మాజీ మంత్రి, మహారాష్ట్రలోని అధికార జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత బాబా సిద్దిఖీని ముంబయ్‌లో మాఫియా శైలిలో హత్య చేసిన తీరు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సినీ నటుడు సల్మాన్ ఖాన్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తదుపరి లక్ష్యాలంటూ వినిపిస్తూ ఉండడం ఆందోళన రేపుతోంది. మరికొద్ది రోజుల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న ఆ రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితిపై సందేహాలు కలిగిస్తోంది. సల్మాన్‌తో సన్నిహిత సంబంధాల రీత్యా సిద్దిఖీ లక్ష్యంగా మారారని కథనం.
కుమారుడి నియోజకవర్గంలోని మురికివాడల పునరభివృద్ధి వ్యవహా రంలో కుంభకోణం ఆయన మెడకు చుట్టుకుందని మరో వాదన. ఇంకా అనేక రకాల కుట్ర కోణాలూ వినవస్తున్నాయి. సిద్దిఖీ దారుణ హత్యకు కారణాలు ఏమైనప్పటికీ, రానున్న ఎన్నికల్లో ఈ ఘటన తాలూకు రాజకీయ పర్యవసానాలు కచ్చితంగా ఉండే అవకాశం మాత్రం కనిపిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో అస్తుబిస్తుగా ఉన్న పాలక కూటమిని ఎన్నికల వేళ ఇది ఇరుకునపెట్టే అంశం కానుంది.
విద్యార్థి నేత నుంచి గ్యాంగ్‌స్టర్‌గా మారిన లారెన్స్ బిష్ణోయ్ జైలులో ఉన్నా, అనేక నెలలుగా ఈ హత్యకు పథకం వేసినట్లు కథనం. జైలులో ఉన్నా సెల్‌ఫోన్ సహా సమస్త సౌకర్యాలతో బిష్ణోయ్ లాంటి కొందరు ఖైదీలు రాజభోగాలు అనుభవిస్తూ ఉండడం మన వ్యవస్థకు పట్టిన తెగులు.
ముంబయ్‌లో రద్దీగా ఉండే బాంద్రా ప్రాంతంలో శనివారం, విజయదశమి నాటి రాత్రి సిద్దిఖీపై దాడి చేసిన ముగ్గురు దుండగులు ముందుగా ఆయన రక్షకుడిపై పెప్పర్‌స్ప్రే జల్లి, ఆపైన సూటిగా 6 బుల్లెట్లు కాల్పులు జరిపి ఊరేగింపులో కలిసిపోయారట. హాస్పిటల్‌కు హుటాహుటిన తరలించి, దాదాపు రెండు గంటల పాటు వైద్యులు శ్రమించినా సిద్దిఖీ ప్రాణాలను కాపాడలేకపోయారు.
ఇద్దరు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ, కాల్పులు జరిపిన మూడో వ్యక్తి ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. బిష్ణోయ్ పక్షాన ముగ్గురు సుపారీ ఇచ్చి పథక రచన చేయగా, మరో ముగ్గురు కాల్పులు జరిపారనీ, నిందితులు యూపీ, పంజాబ్, హర్యానా – ఇలా వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చి రెక్కీ జరిపినట్లూ, దొరకకుండా వాట్సప్, సిగ్నల్ యాప్‌ల ద్వారా కథ నడిపినట్లూ సమాచారం.
సరిగ్గా వారం పైచిలుకు క్రితమే ముంబయ్‌లోని బైకులా ప్రాంతంలో మరో ఎన్సీపీ నేత కత్తిపోట్లకు గురయ్యారు. ఆ ఘటనను మర్చిపోకముందే ఇప్పుడీ దారుణహత్య జరగడం విషాదం. దాదాపు 48 ఏళ్ళ పాటు కాంగ్రెస్‌లో ఉండి, పాపులర్ రాజకీయ నేతగా ఎదిగిన చరిత్ర సిద్దిఖీది. ఏటేటా ఆయన ఆర్భాటంగా నిర్వహించే ఇఫ్తార్ విందులు, వాటికి హాజరయ్యే నగర ప్రముఖులు, మరీ ముఖ్యంగా హిందీ సినీ అగ్ర తారలు జగత్ప్రసిద్ధం.
అంత పేరు, పలుకుబడి, ప్రజాక్షేత్రంలో సుదీర్ఘ అనుభవం ఉన్న బాబా సిద్దిఖీని స్వయంగా ఎమ్మెల్యే అయిన ఆయన కుమారుడు జీషన్ కార్యాలయం ఎదుటే హత్య చేయడం దిగ్భ్రాంతికరం. ‘వై ప్లస్’ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ ఇలా ఓ పాపులర్ నాయకుడు దారుణహత్యకు గురికావడం వ్యవస్థల వైఫల్యానికి ఉదాహరణ. అదీ పోలీసు బందోబస్తు ఎక్కువగా ఉన్న దసరా ఉత్సవాల హంగామా సమయంలోనే జరగడం పరాకాష్ఠ. దేశ వాణిజ్య రాజధానిలో ఇలాంటి ఘటన జరిగిందంటే, పాలకులకు ఇది మరీ మాయని మచ్చ.
గ్లామర్ నిండిన హిందీ చిత్రసీమ, ఖరీదైన ముంబయ్ రియల్ ఎస్టేట్, ఈ రెంటితోనూ ముడి పడ్డ మాఫియా ముఠా నేతల ముక్కోణపు వ్యవహారం ముంబయ్‌లో ఎప్పుడూ ఒక డెడ్లీ కాంబి నేషన్. కొన్ని నియోజకవర్గాలు అచ్చంగా మాఫియా నేతల కనుసన్నల్లోనే నడుస్తూ వచ్చాయి. 1980, ’90లలో ముంబయ్‌లో దావూద్ ఇబ్రహీమ్, ఛోటా రాజన్ లాంటి మాఫియా నేతల గ్యాంగ్ వార్ తెలిసినదే.
గతంలో చాలా ఏళ్ళ క్రితం ప్రముఖ సినీ నిర్మాత, ఆడియో కంపెనీ అధినేత గుల్షన్ కుమార్ హత్య ఇలాగే జరిగిందీ ప్రజలకు గుర్తే. కానీ, ఇప్పుడు కటకటాల వెనుక ఉన్న ఓ గ్యాంగ్‌స్టర్ ఇలాంటి చర్యలకు దిగడమే దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ప్రముఖులపై హింసాత్మక దాడులు, హత్యలు ఈ ఏడాది వరుసగా జరుగుతూ ఉండడం ఆందోళనకరమైనది.
ఇదే ఏడాది ఫిబ్రవరిలో ఫేస్‌బుక్ లైవ్‌లో ఉండగా శివసేన (యూబీటీ) నేత ఒకరు దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ ఘటనపై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో లోపాలతో ఆగ్రహించిన హైకోర్ట్ చివరకు ఆ కేసును గత నెలలో సీబీఐకి బదలాయించాల్సి వచ్చింది. ఇవన్నీ పోలీసులకూ, పాలకపక్షానికీ చెంపపెట్టు.
మహారాష్ట్రలో శివసేన, బీజేపీ, ఎన్సీపీలతో కూడిన మహాయుతి సర్కార్‌కు ఇప్పటికే బోలెడన్ని చిక్కులున్నాయి. అధికారం కోసం ఈ పార్టీలన్నీ అనైతిక కూటమి కట్టాయనే భావన ఉంది. కూటమి పాలనపై అసంతృప్తి సహా ఇంకా అనేకం ఉండనే ఉన్నాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ బలం పుంజుకుంటూ ఉండడంతో, ఎన్నికల వేళ... ముంబయ్‌లో టోల్‌ఫ్రీ ప్రయాణం సహా రకరకాల జిమ్మిక్కులకు సర్కారు సిద్ధమవుతున్న పరిస్థితి.
ఇలాంటప్పుడు సిద్దిఖీ హత్య జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు బాధ్యత వహించాల్సిన హోమ్ శాఖకు బీజేపీ నేత, సాక్షాత్తూ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సారథి. అదీ కాషాయపార్టీకి ఇబ్బందికరమే. సిద్దిఖీ మీద గతంలో అనేక అవినీతి ఆరోపణలున్నా ఈ హత్య ఊహించనిది. ముంబయ్‌లో మళ్ళీ ఒకప్పటి గ్యాంగ్‌వార్ పరిస్థితులు రాకుండా ఉండాలంటే, సర్కారు ఉక్కుపాదం మోపాలి.
అన్ని పక్షాలూ రాజకీయాల కన్నా రాష్ట్రంలో భయరహిత వాతావరణం నెలకొనేందుకు కృషి చేయాలి. గతంలో ఎంతో పేరున్న ముంబయ్ పోలీ సులు ఈ కేసును సవాలుగా తీసుకోవాలి. దోషులకు శిక్ష పడేలా చూడాలి. పోయిన ప్రతిష్ఠను తెచ్చు కోవాలి. చట్టం మీద ప్రజలకు మళ్ళీ నమ్మకం నెలకొనేలా చూడడం పాలకుల తక్షణ కర్తవ్యం.
దిగ్భ్రాంతికర హత్యాకాండ
Published Tue, Oct 15 2024 4:10 AM | Last Updated on Tue, Oct 15 2024 4:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment