బలపరీక్షలో నెగ్గాక అసెంబ్లీలో పార్టీ ఎమ్మెల్యేలతో కలసి సీఎం ఉద్ధవ్ ఠాక్రే విజయనాదం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వం లోని ‘మహా వికాస్ ఆఘాడి’ విశ్వాస పరీక్షలో నెగ్గింది. శనివారం జరిగిన ప్రత్యేక భేటీలో శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం సభ విశ్వాసం పొందింది. 288 మంది సభ్యులున్న అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 145 కాగా 169 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు పలికారు.
కాషాయ తలపాగాతో ఉద్ధవ్
రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాలకు సీఎం ఉద్ధవ్‌తోపాటు సేన ఎమ్మెల్యేలంతా కాషాయ రంగు తలపాగా ధరించి సభకు వచ్చారు. ఉద్ధవ్ వెనుక ఆయన కొడుకు, ఆదిత్య ఠాక్రే మిగతా సేన ఎమ్మెల్యేలతోపాటు కూర్చున్నారు. ముందుగా ప్రొటెం స్పీకర్ కొలాంబ్కర్‌ను తొలగించి ఎన్సీపీకి చెందిన వల్సే పటిల్‌ను అధికార పక్షం ఎన్నుకుంది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సభలో విశ్వాస పరీక్ష కార్యక్రమం మొదలైంది. పరీక్షలో నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించగానే ఉద్ధవ్ లేచి సభ్యులకు, రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
బీజేపీ వాకౌట్
ఠాక్రే ప్రభుత్వంపై కాంగ్రెస్‌కు చెందిన మాజీ సీఎం అశోక్ చవాన్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానాన్ని సీనియర్ ఎన్సీపీ, సేన సభ్యులు బలపరిచారు. బీజేపీకి చెందిన 105 మంది సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయగా వేర్వేరు పార్టీలకు నలుగురు ఎమ్మెల్యేలు తటస్థంగా దూరంగా ఉన్నారని ప్రొటెం స్పీకర్ దిలీప్ వల్సే సభలో ప్రకటించారు. అనంతరం సభలో ఉన్న సభ్యులను లెక్కించి ఉద్ధవ్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు. ప్రభుత్వానికి 169 మంది అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. మద్దతు తెలిపిన ఎమ్మెల్యేల్లో.. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44, బహుజన్ వికాస్ ఆఘాడి 3, సమాజ్‌వాదీ పార్టీ 2, స్వాభిమాని శేట్కారి పార్టీ 1, శేత్కరి కామ్‌గార్ పార్టీ 1, క్రాంతికారి శేత్కరీ పార్టీ 1, ఇతరులు, స్వతంత్రులు ఏడుగురు ఉన్నారు. ఏఐఎంఐఎంకు చెందిన ఇద్దరు, సీపీఎంకు చెందిన ఒకరు, రాజ్ ఠాక్రే పార్టీ మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్)ఎమ్మెల్యే తటస్థంగా ఉన్నారు.
రాజ్యాంగ ఉల్లంఘనే: బీజేపీ
అంతకుముందు అసెంబ్లీలో సంభవించిన పరిణామాలు రాజ్యాంగ విరుద్ధమంటూ బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. ప్రొటెం స్పీకర్‌గా ఉన్న బీజేపీకి చెందిన కాళిదాస్ కొలాంబ్కర్ స్థానంలో ఎన్సీపీ నేత దిలీప్ వల్సే పాటిల్‌ను నియమించడంపై బీజేపీ శాసనసభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ అభ్యంతరం తెలిపారు.
అలాగైతే పార్లమెంట్ సగం ఖాళీ: ఎన్సీపీ
నిర్ణీత ఫార్మాట్ ప్రకారం అధికార పక్షం సభ్యులు ప్రమాణ స్వీకారం చేయలేదన్న శివసేన ఆరోపణలపై ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ స్పందించారు. ‘పార్లమెంట్‌లో బీజేపీ సభ్యులు కూడా ఫార్మాట్‌ను పట్టించుకోకుండా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రకాంత్ పాటిల్ చెబుతున్న నియమాన్ని వారికి కూడా వర్తింపజేస్తే లోక్‌సభ సగం ఖాళీ అవుతుంది’అని పేర్కొన్నారు. అధికార కూటమి తరఫున నానా పటోలే, బీజేపీ నుంచి కిసాన్ కతోరే స్పీకర్ పదవికి పోటీ చేయనున్నారు.
అసెంబ్లీలో బలాబలాలు..
మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 మంది సభ్యుల్లో అతిపెద్ద పార్టీ బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 మంది సభ్యుల బలముంది. నవంబర్ 28వ తేదీన శివాజీ పార్క్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎంగా ఉద్ధవ్, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల నుంచి ఇద్దరేసి చొప్పున మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment