faith test
-
కమల్‌ను కాపాడిన ‘కరోనా’
భోపాల్/న్యూఢిల్లీ: మధ్య ప్రదేశ్ రాజకీయాల్లో సోమవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కరోనా వైరస్ కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాత్కాలికంగా ఆదుకుంది. విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని గవర్నర్ లాల్జీ టాండన్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను ఆదేశించిన నేపథ్యంలో.. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే సభను మార్చి 26 వరకు వాయిదా వేస్తూ స్పీకర్ ప్రజాపతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అంతకుముందు, కోవిడ్–19ను ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్వవ్యాప్త మహమ్మారిగా నిర్ధారించిందని, ఆ వైరస్ వ్యాప్తిని నిరోధించే లక్ష్యంతో.. రాజస్తాన్, కేరళ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేశారని మంత్రి గోవింద్ సింగ్ స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు, మంగళవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని ఆదేశిస్తూ గవర్నర్ టాండన్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు సోమవారం మరో లేఖ రాశారు. విశ్వాస పరీక్ష జరపనట్లయితే.. ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినట్లు భావించాల్సి వస్తుందన్నారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడడంతో బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కమల్‌నాథ్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని, తక్షణమే బల నిరూపణకు ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది. నిమిషం పాటే గవర్నర్ ప్రసంగం: బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ సభను ఉద్దేశించి ఇచ్చే ప్రసంగం సోమవారం మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఒక్క నిమిషం పాటే కొనసాగింది. అధికార, విపక్ష సభ్యుల నినాదాలు, వాగ్వివాదాల గందరగోళం మధ్య ఒక నిమిషంలోనే గవర్నర్ లాల్జీ టాండన్ తన ప్రసంగాన్ని ముగించి, వెళ్లిపోయారు. ఆ తరువాత, సోమవారమే బల నిరూపణ జరగాలని బీజేపీ చీఫ్ విప్ నరోత్తమ్ మిశ్రా, సభలో విపక్ష నేత గోపాల భార్గవ డిమాండ్ చేశారు. అనంతరం, గందరగోళం మధ్యనే కరోనా వైరస్ ముప్పును శాసనసభ వ్యవహారాల మంత్రి గోవింద్ సింగ్ స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. దాంతో సభను 26 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గవర్నర్ వద్దకు బీజేపీ నేతలు: ఆ తరువాత, శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో 106 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ నివాసానికి వెళ్లి, తక్షణమే విశ్వాస పరీక్ష జరగాలని ఆదేశించాలని అభ్యర్థించారు. మరోవైపు, కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పోలీసుల సాయంతో కర్నాటకలో బీజేపీ నిర్బంధించిందని, ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాస పరీక్ష రాజ్యాంగవిరుద్ధం అవుతుందని కమల్‌నాథ్ గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. -
నేడు ‘బల నిరూపణ’ ఉంటుందా?
భోపాల్: రాజకీయ సంక్షోభం నెలకొన్న మధ్యప్రదేశ్‌లో నేటి(సోమవారం) నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. సభను ఉద్దేశించి ఉదయం తాను ప్రసంగించిన అనంతరం విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గవర్నర్ లాల్జీ టాండన్ శనివారం రాత్రి ఆదేశించారు. ‘నా ప్రసంగం ముగియగానే, విశ్వాస పరీక్ష ప్రక్రియను ప్రారంభించాలి. ఎట్టి పరిస్థితుల్లో మార్చి 16న అది జరగాలి. వాయిదా వేయకూడదు’ అని ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు పంపిన లేఖలో ఆయన విస్పష్టంగా పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోవడంపై తన నిర్ణయం సోమవారం ప్రకటిస్తానని స్పీకర్ ఎన్పీ ప్రజాపతి వెల్లడించారు. దాంతో సోమవారం విశ్వాస పరీక్ష జరుగుతుందా? అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 22 మంది రాజీనామా చేయడం, దాంతో మిగిలిన ఎమ్మెల్యేలను రాజస్తాన్ రాజధాని జైపూర్‌కు కాంగ్రెస్ తరలించడం తెలిసిందే. వారంతా బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేం దుకు వీలుగా ఆదివారం తిరిగివచ్చారు. వారిని ఇళ్లకు పంపిం చకుండా, భోపాల్‌లోని ఒక హోటల్‌కు తరలించారు. రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురి రాజీనామాలను మాత్రమే స్పీకర్ ఆమోదించారు. కాగా, సభ్యులంతా హాజరై, పార్టీ నిర్ణయం మేరకు ఓటేయాలని కాంగ్రెస్, బీజేపీ విప్ జారీ చేశాయి. కాగా, విశ్వాస పరీక్షకు సంబంధించిన విషయం అసెంబ్లీ సెక్రటేరియట్ ఆదివారం రాత్రి విడుదల చేసిన ‘సభాకార్యక్రమాల జాబితా’లో లేకపోవడం గమనార్హం. గవర్నర్ ప్రసంగం, ఆ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశాలే అందులో ఉన్నాయి. ఈ రోజు డౌటే..: సోమవారం ముఖ్యమంత్రి కమల్‌నాథ్ విశ్వాస పరీక్షను ఎదుర్కోకపోవచ్చని తెలుస్తోంది. సోమవారం బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించినప్పటికీ.. తుది నిర్ణయాధికారం స్పీకర్‌కే ఉంటుందని రాష్ట్ర మంత్రి పీసీ శర్మ పేర్కొన్నారు. అయితే, ముందుగా ఎమ్మెల్యేలందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు జరపాలన్నారు. ఈ బల నిరూపణ సోమవారం జరగదని, ఈ అంశం కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు సంకేతాలిచ్చారు. మరోవైపు, గవర్నర్ ప్రసంగం పూర్తి కాగానే, విశ్వాస పరీక్ష జరపాలని డిమాండ్ చేస్తూ, సభాకార్యక్రమాలను బీజేపీ అడ్డుకునే అవకాశముంది. విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని ఆదేశిస్తూ సీఎం కమల్‌నాథ్‌కు గవర్నర్ టాండన్ రాసిన లేఖలో.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో మాత్రమే బల నిరూపణ జరగాలని ఆదేశించారు. అసెంబ్లీలో 228 మంది సభ్యులుండగా, ఆరుగురి రాజీనామాలు ఆమోదం పొందడంతో అది 222కి చేరింది. మిగతా 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలూ ఆమోదం పొందితే ఆ సంఖ్య 206కి చేరుతుంది. అప్పుడు మెజారిటీకి అవసరమైన మ్యాజిక్ నంబర్ 104 అవుతుంది. బీజేపీకి 107 మంది ఎమ్మెల్యేలున్నారు. రాజీనామాలకు ముందు సభలో కాంగ్రెస్ బలం 114. అందరి రాజీనామాలు ఆమోదం పొందితే అది 92కి చేరుతుంది. అలాగే, నలుగురు స్వతంత్ర, ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యే ఎటువైపు నిలుస్తారన్నదీ ప్రశ్నార్థకమే. గుజరాత్ లో కాంగ్రెస్‌కు షాక్ అహ్మదాబాద్: రాజ్యసభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు గుజరాత్లో షాక్ తగిలింది. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆ రాజీనామాలను ఆమోదించినట్లు స్పీకర్ త్రివేదీ తెలిపారు. దీంతో సభలో కాంగ్రెస్ బలం 73నుంచి 69కి చేరింది. కాగా, రాజ్యసభ ఎన్నికల్లో తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెట్టే అవకాశముందనే భయంతో కాంగ్రెస్ 14 మంది ఎమ్మెల్యేలను జైపూర్‌కు తరలించింది. గుజరాత్ నుంచి బీజేపీ ముగ్గురు అభ్యర్థులను రాజ్యసభ బరిలో నిలిపింది. అయితే, వారిలో ఇద్దరిని మాత్రమే బీజేపీ గెలిపించుకోగలదు. -
విశ్వాసం పొందిన ఉద్ధవ్
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వం లోని ‘మహా వికాస్ ఆఘాడి’ విశ్వాస పరీక్షలో నెగ్గింది. శనివారం జరిగిన ప్రత్యేక భేటీలో శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం సభ విశ్వాసం పొందింది. 288 మంది సభ్యులున్న అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 145 కాగా 169 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు పలికారు. కాషాయ తలపాగాతో ఉద్ధవ్ రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాలకు సీఎం ఉద్ధవ్‌తోపాటు సేన ఎమ్మెల్యేలంతా కాషాయ రంగు తలపాగా ధరించి సభకు వచ్చారు. ఉద్ధవ్ వెనుక ఆయన కొడుకు, ఆదిత్య ఠాక్రే మిగతా సేన ఎమ్మెల్యేలతోపాటు కూర్చున్నారు. ముందుగా ప్రొటెం స్పీకర్ కొలాంబ్కర్‌ను తొలగించి ఎన్సీపీకి చెందిన వల్సే పటిల్‌ను అధికార పక్షం ఎన్నుకుంది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సభలో విశ్వాస పరీక్ష కార్యక్రమం మొదలైంది. పరీక్షలో నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించగానే ఉద్ధవ్ లేచి సభ్యులకు, రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ వాకౌట్ ఠాక్రే ప్రభుత్వంపై కాంగ్రెస్‌కు చెందిన మాజీ సీఎం అశోక్ చవాన్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానాన్ని సీనియర్ ఎన్సీపీ, సేన సభ్యులు బలపరిచారు. బీజేపీకి చెందిన 105 మంది సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయగా వేర్వేరు పార్టీలకు నలుగురు ఎమ్మెల్యేలు తటస్థంగా దూరంగా ఉన్నారని ప్రొటెం స్పీకర్ దిలీప్ వల్సే సభలో ప్రకటించారు. అనంతరం సభలో ఉన్న సభ్యులను లెక్కించి ఉద్ధవ్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు. ప్రభుత్వానికి 169 మంది అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. మద్దతు తెలిపిన ఎమ్మెల్యేల్లో.. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44, బహుజన్ వికాస్ ఆఘాడి 3, సమాజ్‌వాదీ పార్టీ 2, స్వాభిమాని శేట్కారి పార్టీ 1, శేత్కరి కామ్‌గార్ పార్టీ 1, క్రాంతికారి శేత్కరీ పార్టీ 1, ఇతరులు, స్వతంత్రులు ఏడుగురు ఉన్నారు. ఏఐఎంఐఎంకు చెందిన ఇద్దరు, సీపీఎంకు చెందిన ఒకరు, రాజ్ ఠాక్రే పార్టీ మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్)ఎమ్మెల్యే తటస్థంగా ఉన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనే: బీజేపీ అంతకుముందు అసెంబ్లీలో సంభవించిన పరిణామాలు రాజ్యాంగ విరుద్ధమంటూ బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. ప్రొటెం స్పీకర్‌గా ఉన్న బీజేపీకి చెందిన కాళిదాస్ కొలాంబ్కర్ స్థానంలో ఎన్సీపీ నేత దిలీప్ వల్సే పాటిల్‌ను నియమించడంపై బీజేపీ శాసనసభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ అభ్యంతరం తెలిపారు. అలాగైతే పార్లమెంట్ సగం ఖాళీ: ఎన్సీపీ నిర్ణీత ఫార్మాట్ ప్రకారం అధికార పక్షం సభ్యులు ప్రమాణ స్వీకారం చేయలేదన్న శివసేన ఆరోపణలపై ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ స్పందించారు. ‘పార్లమెంట్లో బీజేపీ సభ్యులు కూడా ఫార్మాట్‌ను పట్టించుకోకుండా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రకాంత్ పాటిల్ చెబుతున్న నియమాన్ని వారికి కూడా వర్తింపజేస్తే లోక్‌సభ సగం ఖాళీ అవుతుంది’అని పేర్కొన్నారు. అధికార కూటమి తరఫున నానా పటోలే, బీజేపీ నుంచి కిసాన్ కతోరే స్పీకర్ పదవికి పోటీ చేయనున్నారు. అసెంబ్లీలో బలాబలాలు.. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 మంది సభ్యుల్లో అతిపెద్ద పార్టీ బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 మంది సభ్యుల బలముంది. నవంబర్ 28వ తేదీన శివాజీ పార్క్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎంగా ఉద్ధవ్, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల నుంచి ఇద్దరేసి చొప్పున మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. -
మా బలం 162
సాక్షి, ముంబై: ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్ గ్రాండ్ హయత్ సోమవారం శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి బలప్రదర్శనకు వేదికైంది. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రభుత్వం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కోవడంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చే రోజుకు ఒక రోజు ముందు.. సోమవారం సాయంత్రం మూడు పార్టీల ‘మహా వికాస్ అఘాడీ’ తమ ఎమ్మెల్యేలతో గ్రాండ్ హయత్ హోటల్లో పరేడ్ నిర్వహించింది. 162 మంది ఎమ్మెల్యేలు తమతో ఉన్నారని, ఇది గవర్నర్ కోశ్యారీ చూస్తున్నారనే భావిస్తున్నామని వ్యాఖ్యానించింది. శివసేనకు చెందిన 56, ఎన్సీపీకి చెందిన 51, కాంగ్రెస్‌కు చెందిన 44, మిత్రపక్షాలు, ఇతరులు 11 మంది.. మొత్తం 162 మంది ఎమ్మెల్యేలు తమవైపు ఉన్నారని తెలిపింది. దేశవ్యాప్తంగా ఆసక్తి సృష్టించిన ఈ ‘మహా పరేడ్’లో శివసేన నేతలు ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్, ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నుంచి ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్, ఛగన్ భుజ్‌బల్, జయంత్ పాటిల్, సునీల్ తట్కరే, సుప్రియా సూలే, కాంగ్రెస్ నేతలు ఖర్గే, అశోక్ చవాన్, ఆయా పార్టీల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వారితో పాటు సమాజ్‌వాదీ నేత అబూ ఆజ్మీ, ‘స్వాభిమాని షెట్కారీ సంఘటన్’ చీఫ్ రాజు శెట్టి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో ‘ఎలాంటి ప్రలోభాలకు లొంగబోమని, తమ పార్టీ నేతల ఆదేశానుసారమే నడుచుకుంటామని’ ప్రతిజ్ఞ చేయించారు. ఎమ్మెల్యేలతో పాటు నేతలు సైతం ప్రతిజ్ఞ చేశారు. పరేడ్ సందర్భంగా ఎమ్మెల్యేలను ఉద్దేశించి శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులు ప్రసంగించారు. అంతకుముందు, ఈ మూడు పార్టీల నేతలు గవర్నర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. తమకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుందని, తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. సభ్యత్వంపై నాదీ భరోసా ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్ పవార్ కనుక, బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయాలంటూ ఆయన జారీ చేసే విప్‌ను ధిక్కరిస్తే శాసనసభ సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుందనే భయాలు అక్కర్లేదని, ఎన్సీపీ ఎమ్మెల్యేల సభ్యత్వానికి తనదే బాధ్యత అని శరద్ పవార్ హామీ ఇచ్చారు. విప్‌ను ధిక్కరిస్తే సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుందంటూ తమ ఎమ్మెల్యేలను బీజేపీ భయాందోళనలకు గురి చేస్తోందని పవార్ విమర్శించారు. ‘రాజ్యాంగ, న్యాయ నిపుణులను సంప్రదించాను. గతంలో జరిగిన ఇలాంటి ఘటనలను పరిశీలించాను. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా అజిత్ పవార్‌ను తొలగించాం. కాబట్టి, పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అధికారం తనకు లేదు. జారీ చేసినా ఆ విప్ చెల్లదు’ అని పవార్ ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పారు. ‘భయం, ఆందోళన వద్దు. మీ సభ్యత్వానికి నాదీ భరోసా. అక్రమంగా అధికారంలోకి వచ్చినవారిని గద్దె దింపాల్సిన సమయం వచ్చింది’ అన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై శరద్ పవార్ నిప్పులు చెరిగారు. ‘అక్రమంగా, మెజారిటీ లేకున్నా అధికారంలోకి రావడానికి ఇది గోవా కాదు.. మహారాష్ట్ర. ఈ విషయం బీజేపీ పెద్దలు గుర్తుంచుకోవాలి’ అని మండిపడ్డారు. కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ మాట్లాడుతూ.. ఇక్కడున్న 162 మంది ఎమ్మెల్యేలే కాదు.. తమ వెనుక ఇంకా ఎక్కువ మంది శాసన సభ్యులే ఉన్నారన్నారు. ‘కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటాం. బీజేపీని అడ్డుకునే దిశగా ఈ అవకాశం మాకు కల్పించిన మా పార్టీ చీఫ్ సోనియాకు కృతజ్ఞతలు’ అన్నారు. నేరస్తుల్లా పరేడ్: బీజేపీ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి నిర్వహించిన బల ప్రదర్శనపై బీజేపీ మండిపడింది. నేరస్తుల తరహాలో పరేడ్ నిర్వహించి, దేశం ముందు మహారాష్ట్ర పరువు తీశారని బీజేపీ నేత ఆశిశ్ షెలార్ విమర్శించారు. పరేడ్‌లో 162 కాదు.. 145 మంది కూడా లేరని వ్యాఖ్యానించారు. దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ల నేతృత్వంతో రాష్ట్రంలో అయిదేళ్ల పాటు సుస్థిర పాలన కొనసాగుతుందన్నారు. అయితే, ఈ పరేడ్‌కు 137 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారని సమాచారం. అడ్డు తొలగండి – ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అడ్డు తొలగాలని బీజేపీని ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. ‘మళ్లీ వస్తాను’ అనే ఫడ్నవీస్ ఎన్నికల ప్రచార నినాదాన్ని ఎద్దేవా చేస్తూ.. ‘మేం ఆల్రెడీ వచ్చేశాం’ అని ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. అధికారం కోసం బీజేపీ అత్యంత హేయంగా వ్యవహరిస్తోందన్నారు. మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించాక సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన చెక్కుపై తొలి సంతకం చేస్తున్న ఫడ్నవీస్ -
విశ్వాస పరీక్షపై స్టే
► తమిళనాడు ‘రాజకీయం’పై మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ► 18 నియోజకవర్గాల్లో ఉపఎన్నికల నోటిఫికేషన్ వద్దని ఆదేశం ► అనర్హతపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్షపై విధించిన స్టే తదుపరి ఆదేశాలిచ్చేంతవరకు కొనసాగుతుందని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలుగా తమపై అనర్హత వేయటాన్ని కొట్టివేయాలంటూ 18 మంది దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే తదుపరి విచారణను అక్టోబర్ 4కు వాయిదావేసింది. అనర్హత వేటు వేసిన ఎమ్మెల్యేల స్థానాలను ఖాళీగా ప్రకటించి వాటిలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలు లేదంటూ న్యాయమూర్తి జస్టిస్ ఎం దురైస్వామి బుధవారం ఆదేశించారు. తమిళనాడు ప్రభుత్వం, పార్టీలో నెలకొన్న పరిణామాలపై వేసిన మూడు పిటిషన్లు, డీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గుట్కా ప్యాకెట్లు ప్రదర్శించటంతో స్పీకర్ జారీచేసిన సభాహక్కుల ఉల్లంఘన నోటీసు పిటిషన్లను ఒకదానితో మరొకటి ముడిపడి ఉండటంతో అన్ని పిటిషన్లను న్యాయమూర్తి ఒకేసారి విచారించారు. ‘18 అసెంబ్లీ స్థానాలను ఖాళీగా ప్రకటించి ఆ నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేయ వద్దు. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంతవరకు దీనిపై నిర్ణయం తీసుకోవద్దు’ అని న్యాయమూర్తి ఆదేశించారు. వాడి వేడిగా వాదనలు: దినకరన్ వర్గం ఎమ్మెల్యే వెట్రివేల్ తరఫున కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షుడు దుశ్యంత్ దవే.. అవిశ్వాస తీర్మానానికి అనుమతించాలని కోరుతూ డీఎంకే వేసిన పిటిషన్‌పై కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ వంటి ప్రముఖులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేలు తమకు తాముగా పార్టీ నుంచి తప్పుకుంటే వారి సభ్యత్వం రద్దవుతుందని.. తద్వారా వారు అనర్హులవుతారన్నారు. కానీ ఈ కేసులో అనర్హత వేటు పడినవారెవరూ.. పార్టీ నుంచి బయటకు వెళ్లలేదని దుశ్యంత్ గుర్తుచేశారు. ఈ వాదనను స్పీకర్ తరఫు న్యాయవాది సుందరం తోసిపుచ్చారు. ఒకవేళ ప్రభుత్వం ఈ 18 సీట్లను ఖాళీగా గుర్తించి.. కోర్టు తీర్పు వచ్చేలోపే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తే పరిస్థితేంటని దుశ్యంత్ ప్రశ్నించారు. ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలైతే కోర్టు జోక్యం చేసుకోలేదన్నారు. ఇదిలా ఉండగా, పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలను ఎమ్మెల్యేలతో కలసి వెళ్లి బెంగళూరు జైల్లో శశికళకు వివరించేందుకు దినకరన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ములాఖత్ కింద ఒకేసారి 21 మంది కలుసుకోవాలంటే హోం శాఖ నుంచి అనుమతి కావాలని జైలు అధికారులు చెప్పడంతో దినకరన్ విరమించుకున్నారు. -
తమిళ తక్కెడ