raj thackeray
-
ఎమ్మెన్నెస్ ‘పట్టాలు తప్పింది’
అసెంబ్లీ రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) ఘోర పరాజయం పాలైంది. ఒక్క సీటు కూడా రాకపోవడంతో పార్టీ గుర్తింపునకే ముప్పు ఏర్పడింది. మహా వికాస్ ఆఘాడి, మహాయుతి కూటములకు చెందిన వెన్నుపోటుదార్లకు (గద్దార్లకు) ఓటు వేయవద్దని, ఒకసారి తమ పార్టీకి అవకాశమిచ్చి చూడాలని ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఓటర్లు తిరస్కరించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరగ్గా, శనివారం ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలిచి రాష్ట్ర రాజకీయరంగంలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలన్న ఎమ్మెన్నెస్ చీఫ్ ఆశలు అడియాశలయ్యాయి. పార్టీ తరపున ఒక్క అభ్యర్థి కూడా గెలవకపోగా మొదటిసారిగా ఎన్నికల బరిలో దిగిన తన తనయుడు అమిత్ ఠాక్రేను కూడా గెలిపించుకోలేకపోయారు. దీంతో రాజ్ వైఖరి,ఆయన తనయుడు అమిత్ ఓటమిపై సోషల్ మీడియాలో వివిధ రకాల కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. పార్టీ గుర్తు రద్దయ్యే అవకాశం... దాదాపు 18 ఏళ్ల కిందట హిందూ హృదయ్ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి బయటకువచ్చిన రాజ్ ఠాక్రే 2006 మార్చి తొమ్మిదో తేదీన ఎమ్మెన్నెస్ పార్టీని స్ధాపించారు. ఆ తరువాత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి తమ పార్టీ తరఫున అభ్యర్ధులను బరిలోకి దింపారు. వీరిలో ఏకంగా 13 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని ప్రశంసలు అందుకున్నారు. ఆ సమయంలో ఎమ్మెన్నెస్‌కు 5.71 శాతం ఓట్లు పోలయ్యాయి. కానీ తరచూ పరాయిప్రాంతం వారిని ముఖ్యంగా ఉత్తరభారతీయులను లక్ష్యంగా చేసుకుని పదేపదే విమర్శించడంతో పార్టీ ప్రాబల్యం క్రమేపీ తగ్గుతూ వచ్చింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరంటే ఒక్కరే గెలవగా మొత్తంమీద 3.15 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆ తరువాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్ధితి పునరావృతమైంది. కేవలం 2.25 శాతం ఓట్లు పోలైనప్పటికీ కల్యాణ్ నియోజక వర్గం నుంచి రాజు పాటిల్ ఒక్కరే గెలవడంతో రాజ్ ఠాక్రే పరువు, పార్టీ ప్రతిష్ట నిలబడ్డాయి. కానీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజు పాటిల్ కూడా ఓటమిపాలయ్యారు.ముఖ్యంగా రాజ్ ఠాక్రేకు విశ్వాస పాత్రుడిగా పేరుగాంచిన బాలా నాంద్‌గావ్కర్ శివ్డీ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నాంద్‌గావ్కర్ గెలుపు కోసం ప్రచారం ముగింపు చివరి రోజున అంటే గత సోమవారం శివ్డీలో ప్రత్యేకంగా ఓ సభ కూడా నిర్వహించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో రాజ్ ఠాక్రేతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర మనస్ధాపానికి గురయ్యారు. ఇప్పుడు ఎమ్మెన్నెస్‌లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. అంతేగాకుండా ఈ ఎన్నికల్లో కనీసమాత్రం ఓట్లు కూడా రాకపోవడంతో పార్టీ మనుగడ ప్రమాదంలో పడే అవకాశముందని, అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం పార్టీ గుర్తును రద్దుచేసే అవకాశం కూడా ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మాటలకు ఓట్లు రాలవని... రాజ్ ఠాక్రే ముంబైసహా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సభ ఏర్పాటు చేసినా ఇసుకవేస్తే రాలనంతమంది ప్రజలు ఆ సభలకు హాజరవుతారు. ఆయన మాటతీరు, ప్రముఖ రాజకీయ నాయకుల మాటలను అనుకరించే (మిమిక్రీ) విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. దీంతో రాజ్ ప్రసంగం వినేందుకు ప్రజలు ఎంతగానో ఆసక్తి కనబరుస్తారు. అయితే మాటలకు ఓట్లు రాలవని ప్రతి ఎన్నికల్లో ఎమ్మెన్నెస్‌కు రుజువవుతూనే ఉంది. ఫలితంగా ఓటింగ్ శాతం నెమ్మదిగా దిగజారుతూ వచ్చింది. దీంతో ఈసారి ఎలాగైనా అధికసంఖ్యలో సీట్లను చేజిక్కించుకోవాలని భావించిన రాజ్‌ఠాక్రే గెలిచే అవకాశాలున్నాయని భావించిన 128 స్ధానాల్లో తమ అభ్యర్ధులను పోటీలో నిలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ అభ్యర్ధులకు మద్దతుగా ముమ్మరంగా ప్రచారం చేశారు. తమ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.చదవండి: మహారాష్ట్రలో సకుటుంబ సపరివార రాజకీయంఅధికారంలో లేకపోయినప్పటికీ పార్టీ తరపున గతంలో చేపట్టిన అనేక ఆందోళనల గురించి ప్రతీ సభలో వివరించారు. వీటినే ప్రధాన ప్రచార ఆ్రస్తాలుగా మలచుకున్నారు. టోల్ మాఫీ, రైల్వే ఉద్యోగాల భర్తీలో భూమిపుత్రులకు జరిగిన అన్యాయం, మసీదుల వద్దనున్న లౌడ్స్పీకర్లలోంచి పెద్ద శబ్దంతో వినిపించే నమాజ్‌కు వ్యతిరేకంగా హనుమాన్ చాలీసా వినిపించాలన్న ఆందోళన.. ఇలా అనేక కార్యక్రమాలను చేపట్టామని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదని తన ప్రసంగాల్లో వివరించారు. తాము అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మసీదులపై అక్రమంగా ఏర్పాటు చేసిన లౌడ్స్పీకర్లను తొలగిస్తామని, యువతకు ఉపాధి, ఉద్యోగవకాశాలు కల్పిస్తామని ఇలా అనేక హామీలిచ్చారు. కాని అవేమి ఓటర్లకు రుచించలేదని శనివారం వెలువడిన ఫలితాలను బట్టి స్పష్టమైంది. -
రాజ్‌ఠాక్రేపై ఏ ఫైల్ ఓపెన్ చేశారు: సంజయ్ రౌత్
ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌ఠాక్రేపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజ్ ఠాక్రేపై ఏదో ఫైల్ ఓపన్ చేశాని.. అందుకే ఒక్కసారిగా బీజేపీకి తన మద్దతు ప్రకటించారని సంజయ్ రౌత్ అన్నారు. ‘ఒక్కసారిగా ఏదో విచిత్రం జరిగింది. మేము ఈ విషయాన్ని రాజ్‌ఠాక్రేను అడగదలుచుకున్నాం. ఒక్కసారిగా మారిపోయి మహారాష్ట్ర శత్రువుల(ప్రత్యర్థుల)వైపు చేరి పూర్తి మద్దతు ఇస్తున్నారు. మీరు ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? ఇలా చేయటం వెనక ఉన్న బలమైన కారణం ఏంటీ? మీ మీద ఏ ఫైల్ ఓపెన్ చేశారు?’ అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు సోదరుడైన రాజ్ ఠాక్రే... తన పార్టీ బీజేపీ, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ (ఎన్సీపీ) కూటమికి సంపూర్ణ మద్దత ఇస్తుందని ప్రకటించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ ఠాక్రే.. తన పార్టీ కేవలం ప్రధాని నర్రేందమోదీ, ఎన్డీయే కూటమికే మాత్రమే మద్దతు ఇస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తనకు 1990 నుంచి బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. మొదటి నుంచి నరేంద్ర మోదీ.. ప్రధాని అవుతారన్న వారిలో తాను ఒకరినని చెప్పారు. ఇక.. ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన(యూబీటీ) ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం మహావికాస్ ఆఘాడీ కూటమి మధ్య సీట్లు పంపిణీ ఖరారైన విషయం తెలిసిందే. శివసేన (యూబీటీ)కి -21,కాంగ్రెస్- 17, ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్)-10 సీట్లుతో లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. -
రంజుగా మారిన రాజకీయం.. ప్రధాని మోదీకి ఎంఎన్ఎస్ భేషరతుగా మద్దతు
లోక్‌సభ ఎన్నికల తరుణంలో మహరాష్ట్ర రాజకీయం రంజుగా మారింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే ప్రధాని నరేంద్ర మోదీకి బేషరతుగా మద్దతు ప్రకటించారు. గత నెలలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఎంఎన్ఎస్ నేత రాజ్‌ఠాక్రే భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం రాజ్ థాకరే బీజేపీ, ఏక్నాథ్ షిండే - శివసేన, అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పక్షాల కూటమి ‘మహాయుతి’లో చేరవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌థాకరే కీలక ప్రకటన చేశారు. ముంబైలోని శివాజీ పార్క్ వద్ద గుడిపడ్వా వేడుకల్లో పాల్గొన్న రాజ్ థాకరే ప్రసంగిస్తూ లోక్‌సభ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ పోటీ చేయదని తెలిపారు. అయితే ఈ ఏడాది చివర్లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి మద్దతు కోరారు. నాకు పదవులొద్దు నాకు రాజ్యసభ, విధానసభ పదవులు వద్దని ఫడ్నవీస్‌తో చెప్పాను. అంతేకాదు నేను ఎటువంటి అంచనాలు, షరతులు లేకుండా ప్రధాని మోదీతో పాటు మహాయుతి కూటమికి మద్దతిస్తున్నానని రాజ్ థాకరే అన్నారు. కాగా, ఎంఎన్ఎస్ 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఒక్క స్థానంలో కూడా గెలువలేకపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అసలు బరిలో దిగలేదు. -
ఎన్డీఏలోకి రాజ్‌ఠాక్రే?
మహారాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరగబోతున్నాయి. ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ఎన్డీఏలో చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్ ఠాక్రే ఎన్డీయేలో చేరడంపై జరుగుతున్న చర్చలు చివరి దశలో ఉన్నాయని తెలుస్తోంది. దక్షిణ ముంబై సీటును ఎంఎన్ఎస్ అభ్యర్థికి కేటాయించాలని రాజ్ ఠాక్రే డిమాండ్ చేస్తున్నారని సమాచారం. ఈ సీటు నుంచి ఇప్పటికే బీజేపీ తరపున రాహుల్ నర్వేకర్ పేరు వినిపిస్తోంది. కాగా రాజ్ ఠాక్రే డిమాండ్‌పై బీజేపీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఈ సీటు కేటాయించిన తర్వాతనే రాజ్‌ఠాక్రే ఎన్డీఏలో చేరనున్నారనే వార్త వినిపిస్తోంది. తాజాగా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వర్గంతో బీజేపీకి ఒప్పందం ఏమీ లేదని అన్నారు. బీజేపీ, షిండే నేతృత్వంలోని శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్) కూటమి మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈసారి బీజేపీ సీట్ల రికార్డును బ్రేక్ చేస్తుందన్నారు. -
హిందువులు సహనశీలురు
ముంబై: ప్రముఖ కవి, గీత రచయిత జావెద్ అక్తర్(78) హిందూ సంస్కృతిపై ప్రశంసలు కురిపించారు. హిందువులు ఎంతో సహనశీలురని, వారి వల్లే మన దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తోందని చెప్పారు. అదే సమయంలో, నేడు దేశంలో వాక్ స్వాతంత్య్రం తగ్గిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ముంబైలో రాజ్ ఠాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) నిర్వహించిన దీపోత్సవ్‌లో ఆయన పాల్గొన్నారు. ‘హిందువులు దయామయులు. విశాల హృదయులు. అసహనం కలిగిన కొందరున్నారు. హిందువులు వారిలా ఉండరు. హిందువులకు మాత్రమే దయ, విశాల హృదయం అనే గొప్ప లక్షణాలుంటాయి. వాటిని కోల్పోవద్దు. లేకుంటే మిగతా వారికీ మీకూ బేధం ఉండదు. హిందువుల జీవన విధానం నుంచి మేం నేర్చుకున్నాం. వాటిని మీరు వదులుకుంటారా?’అని ఆయన ప్రశ్నించారు. ఇంకా ఆయన.. ‘శ్రీరాముడు, సీతాదేవిల గడ్డపై పుట్టినందుకు గర్విస్తున్నాను. నేను నాస్తికుడినే అయితే రాముడిని, సీతను ఈ దేశ సంపదగా భావిస్తాను. రామాయణం మన సాంస్కృతిక వారసత్వం’అంటూ జై సియా రాం అని నినదించారు. ‘ఇది హిందూ సంస్కృతి, నాగరికత. మనకు ప్రజాస్వామ్య దృక్పథాలను నేర్పింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. అందుకే మనమే ఒప్పు, అందరిదీ తప్పు అని భావించడం హిందువుల సిద్ధాంతం కాదు. ఇది మీకు ఎవరు నేర్పించినా తప్పే’అని అన్నారు. అయితే, దేశంలో నేడు వాక్ స్వాతంత్య్రం క్షీణిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. -
సోదరులిద్దరూ కలిసేనా? ఒకతాటిపైకి ఉద్ధవ్ ఠాక్రే.. రాజ్ ఠాక్రే!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (చీఫ్) రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఒకతాటిపైకి వస్తుండవచ్చనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తోంది. దివంగత బాల్ ఠా క్రే స్మారకం విషయంపై చర్చించేందుకు తన సోదరుడైన రాజ్‌ఠాక్రేకి ఫోన్ చేయాల్సి ఉందని ఇటీ వల ఓ ఇంటర్వ్యూలో ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. అయితే అది ఎప్పుడనేది మాత్రం స్పష్టం చేయలేదు. కాగా.. రాజ్–ఉద్ధవ్‌లు ఒకటయితే బాగుంటుందని ఇరు పార్టీల కార్యకర్తలు కొంత కాలంగా కోరుకుంటున్నా రు. అంతేగాకుండా ఇటీవల అక్కడక్కడా ఫ్లె క్సీలు, బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇద్దరు ఠాక్రేలు ఒకటైతే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఎవరు.. ఏ పార్టీలో ఉన్నారో? రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల ఊహించని మార్పులు జరుగుతున్నాయి. నాయకులు ఓ పార్టీ నుంచి బయటపడి ప్రత్యర్థి పారీ్టలో చేరడం, లేదంటే కొత్త పార్టీ ఏర్పాటు వంటివి చేస్తున్నారు. కూటములు ఏర్పడుతున్నాయి దీంతో ఎవరు, ఏ పారీ్టలో ఉన్నారో తెలియని గందరగోళ పరిస్ధితి నెలకొంది. గత సంవత్సరం ఏక్నాథ్ శిందే.. శివసేనను చీల్చి బీజేపీలో చేరారు. ఆ తరువాత నాటకీయ పరిణామాల మధ్య మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం కుప్పకూలిపోవడం, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం చకచకా జరిగిపోయాయి. ఈ విషయం నుంచి తేరుకోకముందే మహా వికాస్ ఆఘాడిలో మిత్రపక్షంగా ఉన్న నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ వర్గం నుంచి అజిత్ పవార్ కూడా బయటపడ్డారు. పార్టీని చీల్చి తన మద్దతుదారులతో ఆయన బీజేపీ ప్రభుత్వంలో చేరారు. వారికి కొన్ని మంత్రిపదవులు సైతం లభించాయి. అందరూ స్వార్థ రాజకీయాలు చేస్తున్న వేళ.. వీరెందుకు (రాజ్–ఉద్ధవ్) ఒకటి కాకూడదనే అంశాన్ని ఇరుపార్టీల పదాధికారులు, కార్యకర్తలు తెరమీదకు తెచ్చారు. బీజేపీ నుంచి ప్రతికూల సంకేతాలు.. బీజేపీతో సాన్నిహిత్యంగా మెలుగుతున్న తీరును బట్టి ఆ పారీ్టతో పొత్తు పెట్టుకుంటుండవచ్చని అప్పట్లో అందరు భావించారు. కానీ ఉత్తర భారతీయుల ఓట్లను దృష్టిలో ఉంచుకుని రాజ్‌ఠాక్రేకు కొంత దూరంగా ఉంచడమే ఉత్తమమని బీజేపీ వర్గాలు భావించాయి. ఆ తరువాత మసీదులపై లౌడ్స్పీకర్లు తొలగించాలని చేపట్టిన ఆందోళన రాజ్‌ను బీజేపీకి మరింత దగ్గర చేసింది. ఈ నేపథ్యంలోనే దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ శిందే, చంద్రకాంత్ పాటిల్సహా పలువురు బీజేపీ మంత్రులు, నేతలు రాజ్ ఠాక్రేతో భేటీ అయ్యేందుకు ఆయన నివాసమైన శివాజీపార్క్‌లోని రాజ్‌ఘడ్‌కు వెళ్లడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో రాజ్ ఠాక్రే బీజేపీతో జత కట్టడం ఖాయమని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జోరందుకుంది. కానీ వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఏక్నాథ్ శిందే, అజిత్ పవార్ లాంటి ఇద్దరు బలమైన నాయకులు లభించారు. ఫలితంగా బీజేపీతో పొత్తుపై ఎమ్మెన్నెస్ పెట్టుకున్న ఆశలు సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే.. బాల్ ఠాక్రే స్మారకం విషయంపై స్వయంగా రాజ్ ఠాక్రేకు ఫోన్ చేస్తానని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. దీంతో ఇరువురు ఠాక్రేలు స్మారకం అంశంతో పాటు తాజా రాజకీయలు, పొత్తు అంశంపై కూడా చర్చస్తుండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజ్ ఠాక్రే ఎలా స్పందిస్తారనే దానిపై ఇరు పారీ్టల పదాధికారులు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. ఉద్ధవ్‌తో మైత్రికి ప్రయత్నాలు.. అయితే అప్పటికే రాష్ట్ర రాజకీయాలపై రాజ్ ఠాక్రే నిప్పులు చెరుగుతున్నారు. మనం ఎవరికి ఓటు వేశాం..? మనం ఓటువేసిన ప్రతినిధి ఏ పార్టీలో కొనసాగుతున్నారో తెలుసుకోలేని పరిస్ధితుల్లో ఓటర్లు ఉన్నారని పలుమార్లు అన్నారు. తను భవిష్యత్తులో ఎవరితోను పొత్తుపెట్టుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు అనేక సందర్బాల్లో వెల్లడించారు. అంతేగాకుండా సోదరులిద్దరూ ఒకటయ్యే విషయంపై ఇదివరకు ఉద్ధవ్‌కు రెండు సార్లు మైత్రి హస్తం చూపానని రాజ్ అన్నారు. కానీ ఏకైక ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెన్నెస్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం లేదని ఉద్ధవ్ భావించి ఉండవచ్చని అనేక సంవత్సరాలు వేచి చూశారు. ఉద్ధవ్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో దూరంగా ఉండడమే ఉత్తమని రాజ్ భావించారు. -
మొత్తం శరద్ పవారే చేశారు.. ఎన్సీపీ చీఫ్‌పై సంచలన వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమిలోని ఎన్సీపీ చీలికపై.. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి సంక్షోభాలకు శరద్ పవార్ ఆద్యుడని ఆరోపించిన రాజ్ థాక్రే.. తాజా పరిణామాలకు కూడా శరద్ పవారే కారణమంటూ పేర్కొన్నారు. మహారాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(MNS) చీఫ్ రాజ్ థాక్రే బుధవారం మీడియాతో మాట్లాడారు. ఎన్సీపీ సంక్షోభం శరద్ పవార్ ఆశీస్సులతోనే జరిగిందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారాయన. ‘‘రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే జరిగిందో అది అసహ్యమైన రాజకీయం. ఇది ముమ్మాటికీ ఓటర్లను అవమానించడమే అని తీవ్రంగా స్పందించారాయన. అసలు మహారాష్ట్రలో ఇలాంటి రాజకీయాలు మొదలుపట్టిందే శరద్ పవార్. 1978లో పులోద్(పురోగామి లోక్‌షాహీ దళ్) పేరుతో చీలిక రాజకీయాలను ప్రదర్శించారు. అప్పటిదాకా మరాఠా రాజకీయం అలాంటి పరిణామాలను చూడలేదు. ఇలాంటివి పవార్‌తోనే మొదలై.. ఆయనతోనే ముగిసేలా కనిపిస్తున్నాయి. కర్మ ఫలితాన్ని ఆయన అనుభవించాల్సిందే కదా. ఇప్పుడు జరుగుతున్నదంతా ఆయన చేజేతులారా చేసుకున్నదే అని రాజ్ థాక్రే విమర్శించారు. అలాగే.. ప్రఫుల్ పటేల్, దిలీప్ వాల్సే పాటిల్, ఛాగన్ భుజ్‌బల్‌లు అజిత్ పవార్ వెంట వెళ్లే వ్యక్తులు ఏమాత్రం కాదని.. వాళ్లకు కచ్చితంగా శరద్ పవార్ అండదండలు ఉంటాయని ఆరోపించారాయన. ఆనాడు ఏం జరిగిందంటే.. 1977 సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం.. జనతా పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్‌లో చీలిక ఏర్పడింది. ఇందిరా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్(ఐ), యశ్వంత్‌రావు చవాన్ నేతృత్వంలో కాంగ్రెస్(యూ)గా ముందుకు వెళ్లాయి. మహారాష్ట్రలో మెజారిటీ సీట్లు ఓడిపోవడంతో నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి సీఎం శంకర్రావ్ చవాన్ రాజీనామా చేశారు. దీంతో వసంత్‌దాదా పాటిల్ సీఎం అయ్యారు. అయితే.. శరద్ పవార్ అప్పటి పాటిల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నుంచి తెగదెంపులు చేసుకుని బయటకు వచ్చారు. తన రాజకీయ గురువైన యశ్వంత్‌రావు చవాన్ పంచన చేరి కాంగ్రెస్(యూ)లో కొనసాగారు. అయితే.. అధికారం కోసం కాంగ్రెస్(యూ) నుంచి విడిపోయి.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(సోషలిస్ట్) పార్టీని సొంతంగా ఏర్పాటు చేశాడు శరద్ పవార్. ఆపై జనతా పార్టీ, పీడబ్ల్యూపీలతో కలిసి ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్(ప్రగతిశీల ప్రజాస్వామ్య కూటమి) లేదా పురోగామి లోక్‌షాహీ అగాఢి ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా 38 ఏళ్ల శరద్ పవార్ ప్రమాణ స్వీకారం చేయగా.. 1978 జులై 18 పీడీఎఫ్ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే.. ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి వచ్చాక 1980 ఫిబ్రవరి 18వ తేదీన ఆ ప్రభుత్వం రద్దు అయ్యింది. అదే ఏడాదిలో జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ తిరిగి అధికారం కైవసం చేసుకుంది. ఇదీ చదవండి: శరద్ పవార్‌కు షాక్ -
మాటల్లో మార్పు.. వెన్నుపోటుకి అజిత్ పవార్ రెడీనా?
పుణే: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) నేత, మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయంలో ఆసక్తికర చర్చకు దారితీశాయి. బాల్ థాక్రే విషయంలో రాజ్ థాక్రే ఎలాంటి దృష్టి పెట్టాడో.. తానూ తన బాబాయ్ శరద్ పవార్ విషయంలో అలాంటి దృష్టే సారిస్తానంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల సంగతి పక్కనపెట్టినా.. బాబాయ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్-అబ్బాయి అజిత్ పవార్ల మధ్య అగాధం తారాస్థాయికి చేరుకుంటోందని వాళ్ల మాటల్లో మార్పుని బట్టి తెలుస్తోంది!. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత, ఎన్సీపీ ఎంపీ అమోల్ ఖోల్హే, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రేలు తాజాగా ఒక వేదికపై చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. అయితే ఆ ఇంటర్వ్యూలో రాజ్ థాక్రే మాట్లాడుతూ.. అజిత్ పవార్ బయట ఎలాగైతే తన బాబాయ్(శరద్ పవార్)ను గౌరవిస్తాడో, పార్టీలో అంతర్గతంగానూ అలాగే గౌరవించాలని సలహా ఇచ్చాడు. అయితే ఆ సలహాపై మీడియా అజిత్ పవార్‌ను స్పందించాలని కోరింది. దానికి ఆయన అంతే తేడాగా స్పందించారు. రాజ్ థాక్రే ఇచ్చిన సలహా గురించి తెలిసింది. తన పెద్దనాన్న అయిన బాల్ థాక్రే విషయంలో రాజ్ థాక్రే ఎలాంటి వైఖరి అవలంభించారో, ఎంతగా దృష్టిసారించారో.. తాను తన బాబాయ్ శరద్ పవార్ విషయంలో అలాంటి దృష్టిసారిస్తానంటూ వ్యాఖ్యానించారు. బాల్ థాక్రే చిన్న సోదరుడు శ్రీకాంత్ థాక్రే తనయుడు రాజ్ థాక్రే. అయితే.. తన పెదనాన్నతో విబేధాలు రావడంతో.. 2006లో శివసేన నుంచి బయటకు వచ్చేసి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీని నెలకొల్పారు రాజ్‌థాక్రే. అజిత్ పవార్, రాజ్ థాక్రే వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూనే.. తన మనసులోని మాట బయటపెట్టారా?. ఎన్సీపీలో తనకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలు, కీలక నేతలతో అజిత్ పవార్ బయటకు వస్తారని, బీజేపీతో కలిసి జట్టు కడతాడంటూ గత కొంతకాలంగా మహా రాజకీయాల్లో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఒకవేళ అదే గనుక జరిగితే.. తాము ప్రభుత్వ కూటమి నుంచి వైదొలుగుతామంటూ బీజేపీకి అల్టిమేటం జారీ చేసింది షిండే శివసేన వర్గం. కానీ, తాను జీవితాంతం ఎన్సీపీ, బాబాయ్ శరద్ పవార్ వెంటనే నడుస్తానని ఆ ప్రచారాన్ని అజిత్ పవార్ ఖండించారు. అయినప్పటికీ మహారాష్ట్ర రాజీకీయాల్లో రాబోయే రోజుల్లో రాజకీయ కుదుపు ఉండొచ్చని, అజిత్ పవార్ వెన్నుపోటు అస్త్రం ప్రయోగించొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పవార్ రోటీ వ్యాఖ్యల దుమారం అజిత్ పవార్ తర్వాత రాజకీయ అడుగుల గురించి చర్చ నడుస్తున్న వేళ.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి. పార్టీ యూత్ వింగ్ సమావేశంలో పాల్గొన్న శరద్ పవార్ మాట్లాడుతూ.. రోటీలను సమాయానికి పెనం మీద తిప్పి వేయాలి. లేకుంటే అవి తినడానికి పనికి రాకుండా పోతాయని నాకు కొందరు చెప్పారు. అలాగే పార్టీలో కూడా సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకుంటాం అని వ్యాఖ్యానించారు. దీంతో.. బీజేపీకి మళ్లీ అజిత్ పవార్ చేరువవుతున్న కమ్రంలో ఎన్సీపీని నుంచి ఆయన్ని దూరం చేయాలని శరద్ పవార్ భావిస్తున్నారా? అనే చర్చ జోరందుకుంది. అయితే ఈ రోటీ వ్యాఖ్యలపైనా అజిత్ పవార్ స్పందించారు. పవార్ సాబ్ తన 55, 60 ఏళ్ల కెరీర్లో ఎన్నోసార్లు పార్టీని పునరుద్ధరించారు. ఎన్నో కొత్త ముఖాలు పార్టీలోకి వచఆచయి. మరెందరికో ప్రమోషన్లు లభించాయి. నాతో పాటు ఆర్ఆర్ పాటిల్, దిలీప్ వాల్సే పాటిల్, చగ్గన్ భుజ్‌బల్, సునీల్ తాట్కరే.. లాంటి నేతలం అలా పైకి వచ్చినవాళ్లమే. మీ వృత్తిలో కూడా రాణిస్తే ప్రమోషన్లు, ఉన్నత పదవులు ఇస్తారు కదా అని అజిత్ పవార్ మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే.. ఎన్సీపీలోనూ కొత్త వాళ్లు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా రావడం సాధారణం. అదే సమయంలో పాత ముఖాలను పక్కనపెట్టడమూ సాధారణమే అని వ్యాఖ్యానించారాయన. షిండే వర్గం స్పందన.. అయితే.. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గం ‘పవార్ రోటీ’ కామెంట్లపై స్పందించింది. అజిత్ పవార్‌ను పక్కనపెట్టే క్రమంలోనే శరద్ పవార్ ఆ వ్యాఖ్యలు చేశాడన్నది స్పష్టంగా తెలుస్తోందని వ్యాఖ్యానించింది. ఇదీ చదవండి: మోదీపై ఖర్గే వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం -
ఎమ్మెల్యేలకు దేవేంద్ర ఫడ్నవీస్ తీపి కబురు
సాక్షి, ముంబై: మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందోనని కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శుభవార్త ఆందించారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని నాగ్‌పూర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఫడ్నవీస్ ప్రకటించారు. త్వరలో అసెంబ్లీ కార్యకలాపాల నిర్వాహణ కమిటీ ముహూర్తం ఖరారుచేసి తేదీ ప్రకటిస్తుందని ఆయన అన్నారు. దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గం, ఫడ్నవీస్ వర్గం ఎమ్మెల్యేలలో ఆనందం వెల్లివిరిసింది. ముఖ్యంగా గత మూడు నెలలుగా అసంతృప్తితో బీజేపీ ప్రభుత్వంలో కొనసాగుతున్న శిందే వర్గం ఎమ్మెల్యేల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే కరోనా మహమ్మారి కారణంగా నాగ్‌పూర్‌లో జరగాల్సిన శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ముంబైలో చాలా తక్కువ రోజులు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసారి నాగ్‌పూర్‌లో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు రెండు వారాలపాటు కచ్చితంగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఒకవేళ ఎమ్మెల్యేలకు అభ్యంతరం లేకుంటే నూతన సంవత్సర వేడుకలు నాగ్‌పూర్‌లో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ఉద్ధవ్‌తో కలవం.. రాజ్ ఠాక్రే సత్సంబంధాలు ఇదిలాఉండగా భవిష్యత్తులో ఉద్ధవ్ ఠాక్రేతో చేతులు కలిపే సమస్యే లేదని విలేకరులడిగిన ఓ ప్రశ్నకు ఫడ్నవీస్ సమాధానమిస్తూ స్పష్టం చేశారు. ఉద్ధవ్ తన మనసుకు చాలా బాధ కల్గించారని, ఆయనతో ఇకపై చేతులు కలిపే ప్రసక్తేలేదని అన్నారు. ఎమ్మెన్నెస్‌తో పొత్తు పెట్టుకుంటారా? అని విలేకరులడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ పార్టీలు వేరైన అనేక ఏళ్లుగా రాజ్ ఠాక్రేతో తమకు సత్సంబంధాలున్నాయి. ఆయన తనకు మంచి మిత్రుడని, రాజకీయంగా కాకపోయిన మంచి మిత్రులుగా కలిసే ఉంటామని ఫడ్నవీస్ వెల్లడించారు. మూడునెలలుగా పెండింగ్‌లోనూ.. ఏక్నాథ్ శిందే, దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి కొత్తగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన నెల రోజులకు మంత్రి వర్గ విస్తరణ జరిగింది. మొదటి దశ మంత్రివర్గ విస్తరణ జరిగి దాదాపు మూడు నెలలు కావస్తోంది. అయినప్పటికీ రెండో దశ విస్తరణకు ఇంకా ముహూర్తం లభించకపోవడంపై ఎమ్మెల్యేలలో అసంతృప్తి నెలకొంది. ముఖ్యంగా శిందే వర్గం ఎమ్మెల్యేలలో అసంతృప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. దీంతో వారిని సంతృప్తి పరిచేందుకు త్వరలో రెండో దశ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అప్పట్లో ప్రకటించారు. కాని ఇంతవరకు దాని ఊసు ఎత్తడం లేదు. మహిళలకు దక్కని ప్రాధాన్యం అప్పట్లో ఏక్నాథ్ శిందే తిరుగుబాటుతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం రద్దయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు నెల రోజులకు మొదటి దశ మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇందులో శిందే, ఫడ్నవీస్ వర్గానికి చెందిన తొమ్మిది మంది చొప్పున ఇలా 18 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిగతావారికి ఆవకాశం దొరక్కపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. అంతేగాకుండా ఈ మంత్రివర్గ విస్తరణలో ఒక్క మహిళకు కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఇటు మహిళా వర్గం నుంచి, అటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవల్సి వచ్చింది. దీంతో రెండో దశ మంత్రివర్గ విస్తరణ త్వరలో ఉంటుందని అందులో మహిళలకు చోటు కల్పిస్తామని అప్పట్లో అందరినీ బుజ్జగించే ప్రయత్నం జరిగింది. రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తి ముఖ్యంగా అప్పట్లో ఏక్నాథ్ శిందేతోపాటు శివసేన నుంచి బయటపడిన ఎమ్మెల్యేలు కొత్త ప్రభుత్వంలోని మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ఎంతో ఆశపడ్డారు. కానీ ఆశ నిరాశకు గురిచేసింది. శిందే వర్గం ఎమ్మెల్యేలలో నెలకొన్న అసంతృప్తి రోజురోజుకు తీవ్రరూపం దాల్చసాగింది. ఫలితంగా శిందేపై తిరుగుబాటుచేసి సొంత గూటిలోకి (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) చేరే ప్రమాదం ఏర్పడింది. ఒకవేళ అదే జరిగితే బీజేపీ ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకోవడం ఖాయం. ఆ పరిస్ధితి రాకముందే శిందే, ఫడ్నవీస్ జాగ్రత్త తీసుకున్నారు. చివరకు శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ చేపడతామని ఫడ్నవీస్ ప్రకటించి ఈ అంశానికితెరదించారు. (క్లిక్ చేయండి: మరో ‘మహా’కూటమి?.. ఉద్ధవ్‌కు చెక్ పెట్టేందుకు పావులు) -
మహారాష్ట్రలో మరో ‘మహా’కూటమి?.. ఉద్ధవ్‌కు చెక్ పెట్టేందుకు పావులు
సాక్షి ముంబై: శివాజీపార్క్ సాక్షిగా మరో మహాకూటమి అవిర్భవించే అవకాశాలు కన్పిస్తున్నాయి. మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్) దీపావళిని పురస్కరించుకుని శివాజీపార్క్‌లో శుక్రవారం రాత్రి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు హాజరయ్యారు. దీంతో రాబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతోపాటు ఇతర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శిందే వర్గం, బీజేపీ, ఎమ్మెన్నెస్‌ల మహాకూటమి ఏర్పడే అవకాశాలున్నాయన్న రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా గణేశ్ ఉత్సవాల సందర్భంగా రాజ్ ఠాక్రే కూడా వారి ఇంటికి వెళ్లి గణేశుడిని దర్శించుకోవడం ఆ సందర్భంగా బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను బట్టి.. రాబోయే రాష్ట్రంలో కొత్తగా మహాకూటమికి శివాజీపార్క్‌లో బీజం పడిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏక్నాథ్ శిందేతోపాటు 40 మంది శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు అనంతరం ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయాలు తారుమారైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేయగా మరోవైపు బీజేపీ మద్దతులో ఏక్నాథ్ శిందే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఈ రాజకీయ పరిణామాల అనంతరం రాష్ట్ర రాజకీయాలలో ఒకరకమైన ఉత్పాతం సంభవించదని చెప్పొచ్చు. అనంతరం ఎన్నికల కమిషన్ శివసేన పార్టీ, చిహ్నాన్ని రెండింటినీ తాత్కాలికంగా సీజ్ చేయడం ఆ తర్వాత ఉద్దవ్‌ఠాక్రేకు శివసేన ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాక్రే పారీ్టగా, ఏక్నాథ్ శిందే వర్గానికి బాలాసాహెబాంచి శివసేన పార్టీగా ఆమోదం తెలిపింది. దీంతోపాటు ఉద్దవ్ ఠాక్రే వర్గానికి మండుతున్న కాగడా (మశాల్), శిందే వర్గానికి కత్తులు డాలు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. దీనిపైనే పోటీ పడనున్నాయి. అయితే రాబోయే బీఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా ఉద్దవ్ ఠాక్రే వర్గాన్ని గద్దె దింపాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ, శిందే వర్గం నేతలు రాజ్ ఠాక్రేతో పొత్తు కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. చదవండి: బెంగాల్‌ను విడదీసేందుకు బీజేపీ కుట్రలు.. టీఎంసీ ఎంపీ ఫైర్ ఈ విషయంపై పలుమార్లు బీజేపీ నాయకులు కూడా పేర్కొన్నారు. ఇలాంటి నేపథ్యంలో రాజ్ ఠాక్రే ఆహా్వనం మేరకు ఏక్నాథ్ శిందే, దేవేంద్ర ఫడ్నవీస్‌లు ఎమ్మెన్నెస్ దీపోత్సవానికి హాజరుకావడంతో పలు రకాల చర్చలకు ఊతం వచ్చేలా చేసింది. ముఖ్యంగా శివాజీపార్క్‌లో జరిగిన ఎమ్మెన్నెస్ దీపోత్సవ కార్యక్రమంలో శిందే, బీజేపీ, ఎమ్మెన్నెస్‌ల మహాకూటమికి బీజం పడిందన్న వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై మాత్రం అధికారికంగా ఎవరూ వెల్లడించడం లేదు. ఎప్పట్నుంచో కలవాలనుకున్నాను:సీఎం ఏక్నాథ్ శిందే ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రేను ఎప్పట్నుంచో కలవాలని ఉన్నప్పటికీ రాజకీయాల్లో తీరికలేని పరిస్థితుల దృష్ట్యా ఇప్పటివరకు కలవలేకపోయానని ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే పేర్కొన్నారు. ముఖ్యంగా గత పదేళ్లుగా ఎమ్మెన్నెస్ దీపోత్సవాలను నిర్వహిస్తోంది. గత రెండేళ్లు కరోనా మహమ్మారి కారణంగా అనేక నిర్బంధాలున్నాయి. అయితే ఈసారి మాత్రం మహమ్మారి తగ్గిపోవడంతో గణేశ్ ఉత్సవాలు, దసరా నవరాత్రోత్సవాలతోపాటు దీపావళి ఉత్సవాలను కూడా ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారు. గతంలో మనసులో కలవాలన్న కోరిక ఉన్నప్పటికీ కలువలేకపోయాను. కానీ ఇప్పుడు దీపోత్సవం సందర్భంగా ఇలా కలిసేందుకు అవకాశం లభించిందన్నారు. -
సొంత బలంతోనే బరిలోకి.. అక్కడ మాత్రం పోటీ చేయం
సాక్షి, ముంబై: స్ధానిక సంస్ధల ఎన్నికల్లో సొంత బలంపై పోటీ చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న స్ధానిక సంస్ధల ఎన్నికలపై చర్చించేందుకు బాంద్రాలోని రంగ్‌శారద సభా గృహంలో ఎమ్మెన్నెస్ పదాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ ఠాక్రే పదాధికారులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తనకు పూర్తి నమ్మకం ఉంది. అధికారం అంచుల వరకు వెళతాం, కానీ మీ ఆలోచన, విధి విధానాలు దృఢంగా ఉంచుకోవాలని సూచించారు. ఒకవేళ అధికారం మనకే దక్కినా పదవి కోసం కక్కుర్తిపడి కుర్చీలో మాత్రం తను కూర్చోనని ఉద్ధవ్ ఠాక్రే పేరు ఉచ్చరించకుండా పరోక్షంగా చురకలంటించారు. ప్రత్యామ్నాయంగా ఎమ్మెన్నెస్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు కింది స్ధాయికి దిగజారి పోతున్నాయి. సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకుని ఎమ్మెన్నెస్‌పై తప్పుడు సందేశాలు అప్లోడ్ చేస్తున్నారు. ఎమ్మెన్నెస్ నుంచి అనేక మంది పదాధికారులు బయటపడతారని, పార్టీకి ఇక నూకలు చెల్లాయని ఇలా రకరకాల సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిని నమ్మవద్దని, సాధ్యమైనంత వరకు వాటికి దూరంగానే ఉండాలని సూచించారు. రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్న తాజా పరిస్ధితిపై ప్రజలు విసిగెత్తిపోయారు. ఇక ఎమ్మెన్నెస్‌ను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటారని ఉద్ఘాటించారు. మైండ్‌ను సెట్ చేసుకోవాలి పార్టీని పటిష్టం చేయడానికి మీ మైండ్‌ను సెట్ చేసుకోవాలని సలహా ఇచ్చారు. అందుకు పార్టీ కార్యకర్తలందరూ ఏకతాటిపైకి వచ్చి పనులు వేగవంతం చేయాలని సూచించారు. బీఎంసీ ఎన్నికల్లో కచ్చితంగా భారీ మెజారిటీతో విజయం సాధించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేస్తామని, ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఇక్కడ సఫలీకృతమైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సునాయాసనంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలుపించుకోవచ్చని అన్నారు. ఆ తరువాత లోక్‌సభ ఎన్నికల్లో కూడా సత్తాచాటవచ్చని దీమా వ్యక్తం చేశారు. అందుకు ఇప్పటి నుంచే ప్రజల దగ్గరకు వెళ్లాలి, దీపావళికి ఇంటి గుమ్మాల ముందు ఎమ్మెన్నెస్ కందిళ్లు (చుక్కలు) వెలగాలని పిలుపునిచ్చారు. వాడివేడిగా రాజకీయ వాతావరణం ప్రస్తుతం రాజకీయ వాతావరణం వాడివేడిగా ఉంది. శివసేన పేరు, విల్లు–బాణం గుర్తుపై ఎన్నికల సంఘం నిషేధం విధించిన తరువాత సభలు, సమావేశాల్లో, సోషల్ మీడియాలో ఎవరు, ఎలాంటి కామెంట్లు చేయవద్దన్నారు. రమేశ్ లట్కే మృతితో ఖాళీ అయిన తూర్పు అంధేరీ అసెంబ్లీ నియోజక వర్గంలో ఎమ్మెన్నెస్ నుంచి ఎవరూ పోటీ చేయడం లేదన్నారు. ఎవరైనా కార్పొరేటర్‌గానీ, ఎమ్మెల్యేగానీ దురదృష్టవశాత్తు చనిపోతే అక్కడ జరిగే ఉప ఎన్నికలో ఎమ్మెన్నెస్ పోటీ చేయదని స్పష్టం చేశారు. (క్లిక్: అంధేరీలో ఆమె చుట్టే తిరుగుతున్న రాజకీయం.. ఇంతకీ ఎవరామె!) -
శిండే, ఠాక్రే వివాదంలో జోక్యం వద్దు..రాజ్ ఠాక్రే ఆదేశం
సాక్షి, ముంబై: ఉద్ధవ్ ఠాక్రే, ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే మధ్య జరుగుతున్న రాజకీయ వివాదంలో జోక్యం చేసుకోవద్దని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే పార్టీ పదాధికారులకు, శ్రేణులకు ట్విట్టర్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో స్ధానికంగా జరిగే సభలు, సమావేశాల్లో ఎలాంటి వివాదాస్పద ప్రసంగాలు చేయవద్దని, సోషల్ మీడియాలో కూడా కామెంట్లు చేసిన క్లిప్పింగులు, రాతలుగానీ పెట్టవద్దని సూచించారు. ఇరువురు మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగాక సమయం చూసుకుని తానే స్వయంగా అభిప్రాయాలను వెల్లడిస్తానని పదాధికారులకు, కార్యకర్తలకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు వాడీవేడిగా ఉన్నాయి. శివసేన ఎవరిదనే విషయం తాజాగా ఉండగానే కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంత వరకు శివసేన పేరు, విల్లు–బాణం గుర్తును వినియోగించడంపై ఎన్నికల సంఘం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో శివసేన తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. ఫలితంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇలాంటి సమయంలో మీరు జోక్యం చేసుకుంటే పరిస్ధితి మరో విధంగా మారుతుందని రాజ్ అన్నారు. గతంలో ఎమ్మెన్నెస్ నేత సందీప్ దేశ్‌పాండే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వ్యాఖ్యలు, సందేశాలు దుమారం లేపాయి. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఎమ్మెన్నెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇది కొద్దిరోజుల వరకు సాగింది. గత అనుభవం, తాజా పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని ఈ వివాదంలో ఎవరూ మాట్లాడవద్దని, రాయవద్దని రాజ్ హెచ్చరించారు. -
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. వారి భేటీ అందుకేనా?
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే సోమవారం ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధికార నివాసమైన సాగర్ బంగ్లాలో భేటీ అయ్యారు. అకస్మాత్తుగా జరిగిన ఇరువురి భేటీవల్ల రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తావిచ్చినట్లయింది. త్వరలో ముంబై, థానే, పుణే, నాసిక్ తదితర ప్రధాన కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్ ఠాక్రే ఫడ్నవీస్‌తో భేటీ కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 2019 అక్టోబరులో ముఖ్యమంత్రి పీఠంపై శివసేన, బీజేపీ మధ్య నెలకొన్న వివాదం చివరకు తెగతెంపులు చేసుకునే వరకు దారి తీసిన విషయం తెలిసిందే. శివసేనతో తెగతెంపులు చేసుకున్న తరువాత అప్పటి నుంచి బీజేపీ, ఎమ్మెన్నెస్‌ల మధ్య సాన్నిహిత్యం కొంతమేర పెరిగిపోయింది. ముఖ్యంగా ఎమ్మెన్నెస్‌కు ముంబై, థానే, నాసిక్, పుణే కార్పొరేషన్లలో మంచి పట్టు ఉంది. దీంతో బీజేపీ, ఎమ్మెన్నెస్ మధ్య పొత్తు కుదురుతుండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శివసేనకు చెందిన ఏక్నాథ్ శిందే వర్గం దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెన్నెస్ మద్దతు కూడా లభిస్తే ఆ నాలుగు కార్పొరేషన్లలో విజయం సులభం కానుంది. దీంతో బీజేపీ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీకి దగ్గరవుతున్న ఎమ్మెన్నెస్ ఇదిలాఉండగా బీజేపీ శివసేనతో తెగతెంపులు చేసుకున్న తరువాత దేవేంద్ర ఫడ్నవీస్, రాజ్ ఠాక్రే మధ్య సంబంధాలు కొంత బలపడ్డట్లు తెలుస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రాజ్ ఠాక్రే ఓ లేఖ రాశారు. అందులో ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసినందుకు ఫడ్నవీస్‌ను ప్రశంసించారు. అనంతరం రాజ్ ఠాక్రే నివాసమైన శివ్ తీర్ధ్ బంగ్లాకు వెళ్లి ఫడ్నవీస్‌తో భేటీ అయ్యారు. అదేవిధంగా రాజ్ ఠాక్రే మసీదులపై అక్రమంగా ఏర్పాటు చేసిన లౌడ్స్పీకర్లకు వ్యతిరేకంగా లేవనెత్తిన ఆందోళనకు బీజేపీ నుంచి ప్రశంసల జల్లులు కురిశాయి. అప్పుడే హిందుత్వ నినాదంపై బీజేపీ, ఎమ్మెన్నెస్ ఒక్కటవుతుండవచ్చని వార్తలు గుప్పుమన్నాయి. అప్పటి నుంచి ఇరుపార్టీల మధ్య రోజురోజుకు పెరుగుతున్న సాన్నిహిత్యం, ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం రాజ్ ఠాక్రే ఫడ్నవీస్‌తో భేటీకావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సోమవారం జరిగిన భేటీ మర్యాదపూర్వకంగా జరిగిందా...లేక రాజకీయ పరంగా జరిగిందా.. అనేది త్వరలో బయటపడనుంది. చదవండి: (చిన్న పార్టీలకు అధికారం దక్కకుండా చేయడమే బీజేపీ ఎజెండా) ఎన్నికలకు సిద్ధమవుతున్న అన్ని పార్టీలు త్వరలో ముంబై, థానే సహా పుణే, పింప్రి–చించ్వడ్, ఉల్లాస్‌నగర్, భివండీ, పన్వేల్, మీరా–భాయందర్, షోలాపూర్, నాసిక్, మాలేగావ్, పర్భణీ, నాందేడ్, లాతూర్, అమరావతి, అకోలా, నాగ్‌పూర్, చంద్రాపూర్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఓబీసీ రిజర్వేషన్ కారణంగా తరుచూ ఈ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. కాని ఈ ఎన్నికల్లో తమ బలం, సత్తా ఏంటో నిరూపించుకునేందుకు అన్ని పార్టీలు నడుం బిగించాయి. ఇటీవల ఏక్నాథ్ శిందే తిరుగుబాటుతో మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం కుప్పకూలిన తరువాత ఎన్నికలు జరగడం ఇదే ప్రథమం. దీంతో అధికార పార్టీతో పాటు, ప్రతిక్షాలు కూడా ఈ ఎన్నికలను ఒక సవాలుగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా గత ఐదు దశాబ్దాలకుపైగా ఒక్కటిగా ఉన్న శివసేన పార్టీ ఇప్పుడు రెండుగా చీలిపోయింది. దీంతో ఈ ఎన్నికల్లో ఏలాంటి అద్భుతం జరుగుతుంది..? ఫలితాలు ఎలా వస్తాయనే దానిపై యావత్ రాష్ట్ర ప్రజల దృష్టి ఇటువైపు ఉంది. -
ఒకేఒక్క ఎమ్మెల్యేతో జాక్‌పాట్.. కేబినెట్లో చోటు!
ముంబై: మహారాష్ట్రలో శివ సేన చీలిక తర్వాత.. రెబల్ వర్గంతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఇప్పుడు మంత్రివర్గ కూర్పుపై దృష్టిసారించింది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలూ ఉన్నందునా.. రాజకీయ స్థిరత్వం కోసం పావులు కదుపుతోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రేను ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కలిశారు. దాదర్(మధ్య ముంబై)లోని థాక్రే నివాసం ‘శివతీర్థ’కు స్వయంగా వెళ్లిన ఫడ్నవీస్.. గంటన్నరకు పైనే మంతనాలు జరిపారు. రాజ్‌థాక్రేకు గత నెలలో సర్జరీ జరిగింది. అలాగే షిండే వర్గంతో పొత్తు సమయంలో అనూహ్యంగా ఉపముఖ్యమంత్రి పదవికి సుముఖత వ్యక్తం చేశారు ఫడ్నవీస్. ఆ సమయంలో ఫడ్నవీస్ త్యాగాన్ని కొనియాడాడు రాజ్ థాక్రే. ఈ నేపథ్యంలోనే మర్యాదపూర్వకంగా కలిసినట్లు ప్రచారం జరిగింది. అయితే.. మొదటి నుంచి ఎంఎన్ఎస్.. బీజేపీకి మద్దతుదారు పార్టీనే. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో, రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ప్రత్యక్ష మద్దతు ప్రకటించింది ఎంఎన్ఎస్. అలాగే త్వరలో బీఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంకోవైపు మంత్రి వర్గ కూర్పు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రాజకీయపరమైన చర్చ ఇద్దరి మధ్య జరిగినట్లు తెలుస్తోంది. కేబినెట్లో చోటు! మహారాష్ట్రలో బీజేపీ రాజకీయ స్థిరత్వం కోసం ప్రయత్నిస్తోంది. మరో రెండున్నరేళ్ల పాటు అధికారం కొనసాగేందుకు అవసరమైన మద్దతు కూడగడుతోంది. ఈ క్రమంలో షిండే వర్గంతో పాటు చిన్న చిన్న పార్టీలను కూడదీసుకుని ముందుకు వెళ్లాలనుకుంటోంది. గతంలోనూ.. ఇప్పుడూ ఎంఎన్ఎస్ మహారాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంది. ఇప్పుడు ఉన్నది ఒక్క సీటే అయినా.. కేబినెట్లో స్థానం ద్వారా మరింత మచ్చిక చేసుకోవాలని బీజేపీ-షిండే వర్గం భావిస్తోంది. ఎంఎన్ఎస్కు ఉన్న ఏకైక ఎమ్మెల్యే ప్రమోద్ రతన్ పాటిల్. కల్యాణ్ రూరల్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2010లో ఎంఎన్ఎస్ పార్టీ స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో 29 సీట్లు గెలవడానికి ఈయనే మూలకారణం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ ఆయనకు పట్టుంది. అందుకే ప్రమోద్‌కు కేబినెట్ బెర్త్ ఆఫర్ చేస్తోంది బీజేపీ. అయితే.. ఇదికాకుండా మరో ప్రతిపాదన సైతం రాజ్ థాక్రే ముందు ఉంచింది. రాజ్ థాక్రే తనయుడు అమిత్ థాక్రేకు షిండే కేబినెట్లో ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అమిత్ చట్టసభలో సభ్యుడిగా లేడు. ఒకవేళ కేబినెట్ హోదా గనుక ఇస్తే.. ఎమ్మెల్యేగా లేదంటే ఎమ్మెల్సీగా తప్పకుండా గెలవాలి. దీంతో బీజేపీ ఆఫర్‌పై రాజ్ థాక్రే పార్టీ వర్గంతో చర్చిస్తున్నట్లు సమాచారం. -
ప్రియమైన ఉపముఖ్యమంత్రి గారూ.. మీరు చాలా గ్రేట్!
సాక్షి,ముంబై: ఒకసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి చేపట్టి కూడా ఇప్పుడ ఉపముఖ్యమంత్రి పదవిని పెద్దమనసుతో అంగీకరించిన దేవేంద్ర ఫడ్నవీస్‌ను మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే అభినందించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఫడ్నవీస్‌కు లేఖ రాశారు. గతంలో ముఖ్యమంత్రిగా కొనసాగినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పదవిని స్వీకరించి అందరికీ ఆదర్శంగా నిలిచారని ఫడ్నవీస్‌ను కొనియాడారు. ఎంత ఉన్నత పదవుల్లో ఉన్నవారైనా పార్టీ అధిష్టానం జారీ చేసిన ఆదేశాలను శిరసావహించాల్సిందేనని, ఈ విషయంలో ఫడ్నవీస్ ఏ మాత్రం భేషజాలు ప్రదర్శించకుండా అధిష్టానం ఆదేశాలను పాటించి మంచి వ్యక్తిత్వాన్ని చాటుకున్నారని అభినందించారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి సమర్థవంతమైన పాలన అందించారని, ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎంతో కృషి చేశారని ఈ విషయంలో మీరు నిజంగా ప్రశంసనీయులని కొనియాడారు. ఇప్పుడు మీకు లభించింది ప్రమోషనా లేక డీమోషనా అనేది ముఖ్యం కాదని, బాణాన్ని వదలాలంటే దారాన్ని గట్టిగా వెనక్కి లాగాలని, అప్పుడే ఆ బాణం ముందుకు దూసుకుపోతుందన్నారు. దారం వెనక్కి వెళ్లినంతమాత్రనా దాని విలువ తగ్గినట్లు కాదని ఉదహరించారు. ‘‘మీ కర్తవ్యాన్ని మీరు నెరవేర్చారని, ప్రజలకు సేవ చేయడానికి మీకు మరోసారి అవకాశం లభించిందని, మీకు ఆయురారోగ్యాలను, శక్తిని ఆ జగదాంబ మాత ప్రసాదించాలని కోరుకుంటున్నా’’నని లేఖలో పేర్కొన్నారు. -
కర్మ అనుభవించక తప్పదు.. ఉద్ధవ్ రాజీనామాపై రాజ్‌ఠాక్రే స్పందన
సాక్షి, ముంబై: నాటకీయ పరిణామాల మధ్య శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత ఈ విషయాన్ని భాగోద్వేగంతో బుధవారం రాత్రి ప్రకటించారు. దీనిపై ఇటు మహావికాస్ ఆఘాడిలో కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు, సొంత పార్టీ శివసేన నాయకులు, సంజయ్ రావుత్, ఇతర పార్టీల పదాధికారుల నుంచి రకరకాల స్పందనలు వచ్చాయి. కానీ ఉద్ధవ్ సోదరుడు, ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే ఎలా స్పందిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాత్రి రాజ్ ఠాక్రే నుంచి ఉద్ధవ్‌ను ఓదార్చడం, బాధ, ఆవేదన, సానుభూతిలాంటి ఎలాంటి స్పందనలు రాలేదు. ఒకవేళ రాజ్ ఠాక్రే వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటాయన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చివరకు ఉద్ధవ్ రాజీనామా చేసిన 15 గంటల తరువాత అంటే.. గురువారం ఉదయం ఎట్టకేలకు రాజ్ ట్విటర్లో స్పందించారు. అందులో ఉద్దవ్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. కాని పరోక్షంగా వ్యాఖ్యలు మాత్రం ఆయనపై చేశారు. ‘ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు, అధికారం చేతిలో ఉంది కదాని విర్రవీగితే పరిస్ధితులు ఇలాగే ఉంటాయి’ అని చురకలంటించారు. మసీదులపై అక్రమంగా ఏర్పాటు చేసిన లౌడ్స్పీకర్లను తొలగించాలని అప్పట్లో రాజ్ చేసిన ప్రకటన చర్చల్లోకి వచ్చింది. చదవండి: నాకు చేసినట్లు ముంబైకి ద్రోహం చేయకండి: షిండే ప్రభుత్వానికి ఉద్దవ్ వార్నింగ్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న లౌడ్స్పీకర్లను తొలగించాలని ఆందోళన చేస్తున్న, మసీదుల ఎదుట హనుమాన్ చాలీసా వినిపిస్తున్న ఎమ్మెన్నెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై రాజ్ ఠాక్రే ఆఘాడి ప్రభుత్వంపై ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌కు ఒక లేఖ రాశారు. అందులో నేను మీకు ఒక్కటే చెప్పదల్చుకున్నాను. మా సహనాన్ని పరీక్షించవద్దు, అధికారం ఇవ్వాళ ఉంటుంది. రేపు పోతుంది. అధికారాన్ని పుట్టుకతోనే అమ్మ కడుపులోంచి ఎవరు తెచ్చుకోలేదు. ఉద్ధవ్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని లేఖలో పేర్కొన్నారు. దాదాపు నెలన్నర కిందట రాసిన ఆ లేఖను గురువారం మళ్లీ ట్విటర్లో పెట్టారు. అప్పట్లో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. -
మహా పాలిటిక్స్‌లో ట్విస్ట్.. రాజ్ థాక్రేతో టచ్‌లో ఏక్నాథ్ షిండే
మహారాష్ట్రలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. పొలిటికల్ ఇష్యూ చివరకు సుప్రీంకోర్టును తాకింది. సీఎం ఉద్ధవ్ థాక్రే వర్గం, శివసేన తిరుగుబాటు టీమ్ ఏక్నాథ్ షిండే మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు.. డిప్యూటీ స్పీకర్ అనర్హతను సవాల్ చేస్తూ షిండే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. వారి పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర పాలిటిక్స్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేవ(ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాక్రే తెర మీదకు వచ్చారు. సోమవారం ఉదయం రాజ్‌థాక్రేకు ఏక్నాథ్ షిండే ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో నెలకొన్ని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. శివసేన నేతలు ప్రవర్తిస్తున్న తీరు, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి షిండే.. రాజ్ ఠాక్రేను అడిగి తెలుసుకున్నారు. దీంతో వీరి మధ్య సంభాషణ ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: మీకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి.. రెబల్స్‌కు ఆధిత్య థాక్రే వార్నింగ్ -
లౌడ్‌స్పీకర్ల వివాదం..చంపేస్తామని బెదిరింపులు.. రాజ్ ఠాక్రేకు భద్రత పెంపు
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రేకు బెదిరింపు లేఖ వచ్చిన నేపథ్యంలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. రాజ్ ఠాక్రేను హతమారుస్తామని రెం డు రోజుల కిందట బెదిరింపు లేఖ వచ్చిన విష యం తెలిసిందే. దీంతో ఆ పార్టీ సీనియర్ నేత బాల నాంద్‌గావ్కర్ బుధవారం హోంమంత్రి దిలీప్ వల్సే పాటిల్‌తో భేటీ అయి ఈ విషయా న్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వాస్తవా లు ఆరా తీసిన మహావికాస్ ఆఘాడి ప్రభు త్వం భద్రత పెంచుతున్నట్లు శుక్రవారం ప్రక టించింది. ప్రస్తుతం రాజ్ ఠాక్రేకు వై–ప్లస్ భ ద్రతా ఉంది. బెదిరింపు లేఖ వచ్చిన తరువాత ప్రభుత్వం ఈ భద్రతను ఇలాగే కొనసాగిస్తూ అదనంగా పోలీసుల సంఖ్య పెంచింది. ఇందు లో అదనంగా ఒక పోలీసు అధికారి, కానిస్టేబుల్ ఉన్నారు. బెదిరింపు లేఖ హిందీలో ఉన్నప్పటకీ అందులో వాడిన పదాలు ఎక్కువ శాతం ఉర్దూలో ఉన్నాయి. దీంతో రాజ్‌కు ఏదైనా హాని జరిగితే మహారాష్ట్ర తగలబడకుండా ఉండదని నాంద్‌గావ్కర్ హెచ్చరించారు. లౌడ్‌స్పీకర్ల వివాదం తెరమీదకు వచ్చిన తరువాత తమకు అనేక బెదిరింపు లేఖలు వస్తున్నాయని నాంద్‌గావ్కర్ అన్నారు. రాజ్ ఠాక్రేను హతమారుస్తామని ఇలా బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. లౌడ్స్పీకర్లలో నమాజ్ వినిపించడాన్ని అడ్డుకుంటున్న విధానం మానుకోవాలని, లేదంటే నిన్ను, రాజ్ ఠాక్రేను వదిలే ప్రసక్తే లేదు. కచ్చితంగా హతమారుస్తామని రాసి ఉంది. ఈ లేఖను రాజ్ ఠాక్రేకు చూపించిన తరువాత పోలీసు కమిషనర్‌తో భేటీ అయినట్లు ఆయన తెలిపారు. దీంతో రాజ్‌కు భద్రత మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చదవండి: క్యాట్ కుప్పకూలుతోంది: సుప్రీం కోర్టు సీరియస్ -
లౌడ్స్పీకర్లు తీస్తేనే.. హనుమాన్ చాలీసా ఆపేస్తాం
ముంబై: ప్రార్థనా మందిరాల్లో లౌడ్‌స్పీకర్ల విషయంలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే తన వైఖరిని సమర్థించుకున్నారు. మసీదుల్లో లౌడ్స్పీకర్లు ఉన్నంతకాలం తమ పార్టీ కార్యకర్తలు హనుమాన్ చాలీసాను బిగ్గరగా పఠిస్తూనే ఉంటారని బుధవారం తేల్చిచెప్పారు. ముంబై పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించేవారిని స్వేచ్ఛగా వదిలేసి తమ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. తన పిలుపు తర్వాత 90 శాతం మసీదుల్లో లౌడ్‌స్పీకర్ల మోత ఆగిపోయిందని చెప్పారు. లౌడ్స్పీకర్లకు వ్యతిరేకంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. మసీదుల్లో రోజుకు నాలుగైదు సార్లు లౌడ్స్పీకర్లు ఉపయోగిస్తే, తమ కార్యకర్తలు కూడా రెట్టింపు శబ్దంతో హనుమాన్ చాలీసా పఠిస్తారని పేర్కొన్నారు. ఏ ఆలయమైనా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాల్సిందేనని సూచించారు. న్యాయస్థానం అనుమతించిన శబ్ద పరిమితిని ఉల్లంఘించడానికి వీల్లేదన్నారు. ముంబైలో బుధవారం రాజ్ నివాసం వద్ద ఎంఎన్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. మాకు హిందుత్వను నేర్పొద్దు: రౌత్ లౌడ్‌స్పీకర్ల నిబంధనలను ఎవరూ ఉల్లంఘించడం లేదని అధికార శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. హిందుత్వ గురించి తమకు నేర్పించొద్దన్నారు. నకిలీ హిందుత్వవాదుల మాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. శివసేనకు వ్యతిరేకంగా కుతంత్రాలు సాగిస్తున్నారని పరోక్షంగా బీజేపీ, ఎంఎన్ఎస్ నేతలపై మండిపడ్డారు. ప్రజల్లో విభజన మంటలు రేపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. -
లౌడ్ స్పీకర్లపై పోరాటం ఆగదు: రాజ్ ఠాక్రే హెచ్చరికలు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో లౌడ్ స్పీకర్ల వివాదం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మసీదుల్లో లౌడ్స్పీకర్లు తొలగించే వరకూ.. హనుమాన్ చాలీసా పఠిస్తామని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే మరోసారి హెచ్చరించారు. భారీ సౌండ్ వచ్చే లౌడ్స్పీకర్లు తొలగించే వరకూ తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. 45 నుంచి 55 డెసిబుల్స్ వరకూ సుప్రీంకోర్టు అనుమతించిందని, అయితే.. ముంబైలోని 135 మసీదులు సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించాయని ఆరోపించారు. వాటిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని రాజ్‌ఠాక్రే ప్రశ్నించారు. కాగా హనుమాన్ చాలీసా ప్లే చేస్తామని రాజ్ ఠాక్రే హెచ్చరించిన నేపథ్యంలో బుధవారం ముంబైతోపాటు దాని పరిసర ప్రాంతాల్లోని చాలా మసీదులు ఆజాన్ సమయంలో లౌడ్స్పీకర్లను బంద్ చేశాయి. మహారాష్ట్రలోని పర్భాని, ఉస్మానాబాద్, హింగోలి, జల్నాలోని కొన్ని ప్రాంతాలు, నాందేడ్, నందుర్బార్, షిర్డీ, శ్రీరాంపూర్‌తో సహా పలు ప్రాంతాల్లో ఆజాన్ సమయంలో లౌడ్స్పీకర్లు స్వచ్ఛందంగా తొలగించగా. మరి కొన్ని చోట్ల తక్కువ వాల్యూమ్‌తో ఉపయోగించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 250 నుంచి 260 మంది ఎమ్ఎన్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ ఠాక్రే నివాసం ముందు గుమిగూడిన పలువురు కార్యకర్తలలతోపాటు పుణెలో ఎనిమిందిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కార్యకర్తల అరెస్ట్‌పై రాజ్ ఠాక్రే స్పందించారు. చట్టాన్ని అనుసరించే తమ పార్టీ కార్యకర్తలను నిర్బంధించి నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు. చదవండి: లౌడ్‌స్పీకర్ల వ్యవహారంలో ముగిసిన డెడ్‌లైన్.. ముంబైలో హైఅలర్ట్ ఈ సమస్య కేవలం మసీదులకు సంబంధించినది మాత్రమే కాదని, అక్రమ లౌడ్‌స్పీకర్లతో అనేక దేవాలయాలు కూడా ఉన్నాయని అన్నారు. ఈ అంశం మతపరమైంది కాదని, సామాజిక సమస్య అని అన్నారు. అలాగే ఈ సమస్య ఒక రోజుది కాదని.. లౌడ్ స్పీకర్ల కారణంగా విద్యార్థులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముంబైలోని 1,140 మసీదుల్లో 135 మసీదులు బుధవారం ఉదయం 6 గంటల కంటే ముందే లౌడ్ స్పీకర్లను ఉపయోగించాయని మహారాష్ట్ర హోంశాఖ పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యహరించిన సదరు 135 మసీదులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. -
ముగిసిన డెడ్‌లైన్.. ముంబైలో హైఅలర్ట్
ఆజాన్ వర్సెస్ హనుమాన్ చాలీసా రాజకీయం.. బెదిరింపులతో ముంబై మహానగరం అప్రమత్తం అయ్యింది. మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే విధించిన డెడ్ లైన్ పూర్తి కావడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మసీద్‌లపై లౌడ్‌స్పీకర్ల నుంచి ఆజాన్ వినిపిస్తే.. ప్రతిగా హనుమాన్ చాలీసా ప్రదర్శిస్తామంటూ రాజ్ థాక్రే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మసీద్‌లపై లౌడ్స్పీకర్లు తొలగించాలంటూ మే 3వ తేదీని డెడ్‌లైన్‌గా ప్రకటించాడాయన. ఆజాన్ శబ్ధ కాలుష్యానికి కారణం అవుతుందనేది ఆయన వాదన. ఈ మేరకు ఆయన విధించిన గడువు ముగియడంతో ముంబై పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇదిలా ఉండగా.. ముంబై నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలాచోట్ల ఆజాన్ టైంలో స్పీకర్లు స్వచ్ఛందంగా బంద్ చేశారు. మసీదు ట్రస్టీలతో సమావేశాలు నిర్వహించిన పోలీసులు.. ఉదయం ప్రార్థనల సమయంలో లౌడ్ స్పీకర్లు బంద్ చేయాలనే సుప్రీం కోర్టు ఆదేశాలను వాళ్లకు వివరించారు. దీంతో కళ్యాణ్ తో పాటు చాలా ప్రాంతాల్లో లౌడ్స్పీకర్లు మూగబోయాయి. ఈ క్రమంలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు మసీదుల దగ్గరకు వెళ్లి.. లౌడ్స్పీకర్లు బంద్ కావడం గమనించి అక్కడి నుంచి నిష్క్రమిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చాన్స్ తీసుకోవాలనుకోవడం లేదు. అందుకే అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంది. మరోవైపు విద్వేషపూరిత ప్రసంగంతో రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు చేశారంటూ రాజ్‌థాక్రేపై ఔరంగాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు నోటీసులు అందించిన పోలీసులు.. బుధవారం ఉదయం రాజ్‌థాక్రే ఇంటి వద్ద భారీగా మోహరించారు. థాక్రే వర్సెస్ థాక్రే మహారాష్ట్రలో స్థానిక సంస్థ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. థాక్రే కుటుంబంలో రాజకీయ వైరం లౌడ్ స్పీకర్ల వ్యవహారంతో ముదురుతోంది. అధికార పార్టీ శివసేన, ఎంఎన్ఎస్ను బీజేపీ బీ టీంగా అభివర్ణిస్తోంది. హిందుత్వ ఓటు బ్యాంక్‌తో సేన ఓట్లను ఎంఎన్ఎస్ ద్వారా చీల్చే యత్నం చేస్తోందంటూ బీజేపీపై మండిపడుతోంది. చదవండి: 14 ఏళ్ల కిందటి కేసు.. రాజ్‌థాక్రేపై నాన్ బెయిలబుల్ వారెంట్ -
లౌడ్‌స్పీకర్ల వివాదంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. రాజ్ ఠాక్రేపై కేసు
ముంబై: ఔరంగాబాద్‌లో ఆదివారం ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్‌ఠాక్రే నిర్వహించిన బహిరంగ సభలో పోలీసులు విధించిన షరతుల్లో కొన్ని ఉల్లంఘించారనే అభియోగంపై మంగళవారం చీఫ్ రాజ్ ఠాక్రేపై కేసు నమోదైంది. రాజ్ ప్రసంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఔరంగాబాద్ పోలీసులు నియమాల ఉల్లంఘన జరిగినట్లు నివేదిక రూపొందించారు. ఆ తరువాత ముఖ్యమంత్రి, హోంమంత్రి, సంబంధత అధికారులతో జరిగిన సమావేశంలో ఆ నివేదికను ప్రవేశపెట్టారు. ఈ నివేదికపై ఆరా తీసిన తరువాత ఔరంగాబాద్‌లోని సిటీ చౌక్ పోలీసు స్టేషన్లో రాజ్‌పై కేసు నమోదు చేశారు. సభకు అనుమతిచ్చే ముందు పోలీసులు విధించిన మొత్తం 16 షరతుల్లో 12 షరతుల ఉల్లంఘన జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో రాజ్‌తోపాటు సభకు అనుమతివ్వాలని దరఖాస్తు చేసుకున్న రాజీవ్ జవళేకర్పై కూడా కేసు నమోదు చేశారు. ఔరంగాబాద్‌లో కేసు నమోదైన విషయంపై రాజ్ ఠాక్రే తనయుడు అమిత్ ఠాక్రే ఫోన్‌చేసి స్ధానిక ఎమ్మెన్నెస్ పదాధికారి రజీవ్ జవళేకర్తో చర్చించారు. చట్టం అందరి సమానంగా ఉండాలని, పోలీసులు సభకు అనుమతిచ్చే ముందు కేవలం 15 వేల మంది హాజరుకావాలని షరతులు విధించారని, అయితే రాజ్ ఠాక్రే రోడ్డుపై నడుస్తూ వెళుతుంటేనే 15 వేలకుపైగా జనాలు అనుసరిస్తారని, ఇలాంటి సందర్భంలో షరతులు ఉల్లంఘించారని కేసు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మరోనేత సందీప్ దేశ్‌పాండే మాట్లాడుతూ తొలుత సభకు అనుమతివ్వకపోవడం, ఆ తరువాత సమయం దగ్గరపడగానే షరతులతో కూడిన అనుమతివ్వడం లాంటి సందర్భాలు గతంలో ఎదురు కాలేదన్నారు. పోలీసులపై ప్రభుత్వం కచ్చితంగా ఒత్తిడి తెచ్చిందని దీన్ని బట్టి స్పష్టమవుతోందన్నారు. కార్యకర్తలను భయపట్టేందుకే కేసులు నమోదు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కేసు నమోదు చేసిన నిందితుల జాబితాలో రాజ్ ఠాక్రే పేరు మొదటి స్ధానంలో ఉంది. ఆ తరువాత రాజీవ్ జావళేకర్, నిర్వాహకులు, ఇతర పదాధికారుల పేర్లున్నాయి. స్ధానిక సిటీ చౌక్ పోలీసు ఇన్స్పెక్టర్ అశోక్ గిరీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: డెన్మార్క్ ప్రధాని నివాసంలో మోదీ చర్చలు.. వీడియో వైరల్ నాన్ బెయిలబుల్ వారెంట్ మరోవైపు మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరేపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. 14 ఏళ్ల కిందటి కేసులో మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కాగా రాజ్ ఠాక్రే రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలపై 2008లో ఆయనపై ఐపీసీ సెక్షన్ 109,117 కింది కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణలో రాజ్ ఠాక్రే కోర్టుకు హాజరు కాకపోవడంతో జూన్ 8లోపు అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని సాంగ్లి జిల్లా షిరాలా ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ పేర్కొంది. అయితే 2012 కంటే ముందు నమోదైన రాజకీయ పరమైన కేసులన్నిటినీ ప్రభుత్వం రద్దు చేసిందని ఎంఎన్ఎస్ నేత ఒకరు గుర్తు చేశారు. -
ఎంఎన్ఎస్కు బీజేపీ ‘కాంట్రాక్ట్’
ముంబై: మహారాష్ట్రలో శాంతిభద్రతలకు భంగం కలిగించడానికి బీజేపీ నుంచి మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కాంట్రాక్టు తీసుకుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. ఎంఎన్ఎస్ పేరు ప్రస్తావించకుండా ఆయన ఈ ఆరోపణలు చేశారు. అయితే తమ ప్రభుత్వ హయాంలో ఎంఎన్ఎస్ ఆటలు సాగబోవని హెచ్చరించారు. ‘శాంతి సామరస్యాలకు విఘాతం కలిగించేందుకు ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీ ‘కాంట్రాక్ట్’ కుదుర్చుకున్నంత మాత్రాన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దెబ్బతినద’ని ఉద్ఘాటించారు. మే 4వ తేదీలోపు మసీదుల నుంచి లౌడ్స్పీకర్లను తొలగించాలని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే అల్టిమేటం జారీ చేశారు. ఔరంగాబాద్‌లో ఆదివారం జరిగిన మహారాష్ట్ర దినోత్సవ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ‘మే 4 నుంచి మేము వినం. మీరు మీ లౌడ్ స్పీకర్లతో ఇబ్బందిని సృష్టించడం కొనసాగిస్తే, మేము హనుమాన్ చాలీసాను మసీదుల ముందు రెట్టింపు పరిమాణంలో ప్రసారం చేస్తామ’ని రాజ్ థాకరే హెచ్చరించారు. శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో రాజ్ థాకరే వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ‘శివసేనను లక్ష్యంగా చేసుకుని మే 1న ముంబైలో బీజేపీ ‘బూస్టర్ డోస్’ ర్యాలీని ప్లాన్ చేయగా, ఔరంగాబాద్‌లో జరిగిన ర్యాలీలో బీజేపీ ఉంపుడుగత్తె ఎమ్ఎన్ఎస్.. శరద్ పవార్‌ను లక్ష్యంగా చేసుకుంద’ని ఘాటుగా వ్యాఖ్యానించింది. దీనిపై సంజయ్ రౌత్ స్పందిస్తూ.. మహా వికాస్ అఘాదీని ఎదుర్కోవడానికి కొన్ని చిన్న పార్టీలను బీజేపీ వాడుకుంటోందని అన్నారు. రాష్ట్రంలో శాంతి, సామరస్యాలకు భంగం కలిగించాలని భ్రమల్లో ఉన్నవారు.. వాస్తవంలోకి రావాలని సూచించారు. (క్లిక్: కాంగ్రెస్‌కు భారీ షాకిచ్చిన సీనియర్ నేతలు) -
పొలిటికల్ రీ సౌండ్
మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే చేస్తున్న డిమాండ్ దేశవ్యాప్తంగా రీ సౌండ్ ఇస్తోంది. బహిరంగ ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్ల వాడకాన్ని ఆపేయాలన్న ఆయన డిమాండ్‌తో క్రమంగా ఒక్కో పార్టీ గొంతు కలుపుతూ వస్తోంది. అసలు దేశంలో లౌడ్ స్పీకర్లపై ఉన్న నిబంధనలేమిటి? చట్టాలు ఏం చెబుతున్నాయి? శబ్ద కాలుష్యంతో నష్టమెంత? మసీదుల్లో ప్రార్థనల వల్ల శబ్ద కాలుష్యంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వాటిలో లౌడ్ స్పీకర్లను తొలగించాలని మహారాష్ట్రలో రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చేస్తున్న డిమాండ్ రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. బీజేపీతో పాటు వీహెచ్‌పీ వంటి హిందుత్వ సంస్థలు ఎంఎన్ఎస్ డిమాండ్‌కు మద్దతిచ్చాయి. శబ్ద కాలుష్య భూతాన్ని తరిమికొట్టాలని అవి డిమాండ్ చేస్తున్నాయి. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన ఈ వివాదాన్ని కేంద్రం కోర్టులోకి విసిరింది. లౌడ్ స్పీకర్‌పై కేంద్రం జాతీయ విధానం రూపొందిస్తే ఆ మేరకు నడుచుకుంటామని చెబుతోంది. ఈ నేపథ్యంలో లౌడ్ స్పీకర్ల వాడకంపై దేశంలో ఎలాంటి నిబంధనలున్నాయనే చర్చ సాగుతోంది. శబ్ద కాలుష్యమంటే? కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ప్రకారం అనవసరమైన శబ్దాలేవైనా కాలుష్యం కిందకే వస్తాయి. చెవులు చిల్లులు పడే శబ్దాలతో శరీరానికి హానికరంగా మారితే దేశ చట్టాల ప్రకారం శబ్ద కాలుష్యం కిందకే వస్తుంది. శబ్ద కాలుష్యం ఇన్నాళ్లూ వాయు కాలుష్య నియంత్రణ చట్టం (1981) పరిధిలో ఉండేది. అది ఇటీవల అతి పెద్ద సమస్యగా మారడంతో శబ్ద కాలుష్య (నియంత్రణ, కట్టడి) నిబంధనలు, 2000 రూపొందించి అమలు చేస్తున్నారు. వీటిని ఉల్లంఘిస్తే సదరు పరికరాలను జప్తు చేయడంతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధించవచ్చు. ఆరోగ్యంపై ప్రభావం శబ్ద కాలుష్యం ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావమే చూపుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 110 కోట్ల మంది యువకులు (12 నుంచి 35 మధ్య వయసువారు) భరించలేని శబ్దాల వల్ల వినికిడి సమస్యను ఎదుర్కొంటున్నారు. రాత్రిపూట శబ్దాలతో నిద్రలేమి సమస్య ఎదుర్కొంటున్న వారూ ఉన్నారు. శబ్దకాలుష్యం తలనొప్పి, రక్తపోటు వంటి సమస్యలకూ దారితీస్తుంది. అమల్లో ఉన్న నిబంధనలేమిటి? బహిరంగ ప్రదేశాల్లో ఇష్టారాజ్యంగా శబ్దాలు చేస్తామంటే, లౌడ్ స్పీకర్ల మోత మోగిస్తామంటే కుదిరే పని కాదు. దేశంలో ఎక్కడైనా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే లౌడ్ స్పీకర్లను అనుమతిస్తారు. శబ్దకాలుష్యం ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుండటంతో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వాడటానికి వీల్లేదని సుప్రీంకోర్టు 2005 అక్టోబర్ 28న తీర్పు ఇచ్చింది. సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాల్లో లౌడ్ స్పీకర్లు పెట్టాలంటే అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి. అది కూడా ఏడాదిలో 15 రోజులకి మించొద్దని సుప్రీం స్పష్టం చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
లోకల్ రైళ్లలో అందరినీ అనుమతించండి
సాక్షి, ముంబై: ముంబైకర్ల సహనం కట్టలు తెంచుకోకముందే లోకల్ రైళ్లలో సామాన్యులందరికి ప్రయాణాలకు అనుమతినివ్వాలని ప్రభుత్వాన్ని ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. సాధ్యమైనంత త్వరగా అందరికోసం లోకల్ రైళ్లు ప్రారంభిస్తే ఎంతో మంచిదని ఆ లేఖలో పేర్కొన్నారు. సాధారణ ప్రజానీకం సహనం నశించకముందే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు. కరోనా కారణంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ తరువాత లోకల్ రైళ్లలో అత్యవసర విభాగాలలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పేద, సామాన్య ప్రజలు, కూలీలు, కార్మికులు, కష్టజీవులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం రూ.100–150 బస్సు చార్జీలు చెల్లించే ఆర్థిక స్థోమత లేక సతమతం అవుతున్నారు. దీంతో అనేక మంది విధులకు వెళ్లలేక కుటుంబాలు పస్తులు ఉంటున్నాయి. ప్రస్తుతం ముంబైలోని దాదాపు అన్ని కార్యాలయాలు, షాపులు, ఇతర వ్యాపార సంస్థలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. అందరికి ఇంటి నుంచి విధులు నిర్వహించే సౌకర్యం లేదు. లోకల్ రైళ్లలో అనుమతి లేకపోవడంతో శివారు ప్రాంతాల నుంచి ముంబైకి విధులకు రావాలంటే చిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, రాష్ట్రంలో ఇంకా లాక్డౌన్ కొనసాగింపుపై రాజ్ ఠాక్రే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘లాక్డౌన్ ఇంకా ఎన్ని నెలలు అమలులో ఉంటుంది..? గత ఏడాదిన్నర నుంచి సామాన్యులు, పేదలు లోకల్ రైలు సేవలను ఉపయోగించుకోలేక పోతున్నారు. గంటల తరబడి రోడ్డు మార్గం ద్వారా ముంబైకి చేరుకుంటున్నారు. బస్సుల్లో అనుమతిస్తున్నప్పటికీ రద్దీ విపరీతంగా ఉంటోంది. బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొడుగాటి క్యూలు ఉంటున్నాయి. రద్దీవల్ల కరోనా వ్యాప్తి చెందే ప్రమాదమూ లేకపోలేదు. వారి సహనం, ఆగ్రహం కట్టలు తెంచుకోకముందే లోకల్ రైళ్లలో అనుమతించాలి’అని ఆ లేఖలో పేర్కొన్నారు. లాక్డౌన్ పొడిగింపునకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అర్ధరాహిత్యమని ఆ లేఖలో రాజ్ ఠాక్రే విమర్శించారు. ప్రభుత్వానికి లాక్డౌన్ అమలు చేయడం తప్ప ఇతర ప్రత్యామ్నాయ ఆలోచనలు రావడం లేదా అంటూ నిలదీశారు. ‘ఇదివరకే ముంబైకర్లందరి కోసం లోకల్ రైలు సేవలు ప్రారంభించాల్సి ఉంది. జాప్యం జరిగినప్పటికీ ప్రజలు ఎంతో సహనం పాటించారు. ఇక వారి ఓపిక నశించి ఉండవచ్చు’అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా వ్యవహరించని పక్షంలో ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. లోకల్ రైళ్లలో అనుమతించాలని డిమాండ్ చేస్తూ సామాన్యులు, కూలీలు, కష్టజీవులు, ఇతర ప్రయాణికులు ఆందోళనలు చేపడితే ఎమ్మెన్నెస్ వారికి మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. అందరినీ కాకుండా కనీసం కరోనా రెండు డోసుల టీకాలు తీసుకున్న వారినైనా లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతించాలని రాజ్ ఠాక్రే ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.