Nationalist Congress Party (NCP)
-
Kerala: రూ.100 కోట్ల ముడుపుల కలకలం
తిరువనంతపురం: కేరళలోని ఎన్సీపీ (శరద్)కి చెందిన ఏకైక ఎమ్మెల్యే థామస్ కె.థామస్ అధికార ఎల్డీఎఫ్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున ఇవ్వజూపారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జనాధిపత్య కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆంటోనీ రాజు, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ(లెనినిస్ట్) ఎమ్మెల్యే కొవూర్ కుంజుమోన్లకు థామస్ ఈ ఆఫర్ ఇచ్చారని అంటున్నారు. ఈ రెండు పార్టీలు ఎల్డీఎఫ్లో భాగస్వాములు. ప్రతిగా ఈ ఎమ్మెల్యేలిద్దరూ ఎన్సీపీ(అజిత్)లో చేరడం, పినరయి విజయన్‌పై ఒత్తిడి తెచ్చి కేబినెట్లో స్థానం దక్కించుకునేందుకు పథక రచన జరిగిందని ఆరోపణలున్నాయి. జూన్ 5న థామస్ నుంచి ఈ మేరకు తమకు ప్రతిపాదన వచి్చందని మాజీ మంత్రి కూడా అయిన రాజు సీఎం విజయన్ చెవిన వేశారు. దీనిపై ఆయన కుంజుమోన్‌ను ప్రశ్నించగా అలాంటిదేమీ లేదంటూ కొట్టిపారేశారు. ఈ వ్యవహారం అక్టోబర్ 25న త్రిసూర్‌లో జరిగిన సీపీఎం సమావేశం సందర్భంగా బయటకు వచి్చంది. ఎల్డీఎఫ్ మిత్ర పక్షం ఎన్సీపీ(శరద్)వర్గం ఎమ్మెల్యే థామస్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోడానికి గల కారణాలను ఈ సమావేశంలో సీఎం విజయన్ చెప్పినట్లు కూడా తెలుస్తోంది. వాస్తవానికి థామస్ కేబినెట్లో అటవీ శాఖను కోరుతున్నారు. అయితే, సీఎం విజయన్, సీపీఎంతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్న మంత్రి శచీంద్రన్ ఆ శాఖను వదులుకునేందుకు ససేమిరా అంటున్నారు. అందుకే, ఒక రకంగా సీఎం విజయన్‌పై ఒత్తిడి తేవడం ద్వారా కేబినెట్లో చేరేందుకు థామస్ వేసిన పథకంగా భావిస్తున్నారు. ఎన్సీపీ(అజిత్), బీజేపీలు మహారాష్ట్రలో మిత్రపక్షాలే కాబట్టి.. ఈ పథకమే ఫలించి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్సీపీ(అజిత్)లో చేరితే కేరళలో బీజేపీకి పరోక్షంగా లాభం కలిగి ఉండేది. ఏదేమైనప్పటికీ, మంత్రి వర్గంలో చేరే అవకాశాన్ని ప్రస్తుతానికి థామస్ కోల్పోయినట్లుగానే భావిస్తున్నారు. ఈ పరిణామాలపై తమకెలాంటి సంబంధం లేదని కేరళలో ఎన్సీపీ(అజిత్)నేత మహ్మద్ కుట్టి స్పష్టం చేశారు. ఆరోపణలపై విచారణకు ఏర్పాటైన ఎన్సీపీ(శరద్)కమిటీ ఎదుట ఇటీవల థామస్ హాజరై, ముడుపుల వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కమిటీ త్వరలోనే ఎన్సీపీ(శరద్) జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పీసీ చాకోకు నివేదిక ఇవ్వనుంది. -
‘గడియారం’ అజిత్ పవార్ వర్గానికే
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టి(అజిత్ పవార్) అధ్యక్షుడు అజిత్ పవార్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గడియారం గుర్తును అజిత్ పవార్ వాడుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే, ఈ గుర్తు వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉన్నట్లు ప్రచార సామగ్రిపై ముద్రించాలని సూచించింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గడియారం గుర్తుపై అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ వర్గం మధ్య మొదలైన వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఎన్నికల ప్రచారంలో ఈ గుర్తును అజిత్ పవార్ వర్గం ఉపయోగించుకోకుండా ఆదేశించాలని కోరుతూ శరద్ పవార్ వర్గం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గడియారం గుర్తుతో శరద్ పవార్‌కు ఎంతో అనుబంధం ఉంది. గుర్తు విషయంలో ప్రజల్లో గందరగోళానికి తావు లేకుండా అజిత్ పవార్ వర్గానికి కొత్త గుర్తు కేటాయించాలని శరద్ పవార్ వర్గం సూచించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం గడియారం గుర్తును అజిత్ పవార్ వర్గం ఎన్నికల ప్రచారంలో వాడుకోవచ్చంటూ తేలి్చచెప్పింది. అయితే, ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ వర్గానికి నష్టం కలుగకుండా హామీ పత్రం సమర్పించాలని అజిత్ పవార్ వర్గాన్ని కోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను నవంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. ఎన్సీపీ రెండుగా చీలిపోగా అజిత్ వర్గానికి గడియారం గుర్తును ఈసీ కేటాయించింది. -
బారామతి బరిలో అజిత్
సాక్షి, న్యూఢిల్లీ/ ముంబై: మహారాష్ట్ర ఎన్నికల ప్రకటన విడుదలైనప్పటి నుంచి అన్ని పారీ్టలు తమ సన్నాహాలను ముమ్మరం చేశాయి. అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 38 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. వీరిలో 26 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ పుణె జిల్లాలో బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గం బారామతి లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. బారామతి ఎంపీ స్థానం శరద్ పవార్ కుటుంబానికి దశాబ్దాలుగా కంచుకోటగా ఉంటోంది. అందుకే ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో శరద్‌పవార్ కుమార్తె సుప్రియాసూలేపై అజిత్ తన భార్య సునేత్రా పవార్‌ను పోటీకి నిలిపినా సునేత్రా ఓటమిని చవిచూడటం తెల్సిందే. ఛగన్ భుజ్‌బల్ యోలా నుంచి, దిలీప్ వాల్సే పాటిల్ అంబేగావ్ నుంచి పోటీ చేయనున్నారు. 45 మందితో శివసేనజాబితా విడుదల మంగళవారం అర్ధరాత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 45 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. సీఎం ఏక్నాథ్ షిండే మరోసారి కోప్రి పాచ్ పాఖాడి నుంచి పోటీచేయనున్నారు. విలాస్ సందీపన్ భూమ్రే పైఠాన్ నుంచి, మంత్రి ఉదయ్ సమంత్ రత్నగిరి నుంచి బరిలో దిగనున్నారు. రాష్ట్రంలోని అధికార మహాయుతి కూటమి ఇప్పటివరకు 182 పేర్లను ప్రకటించింది. ఇందులో బీజేపీ నుంచి 99 మంది, శివసేన నుంచి 45 మంది, ఎన్సీపీ నుంచి 38 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తన కుమారుడు అమిత్ ఠాక్రేను మాహిం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దింపారు. శివసేన(యూబీటీ) తొలిజాబితా ఉద్ధవ్‌ఠాక్రే సారథ్యంలోని శివసేన(యూబీటీ) బుధవారం 65 మంది అభ్యర్థుల పేర్లతో తొలిజాబితాను విడుదలచేసింది. పార్టీ నేత, మాజీ రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే సెంట్రల్ ముంబై పరిధిలోని వర్లీ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు. యువసేన నేత, ఆదిత్య బంధువు వరుణ్ సర్దేశాయ్ బాంద్రా(ఈస్ట్) నుంచి పోటీచేస్తారు. పార్టీ నుంచి చీలిపోయి పార్టీ పేరు, గుర్తును కైవసం చేసుకున్న ఏక్నాథ్ షిండే పోటీచేస్తున్న కోప్రి పాచ్ పాఖాడి నియోజకవర్గంలో శివసేన(యూబీటీ) తరఫున కేదార్ దిఘే బరిలో దిగుతున్నారు. షిండే రాజకీయగురువు ఆనంద్ దిఘే మేనల్లుడే కేదార్. -
Maha Vikas Aghadi: 200 సీట్లపై ఏకాభిప్రాయం.. శరద్‌పవార్ వెల్లడి
పుణె: మహావికాస్ అఘాడిలోని మూడు భాగస్వామ్య పార్టీల మధ్య 200 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరిందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్‌పవార్ గురువారం వెల్లడించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలుండగా.. కాంగ్రెస్, ఎన్పీపీ (ఎస్పీ), శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) కలిసి పోటీచేయనున్న విషయం తెలిసిందే. తమ తరఫున ఎన్సీపీ (ఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ సీట్ల పంపకం చర్చల్లో పాల్గొంటున్నారని, ఆయనిచ్చిన సమాచారం మేరకు 200 సీట్లపై ఏకాభిప్రాయం కుదిరిందని వెల్లడించారు. ఎవరెన్ని స్థానాల్లో పోటీచేయాలి, ఏయే నియోజకవర్గాలు ఏ పార్టీకి కేటాయించాలనే విషయంలో మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) పార్టీలు చాలా రోజులుగా కసరత్తు చేస్తున్నాయి. నవంబరు 20న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఈసీ షెడ్యూల్‌ను విడుదల చేయడంతో ఈ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. హరియాణా ఫలితం ప్రభావం (బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది) మహారాష్ట్ర ఎన్నికలపై ఉండదని శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. ఎంవీఏ సీఎం అభ్యరి్థని ప్రకటించాలనే శివసేన (యూబీటీ) డిమాండ్‌ను ప్రస్తావించగా మూడు భాగస్వామ్యపక్షాల మధ్య ఈ అంశం పరిష్కారమైందని బదులిచ్చారు. ఉద్ధవ్ ఠాక్రే పాల్గొన్న సంయుక్త విలేకరుల సమావేశంలో దీనిపై స్పష్టత ఇచ్చామని, ఎన్నికల తర్వాత సీఎం అభ్యర్థి నిర్ణయమవుతారని తెలిపారు. నాందేడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా రవీంద్ర చవాన్ నాందేడ్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ తమ అభ్యర్థిగా రవీంద్ర చవాన్‌ను ప్రకటించింది. దివంగత ఎంపీ వసంత్ రావు కుమారుడే రవీంద్ర. వసంత్ రావు మృతి చెందడంతో నాందేడ్ స్థానికి ఉపఎన్నిక వచి్చంది. వచ్చేనెల 20న పోలింగ్ జరగనుంది. -
మహాయుతిలో 225–230 సీట్లపై ఏకాభిప్రాయం: ప్రఫుల్
ముంబై: అధికార మహాయుతి కూటమిలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 225–230 సీట్లపై ఏకాభిప్రాయం వచ్చిందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ సోమవారం వెల్లడించారు. ఈ స్థానాల్లో ఎవరెక్కడ పోటీచేయాలనే దానిపై అంగీకారానికి వచ్చామని తెలిపారు. మరో రెండు లేదా నాలుగు రోజుల్లో మిగతా సీట్ల పంపకంపై నిర్ణయానికి వచ్చాక వివరాలను వెల్లడిస్తామన్నారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమిలో శివసేన (ఏక్నాథ్ షిండే), ఎన్సీపీ (అజిత్‌పవార్), బీజేపీలు భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలున్నాయి. ఈ ఏడాది నవంబరు 26తో అసెంబ్లీ గడువు ముగియనుంది. ఎన్సీపీతో కలిపి ఎన్నికలకు వెళితే నష్టపోతామని బీజేపీ, శివసేన నాయకులు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. -
సిద్దిఖీ హత్యకు పుణెలో కుట్ర
ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నేత బాబా సిద్దిఖీని కాల్చిచంపడానికి పుణెలో కుట్ర జరిగిందని పోలీసులు సోమవారం వెల్లడించారు. íసిద్దిఖీని గుర్తించడానికి వీలుగా ఆయన ఫొటో, చిత్రం ముద్రించిన ఫ్లెక్సీని షూటర్లకు అందజేశారు. ఈ హత్యలో పుణెకు చెందిన సోదరులు ప్రవీణ్ లోంకర్, శుభమ్ లోంకర్ల పాత్ర ఉందని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. నిందితులు దొరకితే హత్యకు కారణాలు తెలుస్తాయని ఒక పోలీసు అధికారి తెలిపారు. లోంకర్ సోదరులే హత్యకు పాల్పడిన షూటర్లకు రూ.50 వేల చొప్పున అడ్వాన్సు అందించారని, నిందితుల మధ్య సమావేశాలను ఏర్పాటు చేశారని, హత్యకు కావాల్సిన ఏర్పాట్లను చూశారని చెప్పారు. శుభమ్‌కు చెందిన డైరీలో ప్రవీణ్ పనిచేస్తున్నాడని.. అక్కడే షూటర్లు శివకుమార్ గౌతమ్, ధర్మరాజ్ కశ్యప్‌లను హత్య కోసం నియమించుకున్నారని తెలిపారు. అడ్వాన్సుగా అందిన మొత్తం నుంచి నిందితులు ఒక మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేసి.. దాని పైనే సిద్దిఖీ నివాసం, ఆఫీసుల వద్ద, ఆయన దినచర్య పైనా రెక్కీ నిర్వహించారని వివరించారు. గుర్మైల్ బల్జీత్‌సింగ్ (హరియాణా), ధర్మరాజ్ కశ్యప్ (ఉత్తరప్రదేశ్), ప్రవీణ్ లోంకర్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. నిందితులకు దిశానిర్దేశం చేసిన మొహమ్మద్ యాసిన్ అక్తర్ కోసం. సిద్దిఖీని కాల్చిచంపిన గౌతమ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
దిగ్భ్రాంతికర హత్యాకాండ
మాజీ మంత్రి, మహారాష్ట్రలోని అధికార జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత బాబా సిద్దిఖీని ముంబయ్‌లో మాఫియా శైలిలో హత్య చేసిన తీరు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సినీ నటుడు సల్మాన్ ఖాన్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తదుపరి లక్ష్యాలంటూ వినిపిస్తూ ఉండడం ఆందోళన రేపుతోంది. మరికొద్ది రోజుల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న ఆ రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితిపై సందేహాలు కలిగిస్తోంది. సల్మాన్‌తో సన్నిహిత సంబంధాల రీత్యా సిద్దిఖీ లక్ష్యంగా మారారని కథనం. కుమారుడి నియోజకవర్గంలోని మురికివాడల పునరభివృద్ధి వ్యవహా రంలో కుంభకోణం ఆయన మెడకు చుట్టుకుందని మరో వాదన. ఇంకా అనేక రకాల కుట్ర కోణాలూ వినవస్తున్నాయి. సిద్దిఖీ దారుణ హత్యకు కారణాలు ఏమైనప్పటికీ, రానున్న ఎన్నికల్లో ఈ ఘటన తాలూకు రాజకీయ పర్యవసానాలు కచ్చితంగా ఉండే అవకాశం మాత్రం కనిపిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో అస్తుబిస్తుగా ఉన్న పాలక కూటమిని ఎన్నికల వేళ ఇది ఇరుకునపెట్టే అంశం కానుంది. విద్యార్థి నేత నుంచి గ్యాంగ్‌స్టర్‌గా మారిన లారెన్స్ బిష్ణోయ్ జైలులో ఉన్నా, అనేక నెలలుగా ఈ హత్యకు పథకం వేసినట్లు కథనం. జైలులో ఉన్నా సెల్‌ఫోన్ సహా సమస్త సౌకర్యాలతో బిష్ణోయ్ లాంటి కొందరు ఖైదీలు రాజభోగాలు అనుభవిస్తూ ఉండడం మన వ్యవస్థకు పట్టిన తెగులు.ముంబయ్‌లో రద్దీగా ఉండే బాంద్రా ప్రాంతంలో శనివారం, విజయదశమి నాటి రాత్రి సిద్దిఖీపై దాడి చేసిన ముగ్గురు దుండగులు ముందుగా ఆయన రక్షకుడిపై పెప్పర్‌స్ప్రే జల్లి, ఆపైన సూటిగా 6 బుల్లెట్లు కాల్పులు జరిపి ఊరేగింపులో కలిసిపోయారట. హాస్పిటల్‌కు హుటాహుటిన తరలించి, దాదాపు రెండు గంటల పాటు వైద్యులు శ్రమించినా సిద్దిఖీ ప్రాణాలను కాపాడలేకపోయారు. ఇద్దరు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ, కాల్పులు జరిపిన మూడో వ్యక్తి ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. బిష్ణోయ్ పక్షాన ముగ్గురు సుపారీ ఇచ్చి పథక రచన చేయగా, మరో ముగ్గురు కాల్పులు జరిపారనీ, నిందితులు యూపీ, పంజాబ్, హర్యానా – ఇలా వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చి రెక్కీ జరిపినట్లూ, దొరకకుండా వాట్సప్, సిగ్నల్ యాప్‌ల ద్వారా కథ నడిపినట్లూ సమాచారం. సరిగ్గా వారం పైచిలుకు క్రితమే ముంబయ్‌లోని బైకులా ప్రాంతంలో మరో ఎన్సీపీ నేత కత్తిపోట్లకు గురయ్యారు. ఆ ఘటనను మర్చిపోకముందే ఇప్పుడీ దారుణహత్య జరగడం విషాదం. దాదాపు 48 ఏళ్ళ పాటు కాంగ్రెస్‌లో ఉండి, పాపులర్ రాజకీయ నేతగా ఎదిగిన చరిత్ర సిద్దిఖీది. ఏటేటా ఆయన ఆర్భాటంగా నిర్వహించే ఇఫ్తార్ విందులు, వాటికి హాజరయ్యే నగర ప్రముఖులు, మరీ ముఖ్యంగా హిందీ సినీ అగ్ర తారలు జగత్ప్రసిద్ధం. అంత పేరు, పలుకుబడి, ప్రజాక్షేత్రంలో సుదీర్ఘ అనుభవం ఉన్న బాబా సిద్దిఖీని స్వయంగా ఎమ్మెల్యే అయిన ఆయన కుమారుడు జీషన్ కార్యాలయం ఎదుటే హత్య చేయడం దిగ్భ్రాంతికరం. ‘వై ప్లస్’ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ ఇలా ఓ పాపులర్ నాయకుడు దారుణహత్యకు గురికావడం వ్యవస్థల వైఫల్యానికి ఉదాహరణ. అదీ పోలీసు బందోబస్తు ఎక్కువగా ఉన్న దసరా ఉత్సవాల హంగామా సమయంలోనే జరగడం పరాకాష్ఠ. దేశ వాణిజ్య రాజధానిలో ఇలాంటి ఘటన జరిగిందంటే, పాలకులకు ఇది మరీ మాయని మచ్చ. గ్లామర్ నిండిన హిందీ చిత్రసీమ, ఖరీదైన ముంబయ్ రియల్ ఎస్టేట్, ఈ రెంటితోనూ ముడి పడ్డ మాఫియా ముఠా నేతల ముక్కోణపు వ్యవహారం ముంబయ్‌లో ఎప్పుడూ ఒక డెడ్లీ కాంబి నేషన్. కొన్ని నియోజకవర్గాలు అచ్చంగా మాఫియా నేతల కనుసన్నల్లోనే నడుస్తూ వచ్చాయి. 1980, ’90లలో ముంబయ్‌లో దావూద్ ఇబ్రహీమ్, ఛోటా రాజన్ లాంటి మాఫియా నేతల గ్యాంగ్ వార్ తెలిసినదే. గతంలో చాలా ఏళ్ళ క్రితం ప్రముఖ సినీ నిర్మాత, ఆడియో కంపెనీ అధినేత గుల్షన్ కుమార్ హత్య ఇలాగే జరిగిందీ ప్రజలకు గుర్తే. కానీ, ఇప్పుడు కటకటాల వెనుక ఉన్న ఓ గ్యాంగ్‌స్టర్ ఇలాంటి చర్యలకు దిగడమే దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ప్రముఖులపై హింసాత్మక దాడులు, హత్యలు ఈ ఏడాది వరుసగా జరుగుతూ ఉండడం ఆందోళనకరమైనది. ఇదే ఏడాది ఫిబ్రవరిలో ఫేస్బుక్ లైవ్‌లో ఉండగా శివసేన (యూబీటీ) నేత ఒకరు దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ ఘటనపై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో లోపాలతో ఆగ్రహించిన హైకోర్ట్ చివరకు ఆ కేసును గత నెలలో సీబీఐకి బదలాయించాల్సి వచ్చింది. ఇవన్నీ పోలీసులకూ, పాలకపక్షానికీ చెంపపెట్టు. మహారాష్ట్రలో శివసేన, బీజేపీ, ఎన్సీపీలతో కూడిన మహాయుతి సర్కార్‌కు ఇప్పటికే బోలెడన్ని చిక్కులున్నాయి. అధికారం కోసం ఈ పార్టీలన్నీ అనైతిక కూటమి కట్టాయనే భావన ఉంది. కూటమి పాలనపై అసంతృప్తి సహా ఇంకా అనేకం ఉండనే ఉన్నాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ బలం పుంజుకుంటూ ఉండడంతో, ఎన్నికల వేళ... ముంబయ్‌లో టోల్‌ఫ్రీ ప్రయాణం సహా రకరకాల జిమ్మిక్కులకు సర్కారు సిద్ధమవుతున్న పరిస్థితి. ఇలాంటప్పుడు సిద్దిఖీ హత్య జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు బాధ్యత వహించాల్సిన హోమ్ శాఖకు బీజేపీ నేత, సాక్షాత్తూ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సారథి. అదీ కాషాయపార్టీకి ఇబ్బందికరమే. సిద్దిఖీ మీద గతంలో అనేక అవినీతి ఆరోపణలున్నా ఈ హత్య ఊహించనిది. ముంబయ్‌లో మళ్ళీ ఒకప్పటి గ్యాంగ్‌వార్ పరిస్థితులు రాకుండా ఉండాలంటే, సర్కారు ఉక్కుపాదం మోపాలి. అన్ని పక్షాలూ రాజకీయాల కన్నా రాష్ట్రంలో భయరహిత వాతావరణం నెలకొనేందుకు కృషి చేయాలి. గతంలో ఎంతో పేరున్న ముంబయ్ పోలీ సులు ఈ కేసును సవాలుగా తీసుకోవాలి. దోషులకు శిక్ష పడేలా చూడాలి. పోయిన ప్రతిష్ఠను తెచ్చు కోవాలి. చట్టం మీద ప్రజలకు మళ్ళీ నమ్మకం నెలకొనేలా చూడడం పాలకుల తక్షణ కర్తవ్యం. -
బీజేపీకి షాక్.. శరద్ పవార్ ఎన్సీపీలోకి మాజీ మంత్రి
ముంబై: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్రలో బీజేపీకి షాక్ తగిలింది. పార్టీ నేత, మాజీ మత్రి హర్షవర్దన్ పాటిల్ తర్వలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో భేటీ అయిన మరుసటి రోజు హర్షవర్దన్ ఈ ప్రకటన చేశారు. శుక్రవారం పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో సమావేశమై.. తాను బీజేపీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ..‘నేను గత రెండు నెలలుగా ఇందాపూర్ నియోజకవర్గం అంతటా పర్యటిస్తూ వివిధ వర్గాల ప్రజలను కలుస్తున్నాను. ఒక విషయం స్పష్టంగా ఉంది. నేను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజలు పట్టుబడుతున్నారు. నా మద్దతుదారులతో మాట్లాడిన తర్వాత శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపారు. అయితే పుణెలోని ఇందాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్సీపీ ఎమ్మెల్యే దత్తమామ భర్నేపై పోటీ చేయాలని హర్షవర్దన్ భావిస్తున్నారు.కాగా అక్టోబరు 7న ఇందాపూర్‌లో జరిగే భారీ ర్యాలీలో ఎన్సీపీ (ఎస్పీ)లో ఆయన చేరుతారని మద్దతుదారులు తెలిపారు. ఇక ఆయన కుమార్తె అంకితా పాటిల్, మాజీ పూణె జిల్లా పరిషత్ సభ్యురాలు కూడా శరద్ పవార్ వర్గంలో చేరనున్నట్లు సమాచారం. పాటిల్ ఇందాపూర్ నుంచి నాలుగుసార్లు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారు. 2019 సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌ను బీజేపీలో చేరారు.అయితే ప్రస్తుతం ఇందాపూర్ నుంచి ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో ఇక్కడి నుంచి బీజేపీ తమ అభ్యర్ధిని ఎంపిక చేసేందుకు అసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. ఇందాపూర్ నియోజకవర్గం నుంచి తన అభ్యర్థిత్వంపై సరైన నిర్ణయం తీసుకోనందుకు బీజేపీపై అసంతృప్తితో ఉన్న పాటిల్ పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. -
Sharad Pawar: నాపై నిఘాకే జెడ్ ప్లస్ భద్రత
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున తన కదలికలపై అధికారిక సమాచారం కోసమే తనకు జెడ్ ప్లస్ భద్రతను కలి్పంచి ఉండొచ్చని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ అన్నారు. శరద్ పవార్‌కు వీఐపీ భద్రతలో అత్యున్నతమైన జెడ్ ప్లస్ భద్రతను బుధవారం కేంద్రం కల్పించింది. 55 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బృందం ఆయనకు రక్షణ కలి్పస్తారు. ముప్పును అంచనా వేసి కేంద్ర ఏజెన్సీలు ఈ మేరకు సిఫారసు చేశాయని కేంద్రం పేర్కొంది. జెడ్ ప్లస్ సెక్యూరిటీపై అడగ్గా.. భద్రత పెంపునకు కారణాలు తనకు తెలియదని పవార్ విలేకరులతో అన్నారు. ‘ముగ్గురికి జెడ్ ప్లస్ భద్రత ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని, అందులో నేనొకడినని హోంశాఖ అధికారి ఒకరు నాకు తెలిపారు. మిగతా ఇద్దరు ఎవరని అడగ్గా.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, హోంమంత్రి అమిత్ షాలని ఆ అధికారి బదులిచ్చారు’ అని పవార్ వివరించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున నాపై నిఘాకు ఈ ఏర్పాటు చేశారేమోనని 83 ఏళ్ల పవార్ అన్నారు. విపక్ష మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)లు భాగస్వాములనే విషయం తెలిసిందే. -
శరద్ పవార్‌కు ధన్యవాదాలు: అజిత్ పవార్
ముంబై: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర డప్యూటీ సీఎం అజిత్ పవార్.. తన అంకుల్ శరద్ పవార్‌కు ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఎన్సీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీని.. 24ఏళ్ల పాటు సుధీర్ఘంగా నడిపించిన శరద్ పవార్‌కు అజిత్ పవార్ ధన్యవాదాలు తెలిపారు.1999లో ఎన్సీపీ ఆవిర్భావించింది. ఈ ఏడాదితో 24 ఏళ్లు పూర్తి చేసుకుంది. మేరకు సోమవారం ముంబైలో అజిత్ కుమార్ మాట్లాడుతూ.. గత 24 సంవత్సరాలుగా పార్టీని నడిపించినందుకు శరద్ పవార్‌కు ధన్యవాదాలు తెలిపారు. వారితోపాటు పార్టీని స్థాపించినప్పటి నుంచి కొనసాగుతున్న వారందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.శివాజీ మహారాజ్, షాహూ మహారాజ్, మహాత్మా ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ బోధనలపైనే మా సిద్ధాంతాలు ఆధారపడి ఉన్నాయని నేను అందరికీ హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు.రాయ్‌గఢ్ లోక్‌సభ స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా పార్టీ నాయకుడు సునీల్ తట్కరే ఎన్సీపీ ప్రతిష్టను కాపాడారని ఆయన పేర్కొన్నారు. ఎన్సీపీలో అంతర్గత సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.అదే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వంలో కేబినెట్ బెర్త్ కంటే తక్కువ స్థాయిలో ఏ పదవిలో ఉండకూడదని ఎన్సీపీ నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. `కేబినెట్ పోర్ట్‌ఫోలియో కంటే తక్కువ పదవిని మేము అంగీకరించబోమని బీజేపీకి స్పష్టం చేస్తున్నాం. వారు చాలా మంది సభ్యులకు కేబినెట్ పదవులు ఇవ్వాలని మాతో చెప్పారు. మేము ఇప్పటికీ ఎన్డీయేలో భాగమే` అని ఆయన అన్నారు. స్తుతం 284 సీట్లు ఉన్న ఎన్డీయ బలం రాబోయే నెలల్లో 300 మార్కును దాటుతుందని పేర్కొన్నారు.కాగా ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నాలుగు చోట్ల పోటీ చేయగా.. కేవలం ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. మరోవైపు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పోటీ చేసిన పది నియోజకవర్గాలలో ఎనిమిదింటిని గెలుచుకుంది. ముఖ్యంగా, అజిత్ భార్య సునేత్రా పవార్.. సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలే చేతిలో బారామతిలో ఓడిపోయారు. -
ఎన్డీయేలో చేరాలన్న మోదీ.. శరద్ పవార్ స్పందన ఇదే
ముంబై: నకిలీ ఎన్సీపీ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీసీ (శరద్ చంద్ర పవార్) చీఫ్ శరద్ పవార్ స్పందించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వారితో (బీజేపీ) తాను ఎప్పటికీ పొత్తు పెట్టుకోనని స్పష్టం చేశారు.మహారాష్ట్రలోని నందుర్బార్లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గానికి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గాన్ని ఉద్ధేశిస్తూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌లో విలీనమై ఉనికి కోల్పోవడం కన్నా.. అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేతో చేతులు కలపాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎన్డీయోలో చేరాలని తెలిపారు.‘గత 40-50 ఏళ్లుగా మహారాష్ట్రకు చెందిన ఓ ప్రముఖ నాయకుడు (శరద్ పవార్) రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. బారామతి లోక్‌సభ స్థానంలో పోలింగ్ తర్వాత ఏమవుతుందో అని ఆయన ఆందోళన చెందుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. జూన్ 4 అనంతరం చిన్న పార్టీలు మనుగడ కోసం కాంగ్రెస్‌లో విలీం చేయాలని ఆయన అంటున్నారు’ అని మోదీ తెలిపారు. నకిలీ ఎన్సీపీ, నకిలీ శివసేన ఇదే ఆలోచనతో ఉన్నట్లు’ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేల పార్టీల గురించి ఎద్దేవా చేశారు.దీనిపై శరద్ పవార్ మాట్లాడుతూ.. మోదీ ఆఫర్‌ను తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. తాను గాంధీ-నెహ్రూ భావజాలాన్ని ఎన్నడూ వదులుకోనని, ముస్లిం వ్యతిరేక విధానాలు అవలంబించే వారితో చేతులు కలపనని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ నేతల్లో ఓటమి తాలూకు భయం కన్పిస్తోందని, అందుకే తన ప్రసంగాన్ని మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ తమపై వస్తున్న ప్రతికూలతను మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. మోదీ పాలనలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని అన్నారు. ఇందుకు సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్‌లను అరెస్టు చేసిన ఉదాహరణలను ఆయన ప్రస్తావించారు.‘కేజ్రీవాల్, సోరెన్‌లను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర నాయకత్వం పాత్ర లేకుండా ఇది సాధ్యం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థపై వారికి ఎంత విశ్వాసం ఉందో ఇది తెలియజేస్తోంది. ప్రధానమంత్రి మోదీ ఇటీవలి ప్రసంగాలు వర్గాల మధ్య చీలికలు సృష్టించేలా ఉన్నాయి. మోదీ ప్రసంగాలు ప్రధాని పదవికి తగినవి కావు. ఇది దేశానికి ప్రమాదకరం. శివసేన(యూబీటీ), ఎన్సీపీలను నకిలీ అని విమర్శించడం సరికాదు. డూప్లికేట్ అని పిలిచే హక్కు ఆయనకు ఎవరిచ్చారు?’ అని శరద్ మండిపడ్డారు -
ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
పుణె: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ నియోవర్గంలో మంగళవారం పోలింగ్ జరిగింది. చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఎన్సీపీ నాయకురాలు, మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు రూపాలి చకంకర్ ఈవీఎం పూజలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. సింహగఢ్ రోడ్, పుణె సిటీ పోలీస్స్టేషన్లలో ఆమెపై కేసు నమోదైంది.ఓటింగ్ సందర్భంగా ఖడక్వాస్లా ప్రాంతంలోని పోలింగ్ కేంద్రానికి రూపాలి చకంకర్ ప్లేటు, దీపంతో వచ్చారు. ఈవీఎం మెషిన్ వద్ద పూజలు చేశారు. స్థానికి ఎన్నికల అధికారులు ఉన్నతాధికారలకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమెపై సింహగఢ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.కాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్‌కు మహాయుతి కూటమి బారామతి లోక్‌సభ అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పటి నుంచి ఆమె కోసం చురుగ్గా ప్రచారం చేస్తున్న రూపాలి చకంకర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. -
బారామతిలో అలాంటి పనులు పనిచేయవు: అజిత్ పవార్
మహారాష్ట్రలో కీలకమై బారామతి పార్లమెంట్ స్థానంలో పవార్ వర్సెస్ పవార్ పోటీ నెలకొంది. మూడో దశలో మే 7(మంగళవారం) బారామతిలో పోలింగ్ జరగనుంది. ఆదివారంతో ఇక్కడ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నేపథ్యంలో పూణె జిల్లాలోని బారామతిలో నిర్వహించిన ఓ ర్యాలీలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ‘వికాస్ పురుష్’అంటూ ప్రశంసలు కురిపించారు. అదే విధంగా ఇటీవల తన మేనల్లుడు రోహిత్ పవార్‌పై విమర్శలు చేశారు. సిట్టింగ్ ఎంపీ, ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్) అభ్యర్థి సుప్రియా సూలే తరఫున ప్రచారం చేస్తూ రోహిత్ పవార్ భావోద్వేగానికి గురైన విషయాన్ని ప్రస్తావించారు.‘నీ భావోద్వేగాలతో కొంతమంది ఆడుకుంటారని చెప్పాను. కానీ, అలాంటి పనులు బారామతిలో పని చేయవు. విమర్శలు చేయడానికి ప్రయత్నం చేయను. అభివృద్ధి కోసం నిరంతరం పని చేయటానికే నా తొలి ప్రాధన్యం. ఇప్పటివరకు చాలా ప్రచార ర్యాలీలో పాల్గొన్నా. కానీ, ఇంత పెద్దసంఖ్యలో అభిమానులు, జనాలను చూడలేదు. ఇదంతా చూస్తే.. మన గెలుపు ఖాయమని అర్థమవుతోంది. రాజకీయాలు నేర్పింది నేనే అని చెప్పే రోహిత్.. ఇప్పడు నాపై విమర్శలు చేస్తున్నాడు. అయినా నేను వాటిని పట్టించుకోను. అభివృద్ధి కోసం పనిచేయటమే నా తొలి ప్రాధాన్యం’ అని అజిత్ పవార్ అన్నారు. అదేవిధంగా ‘ప్రధాని మోదీ భారత దేశానికి వికాస్ పురుష్. ఈ లోక్‌సభ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. బారామతి గత 15ఏళ్లగా ఎటువంటి నిధులు పొందలేదు. కానీ, ప్రస్తుతం 2499 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు నిధలు అనుమతులు పొందాయి’ అని అజిత్ పవార్ వెల్లడించారు. ఇక.. ఇటీవల సుప్రియా సూలేకు మద్దతుగా ఓ ర్యాలీలో పాల్గొన్న రోహిత్ ప్రవార్ ప్రసంగిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘‘పార్టీ రెండుగా చీలినప్పుడు నేను పార్టీ కార్యకర్తలతో కలిసి శరద్ పవార్‌ను కలిశాను. మేము, కుటుంబం అండగా ఉంటామని తెలిపాను’’ అని ఒకింత భావోద్వేగంతో మాట్లాడారు. -
బీజేపీ కూటమి.. ఆ ఆరు స్థానాల్లో ఎవరు?
లోక్‌సభ ఎన్నికల మొదటిదశ పోలింగ్ మరో నాలుగు రోజులున్నా.. ఇంకా మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో మరో ఆరు సీట్ల అభ్యర్థుల కేటాయింపు పెండింగ్‌లో ఉంది. ఆ ఆరు కీలక స్థానాల్లో మహాయుతి కూటమి పొత్తులో భాగంగా ఏ పార్టీకి ఏ సీట్లు ఇవ్వాలో నిర్ణయం తీసుకోలేకపోతోందని పార్టీల్లో తీవ్ర చర్చ జరగుతోంది. ఇవే ఆ ఆరు స్థానాలు.. దక్షిణ ముంబై, థానే, పాల్ఘర్, రత్నగిరి-సింధుదుర్గ్ సీటు, నాసిక్ ఔరంగాబాద్. నాసిక్ సీటులో ఎన్సీపీ( అజిత్ పవార్) పార్టీ తరఫున మాజీ మంత్రి ఛగన్ భుజబల్‌ను ప్రతిపాధించగా.. సీఎం ఏక్నాథ్ షిండే(శివసేన) ఆ స్థానాన్ని వదులకోవడానికి సిద్ధం లేనట్టు తెలుస్తోంది. నాసిక్ స్థానం శిశసేన సిట్టంగ్ స్థానం. అక్కడ ఎంపీగా హేమంత్ గాడ్సే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఔరంగాబాద్ నుంచి బీజేపీ ఎంపీ పార్లమెంట్లో అడుగుపెడతారని ఇటీవల కేంద్రహోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. సీఎం ఏక్నాథ్ షిండే సోమవారం పార్టీ కార్యకర్తల మీటింగ్ మాట్లాడుతూ.. ఔరంగాబాద్ నుంచి శివసేన అభ్యర్థి బరిలోకి దిగుతారని వ్యాఖ్యానించటం గమనార్హం. థానే, రత్నగిరి-సింద్‌దుర్గ్ రెండు స్థానాల్లో బీజేపీనే పోటీ చేయాలని భావించినప్పటికీ.. తర్వాత తన ఆలోచనను విరమించుకొని థానే సీటును శివసేన( షిండే)కు కేటాయించడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ ఉమ్మడి శివసేన అభ్యర్థిగా 2019లో రాజన్ విచారే గెలుపొందారు. శివసేన పార్టీ చీలిన తర్వాత ఆయన ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో ఉన్నారు. అయితే శివసేనకు కంచుకోట అయిన థానే స్థానాన్ని షిండే వదలుకుకోవడాని సిద్ధంగా లేరని సమాచారం. అయితే థానేకు బదులు రత్నగిరి-సింద్దుర్గ్ను శివసేన బీజేపీకి ఇవ్వడానికి ఆసక్తి చూపుతోంది. ఇక ఈ స్థానంలో బీజేపీ నారాయణ రాణేను బరిలోకి దించాలని యోచిస్తోంది. పాల్ఘర్ స్థానం బీజేపీ దక్కే అవకాశం ఉంది. 2019లో శివసేన గెలిచే వరకు పాల్ఘర్ బీజేపీ పట్టున్న స్థానం. ఇప్పటికే పలు స్థానాలను వదులుకున్న శవసేన.. సౌత్ ముంబై స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధం లేదు. సీఎం షిండే శివసేన మొదట్లో ముంబైలో మొత్తం 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినప్పటికీ అందులో ఇద్దరిని మార్పు చేశారు. నాలుగురికి టికెట్ తిరస్కరించింది. సీట్ల విషయంలో శివసేన ఒత్తిడిలో ఉన్నట్లు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శివసేనకు బలం ఉన్న ముంబై, ఇతర సీట్లను వదులుకోవడాని సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈసారి సౌత్ ముంబై, థానే, రత్నగిరి సింద్‌దుర్గ్, నాసిక్ స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు బీజేపీ భావిస్తోంది. అయితే శివసేన ఈ సీట్లను వదులుపోవడానికి సిద్ధంగా లేదు. ఒకట్రెండు రోజుల్లో ఈ సిట్లలో ఎవరికి దక్కుతాయో కొలిక్కి రానుంది. ఇక.. అజిత్ పవార్ ఎన్సీపీ ఆశిస్తున్న నాసిక్ సీటు సైతం షిండే(శివసేన) దక్కించుకోనున్నట్లు సమాచారం.థానే సీటును ఏక్నాథ్ షిండే దక్కించుకునే అవకాశం ఉందని.. రత్నగిరి-సింధుదుర్గ్ సీటు బీజేపీకి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. -
Lok Sabha polls 2024: గెలిస్తేనే నిలిచేది..!
ఈ లోక్‌సభ ఎన్నికలు మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టిలకు జీవన్మరణ పరీక్షగా మారాయి. రాజకీయ కురువృద్ధుడు ఎన్సీపీ (ఎస్సీపీ) అధినేత శరద్ పవార్, చీలిక వర్గం చీఫ్, ఆయన అన్న కుమారుడు అజిత్ పవార్, బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే, శివసేన చీఫ్, సీఎం ఏక్నాథ్ షిండే... ఈ నలుగురూ గెలుపు కోసం అన్ని అ్రస్తాలనూ ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా శరద్ పవార్, ఉద్ధవ్ ఎన్నికలయ్యేదాకా ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితులు కూడా లేవంటే అతిశయోక్తి కాదు. శివసేనను షిండే, ఎన్సీపీని అజిత్ చీల్చి వేరుకుంపటి పెట్టుకోవడం తెలిసిందే. వాటినే అసలైన శివసేన, ఎన్సీపీగా మహారాష్ట్ర స్పీకర్‌తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్, శరద్ పవార్ అధికారంలో భాగస్వాములుగా లేరు. పైగా మహావికాస్ అఘాడీ కూటమి పొత్తులో భాగంగా కొన్ని స్థానాలకే పోటీ చేస్తున్నారు. కనుక గణనీయమైన సీట్లు సాధిస్తే తప్ప వారి రాజకీయ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరిలో శరద్ పవార్ 50 ఏళ్లలో ఒక్క ఓటమీ ఎదుర్కోని నేత కాగా, ఉద్ధవ్ ఠాక్రే ఒక్కసారీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపడని నేత కావడం విశేషం! ఠాక్రే... వీలైనన్ని చోట్ల పోటీ 2019లో బీజేపీతో పొత్తులో భాగంగా శివసేన 23 స్థానాల్లో పోటీ చేసి 18 గెలుచుకుంది. తర్వాత పార్టీని షిండే చీల్చడంతో ఉద్ధవ్ రాజకీయ భవితవ్యమే అనిశి్చతిలో పడింది. ఈసారి సాధ్యమైనన్ని స్థానాల్లో పోటీ చేసి సత్తా చాటే క్రమంలో 21 స్థానాలకు ఆయన అభ్యర్థులను ప్రకటించేశారు. ఈ ఏడాది చివర్లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వరకైనా ఉద్ధవ్ తన కేడర్‌ను కాపాడుకోవాలంటే కనీసం ఆరేడు లోక్‌సభ స్థానాలు గెలిచి తీరాలని రాజకీయ విశ్లేషకుడు అకోల్కర్ విశ్లేషించారు. బారామతిలో ఎవరిదో పరపతి! శరద్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ 10 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. వాటిలో బారామతి పవార్‌కు కీలకమైనది. అక్కడ 3సార్లుగా ఎంపీగా గెలుస్తు న్న పవార్ కుమార్తె సుప్రియా సులే ఈ విడత అజిత్ పవార్ భార్య సునేత్ర గట్టి సవాలు విసురుతున్నారు. ‘‘బారామతిలో సుప్రి య ఓడితే పవార్ అంతా కోల్పోయినట్టే. అలా చూస్తే ఈ యుద్ధం శరద్, అజిత్ మధ్యే!’’ అని పరిశీలకులు అంటున్నారు. ఓట్ల చీలిక.. సీఎంగా ఉండగా ఇల్లు కదల్లేదన్న విమర్శలు మూటగట్టుకున్న ఉద్ధవ్ ఇప్పుడు పార్టీని బతికించుకునేందుకు రాష్ట్రమంతా చుడుతున్నారు. ఆయన ర్యాలీలకు మంచి స్పందనే వస్తోంది. శరద్ పవార్ ఉన్నచోటి నుంచే చక్రం తిప్పుతున్నారు. బారామతిలో కుమార్తె గెలుపు కోసం పుణె జిల్లాలో పూర్వపు ప్రత్యర్థులైన కాంగ్రెస్ నేతల మద్దతుకూ ప్రయత్నిస్తున్నారు. అంబేడ్కర్ మన వడైన ప్రకాశ్ అంబేడ్కర్ ఆధ్వర్యంలోని వంచిత్ బహుజన్ అఘాడి (వీబీఏ)తో ఎంవీఏ కూటమి సీట్ల పంపకం చర్చలు విఫలమయ్యాయి. దాంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఇది అధికార కూటమికి అనుకూలిస్తుందంటున్నారు. కేడర్, ఓటర్ ఎటువైపు శరద్ పవార్, ఉద్దవ్లకు ఈ ఎన్నికలు గట్టి పరీక్షేనని సీనియర్ జర్నలిస్ట్ అభయ్ దేశ్‌పాండే అన్నారు. అయితే పార్టిలు చీలినా సంప్రదాయ ఓటర్లు, కేడర్ మద్దతు వావైపేనని అభిప్రాయపడ్డారు. ‘‘పైగా బీజేపీ కేడర్‌లోనూ అశాంతి నెలకొని ఉంది. కనుక వాళ్లు అజిత్, షిండే అభ్యర్థుల విజయానికి మనస్ఫూర్తిగా పనిచేస్తారా అన్నది అనుమానమే’’ అని ఆయన సందేహం వెలిబుచ్చారు. 2019 ఎన్నికల్లో బీజేపీ–శివసేన 41 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నాయి. వాటిని నిలుపుకోవడం వాటికి ప్రతిష్టాత్మకమని, ఆ లెక్కన ఈ ఎన్నికలు అధికార బీజేపీ–షిండే–అజిత్ కూటమికే అసలైన పరీక్ష అని ఉద్దవ్, శరద్ పవార్ వర్గీయులు వాదిస్తున్నారు. – ముంబై -
బీజేపీ కూటమిలో అజిత్ పవార్ పార్టీకి 6 సీట్లు.. కానీ షరతు ఇదే!
ముంబై: మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ తమ సీట్ల షేరింగ్ ఒప్పందంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి ఆరు సీట్లను ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి కాషాయ పార్టీ ఓ షరతు పెట్టినట్లు చెబుతున్నారు. రెండు స్థానాల్లో బీజేపీ తమ అభ్యర్థులను ఎన్సీపీ ఎన్నికల గుర్తు కింద, ఒక ఎన్సీపీ అభ్యర్థిని బీజేపీ గుర్తు కింద పోటీ చేయించాలని ప్రతిపాదించినట్లుగా హిందుస్థాన్ టైమ్స్ నివేదిక పేర్కొంది. ఈ పరిణామం ఎన్సీపీలో అసంతృప్తిని రేకెత్తించింది. దీంతో మహాయుతి కూటమిలో మరోసారి సీట్ల కేటాయింపుపై చర్చలు అపరిష్కృతంగా మారాయి. కనీసం 9 సీట్లు కోరుతున్న పవార్ అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీసీ కనీసం తొమ్మిది లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని భావించింది. దీంతో బీజేపీ పెట్టిన నిబంధనలను అంగీకరించడానికి ఆ పార్టీ నాయకత్వం వెనుకాడుతోంది. అందుకే అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం జరుగుతోందని ఎన్సీపీ నేతలు పేర్కొంటున్నారు. మహారాష్ట్రలో ఈసారి లోక్‌సభ ఎన్నికలు ఐదు దశల్లో ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20 తేదీల్లో జరగనున్నాయి. జూన్ 1న ఓట్ల లెక్కింపు జరగనుంది. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. -
ఎన్సీపీ నేత ప్రఫుల్‌పటేల్‌కు సీబీఐ క్లీన్చిట్.. అందుకేనా ?
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన విమానాల లీజు వ్యవహారంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని సీబీఐ తాజాగా క్లీన్ చిట్ ఇచ్చింది. ఢిల్లీలో ఈ కేసు విచారణ జరుగుతున్న కోర్టులో సీబీఐ ఈ మేరకు దర్యాప్తు క్లోజర్ రిపోర్టు దాఖలు చేసింది. యూపీఏ హయంలో ప్రఫుల్ విమానయాన శాఖ మంత్రిగా ఉన్నపుడు ఎయిర్ ఇండియా విమానాల లీజులో అవినీతి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని క్లోజర్ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. ఈ క్లోజర్ రిపోర్టును విచారించి కేసును మూసివేసే అంశంలో నిర్ణయం తీసుకునేందుకుగాను ఏప్రిల్ 15న హాజరుకావాలని కేసు దర్యాప్తు అధికారికి కోర్టు నోటీసులు జారీ చేసింది. శరద్‌పవార్ అధ్యక్షుడిగా ఉన్న ఎన్సీపీని ఆయన మేనల్లుడు అజిత్‌పవార్ చీల్చి మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా చేరిన విషయం తెలిసిందే. సరిగ్గా ఇది జరిగిన 8 నెలల తర్వాత ఎన్సీపీ ముఖ్య నేత ప్రఫుల్‌పటేల్‌కు సీబీఐ క్లీన్చిట్ ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది. అవసరం లేకున్నా ఎయిర్ఇండియా కోసం అత్యంత ఎక్కువ ఖర్చుతో విమానాలు లీజుకు తీసుకున్నారన్న ఆరోపణలపై ప్రఫుల్‌పటేల్ మీద 2017లో సీబీఐ కేసు నమోదు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేసింది. ఇదీ చదవండి.. బీజేపీకి అర్థం కావడం లేదు.. చిదంబరం -
వారి పేరు, ఫొటోలు వాడకండి.. అజిత్ పవార్ వర్గానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు
రాజకీయ ప్రయోజనాల కోసం పేరు, ఫోటోలను దుర్వినియోగం చేస్తున్నారంటూ.. శరద్ పవార్ వర్గం దాఖలు చేసిన పిటిషన్‌పై అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. శరద్ పవార్ పేరు, చిత్రాలను ఉపయోగించబోమని హామీ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ స్థాపించిన ఎన్సీపీ గత ఏడాది జూలైలో అజిత్ పవార్.. ఆయనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు ఏకనాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన తర్వాత చీలిపోయింది. ప్రత్యేకంగా పార్టీ ఉన్నప్పుడు శరద్ పవార్ ఫొటోను ఎందుకు వినియోగిస్తున్నారని అజిత్ వర్గాన్ని కోర్టు ప్రశ్నించింది. మీరు సొంత పార్టీ గుర్తింపుతో ముందుకు వెళ్ళాలి అని సుప్రీంకోర్టు అజిత్ వర్గానికి సూచించింది. అజిత్ పవర్ వర్గం తరఫున సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ వాదనలు వినిపిస్తూ.. పార్టీ శరద్ పవార్ పేరును ఉపయోగించడం లేదని, కొందరు గుర్తు తెలియని కార్యకర్తలే ఈ పనులు చేస్తున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో కార్యకర్తలను నిలువరించడం సాధ్యం కాదని అజిత్ వర్గం పేర్కొన్నారు. అజిత్ వర్గం వాదనలు విన్న తరువాత.. మీ కార్యకర్తలను అదుపులో ఉంచుకోవాల్సిన బాధ్యత మీదే అంటూ కోర్టు స్పష్టం చేసింది. రెండు పార్టీలుగా విడిపోయిన తరువాత తప్పకుండా కొన్ని రూల్స్ పాటించాల్సిన అవసరం చాలా ఉందని వెల్లడించారు. శరద్ పవార్ వర్గం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టులు వాదనలు వినిపిస్తూ.. అజిత్ వర్గం ఎన్సీపీ ఎన్నికల గుర్తు గడియారాన్ని ఉపయోగిస్తుందని తెలిపారు. ఆ గుర్తుకు శరద్ పవార్‌కు ఉన్న రాజకీయ బంధం గురించి అందరికి తెలుసని అన్నారు. -
ఇప్పటివరకూ సలహాలే.. ఇకపై.. లోక్‌సభ బరిలో డిప్యూటీ సీఎం సతీమణి
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) సతీమణి సునేత్ర పవార్‌ను బారామతి లోక్‌సభ స్థానం నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) బరిలో నిలిపింది. పార్టీ ఆమెను అభ్యర్థిగా ప్రకటించిన తరువాత నిర్వహించిన కార్యక్రమంలో సునేత్ర పవార్ మాట్లాడుతూ ప్రజల మద్దతు కోరారు. "మీరు ( బారామతి లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు ) మాకు మద్దతు ఇస్తే, మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం" అని సునేత్ర అన్నారు. తన భర్త అజిత్ పవార్ చేసిన అభివృద్ధి పనులను ప్రస్తావించారు. వాటి పట్ల గర్వపడుతున్నట్లు చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తానూ తన వంతు ప్రయత్నం చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు "దాదా" ( అజిత్ పవార్‌ను మద్దతుదారులు ఇలా పిలుస్తారు) ప్రజల కోసం పనిచేస్తున్నారని, ఆయనకు ప్రజల సమస్యలు తెలియజేయడం వరకే తన పాత్ర ఉండేదని ఆమె చెప్పారు. "నా పేరు బారామతికి అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో మీరు మాకు అవకాశం ఇస్తే, మేమిద్దరం ( అజిత్ పవార్, సునేత్ర పవార్ ) మీ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం" అన్నారు. ఆడపడుచు స్థానంలోకి అన్న భార్య.. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ కార్యకర్తలు, మద్దతుదారులతో సమావేశమవుతుండటంతో సునేత్రా పవార్ అభ్యర్థిత్వంపై గత కొన్ని వారాలుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా, లోక్‌సభ ఎన్నికలకు అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మొదటి అభ్యర్థి సునేత్రా పవార్ . బారామతి సీటు ప్రస్తుతం అజిత్ పవార్ సోదరి, శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుప్రియా సూలే (Supriya Sule) చేతిలో ఉంది. సూలే 2009 నుండి బారామతి ఎంపీగా ఉన్నారు. శరద్ పవార్ 1996 నుండి 2009 వరకు ఆ స్థానాన్ని పవార్ కుటుంబానికి బలమైన కోటగా పరిగణించారు. -
Maharashtra Politics: సుప్రీంకు వెళతాం: శరద్ పవార్
బారామతి(మహారాష్ట్ర): నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం అన్యాయపూరితమని ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ శనివారం పేర్కొన్నారు. దీనిపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సారథ్యంలోని చీలికవర్గమే అసలైన ఎన్సీపీ అని, పార్టీ పేరు, ఎన్నికల గుర్తును కూడా అజిత్ పవార్ వర్గానికే కేటాయిస్తూ ఈసీతోపాటు స్పీకర్ నర్వేకర్ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
శరద్ పవార్‌కు మరో షాక్.. ‘అజిత్‌దే నిజమైన ఎన్సీపీ’: మహారాష్ట్ర స్పీకర్
సాక్షి, ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) వివాదంలో రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్‌కి మరోసారి షాక్ తగిలింది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీనే నిజమైన పార్టీ అని మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ స్పష్టం చేశారు. ఎన్సీపీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యే అజిత్ పవార్ వెంటే ఉన్నారని.. ఆయన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేమని పేర్కొన్నారు. ‘అజిత్ పవార్ వర్గం ఎన్సీపీనే నిజమైన పార్టీ. అసెంబ్లీలో మొత్తం 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉండగా.. అజిత్ పవార్‌కు 41 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. శరద్ పవార్ వర్గానికి 12 మంది ఎమ్మెల్యేల వర్గం ఉంది. మెజార్టీ ఎమ్మెల్యేలు అజిత్ వెంటే ఉన్నందున ఆయన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేము’ అని తెలిపారు. చదవండి: టీఎంసీకి షాక్.. ఎంపీ సభ్యత్వానికి మిమీ చక్రవర్తి రాజీనామా కాగా శరద్ పవార్ ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ తిరుగుబాటు చేసి 2023 జూలైలో బీజేపీ-శివసేన (షిండే వర్గం) ప్రభుత్వంలో చేరడంతో ఇరు నాయకుల మధ్య వివాదం రాజుకుంది. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. ముఖ్యంగా పార్టీ ఎవరిది, ఏ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారనే రెండు అంశాలపై రెండు వర్గాల మధ్య చిచ్చు నెలకొంది. అయితే ఇటీవల అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గాన్ని 'అసలైన రాజకీయ పార్టీ'గా ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే.. దీంతో పార్టీ పేరు, గడియారం గుర్తు అజిత్‌కే దక్కింది. ఎన్నికల కమిషన్ నిర్ణయం అనంతరం శరద్ పవార్ నేతృత్వంలోని వర్గానికి 'నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ - శరద్ చంద్ర పవార్' అనే కొత్త పేరు వచ్చింది. -
శరద్ పవార్‌కు బిగ్ షాక్
ఢిల్లీ, సాక్షి: లోక్‌సభ ఎన్నికల వేళ.. రాజకీయ దిగ్గజం శరద్ పవార్‌కు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీ(NCP)గా గుర్తిస్తూ.. గడియారం గుర్తును ఆ వర్గానికే కేటాయించింది. ఎస్పీపీ ఎవరిదనే విషయంలో గత కొంతకాలంగా ఆ పార్టీ చీలిక వర్గాలు కుమ్ములాడుకుంటున్నాయి. ఈ క్రమంలో పార్టీ చిహ్నం, ఎన్నికల గుర్తును అజిత్ వర్గం దక్కించుకుంది. ఎన్సీపీ తరఫున నెగ్గిన ఎమ్మెల్యేలు అత్యధికంగా అజిత్ పవార్ వైపే ఉండడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తన వర్గానికి ఓ పేరును ఎంచుకోవాలని ఈసీ శరద్ పవార్‌ను కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 7వ తేదీన(రేపు) ఈసీ ముందుకు శరద్ పవార్ వర్గం.. పార్టీ పేరు, గుర్తు అభ్యర్థనతో వెళ్లనుంది. ఆ వెంటనే ఈసీ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. గతేడాది ఎన్సీపీ నుంచి చీలిపోయి మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి షిండే-బీజేపీ సర్కారుకు మద్దతు పలికిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలూ మంత్రులయ్యారు. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. ఎన్సీపీకి మొత్తంగా 53మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అజత్ వర్గం చీలిక తర్వాత శరద్ పవార్ ఆ పార్టీపై క్రమంగా నియంత్రణ కోల్పోతూ వచ్చారు. ప్రస్తుతం ఆయనకు 12మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నట్లు సమాచారం. పవార్ నాయకత్వంలో ఎన్సీపీ నావ జాతీయ వాదం, గాంధీ సెక్యులరిజం సిద్దాంతాలతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ NCP పుట్టుకొచ్చింది. 1999 మే 20న.. సోనియా గాంధీ నాయకత్వాన్ని ‘ఇటలీ’ మార్క్‌ను చూపిస్తూ తీవ్రంగా వ్యతిరేకించింది కాంగ్రెస్‌లోని వర్గం. దీంతో శరద్ పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది కాంగ్రెస్. అయితే నెల తిరగక ముందే జూన్ 10వ తేదీన.. ఆ ముగ్గురి ఆధ్వర్యంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఆవిర్భవించింది. పార్టీ గుర్తు మూడు రంగుల మధ్యలో గడియారం సింబల్. పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన శరద్ పవార్ నాటి నుంచి పార్టీ జాతీయాధ్యక్షుడిగా కొనసాగుతూ వచ్చారు. ఏక పక్షంగా! ఆయన నియామకం జరుగుతూ వస్తోంది. అయితే.. ఏ సోనియా గాంధీని అయితే వ్యతిరేకిస్తూ ఎన్సీపీ పుట్టిందో.. ఆ తర్వాతి సంవత్సరాల్లో ఆమె అధినేత్రిగా వ్యవహరించిన యూపీఏ కూటమి ప్రభుత్వంతో మిత్రపక్షంగా కొనసాగడం గమనార్హం. -
‘రామ మందిరం: రాజీవ్‌గాంధీ హయాంలోనే వేడుక జరిగింది’
అయోద్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దేశంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు రామాలయ ప్రారంభోత్సవ కమిటీ ఆహ్వాన ప్రతికలు అందజేస్తోంది. ఇక..ఈ కార్యక్రమంపై పలువురు రాజకీయ నాయకులు బీజేపీ రామ మందిర ప్రారంభోత్సవాన్ని రాజకీయం చేస్తోదని రాబోయే లోక్‌సభ ఎన్నికలకు పావుగా వాడుకుంటోందని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పింస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ రామ మందిర ప్రారంభోత్సవం విషయంలో మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్పై తీరుపై విమర్శలు చేశారు. వాస్తవానికి అయోధ్యలో రామ మందిర ఏర్పాటుకు మాజీ, దివంగత ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ హయాంలోనే కీలకమైన ‘శిలాన్యాస్’ (శిలాఫలకం శంకుస్థాపన) చేసి వేడుక జరిపారని గుర్తు చేశారు. శరద్ పవార్ కర్ణాటకలోని నిపాణిలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మంగళవారం మాట్లాడారు. రామ మందర విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కేవలం రాజకీయం కోసమే చాలా హడావుడీ చేస్తున్నాయని మండిపడ్డారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే ‘శిలాన్యాస్’ (శిలాఫలకం శంకుస్థాపన) వేడుక చేశారని తెలిపారు. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ మాత్రం రాముడి పేరుతో రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయోద్యలో బలరాముడి ప్రాణప్రతిష్టను పురస్కరించుకొని 11 రోజులు ఉపవాసం ఉంటున్న విషయం తెలిసిందే. దానిపై కూడా సీనియర్ నేత శరద్ పవార్ స్పందిస్తూ.. రాముడిపై భక్తి, విశ్వాసం ఉండటాన్ని తాను గౌరవిస్తాన్నానని తెలిపారు. కానీ.. దేశంలో పేదరికం నిర్మూలించబడాలని ఉపవాసం చేస్తే దేశ ప్రజలు సైతం ప్రశంసిస్తారని హితవు పలికారు. చదవండి: అటల్ సేతుపై ఆటో రిక్షా.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు! -
Maratha reservation: మరాఠాల ఆందోళన హింసాత్మకం
ముంబై: మహారాష్ట్రలో ప్రత్యేక కోటా డిమాండ్‌తో మరాఠాలు చేపట్టిన ఆందోళన మళ్లీ హింసాత్మక రూపం దాల్చింది. ఆందోళనకారులు సోమవారం బీడ్ జిల్లా మజల్‌గావ్‌లోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఎమ్మెల్యేలు ప్రకాశ్ సోలంకె, సందీప్ క్షీరసాగర్ ఇళ్లకు నిప్పు పెట్టారు. మజల్గావ్ మున్సిపల్ కౌన్సిల్ భవనంలోని మొదటి అంతస్తులో ఫర్నిచర్‌కు నిప్పుపెట్టి, విధ్వంసం సృష్టించారు. ఛత్రపతి శంభాజీ జిల్లా గంగాపూర్‌లో నిరసనకారులు బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత్ బంబ్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కిటికీలు, ఫర్నిచర్ పగులగొట్టారు. పలు చోట్ల రహదారులపై బైటాయించారు. మరాఠాలకు ప్రత్యేక కోటా డిమాండ్‌కు మద్దతుగా సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన నాశిక్, హింగోలి ఎంపీలు హేమంత్ గాడ్సే, హేమంత్ పాటిల్‌లు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘మరాఠాలకు రిజర్వేషన్లు అక్టోబర్ 24 నుంచి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి 40 రోజుల డెడ్‌లైన్ పెట్టిన వారు ఈ వ్యవహారం చిన్న పిల్లల ఆట అనుకుంటున్నారు’అంటూ ఎమ్మెల్యే సోలంకె చేసిన వ్యాఖ్యల ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మరాఠాలకు రిజర్వేషన్ల డిమాండ్‌తో మనోజ్ జరంగె అనే వ్యక్తి అక్టోబర్ 25 నుంచి జల్నా జిల్లాలోని అంతర్వలి సరటి గ్రామంలో నిరశన దీక్షకు సాగిస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యే సోలంకె..కనీసం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేయని వ్యక్తి, ఇప్పుడు నాయకుడా..అంటూ వ్యాఖ్యానిస్తున్నట్లుగా ఆ ఆడియోలో ఉంది. దీంతో మరాఠా సంఘాలు భగ్గుమన్నాయి. సోమవారం స్థానికంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. కొందరు ఆందోళనకారులు సోమవారం మధ్యాహ్నం మజల్‌గావ్‌లోని ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టారు. ఆయన నివాసానికి, కారుకు నిప్పుపెట్టారు, రాళ్లు రువ్వారు. ఘటన సమయంలో ఆ ఇంట్లోనే ఉన్నట్లు ఎమ్మెల్యే సోలంకె ఆ తర్వాత తెలిపారు. బీడ్ నగరంలో మరో ఎన్సీపీ ఎమ్మెల్యే సందీప్ క్షీరసాగర్ నివాసం, ఆఫీసుకు కూడా నిప్పు పెట్టారు. పోలీసులు అక్కడికి చేరుకున్న గుంపును చెదరగొట్టారు. బీడ్‌లోని ఒక హోటల్‌కు మరాఠా నిరసనకారులు అగ్నికి ఆహుతి చేశారు. జల్నా వద్ద ముంబైకి వెళ్లే సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వేపై బైటాయించారు. షోలాపూర్–అక్కల్కోట్ హైవేపై మండుతున్న టైర్లను వేసి వాహనాలను అడ్డుకున్నారు. కొందరు నిరసనకారులు కర్రలు పట్టుకుని గంగాపూర్‌లోని ఎమ్మెల్యే ప్రశాంత్ కార్యాలయంపై దాడి చేశారు. యావత్మాల్లో తనను ఆందోళనకారులు అడ్డగించి, రిజర్వేషన్ అంశంపై నిలదీశారని హింగోలి ఎంపీ హేమంత్ పాటిల్ తెలిపారు. దీంతో, రాజీనామా పత్రం రాశానన్నారు. తన రాజీనామా లేఖ అందినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి రసీదు వచ్చిందని చెప్పారు. రిజర్వేషన్లపై వైఖరి తెలపాలంటూ నాశిక్ ఎంపీ గాడ్సేను కొందరు నిలదీయడంతో ఆయన రాజీనామా చేసి లేఖను సీఎంకు పంపించారు. -
ఖర్గే, రాహుల్ గాం«దీతో శరద్ పవార్ భేటీ
న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాం«దీతో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వారు చర్చించుకున్నారు. విపక్ష ‘ఇండియా’ కూటమి తదుపరి కార్యాచరణపై అభిప్రాయాలు పంచుకున్నారు. దాదాపు 40 నిమిషాలపాటు ఈ సమావేశం జరిగింది. ఇండియా కూటమి చివరి సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ముంబైలో జరిగింది. త్వరలోనే కూటమి నేతలంతా మరోసారి భేటీ కావాలని పవర్, ఖర్గే, రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.