ముంబై: మహారాష్ట్రలో రాజకీయంగా రసవత్తరంగా మారింది. ఇప్పటికే పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్న ఎన్సీపీలో తాజాగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీజేపీ చేరాలని కొంతమంది శ్రేయోభిలాషులు తనను ఒప్పించే ప్రయత్నం చేశారని అన్నారు. ఇదే సమయంలో బీజేపీతో ఎన్సీపీ చేతులు కలిపే ప్రసక్తేలేదని పవార్ కుండబద్దలు కొట్టారు.
అయితే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఎన్సీపీ అధినేత శరత్ పవార్‌ను కలవడంతో రాజకీయంగా చర్చకు దారితీసింది. కాగా, శరద్ పవార్ సోలాపూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజిత్ పవార్‌తో భేటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో శరద్ పవార్ మాట్లాడుతూ.. ‘అజిత్ నా సోదరుడి కుమారుడు. అతడిని కలవడంలో తప్పేముంది?. ఒక ఇంట్లోని సీనియర్ వ్యక్తి.. తన కుటుంబంలోని మరో వ్యక్తిని కలవాలని కోరుకుంటే.. దాంతో ఎటువంటి సమస్య ఉండకూడదు’ అని అన్నారు.
ఇదే సమయంలో ఎన్సీపీలోని కొందరు నేతలు బీజేపీతో చేతులు కలిపారు. కానీ, మా వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. బీజేపీతో కలవాలని కొందరు నన్ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీతో కలిసే ప్రసక్తి లేదు. మా పార్టీ బీజేపీతో ఎప్పటికీ జతకట్టదు. బీజేపీతో ఎలాంటి అనుబంధమైనా.. అది ఎన్సీపీ రాజకీయ విధానానికి సరిపోదు. ఈ విషయంపై ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా ఇది అందరికీ స్పష్టం చేస్తున్నా అంటూ కామెంట్స్ చేశారు.
మరోవైపు.. ఈ నెలాఖరున మహా వికాస్ అఘాడీ నేతృత్వంలో ఇండియా కూటమి ముంబైలో సమావేశం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కూటమిని ఇరుకున పెట్టే విధంగా ఏదో ఒక మార్పు చేయాలని అజిత్ పవార్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇటీవల జయంత్ పాటిల్ కూడా ఎన్డీయేలో కలిసిపోతారనే పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: కిసాన్ మోర్చా మహిళా నేత ఆత్మహత్య.. బీజేపీ కీలక నిర్ణయం..
Comments
Please login to add a commentAdd a comment