ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విదర్భలోని సీట్ల విషయంలో కాంగ్రెస్, మిత్రపక్షం శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. విదర్భలో శివసేన (యూబీటీ) 17 సీట్లను కోరుతోంది. అయితే అన్ని సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఆసక్తి చూపించటం లేదు. విదర్భలో కాంగ్రెస్ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసోంది. ఇక.. ముంబై, నాసిక్‌లలో సీట్ల విషయంలో ఇప్పటికే ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.
విదర్భలో మొత్తం 62 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 288 మంది సభ్యుల అసెంబ్లీలో విదర్భ 22 శాతం స్థానాలకు ప్రాతినిధ్యం విశేషం. ఇక్కడ మెజారిటీని సాధించటం అన్ని పార్టీలకు చాలా కీలకం. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో విదర్భలోని 10 లోక్‌సభ స్థానాలకు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి ఏడింటిలో విజయం సాధించింది. కాంగ్రెస్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, ఐదు స్థానాలను గెలుచుకుంది. ఇక.. అధికా కూటమిలోని బీజేపీ సైతం రెండు స్థానాలు గెలుచుకుంది.
అయితే.. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన (యూబీటీ) 62 సీట్లలో కనీసం 8 సీట్లను కోరుతోంది. విదర్భలో కాంగ్రెస్‌కు బలమైన పునాది ఉందనటంలో ఎటువంటి సందేహం లేదని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ అన్నారు. అయితే తమకు కూడా 4-5 మంది ఎంపీలు కూడా ఉన్నారని గుర్తు చేశారు.
మరోవైపు.. మహా వికాస్ అఘాడిలో కూటమి నుంచి సేన (యూబీటీ) చీలిక సృష్టిస్తోందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. గత వారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రే సీట్ల పంపకానికి సహకరించడం లేదని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెలిపారు. అయితే ఇరు పార్టీల మధ్య విభేదాల వార్తలను కాంగ్రెస్ ఖండించింది. బీజేపీనే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించింది.
మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌కు చెందిన విజయ్ వాడెట్టివార్ మాట్లాడుతూ.. ‘‘ ఎంవీఏలో 17 సీట్లపై చర్చలు ఇంకా పెండింగ్‌లో ఉంది. కొన్ని సీట్లపై మాకు థాక్రే వర్గంతో వివాదం ఉంది. కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. సీట్ల పంపకం విషయంలో కూడా మూడు పార్టీలు సమయం తీసుకుంటాయి’ అని అన్నారు. ఇక.. అక్టోబర్ 22న కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా వస్తుందని తెలుస్తోంది. 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment