
అజిత్ పవార్ నేతృత్వంలోని రెబల్ గ్రూప్ ఎమ్మెల్యేలు.. ఆశ్చర్యకరరీతిలో ఎస్పీపీ చీఫ్ శరద్ పవార్‌ను కలిసి ఆశ్వీర్వాదం తీసుకోవడంతో మహా రాజకీయాలు మరేదైనా మలుపు తిరుగుతాయా? అనే ఆసక్తిని రేకెత్తించింది. అయితే.. ఈలోపు ఆ సస్పెన్స్‌కు తెర దించారు శరద్ పవార్.
ఎట్టి పరిస్థితుల్లో తాను బీజేపీకి మద్దతు ఇవ్వబోనని.. ప్రగతిశీల రాజకీయాలే తమ ఎజెండా అని స్పష్టం చేశారాయన. ఈ మేరకు ముంబై వైబీ చవన్ సెంటర్‌లో జరిగిన ఎన్సీపీ యువ కార్యకర్తల సమావేశాల ఆయన ఈ ప్రకటన చేశారు.
జులై 2వ తేదీన షిండే శివసేన-బీజేపీ కూటమి ప్రభుత్వానికి అనూహ్యంగా మద్దతు ప్రకటించి.. ఎన్సీపీ సంక్షోభానికి తెర తీసింది అజిత్ పవార్ నేతృత్వంలోని రెబల్ గ్రూప్. అప్పటి నుంచి శరద్ పవార్ ఎన్సీపీ వర్సెస్ అజిత్ పవార్ ఎన్సీపీగా మాటల యుద్ధం నడుస్తోంది.
ఈ క్రమంలో.. సంక్షోభం మొదలైన రెండువారాల తర్వాత హఠాత్తుగా ఆదివారం రెబల్ గ్రూప్, శరద్‌పవార్‌ను కలిసింది. చాలాసేపు భేటీ తర్వాత తాము పవార్ ఆశీస్సుల కోసం వచ్చామని.. జరిగింది మరిచిపోయి తమతో పొత్తు దిశగా అడుగువేయమని కోరామని రెబల్ గ్రూప్ మీడియాకు వివరించింది. అయితే ఆ భేటీలో తన స్పందన తెలపని శరద్ పవార్.. ఆ తర్వాత యువ కార్యకర్తల సమావేశంలో మాత్రం తన అభిప్రాయాన్ని ఖుల్లాగా వ్యక్తం చేశారు.
విపక్ష సమావేశానికి గైర్హాజరు
ఇదిలా ఉంటే.. బెంగళూరు వేదికగా జరగబోయే విపక్షాల సమావేశానికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. పవార్ స్థానంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే హజరు కానున్నారు. అయితే రెండవ రోజు అంటే రేపు మంగళవారం జరగబోయే భేటీకి మాత్రం పవార్ హాజరు కావొచ్చని తెలుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మొత్తం 24 పార్టీలు ఈ కూటమి భేటీలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment