
‘నేను పార్టీ నుంచి ఏం కోరుకున్నాను.. గౌరవం, మర్యాద కోరుకున్నాను. కానీ నాకు అవి అక్కడ దొరకలేదు. పార్టీ నుంచి ఏమీ ఆశించలేదు. చాలా అవమానించారు. మానసికంగా చాలా హింసించారు. నా బద్ధ శత్రువుకు కూడా ఇటువంటి రోజు రాకూడదు’. ఇవి ఒకనాడు రాజ్ ఠాక్రే చెప్పిన మాటలు. 20 ఏళ్ల క్రితం రాజ్ ఠాక్రే ప్రెస్ కాన్పరెన్స్ లో చెప్పిన మాటలు. శివసేన నుంచి బయటకొచ్చి ఎమ్మెన్నెస్ పార్టీ పెట్టడానికి ముందు అన్న మాటలు. 2005, డిసంబర్ 18వ తేదీన మీడియా సాక్షిగా రాజ్ ఠాక్రే అన్న మాటలివి. ఆ రోజు ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం. బాలాసాహెబ్ ఠాక్రే కలలో కూడా ఊహించని పరిణామం.
2005లో శివసేన నుంచి బయటకొచ్చిన రాజ్ ఠాక్రే.. మూడు నెలల వ్యవధిలోనే ఎమ్మెన్నెస్ పార్టీ స్థాపించారు. అప్పట్నుంచి ఇప్పటివరకూ శివసేనతో ఎటువంటి సంబంధాలు కొనసాగించలేదు. ‘మీరు వేరు- మేము వేరు’ అన్నట్లుగానే సాగింది ఈ ఇరు పార్టీల వైరం. కానీ ఇప్పుడు శివసేనతో కలవడానికి ఆసక్తి చూపిస్తున్న సమయంలో ఆనాడు రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి.
ప్రత్యేకంగా ఉద్ధవ్ ఠాక్రే కారణంగానే ఆనాడు తాను బయటకొచ్చానని రాజ్ ఠాక్రే పరోక్షంగా చెప్పారు. పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత శివసేన వ్యవస్థాపకులు బాలాసాహెబ్ ఠాక్రేతో రాజ్ ఠాక్రే జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఫలితంగా ఎమ్మెన్నెస్ అవతరించింది. ఇన్నాళ్లకు శివసేనతో మళ్లీ జట్టు కట్టాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టాడు. మహారాష్ట్ర ప్రజల ఆశయం కోసం ముఖ్యంగా మరాఠీల రక్షణ కోసం తాము కలిసి అడుగేయాలని తాజాగా రాజ్ ఠాక్రే స్పష్టం చేశారు. దీనికి శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ కూడా సానుకూలంగా స్పందించడంతో వారి బంధం రెండు దశాబ్దాల తర్వాత పట్టాలెక్కడానికి తొలి అడుగు పడింది.
ఇదీ చదవండి: