రాజకీయ పార్టీలో అంతర్గత విభేదాలు ఎప్పుడూ ఒక పద్ధతిని అనుస రిస్తాయి. వర్గ విభేదాలు బహిరంగంగా మారిన తర్వాత, ప్రతి ఒక్క పక్షం కూడా పార్టీపై నియంత్రణ సాధించడానికి ప్రయత్నిస్తుంది. మొదటగా, రెండు గ్రూపులూ తమతమ కార్యకర్తలను నియమిస్తాయి, పార్టీ స్థానాల నుండి ప్రత్యర్థులను తొలగిస్తాయి. అప్పుడు, రెండు వైపులా ప్రత్యర్థి సమూహానికి చెందిన చట్టసభ సభ్యుల సభ్యత్వం నుండి అనర్హులుగా ప్రకటించే ప్రక్రియను ప్రారంభిస్తాయి.
చివరగా, పార్టీపై నియంత్రణను చేజిక్కించుకోవడానికి చట్టపరమైన తగాదాలు ప్రారంభమవుతాయి. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పార్టీ గుర్తు, దాని పేరు ఏ వర్గాని దన్న సంగతి నిర్ణయిస్తుంది. అనర్హత నిర్ణయించే క్రమంలో తెలుసుకున్న సమాచారం మేరకు శాసనసభ ప్రిసైడింగ్ అధికారి (స్పీకర్) ప్రతి వర్గానికి చెందిన చట్ట సభ సభ్యుల బలం ఎంతో నిర్ణయిస్తారు. ప్రతి దశలో, ప్రతి గ్రూపునకు చెందిన సంఖ్యా బలం, పార్టీ రాజ్యాంగం ఈ నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తాయి.
మహారాష్ట్రను చుట్టుముట్టిన రాజకీయ నాటకంలో, శరద్ పవార్, అజిత్ పవార్‌ల నుండి మొదటి రెండు దశలు అంటే... టిట్–ఫర్–టాట్ తొలగింపులు, అనర్హతా పిటిషన్ల ధాఖలు చేయడం ఇప్పటికే పూర్తయ్యాయి. మూడవ దశ ప్రారంభం కావడానికి కొద్ది సమయం మాత్రమే ఉంది.
ఎన్సీపీకి శాసనసభలో 53 మంది, శాసనమండలిలో తొమ్మిది మంది, లోక్‌సభలో ఐదుగురు, రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు. అయితే ఎవరి వర్గంలో గణనీయమైన సంఖ్యలో నాయకులు ఉన్నారనే విషయం తెలియడంలేదు. ఇది కీలకమైనది. శివసేన కేసులో, ఎన్నికల చిహ్నాలపై, ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునేటప్పుడు ఈసీఐ, స్పీకర్ ఇద్దరూ శాసనసభలో, పార్టీ సంస్థాగత విభాగాలలో వర్గ బలాలను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది.
సుప్రీంకోర్టు నొక్కిచెప్పిన రెండో అంశం పార్టీ రాజ్యాంగం. ఎన్సీపీ రాజ్యాంగం ఒక వివరణాత్మక పత్రం. ఇది పార్టీ సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల నియామకం, వారి పాత్ర, క్రమ శిక్షణా చర్యల ప్రక్రియను నిర్దేశిస్తోంది. చివరి నుంచి రెండో నిబంధన పార్టీని రద్దు చేయడం లేదా మరొక సంస్థలో విలీనం చేసే ప్రక్రియను తెలియజేస్తోంది.
ఈ అంశంపై పార్టీ జాతీయ కమిటీ మాత్రమే నిర్ణయం తీసుకోగలదని అది పేర్కొంది. పార్టీ అధ్యక్షుడు ఈ కమిటీ సమావేశానికి నెల రోజుల ముందు నోటీస్ ఇస్తారు. కోరమ్, కమిటీలోని ఎన్నుకోబడిన సభ్యులలో 75 శాతం అని కూడా ఈ పత్రం నిర్దేశిస్తోంది. పార్టీని రద్దు చేయ డానికి లేదా విలీనం చేయడానికి 90 శాతం మంది అంగీకరించాలి.
మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఫిరాయింపు పిటిషన్లపై విచారణ ప్రారంభించినప్పుడు, ఆయన ముందు ఈ పత్రం ఉంటుంది. గత సంవత్సరం నుండి పెండింగ్‌లో ఉన్న సేన పిటి షన్లతోపాటు రెండు ఎన్సీపీ వర్గాల ఫిరాయింపు అభ్యర్థనలు 11 వరకు ఆయన ముందు ఉన్నాయి. ఎన్సీపీ సంక్షోభం ముదిరితే, సేన మాదిరిగానే, దాదాపు ఎన్సీపీ శాసనసభ్యులందరూ ఏదో ఒక వర్గం నుండి అనర్హత ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. రాష్ట్రంలోని దాదాపు 100 మంది చట్టసభ సభ్యులు అంటే అసెంబ్లీ బలంలో మూడింట ఒక వంతు – ఫిరాయింపుల నిరో ధక చట్టంలో చిక్కుకునే పరిస్థితిని ఇది సృష్టించవచ్చు.
దురదృష్టవశాత్తు, ఈ చట్టం తరచుగా పరిష్కారం కంటే సమస్యగానే ఉంటోంది. శాసనసభ అమాయకత్వం లేదా రాజకీయ వంచన 1985లో ఈ చట్టం ఆమోదం పొందడానికి దారి తీసింది. ఒక రాజకీయ పార్టీ టిక్కెట్‌పై ఎన్నికైన చట్టసభ సభ్యులు పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ప్రవర్తించినా లేదా ఓటు వేసినా రెండు మినహాయింపులతో తమ స్థానాన్ని కోల్పోతారని ఇది పేర్కొంది. మొదటి మినహాయింపు ఏమిటంటే, చట్టసభ సభ్యులలో మూడింట ఒక వంతు మంది పార్టీ నుండి విడిపోతే, దానిని ఫిరాయింపుగా పేర్కొనరు.
ఈ నిబంధన ప్రభుత్వాలను పడగొట్టడానికి విస్తృతంగా ఉపయోగపడింది. చివరికి 2003లో పార్లమెంటు దానిని తొలగించింది. రెండవ మినహాయింపు – విలీన నిబంధన అని పిలవబడేది – ఒక రాజకీయ పార్టీ మరొక దానితో విలీనం అయితే, విలీనంలో భాగమైన చట్టసభ సభ్యు లను అనర్హులుగా ప్రకటించరు. పైగా పార్టీ శాసనసభ్యులలో మూడింట రెండొంతుల మంది అంగీకరించినట్లయితే అటు వంటి విలీనం జరిగినట్లు పరిగణిస్తారు.
దీన్ని యథాతథంగా తీసుకుంటే, ఒక రాజకీయ పార్టీని మరొక దానితో విలీనం చేయడానికి కావాల్సిందల్లా దాని శాసన సభ్యులలో మూడింట రెండు వంతుల మందిని ఒప్పించడమే. ఉదాహరణకు, 2019 రాష్ట్ర ఎన్నికల తర్వాత, 10 మంది సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనం అయ్యారు. ఫలితంగా ఇంతకుముందు ఒక్క సభ్యుడు కూడా లేని బీజేపీ ఒక్కసారిగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది.
అయితే పార్టీ ఫిరాయింపులను నిరోధించే ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అర్థం చేసు కోవాలని సుప్రీం కోర్ట్ శివసేన కేసు విషయంలో భావించింది. పార్టీకి చెందిన చట్ట సభలకు ఎన్నికైన సభ్యులలో మూడింట రెండు వంతుల మంది విలీనం కావడానికి ముందు... ఆ రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తలు, సభ్యులు విలీనం అవ్వాలి.
అప్పుడే ఒక పార్టీ మరో పార్టీలో విలీనం అయినట్లు పరిగణిస్తారు. విలీనాన్ని నిర్థారించ వలసిన చట్ట సభ స్పీకర్ విలీనానికి ఎంత మంది పార్టీ కార్యకర్తలు అనుకూలంగా ఉన్నారో ఎలా తెలుసుకుంటారు? అందుకే 1999లో లా కమిషన్ విలీన నిబంధనను తొలగించాలని సిఫార్సు చేసింది. కానీ అది అమలుకు నోచుకోలేదు.
ఫిరాయింపుల నిరోధక చట్టం ఏనాడూ పని చేయలేదు. ఉదాహరణకు, సేన ఫిరాయింపు కేసు గత ఏడాది జూన్‌లో ప్రారంభమైంది, కానీ ఎక్కడా అది ముగింపునకు రాలేదు. ప్రస్తుత ఎన్సీపీ ఫిరాయింపు పిటిషన్‌లకు కూడా ఒక సంవత్సరం పట్టవచ్చు. అప్పటికి ఎన్నికలు సమీపిస్తాయి. దీంతో అప్పటి వరకు జరిగిన ప్రక్రియ అంతా–కనీసం రాజకీయంగా చూసినా నిష్ఫలమైనట్లే.
రాజ్యాంగంలో కొన్ని చట్టపరమైన నిబంధనలను చేర్చినంత మాత్రాన రాజకీయ నైతికతను సాధించలేమని మనం గ్రహించాల్సిన సమయం ఇది. ఫిరాయింపుల సమస్యను ఎప్ప టికైనా పరిష్కరిస్తుందనే ఆశతో అంటిపెట్టుకోకుండా ‘ఫిరాయింపుల నిరోధక చట్టా’న్ని పూర్తిగా తొలగించడం మంచిది. ఫిరా యింపులు రాజకీయ సమస్యలు, వాటికి రాజకీయ పరిష్కారాలు అవసరం. ఈ విషయంలో చట్టం పరిమిత పాత్ర మాత్రమే పోషిస్తుంది.
చక్షు రాయ్
వ్యాసకర్త లెజిస్లేటివ్, సివిక్ ఎంగేజ్‌మెంట్ హెడ్,పీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
పార్టీ ఫిరాయింపులను చట్టాలు నిరోధించలేవు!
Published Sun, Jul 9 2023 4:00 AM | Last Updated on Sun, Jul 9 2023 4:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment