ఢిల్లీ, సాక్షి: లోక్‌సభ ఎన్నికల వేళ.. రాజకీయ దిగ్గజం శరద్ పవార్‌కు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీ(NCP)గా గుర్తిస్తూ.. గడియారం గుర్తును ఆ వర్గానికే కేటాయించింది. ఎస్పీపీ ఎవరిదనే విషయంలో గత కొంతకాలంగా ఆ పార్టీ చీలిక వర్గాలు కుమ్ములాడుకుంటున్నాయి.
ఈ క్రమంలో పార్టీ చిహ్నం, ఎన్నికల గుర్తును అజిత్ వర్గం దక్కించుకుంది. ఎన్సీపీ తరఫున నెగ్గిన ఎమ్మెల్యేలు అత్యధికంగా అజిత్ పవార్ వైపే ఉండడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తన వర్గానికి ఓ పేరును ఎంచుకోవాలని ఈసీ శరద్ పవార్‌ను కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 7వ తేదీన(రేపు) ఈసీ ముందుకు శరద్ పవార్ వర్గం.. పార్టీ పేరు, గుర్తు అభ్యర్థనతో వెళ్లనుంది. ఆ వెంటనే ఈసీ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
గతేడాది ఎన్సీపీ నుంచి చీలిపోయి మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి షిండే-బీజేపీ సర్కారుకు మద్దతు పలికిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలూ మంత్రులయ్యారు. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది.
ఎన్సీపీకి మొత్తంగా 53మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అజత్ వర్గం చీలిక తర్వాత శరద్ పవార్ ఆ పార్టీపై క్రమంగా నియంత్రణ కోల్పోతూ వచ్చారు. ప్రస్తుతం ఆయనకు 12మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నట్లు సమాచారం.
పవార్ నాయకత్వంలో ఎన్సీపీ నావ
జాతీయ వాదం, గాంధీ సెక్యులరిజం సిద్దాంతాలతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ NCP పుట్టుకొచ్చింది. 1999 మే 20న.. సోనియా గాంధీ నాయకత్వాన్ని ‘ఇటలీ’ మార్క్‌ను చూపిస్తూ తీవ్రంగా వ్యతిరేకించింది కాంగ్రెస్‌లోని వర్గం. దీంతో శరద్ పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది కాంగ్రెస్. అయితే నెల తిరగక ముందే జూన్ 10వ తేదీన.. ఆ ముగ్గురి ఆధ్వర్యంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఆవిర్భవించింది. పార్టీ గుర్తు మూడు రంగుల మధ్యలో గడియారం సింబల్. పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన శరద్ పవార్ నాటి నుంచి పార్టీ జాతీయాధ్యక్షుడిగా కొనసాగుతూ వచ్చారు. ఏక పక్షంగా! ఆయన నియామకం జరుగుతూ వస్తోంది. అయితే.. ఏ సోనియా గాంధీని అయితే వ్యతిరేకిస్తూ ఎన్‌సీపీ పుట్టిందో.. ఆ తర్వాతి సంవత్సరాల్లో ఆమె అధినేత్రిగా వ్యవహరించిన యూపీఏ కూటమి ప్రభుత్వంతో మిత్రపక్షంగా కొనసాగడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment