సాక్షి, ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) వివాదంలో రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్‌కి మరోసారి షాక్ తగిలింది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీనే నిజమైన పార్టీ అని మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ స్పష్టం చేశారు. ఎన్సీపీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యే అజిత్ పవార్ వెంటే ఉన్నారని.. ఆయన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేమని పేర్కొన్నారు.
‘అజిత్ పవార్ వర్గం ఎన్సీపీనే నిజమైన పార్టీ. అసెంబ్లీలో మొత్తం 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉండగా.. అజిత్ పవార్‌కు 41 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. శరద్ పవార్ వర్గానికి 12 మంది ఎమ్మెల్యేల వర్గం ఉంది. మెజార్టీ ఎమ్మెల్యేలు అజిత్ వెంటే ఉన్నందున ఆయన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేము’ అని తెలిపారు.
చదవండి: టీఎంసీకి షాక్.. ఎంపీ సభ్యత్వానికి మిమీ చక్రవర్తి రాజీనామా
కాగా శరద్ పవార్ ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ తిరుగుబాటు చేసి 2023 జూలైలో బీజేపీ-శివసేన (షిండే వర్గం) ప్రభుత్వంలో చేరడంతో ఇరు నాయకుల మధ్య వివాదం రాజుకుంది. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. ముఖ్యంగా పార్టీ ఎవరిది, ఏ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారనే రెండు అంశాలపై రెండు వర్గాల మధ్య చిచ్చు నెలకొంది.
అయితే ఇటీవల అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గాన్ని 'అసలైన రాజకీయ పార్టీ'గా ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే.. దీంతో పార్టీ పేరు, గడియారం గుర్తు అజిత్‌కే దక్కింది. ఎన్నికల కమిషన్ నిర్ణయం అనంతరం శరద్ పవార్ నేతృత్వంలోని వర్గానికి 'నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ - శరద్ చంద్ర పవార్' అనే కొత్త పేరు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment