ముంబై: ప్రముఖ కవి, గీత రచయిత జావెద్ అక్తర్(78) హిందూ సంస్కృతిపై ప్రశంసలు కురిపించారు. హిందువులు ఎంతో సహనశీలురని, వారి వల్లే మన దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తోందని చెప్పారు. అదే సమయంలో, నేడు దేశంలో వాక్ స్వాతంత్య్రం తగ్గిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ముంబైలో రాజ్ ఠాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్) నిర్వహించిన దీపోత్సవ్‌లో ఆయన పాల్గొన్నారు. ‘హిందువులు దయామయులు.
విశాల హృదయులు. అసహనం కలిగిన కొందరున్నారు. హిందువులు వారిలా ఉండరు. హిందువులకు మాత్రమే దయ, విశాల హృదయం అనే గొప్ప లక్షణాలుంటాయి. వాటిని కోల్పోవద్దు. లేకుంటే మిగతా వారికీ మీకూ బేధం ఉండదు. హిందువుల జీవన విధానం నుంచి మేం నేర్చుకున్నాం. వాటిని మీరు వదులుకుంటారా?’అని ఆయన ప్రశ్నించారు. ఇంకా ఆయన.. ‘శ్రీరాముడు, సీతాదేవిల గడ్డపై పుట్టినందుకు గర్విస్తున్నాను.
నేను నాస్తికుడినే అయితే రాముడిని, సీతను ఈ దేశ సంపదగా భావిస్తాను. రామాయణం మన సాంస్కృతిక వారసత్వం’అంటూ జై సియా రాం అని నినదించారు. ‘ఇది హిందూ సంస్కృతి, నాగరికత. మనకు ప్రజాస్వామ్య దృక్పథాలను నేర్పింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. అందుకే మనమే ఒప్పు, అందరిదీ తప్పు అని భావించడం హిందువుల సిద్ధాంతం కాదు. ఇది మీకు ఎవరు నేర్పించినా తప్పే’అని అన్నారు. అయితే, దేశంలో నేడు వాక్ స్వాతంత్య్రం క్షీణిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment