పరిస్థితులపై చర్చిస్తున్నారు. అలాగే ప్రత్యర్థి పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించేందుకు స్థానిక లీడర్ల సాయంతో కొంత సమయం కేటాయిస్తున్నారు. నియోజకవర్గానికి ఎవరైనా ముఖ్యనేతలు వస్తే జనసమీకరణ తదితర ఏర్పాట్లు చూసుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం రోజులో ఎంతో కొంత సమయం కేటాయిస్తున్నారు. దిన చర్య ఇలా.. ► ఉదయం 5గంటలకు మేల్కొనడం ► 5నుంచి 6గంటల వరకు కాలకృత్యాలు తీర్చుకోవడం ► 6నుంచి 7లోగా స్నానం, టిఫిన్ చేయడం ► 7నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు గ్రామాల్లో ప్రచారం, రోడ్ షోలు, చేరికలు, సభలు, ప్రెస్మీట్లు నిర్వహించడం ► 2నుంచి 4గంటల మధ్య మధ్నాహ్న భోజనం చేయడం ► సాయంత్రం 4నుంచి రాత్రి 10గంటల వరకు సభలు, సమావేశాలు, ర్యాలీల్లో పాల్గొనడం ► రాత్రి 10గంటలకు రాత్రి భోజనం తర్వాత ముఖ్యులతో మాటామంతి ► రేపటి దిన చర్య కోసం ప్లాన్ వేసుకోవడం ఆ రోజు అన్ని పనులు పూర్తయితే నిద్రకు ఉపక్రమించడం. ఈ తతంగం ముగిసే వరకు రాత్రి 12నుంచి 2గంటలు దాటుతోంది. ఒక్కోసారి ముఖ్యనేతల బహిరంగ సభలు ఉంటే తెల్లవారుజాము వరకు మేల్కొనే ఉంటున్నారు. -
వస్తారా.. రారా..?
సాక్షి, మెదక్: టికెట్లు ఆశించి భంగపడిన నేతలు కొందరు, పార్టీలో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని మరికొందరు, ఇలా చాలా మంది వివిధ పార్టీల కండువాలు మార్చారు. అయితే, వారికి సంబంధించిన కేడర్ మాత్రం తమతోపాటు రాకపోవడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. తమ వెంట వస్తే పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీలు సైతం ఇస్తున్నారు. అది కూడా కుదరకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లో కండువాలు మార్చిన నేతలు చాలా మందే ఉన్నారు. వీరితోపాటు వెళ్లడానికి కార్యకర్తలు మాత్రం వెనుకడుగు వేశారు. దీంతో ‘‘నిన్న, మొన్నటి వరకు నా వెంట ఉండి, పార్టీ మారాక నాతో రావా, నీ సంగతి చూస్తా’’అంటూ పార్టీ మారిన నాయకులు ధమ్కీ ఇస్తున్నారని పలువురు వాపోతున్నారు. ఇటీవల నర్సాపూర్‌లో ఓ పార్టీనేత ఎమ్మెల్యే టికెట్ ఆశించగా అతడికి టికెట్ లభించలేదు. వెంటనే మరో పార్టీలోకి జంప్ అయ్యాడు. కానీ, ఆ నాయకుడి వెంట కేడర్ మాత్రం వెళ్లలేదు. పార్టీ సిద్ధాంతం నచ్చి వారు ఆ పార్టీతోనే కొనసాగుతున్నారు. దీంతో ఆ నాయకుడు ‘‘నా వెంట మీరు రావాల్సిందే’’అని పలు వురు కార్యకర్తలను బెదిరించగా వారు వాగ్వాదానికి దిగారు. మర్యాద కరువు.. పార్టీలు మారిన నేతల వెంట కేడర్ వెళ్లకపోవడంతో కొత్తపార్టీలో ఆ నేతకు మర్యాద కరువైందని, ఎవరూ తమకు విలువ ఇవ్వడంలేదని జంప్‌జిలానీలు తలలు పట్టుకుంటున్నారు. నిన్న, మొన్నటి వరకు ప్రత్యర్థులుగా తిట్టుకున్న నేతలు ఒకేపార్టీలో చేరడంతో బలాలు, బలగాల లెక్కలపై పంచాయితీలు పెట్టుకుంటూ, జంప్ జిలానీలను సీనియర్ నాయకులు సూటిపోటీ మాటలతో అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలు మారిన నేతలు కొత్త పార్టీలో ఇమడలేక నామూ షీగా ఫీలవుతున్నట్లు సమాచారం. ఇవి చదవండి: కరీంనగర్‌కు రూ.9వేల కోట్లు తెచ్చా! : బండి సంజయ్ -
జంపింగ్ జపాంగ్స్.. లాభమెంత.. నష్టమెంత?
రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదని అంటారు. అలాగే ఏ నాయకుడు ఎలా పార్టీ మారవలసి వస్తుందో కూడా చెప్పలేం. రకరకాల పరిణామాలు ఇందుకు దోహదపడుతుంటాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికలను పరిశీలిస్తే, ఈసారి జరిగినన్ని ఫిరాయింపులు గత రెండు ఎన్నికలలో జరగలేదని చెప్పాలి. అందులోను కొందరు పెద్ద నాయకులు, దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేతలు పార్టీలు మారవలసిన పరిస్థితులు ఏర్పడడం ఆసక్తికరమైన అంశమే. ఇందుకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సైతం అతీతం కాదు. ఆ పార్టీకి చెందిన కొందరు ప్రముఖులు కూడా వేరే పార్టీలోకి వెళ్లారు. ✍️బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందుగానే 115 స్థానాలకు అభ్యర్దులను ప్రకటించి దాదాపు అందరికి బిఫారంలు ఇచ్చేశారు. దాంతో కొంత గడబిడ జరిగినా, సర్దుకోవడానికి టైమ్ దొరికింది. కాని కాంగ్రెస్, బీజేపీలు అలా చేయలేకపోయాయి. దాంతో ఆ పార్టీలు అసమ్మతులతో కొంత ఎక్కువ సతమతం అయ్యాయి. బుజ్జగింపులలో కాంగ్రెస్ కొంతవరకు సఫలం అయినా, బీజేపీ మాత్రం అంత సత్ఫలితం సాధించలేకపోయిందనే చెప్పాలి. తాజాగా మాజీ ఎంపీ, ప్రముఖ నటి విజయశాంతి కూడా బీజేపీకి గుడ్ బై చెప్పడం విశేషం. బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన ప్రముఖుల గురించి చూద్దాం. ✍️సాధారణంగా పార్టీ టిక్కెట్ ఇచ్చిన తర్వాత ఫిరాయించడం అరుదుగా జరుగుతుంటుంది. మల్కాజిగిరి బిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడికి మెదక్ టిక్కెట్ కోరుతూ పార్టీలో రగడ సృష్టించారు. అందుకోసం తన మల్కాజిగిరి టిక్కెట్ కూడా వదలుకుని, రెండు సీట్లు ఇస్తామన్న కాంగ్రెస్‌లో చేరడం సంచలనమే. టిక్కెట్లు రాని కొందరు నేతలు కూడా ఇలాగే పార్టీ మారారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లారు. సీనియర్ నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లోకి వెళ్లవలసి వస్తుందని ఆయన అనుచరులు ఎవరూ అనుకుని ఉండరు. ✍️ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ కన్నా ముందే మంత్రి పదవి పొందిన తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా వెనుకబడ్డారు. ఆ తరుణంలో కేసీఆర్ ఆయనను ఆహ్వానించి పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి కూడా ఇచ్చారు. తదుపరి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. పాలేరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే ఆ సీటు కేటాయించారు. ఆ ఎన్నికలో గెలిచారు కాని, సాధారణ ఎ న్నికలో ఓటమి చెందారు. దాంతో తుమ్మల రాజకీయం తిరగబడినట్లయింది. ఆయనకు అసెంబ్లీ ఎన్నికలలో టిక్కెట్ ఇచ్చి ఉంటే బీఆర్ఎస్లో కొనసాగేవారు. కాని అందుకు కేసీఆర్ సిద్దపడలేదు ✍️దానికి కారణం కాంగ్రెస్ పక్షాన గెలిచి, బీఆర్ఎస్లోకి వచ్చిన ఉపేందర్ రెడ్డికి సీటు ఇవ్వవలసి రావడమే. దాంతో అసంతృప్తి చెందిన తుమ్మల పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిపోయారు. మంత్రిగా ఉన్నప్పుడు ఏ పార్టీతో అయితే పోరాడారో ఆ పార్టీలోకే వెళ్లవలసి వచ్చింది. ఈ పిరాయింపుపై కేసీఆర్, తుమ్మల మధ్య మాటల విమర్శలు కూడా జరిగాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చక్రం తిప్పిన తుమ్మలకు ఈసారి పెద్ద పరీక్షే కావచ్చు. ✍️ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై ఆయన తలపడుతున్నారు. మరో నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచినా, మారిన రాజకీయాలలో ఆయన అధికార బీఆర్ఎస్లో చేరిపోయారు. కాని 2018 ఎన్నికలలో ఆయనకు టిక్కెట్ రాలేదు. అయినా ఓపికగా ఈ ఐదేళ్లు వేచి చూశారు. కాని ఆశ్చర్యంగా ఈసారి అసెంబ్లీ టిక్కెట్ కూడా రాలేదు. ఇక లాభం లేదని కాంగ్రెస్‌తో బేరం ఆడుకుని జంప్ చేసేశారు. ఒకదశలో బీజేపీకి వెళతారని అనుకున్నా, ఖమ్మం ప్రాంతంలో ఆ పార్టీ పుంజుకోలేదని అంచనాకు వచ్చి కాంగ్రెస్ వైపు వెళ్లి పాలేరు నియోజకవర్గంలో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ✍️కొల్లాపూర్‌లో ఐదుసార్లు గెలిచిన జూపల్లి కృష్ణారావు గత ఎన్నికలలో ఓటమిపాలయ్యారు. అప్పుడు గెలిచిన హర్షవర్దన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరడంతో కృష్ణారావుకు అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా ఆయన ఆగ్రహంతో కాంగ్రెస్‌లో చేరారు. కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగాను, తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వ్యక్తిగాను, అంతకుముందు కాంగ్రెస్‌లో కూడా ప్రముఖుడుగా రాణించిన జూపల్లె మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకుని బీఆర్ఎస్ సవాల్‌కు సవాల్ విసురుతున్నారు. ✍️గతసారి కాంగ్రెస్ తరపున గెలిచి ఆ తర్వాత కాలంలో బీఆర్ఎస్లోకి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలలో దాదాపు అందరికి కేసీఆర్ టిక్కెట్లు ఇచ్చారు. వారిలో సబితా ఇంద్రారెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, పైలల్ రోహిత్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, ప్రభృతులు ఉన్నారు. బీఆర్ఎస్ టిక్కెట్ ఆశించి రాక పోవడంతో కాంగ్రెస్‌లో చేరిన వారిలో పాయం వెంకటేశ్వర్లు, వేముల వీరేశం, వంటివారు ఉన్నారు. టిక్కెట్ రానందున అసంతృప్తి చెంది కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన ప్రముఖులలో డాక్టర్ నాగం జనార్దనరెడ్డి ఉన్నారు. ఆయన ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీని వీడి తెలంగాణ నగారా పేరుతో సొంత బానర్‌పై ఉప ఎన్నికలలో పోటీచేసి గెలిచిన నాగం రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా దెబ్బతిన్నారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పలు పోరాటాలు సాగించారు. ✍️ఆయన కొంతకాలం బీజేపీలోను, తదుపరి కాంగ్రెస్ లోను చేరారు. కాని కాంగ్రెస్‌లో తన రాజకీయ ప్రత్యర్ధి కె.దామోదరరెడ్డి కుమారుడికి నాగర్ కర్నూల్ టిక్కెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయారు. దాంతో ఆయన కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్లో చేరిపోవడం విశేషం. ఈయన కూడా కేసీఆర్ సమకాలికుడే. కేసీఆర్ కన్నా ముందుగానే మంత్రి అయ్యారు. కేసీఆర్‌ను చాలాకాలం వ్యతిరేకించిన నాగం, పాత స్నేహితుడే బెటర్ అనుకుని గులాబి కండువా కప్పుకున్నారు. ✍️పీసీసీ అధ్యక్షుడుగా పనిచేసిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్యయ్య కూడా జనగామ టిక్కెట్ పై కాంగ్రెస్‌తో విభేధించి పార్టీకి దూరం అయి బీఆర్ఎస్లో చేరారు. 2014 ఎన్నికల సమయంలో పార్టీకి నాయకత్వం వహించిన పొన్నాల 2023 ఎన్నికల సమయానికి బీఆర్ఎస్లోకి వచ్చారు. అయితే నాగం, పొన్నాల లకు ఇక్కడ కూడా టిక్కెట్ ఇవ్వకపోయినా, అధికారం వచ్చాక వారికి గుర్తింపు ఇస్తామన్న హామీని మాత్రం పొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక భూమిక పోషించిన చెరుకు సుధాకర్ కూడా సొంత పార్టీ పెట్టుకుని తర్వాత దానిని కాంగ్రెస్ లో కలిపినా ,టిక్కెట్ రాకపోవడంతో కోపం వచ్చి చాలాకాలంగా తాను వ్యతిరేకిస్తూ వచ్చిన బీఆర్ఎస్ లో చేరిపోయారు. ✍️గతంలో నకిరేకల్ ఎమ్మెల్యేగా పనిచేసిన వేముల వీరేశం ఈసారి బీఆర్ఎస్ను వదలి కాంగ్రెస్ టిక్కెట్ పై తలపడుతున్నారు. దానికి కారణం గతసారి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బిఆర్ఎస్లో చేరడం, తిరిగి టిక్కెట్ పొందడం.. ఫిరాయింపుల వల్ల ఇలాంటి సమస్యలు కూడా వస్తుంటాయి. తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ అవడంతో తుమ్మల తో సహా పలువురు నేతలు తలో దిక్కు అయ్యారు. వారిలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయి ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన పలువురు టీడీపీ నేతలకు కాంగ్రెస్‌లో ఆశ్రయం కల్పించారు. ములుగు నుంచి గెలిచిన సీతక్క తదితరులు ఇలాంటి వారిలో ఉన్నారు. ✍️తాజాగా మరో నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి టీడీపీని వీడి పరకాల నుంచి కాంగ్రెస్ పక్షాన పోటీచేస్తున్నారు. సుదీర్ఘకాలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ బీజేపీ పక్షాన మరోసారి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లలో టిక్కెట్లు రాని కొందరు బీజేపీలో టిక్కెట్ తీసుకుని పోటీచేస్తున్నారు. గెలవడం, ఓడడం సంగతి ఎలా ఉన్నా, గేమ్‌లో ఉండాలన్నది వారి ఉద్దేశంగా కనిపిస్తుంది. తొలుత బీజేపీకి ఊపు వస్తుందని ఆశించి ఆ పార్టీలో చేరిన మాజీ ఎంపీ వివేక్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వంటి నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోవడం గమనించదగ్గ అంశం. ✍️రాజగోపాలరెడ్డి గత ఎన్నికలలో కాంగ్రెస్ పక్షాన గెలిచి, కొంతకాలం తర్వాత బీజేపీలోకి వెళ్లారు. ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేసి ఉప ఎన్నికలో తిరిగి నిలిచి ఓటమి చెందారు. బీఆర్ఎస్ను అప్పట్లో బీజేపీనే ఓడించగలదని ఆయన అనేవారు. కాని పరిస్థితి మారడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో ఎక్కువ మంది కేసీఆర్ అవినీతిపై చర్య తీసుకోవడంలో బీజేపీ విఫలం అయిందని ఆరోపించడం విశేషం. కాంగ్రెస్‌లో టిక్కెట్లు రాని వారు కొందరు బీఆర్ఎస్లో చేరారు. ఈ ఫిరాయింపులలో బీజేపీకి ఎక్కువ నష్టం జరిగినట్లనిపిస్తుంది. ✍️అధికార బీఆర్ఎస్ను కాదనుకుని ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇద్దరు, ముగ్గురు జడ్పిచైర్ పర్సన్లు కాంగ్రెస్ లోకి వెళ్లారు. అలాగే కాంగ్రెస్ మాజీ మంత్రి పి.జనార్ధనరెడ్డి కుమార్తె విజయారెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరి ఖైరతాబాద్ నుంచి పోటీ చేస్తుంటే, ఆమె సోదరుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. ఈ విధంగా తెలంగాణలో ఫిరాయింపుల పర్వం ఈసారి జోరుగా సాగిందని చెప్పాలి. ఎన్నికలకు ముందే ఇన్ని ఫిరాయింపులు జరిగితే ఎన్నికలు అయ్యాక ఇంకెన్ని పార్టీ మార్పిడులు జరుగుతాయో చూడాలి! ::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
కేసులున్నవారే.. కానీ యోగ్యులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో నేరారోపణలు, పోలీసు కేసులున్నవారికి అభ్యర్థులుగా అవకాశం ఇవ్వడంపై ప్రధాన రాజకీయ పార్టీలు వివరణలు ఇచ్చాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎలాంటి నేరారోపణలు లేని ఔత్సాహికుల పేర్లను సైతం పరిశీలించామని.. అయితే యోగ్యతల విషయంలో వారు నేరచరిత్ర గల అభ్యర్థులకు సాటిలేరని బీఆర్ఎస్ ప్రకటించింది. వారంతా పార్టీకి విధేయులని, అధినాయకత్వం చేపట్టే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో వారికి తిరుగులేదని పేర్కొంది. ఇక మాజీ మంత్రులు/మాజీ ఎమ్మెల్యేలు/ ప్రస్తుత ఎంపీలు/ ఎమ్మెల్సీలు కావడంతోనే నేరచరిత్ర/కేసులున్న అభ్యర్థులను ఎంపిక చేశామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తమ పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకు వారిని ఎంపిక చేశామని పేర్కొంది. ఈ మేరకు కళంకిత అభ్యర్థులకు టికెట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్న అంశంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ తమ అధికారిక వెబ్సైట్లలో బహిరంగ ప్రకటనలు జారీ చేశాయి. నిబంధనల మేరకు అభ్యర్థుల నేర చరిత్రను ‘ఫార్మాట్ సీ–2’రూపంలో వెల్లడించాయి. బీజేపీ ఇంకా తమ అభ్యర్థుల నేరారోపణలు, కేసుల అంశంపై ప్రకటన జారీ చేయలేదు. మా అభ్యర్థులపై ఆరోపణలు, కేసుల్లో పసలేదు: బీఆర్ఎస్ బీఆర్ఎస్ అధినాయకత్వం అభ్యర్థుల యోగ్యతలు, అయోగ్యతలను క్షుణ్నంగా పరిశీలించాకే ఎంపిక చేసిందని పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్ డిక్లరేషన్‌లో ప్రకటించారు. బీఆర్ఎస్ తరఫున పోటీచేస్తున్న 119 మంది అభ్యర్థుల్లో 57 మంది విషయంలో ఉమ్మడిగా ఈ డిక్లరేషన్ జారీ చేశారు. ప్రజాజీవితంలో ప్రశంసనీయ అనుభవాన్ని కలిగి ఉండడంతోపాటు తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారనే ఈ అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు. ‘‘అభ్యర్థులంతా విద్యావంతులేగాక సమాజంలో ఉన్నతస్థాయిల్లో ఉన్నవారే. వారిపై ఆరోపణలు, కేసుల తీవ్రతను పార్టీలోని సంబంధిత విభాగం పరిశీలించి వాటిలో పసలేదనే భావనకు వచ్చింది. అందుకే ఈ అభ్యర్థులు సరైనవారని పార్టీ అధినాయకత్వం భావించి తెలంగాణ సర్వతోముఖ అభివృద్ధి కోసం ఎంపిక చేసింది’’అని డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకు.. మొత్తం 52మంది అభ్యర్థులపై నేరారోపణలు, వారి ఎంపిక కారణాలను కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఒక్కో అభ్యర్థి ఎంపికపై ప్రత్యేకంగా కారణాలను వివరించింది. నేరచరిత్ర లేని ఇతర అభ్యర్థులను ఎందుకు ఎంపిక చేయలేదనే అంశంపై వివరణ ఇస్తూ.. పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకు ఎంపిక జరిగిందని తెలిపింది. ప్రస్తుతం ఎంపీ కావడం, ప్రజాదరణ ఉండటంతోనే టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కొడంగల్ స్థానానికి ఎంపిక చేసినట్టు వెల్లడించింది. పేరొందిన డాక్టర్లు, న్యాయవాదులు, తెలంగాణ ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలు కావడంతో మరికొందరిని ఎంపిక చేసినట్టు తెలిపింది. ‘నేరచరిత’ ప్రకటన ఎందుకు? కేంద్ర ఎన్నికల సంఘం 2020 మార్చి 6న జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. అన్ని జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న తమ అభ్యర్థులపై నేరారోపణలు/కేసుల వివరాలను ‘ఫార్మట్–సీ2, ఫార్మాట్– సీ7’రూపంలో తమ అధికారిక వెబ్సైట్లో పొందుపర్చాలి. సదరు నేరాల స్వభావం, చార్జిషీట్ దాఖలు అయిందా, కోర్టు పేరు, కేసు నంబర్ వంటి వివరాలనూ అందులో పేర్కొనాలి. దీనితోపాటు సదరు అభ్యర్థులను ఎందుకు ఎంపిక చేశారు? నేరచరిత్ర లేని ఇతర అభ్యర్థులను ఎందుకు ఎంపిక చేయలేకపోయారన్న వివరణను కూడా పొందుపరచాలి. అభ్యర్థుల విద్యార్హతలు, సాధించిన ఘనతలు, విజయాలు, ప్రతిభ వంటి అంశాలనూ పేర్కొనాలి. ఈ సమాచారాన్ని ఒక ప్రాంతీయ, ఒక జాతీయ పత్రికలో సైతం ప్రచురించాలి. రాజకీయ పార్టీకి సంబంధించిన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లోనూ ఈ వివరాలను వెల్లడించాలి. -
అడుక్కుంటే ఓట్లేస్తారట కానీ డబ్బులేయరట సార్!
అడుక్కుంటే ఓట్లేస్తారట కానీ డబ్బులేయరట సార్! -
Tandur: ఓ పార్టీ నుంచి అడ్వాన్స్ తీసుకుని.. మరో పార్టీలోకి జంప్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో ఓ ప్రధాన పార్టీ తమ సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు దసరా పండుగ సందర్భంగా రూ.3 లక్షల చొప్పున ఇస్తామని చెప్పింది. పండుగకు ముందుగానే రూ. 50 వేల చొప్పున ముట్టజెప్పింది. మిగిలిన డబ్బులు ఎన్నికలు ముగిసేలోపు రెండు దశల్లో ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే అడ్వాన్స్ (రూ. 50వేలు) పుచ్చుకున్న కొందరు ప్రజాప్రతినిధులు, నాయకులు.. తీరా ఆ తర్వాత ప్రత్యర్థి పార్టీలో చేరారు. అక్కడ కూడా రూ.3 లక్షల ఆఫర్, కొందరికి అంతకంటే ఎక్కువ ఆఫర్ రావడంతో కండువా మార్చేశారు. అయితే ఇప్పుడు మొదట అడ్వాన్స్ డబ్బులిచ్చిన పార్టీ వారు సీన్లోకి వచ్చేశారు. తమ వద్ద డబ్బులు తీసుకొని పార్టీ మారడంతో ఫైరయ్యారు. సదరు సర్పంచ్‌లు, నాయకుల ఇళ్లకు వెళ్లి తమ డబ్బులు వాపస్ ఇవ్వాలని హెచ్చరించారు. అయితే అవతలి పార్టీ నుంచి తమకు ఇంకా డబ్బులు అందలేదని, రాగానే తిరిగి ఇచ్చేస్తామని సదరు సర్పంచ్‌లు, నేతలు చెప్పుకొస్తున్నారు. మొత్తంగా స్థానిక ప్రజాప్రతినిధులకు రేటు కట్టి కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల అధికారులకు ఈ తతంగం తెలిసినా సరే.. ఫిర్యాదు అందితేనే చర్యలు తీసుకుంటామని అంటున్నారు. చదవండి: గజ్వేల్ జేజేల కోసం.. -
మాస్టార్ తిప్పండి
వనం దుర్గాప్రసాద్ : ఉపాధ్యాయ ఓటర్లను సానుకూలంగా మార్చుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. అన్ని పార్టీలూ ఆయా అనుబంధ సంఘాలతో సంప్రదింపులు చేస్తున్నాయి. పరోక్ష సహకారం అందించాలని కోరుతున్నాయి. ఇటీవల ఓ పార్టీ నేత హైదరాబాద్‌లో ఓ ఉపాధ్యాయ సంఘం నేతలకు పెద్దఎత్తున విందు ఏర్పాటు చేయడం వివాదమైంది. ఈ విందు సందర్భంగా జిల్లాలవారీగా సంఘ నేతలను పరోక్ష ప్రచారంలోకి దించాలని నిర్ణయించినట్టు చర్చ జరుగుతోంది. ఇదే మాదిరి ఇప్పుడు ఇతర పార్టీలూ తమ అనుబంధ సంఘాల నేతలతో భేటీలు నిర్వహిస్తున్నాయి. ఉపాధ్యాయ ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఏయే హామీలివ్వాలనే దిశగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. ఇందులో 80 వేల మంది వరకూ ఎన్నికల విధుల్లో ఉంటారు. వీళ్లంతా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగిస్తారు. ఉపాధ్యాయ కుటుంబాల నుంచి దాదాపు 4 లక్షల ఓట్లు ఉంటాయి. దీంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పార్టీలున్నాయి. ఓడీల తాయిలం... ఉపాధ్యాయ సంఘాలు కొన్నేళ్లుగా ఆన్ డ్యూటీ కోసం పోరాడుతున్నాయి. గత ఏడాది ఏకంగా 14 సంఘాలకు ప్రభుత్వం ఓడీ ఇచ్చింది. కానీ గత ఏడాది డిసెంబర్‌తో పూర్తయ్యింది. అప్పట్నుంచీ దీన్ని పొడిగించకపోవడంతో పలు ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఎన్నికల సందర్భంగా నేతల వద్ద కూడా ఇదే అంశాన్ని ఉపాధ్యాయులు ప్రస్తావిస్తున్నారు. సంఘాల నేతలకు ఓడీ ఇస్తామన్న భరోసా ఉండాలని అన్ని సంఘాలు పార్టీలను కోరుతున్నాయి. ఓడీ ఇవ్వడం ద్వారా టీచర్ల సంఘ నేతలు విధులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎన్నికల ముందు కేవలం ఒకేఒక సంఘానికి ఓడీ లభించడం కూడా ఉపాధ్యాయ సంఘాల మధ్య భిన్న ధోరణికి కారణమైంది. ఓడీ ఇచ్చిన సంఘానికి వ్యతిరేకంగా ఓడీ రాని సంఘాలు ఏకమవ్వడాన్ని వివిధ పార్టీలు గుర్తిస్తున్నాయి. వీరిని సమన్వయం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బదిలీలు, పదోన్నతులూ కీలకమే.. దీర్ఘకాలంగా బదిలీలు, పదోన్నతులపై టీచర్లు ఆశలు పెట్టుకున్నారు. కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులో భాగంగా 317 జీఓ అమలు చేశారు. ఇది కూడా కొంతమంది ఉపాధ్యాయుల్లో అసంతృప్తి కలిగించింది. సాధారణ బదిలీల్లో కొన్ని మార్పులుంటాయని టీచర్లు ఆశించారు. కానీ 2022లో బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వం భావించినా, కోర్టు స్టే ఇవ్వడంతో ఆగిపోయింది. ఈలోగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేసింది. దీంతో బదిలీలు, పదోన్నతులపై పార్టీలు స్పష్టత ఇవ్వాలని మెజారిటీ టీచర్లు కోరుతున్నారు. దీన్ని గుర్తించిన పార్టీలు ఆ దిశగా అడుగులేసేందుకు సిద్ధపడుతున్నాయి. వీలైతే ఎన్నికల ప్రచారంలో ఎక్కడో చోట దీన్ని ప్రస్తావించి, టీచర్ ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని అన్ని పార్టీలూ భావిస్తున్నాయి. దీంతో పాటు ఖాళీల భర్తీ, కొత్త పోస్టుల నియామకంపై కూడా ఎన్నికల ప్రచారంలో ప్రస్తావన వచ్చే అవకాశముంది. విందు, వినోద రాజకీయాలు మాతో వద్దు టీచర్లకయినా వ్యక్తిగత అభిప్రాయాలుంటాయి. ఇదేమీ తప్పుకాదు. కానీ విధి నిర్వహణపై ప్రభావం చూపకూడదు. ఎన్నికలవేళ రాజకీయ పార్టీల విందులు, వినోదాలకు వెళ్లే చిల్లర రాజకీయాలు ఆమోదయోగ్యం కాదు. నాయకులే కాదు..ఓటర్లనూ ఇది ప్రలోభ పెట్టే చర్యగానే చూడాలి. ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడి పవిత్రతను అందరూ కాపాడాలి. – చావా రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వృత్తి గౌరవమే ముఖ్యం ఉపాధ్యాయుడు బాధ్యతాయుతమైన వ్యక్తి. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ సంఘ నేతలూ గుర్తించాలి. ఓట్ల ప్రలోభాలకు టీచర్లను లక్ష్యంగా చేయొద్దు. ఉపాధ్యాయూలూ దీనికి దూరంగా ఉండాలి. వృత్తి గౌరవాన్ని భంగపరిచే చర్యలకు పాల్పడొద్దు. విందులు, వినోదాలకు దూరంగా ఉండాల్సిన బాధ్యత సంఘ నేతలకు ఉంది. –సయ్యద్ షౌకత్ అలీ, తెలంగాణ రాష్ట్ర ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
416 ప్రకటనల్లో 15 మాత్రమే నిలిపివేశాం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ప్రచారం కోసం సమర్పించిన ప్రకటనల్లో మూడు ప్రధాన పార్టీలకు సంబంధించి 15 ప్రకటనలు మాత్రమే నిలిపివేస్తూ ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. ప్రచార ప్రకటనల నిలిపివేతపై వస్తున్న వార్తలపై స్పందించిన సీఈవో మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. ఎన్నికల సంఘం నియమించిన ప్రకటనల పరిశీలన, అనుమతి కమిటీ మొత్తం 416 ప్రకటనలకు అనుమతినిచ్చిందని తెలిపారు. అనుమతించిన వాటిలో కొన్నింటి రూపురేఖలు మార్చడం, వక్రీకరించి తప్పుగా అన్వయించడం వంటివి జరిగినట్లు పేర్కొన్నారు. అనుమతి నిబంధనలను ఉల్లంఘించి వాటిని ప్రసారం చేయడం అంటే ఆ స్ఫూర్తిని దెబ్బతీయడమేనని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రకటన తర్వాత అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం ఆయా రాజకీయ పార్టీలు ప్రచారం చేసుకోవడానికి రాష్ట్ర స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అనుమతి మంజూరు చేస్తుందని, వాటిని యథాతథంగా ఉపయోగించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే రాజకీయ పార్టీలు ముందుగా తగిన అనుమతి పొందని ప్రకటనలను యూట్యూబ్‌తో పాటు ఇతర వేదికలలో కూడా ప్రచారం చేస్తున్నట్లు ఎన్నికల సంఘం దృష్టికి వచ్చిందని తెలిపారు. దీనిపై ఎన్నికల సంఘం ఈనెల 8, 9, 10 తేదీల్లో వివిధ రాజకీయ పార్టీలతో మూడు సమావేశాలు నిర్వహించిందని, ఈ సమావేశాల్లో ప్రచార, ప్రచార అనుమతి (ధ్రువీకరణ/ సర్టిఫికేషన్) పొందడానికి మార్గదర్శకాలను క్షుణ్ణంగా వివరించామన్నారు. అదే విధంగా అనుమతుల్లేని ప్రకటనల ద్వారా తలెత్తే సమస్యలను కూడా తెలిపామన్నారు. ఎన్నికల సంఘం సూచనలను, మార్గదర్శకాలను అనుసరిస్తామని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల సంఘం అనుమతి పొందాల్సిందే రాజకీయ పార్టీలు విడుదల చేసే ప్రకటనలను ప్రసారం చేయడానికి ముందు ధ్రువీకరణ పొందిన ప్రకటనలేనా కాదా అనేది మీడియా సరిచూసుకోవాలని కోరింది. ఎన్నికల నియమావళి ప్రకారం అనుమతి పొందని అంశాల ప్రసారాలను నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తామని వికాస్‌రాజ్ తెలిపారు. రాజకీయ పార్టీలు విడుదల చేసే ప్రకటనలకు అనుమతి ధ్రువీకరణ ఇవ్వడం అనేది నిరంతర ప్రక్రియని వివరించారు. ఏ రాజకీయ పార్టీ అయినా, అభ్యర్థి అయినా రాష్ట్ర, జిల్లా స్థాయిలో అనుమతి ధ్రువీకరణ కోసం మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీకి ప్రకటనలను పంపుకోవచ్చునని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఉపసంహరించిన ప్రకటనలు ఇలా.... బీజేపీ డబుల్ బెడ్రూం, దొంగ చేతికి తాళం, రైతు, నేతి బీరకాయ, పేనుకు పెత్తనం బీఆర్ఎస్ దేఖ్ లేంగే (తెలుగు పాట), మొదటి ఓటు ఎవరికి (వీడియో ప్రకటన), రైతుల అండదండ– కేసీఆర్ (వీడియో ప్రకటన), కల్యాణలక్ష్మి కాంగ్రెస్ కారు (30 సెకన్లు), జాబ్ (15 సెకన్లు), రైతు (40 సెకన్లు), రైతు (30 సెకన్లు), రైతు (15 సెకన్లు), రైతు (15 సెకన్లు) -
ప్రచారాస్త్రం.. ‘నిజాం షుగర్స్’
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: చెరకు రైతుల అంశం ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని 12 నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేయనుంది. పసుపు బోర్డు అంశం తరహాలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీల పరిధిలోని చెరకు రైతుల విషయం ఉత్తర తెలంగాణలో రాజకీయ పార్టీలకు ప్రధాన ప్రచారాస్త్రమైంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు అంశం నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాన్ని శాసించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో చెరకు పంట విస్తీర్ణం పెంపు అంశం కీలకం కానుంది. బోధన్ (ఉమ్మడి నిజామాబాద్), మంబోజిపల్లి (ఉమ్మడి మెదక్), ముత్యంపేట (ఉమ్మడి కరీంనగర్) జిల్లాల్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీలను రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే తెరిపిస్తామని ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కూడా ప్రకటించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో ఇథనాల్ వాడకం పెరిగిన నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారీకి ఆయా పరిశ్రమల ఏర్పాటుపై పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే అంశాన్ని బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రచారా్రస్తాలుగా చేసుకుంటున్నాయి. 2002లో చంద్రబాబు విక్రయం.. నిజాం షుగర్స్ యూనిట్లను 2002లో డెల్టా పేపర్ మిల్స్ అనే ప్రైవేటు కంపెనీకి చంద్రబాబు ప్రభుత్వం విక్రయించింది. 2014 ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ నిజాం షుగర్స్‌ను ప్రభుత్వపరం చేస్తామన్నారు. అయితే 2015 డిసెంబర్ 23న ఫ్యాక్టరీ మూడు యూనిట్లు లేఆఫ్ ప్రకటించాయి. అయితే 2005–06లో చెరకు 35 వేల టన్నుల దిగుబడి ఉన్నప్పటికీ నడిపిన ఈ కర్మాగారాలను 2015లో లక్ష టన్నుల చెరకు దిగుబడి ఉన్నప్పటికీ మూసేయడం గమనార్హం. దీంతో రైతులు వరి వైపు మళ్లారు. నిజాం షుగర్స్ పరిధిలో చెరకు పండించే 12 నియోజకవర్గాల్లో గతంలో సుమారు 1.22 లక్షల ఎకరాల్లో చెరకు సాగు చేసేవారు. చెరకు రైతులే ప్రధానాంశంగా బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇది చర్చనీయాంశమైంది. -
ఇది గ్రీన్ పాలిటిక్స్ యుగం!
క్లైమెట్ పాటు పొలిటికల్ క్లైమెట్ కూడా గుణాత్మకంగా మారుతోంది. నిన్న మొన్నటి వరకు తోక పార్టీలుగా ఉన్న గ్రీన్ పార్టీలు ఇప్పుడు ప్రపంచ రాజకీయాలను మలుపు తిప్పే దశకు ఎదిగే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు నిపుణులు. పర్యావరణ చైతన్యంతో కూడిన ప్రజాస్వామిక రాజకీయాలతో పాటు శాంతి, అహింస, సామాజిక న్యాయంతో కూడిన సమాజం కోసం గ్రీన్ పార్టీలు కలలు కంటున్నాయి. ఈ క్లైమెట్ ఎమర్జెన్సీ కాలంలో పారిశ్రామిక దేశాల రాజకీయాల తోపాటు మన రాజకీయాలు కూడా పర్యావరణ కేంద్రంగా ఇకనైనా మారేనా? పర్యావరణ సమస్యలపై సాంఘిక ఉద్యమాలు నిర్మించే సంఘాలు, సంస్థలే కాలక్రమంలో గ్రీన్ రాజకీయ పార్టీలుగా మారుతున్నాయి. యూరప్, అమెరికా ఖండాల్లోని సంపన్న దేశాల్లో ఎక్కువగా గ్రీన్ పార్టీలు పుట్టుకు రావటమే కాదు ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి కూడా. 1960వ దశకంలో రాడికల్ సోషల్ యాక్టివిస్టులు, ముఖ్యంగా విద్యార్థుల నిరసనోద్యమాలు.. 1970–80 దశకాల్లో అణ్వాయుధ వ్యతిరేక ఉద్యమాల నుంచి తొలినాటి గ్రీన్ పార్టీలు ఆవిర్భవించాయి. ప్రధాన స్రవంతి రాజకీయాల్లో ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో గ్రీన్ పార్టీలకు ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది. కీలకమైన పార్లమెంటరీ స్థానాల్లో గెలుపొందటమే కాదు ముఖ్యమైన ప్రభుత్వ పదవులను సైతం చేపడుతుండటం విశేషం. క్లైమెట్ ఛేంజ్ వల్ల పర్యావరణ విపత్తులు గతమెన్నడూ ఎరుగని రీతిలో విరుచుకు పడుతున్న ప్రస్తుత తరుణంలో సంప్రదాయ రాజకీయ పార్టీల కూసాలు కదులుతుండగా గ్రీన్ పార్టీలకు ప్రజల్లో అంతకంతకూ ప్రాధాన్యం పెరుగుతోంది. 1972 నుంచి గ్రీన్ పార్టీల పుట్టుక తొలి రెండు గ్రీన్ పార్టీలు ఆస్ట్రేలియా (ద యునైటెడ్ తస్మానియా గ్రూప్), న్యూజిలాండ్ (ద వాల్యూస్ పార్టీ)లలో 1972లో ఏర్పాటయ్యాయి. 1973లో యునైటెడ్ కింగ్డమ్లో పీపుల్ (తర్వాత ద ఎకాలజీ పార్టీగా మారింది) పార్టీ పుట్టింది. 1979లో గ్రీన్ పార్టీ ఆఫ్ జర్మనీ రిజిస్టరైంది. 250 పర్యావరణ సంఘాలను ఏకం చేసి హెర్బర్ట్ గ్రూల్, పెట్రా కెల్లీ ఈ పార్టీని నెలకొల్పారు. 1983లో జాతీయ ఎన్నికల్లో ఈ పార్టీ ప్రతినిధి తొలుత గెలుపొందారు. 1998 నుంచి 2005 వరకు సోషల్ డెమోక్రటిక్ పార్టీతో కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. 2021 ఎన్నికల్లో అపూర్వమైన రీతిలో 15% ఓట్లు గెల్చుకుంది. గ్రీన్ పార్టీ అంటే..? ఫక్తు ఆధిపత్య రాజకీయాలకే పరిమితం కాకుండా పర్యావరణవాదం, సామాజిక నాయ్యం, అహింస తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించే రాజకీయ పార్టీలే గ్రీన్ పార్టీలు. సాధారణంగా ఇవి సోషల్ డెమోక్రటిక్ ఆర్థిక విధానాలను అనుసరిస్తూ వామపక్ష పార్టీలతో జత కడుతూ ఉంటాయి. ‘గ్లోబల్ గ్రీన్స్’ సమాచారం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 87 గ్రీన్ పొలిటికల్ పార్టీలున్నాయి. ఈ పార్టీలన్నీ కలిసి 2001లో గ్లోబల్ గ్రీన్స్ పేరిట సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నాయి. బ్రస్సెల్స్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థలో 87 గ్రీన్ రాజకీయ పార్టీలతో పాటు, 9 పర్యావరణ సంస్థలు కూడా సభ్యులుగా ఉన్నాయి. 12 మంది సభ్యులు గల స్టీరింగ్ కమిటీకి బాబ్ హలె, గ్లోరియా పొలాంకో 2020 నుంచి కన్వీనర్లుగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా సురేశ్ నాటియాల్ 2019లో నెలకొల్పిన ‘ఇండియా గ్రీన్స్ పార్టీ’కి కూడా ఈ సమాఖ్యలో సభ్యత్వం ఉంది. గ్లోబల్ గ్రీన్స్‌లోని పార్లమెంటేరియన్ నెట్‌వర్క్‌లో ప్రపంచవ్యప్తంగా విస్తరించిన 400కి పైగా గ్రీన్ పార్లమెంటు సభ్యులు టచ్‌లో ఉన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో 1992లో బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరంలో జరిగిన గ్రీన్ పార్టీల తొలి అంతర్జాతీయ సమావేశం గ్లోబల్ గ్రీన్స్ ప్రకటనను వెలువరించాయి. ‘గ్రీన్ పొలిటికల్ పార్టీలకు ప్రజలు ఓట్లు వేసినప్పుడే పర్యావరణ సమస్యలపై ప్రభుత్వాలు సీరియస్‌గా స్పందిస్తున్నాయని అనుభవాలు చెబుతున్నాయ’ని ఈ ప్రకటన పేర్కొంది. ఈ నేపథ్యంలో 2001లో తొలి ‘గ్లోబల్ గ్రీన్ పార్టీల కాంగ్రెస్’ కాన్బెర్రాలో జరిగింది. ఆ కాంగ్రెస్‌లోనే ‘గ్లోబల్ గ్రీన్స్ ఛార్టర్’ పేరిట పూర్తిస్థాయి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించాయి. ఆ తర్వాత 2012లో డకర్లో, 2017లో లివర్‌పూల్‌లో గ్రీన్ పార్టీల కాంగ్రెస్‌లు జరిగాయి. ఈ ఏడాది ఆగస్టులో దక్షిణ కొరియాలో జరిగిన కాంగ్రెస్‌లో గ్లోబల్ గ్రీన్స్ చార్టర్ అప్డేట్ చేశారు. 6 మూల సూత్రాలు పర్యావరణ జ్ఞానం, సాంఘిక న్యాయం, భాగస్వామ్య ప్రజాస్వామ్యం (పార్టిసిపేటరీ డెమోక్రసీ), అహింస, సుస్థిరత, వైవిధ్యానికి గౌరవం.. ఇవీ గ్లోబల్ గ్రీన్ పార్టీల మేనిఫెస్టోలో పేర్కొన్న ఆరు మూల సూత్రాలు. ‘భూమి జీవ శక్తి, వైవిధ్యం, సౌందర్యం మీద ఆధారపడి మనం జీవిస్తున్నాం. వీటిని అంతరింపజేయకుండా, వీలైతే మెరుగుపరిచి, మన తరువాతి తరానికి అందించడం మన బాధ్యత’ అని దీని పీఠికలో తొలి వాక్యం చాటి చెబుతోంది. ‘పౌరులందరికీ తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే హక్కు ఉన్న ప్రజాస్వామ్యం కోసం కృషి చేస్తాం. వారి జీవితాలను ప్రభావితం చేసే పర్యావరణ, ఆర్థిక, సామాజిక, రాజకీయ నిర్ణయాలలో ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు. స్థానిక, ప్రాంతీయ సమాజాలలో అధికారం, బాధ్యతలు కేంద్రీకృతమై ఉంటాయి. ఉన్నత స్థాయి పాలనకు అవసరమైన చోట మాత్రమే అధికారం, బాధ్యతలు పంపిణీ అవుతాయి..’ అని చార్టర్ భాగస్వామ్య ప్రజాస్వామ్యానికి భాష్యం చెప్తోంది. చారిత్రక బాధ్యత యూరప్, అమెరికా ఖండాల్లోని పారిశ్రామిక దేశాలు చాలా దశాబ్దాలుగా అతిగా కర్బన ఉద్గారాలను వెలువరిస్తూ భూగోళాన్ని అతిగా వేడెక్కిస్తూ పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. ఈ పనికి చారిత్రక బాధ్యతను సంపన్న దేశాలు ఇప్పటికైనా స్వీకరించాలి. భూతాపంతో వెల్లువెత్తుతున్న విపత్తులతో అన్ని దేశాలూ అతలాకుతలం అవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇది మరీ స్పష్టమైపోయింది. అయితే, చేయని తప్పునకు పెను నష్టానికి గురవుతున్న అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలను నష్ట నివారణ సాంకేతికతను, నగదు తోడ్పాటును అందించి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ, ప్రస్తుతానికి యూరప్, అమెరికా ఖండాలకే పరిమితమైన పర్యావరణ చైతన్యంతో కూడిన రాజకీయాలు ఈ ‘క్లైమెట్ ఎమర్జెన్సీ’ కాలంలో మనకు కూడా అవసరమే అనటంలో అతిశయోక్తి ఇసుమంతైనా లేదు. – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: ఈగలతో ప్రొటీన్ల సేద్యం! వ్యర్థాలకు చెక్..ఆదాయానికి ఆదాయం!) -
అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం
రాజకీయపార్టీల్లో సైద్ధాంతిక ఆచరణ విధానం లోపించడం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని అంటున్నారు జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి. చట్టాల్లోని నిర్దేశిత సూత్రాలు వాస్తవ రాజకీయ ముఖచిత్రంలో కనిపించడం లేదని, ఎన్నికల్లో డబ్బు ఎరచూపి, పౌరుల హక్కులపై పార్టీలు దాడి చేయడం దుర్మార్గమన్నారు. పార్టీలిచ్చే పోటీ వాగ్దానాలు వేలం పాటలను తలపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. సంక్షేమం పేదవాడి అభ్యున్నతికి వెన్నుపూసలాంటిదని చెప్పారు. మితిమిరిన హామీలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనే కుదేలు చేస్తాయన్నారు. హామీల చక్రబంధంలో ఇరుక్కున్న ప్రజలు మేల్కోవాలని పిలుపునిచ్చారు. న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం పనిచేసిన నేపథ్యం ఆయనది. ఏపీఈఆర్సీ చైర్మన్‌గా విద్యుత్‌రంగాన్ని గాడిలో పెట్టిన అనుభవం ఆయన సొంతం. ఎన్నికల వేళ ‘సాక్షి’తో ఆయన అనేక అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఏమన్నారో ఆయన మాటల్లోనే... ఆ సిద్ధాంతాలేవి? అన్ని పార్టీల సిద్ధాంతాలు ఘనంగా ఉంటాయి. కానీ, అవన్నీ నేతల ఆచరణలో కనిపించకపోవడం విడ్డూరం. ఎన్నికల వ్యయాన్నే తీసుకోండి. దీనికి పరిమితి ఉంది కదా? ఏ పార్టీ నాయకుడైనా నిర్దేశించిన పరిమితిలోనే ఖర్చు చేస్తున్నారా? లేనే లేదు. విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. అలా చెయ్యకపోతే గెలవలేరు. అసలీ విషయంపై ఎవరూ మాట్లాడరేం? చట్ట విరుద్ధమని తెలిసినా మౌనంగా ఉంటారేం? తమ ఆకాంక్షలకు తగ్గవారిని ఎన్నుకోవడం ప్రజల హక్కు. ఈ హక్కును డబ్బుతో ముడిపెడుతున్నారు. ఇది రానురాను దిగజారుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో నాయకుడు చెప్పినంత ఇవ్వలేదని ఓ గ్రామంలో ప్రజలు ధర్నా చేశారు. ఇది దౌర్భాగ్య పరిస్థితి కాదంటారా? ప్రజల నైతికతను డబ్బు అనైతికంగా కొనేస్తోందనడానికి ఇదే సాక్ష్యం. ఈ విషయంలో ప్రజలు జాగృతం కావాలి. డబ్బులకు ప్రలోభ పడొద్దు. ఓటును బలమైన ఆయుధంగానే భావించాలి. వేలం వెర్రి హామీలు అన్ని పార్టీలూ పోటీపడి హామీలిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే వేలం వెర్రిగా గుప్పిస్తున్నాయి. ఇది ఓ రకంగా ప్రజలను మోసం చేయడమే. అలవి కాని హామీలు ఎలా నెరవేరుస్తారు? గెలవడమే పార్టీలకు గీటురాయిగా మారింది. పార్టీల మేనిఫెస్టోకు ఎలాంటి చట్టబద్ధత ఉండదు. అందుకే ఇచ్చే హామీలు ఒకలా ఉంటాయి. అమలు వేరోలా ఉంటాయి. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలకు సవాలక్ష షరతులు పెడతారు. లబ్దిపొందే వారి సంఖ్యను భారీగా కుదిస్తారు. దీన్ని మోసం కాదంటారా? 20 ఏళ్లక్రితం ఇలాంటి పరిస్థితి చాలా తక్కువ. ఇప్పుడే విపరీతమైన పరిస్థితి. హామీలివ్వడం నేతలకు అలవాటైంది. వాటికోసం ఎదురుచూడటం ఓటర్లకు రివాజు అయ్యింది. అంతిమంగా ప్రజలు హామీల చక్రబంధంలో ఇరుక్కుంటున్నారు. మితిమీరిన హామీలిస్తే ఆర్థిక పరిస్థితి ఎంత దెబ్బతింటుందనేది ఆలోచించడం లేదు. మోసపూరిత హామీలను నమ్మొద్దు. పవర్ పాలిటిక్స్ మంచిది కాదు.. విద్యుత్ అంశం రాజకీయ ఆయుధమైంది. ఈ విషయంలో అన్ని పార్టీలూ పోటీ పడుతున్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించేకు ప్రయత్నిస్తున్నాయి. జనం వాస్తవాలు తెలుసుకునే అవకాశమే ఇవ్వడం లేదు. ఈ నేరం ముమ్మాటికీ రాజకీయ పార్టీలదే. 1969లో పరిశ్రమలకు యూనిట్‌కు 10 పైసల విద్యుత్ ఉండేది. కానీ వ్యవసాయానికి 11 పైసలుండేది. ఉచిత విద్యుత్ తెచ్చింది దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఇప్పుడు అన్ని పార్టీలూ వ్యవసాయ విద్యుత్‌ను రాజకీయ అస్త్రం చేసుకుంటున్నాయి. ఇవ్వొచ్చు. తప్పులేదు. విద్యుత్ చట్టం ప్రకారం వాడే విద్యుత్‌ను లెక్కగట్టాలి. ఈ పని జరగకుండా నేతలు రాజకీయం చేస్తున్నారు. రైతులకు ఇచ్చే ఉచిత విద్యత్‌ను డిస్కమ్‌లకు ప్రభుత్వాలు ముందే చెల్లించాలి. అప్పుడే డిస్కమ్‌లు ఆర్థికంగా బాగుంటాయి. దీన్ని పక్కనబెడుతున్నారు. మీటర్లు.. మోటర్ల రాజకీయంతో ప్రజలను కరెంట్ వాస్తవాలు తెలియకుండా పక్కదారి పట్టిస్తున్నారు. మీటర్లు పెడితే తమ ఉచిత హక్కు హరించేస్తారనే భయం కల్పిస్తున్నారు. ఈ పాలిటిక్స్ మంచిది కానేకాదు. యువతకు ఉపాధి కల్పన పార్టీల ఎజెండా కావాలి ప్రభుత్వ ఉద్యోగాలు ఇక కలే. దీన్ని యువత గుర్తించేలా అన్ని పార్టీలు అవగాహన కల్పించాలి. ఉపాధి కల్పన పార్టీల ఎజెండా కావాలి. హైదరాబాద్ మౌలిక వసతుల కల్పనలోనూ మెరుగ్గా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉపాధి అవకాశాలు పెంచాలి. పరిశ్రమలు విస్తరించేలా చూడాలి. అన్నింటికన్నా ముందు విద్యావ్యవస్థలో మార్పు తేవాలి. పోటీ ప్రపంచంలో నెగ్గుకొచ్చే నైపుణ్యం అవసరం. ఇది విద్యార్థి దశ నుంచే జరగాలి. చదువుకునేటప్పుడే ఏదో ఒక నైపుణ్యం కల్పించాలి. అమెరికాలోనైతే విద్యార్థి ఆసక్తిని గుర్తిస్తారు. అందులో మొదట్నుంచీ శిక్షణ ఇస్తారు. పార్టీలకతీతంగా యువతలో ‘సైంటిఫిక్ టెంపర్మెంట్’ తీసుకురావాలి. ఇందులో విజయవంతమయ్యే ప్రభుత్వాలే యువతను తమ వెంట ఉంచుకోగలవు. ఓటు ప్రతి ఒక్కరి ఆయుధం. సమాజానికి పనికొచ్చే వారిని గుర్తించి మరీ ఓటు వేయాలి. అప్పుడే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. -వనం దుర్గాప్రసాద్ -
జంప్ జిలానీలు..! ఉన్న నేతలు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతారో?
సాక్షి, కరీంనగర్/జగిత్యాల: అసెంబ్లీ ఎన్నికల వేళ పారీల్టలో ఉన్న నేతలు ఎప్పుడో ఏ పార్టీలో చేరుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఉదయం ఓ పార్టీ.. సాయంత్రం మరో పార్టీలో చేరిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని గంటల వ్యవధిలోనే కొందరు నాయకులు కండువాలు మార్చుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమవైపు తిప్పుకొని కండువాలు కప్పే కార్యక్రమాన్ని పనిగా పెట్టుకుంటున్నాయి. నెలలో అధికార పార్టీ నాయకులు ఎంతోమందిని బీఆర్ఎస్లోకి చేర్చుకున్నారు. జిల్లాలోని కోరుట్ల, ధర్మపురి, జగిత్యాలలో ఎక్కువగా పార్టీలు మారుతున్నారు. ప్రస్తుతం శాసన సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్తున్న ప్రధాన పార్టీల్లోకి పలువురు నేతలు మారడం చర్చనీయాంశమైంది. నేతల కదలికలపై ఆరా.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమపార్టీ నేతలు ఎవరిని కలుస్తున్నారు, ఎటు వెళ్తున్నారన్న దానిపై ఆయాపార్టీల నాయకులు తెలుసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, మండల, నియోజకవర్గ నేతలకు అందుబాటులో ఉండకపోవడం వంటి వాటిపై ఆరా తీస్తున్నారు. పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా? దేనిౖపైనెనా అసంతృప్తితో ఉన్నారా? అన్నదానిపై అనచరుల ద్వారా తెలసుకుంటన్నారు. కార్యకర్తల నుంచి కీలక నేతల వరకు.. జిల్లాలోని కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ఇటీవల జోరుగా కండువాలు మార్చుతుండటంతో జిల్లాలో జంపింగ్ పాలిటిక్స్ జోరందుకున్నాయి. సాధారణ కార్యకర్తలు మొదలుకొని కీలక నేతల దాకా పార్టీలు మారుతున్నారు. పార్టీలో ఉన్నవారిని కాపాడుకోవ డం కోసం ఇతర పార్టీలకు గాలం వేయడం, పార్టీ వీడినవారిని మళ్లీ సొంతగూటికి ఆహ్వానించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. పార్టీలో చేరినవారితో పాటు పాతవారికి కండువాలు కప్పిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేస్తూ నియోజకవర్గ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. బీజేపీలో.. మొదటి రెండు జాబితాల్లో అభ్యర్థుల పేర్లను అధిష్టానం ప్రకటించడంతో బీజేపీ ప్రచారం కాస్త వెనుకబడింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ముందే ప్రకటించడంతో రెండు పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. బీజేపీ అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించడంతో కార్యకర్తలు కాంగ్రెస్, బీఆర్ఎస్లో చేరారు. దీంతో కమలం పార్టీలో స్తబ్ధత నెలకొంది. ఆశ చూపుతూ.. మద్దతు కూడగట్టుకుంటూ.. గత సార్వత్రిక, స్థానిక ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన వారితో పాటు ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా ఉన్నవారితో మళ్లీ లబ్ధిపొందవచ్చనే ఉద్దేశంతో పార్టీలు మారేలా రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జంపింగ్‌లు ఎక్కువకావడంతో ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారింది. కొన్నేళ్లుగా పార్టీకి దూరంగా ఉన్నా పట్టించుకోని పార్టీల నాయకులు ఇప్పుడు వారి ఇళ్లకు వెళ్లి కలుస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పదవులు ఇప్పిస్తామని ఆశచూపుతూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఇవి చదవండి: ఇద్దరు పోలీసు అధికారులు.. హవాలా వ్యాపారితో కుమ్మక్కై.. ఏకంగా.. -
విరాళాల వివరాలివ్వండి
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు విరాళాలు అందుకునేందుకు తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం చట్టబద్ధతను సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై వాదనలు గురువారం ముగిశాయి. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ‘ ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు అందుకున్న విరాళాల సమగ్ర డేటాను సీల్డ్ కవర్లో మాకు రెండు వారాల్లోగా అందజేయండి’ అని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)ను ధర్మాసనం ఆదేశించింది. ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు. బాండ్ల చట్టబద్ధతను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్, సీపీఐ(ఎం) నేత, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)లు విడివిడిగా పిటిషన్ల వేయడం తెల్సిందే. బాండ్లను విక్రయించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను విరాళాల దాతల వివరాలు అడగబోము. కానీ ఎన్ని బాండ్లు విక్రయించారు, ఎంత మొత్తం పార్టీల ఖాతాల్లో జమ అయిందనే వివరాలు ఇవ్వండి’ అని ఈసీకి కోర్టు సూచించింది. ‘పరస్పర సహకార’ ధోరణికి ఈ బాండ్ పనిముట్టుగా మారొద్దు: అధికార పార్టీ నుంచి ప్రయోజనం పొందే వారు.. అధికార పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో భారీగా విరాళాల ద్వారా లబ్ది చేకూర్చడం, ఆతర్వాత అధికార పార్టీ నుంచి వారు అదే స్థాయిలో లబ్ధిపొందటం వంటి ధోరణి ఉండొద్దు. లబ్దిదారులు, అధికారి పార్టీ మధ్య నీకిది నాకది(క్విడ్ ప్రో కో) తరహా విధానానికి ఎలక్టోరల్ బాండ్ అనేది పనిముట్టుగా మారకూడదు’ అని వాదోపవాదనల సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘ దాత వివరాలు గ్రహీత పార్టీకి తెలుసు. తాను ఎవరికి విరాళమిచ్చేది ఇంకో పార్టీకి తెలియకూడదని దాత కోరుకుంటున్నాడు. విరాళాల బదిలీ వ్యవహారం దాతకు, ఆ రాజకీయ పార్టీకి ముందే తెలిసినప్పుడు ఈ వివరాలు సాధారణ పౌరుడికి మాత్రం తెలియాల్సిన పని లేదని కేంద్రం వాదించడంలో ఆంతర్యమేంటి?’ అని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం ప్రశ్నించింది. -
అభ్యర్థులు వారే.. గుర్తులు వేరే!
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు..శాశ్వత శత్రువులు ఉండరంటారు. ఇది అక్షర సత్యం. నిండు శాసనసభలో అధ్యక్షా అనాలనే వారి చిరకాలవాంఛ తీర్చుకునేందుకు ఎన్ని ఎత్తుగడలైనా వేస్తారు..ఎన్నిసార్లయినా గోడ దూకుతారు. తాజాగా తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జరుగుతోందిదే. గత ఎన్నికల్లో గెలిచిన మళ్లీ టికెట్ దక్కిందన్న ధీమాగా ఉన్న నేతలు ఒకవైపు ఉండగా, మరోవైపు ఓడినా పార్టీ కోసం పనిచేస్తున్నాం కాబట్టి మళ్లీ అదృష్టం వరిస్తుందనే ఆశలో కొందరు నేతలున్నారు. ఇక టికెట్లు దక్కవని మరికొందరు నేతలు పక్క పార్టీల వైపు చూపులు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొన్ని నియోజకవర్గాల్లో గత ఎన్నికల సమయంలో బండ బూతులు తిట్టిన పార్టీ నుంచే ఈసారి టికెట్ దక్కించుకున్న నేతలున్నారు. ఆయా సెగ్మెంట్లలో ప్రత్యర్థులు వాళ్లే, కానీ పార్టీలే మారాయి! కాకపోతే గతంలో పోటీ చేసిన గుర్తుతో కాకుండా మరో గుర్తుతో పోటీ చేయాల్సి వస్తుండటంతో.. ప్రచారంలో తమ పార్టీ గుర్తుకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తున్నారు. కాంగ్రెస్ టు కాంగ్రెస్ వయా బీజేపీ.. 2018లో మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌తో పోటీ చేసి నెగ్గిన రాజగోపాల్‌రెడ్డి.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తాజాగా బీజేపీకి పార్టీని వీడి మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు మునుగోడు హస్తం అభ్యర్థి ఈయనే. మాజీ ఎంపీ అయిన రమేష్ రాథోడ్ ఖానాపూర్ నుంచి, సోయం బాపురావు బోథ్ నుంచి గత ఎన్నికల్లో చేయి ఎత్తగా.. ఇప్పుడు కమలం తరఫున తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 2014, 2018ల్లో వరుసగా రెండుసార్లు టీడీపీ టికెట్‌తో సత్తుపల్లి నుంచి గెలుపొందిన సండ్ర వెంకటవీరయ్య.. ఆ తర్వాత కారెక్కి అదే పార్టీ నుంచి బరిలో దిగారు. నాడు స్వతంత్రంగా, ప్రధాన పార్టీ నుంచి.. గతంలో వికారాబాద్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన చంద్రశేఖర్ తాజాగా హస్తం గుర్తుతో జహీరాబాద్ నుంచి, గతంలో బాల్కొండలో బీఎస్పీ టికెట్‌తో పోటీ చేసిన ముత్యాల సునీల్ కుమార్.. తాజాగా కాంగ్రెస్ నుంచి రంగంలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో నిర్మల్ నుంచి చేయి గుర్తుతో పోటీ చేసిన మహేశ్వర్ రెడ్డి ఇప్పుడు బీజేపీ టికెట్‌తో, 2018లో ఆర్మూర్ నుంచి, బీజేపీ టికెట్‌తో పోటీ చేసిన పొద్దుటూరి వినయ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి, 2014, 2018ల్లో వరుసగా రెండుసార్లు నర్సాపూర్‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సునీతా లక్ష్మారెడ్డి.. తాజాగా బీఆర్ఎస్ నుంచి పోటీలో దిగుతున్నారు. గ్రేటర్లో.. ♦ 2018లో కాంగ్రెస్ టికెట్‌తో మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సబిత.. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి. ♦ ఎల్బీనగర్, తాండూరు నుంచి 2018లో కాంగ్రెస్ అభ్యర్థులుగా గెలిచిన సు«దీర్‌రెడ్డి, పైలెట్ రోహిత్‌రెడ్డి ఇప్పుడు కారులో ఉన్నారు. ♦ 2009 ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నుంచి స్వతంత్రంగా, 2014, 2018ల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కూన శ్రీశైలంగౌడ్.. తాజాగా బీజేపీ నుంచి దిగుతున్నారు. ♦ 2018లో మల్కాజ్గిరి అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన మైనంపల్లి.. ఈ సారి హస్తం గుర్తుతో రంగంలోకి దిగారు. ♦ 2018లో టీడీపీ టికెట్‌తో ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసిన సామరంగారెడ్డి.. ఇప్పుడు బీజేపీ టికెట్‌తో ఎల్బీ నగర్ నుంచి పోటీకి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మర్రి శశిధర్ రెడ్డి.. ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ దాదాపు ఖరారైంది. ♦ 2014లో కాంగ్రెస్ టికెట్‌తో మహేశ్వరం నుంచి, 2018లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) టికెట్‌తో ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మల్రెడ్డి .. తాజాగా మళ్లీ కాంగ్రెస్ టికెట్‌తో ఇబ్రహీంపట్నం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరేగాకుండా గత ఎన్నికల్లో వేర్వేరు పార్టీల చిహ్నలపై గెలిచి/ఓడి... ఇప్పుడు మరో పార్టీ తరఫున బరిలో నిలిచిన వారు అనేకమంది ఉన్నారు. మునుపెన్నడూలేని రీతిలో రాష్ట్ర రాజకీయాల్లో వేర్వేరు కండువాలు మార్చుకున్నవారి సంఖ్య ఈసారే ఎక్కువగా ఉండడం గమనార్హం. -
ఎన్నికలవే.. ఎరలవే!
‘ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా..’ అనే సినిమా డైలాగ్ తరహాలో ఎలాంటి హామీలిచ్చామన్నది కాదు.. తమకు అనుకూలంగా బ్యాలెట్ బాక్సులు నిండాయా..లేదా? అధికారం చేపడతామా..లేదా?.. ఎన్నికలు ఎక్కడ, ఎప్పుడు జరిగినా రాజకీయ పార్టీల టార్గెట్ ఇదే. నగదుతో పాటు చీరలు, సెల్ఫోన్లు, కుక్కర్ల లాంటి వస్తువుల పంపిణీతో ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నించడం.. ముఖ్యంగా అధికారంలోకి వస్తే అది చేస్తాం..ఇది చేస్తాం..అంటూ హామీలు గుప్పించడం. ప్రపంచవ్యాప్తంగా పార్టీలది ఇదే బాట. తెలంగాణ అయినా, భారత్‌లో అయినా, పర్యాటక ప్రేమికుల స్వర్గధామం థాయిలాండ్ అయినా, భూకంపాల పుట్టినిల్లు టర్కీ అయినా.. ఎక్కడైనా ఓటర్ల కోసం తాయిలాలే. మన దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల సందర్భంగా పార్టీలు ఇస్తున్న హామీల తరహాలోనే.. గతంలో ప్రపంచంలోని పలు దేశాల ఎన్నికల్లోనూ పార్టీలు అనేక రకాల హామీలను గుప్పించి ఓట్లు సంపాదించే ప్రయత్నం చేయడం గమనార్హం. అయితే కొన్ని దేశాల్లో ప్రజాకర్షక హామీలతో పాటు పలు ఆర్థిక, సామాజిక, రక్షణ రంగాలకు సంబంధించిన అంశాలు కూడా అక్కడి ఓటర్లను ప్రభావితం చేయడం ఆసక్తి కలిగించే అంశం. కాగా, ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎన్నికలు జరిగిన టర్కీ, అర్జెంటీనా, పోలండ్, థాయ్‌లాండ్ దేశాల్లో స్థానిక ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లకు ఎలాంటి తాయిలాలు ప్రకటించాయో ఓసారి చూద్దాం. పోలండ్‌లో హక్కుల అంశాలు! 1989లో కమ్యూనిస్టు పాలన ముగిసిన తర్వాత పోలండ్‌లో మొదటిసారి ఈ ఏడాది అక్టోబర్‌లో పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ అధికార లా అండ్ జస్టిస్ పార్టీ (పీఐఎస్) మిత్రపక్షాలు, సెంటర్ రైట్ సివిక్ ప్లాట్‌ఫామ్ (పీవో)లు హోరాహోరీ తలపడ్డాయి. ఇక్కడి ఎన్నికలు రక్షణ రంగం, వలసలు, యూరోపియన్ యూనియన్ పాత్ర, మహిళలు, స్వలింగ సంపర్కుల హక్కులు, ద్రవ్యోల్బణం లాంటి అంశాలపై జరిగాయి. చిన్నారులు, వృద్ధులకు ఉచితంగా ఔషధాలను ఇస్తామని, 1989 కంటే ముందు కట్టిన అపార్ట్మెంట్లను ఆధునీకరిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాలను పెంచుతామని, కనీస వేతనాన్ని 6,450 జ్లోటీలకు పెంచుతామనే హామీలనిచ్చాయి. ఆర్థిక వ్యవస్థ పటిష్టతపై అర్జెంటీనా అర్జెంటీనాలో అధ్యక్షుడితో పాటు 22 ప్రావిన్సుల గవర్నర్లు, 130 డిప్యూటీ గవర్నర్లు, 24 సెనేటర్ స్థానాలకు ఈ ఏడాది అక్టోబర్ 22న ఎన్నికలు జరిగాయి. ఈ దేశంలో బహుళ పార్టీ వ్యవస్థ ఉన్నా.. ది యూనియన్ పోర్లా పాట్రియా (యూపీ), జుంటోస్ పార్ కాంబియో (జేఎక్స్సీ), లా లిబరా్టడ్ అవాంజా (ఎల్‌ఎల్‌ఏ) కూటముల మధ్య పోటీ జరిగింది. దేశంలో జరుగుతున్న నేరాలు, డ్రగ్ ట్రాఫికింగ్లను అరికట్టేందుకు భద్రత పెంపు, పన్నుల తగ్గింపు, రాష్ట్రాల పరిధుల తగ్గింపు (మన రాష్ట్రంలో జరిగిన జిల్లాల పునర్విభజన తరహాలో), నిరుద్యోగ బీమా, ప్రభుత్వ కంపెనీల ప్రైవేటీకరణ, సామాజిక అంశాలపై ఖర్చు తగ్గింపు, వాణిజ్య రంగంలో నిబంధనల సరళీకరణ, చైనాతో సంబంధాల కటీఫ్, అమెరికన్ డాలర్‌తో పోటీ పడేలా ఆర్థిక వ్యవస్థ రూపకల్పన లాంటి అంశాలు ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు ప్రచారా్రస్తాలుగా ఉపయోగపడ్డాయి. టర్కీలో ‘టెర్రర్’ తీవ్రవాదంతో కునారిల్లుతోన్న టర్కీలో జరిగిన ఎన్నికల్లో కూడా రాజకీయ పార్టీలు ప్రధానంగా ఈ అంశంపైనే దృష్టి సారించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశాయి. దేశ ఆర్థిక వ్యవస్థ, ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో సంభవించిన భూకంపాల కేంద్రంగానే ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఇక్కడి ప్రధాన పార్టీలు సిరియా శరణార్ధులను కూడా ఎన్నికల బూచిగా వాడుకున్నారు. రష్యా మధ్యవర్తిత్వంతో సిరియాతో చర్చలు జరుపుతామని ప్రస్తుత అధ్యక్షుడు ఎర్డోగాన్ అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. భూకంపాల నుంచి ఉపశమనం పొందేందుకు గాను ఈశాన్య టర్కిలోని ప్రజలకు 20 ఏళ్ల కాలపరిమితితో ఇంటి రుణాలు ఇప్పిస్తామని, రెండేళ్ల తర్వాత ఈ రుణాలు చెల్లించేలా చేస్తామని చెప్పాయి. మొత్తం ఆరున్నర లక్షల ఇళ్లను ప్రభుత్వమే కట్టి ఇస్తుందని, ఇందులో 3.19 లక్షలను ఏడాదిలోగా పూర్తి చేస్తామని పార్టీలు హామీలిచ్చాయి. థాయ్‌లాండ్‌లో ఆర్థిక లబ్ధిపై దృష్టి! ప్రపంచ పర్యాటక కేంద్రమైన థాయ్‌లాండ్‌లో ఈ ఏడాది మేలో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఇక్కడి ప్రధాన రాజకీయ పార్టీలయిన ప్యూ థాయ్ పార్టీ, మూవ్ ఫార్వార్డ్ పార్టీ, యునైటెడ్ థాయ్ నేషన్ పార్టీ, పలాంగ్ ప్రచారత్ పార్టీ, భుంజయ్థాయ్ పార్టీ, డెమొక్రాట్ పార్టీలు ఓట్ల వేటలో భాగంగా పలు హామీలు అక్కడి ప్రజలకు ఇచ్చాయి. ఎక్కువగా ఆర్థిక లబ్ధి చేకూర్చే కార్యక్రమాలపైనే దృష్టి పెట్టాయి. డిజిటల్ వ్యాలెట్ల ద్వారా 16 ఏళ్లు నిండిన వారికి రూ.10వేల బాత్‌లను ఇస్తామని, దినసరి కనీస వేతనాలను 337 బాత్‌ల నుంచి 600 బాత్‌లకు పెంచుతామని, రుణాలపై మూడేళ్ల మారటోరియం ప్రకటిస్తామని, ప్రతి ఉపాధ్యాయునికి, విద్యార్థి కి టాబ్లెట్ కంప్యూటర్ ఇస్తామని, వృద్ధాప్య భృతి నెలకు 3వేల బాత్‌లు చేస్తామని, విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని, 1జీబీ ఇంటర్నెట్ ఉచితంగా ఇస్తామని, వ్యవసాయ కుటుంబాలకు 30వేల బాత్‌లు సాయం చేస్తామని, వరి పండించే రైతాంగానికి రయ్ (అర ఎకరానికి కొంచెం ఎక్కువ)కి 2వేల బాత్ ఇస్తామని ప్రకటించాయి. -మేకల కళ్యాణ్ చక్రవర్తి -
ఎజెండాలో కపిరాజు ఎక్కడ?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటించాయి. కానీ పల్లె, పట్నం, పేద, ధనిక అన్న తేడా లేకుండా అ న్నిచోట్లా ఇబ్బందులకు కారణమవుతున్న కోతుల సమస్యను పూర్తిగా పక్కన పెట్టేశాయి. ఏపార్టీ కూడా ఈ సమస్యపై ఇప్పటివరకు మాట్లాడలేదు. జనావాసాలపై దాడులు.. అడవుల్లో ఉండాల్సిన కోతులు అక్కడ ఆహారం దొరక్క 20 ఏళ్లుగా ఊర్ల బాట పట్టాయి. మొదట్లో అడవుల గుండా వెళ్లే హైవేల పక్కన అడ్డా ఏర్పాటు చేసుకున్నాయి. వచ్చి పోయేవారు ఇచ్చే ఆహారం కోసం ఎదురుచూశాయి. ఇక అక్కడి నుంచి ఊర్లలోకి వచ్చిన తర్వాత పంట పొలాలు మొద లు ఇంట్లోని కిచెన్ వరకు ప్రతీ చోట కోతుల దాడి పెరిగింది. కోతులు అడవులకు వెళ్లాలి తెలంగాణ వచ్చిన కొత్తలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం చేపట్టింది. ‘వనాలు పెరగాలి – కోతులు అడవులకు పోవాలి’ అనేది హరితహారం నినాదం. పదేళ్లు గడిచే సరికి తెలంగాణలో స్థూలంగా అడవుల విస్తీర్ణం పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ హరితహారం నినాదానికి తగ్గట్టుగా కోతులు అడవులకు పోలే దు సరికదా మరింతగా దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రైతులకు పంట నష్టం జరుగుతోంది. కనిపించని ఫుడ్‌కోర్టులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మండలాల్లో కోతుల కోసం ప్రత్యేకంగా మంకీ ఫుడ్ కోర్టులంటూ పండ్ల మొక్కలను ఎంపిక చేసిన స్థలాల్లో నాటారు. కానీ సరైన ఆలనాపాలన లేకపోవడంతో ఇవి నామరూపాల్లేకుండా పోయాయి. అసెంబ్లీలో సైతం చర్చ తెలంగాణ తొలి శాసనసభలో సీఎం కేసీఆర్ స్వయంగా కోతుల కారణంగా గ్రామాల్లో తలెత్తుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. నల్లగొండ జిల్లా తుంగతుర్తి లాంటి ప్రాంతాల్లో కోతుల కారణంగా కూరగాయల సాగుకు రైతులు దూరమయ్యారని చెప్పారు. కోతులు బాధ భయంకరంగా మారిందన్నారు. అడవుల్లో ఫలాలు ఇచ్చే వృక్షాలను పెంచడం తప్ప మరో మార్గం లేదన్నారు. పరిహారం మాటేమిటి? కోతుల కారణంగా జరుగుతున్న పంట నష్టానికి పరిహారం చెల్లించాలంటూ 2017లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో నాటి కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు డిమాండ్ చేశారు. అప్పటి అటవీశాఖ మంత్రి జోగురామన్న కోతుల వల్ల ఇబ్బందులేమీ లేవని చెప్పే ప్రయత్నం చేయగా వరంగల్‌కు చెందిన ఎర్రబెల్లి దయాకర్‌రావు, అప్పటి స్పీకర్ మధుసూదనాచారి కోతుల సమస్య తీవ్రంగా ఉందంటూ చర్చలో తమ అభిప్రాయాలు తెలిపారు. ఆఖరికి కోతులను బెదరగొట్టేందుకు కొండెంగలు (కొండముచ్చులు) అద్దెకు తీసుకురావాలని అప్పటి శాసన సభ్యులు కోరారు. కోతుల నియంత్రణ కోసం రూ. 2.2 కోట్లతో నిర్మల్‌లో ప్రత్యేక సెంటర్ అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. అయితే ఆచరణ అంతంతగానే ఉంది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలే స్వచ్ఛందంగా చందాలు వేసుకుని కోతులను పట్టుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి నిపుణులను రప్పించుకున్నారు. -
'రాజకీయ పార్టీల విరాళాలపై.. ప్రజలకు ఆ హక్కు లేదు'
ఢిల్లీ: రాజకీయ పార్టీలకు నిధుల కోసం ఉద్దేశించిన ఎలక్టోరల్ బాండ్ల పథకంలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉండదని తెలిపింది. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం (అక్టోబర్ 31న) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానానికి కేంద్రం తన వాదనను సమర్పించింది. "ఎలక్టోరల్ బాండ్ల విధానంలో విరాళాలు సమర్ఫించే దాతల గోప్యతను కాపాడాల్సి ఉంటుంది. ఈ పథకం స్వచ్ఛమైన డబ్బును రాజకీయ పార్టీలకు అందిస్తుంది. ఈ విరాళాలు పన్ను బాధ్యతలకు కట్టుబడి ఉండేలా చేస్తుంది. అందువల్ల ఇది ఏ హక్కుకు కూడా భంగం కలిగించదు" అని అటార్ని జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఎన్నికల బాండ్ల సమాచారం పబ్లిక్ డొమైన్లలో ఉండబోదని అటార్ని జనరల్ తెలిపారు. అభ్యర్థుల వివరాలకు సంబంధించి ప్రతిదీ తెలుసుకునే హక్కు ప్రజలకు ఉండదని వెల్లడించారు. రాజకీయ నిధులలో పారదర్శకతను తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా రాజకీయ పార్టీలకు ఇచ్చే నగదు విరాళాలకు జనవరి 2, 2018న ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. ఈ ఎన్నికల బాండ్లు ఓ ప్రామిసరీ నోట్ లాంటిది. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు. వీటిని రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వవచ్చు. ఈ బాండ్లను పార్టీలు నగదుగా మార్చుకుని ప్రచారాల కోసం వాడుకోవచ్చు. ఇదీ చదవండి: ఈడీ ముందు హాజరైన రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కుమారుడు -
తనకు టికెట్ కన్ఫామ్ అయిందో లేదో చెబితే భవిష్యత్ కార్యాచరణ చేపడతాడట!
తనకు టికెట్ కన్ఫామ్ అయిందో లేదో చెబితే భవిష్యత్ కార్యాచరణ చేపడతాడట! -
ఆర్టీసీకి ‘ఎన్నికల గిరాకీ’
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వేళ ఆర్టీసీకి మంచి బేరం దొరుకుతోంది. ఆర్టీసీ బస్సుల బుకింగ్ రాజకీయ పార్టీలకు మంచి వెసులుబాటుగా ఉంటుండగా, సంస్థకు సైతం లాభసాటిగా మారుతోంది. గత నెల రోజుల వ్యవధిలోనే రాజకీయ పార్టీలు తమ సభలకు దాదాపు 12 వేల వరకు బస్సులను బుక్ చేసుకున్నాయి. భలే మంచి ఆదాయ మార్గం.. ఆర్టీసీ బస్సులకు పండుగ రోజులు, శుభ ముహూర్తాలున్న రోజుల్లోనే ఆక్యుపెన్సీ రేషియో మెరుగ్గా ఉంటుంది. మిగతా రోజుల్లో సగటున 62 శాతం నుంచి 65 శాతం వరకు ఉంటుంది. అయితే, రాజకీయ సభలకు బస్సులను అద్దెకిస్తే మంచి ఆదాయం వస్తుంది. వారికి అద్దెకిచ్చిన సమయంలో బస్సుల్లో ఎంతమంది ఎక్కారన్న సంఖ్యతో నిమిత్తం లేకుండా.. 100 శాతం ఆక్యుపెన్సీ రేషియోను లెక్కగడ తారు. అంటే.. ప్రతి సీటుకు టికెట్ జారీ చేసినట్టన్న మాట. ఈ లెక్కన ఒక్కో బస్సుకు రూ.20 వేల నుంచి 24 వేల వరకు ఆదాయం వస్తుంది. ప్రస్తుతం దసరా పండుగ రద్దీ అధికంగా ఉంది. మరమ్మతుల కోసం డిపోలకే పరిమితమైన బస్సులను కూడా సిద్ధం చేసి ప్రయాణికుల కోసం పంపుతుంటారు. ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో తప్ప, సాధారణ రోజుల్లో వీలైనన్ని బస్సులను అధికారులు పార్టీలకు కేటాయిస్తున్నారు. పార్టీలకు అద్దెకివ్వటం ద్వారా ఆదాయం ఎక్కువగానే వస్తున్నా.. ఆర్టీసీ మాత్రం తొలి ప్రాధాన్యం ప్రయాణికుల సేవకే ఇస్తుండటం విశేషం. గత నెల కొల్లాపూర్‌లో ముఖ్యమంత్రి పర్యటించిన సందర్భంలో భారీ బహిరంగసభ నిర్వహించారు. దానికి దాదాపు 2 వేల బస్సులను బుక్ చేశారు. ఆ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈనెల మొదటి వారంలో రెండు రోజుల తేడాతో రెండు పర్యాయాలు రాష్ట్రానికి వచ్చారు. ఆ సందర్భంలో మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో భారీ బహి రంగ సభలు నిర్వహించారు. వీటికి దాదాపు రెండు వేల బస్సులను బుక్ చేశారు. రాహుల్‌గాంధీ ఇటీ వల తెలంగాణ పర్యటనలో నిర్వహించిన సభలకు కూడా ఆర్టీసీ బస్సులను బుక్ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తు న్నారు. ఈ సందర్భంగా సిరిసిల్ల, జడ్చర్ల, భువనగిరి, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేశారు. వీటిల్లో కొన్నింటికి ప్రైవేటు వాహనాలను బుక్ చేస్తే, కొన్నింటికి ఆర్టీసీ బస్సు లను బుక్ చేశారు. ఇటీవల కేంద్రమంత్రులు రాజ్ నాథ్‌సింగ్, అమిత్‌షాలు బహిరంగ సభలు నిర్వ హించారు. గత నెల రోజుల్లో అన్ని పార్టీలు దాదాపు 12 వేలకుపైగా బస్సులను బుక్ చేసుకున్నట్టు సమాచారం. ఒక్కో బస్‌కు సగటున రూ.20 వేల చొప్పున చెల్లిస్తుండటంతో వీలైనన్ని బస్సులను అద్దెకివ్వటం ద్వారా ఆదాయాన్ని పొందే ప్రయ త్నంలో ఆర్టీసీ ఉంది. దసరా, దీపావళి, క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి లాంటి పండుగల వేళ ఎక్కువ మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా ఆ సంస్థ 100 రోజుల ఫెస్టివల్ చాలెంజ్ పేరుతో సిబ్బందికి ప్రత్యేక టార్గెట్లను కేటాయించింది. ఇందులో ఎన్నికల అంశాన్ని కూడా చేర్చటం విశేషం. రాజకీయ పార్టీలకు బస్సులను అద్దెకివ్వటం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందాలన్న ఆదేశాలు మౌఖికంగా వెలువడ్డాయి. పార్టీలకు కూడా సౌలభ్యమే.. పెద్ద నేతలు పాల్గొన్న బహిరంగ సభలకు పార్టీ నేతలు భారీగా జనాన్ని సమీకరిస్తున్నారు. ఇందుకు వారికి వందల సంఖ్యలో వాహనాలు అవసరమవుతాయి. ప్రైవేటు వాహనాలను సమీకరించుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. అదే ఆర్టీసీ బస్సులయితే కావాల్సినన్ని సిద్ధంగా ఉంటాయి. దీంతో ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకోవటం వారికి వెసులు బాటుగా మారింది. పైగా వ్యాన్లు లాంటి ప్రైవేటు వాహనాల ఖర్చుతో పోలిస్తే, ఆర్టీసీ బస్సుల ఛార్జీనే తక్కువగా ఉంటుంది. -
అప్పుడేం చేశారు..? ఇప్పుడేం చేస్తారు? గల్లీ ప్రశ్నిస్తోంది..!
సాక్షి హైదరాబాద్: నగరంలో ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. ప్రధాన పార్టీలు సమరభేరి మోగించి కదన రంగంలో ప్రచారస్త్రలను సంధిస్తున్నాయి. సభలు, సమావేశాలు, భారీ ప్రదర్శనలు సమరోత్సాహంతో ఉన్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏళ్లకు ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధికి, సంక్షేమానికి నోచుకోని ఓటర్లు కూడా తమ వద్ద ఉన్న ఏకైక పాశుపతాస్త్రాన్ని సంధించేందుకు సన్నద్ధమవుతున్నారు. మౌలిక సమస్యలపై నిలదీసేందుకు, ప్రశ్నించేందుకు బస్తీ సంక్షేమ సంఘాలు సరికొత్త ప్రశ్నావళితో ముందుకొస్తున్నాయి. బస్తీలు, మురికివాడల్లో నివసించే ప్రజలను కేవలం ఓటు బ్యాంకులుగా భావించే పార్టీల ధోరణి మారాలంటున్నాయి. స్థానిక నాయకులు మొదలుకొని బరిలోకి దిగిన అభ్యర్థుల వరకు బస్తీల్లోకొచ్చే వారిపై ఈ ప్రశ్నిస్త్రాలను సంధించనున్నారు. బస్తీలపై వివక్ష ఎందుకు? బస్తీలు అంటే వెంటనే గుర్తుకొచ్చేది కంకర తేలిన సిమెంట్ రోడ్లు, ఇరుకు గల్లీలు. ఒకదానికొకటి అతికించినట్లుగా ఉండే అగ్గిపెట్టెల్టాంటి ఇళ్లు. వాటిని ఆనుకొని నురగలు కక్కుతూ ప్రవహించే నాలాలు. ముక్కుపుటాలదిరే దుర్గంధం గుర్తుకొస్తుంది. దోమల స్వైరవిహారం కళ్ల మందు కనిపిస్తుంది. ఫుట్‌పాత్‌లు, పేవ్మెంట్లను ఆశ్రయించుకొని జీవనం సాగించే చిరువ్యాపారులు కనిపిస్తారు. దశాబ్దాలుగా అనేకసార్లు ఎన్నికలొచ్చాయి. కానీ బస్తీ ముఖచిత్రం మారలేదు. మరోసారి ఎన్నికలు వచ్చాయి. అన్ని గల్లీల్లో ఇప్పుడు పార్టీల జెండాలు ఎగురుతున్నాయి. మైకుల్లో ప్రచారం హోరెత్తుతోంది. నాయకులు హామీలు గుప్పిస్తున్నారు. ఈ హామీలు అప్పుడు, ఇప్పుడు, భవిష్యత్‌లోనూ ఉంటాయని బస్తీవాసులకు తెలుసు. అందుకే ‘గత ఎన్నికల్లో ఓటేస్తే ఏం చేశారు. ఇప్పుడు ఓటెందుకు వేయాలి’ అనే మౌలికమైన ప్రశ్నతో వివిధ పార్టీల నాయకులను నిలదీసేందుకు బస్తీ సంఘాలు, కాలనీ సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. గ్రేటర్లో సుమారు 1,500కు పైగా మురికి వాడలు, బస్తీలు ఉన్నాయి. లక్షలాది మంది నివసించే ఈ మురికివాడలే అన్ని రాకీయ పార్టీలకు ప్రధాన ఓటుబ్యాంకులు. బాధ్యతగా ఓటు వేసేది కూడా వాళ్లే. ఈ నేపథ్యంలో అనేక సంవత్సరాలుగా బస్తీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం, వారి నివాస హక్కుల కోసం పోరాడుతున్న హైదరాబాద్ బస్తీ ప్రజల సమాఖ్య వివిధ పార్టీల అభ్యర్థులపై ఈ అ్రస్తాలను సంధిస్తోంది. ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ఎమ్మెల్యే కావాలి? అని హైదరాబాద్ బస్తీ ప్రజల సమాఖ్య ప్రతినిధి బ్రదర్ వర్గీస్ అన్నారు. ఇప్పటి వరకు ఏం చేశారు? స్థానిక సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు బస్తీసంఘాలు విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. కరపత్రాలను పంపిణీ చేస్తున్నాయి. ఇప్పటి వరకు గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు బస్తీల్లో పర్యటించారు. ఏయే సమస్యలను పరిష్కరించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలేంటి అనే అంశాలపై చర్చిస్తున్నారు. బస్తీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యేలకు ఏ మేరకు అవగాహన ఉందనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని బస్తీ సంఘాలు భావిస్తున్నాయి. డబుల్బెడ్రూం ఇళ్ల మంజూరుపైనా ప్రశ్నించనున్నారు. ఈ ప్రశ్నలకు బదులేదీ? బస్తీల్లో ప్రచారానికి వచ్చే నాయకులను, పార్టీలను నిలదీసేందుకు బస్తీ సంఘాలు సిద్ధం చేస్తున్న ప్రశ్నావళి ఇలా ఉంది. బస్తీ ప్రజల ఉపాధి కోసం ఎలాంటి అవకాశాలు కల్పిస్తారు. ఎప్పటి వరకు ఇళ్లు కట్టించి ఇస్తారు. బ్యాంకుల నుంచి రుణసదుపాయం కల్పిస్తారా? వర్షాకాలంలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి మీ వద్ద ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి. బస్తీలు నీటమునగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? నగరంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో పేదప్రజలకు ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు మీరు సిద్ధమేనా? బస్తీల్లోని యువతను నిర్విర్యం చేసేందుకు మోహరించి ఉన్న మాదకద్రవ్యాల అమ్మకాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నాలాలను కబ్జా చేసిన వాళ్లను, బస్తీల్లో ప్రజలపై దౌర్జన్యం చేసే వారిని కట్టడి చేయగలరా? వరదల నివారణకు ఎలాంటి కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తారు? వివిధ రకాల అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం మంజూరు చేసే నిధులను పారదర్శకంగా ప్రజల ముందు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారా? గత ఎన్నికల్లో మీ పార్టీ ఇచ్చిన హామీలు గుర్తున్నాయా? ఇప్పుడు కొత్తగా ఎలాంటి హామీలు ఇస్తున్నారు? హామీలను నిలబెట్టుకోలేని పార్టీలకు ఓటెందుకు వేయాలి? -
కాంగ్రెస్, బీజేపీ నుంచి టికెట్ రాకపోయినా బరిలో..
సాక్షి, సిద్దిపేట: త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలవాలనుకుంటు న్న నేతలు టికెట్ రాకపోయినా పోటీ చేయాలనుకుంటున్నారు. దీంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేయడమా.. లేదంటే ఇతర రాజకీయ పార్టీ తరపున బరిలో నిలవడమా అని ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రతి నియోజకవర్గం నుంచి ఇద్దరు ముగ్గురు నేతలు పోటా పోటీగా టికెట్ల కోసం ప్రయత్నిస్తు న్నారు. ఇండిపెండెంట్‌కు బదులు ఆలిండియా ఫార్వడ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) నుంచి అయితే ఎన్నికల గుర్తు సింహం కాబట్టి ప్రజల్లోకి వేగంగా వెళ్తుందని భావిస్తున్నారు. ఆశావహులు ఎక్కువే.. జిల్లాలో ఇప్పటికే అధికార బీఆర్ఎస్ అన్ని నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచే వారి టికెట్లను ప్రకటించి అభ్యర్థులకు బీఫాంలు సైతం అందజేసింది. బీజేపీ ఇప్పటివరకు ఒక్క లిస్టు సైతం విడుదల చేయలేదు. కాంగ్రెస్ ఈనెల 15న విడుదల చేసిన మొదటి జాబితాలో గజ్వేల్ నుంచి మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిని ప్రకటించింది. ఇంకా హు స్నాబాద్, దుబ్బాక, సిద్దిపేట, జనగామ ప్రకటించాల్సి ఉంది. హుస్నాబాద్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వర్గంగా ప్రవీణ్‌రెడ్డి కొనసాగుతుండగా, కాంగ్రెస్ జాతీయ నేతల ద్వారా ప్రభాకర్ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. దుబ్బాక నుంచి ఆపార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్‌రెడ్డి, కత్తి కార్తీక టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హుస్నాబాద్‌లో బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర హౌజ్‌ఫెడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి ఇద్దరు పోటా పోటీగా ప్రయత్నిస్తున్నారు. ఇద్దరు నేతలు నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. -
సంక్షేమం భళా..మౌలికం ఎలా ?
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సాధనే లక్ష్యంగా అన్ని రాజకీయ పక్షాలు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నాయి. ప్రధానంగా సంక్షేమాన్నే నమ్ముకుని ఎన్నికల హామీలిస్తున్నాయి. ప్రచారంలో కానీ, పార్టీ ప్రణాళికల్లో కానీ సంక్షేమ ఆధారిత అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. అధికార భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), కాంగ్రెస్‌తో పాటు బీఎస్పీ కూడా ఇదే బాటలో నడుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం ఇంతవరకు మేనిఫెస్టో విడుదల చేయలేదు. ఇక బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) సంక్షేమ సూత్రాన్నే ప్రధానంగా అనుసరించినా.. అభివృద్ధి, ఉపాధి అంశాలకు కూడా చోటిస్తూ తన ఎన్నికల ప్రణాళిక విడుదల చేసింది. అయితే దేశాభివృద్ధికి కీలకమైన రెండు ప్రధానమైన అంశాలకు సంబంధించి ఏ పార్టీ కూడా స్పష్టమైన హామీలు ఇవ్వడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కీలకమైన విద్య, వైద్యానికి సంబంధించి తమ విధానమేమిటో? బడ్జెట్లో ఏ మేరకు నిధులు పెంచుతారన్న అంశాలను ఎక్కడా చెప్పడం లేదు. ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ విద్య, వైద్యంపై చేసిన వ్యయం చాలా తక్కువగా ఉండటం గమనార్హం. కాగా అతి ప్రధానమైన మౌలిక సదుపాయాల కల్పనపై కూడా దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సంక్షేమం సరే.. సంక్షేమ పథకాలను ఎవరూ తప్పుబట్టడం లేదని, అదే సమయంలో సుస్థిర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు దోహదపడే కార్యక్రమాలపై పార్టీలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభి ప్రాయం వ్యక్తమవుతోంది. విద్య, వైద్య రంగానికి బడ్జెట్లో కేటాయింపులు, చేస్తున్న వ్యయం పరిశీలిస్తే ఇది స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో బడ్జెట్లో కేటాయించిన నిధులు కూడా వ్యయం చేయడం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. విద్యపై వ్యయం ఎంత పెరిగితే.. భవిష్యత్ కు అంత పెట్టుబడి అనే అంశాన్ని పార్టీలు విస్మరిస్తున్నాయని అంటున్నారు. అలాగే రహదారుల అభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, యూనివర్సిటీలు, పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాల గురించి ప్రధాన పార్టీలు పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా విన్పిస్తుండటం గమనార్హం. ఎన్నికల హామీలు ఇలా.. కాంగ్రెస్: ఆరు గ్యారంటీల పేరిట పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహిస్తోంది. వివిధ రకాల డిక్లరేషన్లు ప్రకటిస్తోంది. మరిన్ని సంక్షేమ పథకాలపై కూడా ఆ పార్టీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి మహాలక్ష్మి పేరిట ప్రతి మహిళకు రూ. 2,500, రూ.500కే గ్యాస్ సిలిండర్, బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతు భరోసా కింద ఏటా ఎకరాకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, వరిపంట బోనస్ రూ.500, అన్ని కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, రూ.5 లక్షల ఆర్థిక సాయం, విద్యార్థులకు రూ.5 లక్షల వరకు వడ్డీ రహిత ఆర్థిక సహాయం, మహిళలకు రూ.4,000 పింఛను. బీఆర్ఎస్: ప్రధానంగా రైతుబంధు పెంపు, పెన్షన్ల పెంపు, రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ, తెల్ల రేషన్‌కార్డు ఉన్న ప్రతి ఇంటికి రైతు బీమా తరహాలోనే రూ.5 లక్షల జీవితబీమా, అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల భృతి, రూ.400కే సిలిండర్, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి రూ.15 లక్షలకు పెంపు, పేదలకు ఇళ్ల స్థలాలు, అగ్రవర్ణ పేదలకు రెసిడెన్షియల్ స్కూళ్లు, అస్సైన్డ్ భూములపై ఇక హక్కుదారులకే పూర్తి అధికారం. బీఎస్పీ: ఐదేళ్లలో యువతకు 10 లక్షల ఉద్యోగాలు. భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరా భూమి, మహిళా సంఘాలకు ఏటా లక్ష రూపాయలు, ఉచిత వాషింగ్ మిషన్లు, వృద్ధులకు వసతి గృహం, ఉచిత వైద్యం, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు తోడ్పాటు, మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్, ప్రతి మండలం నుంచి 100 మంది విద్యార్థులకు విదేశీ విద్య, పల్లె, పట్టణాల్లోని వారికి 150 రోజుల ఉపాధి, రూ.15 లక్షల వరకు ఆరోగ్య బీమా, ఆరోగ్యానికి రూ.25 వేల కోట్ల బడ్జెట్, రూ.5 వేల కోట్లతో గల్ఫ్ కార్మికుల సంక్షేమ నిధి, 600 సబ్సిడీ క్యాంటీన్లు, ఇల్లు లేని వారికి 550 చ.గజాల స్థలం, ఇల్లు కట్టుకునే వారికి రూ.6 లక్షల ఆర్థిక సాయం. నెగ్గడానికి షార్ట్‌కట్ మార్గాలు సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలే అట్టడుగు వర్గాల ప్రజల నిజమైన అభివృద్ధికి దోహదపడతాయి. సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిందే.. కానీ అవి వారికి ఉపాధి కల్పించే విధంగా ఉండాలి. పార్టీల మేనిఫెస్టోలు చూస్తుంటే విద్య, వైద్యం, యువత, ఉపాధికి సంబంధించిన అంశాలను అవి పట్టించుకోవడం లేదు. కేవలం డబ్బు పంపిణీ చేయడం ద్వారా ఎన్నికల్లో గెలవాలన్న తపనే రాజకీయ నాయకుల్లో కనిపిస్తోంది. ఇది మంచిది కాదు. ఇప్పుడు ఇరవై ముప్పయ్ కోట్లు పెడితే తప్ప ఎన్నికల్లో నిలబడలేని పరిస్థితి ఉంది. ఎన్నికల్లో గెలిచాక అవినీతితో పెద్ద ఎత్తున సంపాదించాలనే దృష్టి ఉంటుంది తప్ప,అభివృద్ధి చేయాలనే తపన ఎందుకు ఉంటుంది? – ఆకునూరి మురళి, రిటైర్డ్ ఐఏఎస్ -
నవంబర్ టెన్షన్...5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు
-
రాజకీయ పార్టీలతో సీఈఓ వికాస్ రాజ్ సమావేశం
-
ఎలక్టోరల్ బాండ్లపై విస్తృత ధర్మాసనం
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీల నిధుల సమీకరణ కోసం చేసే ఎలక్టోరల్ బాండ్ల జారీ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. దీనిపై దాఖలైన 4 ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై అక్టోబర్ 31, నవంబర్ 1 తేదీల్లో ధర్మాసనం తుది విచారణ జరపనుంది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం సోమవారం ఈ మేరకు పేర్కొంది. దీన్ని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారిస్తుందని తొలుత ధర్మాసనం పేర్కొనడం తెలిసిందే. ‘‘కానీ విషయ తీవ్రత, ప్రాధాన్యం దృష్ట్యా సుప్రీంకోర్టు కార్యకలాపాలను నియంత్రించే ఆరి్టకల్145(4) ప్రకారం కనీసం ఐదుగురు జడ్జిల ధర్మాసనం దీనిపై వాదనలు ఆలకిస్తుంది’’ అని తాజాగా వివరించింది. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్టోరల్ బాండ్ల పథకం మళ్లీ తెరపైకి రాకముందే ఈ కేసును తేల్చేయాలని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అక్టోబర్ 10న ధర్మాసనాన్ని అభ్యరి్థంచారు. బాండ్ల ద్వారా ఇలాంటి అనామక నిధుల ప్రవాహం ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా జరిగి దేశం అవినీతిరహితంగా మారాలన్న ఆశయానికి తూట్లు పొడుస్తోందని ఆయన ఆరోపించారు. దాంతో ఈ పిటిషన్లపై విచారణను అక్టోబర్ 31న మొదలు పెట్టి నవంబర్ 1కల్లా ముగిస్తామని ధర్మాసనం ప్రకటించింది. 2018లో తెరపైకి... పార్టీల నిధుల సమీకరణలో పారదర్శకత కోసమని 2018 జనవరి 2న కేంద్రం ఈ ఎలక్టోరల్ బాండ్ల పథకం తెచి్చంది. దీని ప్రకారం పార్టీలు నగదుకు బదులుగా బాండ్ల రూపంలో విరాళాలు స్వీకరిస్తాయి. భారత పౌరులు, సంస్థలు బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఈ రూపంలో పార్టీలకు ఇప్పటిదాకా ఏకంగా రూ.12,000 కోట్లు అందాయని పిటిషన్‌దారుల్లో ఒకరు పేర్కొన్నారు. వీటిలో మూడింట రెండొంతుల మొత్తం ఒకే పార్టీకి చేరిందన్నారు! ఎలక్టోరల్ బాండ్ల సేకరణపై నిషేధం విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు రెండు సార్లు తోసిపుచి్చంది. -
మేనిఫెస్టో... మా ఇష్టమంటే కుదరదు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల మేనిఫెస్టోల ప్రకటనలో రాజకీయపార్టీల ఇష్టారాజ్యం ఉండదు. ఓటర్లను ఆకర్షించేందుకు హామీలు ఇవ్వడం...గెలిచాక అమలు చేయకపోవడం..లేకపోతే ఆచరణ సాధ్యంకాని హామీలతో ఓట్లు కొల్లగొడదామంటే ఎన్నికల ప్రవర్తన నియమావళి అంగీకరించదు. ఎందుకంటే..ఎన్నికల ప్రవర్తన నియమావళిలో 8వ భాగంగా మేనిఫెస్టో చేర్చుతూ 2015 ఏప్రిల్ 24న కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఎన్నికల మేనిఫెస్టోల్లో హామీలు ఎలా ఉండాలి? ఎలా ఉండరాదు? అన్న అంశాలు ఉన్నాయి. దీంతో మేనిఫెస్టోల విషయంలో రాజకీయపార్టీ లు, అభ్యర్థులు పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరించకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఓటర్లకు వ్యక్తిగత ప్రయోజనం కలిగించే ఉచిత హామీలిచ్చేందుకు ఈ నిబంధనలు అంగీకరించవు. ‘హామీలు’ రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలి రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలు, విలువలకు భంగం కలిగించే అంశాలేమీ మేనిఫెస్టోలో ఉండరాదు. ఎన్నికల ప్రవర్తన నియమావళి స్ఫూర్తికి అనుగుణంగా మాత్రమే ఉండాలి. పౌరులకు వివిధ సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేయాలని.. ప్రభుత్వ విధానాలపై రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలు స్పష్టం చేస్తున్నాయి. మేనిఫెస్టోల్లో వాగ్దానాలు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగేలా ఆ హామీలు ఉండరాదు. ఓటు వినియోగించే విషయంలో ఓటర్లను అనుచిత ప్రలోభాలకు గురి చేయకూడదు. మేనిఫెస్టోలో ప్రకటించే హామీలు హేతుబద్ధంగా ఉండాలి. వీటి అమలుకు అనుసరించే మార్గాలు, అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ సైతం సవివరంగా ఓటర్లకు తెలియజేయాలి. నెరవేర్చగలిగే వాగ్దానాల ద్వారానే ఓటర్ల నమ్మకాన్ని కోరాలి. నిషేధాజ్ఞలు అమల్లోకి వస్తే... ప్రజాప్రాతినిధ్య చట్టం–195లోని సెక్షన్ 126లో నిర్దేశించిన నిషేధాజ్ఞలు అమలులో ఉన్నప్పుడు మేనిఫెస్టోలు విడుదల చేయొద్దు. ఒకేవిడత ఎన్నికల విషయంలో పోలింగ్‌కు ముందు అమలుచేసే నిషేధాజ్ఞల కాలవ్యవధిలో మేనిఫెస్టోలు ప్రకటించరాదు. ఒకటికంటే ఎక్కువ విడతల్లో ఎన్నికలు జరిగితే..ప్రతి విడత పోలింగ్‌కు ముందు ప్రకటించే నిషేధాజ్ఞల వ్యవధిలో మేనిఫెస్టోలు విడుదల చేయొద్దు. సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరి గతంలో రాజకీయపార్టీలు ప్రజలకు మీడియా ద్వారా మాత్రమే ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించేవి. కానీ ఇప్పుడు మేనిఫెస్టో ఎన్నికల సంఘానికి తప్పనిసరిగా సమర్పించాల్సిందే. ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన మూడు రోజుల్లోగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ)కి రాజకీయ పార్టీ లు, అభ్యర్థులు తప్పనిసరిగా ఆంగ్ల/హిందీ భాషల్లో మూడు ప్రతులు సమర్పించాలని ఎన్నికల సంఘం నిబంధనలు చెబుతున్నాయి. ఎన్నికల ప్రవర్తన నియమావళిలోని 8వ భాగంలో పేర్కొన్న విధివిధానాలకు అనుగుణంగానే మేనిఫెస్టోలో హామీలు, కార్యక్రమాలు, విధానాలు పొందుపర్చినట్టు స్వీయ ధ్రువీకరణ పత్రం(డిక్లరేషన్) సైతం మేనిఫెస్టోతో పాటు సీఈఓకు సమర్పించాలి. 2016 డిసెంబర్ 27న ఎన్నికల సంఘం జారీ చేసిన ఈ ఉత్తర్వుల కారణంగా రాజకీయపార్టీ ల ఎన్నికల మేనిఫెస్టోలను భవిష్యత్ అవసరాల కోసం ఎన్నికల సంఘం భద్రపరుస్తుంది. ‘సుప్రీం’ చొరవతో మేనిఫెస్టోకు పారదర్శకత ఎన్నికల మేనిఫెస్టోలో ఉండాల్సిన హామీల విషయంలో రాజకీయ పార్టీ లతో సంప్రదింపులు జరిపి మార్గదర్శకాలను నిర్దేశించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ 2013 జూలై 5న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్.సుబ్రమణ్యం బాలాజీ వేసిన కేసులో ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తన తీర్పులో చేసిన సూచనల ఆధారంగా మేనిఫెస్టోలపై మార్గదర్శకాలను ఈసీఐ రూపకల్పన చేసింది. సుప్రీంకోర్టు చేసిన సూచనలు ఇవే... మేనిఫెస్టోల్లోని హామీలను ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 ప్రకారం అవినీతి చర్యలుగా పరిగణించడానికి ఆస్కారం లేదు. అయినప్పటికీ, ఏ విధమైన ఉచిత హామీలైనా ప్రజలందరినీ ప్రభావితం చేస్తాయనడంలో అనుమానం లేదు. స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరగాల్సిన ఎన్నికలకు ఇలాంటి హామీలతో తీవ్రస్థాయిలో కుదుపునకు గురవుతాయి. ఎన్నికల్లో పోటీపడే పార్టీ లు/అభ్యర్థుల సమాన అవకాశాలను పరిరక్షించడానికి, స్వచ్ఛమైన ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలగకుండా ఎన్నికలసంఘం గతంలో సైతం ఎన్నికల ప్రవర్తన నియమావళి కింద ఇలాంటి ఆదేశాలు జారీ చేసింది. స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగంలోని ఆర్టీకల్ 324 ద్వారా ఎన్నికల సంఘానికి ఇలాంటి అధికారాలు లభించాయి. సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే రాజకీయ పార్టీ లు మేనిఫెస్టోలు ప్రకటిస్తాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందటి చర్యలను నియంత్రించే అధికారం ఎన్నికల సంఘానికి ఏ మాత్రం లేదు. అయితే, మేనిఫెస్టోలు ఎన్నికలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి వీటి విషయంలో ఎన్నికల సంఘం మినహాయింపు కలిగి ఉంటుంది. ప్రధాన దేశాల్లో పార్టీ ల విధానాలే హామీలు అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, స్వీడన్, కెనడా, నెదర్లాండ్, ఆ్రస్టియా, ఇతర పశ్చిమ ఐరోపా దేశాల్లొ వ్యక్తిగత లబ్ధి కలిగించే ఉచిత హామీలు మేనిఫెస్టోల్లో ప్రకటించరు. రాజకీయపార్టీలు తమ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆర్థిక విధానాలు, విదేశీ వ్యవహారాలు, ఆరోగ్య సంరక్షణ, పాలనాసంస్కరణలు, పర్యావరణ అంశాలు, వలసలు వంటి అంశాలపై తమ విధానాలను మాత్రమే ప్రకటించి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తాయి. భూటాన్, మెక్సికో వంటి దేశాల్లో రాజకీయ పార్టీలు/అభ్యర్థుల ఎన్నికల మేనిఫెస్టోలను ఆయా దేశాల ఎన్నికల యంత్రాంగానికి తొలుత సమర్పి స్తాయి. ఎన్నికల యంత్రాంగం పరిశీలించి అవసరమైతే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న హామీలను తొలగించాలని ఆదేశిస్తుంది. యూకేలో సైతం మేనిఫెస్టోలపై మార్గదర్శకాలు అమల్లో ఉన్నాయి. మన దగ్గరా మేనిఫెస్టోలు ఈసీ పరిశీలించాలనే డిమాండ్ మన దేశంలో సైతం రాజకీయపార్టీ లు మేనిఫెస్టోలను తొలుత ఎన్నికల సంఘానికి సమర్పించాలని, ఎన్నికల సంఘం పరిశీలించి ఆమోదించిన తర్వాతే ప్రజలకు ప్రకటించాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. మేనిఫెస్టోలను ఎన్నికల సంఘం పరిశీలించి ఆచరణకు సాధ్యం కాని, ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ఉన్న హామీలను తొలగింపునకు ఆదేశించాలని స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు మేనిఫెస్టోలను తాము పరిశీలించడం ఆచరణలో సాధ్యం కాదని ఎన్నికల సంఘం అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకవేళ మేనిఫెస్టోల్లో మార్పులు సూచిస్తే రాజకీయ పార్టీలు న్యాయస్థానాలకు వెళ్లే అవకాశముందని, దీంతో షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగడం కష్టమవుతుందంటున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరిస్తే ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించొచ్చని అధికారులు సూచిస్తున్నారు. -
ప్రలోభాలపై పక్కా నిఘా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ఎలాంటి ప్రలో భాలకు తావులేకుండా నిర్వహించడానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ స్పష్టం చేశారు. అన్ని రకాల ప్రలోభాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామని ప్రకటించారు. ఎన్నికల్లో ధనం, మద్యం, ఇతర కానుకలు, మాదకద్రవ్యాల ప్రవాహాన్ని పూర్తిగా నియంత్రించాలని, వీటిపట్ల అత్యంత అప్రమత్తంగా ఉంటూ కఠినంగా వ్యవహరించాల్సిందిగా కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల యంత్రాంగాన్ని ఆదేశించామని తెలిపారు. వారు కఠిన చర్యలు తీసుకునేలా తాము చేస్తామని చెప్పారు. గత అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రలోభాల గురించి తాము విన్నామని, ఇలాంటి విషయంలో తమ చర్యలు ఎలా ఉంటాయో ఈసారి చూడబోతున్నారని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే అధికార యంత్రాంగం యావత్తూ డెప్యుటేషన్‌పై ఈసీ పరిధిలోకి వస్తుందని వివరించారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేయడం, వాటికి ఫైనాన్స్ చేయడం, నిర్మూలించాల్సిన బాధ్యతల్లో ఉండి అవకాశం కల్పించడం నేరమేనని, ఐపీసీలోని పలు సెక్షన్లతో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం కింద శిక్షార్హులని రాజీవ్‌కుమార్ స్పష్టం చేశారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సన్నద్ధతను పరిశీలించడానికి మూడురోజుల రాష్ట్ర పర్యటనకు వచి్చన ఆయన.. గురువారం చివరిరోజు సహచర ఎన్నికల కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎస్ఎల్బీసీకి, ఆర్బీఐకి ప్రత్యేక ఆదేశాలు ‘బ్యాంకులు నగదు రవాణా వాహనాలను నిర్దేశిత సమయాల్లోనే నడిపించాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ)ని ఆదేశించాం. ఎన్నికల్లో అక్రమ నగదు రవాణాకు ఆ వాహనాలను వినియోగించే అవకాశం ఉందని గుర్తించాం. అంబులెన్సులు, ప్రభుత్వ వాహనాల్లో డబ్బు, ఇతర వస్తువుల అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు చేయాలని సంబంధిత యంత్రాంగాలను కోరాం. చీరలు, కుక్కర్లు వంటి ఎన్నికల్లో పంపిణీ చేసే కానుకలను నిల్వ చేసే ప్రైవేటు గోదాముల వద్ద గట్టి నిఘా పెట్టాలని రాష్ట్ర దర్యాప్తు సంస్థలను కోరాం. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లతో పాటు ఎయిర్‌పోర్టులు, కార్గో ఫ్లయిట్లు, ప్రైవేటు ఎయిర్్రస్టిప్లు, రాజకీయ నేతలు వినియోగించే వాణిజ్యేతర విమానాలు, ప్రత్యేక విమానాలు సైతం తనిఖీ చేయాలని కోరాం. పేమెంట్ వ్యాలెట్ల ద్వారా జరిగే ఆన్లైన్ నగదు లావాదేవీలపై నిఘా పెట్టాలని ఆర్బీఐ, ఎస్ఎల్బీసీకి సూచించాం. ఒకే ఖాతా నుంచి వందల సంఖ్యలోని ఖాతాలకు ఆన్లైన్ ద్వారా నగదు బదిలీ జరిగితే గుర్తించి విచారణ జరపాలని ఆదేశించాం. చిన్న చిన్న డ్రగ్ పెడ్లర్లపై చర్యలతోనే సరిపెట్టరాదని, పెద్ద మొత్తంలో మద్యం, మాదక ద్రవ్యాల సరఫరా, ఇతర అక్రమాలకు పాల్పడే కింగ్‌పిన్స్‌ను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. రాష్ట్ర సరిహద్దులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 148 చెక్‌పోస్టులను సీసీటీవీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరంగా పర్యవేక్షిస్తాం..’ అని సీఈసీ తెలిపారు. ఫిర్యాదులపై కలెక్టర్లు, ఎస్పీలు స్పందించాలి ‘రాజకీయ పార్టీలు, అభ్యర్థుల నుంచి వచ్చే ఫిర్యాదులన్నింటిపై విచారణ జరిపి వారికి సమాధానం ఇవ్వాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించాం. రాజకీయ పార్టీలు, అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాలని చెప్పాం. పోలింగ్ రోజుకి రెండు రోజుల కన్నా ముందే ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలని, ఈవీఎంలు/వీవీ ప్యాట్లను అధికారిక వాహనాల్లోనే రవాణా చేయాలని కోరాం. ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి సాధారణ పరిశీలకులు, పోలీసు పరిశీలకులు, వ్యయ పరిశీలకులను నియమిస్తాం. ఫిర్యాదుల స్వీకరణ కోసం వారి చిరునామాలు సైతం తెలియజేస్తాం. సామాజిక మాధ్యమాల్లో ఫేక్‌న్యూస్‌ను కట్టడి చేసేందుకు ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేస్తాం..’ అని రాజీవ్‌కుమార్ చెప్పారు. ఫిర్యాదుల కోసం సీ–విజిల్ యాప్ ‘ఎన్నికల్లో ప్రలోభాలు, ఇతర అక్రమాలపై ‘సీ–విజిల్’ యాప్ ద్వారా అక్కడికక్కడే ఫోటోలు తీసి పంపిస్తే 100 నిమిషాల్లోగా చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదుదారుల గోప్యతను పరిరక్షిస్తాం. ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా ఓటరుగా నమోదు, జాబితాలో పేరు, పోలింగ్ కేంద్రం పరిశీలన వంటి సేవలను ఉపయోగించుకోవచ్చు. ప్రలోభాలకు తావులేకుండా ఎన్నికలు జరపాలని, ధన, మద్య ప్రవాహం లేకుండా చూడాలని అన్ని రాజకీయ పార్టీలు కోరాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర సాయుధ బలగాలను నియమించాలని, విద్వేష ప్రసంగాలు, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌ను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశాయి. అభ్యర్థుల ఎన్నికల గరిష్ట వ్యయ పరిమితిని పెంచాలని ఓ పార్టీ కోరింది. త్వరలో వీటికి బదులిస్తాం..’ అని సీఈసీ తెలిపారు. ధ్రువీకరణ తర్వాతే ఓట్ల తొలగింపులు ‘ఓటర్ల తొలగింపు కోసం వచ్చిన ఫామ్–7 దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తర్వాతే చనిపోయిన, డూప్లికేట్ ఓటర్లను తొలగించాం. మా అంతట మేముగా ఎలాంటి ఓట్లు తొలగించలేదు. మరణ ధ్రువీకరణ పత్రం పరిశీలించిన తర్వాతే రిజిస్టర్డ్ మృతుల ఓట్లను తొలగించాం. 10 శాతం తొలగించిన ఓట్లను ఎంపిక చేసి పునఃపరిశీలన జరిపాం. 2022, 2023లో మొత్తం 22 లక్షల ఓట్లను తొలగించాం. చెంచు, కోలం, తోటి, కొండారెడ్డి వంటి గిరిజన తెగలవారిని 100 శాతం ఓటర్లుగా నమోదు చేశాం..’ అని రాజీవ్‌కుమార్ వివరించారు. అభ్యర్థులు తమ నేర చరిత్రపై ప్రకటన ఇవ్వాలి అభ్యర్థులు తమ నేరచరిత్రపై 3 వేర్వేరు సమయాల్లో ప్రముఖ పత్రికల్లో ప్రకటన ఇవ్వాల్సి ఉంటుందని సీఈసీ స్పష్టం చేశారు. నేర చరిత్ర కలిగిన అభ్యర్థులను ఎందుకు ఎంపిక చేశారన్న అంశాన్ని రాజకీయ పార్టీలు కూడా ఓటర్లకు తెలపాల్సి ఉంటుందన్నారు. కారణాలను ఒక జాతీయ, మరో ప్రాంతీయ పత్రికలో ప్రచురించాల్సి ఉంటుందని చెప్పారు. -
తెలంగాణలో మొత్తం 3.13 కోట్ల ఓటర్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం వడివడిగా అడుగులేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం మూడు రోజులపాటు ఎన్నికల సన్నాహాక భేటీలు వరుసగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు తుది ఓటర్ల జాబితా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసీ డేటా ప్రకారం సెప్టెంబర్ 18వ తేదీ వరకు.. కొత్త ఓటర్ల నమోదుకు 13.06 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో వివరాల సవరణ కోసం 7.77 లక్షల దరఖాస్తులు ఉండగా.. పేర్ల తొలగింపునకు 6.26 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. తెలంగాణలో మొత్తం 3.13 కోట్ల ఓటర్లు ఉన్నారు. అయితే రాజకీయ పార్టీలు మాత్రం ఓటర్ దరఖాస్తులన్నీ పరిష్కరించాకే.. తుది జాబితా విడదలు చేయాలని కోరుతున్నాయి. ఈ విజ్ఞప్తిని ఈసీ స్పందన ఏంటన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు సమావేశాలు హైదరాబాద్‌లో కొనసాగుతున్నాయి. జిల్లా ఎన్నికల అధికారులు - ఎస్పీలు, సీపీలతో ఇప్పటికే EC మీటింగ్ మొదలైంది. ఇవాళ రెండు సెషన్లుగా ఈ భేటీ జరగనుంది. మొదటి సెషన్లో అధికారులు చెప్పే అంశాల్ని కేంద్ర బృందం విననుంది. ఇక రెండో సెషన్లో అధికారులకు ఈసీ దిశానిర్దేశం చేస్తుంది. మరోవైపు.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా జిల్లాలో నిర్వహించిన అవగాహన కార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్‌ను కేంద్రం ఎన్నికల సంఘ బృందం పరిశీలించింది. -
TS: 6 లేదా 7న ఎన్నికల షెడ్యూల్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నేటి(మంగళవారం) నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో 17 మంది సభ్యుల బృందం హైదరాబాద్‌లో వరుస భేటీలు జరపనుంది. వివిధ రాజకీయ పార్టీలతో.. ఎన్నికల ఏర్పాట్లు, సంసిద్ధత తదితర అంశాలపై సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఓ ప్రముఖ హోటల్లో మంగళవారం మధ్యాహ్నం 2.30 నుండి 4.30 వరకు గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలతో సమావేశం అవ్వనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 7.30 గంటల వరకు పలు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో సమీక్షించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, అధికారులు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాలు, మోడల్ కోడ్‌తో పాటు డబ్బు, ఉచిత పంపిణీలు, మద్యం సరఫరా సహాపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక 4వ తేది ఉదయం 6.30 గంటలకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జీపై సైక్లోథాన్, వాక్ థాన్ నిర్వహించనుంది. ఉదయం 9.30 గంటల నుంచిసాయంత్రం 7 వరకు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలతో ఎన్నికల బృందం సమావేశమవ్వనుంది. 5వ తేదీ ఉదయం 9 గంటలకు టెక్ మహీంద్రలో స్టేట్ ఐకాన్స్, దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతో ఇంటరాక్షన్ అవ్వనుంది. 11 గంటలకు సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. అలాగే మధ్యాహ్నాం 1 గంటకు ప్రెస్ కాన్ఫరెన్స్, ఓటర్ల జాబితా, ఎన్నికల ఏర్పాట్లు, నిఘాపై కేంద్ర ఎన్నికల బృందం ఆరా తీయనుంది. గత ఎన్నికల సమయంలో.. అక్టోబర్ నెలలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఈసారి కూడా అక్టోబర్ 6 లేదా 7వ తేదీల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చదవండి: తెలంగాణలో మోదీ పర్యటన.. ప్రధాని ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి -
సీటివ్వలేదని ఆ పార్టీలో చేరావు.. అక్కడ కూడా సీటు హామీ లేనపుడు పాత పార్టీలోనే ఉంటే పోలా!
సీటివ్వలేదని ఆ పార్టీలో చేరావు.. అక్కడ కూడా సీటు హామీ లేనపుడు పాత పార్టీలోనే ఉంటే పోలా! -
TS Election 2023: బీజేపీ టికెట్‌కు.. కొత్తపల్లి శ్రీనివాస్ దరఖాస్తు!
కుమరం భీం: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ కోసం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ దరఖాస్తు చేసుకున్నారు. ఆది వారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో దరఖాస్తు ఫారాన్ని అందజేశారు. 2018 లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. బీసీ బిడ్డగా తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. దరఖాస్తు సమర్పించిన ‘పాల్వాయి’ సిర్పూర్ బీజేపీ టిక్కెట్ కోసం పాల్వాయి హరీశ్‌బాబు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం తన దరఖాస్తు సమర్పించారు. బీజేపీ తరఫున బరిలో ఉంటానని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. -
తెరపైకి భారత్..!
న్యూఢిల్లీ: భారతదేశం, హిందుస్తాన్, ఇండియా.. ఇవన్నీ ఒకే దేశం పేర్లు. భారతదేశం ప్రపంచ దేశాలకు ‘ఇండియా’గానే తెలుసు. అధికారికంగా అమల్లో ఉన్న పేర్లలో ‘ఇండియా’కూడా ఒకటి. అయితే, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా సంబోధిస్తూ ముద్రించిన ఆహ్వాన పత్రికలను ఆమె తరఫున జీ20 దేశాల అధినేతలకు రాష్ట్రపతి భవన్ పంపించడం తీవ్ర వివాదానికి దారితీసింది. దేశం పేరును మార్చడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. జీ20 శిఖరాగ్ర సదస్సు వేదిక అయిన ‘భారత్ మండపం’లో ఈ నెల 9న రాత్రి జరిగే విందుకు హాజరు కావాలని కోరుతూ ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’తరఫున రాష్ట్రపతి భవన్ ఆహ్వానాలు పంపించింది. ఈ ఆహ్వాన పత్రికను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘జనగణమన అధినాయక జయహే, భారత భాగ్య విధాత’అనే వ్యాఖ్యను సైతం జోడించారు. జయహో అంటూ ముక్తాయించారు. ఈ పత్రిక సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దేశం పేరును ‘భారత్’గా మార్చడానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నెల 18 నుంచి మొదలయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉన్నట్లు ప్రచారం మొదలైంది. తమ కూటమి పేరు ‘ఇండియా’ను చూసి మోదీ సర్కారు భయపడుతోందని, అందుకే దేశం పేరును మార్చేసే కుతంత్రానికి పాల్పడుతోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. భారత్ అని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని, అదే పేరును ఉపయోగిస్తే తప్పేమిటని అధికార బీజేపీ నాయకులు ఎదురు దాడికి దిగారు. పేరు మార్చే హక్కు ఎవరికీ లేదు: శరద్ పవార్ మనకు ఇండియా అంటే భారత్, ప్రపంచదేశాలకు మన దేశం కేవలం ఇండియాగానే తెలుసని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ పేర్కొన్నాను. కేవలం భారత్ అనే పేరును వాడాల్సిన అవసరం ఇప్పటికిప్పుడు ఏమొచ్చిందని ప్రశ్నించారు. బీజేపీయేతర పార్టీల కూటమికి ఇండియా అనే పేరు పెట్టడం బీజేపీకి మింగుడు పడడం లేదని, అందుకే దేశం పేరును భారత్ మార్చాలని కోరుకుంటోందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆక్షేపించారు. ఇండియాను మార్చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ తొమ్మిదేళ్ల తర్వాత చేస్తున్నది కేవలం పేరు మార్చడమేనని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ‘ఇండియా’ఓడిస్తుందన్నారు. ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి తమ పేరును ‘భారత్’గా మార్చుకుంటే, ఆ పేరును కూడా బీజేపీ మార్చేస్తుందా? ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ ప్రశ్నించారు. దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ తేల్చిచెప్పారు. ‘‘భారత్.. అంటే ఇండియా. రాష్ట్రాల సమాహారమే ఇండియా అని రాజ్యాగంలోని ఆర్టికల్ 1 చెబుతోంది. అలాంటి రాష్ట్రాల సమాహారంపై మోదీ ప్రభుత్వం దాడి చేస్తోంది. డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, న్యూ ఇండియా అనే పేర్లను బీజేపీ ప్రభుత్వమే తీసుకొచ్చింది. ఇండియా షైనింగ్ అంటూ గతంలో బీజేపీ ఎన్నికలకు వెళ్లింది. ప్రధాని మోదీ చరిత్రను వక్రీకరిస్తున్నారు. దేశాన్ని విభజిస్తున్నారు. దేశం పేరును మార్చాలనుకుంటే కచ్చితంగా అడ్డుకుంటాం’’కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ హెచ్చరించారు. ‘ఇండియా’పేరుకు లెక్కగట్టలేనంత బ్రాండ్ విలువ ఉందని, దేశం పేరును మార్చే పిచ్చి పనిని బీజేపీ చేయదని తాను భావిస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చెప్పారు. భారత్ కాకుండా ఇంకెలా పిలవాలి?: రాజీవ్ చంద్రశేఖర్ మన దేశం పేరు భారత్ అయినప్పుడు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’అని పేర్కొంటే తప్పేమిటని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నిలదీశారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. భారత్‌ను భారత్ అని కాకుండా ఇంకేలా పిలవాలని ప్రశ్నించారు. ప్రాచీన కాలం నుంచి భారత్ అనే పేరు వాడుకలో ఉందని బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ గుర్తుచేశారు. భారతమాత, వందేమాతరం మన రక్తంలోనే ఉన్నాయని చెప్పారు. భారత్ అనే పేరును తుడిచిపెట్టేయడానికి కొత్త ఖిల్జీలు, కొత్త మొఘల్ రాజులు పుట్టుకొచ్చారని ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. మన దేశం ‘రిపబ్లిక్ ఆఫ్ భారత్’అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఉద్ఘాటించారు. మన నాగరికత అమృతకాలం వైపు సాగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ‘భారత్’ను ఓడించడానికే ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’అనే పేరు పెట్టుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి భారత్ అంటే నచ్చదని చెప్పారు. -
మళ్లీ మారడానికి ఇక ఏ పార్టీ మిగుల్లేద్సార్!
ఒకవేళ ఇప్పుడున్న పార్టీ వాళ్లు టికెట్ ఇవ్వకుంటే.. మళ్లీ మారడానికి ఇక ఏ పార్టీ మిగుల్లేద్సార్! -
గొప్పగా ప్రారంభమై.. అంతలోనే కనుమరుగై.. పాకిస్తాన్ హిందూ పార్టీ పతనం వెనుక..
పాకిస్తాన్‌కు స్వాతంత్ర్యం లభించకముందు అక్కడ హిందువుల సంఖ్య భారీగానే ఉండేది. దీంతో అక్కడ వారికి తగిన ప్రాధాన్యత లభించేది. స్వాతంత్ర్యం అనంతరం పాక్ ప్రత్యేక దేశంగా అవతరించింది. అదేసమయంలో అక్కడ ఉంటున్న హిందువులు భారత్‌కు తరలివచ్చారు. కొద్దిమంది మాత్రం పాకిస్తాన్‌లోనే ఉండిపోయారు. వారిలో హిందూ రాజులు కూడా ఉన్నారు. వారిలో ఒకరే పాకిస్తాన్‌లోని అమర్కోటకు చెందిన హిందూ రాజు రాణా చంద్ర సింగ్. ఇతనే తొలిసారిగా 1990లో పాకిస్తాన్లో పాకిస్తాన్ హిందూ పార్టీని స్థాపించారు. నాడు పాకిస్తాన్లో అమర్ కోటగా పిలిచే ప్రాంతాన్ని నేడు ఉమర్కోటగా మార్చారు. రాణా చంద్ర సింగ్ అక్కడే రాజుగా ఉండేవారు. పాక్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అక్కడి హిందువులకుపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్న విషయాన్ని గమనించిన రాజపూత్ వంశస్థుడైన రాణా చంద్ర సింగ్ పాకిస్తాన్ హిందూ పార్టీని నెలకొల్పారు. అయితే పార్టీకి ప్రజల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. పాకిస్తాన్‌లోని హిందువులు పార్టీకి తగినంత అండనివ్వలేదు. రాజకీయ విశ్లేషకులు తెలిపిన వివరాల ప్రకారం ఈ పార్టీలోని కీలకపదవులను రాణా చంద్ర సింగ్ కుటుంబ సభ్యులు, పాక్‌లోని అగ్రవర్ణాల వారు ఆక్రమించారు. అప్పట్లో పాక్‌లోని హిందూ ఓటర్లలో అత్యధికులు కింది వర్గాలకు చెందినవారే ఉన్నారు. దీంతో వారు ఈ పార్టీతో అనుసంధానం కాలేకపోయారు. ఫలితంగా పార్టీ ఎంత గొప్పగా ప్రారంభమయ్యిందో అంత వేగంగానే పతనమయ్యింది. పాకిస్తాన్ హిందూ పార్టీకి చెందిన జెండా హిందూ చిహ్నాలతో కూడి ఉంటుంది. కాషాయవర్ణంలోని జెండాపై త్రిశూలం గుర్తు కనిపిస్తుంది. అలాగే ఓంకారం కూడా ఉంది. ప్రస్తుతం ఈ పార్టీ మనుగడలో లేదు. అయితే ఈ పార్టీని స్థాపించిన రాణా చంద్ర సింగ్ కుమారుడు రాణా హమీర్ సింగ్ రాజకీయాల్లో యాక్టివ్గానే ఉన్నారు. ఆయన సింధ్ ప్రాంతానికి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సింధ్‌లో ఆయన పలుకుబడి కలిగిన వ్యక్తిగా పేరుగాంచారు. ఇది కూడా చదవండి: మరో ‘పబ్జీ’ దారుణం: తల్లిదండ్రులపై దాడికి తెగబడి.. -
పార్టీ లు మార్చడం పై సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ వ్యాఖ్యలు
-
ఫ్యాన్స్‌తో విజయ్ చర్చలు.. మళ్లీ ఆదే టాపిక్ వైరల్
హీరో విజయ్.. కోలీవుడ్‌లో ఈ పేరు ఇప్పుడు ఆయన అభిమానులకు తారక మంత్రంగా మారింది. రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిగ్గా మారింది. వివరాలు.. విజయ్ అత్యధిక ప్రేక్షకాదరణ కలిగిన నటుడిగా ఎదిగారు. తన అభిమాన సంఘాలను విజయ్ ప్రజా సంఘాలుగా మార్చారు. తద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలకు చెందిన 10, ప్లస్–1, ప్లస్–2 తరగతుల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉత్తీర్ణత సాధించిన నియోజకవర్గం ముగ్గురు చొప్పున ఎంపిక చేసిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పనైయూరులోని తన కార్యాలయానికి ఆహ్వానించి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. (ఇదీ చదవండి: ప్రాజెక్ట్- కే యూనిట్‌పై ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్) ఈ సందర్భంగా విద్యార్థులకు పలు హిత వాక్యాలు చేశారు. ముఖ్యంగా ఓటుకు నోటు విధానం మంచిది కాదనే విషయాన్ని తనదైన శైలిలో స్పష్టం చేశారు. ఇది రాజకీయ వర్గాల్లోనూ, టీవీ ఛానల్లో పెద్ద డిబేట్ జరిగింది. అంతేకాకుండా విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారనే నమ్మకాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు విజయ్ మంగళవారం ఉదయం మరోసారి తన అభిమాన సంఘ నిర్వాహకులను, కార్యకర్తలను చైన్నెలోని తన కార్యాలయంలో కలిశారు. (ఇదీ చదవండి: ధోని తొలి సినిమా రెడీ! హీరోహీరోయిన్లు, కథ ఏంటంటే?) ఈ సందర్భంగా తమిళనాడులోని అన్ని నియోజకవర్గాల్లోనూ జరుగుతున్న పరిణామాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించినట్లు సమాచారం. అదే విధంగా మరికొన్ని రాజకీయ పరమైన అంశాల గురించి తీవ్రంగా కార్యకర్తలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో 15 జిల్లాలకు చెందిన విజయ్ ప్రజా సంఘం నిర్వాహకులు పాల్గొన్నట్లు సమాచారం. దీంతో మారోసారి విజయ్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు జోరందుకున్నాయి.