Maharashtra Navnirman Sena (MNS)
-
హిందువులు సహనశీలురు
ముంబై: ప్రముఖ కవి, గీత రచయిత జావెద్ అక్తర్(78) హిందూ సంస్కృతిపై ప్రశంసలు కురిపించారు. హిందువులు ఎంతో సహనశీలురని, వారి వల్లే మన దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తోందని చెప్పారు. అదే సమయంలో, నేడు దేశంలో వాక్ స్వాతంత్య్రం తగ్గిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ముంబైలో రాజ్ ఠాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) నిర్వహించిన దీపోత్సవ్‌లో ఆయన పాల్గొన్నారు. ‘హిందువులు దయామయులు. విశాల హృదయులు. అసహనం కలిగిన కొందరున్నారు. హిందువులు వారిలా ఉండరు. హిందువులకు మాత్రమే దయ, విశాల హృదయం అనే గొప్ప లక్షణాలుంటాయి. వాటిని కోల్పోవద్దు. లేకుంటే మిగతా వారికీ మీకూ బేధం ఉండదు. హిందువుల జీవన విధానం నుంచి మేం నేర్చుకున్నాం. వాటిని మీరు వదులుకుంటారా?’అని ఆయన ప్రశ్నించారు. ఇంకా ఆయన.. ‘శ్రీరాముడు, సీతాదేవిల గడ్డపై పుట్టినందుకు గర్విస్తున్నాను. నేను నాస్తికుడినే అయితే రాముడిని, సీతను ఈ దేశ సంపదగా భావిస్తాను. రామాయణం మన సాంస్కృతిక వారసత్వం’అంటూ జై సియా రాం అని నినదించారు. ‘ఇది హిందూ సంస్కృతి, నాగరికత. మనకు ప్రజాస్వామ్య దృక్పథాలను నేర్పింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. అందుకే మనమే ఒప్పు, అందరిదీ తప్పు అని భావించడం హిందువుల సిద్ధాంతం కాదు. ఇది మీకు ఎవరు నేర్పించినా తప్పే’అని అన్నారు. అయితే, దేశంలో నేడు వాక్ స్వాతంత్య్రం క్షీణిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. -
ఠాక్రేకు హెచ్చరిక.. బ్రిజ్ భూషణ్ సింగ్ రాకతో ఏం జరగనుంది?
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే అయోధ్య పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఉత్తరప్రదేశ్‌లోని కేసర్‌గంజ్ నియోజక వర్గం బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్ ఈ నెల 15న పుణే పర్యటనకు రానున్నారు. పుణేలో మహారాష్ట్ర కేసరీ కుస్తీ పోటీలు జరగనున్న నేపథ్యంలో ఆయన పుణేకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన పర్యటనపై ఎమ్మెన్నెస్ ఎలా స్పందిస్తుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే, బ్రిజ్‌భూషణ్ పర్యటనను వ్యతిరేకించబోమని పుణేకు చెందిన ఎమ్మెన్నెస్ నేత వసంత్ మోరే తెలిపారు. బ్రిజ్‌భూషణ్ సింగ్ పుణే పర్యటనపై ఎమ్మెన్నెస్ నేతలు, పదాధికారులు, కార్యకర్తలు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ చీఫ్ రాజ్ ఠాక్రే ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు దూకుడు తగ్గించి, మెతకవైఖరి అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. ఠాక్రే పర్యటనపై సవాళ్లు..ప్రతిసవాళ్లు.. రాజ్ ఠాక్రే ఈ ఏడాది జూన్ ఐదో తేదీన అయోధ్య పర్యటనకు వెళతానని, అక్కడ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాలని ప్రకటించగానే.. ఆయనను అయోధ్యలో అడుగు పెట్టనివ్వబోమని బ్రిజ్‌భూషణ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. రాజ్ ఠాక్రే అయోధ్యకు రావాలనుకుంటే అప్పట్లో రైల్వే ఉద్యోగ భర్తీ ప్రక్రియలో ముంబై వచి్చన ఉత్తరభారతీయులపై జరిగిన దాడులకు క్షమాపణలు చెప్పాలని, ఆ తర్వాతే అడుగుపెట్టాలని బ్రిజ్‌భూషణ్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అదే సందర్భంలో రాజ్‌ఠాక్రే అయోధ్యకు వస్తే విమానాశ్రయంలో, రైల్వే స్టేషన్లో, రోడ్డు మార్గంలో ఇలా ఎక్కడైనా సరే తమ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారని హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంతో అటు ఉత్తరప్రదేశ్‌లో ఇటు మహారాష్ట్రలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడిక్కింది. రాజ్ ఠాక్రేను వ్యతిరేకించినప్పటికీ జూన్‌లో ఎమ్మెన్నెస్ పదాధికారులు, కార్యకర్తలు కొందరు అయోధ్య వెళ్లి రామున్ని దర్శించుకున్నారు. తాజాగా బ్రిజ్‌భూషణ్‌సింగ్ పుణే పర్యటనతో గత పదేళ్లు సద్దుమణిగిన ఉత్తరభారతీయుల వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ముంబైలో ఎమ్మెన్నెస్– ఉత్తరభారతీయు ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఎదురైంది. బ్రిజ్‌భూషణ్‌సింగ్ విసిరిన సవాలుకు ఎమ్మెన్నెస్ నేతలు అంతే దీటుగా సమాధానమిచ్చారు. ఇక అప్పట్నుంచి ఎమ్మెన్నెస్ నేతలు, బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సమయం కోసం ఎదురు చూస్తున్నారు. చిచ్చుపెట్టేందుకే బ్రిజ్ పర్యటన! ఎమ్మెన్నెస్‌కు బ్రిజ్‌భూషణ్ మధ్య చిచ్చుపెట్టేందుకే బ్రిజ్‌భూషణ్ పుణె పర్యటనకు వస్తున్నారని, ఇందులో ఎన్సీపీ నేత శరద్‌పవార్ హస్తం కూడా ఉండొచ్చని అనుమానం ఎమ్మెన్నెస్ నేత సందీప్ దేశ్‌పాండే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘‘సింగ్ మేక లాంటి వారు. పులిని వేటాడేందుకు మేకను ఎరవేసినట్లు పవార్ మా మధ్య చిచ్చు పెట్టేందుకు సింగ్‌ను పుణేకు ఆహ్వానించి ఉండొచ్చు’’అని దేశ్‌పాండే ఆరోపించారు. విభేదాలు తాత్కాలికమే: బ్రిజ్‌భూషణ్ తనకు రాజ్‌ఠాక్రేకు మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు, విభేదాలు లేవని, అప్పట్లో ఉన్న విభేదాలు తాత్కాలికమేనని బ్రిజ్‌భూషణ్ సింగ్ స్పష్టం చేశారు. 15న రాజ్ ఠాక్రే పుణేలో ఉంటే, ఆయన తనను కలిసేందుకు ఇష్టపూర్వకంగా ఉంటే తప్పకుండా ఆయనను కలిసి వెళ్తానని చెప్పారు. ఎవరీ బ్రిజ్‌భూషణ్ సింగ్ బ్రిజ్‌భూషణ్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని కేసర్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గంలో ఆరుసార్లు విజయకేతనం ఎగురవేశారు. 1991లో గోండా లోక్‌సభ నియోజకవర్గంలో సమీప ప్రత్యర్థిపై 1.31 లక్షల ఓట్ల తేడాతో ఓడించి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆయన బీజేపీ ఎంపీగా ఉన్నారు. అంతేగాకుండా భారతీయ కుస్తీగీర్ సంఘానికి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. అయోధ్యలో వివాదస్పద కట్టడాన్ని కూల్చిన ఘటనలో బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వాని సహా 40 మందిపై నమోదైన కేసులో బ్రిజ్‌భూషణ్ సింగ్ ఒకరు. 2020 సెప్టెంబరు 30న వెలువడిన తీర్పులో సింగ్‌ను నిర్ధోషిగా గుర్తించిన కోర్టు విడుదల చేసింది. కుస్తీ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న సింగ్ అందరికీ సుపరిచితులే కావడంతో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. -
శిండే, ఠాక్రే వివాదంలో జోక్యం వద్దు..రాజ్ ఠాక్రే ఆదేశం
సాక్షి, ముంబై: ఉద్ధవ్ ఠాక్రే, ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే మధ్య జరుగుతున్న రాజకీయ వివాదంలో జోక్యం చేసుకోవద్దని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే పార్టీ పదాధికారులకు, శ్రేణులకు ట్విట్టర్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో స్ధానికంగా జరిగే సభలు, సమావేశాల్లో ఎలాంటి వివాదాస్పద ప్రసంగాలు చేయవద్దని, సోషల్ మీడియాలో కూడా కామెంట్లు చేసిన క్లిప్పింగులు, రాతలుగానీ పెట్టవద్దని సూచించారు. ఇరువురు మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగాక సమయం చూసుకుని తానే స్వయంగా అభిప్రాయాలను వెల్లడిస్తానని పదాధికారులకు, కార్యకర్తలకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు వాడీవేడిగా ఉన్నాయి. శివసేన ఎవరిదనే విషయం తాజాగా ఉండగానే కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంత వరకు శివసేన పేరు, విల్లు–బాణం గుర్తును వినియోగించడంపై ఎన్నికల సంఘం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో శివసేన తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. ఫలితంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇలాంటి సమయంలో మీరు జోక్యం చేసుకుంటే పరిస్ధితి మరో విధంగా మారుతుందని రాజ్ అన్నారు. గతంలో ఎమ్మెన్నెస్ నేత సందీప్ దేశ్‌పాండే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వ్యాఖ్యలు, సందేశాలు దుమారం లేపాయి. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఎమ్మెన్నెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇది కొద్దిరోజుల వరకు సాగింది. గత అనుభవం, తాజా పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని ఈ వివాదంలో ఎవరూ మాట్లాడవద్దని, రాయవద్దని రాజ్ హెచ్చరించారు. -
ముంబైలో రెచ్చిపోయిన రాజ్ థాక్రే వర్గం.. మహిళకు ఘోర అవమానం
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాజ్ థాక్రే అనుచరులు ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఆమెపై దాడి చేసి, చెప్పులతో కొట్టారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. ఆగస్టు 28వ తేదీన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) నాయకుడు వినోద్ అర్గిలే నేతృత్వంలో ముంబా దేవి ఆలయం వద్ద ఎంఎన్ఎస్ పార్టీకి సంబంధించిన హోర్డింగ్ నిమిత్తం వెదురు కట్టెలను పాతారు. ఈ క్రమంలో ప్రకాశ్ దేవీ అనే మహిళ వారిని అడ్డుకుని తన షాపు ఎదుట వారి పార్టీకి సంబంధించిన హోర్డింగ్స్ పెట్టవద్దని చెప్పింది. అయితే, సదరు మహిళ మాటలను లెక్కచేయకుండా మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే అనుచరులు.. హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. దీంతో, సదరు మహిళ, కార్యకర్తల మధ్య వాగ్వాదం జరగడంతో రెచ్చిపోయిన కార్యకర్తలు.. ఆమెపై దాడి చేసి, చెప్పులతో కొట్టి, తోసిపడేశారు. అంతటితో ఆగకుండా ఆమెను అసభ్య పదజాలంతో దూషించారు. కాగా, వారి దాడిలో మహిళ తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. అయితే, జరిగిన విషయంపై బాధితురాల పోలీసులను ఆశ్రయించినప్పటికీ.. వారు కేసు నమోదు చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. An elderly woman was assaulted and abused by MNS workers in Mumbai. A woman namely Prakash Devi, runs a medical shop, MNS workers installed wooden poles in front of her medical which led to an argument. She requested to remove but MNS started assaulted her. pic.twitter.com/PNji8DxrIR — Meenu Thakur (@JournoMeenu) September 1, 2022 -
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. వారి భేటీ అందుకేనా?
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే సోమవారం ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధికార నివాసమైన సాగర్ బంగ్లాలో భేటీ అయ్యారు. అకస్మాత్తుగా జరిగిన ఇరువురి భేటీవల్ల రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తావిచ్చినట్లయింది. త్వరలో ముంబై, థానే, పుణే, నాసిక్ తదితర ప్రధాన కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్ ఠాక్రే ఫడ్నవీస్‌తో భేటీ కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 2019 అక్టోబరులో ముఖ్యమంత్రి పీఠంపై శివసేన, బీజేపీ మధ్య నెలకొన్న వివాదం చివరకు తెగతెంపులు చేసుకునే వరకు దారి తీసిన విషయం తెలిసిందే. శివసేనతో తెగతెంపులు చేసుకున్న తరువాత అప్పటి నుంచి బీజేపీ, ఎమ్మెన్నెస్‌ల మధ్య సాన్నిహిత్యం కొంతమేర పెరిగిపోయింది. ముఖ్యంగా ఎమ్మెన్నెస్‌కు ముంబై, థానే, నాసిక్, పుణే కార్పొరేషన్లలో మంచి పట్టు ఉంది. దీంతో బీజేపీ, ఎమ్మెన్నెస్ మధ్య పొత్తు కుదురుతుండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శివసేనకు చెందిన ఏక్నాథ్ శిందే వర్గం దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెన్నెస్ మద్దతు కూడా లభిస్తే ఆ నాలుగు కార్పొరేషన్లలో విజయం సులభం కానుంది. దీంతో బీజేపీ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీకి దగ్గరవుతున్న ఎమ్మెన్నెస్ ఇదిలాఉండగా బీజేపీ శివసేనతో తెగతెంపులు చేసుకున్న తరువాత దేవేంద్ర ఫడ్నవీస్, రాజ్ ఠాక్రే మధ్య సంబంధాలు కొంత బలపడ్డట్లు తెలుస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రాజ్ ఠాక్రే ఓ లేఖ రాశారు. అందులో ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసినందుకు ఫడ్నవీస్‌ను ప్రశంసించారు. అనంతరం రాజ్ ఠాక్రే నివాసమైన శివ్ తీర్ధ్ బంగ్లాకు వెళ్లి ఫడ్నవీస్‌తో భేటీ అయ్యారు. అదేవిధంగా రాజ్ ఠాక్రే మసీదులపై అక్రమంగా ఏర్పాటు చేసిన లౌడ్స్పీకర్లకు వ్యతిరేకంగా లేవనెత్తిన ఆందోళనకు బీజేపీ నుంచి ప్రశంసల జల్లులు కురిశాయి. అప్పుడే హిందుత్వ నినాదంపై బీజేపీ, ఎమ్మెన్నెస్ ఒక్కటవుతుండవచ్చని వార్తలు గుప్పుమన్నాయి. అప్పటి నుంచి ఇరుపార్టీల మధ్య రోజురోజుకు పెరుగుతున్న సాన్నిహిత్యం, ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం రాజ్ ఠాక్రే ఫడ్నవీస్‌తో భేటీకావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సోమవారం జరిగిన భేటీ మర్యాదపూర్వకంగా జరిగిందా...లేక రాజకీయ పరంగా జరిగిందా.. అనేది త్వరలో బయటపడనుంది. చదవండి: (చిన్న పార్టీలకు అధికారం దక్కకుండా చేయడమే బీజేపీ ఎజెండా) ఎన్నికలకు సిద్ధమవుతున్న అన్ని పార్టీలు త్వరలో ముంబై, థానే సహా పుణే, పింప్రి–చించ్వడ్, ఉల్లాస్‌నగర్, భివండీ, పన్వేల్, మీరా–భాయందర్, షోలాపూర్, నాసిక్, మాలేగావ్, పర్భణీ, నాందేడ్, లాతూర్, అమరావతి, అకోలా, నాగ్‌పూర్, చంద్రాపూర్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఓబీసీ రిజర్వేషన్ కారణంగా తరుచూ ఈ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. కాని ఈ ఎన్నికల్లో తమ బలం, సత్తా ఏంటో నిరూపించుకునేందుకు అన్ని పార్టీలు నడుం బిగించాయి. ఇటీవల ఏక్నాథ్ శిందే తిరుగుబాటుతో మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం కుప్పకూలిన తరువాత ఎన్నికలు జరగడం ఇదే ప్రథమం. దీంతో అధికార పార్టీతో పాటు, ప్రతిక్షాలు కూడా ఈ ఎన్నికలను ఒక సవాలుగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా గత ఐదు దశాబ్దాలకుపైగా ఒక్కటిగా ఉన్న శివసేన పార్టీ ఇప్పుడు రెండుగా చీలిపోయింది. దీంతో ఈ ఎన్నికల్లో ఏలాంటి అద్భుతం జరుగుతుంది..? ఫలితాలు ఎలా వస్తాయనే దానిపై యావత్ రాష్ట్ర ప్రజల దృష్టి ఇటువైపు ఉంది. -
ఒకేఒక్క ఎమ్మెల్యేతో జాక్‌పాట్.. కేబినెట్లో చోటు!
ముంబై: మహారాష్ట్రలో శివ సేన చీలిక తర్వాత.. రెబల్ వర్గంతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఇప్పుడు మంత్రివర్గ కూర్పుపై దృష్టిసారించింది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలూ ఉన్నందునా.. రాజకీయ స్థిరత్వం కోసం పావులు కదుపుతోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రేను ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కలిశారు. దాదర్(మధ్య ముంబై)లోని థాక్రే నివాసం ‘శివతీర్థ’కు స్వయంగా వెళ్లిన ఫడ్నవీస్.. గంటన్నరకు పైనే మంతనాలు జరిపారు. రాజ్‌థాక్రేకు గత నెలలో సర్జరీ జరిగింది. అలాగే షిండే వర్గంతో పొత్తు సమయంలో అనూహ్యంగా ఉపముఖ్యమంత్రి పదవికి సుముఖత వ్యక్తం చేశారు ఫడ్నవీస్. ఆ సమయంలో ఫడ్నవీస్ త్యాగాన్ని కొనియాడాడు రాజ్ థాక్రే. ఈ నేపథ్యంలోనే మర్యాదపూర్వకంగా కలిసినట్లు ప్రచారం జరిగింది. అయితే.. మొదటి నుంచి ఎంఎన్ఎస్.. బీజేపీకి మద్దతుదారు పార్టీనే. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో, రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ప్రత్యక్ష మద్దతు ప్రకటించింది ఎంఎన్ఎస్. అలాగే త్వరలో బీఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంకోవైపు మంత్రి వర్గ కూర్పు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రాజకీయపరమైన చర్చ ఇద్దరి మధ్య జరిగినట్లు తెలుస్తోంది. కేబినెట్లో చోటు! మహారాష్ట్రలో బీజేపీ రాజకీయ స్థిరత్వం కోసం ప్రయత్నిస్తోంది. మరో రెండున్నరేళ్ల పాటు అధికారం కొనసాగేందుకు అవసరమైన మద్దతు కూడగడుతోంది. ఈ క్రమంలో షిండే వర్గంతో పాటు చిన్న చిన్న పార్టీలను కూడదీసుకుని ముందుకు వెళ్లాలనుకుంటోంది. గతంలోనూ.. ఇప్పుడూ ఎంఎన్ఎస్ మహారాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంది. ఇప్పుడు ఉన్నది ఒక్క సీటే అయినా.. కేబినెట్లో స్థానం ద్వారా మరింత మచ్చిక చేసుకోవాలని బీజేపీ-షిండే వర్గం భావిస్తోంది. ఎంఎన్ఎస్కు ఉన్న ఏకైక ఎమ్మెల్యే ప్రమోద్ రతన్ పాటిల్. కల్యాణ్ రూరల్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2010లో ఎంఎన్ఎస్ పార్టీ స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో 29 సీట్లు గెలవడానికి ఈయనే మూలకారణం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ ఆయనకు పట్టుంది. అందుకే ప్రమోద్‌కు కేబినెట్ బెర్త్ ఆఫర్ చేస్తోంది బీజేపీ. అయితే.. ఇదికాకుండా మరో ప్రతిపాదన సైతం రాజ్ థాక్రే ముందు ఉంచింది. రాజ్ థాక్రే తనయుడు అమిత్ థాక్రేకు షిండే కేబినెట్లో ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అమిత్ చట్టసభలో సభ్యుడిగా లేడు. ఒకవేళ కేబినెట్ హోదా గనుక ఇస్తే.. ఎమ్మెల్యేగా లేదంటే ఎమ్మెల్సీగా తప్పకుండా గెలవాలి. దీంతో బీజేపీ ఆఫర్‌పై రాజ్ థాక్రే పార్టీ వర్గంతో చర్చిస్తున్నట్లు సమాచారం. -
లౌడ్స్పీకర్లు తీస్తేనే.. హనుమాన్ చాలీసా ఆపేస్తాం
ముంబై: ప్రార్థనా మందిరాల్లో లౌడ్‌స్పీకర్ల విషయంలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే తన వైఖరిని సమర్థించుకున్నారు. మసీదుల్లో లౌడ్స్పీకర్లు ఉన్నంతకాలం తమ పార్టీ కార్యకర్తలు హనుమాన్ చాలీసాను బిగ్గరగా పఠిస్తూనే ఉంటారని బుధవారం తేల్చిచెప్పారు. ముంబై పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించేవారిని స్వేచ్ఛగా వదిలేసి తమ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. తన పిలుపు తర్వాత 90 శాతం మసీదుల్లో లౌడ్‌స్పీకర్ల మోత ఆగిపోయిందని చెప్పారు. లౌడ్స్పీకర్లకు వ్యతిరేకంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. మసీదుల్లో రోజుకు నాలుగైదు సార్లు లౌడ్స్పీకర్లు ఉపయోగిస్తే, తమ కార్యకర్తలు కూడా రెట్టింపు శబ్దంతో హనుమాన్ చాలీసా పఠిస్తారని పేర్కొన్నారు. ఏ ఆలయమైనా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాల్సిందేనని సూచించారు. న్యాయస్థానం అనుమతించిన శబ్ద పరిమితిని ఉల్లంఘించడానికి వీల్లేదన్నారు. ముంబైలో బుధవారం రాజ్ నివాసం వద్ద ఎంఎన్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. మాకు హిందుత్వను నేర్పొద్దు: రౌత్ లౌడ్‌స్పీకర్ల నిబంధనలను ఎవరూ ఉల్లంఘించడం లేదని అధికార శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. హిందుత్వ గురించి తమకు నేర్పించొద్దన్నారు. నకిలీ హిందుత్వవాదుల మాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. శివసేనకు వ్యతిరేకంగా కుతంత్రాలు సాగిస్తున్నారని పరోక్షంగా బీజేపీ, ఎంఎన్ఎస్ నేతలపై మండిపడ్డారు. ప్రజల్లో విభజన మంటలు రేపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. -
అమిత్‌కు విద్యార్థి సేన పగ్గాలు!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్)కు అనుబంధంగా ఉన్న విద్యార్థి సేన అధ్యక్షుడిగా అమిత్ ఠాక్రేకు నియమించనున్నారని తెలిసింది. ఇదివరకు విద్యార్థి సేన అధ్యక్ష పదవిలో కొనసాగిన ఆదిత్య శిరోడ్కర్ ఎమ్మెన్నెస్ నుంచి బయటపడి శివసేనలో చేరారు. దీంతో ఖాళీ అయిన ఆ పదవిలో పార్టీ చీఫ్ రాజ్‌ఠాక్రే తనయుడు అమిత్ ఠాక్రేను నియమించేందుకు ఆ పార్టీ పదాధికారులు, కార్యకర్తలు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆ పార్టీలో పలువురు సీనియర్ల పేర్లు రేసులో ఉన్నప్పటికీ అమిత్ ఠాక్రేను నియమించాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది. దీంతో ఈ పదవీ బాధ్యతలు ఎవరికి కట్టబెడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. నాసిక్‌లో చర్చలు.. ఎమ్మెన్నెస్ ప్రధాన కార్యదర్శి, విద్యార్థి సేన అధ్యక్షుడు ఆదిత్య శిరోడ్కర్ ఇటీవల ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమక్షంలో శివసేనలో చేరారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఆదిత్య అకస్మాత్తుగా శివసేనలో చేరడం వల్ల ఎమ్మెన్నెస్‌కు గట్టి దెబ్బ తగిలినట్లైంది. వచ్చే సంవత్సరం బీఎంసీ ఎన్నికలు, భవిష్యత్తులో అసెంబ్లీ, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఆదిత్య ఇలా అకస్మాత్తుగా పార్టీని విడటం రాజ్ ఠాక్రేతోపాటు ఆ పార్టీ సీనియర్ నాయకులు, పదాధికారులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం రాజ్‌ఠాక్రే నాసిక్ పర్యటనలో ఉన్నారు. దీంతో ఆ పదవిలో ఎవరిని నియమించాలనే దానిపై చర్చించేందుకు అమిత్‌తోపాటు పలువురు సీనియర్ నాయకులు వెంటనే నాసిక్‌కు రావాలని సందేశం పింపించారు. అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై చర్చించినట్లు తెలిసింది. ఇందులో అధిక శాతం అమిత్‌నే నియమించడానికి ఇష్టపడినట్లు తెలిసింది. ఒకవేళ ఈ పదవిలో అమిత్ ఠాక్రేను నియమిస్తే నేటి యువ కార్యకర్తల్లో నవ చైత్యనం నూరిపోసినట్లవుతుంది. దీంతో అమిత్‌నే నియమించాలని పదాధికారులు, కార్యకర్తలు పట్టుబడినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కాగా ఎమ్మెన్సెస్ సినెట్ సభ్యులు సుధాకర్ తాంబోలి, అఖిల్ చిత్రే, గజానన్ కాళే తదితర సీనియర్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. కానీ, ముందువరుసలో అమిత్ ఠాక్రే ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇందులో విద్యార్థి సేన అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రారంభంలో ఘనంగా.. అప్పట్లో శివసేన నుంచి బయటపడిన రాజ్‌ఠాక్రే సొంత పార్టీ పెట్టుకున్నారు. అన్ని వర్గాల ప్రజలను తమ పార్టీలో చేర్చుకుంటామని పేర్కొంటూ 2006 మార్చి 9వ తేదీన ఎమ్మెన్నెస్ పార్టీ స్థాపించారు. ప్రారంభంలో తిరుగులేని పార్టీగా ఎదిగిన ఎమ్మెన్నెస్ ప్రధాన పార్టీలను సైతం దెబ్బతీసింది. ఆ తరువాత జరిగిన బీఎంసీ, నాసిక్ కార్పొరేషన్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించుకుంది. కాని కాలక్రమేణా పార్టీ ప్రతిష్ట, ప్రాబల్యం దెబ్బతినసాగింది. దీంతో కార్పొరేటర్ల సంఖ్య, ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోయింది. చివరకు పార్టీలో ఒక్కరే ఎమ్మెల్యే, ఒక్కరే కార్పొరేటర్ మిగిలారు. ఇది పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో పార్టీ కోల్పోయిన ప్రతిష్ట, కార్యకర్తలు కోల్పోయిన మనోధైర్యాన్ని తిరిగి నింపేందుకు శత ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగం గా త్వరలో ఎన్నికలు జరగనున్న కార్పొరేషన్లలో పర్యటించడం, పదాధికారులు, కార్యకర్తలతో సంప్రదించడం లాంటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అదేవిధంగా సభ్యత నమోదు పథకాన్ని సోషల్ మీడియా ద్వారా చేపట్టి పార్టీలో కార్యకర్తల సంఖ్య పెంచుకోవాలని, అలాగే ప్రజలకు మరిం త దగ్గరవ్వాలనే ప్రయత్నం రాజ్ ఠాక్రే చేస్తున్నా రని పార్టీ అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఒకవేళ విద్యార్థి సేన పగ్గాలు అమిత్‌కు దక్కితే పార్టీలో నూతనోత్తేజం రావడం ఖాయమని రాజకీయ వర్గాలో చర్చ నడుస్తోంది. -
‘దయచేసి పెద్ద మనసు చేసుకోండి బిగ్‌బి’
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ముంబైలోని నివాసం ప్రతీక్ష ఇటీవల వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. రోడ్డు మధ్యలో ఆయన బంగ్లా ఉందని, ఇంటి గోడను కూల్చివేయాలంటూ బృహత్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్(బీఎంసీ) గతంలో నోటీసులు ఇచ్చింది. అయినప్పటికీ అమితాబ్ దీనిపై స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ పెద్ద మనసు చాటుకోవాలని కోరుతూ ఎంఎన్ఎస్ కార్యకర్తలు ప్లకార్డుల ప్రదర్శనకు దిగారు. ‘బిగ్‌బి.. దయచేసి.. పెద్ద మనసు చేసుకోండి’ అంటూ బుధవారం రాత్రి జుహులోని ప్రతీక్ష ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా ఎంఎన్ఎస్ నేత మనీష్ ధురి మాట్లాడుతూ ‘ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా సంత్ జ్ఞానేశ్వర్ రోడ్డు విస్తరణ కోసం బీఎంసీ 2017లో అమితాబ్‌తో పాటు పలువురికి నోటీసులు జారీ చేసింది. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. రోడ్డు విస్తరణ కోసం అందరు సహకరించినా అమితాబ్ మాత్రం సహకరించడం లేదు. దీనిపై ఆయన స్పందన కోసం ఎదురు చూస్తున్నాము. ఈ మేరకే ఆయన ఇంటి ఎదుట ప్లకార్డుల ప్రదర్శనకు దిగాము’ అని చెప్పుకొచ్చారు. అంతేగాక ఈ విషయంలో బీఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా, బిగ్‌బి దీనిపై స్పందించకపోయినా బీఎంసీకి వ్యతిరేకంగా భారీ నిరసన చేపడతామని హెచ్చరించారు. అయితే ట్రాఫిక్ సమస్యను పరిష్కారించేందుకు రోడ్డు విస్తరణలో భాగంగా అమితాబ్ బంగ్లా ప్రతిక్ష గోడను పడగొట్టాలని బీఎంసీ ప్రణాళిక వేసింది. ప్రస్తుతం ఈ రోడ్డు 45 అడుగులు ఉండగా.. దాన్ని 60 అడుగులకు విస్తరించాలని ప్లాన్ చేస్తుంది. -
సీఏఏ, ఎన్నార్సీలపై నిరసనలెందుకు?
ముంబై: అక్రమంగా భారత్‌లో నివాసముంటున్న పాకిస్తానీయులు, బంగ్లాదేశీలను తిప్పి పంపాల్సిందేనని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే డిమాండ్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరపట్టిక (ఎన్నార్సీ)లకు మద్దతుగా ఆదివారం ముంబైలో గిర్గావ్ చౌపట్టి నుంచి ఆజాద్ మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వేలాది మంది కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం ఆజాద్ మైదానంలో ఆయన మాట్లాడుతూ.. సీఏఏ, ఎన్నార్సీలపై నిరసనలు ఎందుకు చేస్తున్నారంటూ సీఏఏ వ్యతిరేక నిరసనకారులను ప్రశ్నించారు. నిరసనలు ఇలాగే కొనసాగితే.. నిరసనలకు నిరసనలతో, రాళ్లకు రాళ్లతో, ఖడ్గాలకు ఖడ్గాలతోనే జవాబిస్తామని హెచ్చరించారు. పుట్టినప్పటి నుంచి భారత్‌లోనే ఉన్న ముస్లింలను ఎవరూ వెలివేయబోవడంలేదని, వారెందుకు నిరసనలు చేస్తున్నారో అర్థంకావడంలేదన్నారు. సీఏఏ, ఎన్నార్సీ నిరసనకారులు తమ బలాన్ని ఎవరికి, ఎందుకు చూపించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. సీఏఏను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే నిరసనలు జరుగుతున్నాయన్నారు. చొరబాటుదారులకు ఆశ్రయం ఇవ్వడానికి భారత్ ఏమైనా ధర్మసత్రమా అని ఆయన ప్రశ్నించారు. -
‘మర్యాదగా వెళ్తారా.. గెంటెయ్యమంటారా?’
ముంబై: బంగ్లాదేశీయులు వెంటనే భారత దేశాన్ని విడిచివెళ్లిపోవాలని.. లేదంటే తామే వెళ్లగొడతామని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్ఎన్ఎస్) నాయకులు బెదిరింపులకు దిగారు. ఈ మేరకు.. ‘‘బంగ్లాదేశీయులు మీరు దేశాన్ని విడిచివెళ్లిపోండి. లేదంటే ఎమ్ఎన్ఎస్ స్టైల్లో మేమే గెంటేస్తాం’’అంటూ రాయ్‌గఢ్ జిల్లాలో ఎమ్ఎన్ఎస్ పేరిట పోస్టర్లు వెలిశాయి. ఇందులో ఎమ్ఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ఫొటోతో పాటు కొత్తగా రాజకీయాల్లో చేరిన ఆయన కుమారుడు అమిత్ ఫొటోను కూడా బ్యానర్లో చేర్చారు. కాగా నరేంద్ర మోదీ సర్కారు తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు తెలుపుతున్నట్లు ఎమ్ఎన్ఎస్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అదే విధంగా మహారాష్ట్రలో శివసేన.. కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో బీజేపీతో కలిసి హిందుత్వ జెండాతో ముందుకు సాగేందుకు పార్టీ నిర్ణయించింది. ఇక పార్టీ జెండాలో సైతం పలు మార్పులు చేసింది. హిందుత్వాన్ని ప్రతిబింబించేలా జెండాను పూర్తిగా కాషాయ రంగులోకి మార్చి... మధ్యలో ఛత్రపతి శివాజీ కాలంనాటి రాజముద్రను చేర్చారు. కాగా ఎమ్ఎన్ఎస్ స్థాపించిన సమయంలో.. పార్టీ జెండాను కాషాయం, నీలం, ఆకుపచ్చ రంగులతో తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతుండగా... ఎమ్ఎన్ఎస్ ఈ విధమైన పోస్టర్లు వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా శివసేన నుంచి బయటికొచ్చిన రాజ్ ఠాక్రే 2006లో ఎమ్ఎన్ఎస్ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. (శివసేనకు చెక్.. బీజేపీతో కలిసిన రాజ్‌ఠాక్రే..!) -
ఠాక్రే కుటుంబం నుంచి మరో వారసుడు..
ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన ఠాక్రేల కుటుంబం నుంచి మరో వారసుడు రాజకీయాల్లోకి వచ్చారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్ ఠాక్రే జయంతి సందర్భంగా గురువారం గోరెగావ్‌లో ఎమ్మెన్నెస్ మహా సభ నిర్వహించింది. ఈ వేదికపై నుంచే ఎమ్మెన్నెస్ సీనియర్ నాయకులు అమిత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా అమిత్ మాట్లాడుతూ.. ‘పార్టీ స్థాపించిన 14 ఏళ్లలో తొలిసారిగా నేను ఓ బహిరంగసభలో మాట్లాడుతున్నాను. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంద’ని అన్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న అమిత్ తల్లి షర్మిల భావోద్వేగానికి లోనయ్యారు. ఎమ్మెన్నెస్‌లో అమిత్‌కు ఏ బాధ్యతలు అప్పగిస్తారనేదానిపై ఆ పార్టీ నేతలు స్పష్టత ఇవ్వలేదు. అయితే ఎమ్మెన్నెస్ యూత్ వింగ్ బాధ్యతలను అమిత్‌కు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే పార్టీ జెండాలో కూడా మార్పులు చేశారు. హిందూత్వాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ఆలోచనలతో పూర్తిగా కాషాయం రంగుతో పార్టీ కొత్త జెండాను రూపొందించారు. జెండా మధ్యలో ఛత్రపతి శివాజీ కాలంనాటి రాజముద్రను చేర్చారు. ఎమ్మెన్నెస్ స్థాపించినప్పుడు.. పార్టీ జెండాను కాషాయం, నీలం, ఆకుపచ్చ రంగులతో తీర్చిదిద్దారు. కాగా, శివసేన నుంచి బయటికొచ్చిన రాజ్ ఠాక్రే 2006లో ఎమ్మెన్నెస్‌ను స్థాపించారు. అనంతరం 2009లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో మొదటిసారి పోటీచేసిన ఎమ్మెన్నెస్.. 13 సీట్లలో గెలుపొందింది. ఆ తర్వాత పలు ఎన్నికల్లో ఆ పార్టీ పోటీచేసిన కూడా అశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 122 స్థానాల్లో పోటీచేసిన ఎమ్మెన్నెస్.. ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందడం ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే పార్టీలో పలు మార్పులు చేయాలని ఆలోచనకు వచ్చారు. మరోవైపు ఠాక్రేల కుటుంబం నుంచి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ఆదిత్య ఠాక్రే.. వర్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. దీంతో శివసేనకు, బీజేపీకి మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి హిందూత్వ ఎజెండాతో ముందుకెళ్లాలని ఎమ్మెన్నెస్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో రాజ్ ఠాక్రే భేటీ అయిన సంగతి తెలిసిందే. -
110 స్థానాల్లో పోటీ.. ఒక్క చోట విజయం
సాక్షి, ముంబై: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాల్లలో బీజేపీ-శివసేన కూటమి దూసుకుపోతుండగా, కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి వెనుకబడింది. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్ఎన్ఎస్) ఘోరంగా చతికిలపడింది. 110 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసిన ఈ పార్టీ కేవలం ఒకచోట గెలిచింది. ఈ ఎన్నికల్లో కనీసం ప్రభావం చూపలేకపోయింది. తన మాటలతో జనాన్ని ఆకర్షించే నాయకుడిగా పేరుపొందిన 51 ఏళ్ల రాజ్ థాకర్ తన పార్టీని మాత్రం గెలుపుబాట పట్టించలేకపోయారు. 2006లో శివసేన నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ 13 సీట్లు గెలిచింది. 2014లో కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ పోటీ చేయకపోయినప్పటికీ, బీజేపీ వ్యతిరేకంగా రాజ్ ఠాక్రే ప్రచారం నిర్వహించారు. అప్పుడు కూడా ఆయన పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 48 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ-శివసేన కూటమి 42 చోట్ల గెలిచి సత్తా చాటింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంలపై విరుచుకుపడ్డారు. కేంద్రం ఎన్నికల సంఘం బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ నిర్వహించేంత వరకు అసెంబ్లీ ఎన్నికలు బహిష్కరించాలని కాంగ్రెస్, ఎన్సీపీలను కోరారు. శరద్ పవార్‌తో పాటు కాంగ్రెస్ కూడా ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో రాజ్ ఠాక్రే రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. (చదవండి: ఎన్నికల ఫలితాల అప్డేట్స్) -
ఈడీ ఎదుటకు రాజ్ ఠాక్రే
సాక్షి, ముంబై: మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించింది. రాత్రి 8.15 గంటల వరకు కూడా విచారణ కొనసాగింది. మరోసారి ఆయన్ను విచారణకు పిలిచేదీ లేనిదీ ఈడీ వెల్లడించలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(ఐఎల్ అండ్ ఎఫ్ఎస్) నుంచి కోహినూర్ సీటీఎన్ఎల్ కంపెనీకి రూ.450 కోట్ల రుణాలు ఇప్పించడంలో రాజ్‌ఠాక్రే అవకతవకలకు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తోంది. -
నానా పటేకర్ అలాంటోడే కానీ..
సాక్షి, ముంబై : మీటూ ఉద్యమంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు నానా పటేకర్ అమర్యాదకరంగా వ్యవహరిస్తాడని తనకు తెలుసన్నారు. అయితే ఆయన ఇలాంటి పనులు చేశాడని తాననుకోవడం లేదని, కోర్టులే దీన్ని నిగ్గుతేలుస్తాయని వ్యాఖ్యానించారు. మీటూ సీరియస్ అంశమని, దీనిపై మీడియా ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఇలాంటి సున్నిత అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరగరాదని కోరారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న పెట్రో ధరలు, రూపాయి క్షీణత, నిరుద్యోగం వంటి తీవ్ర సమస్యల నుంచి పక్కదారి పట్టించేందుకే ఈ ఉద్యమం ముందుకువచ్చిందని రాజ్ థాకరే సందేహం వ్యక్తం చేశారు. మహిళలకు ఎలాంటి అవాంఛనీయ పరిస్థితి ఎదురైనా వారు ఎంఎన్ఎస్ను సాయం కోసం ఆశ్రయించవచ్చన్నారు. మహిళలు తాము అణిచివేతకు గురైన వెంటనే గొంతెత్తాలని, పదేళ్ల తర్వాత కాదని ఆయన చురకలు వేశారు. -
భారత్ బంద్‌కు రాజ్ థాకరే మద్దతు
సాక్షి, ముంబై : ఇంధన భారాలకు వ్యతిరేకంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) మద్దతు ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతుండటం పట్ల సామాన్య ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, భారత్ బంద్‌లో తమ పార్టీ చురుకుగా పాల్గొంటుందని రాజ్ థాకరే ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. పెట్రో ధరలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులతో మరింత భారమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి ఇష్టాఇష్టాలకు అనుగుణంగా దేశ విధానాలు ఉండటం ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని దుయ్యబట్టారు. నోట్ల రద్దు పర్యవసానాలను చక్కదిద్దుకునేందుకు పెట్రోల్, డీజిల్ ధరలపై భారీగా పన్నులు వడ్డించారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ తప్పిదాలకు సామాన్యుడిపై భారం ఎందుకు మోపుతున్నారని ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రజలంతా రాజకీయ, సిద్ధాంత వైరుధ్యాలను పక్కనపెట్టి బంద్‌లో పాల్గొనాలని కోరారు. -
థియేటర్లో అధిక రేట్లు.. మేనేజర్‌ను చితక్కొట్టారు..
పూణే : మల్టీఫ్లెక్స్‌లో ఆహార పదార్థాలను అధిక రేట్లకు అమ్మడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన(ఎమ్ఎన్ఎస్) కార్యకర్తలు అసిస్టెంట్ మేనేజర్‌పై దాడి చేశారు. అధిక రేట్లపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ అతన్ని చావబాదారు. ఈ ఘటన శుక్రవారం పూణేలోని ఓ మల్టీఫ్లెక్స్‌లో చోటు చేసుకుంది. కాగా, థియేటర్లో అసిస్టెంట్ మేనేజర్‌పై దాడి చేసిన వారిలో మాజీ కార్పొరేటర్ కూడా ఉన్నారు. దాడికి పాల్పడిన వారందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సేనాపతి బాపత్ రోడ్‌లోని పీవీఆర్ ఐకాన్ మల్టీఫ్లెక్స్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై వివరణ ఇచ్చిన మాజీ కార్పొరేటర్ షిండే.. థియేటర్లలో అధిక రేట్లకు ఆహార పదార్థాలను అమ్మడంపై హైకోర్టు ఉత్తర్వులను ప్రస్తావించారు. అధిక రేట్లకు ఆహారపదార్థాలను అమ్ముతున్నారని, అలా చేయకుండా అరికట్టాలని ప్రభుత్వానికి కోర్టు చేసిన సూచనలను షిండే గుర్తు చేశారు. అన్ని థియేటర్లకు వెళ్లినట్లే పీవీఆర్ ఐకాన్‌కు కూడా వెళ్లామని తెలిపారు. అధిక రేట్ల గురించి మల్టీఫ్లెక్స్ అసిస్టెంట్ మేనేజర్‌తో మాట్లాడగా ఆయన ’డబ్బులు ఉన్నవాళ్లే థియేటర్‌కు రావాలి. భరించలేని వాళ్లు థియేటర్‌కు రావొద్దు.’అని వ్యాఖ్యానించినట్లు చెప్పారు. దీనిపై అసిస్టెంట్ మేనేజర్‌తో వాగ్వాదం జరిగిందని, దీంతో కొందరు ఎంఎన్ఎస్ కార్యకర్తలు అతనిపై చేయి చేసుకున్నారని వెల్లడించారు. కాగా, ముంబైలో సినిమా టికెట్ల రేట్ల కంటే అక్కడ అమ్మే ఆహార పదార్థాల రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి. -
ముంబైలో కలకలం; గుజరాతీల షాపులపై దాడి
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే ఇచ్చిన మోదీ ముక్త్ భారత్ నినాదం సెగలు రేపుతోంది. ముంబయి శివాజీ పార్క్‌లో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముంబయి శివార్లలోని వసాయ్‌లో ఎంఎన్ఎస్ కార్యకర్తలు గుజరాతీల దుకాణాలను టార్గెట్ చేసి సైన్బోర్డులను ధ్వంసం చేశారు. ముంబయి-అహ్మదాబాద్ హైవేపై పలు గుజరాతీ దాబాలపై కూడా ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడులు చేశారు. మహారాష్ట్రలో గుజరాతీల ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ఎంఎన్ఎస్ చెలరేగడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది జులైలోనూ దాదర్‌లోని ఓ జ్యూవెలరీ షాపుపై, ముంబయిలోని మహీంలో ఓ హోటల్పైనా హింసాత్మక దాడులకు తెగబడ్డారు. గుజరాతీలో ఉన్న సైన్బోర్డులను లాగిపడవేశారు. అప్పట్లో దాదార్‌లోని పీఎన్ గాడ్గిల్ జ్యూవెలర్స్ ఎదుట ఆందోళనకు దిగిన ఎంఎన్ఎస్ కార్యకర్తలు మేనేజ్మెంట్ దిగివచ్చి సైన్‌బోర్డును తొలగించడంతో శాంతించారు. నగరంలోని మహీం వద్ద గుజరాతీలో ఉన్న హోటల్ శోభ సైన్‌బోర్డును కూడా ఎంఎన్ఎస్ కార్యకర్తలు బలవంతంగా తొలగింపచేశారు. -
గుజరాత్ ఎన్నికలు.. గెలిస్తే వాటి మహిమే!
సాక్షి, ముంబై : ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గుజరాత్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటమి తప్పదని రాజ్ థాక్రే అంటున్నారు. శనివారం ఓ బహిరంగ సభలో పాల్గొన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్.. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీపై వ్యాఖ్యలు చేశారు. ’’గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిపోతుంది. ఇది నేను చెబుతుంది కాదు.. తాజా నివేదికలు, సర్వేలు చెబతుతున్నాయి. మోదీ మాట్లాడుతుంటే ప్రజలు లేచివెళ్లిపోతున్నారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. ఇది ఆయన పాలనపై అసంతృప్తితో ఉన్నారన్నటానికి సంకేతమనే భావించవచ్చు. ఒకవేళ వాళ్లు(బీజేపీ) చెబుతున్నట్లు 150 సీట్లు గెలవాలంటే ఓ అద్భుతం జరగాలి. అది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎం)ల మహిమన్నది నేను బలంగా నమ్ముతా" అని రాజ్ థాక్రే అన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా రాహుల్ తప్పిదాల వల్లే మోదీ అధికారంలోకి వచ్చారని.. మోదీ ఛరిష్మా కేవలం 15 శాతం మాత్రమే పని చేసిందని రాజ్ థాక్రే చురకలంటించారు. పరిస్థితులు దారుణంగా మారిపోయానని.. బీజేపీని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన చెబుతున్నారు. కాగా, డిసెంబర్ 9, 14 తేదీల్లో గుజరాత్‌లోని 182 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. -
‘విపక్షం సత్తా అప్పుడు తెలుస్తుంది’
సాక్షి,ముంబయి:గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం దేశంలో విపక్షాలు పటిష్టమవుతాయని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే అన్నారు. ‘ప్రతిపక్షం కొంత బలహీనంగా ఉందనేది వాస్తవం..అయితే గుజరాత్ ఎన్నికల తర్వాత బలోపేతమవుతుంది..విపక్షంలో గణనీయ మార్పు గమనిస్తార’ ని థాకరే అన్నారు. కేవలం ఒకే రాష్ట్ట్రంలో ప్రధాని సహా పలువురు మంత్రులు ర్యాలీలు నిర్వహిస్తుండం ఆశ్యర్యకరమన్నారు. ప్రధాని సొంత రాష్ట్రమే అయినా దేశాధినేత ఒకే రాష్ట్రంలో అంతగా దృష్టి కేంద్రీకరించడం సరైంది కాదని ఆక్షేపించారు. గుజరాత్లో పాలక బీజేపీ ప్రజలకు మేలు చేకూర్చి ఉంటే ఇంతమంది మంత్రులు పార్టీ కోసం ప్రచారం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. నోట్ల రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వం ఎక్కువ నోట్లను ముద్రించిందని, ఇది బీజేపీకి లాభం చేకూర్చిందని ఆయన ఆరోపించారు.బీజేపీ మినహా మరే రాజకీయ పార్టీకి అన్ని నిధులు లేవని, బీజేపీకి ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎలా సమకూరాయని థాకరే ప్రశ్నించారు. -
ఠాక్రేతో రాందేవ్ భేటీ.. మతలబేంటి?
మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్‌ఠాక్రేను ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కలిశారు. ముంబైలోని ఆయన నివాసమైన 'కృష్ణ కుంజ్'లో ఉదయం 9.30 గంటల సమయంలో ఈ భేటీ జరిగింది. వారిద్దరూ ఈ భేటీలో ఏం చర్చించుకున్నారో తెలియలేదు గానీ.. ఆ తర్వాత మాత్రం రాందేవ్ బాబాను రాజ్ ఠాక్రే పొగడ్తల్లో ముంచెత్తారు. హిందూ సంప్రదాయం, యోగా, ఆయుర్వేదం తదితర అంశాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంలో రాందేవ్ మంచి పాత్ర పోషిస్తున్నారని అన్నారు. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల ద్వారా ఆయుర్వేదం ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి చాటుతున్నారని తెలిపారు. రాందేవ్‌ను కలవడం చాలా గొప్పగా అనిపిస్తోందని కూడా ఆయన చెప్పారు. అయితే ఈ సమావేశం గురించి రాందేవ్ వైపు నుంచి గానీ, పతంజలి గ్రూపు నుంచి గానీ ఎలాంటి సమాచారం విడుదల కాలేదు. -
చదువుతో పేదరికాన్ని జయించాలి
పర్వతగిరి(వర్ధన్నపేట): పేదరికాన్ని అనుభవిస్తూ కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిలు చదువుతో పేదరికాన్ని జయించాలని కడియం కావ్య అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థినులకు తాగునీటి సౌకర్యం కోసం గురువారం కావ్య ఫ్రిజ్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కస్తూర్బా పాఠశాల విద్యార్థినీల సౌకర్యార్థం మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. విద్యార్థినులు ఆత్మస్థైర్యంతో ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలన్నారు. వందేమాతరం షౌండేషన్ వ్యవస్థపకుడు రవీందర్రావు మాట్లాడుతూ పాఠశాలలో ఏర్పాటుచేసిన ఎంఎన్ఎస్ ప్రోగ్రాం ద్వారా విద్యార్థినులు కార్పొరేట్ స్థాయిని మించి గణితం చేయగలరని ధీమా వ్యక్తం చేశారు. డాక్టర్ నజీర్ మాట్లాడారు. అనంతరం విద్యార్థినులు కావ్యకు బహుమతులు అందజేశారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినులు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్ కక్కెర్ల శ్రీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వాళ్లందరినీ దేశం నుంచి తరిమేయండి
కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ ఉరిశిక్ష విధించడంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన తీవ్రంగా మండిపడింది. జాదవ్‌ను పాకిస్తాన్ విడిచిపెట్టేవరకు మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క పాక్ జాతీయుడిని దేశం నుంచి తరిమికొట్టాలని డిమాండ్ చేసింది. ''పాకిస్తానీలు అందరినీ చితక్కొట్టి దేశం నుంచి తరిమేయండి. వాళ్లు ఎవరైనా సరే. కొట్టి కొట్టి తరమాలి'' అని ఎంఎన్ఎస్ చెప్పింది. కుల్‌భూషణ్ జాదవ్‌ను పాకిస్తాన్ విడిచిపెట్టేవరకు ఇది కొనసాగాలని, ఈ విషయంలో తమ నిర్ణయం చాలా పక్కాగా ఉందని ఎంఎన్ఎస్ సీనియర్ నాయకుడు సందీప్ దేశ్‌పాండే అన్నారు. కుల్‌భూషణ్ జాదవ్‌కు, అతడి కుటుంబానికి తాము అండగా ఉంటామని, అతడు విడుదలయ్యేవరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. భారతదేశంలో ఉన్నవాళ్లు పాకిస్తానీ పౌరులైనా, వ్యాపారవేత్తలైనా, కళాకారులైనా.. ప్రతి ఒక్కరినీ తరిమి తరిమి కొట్టాలన్నారు. గతంలో కూడా బాలీవుడ్ సినిమాలలో పాకిస్తానీ కళాకారులు పనిచేయడాన్ని ఎంఎన్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. కరణ్ జోహార్ తీసిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించడంతో ఆ సినిమాను ఎంఎన్ఎస్ తొలుత నిషేధించింది కూడా. ఆ తర్వత చర్చల ఫలితంగా నిషేధాన్ని ఎత్తేశారు. -
శివసేన విజయానికి బ్రేకులు!
దేశంలోనే అత్యంత ధనవంతమైన కార్పొరేషన్ అయిన బీఎంసీ ఎన్నికలు వాడి వేడిగా జరిగాయి. మొత్తం 227 వార్డులకు గాను 2275 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. చాలా కాలంగా బీజేపీ - శివసేన కూటమి పాలనలో ఉన్న బీఎంసీలో ఈసారి ఈ రెండు పార్టీలు ఎదురెదురుగా తలపడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు భుజాల మీద చేతులు వేసుకుని తిరిగిన నాయకులు ఇప్పుడు కత్తులు దూశారు. అయితే, ఈసారి శివసేన విజయాన్ని అడ్డుకునేది బీజేపీ కాకపోవచ్చని.. ఠాక్రేల కుటుంబం నుంచే వచ్చిన మరో పార్టీ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అని విశ్లేషకులు భావిస్తున్నారు. చాలావరకు వార్డులలో శివసేన ఓట్లను రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ చీల్చుకోవచ్చని అంచనా వేస్తున్నారు. సొంతంగా గెలిచేంత బలం ఎంఎన్ఎస్కు లేకపోయినా.. మరాఠా సెంటిమెంటుతో శివసేన పొందాలనుకున్న ఓట్లను మాత్రం చాలావరకు అది చీల్చే అవకాశం ఉందని, దానివల్ల అంతిమంగా బీజేపీకి లబ్ధి చేకూరవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఫలితాలు వెలువడేవరకు ఇది అంచనా మాత్రమే అవుతుంది. ఆ తర్వాతే అసలు విషయం తెలుస్తుంది. మొత్తం 227 వార్డులకు గాను ముంబైలో 7034 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. మొత్తం 91,80,491 మంది ఓటర్లుండగా, వారిలో 50,30,361 మంది పురుషులు, 49,49,749 మంది మహిళలు, 381 మంది 'ఇతరులు' ఉన్నారు. -
అంతరార్థం ఏమిటి?
విశ్లేషణ రాజకీయ పార్టీలు రకరకాల కారణాలతో ఏర్పడుతుంటాయి. వాటిలో ఒకటి నల్లధనాన్ని అక్రమంగా చలామణి చేయడమని ఎన్నికల కమిషన్ గుర్తించింది. అలాంటి దాదాపు రెండు వందల పార్టీల గుర్తింపును రద్దు చేసింది. పార్టీల ఏర్పాటుకు ఇతర కారణాలూ ఉంటాయి. పార్టీలోని వ్యక్తిగత, భావజాల వివాదాలు, వారసత్వ పోరాటాలు వంటివి కూడా వాటిలో ఉంటాయి. ములాయంసింగ్ యాదవ్ చేతులెత్తేయకపోతే రెండు సమాజ్‌వాదీ పార్టీలుండేవే. పదేళ్ల క్రితం రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్ఎన్ఎస్)ను ఏర్పాటు చేయడంతో శివసేన చీలిపోయింది. అదో ప్రత్యేకవాద పార్టీ. తమ పార్టీ అది కాక మరేదో అన్నట్టుగా అది నటించిందీ లేదు. మౌలికంగా మరాఠీలే ఆ పార్టీ ఓటర్లు. అది, తమది బాల్ ఠాక్రే నిర్మించిన పార్టీగా చెప్పుకుంటుంది. అయితే ఈ పార్టీ ఏర్పాటుకు అసలు కారణం నేడు రాజ్ మేనబావ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఉన్న శివసేన నాయకత్వ వారసత్వ సమస్య వల్ల మాత్రమే ఎమ్ఎన్ఎస్ ఏర్పడింది. ఇద్దరూ మరాఠీలే కాబట్టి, వారు ఐక్యం కావాలని రెండు పార్టీల కేడరూ కోరుకుంటున్నారని ఎప్పుడూ వారికి సూచనలు అందుతూనే ఉన్నాయి. అయితే ఆ ఇద్దరు నేతలు మాత్రం ఆ విషయం గురించి ఎన్నడూ మాట్లాడలేదు. కలసి పనిచేయడం కాదుగదా, కనీసం ఇద్దరి మధ్య అగాధాన్ని పూడ్చే ప్రయత్నమైనా వారిలో ఏ ఒక్కరూ చేయలేదు. స్థానిక పౌర పరిపాలనా సంస్థల నుంచి శాసనసభ వరకు అన్ని స్థాయిల్లోని ఎన్నికల రాజకీయాల్లోనూ వారు ప్రత్యర్థులుగానే ఉంటూ వచ్చారు. అయితే, ముంబైసహా పది ప్రధాన పౌర పురపాలన సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో రాజ్ ఠాక్రే హఠాత్తుగా ఆశ్చర్యకరంగా ప్రవర్తించారు. రాజ్ తన బావ ఉద్ధవ్‌కు ఏడు సార్లు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ తీయలేదు. ఉద్ధవ్ ఎక్కడ, ఎన్ని సీట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డా అంగీకరించి రెండు పార్టీల మధ్య ఎన్నికల సర్దుబాట్లు చేసుకోవాలనేదే ఈ చర్య వెనుక ఉన్న S ఉద్దేశం. రాజ్ పంపిన దూతను సైతం ఉద్ధవ్ కలవలేదు. మరో నేతను కలిసినా ఎలాంటి ఫలితమూ లేకపోయింది. ఇది, ఎంత హఠాత్తుగా మొదలైందో అంత హఠాత్తుగానే ముగిసిపోయిన ప్రధాన పరిణామం. బలహీనపడుతున్న ఎమ్ఎన్ఎస్ నేత వేసిన ఈ ఎత్తుగడ ఆయనలోని నిస్పృహను సూచిస్తోంది. నాసిక్ మునిసిపల్ కార్పొరేషన్లో మూడొంతుల మంది కార్పొరేటర్లు, అంటే 40 మంది ఉన్న ఎమ్ఎన్ఎస్ ఆ సంస్థను నియంత్రిస్తోంది. కానీ అక్కడి ఆ పార్టీ ప్రతినిధులు శివసేనలోకో లేక బీజేపీలోకో ఫిరాయిస్తున్నారు. 2009లో 13గా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 2014 నాటికి ఒకటికి పడిపోయింది. ఏ ప్రాతినిధ్య సంస్థలోనైనా ఎంత మంది ప్రజాప్రతినిధులున్నారు అనే దాన్ని బట్టే ఒక పార్టీ బలాన్ని లెక్కిస్తారు. అంతేగానీ ఏ సమస్యపైనైనా అది ఎంత ప్రభావాన్ని నెరపగలుగుతుందనేదాన్ని బట్టి కాదు. సేన, ఎమ్ఎన్ఎస్లకు సొంత రాజకీయ రంగ స్థలిౖయెన ముంబైలో పార్టీ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కీలకమైనది. దాదర్ శివసేనకు కీలక ప్రాంతం. గత ఎన్నికల్లో ఎమ్ఎన్ఎస్ చిత్తుగా ఓడిపోయింది. ఠాక్రే కుటుంబీకులు నివసించే ది, శివసేన ఏర్పడింది, దాని ప్రధాన కార్యాలయం ఉన్నది ఆ ప్రాంతంలోనే. ఈ ఘోర పరాజయం రాజ్‌కు మింగుడు పడటం కష్టమే. ఇకపై శివసేన ఏ పార్టీతోనూ ఎన్నికలకు ముందు కలిసేది లేదని ఆ పార్టీ ముందుగానే ప్రకటించిందనే విషయాన్ని ఇక్కడ చెప్పడం అవసరం. అయినా రాజ్ ఠాక్రే సర్దుబాట్ల కోసం పాకులాడారు. బీజేపీకి, సేనకు మధ్యనే ప్రధానంగా సాగే ఎన్నికల పోరులో మరాఠీ ఓట్లు చీలిపోకూడదనేదే తమ ఉద్దేశమని వివరించ డానికి ఆయన తంటాలుపడ్డారు. ఇదో చిన్నపాటి బెదిరింపే కాదు, ఆ పునాదిని నిలబెట్టుకోగలిగే ఆశలు లేవని ఎమ్ఎన్ఎస్ అంగీకరించడం కూడా. అయితే రాజ్ ఇలా ఉద్ధవ్‌కు సంకేతాలను పంపడం అతి చాకచక్యంగా వేసిన ఎత్తు అని ప్రస్తుతం రాజకీయ పరిశీలకులు విశ్వసిస్తున్నారు. ముంబై స్థానిక ఎన్నికల్లో బీజేపీ చేతుల్లో శివసేన ఓడిపోతే... మరాఠీ భూమిపుత్రులతో శివసేన జూదం ఆడాలని ప్రయత్నిం చిందనే విషయం ప్రపంచానికి తెలుస్తుంది అనేదే రాజ్ ఉద్దేశమని అంటున్నారు. బీజేపీని మహారాష్ట్రేతరుల పార్టీగానే చూస్తుంటారు. అది వాస్తవాలపై ఆధారపడి ఏర్పడ్డ అభిప్రాయం కానవసరం లేదు. అయినాగానీ బీజేపీ చేతిలో ఓటమి కంటే ఎక్కువగా మరాఠీ అస్తిత్వాన్ని గాయపరచేది మరొకటి ఉండదు. ఒక రాజకీయ పరిణామం జరిగిన తర్వాత దానికి కారణాన్ని చెప్పడం అవసరం. శివసేన ఓటమిని వివరించడానికి జరిపే విశ్లేషణగా అది తెలివైన ఎత్తే కావచ్చు. కానీ అసలీ కాళ్లబేరంలో రాజ్ ఠాక్రే తాను ద్వేషించే నాయకుని పార్టీతోనే మైత్రిని కోరి తన బలహీనతను ఎందుకు ప్రదర్శించాల్సి వచ్చిందో అది వివరించదు. ఏది ఏమైనా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఎమ్ఎన్ఎస్ను అది తక్కువగా చేసి చూపింది. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
పార్టీ గుర్తు మార్చే పనిలో ఎంఎన్ఎస్!
ముంబై: మహారాష్ట్రలో త్వరలో జరగనున్న బృహత్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో రాజ్‌ఠాక్రే ఆధ్వర్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎంఎన్ఎస్) కొత్త పార్టీ గుర్తుతో బరిలోకి దిగాలని నిర్ణయించింది. ఈ పార్టీ గుర్తుగా రైలింజన్‌ను దాదాపు ఖరారు చేసినట్టు కొందరు నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఎంఎన్ఎస్ పార్టీ మహారాష్ట్రలో గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది. 2009లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 13 స్థానాలు సాధించిన ఎంఎన్ఎస్, 2013లో మాత్రం కేవలం ఒక స్థానం సాధించి పూర్తిగా చతికలపడిన విషయం తెలిసిందే. పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికే గుర్తు మారుస్తున్నారని పార్టీ నాయకులు భావిస్తున్నప్పటికీ కారణాలు మాత్రం కచ్చితంగా తెలియరాలేదు. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ ఆర్టిస్టులపై నిషేధం విషయంలో ఎంఎన్ఎస్ నేతలు వీరంగం సృష్టించారు. థియేటర్ల యాజమాన్యాన్ని బెదిరించడం, బాలీవుడ్ దర్శకనిర్మాతలను హెచ్చరిస్తూ వ్యవహారాన్ని పెద్దది చేయడంతో.. ఇండస్ట్రీకి చెందిన కొందరు ఏకంగా హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆశ్రయించారు. చివరికి కరణ్ జోహర్ తీసిన మూవీ విడుదలై రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తోంది. పార్టీ గుర్తు మార్చితే.. బీఎంసీ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ ఫేట్ మారుతుందో లేదో తెలియాలంటే ఆ ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాల్సిందే. -
ఆ దర్శకుడితో డబ్బు డిమాండ్ చేయడం తప్పు
న్యూఢిల్లీ: బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ భారత సైన్యానికి ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని ఎంఎన్ఎస్ డిమాండ్ చేయడం తప్పని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ ప్రతిపాదన సరికాదని, ఎంఎన్ఎస్ వాదనతో ఏకీభవించబోమని చెప్పారు. పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన కరణ్ జోహార్ సినిమా ఏ దిల్ హై ముష్కిల్ విడుదల కాకుండా అడ్డుకుంటామని ఎంఎన్ఎస్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం పరిష్కరించుకునేందుకు ఇటీవల కరణ్ జోహార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేలను కలిశాడు. పాక్ నటులకు ఇకమీదట తన సినిమాల్లో అవకాశం ఇవ్వబోనని కరణ్ చెప్పాడు. భారత సైన్యానికి ఐదు కోట్లు ఇవ్వాలని ఈ సందర్భంగా రాజ్ ఠాక్రే డిమాండ్ చేయగా, కరణ్ ఇందుకు అంగీకరించాడు. ఈ విషయంపై వెంకయ్య స్పందిస్తూ.. మరో పార్టీ చేసిన ప్రతిపాదనతో తనకు సంబంధంలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేశారని చెప్పారు. రాష్ట్రాలకు సంబంధించిన విషయాల్లో భద్రత కల్పించడం ఆ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతని అన్నారు. -
ముఖ్యమంత్రిగా ఆ పని చేయడం తప్పా!
'ముఖ్యమంత్రి బ్రోకర్లా మారారు.. పాకిస్థానీలకు వత్తాసు పలుకుతున్నారు' అని మిత్రపక్షం శివసేన చేస్తోన్న తీవ్ర ఆరోపణలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా విడుదల విషయంలో నెలకొన్న ఉద్రిక్తతను పరిష్కరించే దిశగా సీఎం.. దర్శకనిర్మాతలకు, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్ఎస్)కు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే సీఎంతో భేటీ తర్వాత రాజ్ ఠాక్రే 'ప్రతి నిర్మాత రూ.5 కోట్లు ఇవ్వాలి' అని డిమాండ్ చెయ్యడంతో అందరితోపాటు ఫడ్నవిస్ కూడా ఖంగుతిన్నారట! తన అధికారిక నివాసం 'వర్ష'లో సోమవారం రాత్రి మీడియాతో మాట్లాడిన సీఎం అసలేంజరిగిందో చెప్పుకొచ్చారు.. (సీఎం సమక్షంలో సినిమా వివాదానికి తెర!) 'నా ముందు రెండు దారులున్నాయి. ఒకటి.. ఆ సినిమా విడుదలయ్యే అన్ని థియేటర్ల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించడం. తద్వారా పండగ(దీపావళి)పూట పోలీసులు కుటుంబాలకు దైరంగా ఉండాల్సి వస్తుంది. ఒకవేళ ఆందోళనలు దారితప్పితే కొత్త సమస్యలు తలెత్తుతాయి. అందుకే నేను రెండో దారి.. అంటే చర్చలకు మొగ్గుచూపా. ఇరుపక్షాలను పిలిపించా. అక్కడ రాజ్ ఠాక్రే మూడు డిమాండ్లు మా ముందుంచారు. అందులో రెండింటికి(ఉడీ అమరజవాన్లకు నివాళులు అర్పించడం, భవిష్యత్ లో పాక్ నటులను తీసుకోకపోవడం) ఇరుపక్షాలు అంగీకరించాయి. ఇక మూడోదైన 'ప్రతి నిర్మాత రూ.5 కోట్లు ఇవ్వాలి' డిమాండ్ ను మాత్రం నేను అక్కడికక్కడే ఖండించా. సైనిక సహాయనిధికి విరాళాలు డిమాండ్ చేయడం సరికాదని రాజ్ ఠాక్రేను వారించా' అని ఫడ్నవిస్ చెప్పారు. చర్చల ద్వారా మంచి ఫలితాన్ని రాబట్టిన తనను అభినందించాల్సిదిపోయి విమర్శలు గుప్పించడం అజ్ఞానమన్న సీఎం ఫడ్నవిస్.. కశ్మీర్ వేర్పాటువాదులతోనూ, తీవ్రవాదులతోనూ ప్రభుత్వాలు చర్చలు జరపడంలేదా?అని ప్రశ్నించారు. అమరజవాన్ల కుటుంబాలకు బాసటగా నిలవడంలో తప్పులేదని, అయితే అలా చేయాలని డిమాండ్ చేయడం మాత్రం సరికాదని సీఎం వ్యాఖ్యానించారు. ఎంఎన్ఎస్ పట్ల ప్రభుత్వానికి సాఫ్ట్ కార్నర్ ఉందన్న విమర్శలు అర్థంలేనివని అన్నారు. -
'ప్రతి నిర్మాత రూ.5 కోట్లు ఇవ్వాలి'
ముంబై: వివాదాలే ఊపిరిగా మహారాష్ట్రలో మనుగడ సాగిస్తోన్న మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్ఎస్) కనీవినీ ఎరుగని డిమాండ్ ను తెరపైకి తెచ్చింది. 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా విడుదలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, దర్శకనిర్మాత కరణ్ జోహార్ లతో భేటీలో పాల్గొన్న ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. (సినిమా రంగంలో కీలక పరిణామం) పాకిస్థానీ నటులతో సినిమాలు తీసిన ప్రతి ఒక్క నిర్మాత రూ.5కోట్లను సైనిక సహాయ నిధి(ఆర్మీ రిలీఫ్ ఫండ్)కి ఇవ్వాలని రాజ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని నిర్మాతలందరూ తప్పక అంగీకరించాలని, రూ.5కోట్లు ఇచ్చేందుకు నోటిమాటగా కాకుండా రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని ఆయన అన్నారు. అంతేకాదు, భారతీయ నిర్మాతలెవ్వరూ పాకిస్థానీ నటీనటులను సినిమాల్లోకి తీసుకోవద్దని, ఒకవేళ అలా చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని ఠాక్రే హెచ్చరించారు. ఉడీ ఉగ్రదాడి తర్వాత పాక్ నటులపై నిషేధం విధించాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన ఎంఎన్ఎస్.. పలు నిర్మాతల మండళ్లు, ఎగ్జిబిటర్ల మద్దతుసైతం కూడగట్టిన సంగతి తెలిసిందే. ఉడీ అమరజవాన్లకు నివాళులు అర్పించడంతోపాటు భవిష్యత్ లోపాక్ నటులను తీసుకోబోమన్న హామీపై 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా విడుదలకు రాజ్ ఠాక్రే అంగీకరించారు. సీఎం ఫడ్నవిస్ సమక్షంలో దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఈ ఒప్పందానికి తలొగ్గారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 28న ఆ సినిమా విడుదల కానుంది. -
సీఎం సమక్షంలో సినిమా వివాదానికి తెర!
ముంబై: రొమాంటిక్ సినిమా విషయంలో కొద్ది రోజులుగా కొనసాగిన సస్సెన్స్ థ్రిల్లర్ ఎట్టకేలకు ముగిసింది. సినిమా విడుదల కావాలంటే సెన్సార్ బోర్డు అనుమతి తప్పనిసరి. కానీ ఓ సినిమా మాత్రం సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వానిధేత, ఒక పార్టీ నేతల అనుమతితో విడుదలవుతోంది. భారతీయ సినిమా రంగంలో కీలక పరిణామంగా భావిస్తోన్న ఈ ఒప్పందానికి సీఎం అధికారిక నివాసం వేదికైంది. ముంబైలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి నివాసంలో శనివారం ఉదయం జరిగిన కీలక భేటీలో.. కరణ్ జోహార్ దర్శకనిర్మాతగా రూపొందించిన 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా విడుదలకు అంగీకారం కుదిరింది. సినిమా విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే, సినిమా విడుదల కోసం పాట్లు పడుతోన్న కరణ్ జోహార్ తోపాటు నిర్మాతల సంఘం అధ్యక్షుడు ముఖేష్ భట్ లు భేటీలో పాల్గొన్నారు. సినిమా ప్రారంభానికి ముందు ఉడీఉగ్రదాడిలో చనిపోయిన అమరజవాన్లకు నివాళులు అర్పిస్తూ ప్రకటన ఇవ్వడం, భవిష్యత్తులో తీయబోయే సినిమాల్లో పాకిస్థానీ నటీనటులను తీసుకోకపోవడం' అని రెండు డిమాండ్లకు దర్శకనిర్మాత తలొగ్గడంతో 'ఏ దిల్ హై ముష్కిల్' విడుదలకు లైన్ క్లియర్ అయింది. (రెచ్చిపోయిన ఐశ్వర్య రాయ్..) సినిమా విడుదలను అడ్డుకోవద్దని, ఒకవేళ ఎవరైనా ఆ పనిచేస్తే తాటతీస్తామని సీఎం ఫడ్నవిస్ ఇంతకుముందే ప్రకటించారు. అయితే ఎంఎన్ఎస్ ఒత్తిడి మేరకు ఎగ్జిబిటర్లు, థియేటర్ల యజమానులు ఆ సినిమాను ప్రదర్శించేందుకు నిరాకరించారు. దీంతో చర్చలు అనివార్యం అయ్యాయి. డీల్ కుదిరిన పిమ్మట బయటికి వచ్చిన రాజ్ ఠాక్రే.. సినిమా విడుదలకు సహకరిస్తామని చెప్పారు. కరణ్ జోహార్ తరఫున ముఖేఖ్ భట్ మాట్లాడుతూ.. 'ఏ దిల్ హై ముష్కిల్ లో 300 మంది భారతీయులు పనిచేశారని, పాకిస్థానీ నటుడు ఫవద్ ఖాన్ ఆఫ్ట్రాల్ నాలుగు నిమిషాలు కనిపిస్తాడని, అయినాసరే సీఎంకు ఇచ్చిన రెండు హామీలను నిలబెట్టుకుంటామని చెప్పారు. (హీరోహీరోయిన్ల స్టన్నింగ్ ఫొటో) ఆందోళన మొదలైందిలా.. కశ్మీర్ లోని ఉడీ సైనిక స్థావరంపై సెప్టెంబర్ 18న పాకిస్థానీ ఉగ్రవాదులు దాడిచేయడం, 19 మంది జవాన్లను పొట్టనపెట్టుకోవడం తెలసిందే. నాటి దాడిని ప్రపంచమంతా తీవ్రంగా ఖండించింది. బాలీవుడ్ ప్రముఖులు కూడా పాకిస్థాన్ తీరుపై భగ్గుమన్నారు. అయితే బాలీవుడ్ లో పనిచేస్తోన్న పాకిస్థానీ నటీనటులు మాత్రం ఉడీపై నోరు మెదపలేదు. దీంతో పాక్ యాక్టర్లను బహిష్కరించాలని ఎంఎన్ఎస్ ఆందోళనలు ప్రారంభించింది. స్థానబలం వల్ల క్రమంగా ఆ ఆందోళనలకు మద్దతు లభించింది. మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లోని నిర్మాతల మండళ్లు, ఎగ్జిబిటర్లు పాక్ నటులున్న సినిమాలను ప్రదర్శించబోమని తేల్చిచెప్పారు. అప్పటికే తాను తీసిన 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా విడుదల తేదీని ప్రకటించిన కరణ్ జోహార్ కు ఎంఎన్ఎస్ నిర్ణయం శరాఘాతంలా మారింది. తనకు దేశం ముఖ్యమని, పరిస్థితులు మరోలా ఉన్నప్పుడు తీసిన సినిమాను ఇప్పుడు అడ్డుకోవడం తగదని కరణ్ జోహార్ పలు వేదికల నుంచి ఎంఎన్ఎస్ ను వేడుకున్నాడు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను సైతం కలిసి సహాయాన్ని ఆర్థించాడు. చివరికి మహారాష్ట్ర సీఎం సమక్షంలో ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదిరింది. కరణ్ జోహార్ దర్శకత్వం వహించి, నిర్మించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్, రణ్ బీర్ కపూర్, అనుష్క శర్మ, ఫవద్ ఖాన్ లు ప్రధాన తారగణం. 'బాద్ షా' షారూఖ్ ఖాన్ కూడా తళుక్కున మెరవనున్నారు. ప్రీతం చక్రవర్తి సంగీతం అందిస్తున్నారు. యధావిథిగా దీపావళి కానుకగా అక్టోబర్ 28న 'ఏ దిల్ హై ముష్కిల్' ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆ సినిమా చూడొద్దని మీరెలా చెబుతారు?
న్యూఢిల్లీ: సినిమా ధియేటర్లపై దాడులు చేసే హక్కు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్మెన్నెస్)కు లేదని కేంద్ర మంత్రి బాబూల్ సుప్రియో అన్నారు. ఎమ్మెన్నెస్ రౌడీల పార్టీ అని దుయ్యబట్టారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ప్రేక్షకులు ఏ సినిమా చూడాలో, చూడకూడదో నిర్ణయించే అధికారం ఎమ్మెన్నెస్ లేదని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించడం సరికాదన్నారు. ఉడీలో ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాతే పాకిస్థాన్ నటులను నిషేధించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చిందని, ఇప్పుడు విడుదలవుతున్న సినిమాలు భారత్-పాక్ సంబంధాలు సవ్యంగా ఉన్నప్పుడు తీసినవని వివరించారు. కాగా, నిన్న తనపై దాడి చేసిన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేయకుండా బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అవమానకరంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. -
అతిపెద్ద గూండా ఎవరో తేల్చుకుందాం: కట్జూ
ముంబై : పాకిస్తానీ యాక్టర్లను భారత్‌లో నిషేధించడంపై తీవ్ర చర్చ రేగుతున్న నేపథ్యంలో మాజీ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరణ్ జోహార్ అప్‌కమింగ్ ఫిల్మ్ యే దిల్ హే ముస్కిల్ విడుదలను నిలిపివేయడంపై మహరాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్)ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించారు."నిస్సహాయంపు ఆర్టిస్టులపై ఎంఎన్ఎస్ ఎందుకు దాడిచేస్తుంది? ఒకవేళ ధైర్యముంటే నా ముందుకు రండి. మీ అసహనానికి నా దగ్గర దండన ఉంది. మీ కోసమే ఈ దండన వేచిచూస్తున్నట్టు" బుధవారం పలు ట్వీట్లు చేశారు. ఎంఎన్ఎస్ ప్రజలు అరేబియన్ సముద్రపు ఉప్పు నీరు తాగే గూండాలని వ్యాఖ్యానించారు. గంగా, యమునా, సరస్వతి త్రివేణి సంగమం పవిత్రమైన నీరు తాగే తాను అలహాబాదీ గూండానని పేర్కొన్నారు. తన ముందుకు వస్తే ఎవరు అతిపెద్ద గూండానో తేల్చుకుందామని సవాలు విసిరారు. ఒక్క ఎంఎల్ఏ పార్టీ ఎంఎన్ఎస్ వారి పాఠాలను వారే నేర్చుకోలేకపోతున్నారన్నారు.వచ్చే ఎన్నికల్లో జీరో-ఎంఎల్ఏ పార్టీగా ఎంఎన్ఎస్ నిలుస్తుందని ట్వీట్ చేశారు. కట్జూ వ్యాఖ్యలపై ఎంఎన్ఎస్ వైస్ ప్రెసిడెంట్ వాగీశ్ సారస్వత్ మండిపడ్డారు. కనీసం మాకు ఒక్క ఎంఎల్ఏనైనా ఉన్నారని, అయినా కట్జూ ఏ ఆధారాలతో ఇలా వ్యాఖ్యానిస్తున్నారని ప్రశ్నించారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధినేతగా ఉన్న కట్జూ ఇప్పటికే పలు అంశాలపై తీవ్రంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పాకిస్తానీ యాక్టర్ ఫవాద్ ఖాన్ నటించిన కరణ్ జోహార్ సినిమా యే దిల్ హై ముస్కిల్ వచ్చే శుక్రవారం విడుదల కాబోతుంది. కానీ ఆ సినిమా విడుదలను నిలిపివేశారు. జోహార్ ఫిల్మ్‌ను నిలిపివేయడంపై ఎంఎన్ఎస్కు మాజీ ఇండియన్ క్రికెటర్, కామెంటర్ సంజయ్ మంజ్రేకర్ అంత మంచికాదంటూ బెదిరించారు. MNS people are goondas who have drunk the salt water of the Arabian Sea. I am an Allahabadi goonda, who has drunk the water of the Sangam — Markandey Katju (@mkatju) October 19, 2016 So instead of showing your bravery on those helpless artists, come have a dangal with me, and let the world see who is a bigger goonda — Markandey Katju (@mkatju) October 19, 2016 -
సినిమా విడుదలపై సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
ముంబై: బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ తీసిన 'ఏ దిల్ హై ముష్కిల్' విడుదలపై ఇప్పటివరకూ ఉన్న ఎన్నో సందేహాలకు మహారాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ ఫుల్ స్టాప్ పెట్టారు. సినిమా విడుదలకు ఎలాంటి ఆటంకాలు, అవాంతరాలు ఎదురవ్వకుండా చూసుకుంటామని పోలీసుశాఖ హామీ ఇచ్చినా కొందరు ఆందోళనకారుల తీరుతో మూవీ యూనిట్ ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో మూవీ విడుదలకు సంబంధించి ఎలాంటి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకుంటామని సీఎం ఫడ్నవీస్ తెలిపారు. ఒకవేళ సినిమా విడుదలకు అవాంతరం కలుగజేస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తేలేదని సీఎం తేల్చి చెప్పారు. మెట్రో సినిమా వద్దకు వెళ్లి 'ఏ దిల్ హై ముష్కిల్' విడుదల చేయవద్దని హెచ్చరించిన 12 మంది మహారాష్ట్ర నవ నిర్మాణసేన(ఎంఎన్ఎస్) కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఆ ఆందోళనకారులను నవంబర్ 4 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు వెల్లడించారు. 'ఏ దిల్ హై ముష్కిల్' ఈ నెల 28న విడుదల కానుందని మూవీ యూనిట్ ఇదివరకే ప్రకటించింది. తన సినిమాలో 300 మందికి పైగా భారతీయ సిబ్బంది పనిచేశారని, వాళ్లను ఇబ్బంది పెట్టొద్దని కరణ్ జోహర్ కోరారు. పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ కేవలం 4 నిమిషాల నిడివిలో మాత్రమే మూవీలో కనిపిస్తాడని, అందరూ తమకు సహకరించాలని మరో నిర్మాత విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రలో సినిమాల విడుదల విషయంలో ఎంఎన్ఎస్ ఏం చేయగలదో ఈ సినిమా నిర్మాతలు తెలుసుకుంటారని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు హెచ్చరించిన విషయం తెలిసిందే. -
కరణ్‌కు తప్పని సినిమా కష్టాలు
కరణ్ జోహార్ తీసిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమా విడుదలకు ఎలాంటి ఆటంకాలు ఉండబోవని పోలీసులు హామీ ఇచ్చినా.. మళ్లీ మహారాష్ట్ర నవ నిర్మాణ సమితి మరో హెచ్చరిక జారీచేసింది. మల్టీప్లెక్సులలో ఎక్కడైనా ఆ సినిమాను ప్రదర్శిస్తే బాగోదని హెచ్చరించింది. సినిమాకు వ్యతిరేకంగా తాము నిర్వహించే నిరసన ప్రదర్శనలను అడ్డుకున్నా, సినిమా ప్రదర్శన ఆపేందుకు చేసే తమ ప్రయత్నాలకు విఘాతం కలిగించినా వాళ్లను చితక్కొట్టడం ఖాయమని ఎంఎన్ఎస్ అధికార ప్రతినిధి అమే ఖోప్కర్ తెలిపారు. మహారాష్ట్రలో సినిమాల విడుదల విషయంలో ఎంఎన్ఎస్ ఏం చేయగలదో ఈ సినిమా నిర్మాతలు తెలుసుకుంటారని ఎంఎన్ఎస్ నాయకురాలు షాలినీ ఠాక్రే కూడా అన్నారు. ఇరు దేశాల మధ్య పరిస్థితులు చక్కబడే వరకు తాను పాకిస్థానీ నటీనటులతో తాను సినిమాలు చేయబోనని కరణ్ జోహార్ మంగళవారం ఒక వీడియోప్రకటన ద్వారా తెలిపారు. తన సినిమాలో 300 మందికి పైగా భారతీయ సిబ్బంది పనిచేశారని, వాళ్లను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. మరోవైపు సినిమా పంపిణీ హక్కులు దక్కించుకున్న ఫాక్స్ స్టార్ స్టూడియోస్ కూడా కరణ్‌కు మద్దతుగా ముందుకొచ్చింది. భారతదేశం మీద జరిగిన ఉగ్రదాడిని తాము ఖండిస్తున్నామని, అయితే.. కరణ్ జోహార్ కూడా మంచి దేశభక్తుడని ఆ సంస్థ ప్రతినిధి అన్నారు. అతడి జాతీయతను ఎవరూ ప్రశ్నించలేరన్నారు. ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో పాకిస్థానీ నటుడైన ఫవాద్ ఖాన్ కేవలం 4 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడని, అందువల్ల ఈ సినిమా విడుదల అయ్యేందుకు సహకరించాలని ప్రముఖ దర్శక నిర్మాత ముకేష్ భట్ ఎంఎన్ఎస్ను కోరారు. సినిమా మీద ఇప్పటికే చాలా ఖర్చుపెట్టినందున దీపావళి సీజన్‌ను దయచేసి పాడుచేయొద్దని విజ్ఞప్తి చేశారు. కానీ ఇప్పటికే నాలుగు రాష్ట్రాలలోని సింగిల్ థియేటర్ల యజమానుల సంఘం కూడా తాము ఈ సినిమాను ప్రదర్శించేది లేదని తేల్చి చెప్పిన నేపథ్యంలో.. సినిమా భవిష్యత్తు ఏమవుతుందో చూడాలి. -
ఆ నటులతో పనిచేస్తే దెబ్బలు తప్పవు
ముంబై: పాకిస్థాన్‌కు చెందిన నటీనటులతో కలసి ఎవరైనా పనిచేస్తే కొడతామని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) హెచ్చరించింది. పాక్ నటులు నటించిన సినిమాలు దేశంలో విడుదల కాకుండా అడ్డుకోవడంతో పాటు వారితో కలసి పనిచేసిన వారికి దెబ్బలు తప్పవని ఎంఎన్ఎస్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. పాక్ నటీనటులు 48 గంట్లలోగా దేశం విడిచి వెళ్లిపోవాల్సిందిగా ఎంఎన్ఎస్ నాయకులు ఇటీవల అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎంఎన్ఎస్ హెచ్చరికలకు భయపడి కొంతమంది పాక్ నటులు దేశం విడిచి స్వదేశానికి వెళ్లారు. మొదట్లో ఎంఎన్ఎస్ తీరును బాలీవుడ్, రాజకీయ వర్గాలు తప్పుపట్టాయి. కాగా ఉడీ ఉగ్రదాడి, పీవోకేలో భారత సైన్యం సర్జికల్ దాడుల అనంతరం పాక్ నటులపై జాతీయ నిర్మాతల మండలి నిషేధం విధించింది. పాక్ నటులు నటించిన బాలీవుడ్ సినిమాలు త్వరలో విడుదల కావాల్సివుంది. -
సల్మాన్ సినిమాలనూ నిషేధిస్తాం: రాజ్ ఠాక్రే
పాకిస్థాన్‌కు చెందిన నటీనటులంతా వెంటనే దేశాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ 48 గంటల అల్టిమేటం ఇచ్చిన ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే మరోసారి అదే అంశంపై స్పందించారు. ఈసారి ఆయన బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్‌కు ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు. వాళ్లకు మరీ అంత ఇబ్బందిగా అనిపిస్తే వాళ్ల సినిమాలను కూడా నిషేధిస్తామని చెప్పారు. మన దేశంలో నటీనటులకు కొరతగా ఉందా అని ప్రశ్నించారు. అసలు పాకిస్థానీ నటులు మన సినిమాల్లో పనిచేయాల్సిన అవసరం ఏముందో తనకు అర్థం కావడం లేదన్నారు. మన కోసం జవాన్లు సరిహద్దుల్లో పోరాటం చేస్తున్నారని.. వాళ్లంతా ఆయుధాలు కింద పడేస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. మన సరిహద్దులను కాపాడేది ఎవరు.. సల్మాన్ ఖానా అని ప్రశ్నించారు. దేశం ముఖ్యమన్న విషయాన్ని వీళ్లంతా గుర్తించాలని చెప్పారు. -
'పాకిస్థానీలు కనబడితే దంచుడే'
ముంబై: పాకిస్థాన్ పై ప్రతీకారం విషయంలో సరిహద్దుల్లో కన్నా ముంబైలో ఉద్రిక్తతను పెంచుతోన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) మరో అడుగు ముందుకువేసి తీవ్ర హెచ్చికలు చేసింది. పాకిస్థాన్ నటులు కనబడితే దాడులు చేస్తామని, ఆయా సినిమాల నిర్మాణాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతామని ఎంఎన్ఎస్ కీలక నేత అమేయ్ ఖోపర్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పాక్ నటులు వీసాలు, వర్క్ పర్మిట్లు తీసుకొని వచ్చారన్న సల్మాన్ ఖాన్ కు సైతం కౌంటర్ ఇచ్చారు. (వాళ్లు వర్క్ పర్మిట్లు, వీసాలతో వచ్చారు: సల్మాన్) 'చాలా మంది సమర్థిస్తున్నట్లు పాకిస్థానీ నటుల్లో ఒక్కరు కూడా వర్క్ పర్మిట్లు తీసుకోలేదు. టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చి సినిమాల్లో నటిస్తున్నారు. ఇది చట్టవ్యతిరేకం. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం. ఉప్పటికిప్పుడైతే పాకిస్థానీ నటులు కనిపిస్తే దాడులు చేస్తాం. ఆ సినిమాల నిర్మాణాలను అడ్డుకుంటాం' అని అమేయ్ ఖొప్కర్ అన్నారు. ఇదే వివాదంపై దర్శక దిగ్గజం శ్యామ్ బెనగల్ స్పందిస్తూ.. నిర్మాణంలో ఉన్న సినిమాల నుంచి తప్పుకోవడంలో పాక్ నటుల తప్పేమీ లేదని, వీళ్ల విషయంలో పాక్ ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపులేదని అన్నారు. నిజానికి భారతీయులకు పాకిస్థానీయుల పట్లగానీ, అక్కడివాళ్లకు ఇక్కడివాళ్లపైగానీ ఎలాంటి విద్వేషాలు లేవని, వివాదాలు ప్రభుత్వాలకు సంబంధించిన విషయాలని శ్యామ్ బెనగల్ వ్యాఖ్యానించారు. -
ఉడీ దాడి చేసింది ఎవరు?: సల్మాన్ ఖాన్
ముంబై: ఉడీ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన సర్జికల్ దాడిని సంపూర్ణంగా సమర్థిస్తున్నానన్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్.. ఇంతటితో ఉడీకి సంబంధించి ప్రతీకారం తీరినట్లేనని వ్యాఖ్యానించారు. ఇండియాలో పాకిస్థానీ నటీనటులపై నిషేధం విధించడం సరికాదన్న ఆయన నిర్మాతల మండలి నిర్ణయాన్ని తప్పుపట్టారు. 'ఉడీ సైనిక స్థావరంపై దాడి చేసింది ఎవరు? ఉగ్రవాదులేకదా, పాకిస్థానీ నటీనటులు కాదుకదా! మరి అలాంటప్పుడు నటీనటులపై నిషేధం ఎందుకు?' అని ప్రశ్నించాడు. శుక్రవారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో సల్మాన్ విలేకరులతో మాట్లాడుతూ.. 'వాళ్లు ఉగ్రవాదులు కాదు. నటులు. ఇక్కడ(ఇండియాలో) పని చేసుకునేందుకు వీసా తీసుకొనిమరీ వచ్చారు. మన ప్రభుత్వమే వీసాలు మంజూరుచేసింది' అని వ్యాఖ్యానించిన సల్మాన్.. 'వాళ్లు నటులా? ఉగ్రవాదులా?' మీరు చెప్పండి.. అని విలేకరులను ప్రశ్నించారు. పాకిస్థానీ నటులు ఇండియాను విడిచి వెళ్లాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పాక్ నటీనలులపై నిషేధం విధిస్తున్నట్లు ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని సైఫ్ అలీఖాన్, దీపికా సహా పలువురు ఆర్టిస్టులు ఖండించారు. తాజాగా ఇప్పుడు సల్మాన్ ఖాన్ వంతు. -
ఉడీ దాడి చేసింది ఎవరు?: సల్మాన్ ఖాన్
-
అప్పుడు వచ్చిన నోళ్లు ఇప్పుడేమయ్యాయి?
పాకిస్థానీ నటీనటులు భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవాలన్న తమ నిర్ణయాన్ని మహారాష్ట్ర నవ నిర్మాణ సమితి (ఎంఎన్ఎస్) మరోసారి స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా తమకు ఏ ఒక్కరిపైనా ఎలాంటి ద్వేషం లేదని, కానీ.. కళను దేశాన్ని వేరు చేయడం సాధ్యం కాదని ఎంఎన్ఎస్ ప్రతినిధి అమే ఖోప్కర్ అన్నారు. పాక్ నటీనటులను భారతదేశంలో చాలా గౌరవిస్తారని చెబుతూ.. ప్యారిస్‌లోను, సిరియాలోను ఉగ్రదాడులు జరిగినప్పుడు ఈ పాక్ నటులంతా స్పందించి, బాధితులకు సంఘీభావంగా ట్వీట్లు చేశారని, మరి ఉడీలో ఉగ్రవాదులు దాడిచేసి భారతీయ సైనికుల ప్రాణాలను బలిగొన్నప్పుడు వీళ్ల నోళ్లు ఏమైపోయాయని ఖోప్కర్ ప్రశ్నించారు. అందుకే ఉంటున్న దేశమంటే గౌరవం లేని వాళ్లు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. -
ప్రభుత్వం నిర్ణయించాలి.. మీరుకాదు: హీరో
ముంబయి: రెండు రోజుల్లో పాకిస్థాన్ కు చెందిన నటులు, టీవీ ఆర్టిస్టులు భారత దేశాన్ని విడిచి వెళ్లిపోవాలన్న మహారాష్ట్ర నవ నిర్మాణ సేన వ్యాఖ్యలపై ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ స్పందించారు. భారత్ లో ఎవరు పనిచేయాలి? ఎవరు పనిచేయకూడదు? అని చెప్పాల్సింది ఒక్క ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. టాలెంట్ ఉన్నవాళ్లందరికీ భారత చిత్ర పరిశ్రమ స్వాగతం పలుకుతుందని, ఆదరిస్తుందని అన్నారు. ఇది ఒక్క దేశ సరిహద్దుకే పరిమితం అని తాను అనుకోవడం లేదని చెప్పారు. ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ ఉగ్రవాదం పై మండిపడుతూ ఆ దేశానికి చెందిన ఫవాద్ ఖాన్, మహీరా ఖాన్ తదితర పాక్ నటులంతా భారత్ ను 48గంటల్లో విడిచి వెళ్లాలని లేదంటే ఎలా వెళ్లగొట్టాలో తమకు తెలుసు అని వార్నింగ్ ఇచ్చారు. 'కళల సంస్కృతిని మార్చుకోవడం అనేది కచ్చితంగా ప్రోత్సహించాల్సిన విషయం. చిత్ర పరిశ్రమ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాలెంట్ ఉన్నవారికి తలుపులు తెరిచి ఉంచుతుంది. ముఖ్యంగా భారత్ తో సరిహద్దు ఉన్న దేశాలకు కూడా. అయితే, ఇలాంటివన్ని ప్రభుత్వం చూసుకుంటుంది. మేమంతా నటులం.. మేం ప్రేమ, శాంతి గురించి మాట్లాడతాం. చట్టం ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం చేస్తుంది' అంటూ జీక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పంపిణీ కార్యక్రమంలో సైఫ్ చెప్పారు. -
రహస్యంగా దేశం విడిచిన పాక్ నటుడు
పాకిస్థాన్‌కు చెందిన నటీనటులందరూ సెప్టెంబర్ 25లోపు దేశం విడిచి వెళ్లిపోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం మహారాష్ట్ర నవనిర్మాణ సేన అల్టిమేటం జారీచేయడం ప్రకంపనలు సృష్టిస్తోంది. భద్రత కల్పిస్తామని ముంబై పోలీసులు హామీ ఇచ్చినా.. పాక్‌కు చెందిన చెందిన సినీ, టీవీ నటీనటులు భయాందోళన చెందుతున్నారు. పాక్ నటుడు ఫవాద్ ఖాన్ రహస్యంగా దేశం విడిచి స్వదేశానికి వెళ్లిపోయాడు. ఇప్పట్లో భారత్‌కు తిరిగొచ్చే ఉద్దేశ్యం అతనికి లేదని తెలుస్తోంది. కరణ్ జొహార్ సినిమాలో ఫవాద్ నటించాడు. ఎంఎన్ఎస్ హెచ్చరికల అనంతరం ఫవాద్ సినిమా ప్రమోషన్లో పాల్గొనడని కరణ్ జొహార్ ఇటీవల చెప్పాడు. కాగా పాక్ నటుల షూటింగ్‌లను అడ్డుకుంటామని, వాళ్లకు అవకాశాలు ఇవ్వరాదని ఎంఎన్ఎస్ నాయకులు బాలీవుడ్ దర్శక నిర్మాతలను హెచ్చరించారు. పాక్‌కు చెందిన పలువురు నటీనటులు బాలీవుడ్ సినిమాలు, టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు. వీళ్లలో ఫవాద్ అగ్రశ్రేణి నటుడు. -
ప్రముఖ దర్శక నిర్మాతకు బెదిరింపులు
ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌కు బెదిరింపులు వచ్చాయి. ముంబైలో పాకిస్థానీ కళాకారులకు మద్దతు ఇస్తానని చెప్పడంతో మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఆయనపై తీవ్రంగా మండిపడింది. కరణ్ తీసే సినిమాల్లో పాకిస్థానీ కళాకారులకు అవకాశం ఇస్తే.. తమదైన శైలిలో ఆయనకు తగిన సమాధానం చెబుతామని ఎంఎన్ఎస్ హెచ్చరించింది. ఆ సమావేశంలో ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే కూడా ఉన్నారు. ఉడీ దాడి నేపథ్యంలో పాకిస్థానీ నటీనటులు ముంబై వదిలి స్వదేశానికి వెళ్లిపోవాలంటూ ఎంఎన్ఎస్ ఇచ్చిన గడువు ఇప్పటికే ముగిసింది. ఇప్పటికే వాళ్లంతా ముంబై వదిలి వెళ్లిపో్యారని, నగరంలో ఇప్పుడు ఒక్క పాకిస్థానీ కళాకారుడు కూడా లేరని ఎంఎన్ఎస్ సీనియర్ నేత అమే ఖోప్కర్ తెలిపారు. పొరపాటున తమకు ఎవరైనా కనపడితే మాత్రం వాళ్లను బయటకు విసిరి పారేస్తామన్నారు. కరణ్ జోహార్‌కు దమ్ముంటే ఒక్క పాకిస్థానీ నటుడినైనా తన సినిమాల్లోకి తీసుకోవాలని, అప్పుడు తామేం చేస్తామో చూడాలని ఖోప్కర్ అన్నారు. ఏవైనా సినిమాల్లో పాకిస్థానీ నటీనటులుంటే ఆ సినిమాలను ఇక్కడ విడుదల కానిచ్చేది లేదిన మరో సీనియర్ నేత షాలినీ ఠాక్రే చెప్పారు. ఇదంతా దేశం కోసమే తప్ప రాజకీయాల కోసం కాదన్న విషయాన్ని బాలీవుడ్ కూడా అర్థం చేసుకోవాలని ఆమె తెలిపారు. పాకిస్థానీలు మన సైనికులను చాలామందిని చంపేస్తున్నారని చెప్పారు. కాగా, ముంబైలో ఉంటున్న పాకిస్థానీలకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని పోలీసులు అంటున్నారు. ఈ విషయాన్ని తాము సీరియస్‌గానే తీసుకుంటున్నామని, వాళ్లందరికీ తగిన భద్రత ఇస్తాం కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని డీసీపీ అశ్వినీ సనప్ చెప్పారు. -
వాళ్లపై నిషేధం మంచిది కాదు: నటి దీపికా
పాకిస్తాన్ నటీనటులపై నిషేధం విధించాలని భావించడం, చాలా మంది ఈ నిర్ణయంపై తమ వైఖరిని వెల్లడించడం చూస్తూనే ఉన్నాం. అయితే దాయాది దేశ నటీనటులపై నిషేధం విధించాలన్న ఆలోచన చాలా చెడ్డ నిర్ణయమేనని బాలీవుడ్ నటి దీపికా కాకర్ అభిప్రాయపడింది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నంత మాత్రాన ఆర్టిస్టులపై ఇలాంటి చర్యలు తీసుకోవద్దని ఆమె సూచించింది. బుల్లితెరపై 'ససురాల్ సిమర్ కా'తో నటనకుగానూ ఆమె ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. మూవీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లను బ్యాన్ చేసినంత మాత్రాన సమస్యలు తొలగిపోతాయా అని ప్రశ్నించింది. పాక్ కు చెందిన ఆర్టిస్టులు వారి దేశానికి వెళ్లిపోవాలని రెండు రోజుల కిందట మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) హెచ్చరించింది. 48 గంటల్లో పాక్ వెళ్లిపోతే వారికే మంచిదని ఎంఎన్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. దాయాది దేశానికి చెందిన ఆర్టిస్టులు నటించిన బాలీవుడ్ సినిమాలను విడుదల కానిచ్చే ప్రసక్తేలేదని ఆ పార్టీ నేతలు స్పష్టంచేశారు. ఏ దిల్ హై ముష్కిల్, రేయిస్ మూవీలలో పాక్ నటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ నటించారని.. అందుకు మూవీ యూనిట్ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పారు. ఎంటర్ టైన్ మెంట్ రంగాలపైనా ఇలాంటి నిషేధం అనే పదాలు వాడరాదని దీపికా కాకర్ చెప్పుకొచ్చింది. ఇటీవల పాక్ ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్ లో జరిపిన ఉడీ ఉగ్రదాడిలో 18 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. -
మీ ఆత్మాహుతి బాంబర్లను పాక్ పంపండి
పాకిస్థాన్‌కు చెందిన నటీనటులంతా 48 గంటల్లోగా భారతదేశాన్ని వదిలి వెళ్లిపోవాలంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చేసిన హెచ్చరికలపై సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర ఎమ్మెల్యే అబూ అజ్మీ స్పందించారు. దమ్ముంటే రాజ్ ఠాక్రే తన ఆత్మాహుతి బాంబర్లను పాకిస్థాన్‌లోని లాహోర్, కరాచీ నగరాలకు పంపాలని సవాలుచేశారు. పాకిస్థాన్ తన ఆత్మాహుతి దళాలను భారత్ పంపుతోందని, దానికి ప్రతీకారంగా కావలంటే మీ వాళ్లను పాక్ పంపాలని తెలిపారు. అంతేతప్ప చట్టబద్ధంగా భారతదేశ వీసా తీసుకుని ఇక్కడకు వచ్చేవారిని భయపెట్టొద్దని తెలిపారు. దానివల్ల మీ ఓటుబ్యాంకే దెబ్బతింటుందని అన్నారు. పాకిస్థాన్ విషయం పక్కన పెడితే.. మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రాపూర్ లాంటి ప్రాంతాల్లో నక్సలైట్లు పోలీసులపై దాడులు చేస్తున్నారని.. ముందుగా పార్టీ కార్యకర్తలను పంపి ఆ పోలీసులను రక్షించాలని అబూ అజ్మీ అన్నారు. పాకిస్థానీ ఉగ్రవాదులు మన 18 మంది జవాన్లను హతమార్చిన మాట నిజమేనని, దానిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనంటూ అంతమాత్రాన అక్కడి నుంచి వచ్చే కళాకారులు, క్రీడాకారులను భయపెట్టడం సరికాదన్నారు. రాజ్‌ఠాక్రేకు దమ్ముంటే ఢిల్లీ వెళ్లి పాకిస్థాన్ రాయబార కార్యాలయాన్ని మూసేయాలని, అలాగే పాకిస్థాన్‌లోని భారత ఎంబసీకి వెళ్లి ఆ దేశం వాళ్లకు ఇక్కడి వీసాలు ఇవ్వకుండా చూడాలని తెలిపారు. -
థాక్రేపై ఎస్పీ నేత సంచలన వ్యాఖ్యలు
ముంబై: ఉరి ఉగ్ర దాడి నేపథ్యంలో బాలీవుడ్‌లోని పాకిస్థాన్ నటులు 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) హెచ్చరికలపై సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) స్పందించింది. దీనిపై ఎస్పీ మహారాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే అబు ఆజ్మీ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి వీసాలతో చట్టబద్ధంగా వచ్చే వారిని భయపెట్టడం కాదని, దమ్ముంటే లాహోర్, కరాచీలకు ఆత్మాహుతి దళాలను పంపించాలని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రేకు సవాలు విసిరారు. పాకిస్తాన్ నుంచి అధికారికంగా భారతదేశం వచ్చే ప్రజలను భయపెట్టడానికి బదులుగా లాహోర్, కరాచీ ఆత్మాహుతి బాంబర్లను పంపండి. పాక్ మన దేశానికి ఆత్మాహుతి బృందాలను భారతదేశానికి పంపుతోంది. మీకు దమ్ముంటే, దేశంపై సానుభూతి , ప్రేమ ఉంటే ఇపుడు మీరు కూడా మీ ఆత్మాహుతి బాంబర్లను లాహోర్, పాకిస్థాన్ కు వ్యతిరేకంగా పోరాడటానికి పంపాలనీ, అంతేకానీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దని రాజ్‌థాక్రేకు అబు అజ్మీ పేర్కొన్నారు. పాకిస్థాన మాట పక్కన పెట్టి...మహారాష్ట్ర సంగతి చూడమంటూ ఘాటుగా స్పందించారు. పాకిస్థాన్ దాకా ఎందుకు? గడ్చిరోలి, చంద్రాపూర్‌లో నక్సల్స్ పోలీసులపై దాడులకు దిగుతున్నారు. కనీసం అక్కడికైనా మీ కార్యకర్తలను పంపించి భద్రతా దళాలను రక్షించండి. అప్పుడు మీరు దేశం కోసం పాకులాడుతున్నట్టు తాను అర్థం చేసుకుంటానంటే అబు అజ్మి విరుచుకుపడ్డారు. మరోవైపు థాక్రే వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకులు విక్రమ్ భట్, హన్సల్ మెహతా స్పందించారు. క్రికెటర్లను, కళాకారులను టార్గెట్ చేయడం సరికాదని విక్రం పీటీఐకి చెప్పారు. దాడులకు , కళాకారులకు సంబంధం ఏమిటంటూ మరో దర్శకుడు హన్సల్ మెహతా ట్విట్టర్ ద్వారా తన నిరసనను వ్యక్తం చేశారు. కాగా పాకిస్తాన్ నుండి నటులు మరియు కళాకారులు 48 గంటల్లో భారతదేశం విడిచి పోవాలని.. లేదంటే తామే మెడపట్టి గెంటేస్తామని ఎంఎన్ఎస్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. MNS for next central govt. In one master stroke they have solved the India Pakistan problem. After all it is artistes who provoke attacks. — Hansal Mehta (@mehtahansal) 23 September 2016 -
ఆ నటులందరికీ భద్రత కల్పిస్తాం
ముంబై: పాకిస్థాన్‌కు చెందిన సినీ, టీవీ నటులు రెండు రోజుల్లోపు దేశం విడిచి వెళ్లిపోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఎంఎన్ఎస్ అల్టిమేటం జారీచేయడంపై మహారాష్ట్ర పోలీసులు స్పందించారు. భారత ప్రభుత్వం అనుమతితో వచ్చిన పాక్ సహా విదేశాలకు చెందిన నటీనటులందరికీ రక్షణ కల్పిస్తామని, ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. వాళ్లకు అవసరమైన భద్రత ఏర్పాటు చేస్తామని ముంబై జాయింట్ పోలీస్ కమిషనర్ దేవెన్ భారతి చెప్పారు. పోలీసుల ప్రకటన అనంతరం ఎంఎన్ఎస్ ఉపాధ్యక్షురాలు షాలిని థాక్రే స్పందిస్తూ.. పాక్ నటులు నటిస్తున్న సినిమాలు, టీవీ సీరియళ్ల షూటింగ్‌లను తమ కార్యకర్తలు అడ్డుకుంటారని హెచ్చరించారు. పాక్ నటులను ప్రోత్సహిస్తున్న కరణ్ జోహార్ వంటి నిర్మాతలను నేరుగా హెచ్చరిస్తున్నామని, పాక్ నటులకు అవకాశాలు ఇవ్వరాదని అన్నారు. పాక్ నటులకు కౌంట్ డౌన్ మొదలైందని, వాళ్లు దేశం విడిచివెళ్లకుంటే వెంటాడి తరిమేస్తామని ఎంఎన్ఎస్ నాయకులు హెచ్చరించారు. -
‘48 గంటల్లో దేశం విడిచిపెట్టి వెళ్లిపోండి’
-
48గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. లేదంటే..
ముంబయి: పాకిస్థాన్ కు చెందిన నటులకు, టీవీ ఆర్టిస్టులకు మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) హెచ్చరికలు జారీ చేసింది. 48గంటల్లో భారత దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీ చేసింది. లేదంటే ఆ తర్వాత జరగబోయే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఎంఎన్ఎస్ చిత్రపత్ సేనా చీఫ్ అమేయ ఖోప్కార్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల (సెప్టెంబర్ 18)న ఊడి సెక్టార్ పై పాక్ ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత దేశ వ్యాప్తంగా పాక్ వ్యతిరేక వైఖరి దేశంలో బాగా పెరిగిపోయిందని అందుకే పాక్ కు చెందిన ఏ నటులు, ఆర్టిస్లులు ఉండొద్దని ముందస్తుగా హెచ్చరిస్తున్నామని చెప్పారు. తాము చెప్పినట్లు విని వారు వెళ్లకపోతే ఎలా పంపించాలో తమ పద్ధతిలో చూపిస్తామని హెచ్చరించారు. పాకిస్థాన్ నటులతో సినిమాలు, ప్రత్యేక షోలు చేసే నిర్మాతలను త్వరలోనే అడ్డుకుంటామని తెలిపారు. గతంలో ఎంఎన్ఎస్, శివసేన ఈ తరహా కార్యక్రమాలు గతంలో చేసిన విషయం తెలిసిందే. -
‘48 గంటల్లో దేశం విడిచిపెట్టి వెళ్లిపోండి’
ముంబై: ఉడీ ఉగ్రవాద ఘటన నేపథ్యంలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) పాకిస్థాన్ నటీనటులు, ఆర్టిస్టులకు అల్టిమేటం జారీ చేసింది. వీరంతా 48 గంటల్లో ఇండియా వదిలిపెట్టి వెళ్లి పోవాలని ఎమ్మెన్నెస్ కు చెందిన చిత్రపట్ కర్మచారి సేన హెచ్చరించించింది. భారతదేశంలో నివసిస్తున్న పాకిస్థాన్ ఆర్టిస్టులు మూటముళ్లె సర్దుకుని వెళ్లిపోవాలని చిత్రపట్ సేన అమేయ్ ఖోపాక్ అన్నారు. ‘పాకిస్థాన్ నటులు, ఆర్టిస్టులు మనదేశం విడిచిపెట్టి వెళ్లిపోవడానికి 48 గంటలు సమయం ఇస్తున్నాం. ఒకవేళ వారు వెళ్లకపోతే ఎమ్మెన్నెస్ బయటకు గెంటేస్తుంద’ని అమేయ్ పేర్కొన్నారు. పాకిస్థాన్ కళాకారులకు వ్యతిరేకంగా శివసేన, ఎమ్మెన్నెస్ గతంలో పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి నేపథ్యంలోనే పాకిస్థాన్ కు చెందిన గజల్ గాయకుడు గులామ్ అలీ ఇటీవల ముంబై జరగాల్సిన తన ప్రదర్శనను రద్దు చేసుకున్నారు. -
ఇంతకీ కమెడియనా.. విలనా?
కమెడియన్ కపిల్ శర్మ వ్యవహారం రోజురోజుకూ సరికొత్త మలుపులు తిరుగుతోంది. అంధేరీలోని తన బంగ్లా వద్ద మడ అడవులను కపిల్ నరికేస్తున్నాడని, అక్రమంగా కొత్త అంతస్తులు నిర్మిస్తున్నాడని మహారాష్ట్ర నవనిర్మాణ సమితి (ఎంఎన్ఎస్) ప్రధాన కార్యదర్శి షాలిని ఠాక్రే ఆరోపించారు. కపిల్‌కు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మద్దతు పలకకూడదని, అబద్ధాల కోరు అయిన శర్మ మునిసిపల్ చట్టాలను ఎలా ఉల్లంఘించాడో తాము సాక్ష్యాలు కూడా చూపిస్తామని అన్నారు. ఇప్పటికే ఉన్న జి ప్లస్ వన్ అంతస్తుకు అదనంగా మరో నిర్మాణం చేస్తుండటంతో కపిల్ శర్మకు జూలై 16న ఒక నోటీసు ఇచ్చారు. దానికి 24 గంటల్లోగా సమాధానం చెప్పాలన్నారు. ఆగస్టు నాలుగోతేదీ వరకు కూడా అతడి నుంచి సమాధానం రాకపోవడంతో వార్డు అధికారులు అదనంగా చేసిన నిర్మాణాలను కూల్చేశారని అసిస్టెంట్ మునిసిపల్ కమిషనర్ పరాగ్ మాసుర్కర్ చెప్పారు. అయితే.. కొన్ని నెలల్లోనే బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు ఉండటంతో పార్టీలన్నీ ఈ వివాదాన్ని భుజానికి ఎత్తుకున్నాయి. కపిల్ శర్మ పాల్గొనే షూటింగులను తాము అడ్డుకుంటామని ఎంఎన్ఎస్ సినిమా విభాగం చీఫ్ అమేయ ఖోప్కర్ హెచ్చరించారు. ఎప్పుడో ఆగస్టు నాలుగో తేదీన కూల్చేస్తే.. బీఎంసీ మీద ఆరోపణలు చేయడానికి కపిల్‌కు నెల రోజులు పట్టిందా అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం బీఎంసీని భ్రష్టాచార్ మునిసిపల్ కార్పొరేషన్ అని అభివర్ణించింది. -
ఔను! చట్టాన్ని ఉల్లంఘిస్తాం!
థానే: సాక్షాత్తు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) బేఖాతరు చేసింది. కృష్ణాష్టమి సందర్భంగా గురువారం థానెలో ఉట్టికొట్టేందుకు ఏకంగా 40 అడుగుల మానవ పిరమిడ్‌ను నిర్మించింది. అంతేకాకుండా 'నేను చట్టాన్ని ఉల్లంఘిస్తాను' అనే రాతలు ఉన్న టీషర్ట్లు ధరించి ఎమ్మెన్నెస్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించే ఉట్టి వేడుకలపై సుప్రీంకోర్టు బుధవారం పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఉట్టికుండ కొట్టేందుకు 20 అడుగుల ఎత్తుకుమించి మానవ పిరమిడ్లను నిర్మించవద్దని, మైనర్లు ఈ వేడుకల్లో పాల్గొనకుండా చూడాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉట్టి ఉత్సవాల్లో పలు ప్రమాదాలు జరిగే ప్రాణాపాయం సంభవిస్తుండటంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ ఆదేశాలు ఇచ్చింది. కానీ, మహారాష్ట్రలో చాలాచోట్ల ఆదేశాలను ఉల్లంఘించారు. రాష్ట్రంలో ఘనంగా జరిగే కృష్ణాష్టమి ఉత్సవాల్లో భాగంగా పలుచోట్ల 40 నుంచి 50 అడుగుల ఎత్తులో మానవ పిరమిడ్లను నిర్మించే ఉట్టికుండలను పగులకొట్టారు. సుప్రీం ఆదేశాలను బేఖాతరు చేయడాన్ని ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ ఠాక్రే సమర్థించుకున్నారు. 'మహారాష్ట్ర పండుగల పరిరక్షణ కోసం చట్టాలను ఉల్లంఘించాల్సి వస్తే అందుకు నేను సిద్ధం. ఎత్తు విషయంలో ఆంక్షలు చట్టమేమీ కాదు. కోర్టు ఆదేశాలు మాత్రమే. అందుకు మీకు ఇష్టమున్న రీతిలో మానవ అంచెలు నిర్మించుకొని గోవిందులకు (ఉట్టి వేడుకలో పాల్గొనేవారికి) చెప్పాను' అని రాజ్ ఠాక్రే మీడియాతో పేర్కొన్నారు. -
ఠాక్రేలు మళ్లీ కలిశారు..!
ముంబై: శివసేనను వీడి వేరుకుంపటి పెట్టుకున్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే మళ్లీ ఆ పార్టీకి దగ్గరవుతున్నారా? బీజేపీపై తరచూ విమర్శలు చేస్తూ, ఆ పార్టీతో పొత్తు కారణంగా తమ పార్టీ తీవ్రంగా నష్టపోయిందని రగిలిపోతున్న శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే రాజకీయ పునరేకీకరణకు ప్రయత్నిస్తున్నారా? అంటే తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే.. ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశంకావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ముంబైలోని దాదర్‌లో నివసిస్తున్న రాజ్ ఠాక్రే శుక్రవారం బాంద్రాలోని ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీకి వెళ్లి ఆయన్ను కలిసినట్టు సమాచారం. శివసేన, ఎంఎన్ఎస్ల మధ్య సయోధ్య కుదరనుందని, వచ్చే ఏడాది జరిగే ముంబై కార్పొరేషన్ సహా స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజ్ ఠాక్రే.. శివసేన వ్యవస్థాపకుడు, దివంగత నేత బాల్ ఠాక్రే సోదరుడి కుమారుడు. ఒకప్పుడు రాజ్ ఠాక్రే శివసేనలో చురుగ్గా పనిచేశారు. వారసత్వ రేసులో విభేదాలు రావడంతో 2006లో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అదే ఏడాది మార్చిలో ఎంఎన్ఎస్ను స్థాపించారు. ఇక శివసేన చీఫ్‌గా బాల్ ఠాక్రే వారసుడిగా ఆయన కుమారుడు ఉద్ధవ్ పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత భిన్నధ్రువాలుగా ఉంటున్న ఠాక్రేలు మళ్లీ కలిసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
రోడ్లపై గుంతలు పూడ్చకపోతే కిడ్నాప్ చేస్తా
అధికారికి ముంబై కార్పొరేటర్ హెచ్చరిక ముంబై : ‘మా ప్రాంతంలో రోడ్లపై గుంతలు పూడ్చకపోతే నిన్ను కిడ్నాప్ చేస్తా’ అంటూ ముంబై కార్పొరేటర్ ఒకరు సంబంధిత అధికారిని బెదిరించారు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పార్టీకి చెందిన దాదర్ కార్పొరేటర్ సందీప్ దేశ్‌పాండే, ‘జీ-నార్త్’ వార్డ్ ఇన్చార్జికి గతవారం ఇలా బెదిరిస్తూ లేఖ రాశారు. సందీప్ స్పందిస్తూ తాను అధికారిని బెదిరిస్తూ ఉత్తరం రాశానని ఒప్పుకున్నారు. ప్రజలు తనను ఎన్నుకున్నది వారి సమస్యలను పరిష్కరించడానికనీ, అధికారితో పనిచేయించడానికి ఈ పని చేశానని అన్నారు. వార్డు ఇన్చార్జ్ మాట్లాడుతూ..దాదార్ ప్రాంతంలో రోడ్లపై గుంతలను పూడ్చడమే తమ తొలి ప్రాధాన్యమన్నారు. ఇక్కడ రోడ్లన్నీ అందంగా, వాహనదారులకు సౌకర్యవంతంగా ఉన్నాయి కాబట్టి వ్యవహార ం కిడ్నాప్ వరకు వెళ్లదని ఆయన చెప్పారు. -
ఆ అసభ్య వీడియోను వెంటనే బ్లాక్ చేయండి!
సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న కమెడియన్ తన్మయ్ భట్ వీడియోపై ముంబై సైబర్ సెల్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ల పట్ల అసభ్య హాస్యంతో ఉన్న ఈ వీడియో ఆన్లైన్లో కనిపించడకుండా బ్లాక్ చేయాలంటూ గూగుల్, ఫేస్బుక్, యుట్యూబ్‌లను వారు అడిగారు. లతా, సచిన్‌ను అవమానపరిచేవిధంగా ఉన్న ఈ వీడియోను తొలగించాలని ఆదేశించారు. ఇమిటేటింగ్ వాయిస్ తో లత, సచిన్ ముఖాలతో యూట్యూబ్ లో తన్మయ్ పోస్ట్ చేసిన వీడియోపై దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. 'లత: సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లి గొప్ప క్రికెటర్.. సచిన్: మీరు 5000 ఏళ్ల ముసలామెగా మాట్లాడుతున్నారు' అంటూ సంభాషణ సాగే వీడియోలో 86 ఏళ్ల లతా ఇంకా ఎందుకు బతికి ఉందని అంటూ వెకిలీ హాస్యాన్ని చూపించారు. ఈ వీడియోపై ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెలువడగా.. బీజేపీ, శివసేన, ఎమ్మెన్నెస్ దీని రూపకర్తలపై పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫేస్బుక్లో, యుట్యూబ్లో ఈ వీడియో పెట్టిన తన్మయ్ భట్‌తోపాటు ఏఐబీ టీమ్‌ను విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వీడియోను పోస్టు చేసిన ఐపీ అడ్రస్‌ను తెలుసుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ముంబై అసిస్టెంట్ పోలీసు కమిషనర్ యశ్వంత్ పాఠక్ విలేకరులకు తెలిపారు. -
కష్టాల్లో కమెడియన్
ముంబై: 'సచిన్ వర్సెస్ లత సివిల్ వార్' వ్యవహారంతో కమెడియన్ తన్మయ్ భట్ కష్టాల్లో పడ్డాడు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను అమానించిందుకు అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడిపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇమిటేటింగ్ వాయిస్ తో లత, సచిన్ ముఖాలతో యూట్యూబ్ లో తన్మయ్ పోస్ట్ చేసిన వీడియోపై వివాదం రేగింది. వీరిద్దరి మధ్య సంభాషణ జరిగినట్టు వీడియో చూపించారు. వీడియాలో ఇలా సాగుతుంది. లత: సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లి గొప్ప క్రికెటర్ సచిన్: మీరు 5000 ఏళ్ల ముసలామెగా మాట్లాడుతున్నారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తన్మయ్ తన వికారాన్ని బయటపెట్టుకున్నాడని మండిపడ్డారు. బాల్ థాకరే బతికివుంటే అతడికి చుక్కలు చూపించేవారని పేర్కొన్నారు. వివాదాలు తన్మయ్ కు కొత్తకాదని దుమ్మెత్తిపోశారు. -
'ఇటు రా.. మెడపై కత్తిపెడతా'
ముంబై: 'భారత్ మాతాకీ జై' నినాదంపై చెలరేగుతున్న వివాదానికి మరింత ఆజ్యంపోశారు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే. 'మహారాష్ట్రకు రా.. నీ మెడపై కత్తిపెడతా. 'భారతమాతాకీ జై' అని ఎందుకు అనవో చూస్తా' అంటూ హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసద్దుదీన్ ఒవైసీని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ముంబైలోని ప్రఖ్యాత శివాజీ పార్కులో శుక్రవారం రాత్రి జరిగిన ఓ సభలో మాట్టాడిన రాజ్ థాక్రే ఎంఐఎం, బీజేపీ, శివసేనలపై విరుచుకుపడ్డారు. ఎంఐఎంకు బీజేపీ ఆర్థిక సహాయం అందిస్తున్నదని ఆరోపించారు. అధికార బీజేపీ కరువు పరిస్థితులపై పట్టనట్లు వ్యవహరిస్తున్నదని, మిత్రపక్షంగా ఉన్న శివసేన వెంటనే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని రాజ్ థాక్రే అన్నారు. దేశభక్తి విషయంలో ఆర్ఎస్ఎస్ నిర్ధేశాలను పట్టించుకోనని, మెడపై కత్తిపెట్టినా భారత్ మాతాకీ జై నినాదం చేయబోనని అసదుద్దీన్ గతంలో చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. 'చట్టాలను గౌరవించబట్టే భారత్ మాతాకీ జై అననన్న లక్షల మందిని ఊచకోత కోయట్లేదు'అని యోగా గురు రామ్ దేవ్ అన్నారు. ఇప్పుడు అసద్ ను విమర్శించిన వంతు రాజ్ థాక్రేది. -
నేను చెప్పిందేంటి.. మీరు రాసిందేంటి..?
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే... మరాఠీ విలేకరులపై మండిపడ్డారు. తానొకటి చెబితే విలేకరులు మరోటిరాశారని మీడియాపై చిందులువేశారు. హిందీ విలేకరుల విషయం పక్కనబెట్టినా మరాఠీ మీడియా ఇలా చేస్తుందని అనుకోలేదని, తన వ్యాఖ్యలు అర్థం చేసుకుంటుందని భావించానన్నారు. కాని మరాఠీ విలేకరులలో ‘ఫుల్ ప్యాంటులో ఆఫ్ ప్యాంటు’ కన్పిస్తోందంటూ.. బీజేపీకి మరాఠీ మీడియా మొకరిల్లిందని పరోక్షంగా ఆరోపించారు. బిల్డర్లతో ప్రభుత్వం కుమ్మక్కు అక్రమ కట్టడాలు నిర్మించిన బిల్డర్లతో ప్రభుత్వం కుమ్మక్కైందని రాజ్ ఠాక్రే ఆరోపించారు. అనుమతి లేకుండా ఇళ్లు నిర్మించి విక్రయించిన బిల్డర్లపై చర్యలు తీసుకోకుండా ఎలా క్రమబద్ధీకరిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని రెండు లక్షలకుపైగా ఉన్న అక్రమ కట్టడాలను కొన్ని శరతులపై క్రమబద్ధీకరిస్తామని శుక్రవారం శాసనసభలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విషయమై తొందర్లోనే చట్టం తీసుకురానున్నట్లు స్పష్టం చేసిన ఫడ్నవీస్ శరతులపై మాత్రం స్పష్టతనివ్వలేదు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో ముంబై, థానే, దివాతోపాటు పుణే, పింప్రి-చించ్వడ్, నాసిక్, ఔరంగాబాద్ నగరాల్లో లక్షలాది మంది ప్రజలకు లాభం కలగనుందని భావిస్తున్నారు. అయితే దీనిపై ఠాక్రే తీవ్రంగా స్పందించారు. కేవలం బిల్డర్లకు లాభం చేకూర్చడానికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. అక్రమ కట్టడాలు నిర్మించి అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా అక్రమకట్టడాలను క్రమబద్దీకరణ చేపట్టడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెనక్కి తీసుకోలేదు.. రాష్ట్రేతరులకు అందించే ఆటో పర్మిట్లపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదని రాజ్ స్పష్టం చేశారు. ఆటో అందోళన ఎంఎన్ఎస్ విరమిస్తున్నట్లు శనివారం వార్తలు ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై ఠాక్రే స్పందిస్తూ.. అలాంటిదేమీలేదని, పర్మిట్లు ఇంకా పంపిణీ చేయకపోవడంతో తాత్కాలికంగా ఆందోళన నిలిపేశామన్నారు. తమ పేరుతో ఇతరులు ఆందోళన చే యకూడదనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. -
'రోడ్లపైకి వస్తే నిప్పంటించడం ఖాయం'
ముంబయి: రాష్ట్రంలో ఆటోరిక్షాల అనుమతులు మరాఠేతరులకే అధికంగా ఇస్తున్నారని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఆరోపించింది. 70శాతం ఆటో పర్మిట్లు రాష్ట్రేతరులకే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఆటోలన్నింటిని గుర్తించి తగులబెడతామంటూ బహిరంగ ప్రకటన చేసింది. తన పార్టీ కార్యకర్తలు అలాంటి ఆటోలు రోడ్లపై కనిపిస్తే నిప్పుపెట్టడం ఖాయం అని ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే చెప్పారు. పార్టీ పదో వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. 'కొత్త పర్మిట్ తీసుకున్న మహారాష్ట్రేతర ఆటో కనిపిస్తే ఆపేస్తాం. అందులోని ప్రయాణీకులను దించివేసి ఆ ఆటోను కాల్చివేస్తాం.. రాష్ట్ర రవాణాశాఖను చూసుకుంటున్న శివసేన ఈ విషయంలో ఏం చేస్తోంది చెప్పాలి' అని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉన్న అనుమతులు కాకుండా త్వరలోనే మరో 70 వేల మహారాష్ట్రేతరులకు అనుమతులు ఇవ్వబోతున్నారని వాటిని ఆపకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. -
'బీజేపీ అంటే.. భారతీయ జంతుపక్ష పార్టీ'
మహారాష్ట్రలో మాంసం విక్రయాల నిషేధంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ అంటే భారతీయ జంతుపక్ష పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ముంబైలో ఏం చేయాలన్నది కేవలం జైనులు మాత్రమే నిర్ణయించలేరు కదా అని ఆయన వ్యాఖ్యానించారు. రేపు మరో వర్గానికి చెందిన ప్రజలు తమ పండుగ రోజుల్లో షాపులన్నీ మూసేయాలంటే అప్పుడు మూసేస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ఓటుబ్యాంకు రాజకీయాల నుంచి లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని రాజ్ ఠాక్రే మండిపడ్డారు. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా హిందువులకు జైనులు వ్యతిరేకమనే భావన వస్తోందని ఆయన అన్నారు. -
మాంసం అమ్మకాల్లో 'మహా సేన'
ముంబయి: దేశ వాణిజ్య రాజధానిలో మాంసం లొల్లి ముదురుతోంది. ఓ పక్క జైనులు పవిత్రంగా భావించే ఆ ఎనిమిది రోజులు మాంసం అమ్మాకాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకోగా దానిని శివసేన పార్టీ విమర్శించిన విషయం తెలిసిందే. అయితే, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన మాత్రం శివసేన కంటే మరో అడుగు మందుకేసి ఏకంగా మాంసం అమ్మకాలను స్వయంగా గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేసింది. ముంబయి దాదార్ లోని అగర్ బజార్‌వద్ద తన పార్టీకి చెందిన కార్యకర్తలతో ప్రత్యేక మాంసం విక్రయ కేంద్రాలను ఏర్పాటుచేయిస్తానని చెప్పింది. దీంతో ఈ వివాదం కాస్త రాజకీయ రంగు పులుముకుని మరింత వివాదంగా మారే అవకాశం ఉంది. జైనులు పవిత్రంగా భావించే పర్యుషాన్ సందర్భంగా తొలుత ఎనిమది రోజులపాటు మాంసం విక్రయాలు నిషేధించాలని భావించారు. అయితే, పలు వర్గాల అభిప్రాయాలు తీసుకొని మొత్తం నాలుగు రోజులు నిషేధం విధించారు. అయినప్పటికీ ఈ నిర్ణయంపై కూడా పలు రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా శివసేన పార్టీ అయితే.. ఎవరేం తినాలో చెప్పే హక్కు ఏ ఒక్కరికీ లేదని బీజేపీ నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకించగా.. ఇప్పుడు ఎమ్మెన్నెస్ మరో అడుగు ముందుకేసింది. -
శివసేన, ఎమ్మెన్నెస్ మధ్య ‘చెరువు’ జగడం
సాక్షి, ముంబై : ఓపెన్ ఎయిర్ జిమ్‌పై కాంగ్రెస్, శివసేన యువ నాయకుల మధ్య వాగ్వివాదం మరువకముందే తాజాగా మరో వివాదం తెరమీదకు వచ్చింది. భాండూప్ ప్రాంతంలో మహానగర పాలక సంస్థ (బీఎంసీ) చేపట్టిన చెరువు సుందరీకరణ పనులపై శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) మధ్య వివాదం ముదురుతోంది. చెరువు సుందరీకరణ తమ ప్రయత్నం వల్లే జరిగిందని ఇరు పార్టీలు వాదించుకుంటున్నాయి. రెండు పార్టీల మధ్య వివాదం ఎక్కువవుతుండటంతో చెరువు ప్రారంభోత్సవం ఎవరి చేతులమీదుగా జరుగుతుందనే విషయం ఆసక్తిగా మారింది. పశ్చిమ భాండూప్‌లోని 108 వార్డులోని శివాజీ (కొలను)లో 25 ఏళ్లుగా బురద, చెత్త పేరుకుపోవడంతో కొలను పరిస్థితి దారుణంగా తయారైంది.దీంతో చెరువును సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ఎమ్మెన్నెస్ మాజీ ఎమ్మెల్యే శిశీర్ షిండే, ఎమ్మెన్నెస్ కార్పొరేటర్లు రూపేశ్ వాయంగన్కర్, వైష్ణవి సర్ఫరే, అనిషా మాజ్గావ్కర్ పలుమార్లు డిమాండ్ చేశారు. తర్వాత బీఎంసీ రూ.రెండు కోట్లతో కొలను సుందరీకరణ పనులు చేపట్టింది. దీంతో తమ వల్లే చెరువు సుందరీకరణ సాధ్యమైందని ఎమ్మెన్నెస్ నాయకులు వాదిస్తున్నారు. సేన ప్రమేయంతోనే..: కార్పొరేటర్ రమేశ్ దీనిపై భాండూప్ ప్రాంతానికి చెందిన శివసేన సీనియర్ కార్పొరేటర్ రమేశ్ కోర్గావ్కర్ మాట్లాడుతూ.. చెరువు సుందరీకరణ పనులకోసం శివసేన బడ్జెట్లో నిధులు కేటాయించిందని చెప్పారు. పార్టీ అభివృద్ధి నిధి నుంచి అదనంగా రూ. 50 లక్షలు అందించినట్లు కూడా పేర్కొన్నారు. పనుల్లో జాప్యం జరగకుండా తరచూ బీఎంసీ కమిషనర్, మేయర్‌తో సేన సంప్రదింపులు జరిపిందన్నారు. సకాలంలో పనులు పూర్తి చేసేందుకు అనేక సమావేశాలు నిర్వహించామని చెప్పారు. చెరువు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న తరుణంలో చెరువు సుందరీకరణ పనుల కీర్తి దక్కించుకునేందుకు ఎమ్మెన్నెస్ ఈవిధమైన వ్యాఖ్యలు చేస్తోందని ఆరోపించారు. కాగా, చెరువు సుందరీకరణ పనులు పూర్తయిన నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే చేతులు మీదుగా జరగాలని ఎమ్మెన్నెస్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే చేతుల మీదుగా జరగాలని బీఎంసీ కమిషనర్‌కు లేఖ రాశారు. దీంతో ప్రారంభోత్సవం ఎవరి చేతుల మీదుగా జరుగుతుందని స్థానికుల్లో ఉత్కంఠ నెలకొంది. -
అమీర్‌పేటలో సాఫ్ట్వేర్ సంస్థ మోసం
హైదరాబాద్: హైదరాబాద్ అమీర్‌పేటలో ఎంఎన్ఎస్ అనే ఓ ప్రైవేటు సాఫ్ట్వేర్ సంస్థ నిరుద్యోగులకు కుచ్చు టోపీ పెట్టింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.40 వేలు వసూలు చేసిన సంస్థ ఎనిమిది నెలలైనా ఉద్యోగాలు చూపించకపోవడంతో బాధితులు శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిరుద్యోగుల నుంచి మొత్తం రూ. 80 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. బాధితుల ఫిర్యాదు మేరకు అమీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎందుకంత తొందర
- సల్మాన్‌తో రాజ్ ఠాక్రే, నితేష్ రాణే భేటీని తప్పుపట్టిన శరద్ పవార్ - కారు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని రాజ్ పరామర్శించారా అని ప్రశ్న సాక్షి, ముంబై: హిట్ అండ్ రన్ కేసులో దోషి అయిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే, కాంగ్రెస్ యువనాయకుడు నితేష్ రాణే కలవడాన్ని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తప్పుపట్టారు. రాజ్ ఠాక్రే శుక్రవారం మధ్యాహ్నం సల్మాన్ ఇంటికి వెళ్లాడని, ఆయన్ను ఓదార్చడానికి ఎందుకింత తొందర అని ప్రశ్నించారు. కారు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబీకులను పరామార్శించేందుకు రాజ్ ఠాక్రే వెళ్లారా అని ప్రశ్నించారు. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్‌కు 5 ఏళ్ల శిక్ష పడిన అనంతరం ఒక్కసారిగా ఖాన్ ఇంటో బాలీవుడ్ నటులు, ఇతర ప్రముఖుల సందడి కనిపించింది. ఈ నేపథ్యంలో పవార్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాజ్ ఠాక్రే ఓ రాజకీయ నాయకుడని, పార్టీ అధ్యక్షుడని, ఓ కేసులో దోషి అయిన వ్యక్తితో రాజ్ భేటీ వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని పరోక్షంగా అన్నారు. మరోవైపు సల్మాన్ ఖాన్‌తో నారాయణ రాణే కుమారుడు నితేష్ రాణే భేటీ కావడంపై కూడా పవార్ విమర్శలు గుప్పించారు. సల్మాన్‌తో భేటీ అయిన సచిన్ ఆహీర్ ఎన్సీపీ నాయకుడు సచిన్ ఆహీర్ హిట్ అండ్ రన్ కేసులో దోషిగా అయిదేళ్ల శిక్ష పడిన సల్మాన్ ఖాన్‌తో భేటీ అయ్యారు. ఓ వైపు ఖాన్‌తో భేటీ అయన రాజ్ ఠాక్రే, నితేష్ రాణేలపై ఎన్సీపీ అధ్యక్షుడు పరోక్షంగా విమర్శలు గుప్పిస్తుంటే.. మరోవైపు ఎన్సీపీ పార్టీ నాయకుడు సల్మాన్ ఖాన్‌తో భేటీ కావడం విశేషం. -
రాజ్ ఠాక్రేకు హైకోర్టు షోకాజ్ నోటీస్
అక్రమ హోర్డింగ్‌లపై వివరణ ఇవ్వాలని ఆదేశం సాక్షి, ముంబై: నగరంలో ఏర్పాటు చేసిన అక్రమ హోర్డింగ్‌లపై బాంబే హైకోర్టు గురువారం ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే, ఆ పార్టీ ఎమ్మెల్యే బాలా నాంద్‌గావ్కర్, బీజేపీ ఎమ్మెల్యే ఆశీష్ శేలార్లకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. న్యాయస్థానాన్ని అవమానించినందుకు ఎందుకు విచారణ జరపకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గతంలో కోర్టులో జరిగిన విచారణలో అక్రమ హోర్డింగ్‌లు పెట్టబోమని అఫిడవిట్ సమర్పించిన వీరు తర్వాత ముంబైలో అనేక చోట్ల అక్రమ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. దీంతో కోర్టులో మళ్లీ పిటిషన్ దాఖలైంది. దీనిపై ఆగ్రహానికి గురైన కోర్టు ఠాక్రే, నాంద్‌గావ్కర్, శేలార్లకు షోకాజ్ నోటీజు జారీ చేసింది. -
ముంబైని అమ్మేస్తే ఒప్పుకోం: రాజ్ ఠాక్రే
ముంబై: అభివృద్ధి పేరిట ముంబైని ఇంచుఇంచుకు అమ్ముతున్నారని మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీ అధినేత రాజ్‌ఠాక్రే బీజేపీపై విమర్శలు గుప్పించారు. భవిష్యత్తులో మహారాష్ట్రీయులకు స్వరాష్ట్రంలోనే ప్రతీది ఖరీదైనదిగా మారే ప్రమాదం ఉందని, పెట్టుబడిదారులకోసం అభివృద్ధి పేరిట ముంబైలోని ప్రతి అంగుళాన్ని అమ్మేస్తున్నారని, దీనిని మనం ఏమాత్రం అంగీకరించవద్దంటూ పార్టీ నేతలకు, ప్రజలకు సూచించారు. ముంబై బృహత్తర ప్రణాళిక అంటూ తీసుకొచ్చారని, దీనిని కొందరు చాలా గొప్పదని అంటుంటే మరికొందరు చెత్తబుట్టల్లో వేయాల్సినదని అంటున్నారని చెప్పారు. తాను మాత్రం పూర్తిగా అది ఫలవంతం కానిదని అంటున్నానని అన్నారు. ప్రజల ప్రయోజనాలను పక్కకు పెట్టి ప్రభుత్వం చేసే ఏ పనులను అంగీకరించబోమని తెలిపారు. -
ఎమ్మెన్నెస్ ఓ కెరటం.. ఉవ్వెత్తున లేస్తుంది
సాక్షి, ముంబై: ఎమ్మెన్నెస్ సముద్రపు కెరటమని, మళ్లీ ఉవ్వెత్తున పైకి లేస్తుందని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే అన్నారు. గోరేగావ్‌లో శనివారం సాయంత్రం పార్టీ ఉపాధ్యక్షులు, గట్ ప్రముఖులు, పదాధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు, ప్రజలు ప్రశ్నించకపోతే ప్రధాని మరింత ఖరీదైన సూటు కుట్టించుకునేవారని మోదీపై రాజ్ విమర్శల బాణాలు సంధించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామ భారత పర్యటనకు వచ్చినప్పుడు మోడీ ప్రత్యేకంగా తయారుచేసిన ఖరీదైన సూటు ధరించారని, తర్వాత దాన్ని గుజరాత్లో వేలం వేశారన్న విషయం తెలిసిందే. దీనిపై రాజ్ ఠాక్రే మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి పదవిలో ఉన్నవారు అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేయాలన్నారు. సూటును గుజరాత్లో వేలం వేసిన విధానాన్ని బట్టి ఆలోచిస్తే మోడీకి సొంతరాష్ట్రంపైనే ప్రేమ ఎక్కువ ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు. సూటు వేలానికి ఇలాంటి స్పందన వస్తుందని ముందే తెలిసుంటే మరిన్ని సూట్లు కుట్టించుకునేవారని ఎద్దేవా చేశారు. వేలం ద్వారా వచ్చిన డబ్బును గంగానది శుభ్రపరచడానికి వినియోగిస్తానని మోడీ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై రాజ్ స్పందిస్తూ... గంగా నది ఎక్కడ...? మోడీ సూట్ ఎక్కడ...? ఇంత చిన్న సూట్‌తో అంతపెద్ద నదిని ఎలా శుభ్రపరుస్తారని ప్రశ్నించారు. చాయ్ (టీ) విక్రయించే వ్యక్తి ప్రధాని కావాలని లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు భారీ మెజారిటీతో గెలిపించారని, ఇపుడు ఆయన వైఖరిపై ప్రజలు ఏమనుకుంటున్నారో ఆలోచించాలన్నారు. టోల్‌పై నోరు మెదపరేం? ఎన్నికలకు ముందు టోల్ రద్దు చేస్తామని వాగ్దానాలు చేసిన బీజేపీ, శివసేన నాయకులు అధికారంలోకి రాగానే ఎందుకు నోరువిప్పడం లేదని ప్రశ్నించారు. టోల్‌కు వ్యతిరేకంగా ఎమ్మెన్నెస్ మాత్రమే పోరాడుతోందని, ఇతర పార్టీలు ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీశారు. ఎమ్మెన్నెస్ లక్ష్యంగా ఆరోపణలు చేసే అధికార పార్టీలు టోల్ ఎందుకు రద్దు చేయడం లేదన్నారు. కేవలం ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎమ్మెన్నెస్ ఆవిర్భవించలేదని, మహారాష్ట్ర హితవు కోసమని ఉద్ఘాటించారు. ఎన్నికల్లో ఓటమి చెందినంత మాత్రాన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదని నేతలకు, కార్యకర్తలకు హితవు పలికారు. శాసన సభలో ఎదురైన ఓటమిని మర్చిపోయి, ప్రజా కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. సముద్రపు అలల మాదిరిగా ఎమ్మెన్నెస్ మళ్లీ ఉవ్వెత్తున పైకి లేస్తుందన్న నమ్మకం ఉందని ఉద్ఘాటించారు. -
త్వరలో ‘మరాఠా’ పేరుతో ఎమ్మెన్నెస్ దినపత్రిక
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షులు రాజ్ ఠాక్రే త్వరలోనే ఓ దిన పత్రికను ప్రారంభించనున్నారు. తానే ప్రధాన సంపాదకులుగా వ్యవహరించనున్న ఈ పత్రిక పేరు ‘మరాఠా’ అని ఖరారు చేసినట్టు తెలిసింది. గతంలో శివసేన పార్టీ తన వాణిని వినిపించేందుకు ‘మార్మిక్’ అనే వ్యంగ్య చిత్రాల వారపత్రికతోపాటు ‘సామ్నా’ దినపత్రికను కూడా ప్రారంభించింది. ఈ పత్రికలను శివసేన తన ఎదుగుదలతోపాటు ప్రత్యర్థులపై తాము చెప్పదల్చుకున్నది వివరించేందుకు ఉపయోగించుకుంటోంది. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా శివసేన పార్టీకి సామ్నా పత్రిక ఎంతో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో బాల్ ఠాక్రే అడుగుజాడల్లో నడిచే రాజ్ ఠాక్రే పత్రిక స్థాపన విషయంలో కూడా ఆయనను అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెన్నెస్ స్థాపించి ఎనిమిదేళ్లు పూర్తవుతుండగా, గత సంవత్సరం జరిగిన లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కేవలం ఒక్క శాసనసభ స్థానం లభించింది. దీంతో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరంచేశారు. ఇందులో బాగంగా ప్రజల సంక్షేమంతోపాటు వారి సమస్యల కోసం పార్టీ చేపట్టిన కార్యక్రమాలను వివరించేందుకు , ప్రత్యర్థుల ఆరోపణలను తిప్పికొట్టేందుకు తమకంటూ ఓ పత్రిక ఉండాలన్న నిర్ణయాలనికి వచ్చారు. మరాఠీ రాజభాష దినోత్సవం సందర్భంగా ఎమ్మెన్నెస్ ఆధ్వర్యంలో మంగళవారం బాంద్రాలోని ఎంఐజీ క్లబ్లో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ కోసం ఓ పత్రిక ఉండాల్సిన అవసరాన్ని రాజ్ ఠాక్రే నొక్కి చెప్పినట్టు తెలిసింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందే పత్రికను ప్రారంభించాలన్న ఆలోచనతో రాజ్‌ఠాక్రే ఉన్నట్టు సమాచారం. -
మొబైల్ టికెటింగ్‌తో సమయం ఆదా
రైల్వే మంత్రి సురేష్ ప్రభు సాక్షి, ముంబై: మొబైల్ టికెటింగ్ విధానంతో లోకల్ రైళ్లలో ప్రయాణించేవారికి సమయం చాలా ఆదా అవుతుందని రైల్వే మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. దాదర్ రైల్వే స్టేషన్లో శనివారం లోకల్ ‘మొబైల్ టికెటింగ్’ విధానాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేశ్ ప్రభు మాట్లాడుతూ ముంబైలోని లోకల్ రైళ్లను ప్రతిరోజూ కొన్ని లక్షల మంది ప్రయాణికులు ఆశ్రయిస్తున్నారన్నారు. కాగా, వీరు గంటల తరబడి క్యూలో నిలబడే అవసరం లేకుండా సులభంగా టికెటు పొందేందుకు ఈ మొబైల్ టికెటింగ్ విధానం ఉపయోగపడుతుందన్నారు. త్వరలోనే సీఎస్టీ, కుర్లా, ఠాణే, కల్యాణ్ తదతర కీలక స్టేషన్లలో ఈ విధానాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఈ అప్లికేషన్‌ను ఆండ్రాయిడ్, విండోస్ సాఫ్ట్ వేర్ ఉపయోగించేవారు డౌన్ లోడ్ చేసుకునే అవకాశముంటుందని చెప్పారు. వినియోగదారుడు తొలుత అప్లికేషన్‌ను ఓపెన్ చేసి పేరు, మొబైల్ నంబర్, ముంబై సిటీ నమోదుచేసిన తర్వాత ఎస్సెమ్మెస్ ద్వారా అతనికి ఒక పాస్ వర్డ్ వస్తుందన్నారు. అప్పుడు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వినియోగదారుడి పేరు నమోదు అవుతుందని చెప్పారు. అనంరతం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం, ఫస్ట్, సెకండ్ క్లాస్ తదితర వివరాలు అందులో కనిపిస్తాయని, ఆ ప్రకారం నమోదు చేయడం పూర్తయితే మనం టికెటు పొందినట్లు మెసేజ్ వస్తుందన్నారు. దానిమేరకు మన ప్రయాణాన్ని కొనసాగించవచ్చని ఆయన వివరించారు. జీరో బ్యాలన్స్తో మన పేరు రిజస్టర్ అయినప్పటికీ టికెటు పొందాలంటే అందులో రూ.100 బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఈ బ్యాలెన్స్‌ను భర్తీ చేసుకునేందుకు ప్రస్తుతం దాదర్‌లో మాత్రమే సౌకర్యం కల్పించినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ముంబై జిల్లా ఇన్చార్జి మంత్రి సుభాష్ దేశాయ్, మేయర్ స్నేహల్ అంబేకర్, ఎంపీలు రాహుల్ శేవాలే, అనిల్ దేశాయ్, సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ హేమంత్‌కుమార్, పశ్చిమ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్.కె.టండన్, రైల్వే బోర్డు సభ్యుడు సంజయ్ దాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెన్నెస్ నుంచి తగ్గని వలసలు
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) పార్టీ నుంచి వలసల పరంపర కొనసాగతూనే ఉంది. ఈ పార్టీకి అనుబంధంగా ఉన్న ముంబై వర్సిటీలోని విద్యార్థి సేనలో అసంతృప్తులు ఎక్కువయ్యారు. అంతర్గత కలహాలు, లుకలుకలు మొదలయ్యాయి. దీంతో విద్యార్థి సేనలో చీలికలు, పార్టీ ఫిరాయింపులు ఖాయమని స్పష్టమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఎమ్మెన్నెస్‌లో ఫిరాయింపులు మొదలయ్యాయి. వాటిని నివారించేందుకు పార్టీ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టినా కొన్ని రోజుల తర్వాత దాన్ని నిలిపివేశారు. కాగా, ఇప్పటికే చాలామంది మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు పార్టీని విడిచిపెట్టారు. త్వరలో మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. తాజాగా ముంబై వర్సిటీకి చెందిన విద్యార్థి సేన నాయకులు సైతం వలస బాట పట్టినట్లు తెలుస్తోంది. తమను విశ్వాసంలోకి తీసుకోకుండానే రాజ్ ఠాక్రే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని విద్యార్థి సేన నాయకులు అంటున్నారు. యూనివర్సిటికీ కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అందుకు చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రత్యర్థులను ఓడించేందుకు ఎత్తుగడలు, వ్యూహాత్మకంగా పావులు కదడం లాంటి విషయాలపై రాజ్ ఠాక్రే ఒంటెద్దు పోకడలకు పోతున్నారని, ఏ విషయంలోనూ తమను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. కాగా, ఇలా అన్ని విభాగాలకు చెందిన నాయకులు, కార్యకర్తలూ విడిచిపెట్టి పోతుంటే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయే అవకాశముందని పార్టీ సీనియర్ నాయకులు ఆవేదన చెందుతున్నారు. -
బీజేపీలో చేరనున్న ఎమ్మెన్నెస్ నాయకులు?
సాక్షి, ముంబై: ఎమ్మెన్నెస్‌కు చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలతోపాటు మరికొందరు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు. కొత్త ఏడాది ఆరంభంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడి సమక్షంలో వీరంతా కమలం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. వీరి చేరికకు మార్గం సుగమమైందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా పరాజయాన్ని ఎమ్మెన్నెస్ జీర్ణించుకోలేకపోతోంది. దీనికితోడు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి బయటపడుతున్నారు. శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత ఓటమిపాలైన కొందరు అభ్యర్థులు... ఆ పార్టీ సీనియర్ నాయకులుగా వెలుగొందుతున్న అవినాశ్ అభ్యంకర్, బాలానాంద్గావ్కర్లపై రాజ్‌ఠాక్రేకు ఫిర్యాదు చేశారు. ఓటమికిగల కారణాలను ఆయనకు విశ్లేషించారు. అయినప్పటికీ రాజ్ ఠాక్రే ఇంతవరకు వారిపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో ప్రవీణ్ దరేకర్తోపాటు వసంత్ గీతే తదితరులు పార్టీకి రాజీనామా చేశారు. -
గుజరాత్‌కు ‘పశ్చిమ రైల్వే’ తరలింపు!
సాక్షి, ముంబై: నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన పశ్చిమ రైల్వే ప్రధాన కార్యాలయాన్ని గుజరాత్‌కు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైల్వే పరిపాలన విభాగం చేస్తున్న ఈ ప్రయత్నాలను మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్)తోపాటు శివసేన కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాల్ఘర్లోని సముద్ర తీర ప్రాంత భద్రత ప్రధాన కార్యాలయం, రిజర్వు బ్యాంక్‌లోని కొన్ని కీలక శాఖలను ఇదివరకే గుజరాత్‌కు తరలించారు. నారిమన్ పాయింట్లో ఉన్న ఎయిర్ ఇండియా ప్రధాన కార్యాలయాన్ని కూడా త్వరలో మార్చివేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వీటితోపాటు డైమండ్ మార్కెట్‌ను, మరికొన్ని కీలక వ్యాపార, వాణిజ్య సంస్థలను గుజరాత్‌కు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా, మహారాష్ట్రను బలహీనపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని శివసేన ఎంపీ సంజయ్ రావుత్ ఆరోపించారు. దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబైనుంచి పలు ప్రధాన కార్యాలయాలను వేరే ప్రాంతాలకు తరలించడంపై సమాధానం చెప్పాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్‌చేశారు. అలాగే ముంబై నుంచి పలు కార్యాలయాల తరలింపును వెంటనే నిలిపివేయాలని కేంద్రానికి లేఖ రాయాలని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఒక పక్క రాష్ట్రంలో ఉన్న మైనారిటీ బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు శివసేనతో పొత్తు అనివార్యమైన పరిస్థితిలో, కేంద్రంలో మోదీ సర్కార్ పనితీరుపై శివసేన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ముంబైలోని పశ్చిమ రైల్వే ప్రధాన కార్యాలయాన్ని గుజరాత్‌కు తరలించాలని పార్లమెంట్లో రెండు రోజుల కిందట బీజేపీకి చెందిన అహ్మదాబాద్ (పశ్చిమ) ఎంపీ కిరీట్ సోలంకి డిమాండ్ చేశారు. అహ్మదాబాద్ నగరం పశ్చిమ రైల్వే పరిధిలో నడి బొడ్డున ఉంది. దీంతో ముంబైలో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని గుజరాత్‌కు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. సోలంకి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం లేపాయి. ప్రయాణికుల సంఘటన్లు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే అనేక కీలక కార్యాలయాలు గుజరాత్‌కు తరలించారని, దీనిపై తన వైఖరి ఏంటో స్పష్టం చేయాలని ఫడ్నవిస్‌ను రావుత్ నిలదీశారు. ఇదిలాఉండగా గత అనేక సంవత్సరాల నుంచి పశ్చిమ రైల్వే ప్రధాన కార్యాలయం ముంబైలోనే ఉంది. అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండగా గుజరాత్‌కు తరలించడంలో ఆంతర్యమేమిటని కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్ ప్రశ్నించారు. ఒకవేళ కార్యాలయాన్ని ముంబై నుంచి గుజరాత్‌కు తరలిస్తే ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. -
ప్రజల మనసులు గెలుచుకోండి..
సాక్షి, ముంబై: మనసులు గెలుచుకోండి .. ఓట్లు అవే పడతాయని (మన్ జింకా, మత్ అపోఆప్ పడ్తీల్) మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. ఎన్నికల ఘోరపరాజయం అనంతరం రాజ్ ఠాక్రే పుణేలో పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా పదాధికారులు, కార్యకర్తలతో శనివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ ప్రణాళికలతోపాటు పదాధికారులు, కార్యకర్తలు ఎవరు ఎలా వ్యవహరించాలనే విషయంపై మాట్లాడారు. ముఖ్యంగా ఓట్లను దృష్టిలో ఉంచుకుని ప్రజల వద్దకి వెళ్లవద్దని, ముందు ప్రజల మనసులు గెల్చుకున్నట్టయితే, ఓట్లు అవే వస్తాయని హితబోధ చేశారు. పార్టీ కార్యకర్త, పదాధికారిగా కాకుండా ఓ మంచి పౌరునిగా ఆలోచించాలని, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలని సూచించారు. పార్టీ నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు... పార్టీ నియమాలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. అనేక మంది తమ పనులను వదిలి ఇతరుల పనుల్లో జోక్యం చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. ముఖ్యంగా శాఖాధ్యక్షుడు, పట్టణాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఇలా పదవుల బట్టి ఎవరు ఏం చేయాలనేది ముందే పార్టీ సూచిస్తుంది.. వారి పరిధిని పాటిస్తూ ముందుకు పోతే సరిపోతుంది.. తప్పితే ఎవరైనా తమ పరిధిలోకి రాని విషయాల్లో జోక్యం చేసుకుంటూ పార్టీ నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. జన్మదిన శుభాకాంక్షల హోర్డింగులు వద్దు.. ఇకపై పార్టీ పదాధికారులు, నాయకులు, కార్యకర్తల జన్మదిన శుభాకాంక్షల హోర్డింగులు ఏర్పాటు చేయవద్దని రాజ్ ఠాక్రే ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడైన ఎమ్మెన్నెస్ పదాధికారుల జన్మదినోత్సవాల హోర్డింగ్‌లు కన్పిస్తే.. ఆ మరుసటి రోజే ఆ పదవిలో ఆ పదాధికారి ఉండరన్నారు. ‘ఇలా ఆర్భాటంగా మన పుట్టినరోజు హోర్డింగులు ఏర్పాటుచేసుకునే బదులు స్థానికంగా ఎవరైనా పుట్టినరోజు పండుగ జరుకుకుంటుంటే వారి వద్దకు వెళ్లి పార్టీ తరఫున ఒక బొకే ఇచ్చి శుభాకాంక్షలు చెప్పిచూడండి.. మీపై ఆ కుటుంబానికి ఎంత అభిమానం పెంచుతుంది..’ అని సూచించారు. అలాగే పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ఆల్ దిబెస్ట్ చెప్పండి. ఇలాంటివి చేసేసమయంలో పార్టీ జెండాలు, బ్యానర్లు ఉపయోగించవద్దు.. షర్ట్‌కు పార్టీ చిహ్నం, పార్టీ పేరు స్ట్రిక్కర్ తగిలించుకుంటే సరిపోతుందని తెలిపారు. ఇకపై నాకు నేరుగా ఈ-మెయిల్ చేయండి.. మహారాష్ట్రలోని పార్టీ కార్యకర్తలను అందరితో మాట్లాడేందుకు సాధ్యంకాదు. కాని రాష్ట్రంతోపాటు తమతమ ప్రాంతాల్లోని సమస్యలు, వాటికి ఏవైనా పరిష్కారాలుంటే ఎలా చేయవచ్చనే సూచనలు తదితరాన్ని నాకు నేరుగా పంపించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం తాను ఛిౌ్ఛఛ్ట్ట్చ్జ్టిజ్చిఛిజ్ఛుట్చడఃజఝ్చజీ.ఛిౌఝ అనే ఈ-మెయిల్ అకౌంట్‌ను కొత్తగా ప్రారంభించినట్టు చెప్పారు. దీనిపై ఎవరైనా సరే కొత్త ఆలోచనలు, సలహాలు, సూచనలు అన్ని పంపవచ్చన్నారు. పార్టీకి, ప్రజలకు మేలుచేసే సూచనలను తప్పకుండా స్వీకరించి అమలుచేసేందుకు ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా ఆయన హామి ఇచ్చారు. తొందర్లోనే ప్రక్షాళన... పుణే లో తొందర్లోనే పార్టీని ప్రక్షాళన చేయనున్నట్లు రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. పార్టీ నియమాలను ఉల్లంఘించిన కొందరిపై వేటువేయనున్నట్లు తెలిపారు. తొందర్లోనే పార్టీ పదాధికారుల కొత్త జాబితాను ప్రకటిస్తామని, అదేవిధంగా జాబితాతోపాటు ఎవరు ఏం చేయాలనే వారి వారి ప్రొటోకాల్స్‌ను కూడా వారికి తెలుపనున్నట్టు చెప్పారు. అప్పటివరకు ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలని రాజ్ ఠాక్రే వారికి సూచించారు. -
‘తేడా’ చూపిస్తే అనుమతి కట్..
శాకాహారులకే ఫ్లాట్లు అమ్ముతామనే బిల్లర్డపై ఎమ్మెన్నెస్ ఆగ్రహం సాక్షి, ముంబై: కేవలం శాకాహారులకే ఫ్లాట్లు విక్రయిస్తామని పెత్తనం చలాయించే బిల్డర్ల ఆగడాలకు ముకుతాడు వేయాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) డిమాండ్ చేసింది. మాంసాహారులకు ఫ్లాట్లు విక్రయింంచేందుకు నిరాకరించే బిల్డర్లు కొత్తగా నిర్మించే భవనాలకు అనుమతి ఇవ్వకూడదని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) సభాగృహంలో జరిగిన సమావేశంలో ఎమ్మెన్నెస్ కార్పొరేటర్లు ప్రతిపాదించారు. దీంతో శాకాహారులకు ప్రాధాన్యత ఇచ్చే బిల్డర్ల గుండెల్లో దడ మొదలైంది. నగరంలో గత కొంతకాలంగా శాకాహారులకే ఫ్లాట్లు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా గుజరాతీ, మార్వాడి తదితర కులాల ప్రజలుంటున్న సొసైటీలలో, బహుళ అంతస్తుల భవనాల్లో మాంసాహారులకు చోటు దొరకడం లేదు. అందులో ఫ్లాటు అద్దెకు ఇవ్వాలన్నా, విక్రయించాలన్నా శాకాహారులకే ఇస్తున్నారు. ఇలా కొన్ని ప్రత్యేక కులాలు బృందాలుగా ఏర్పడి కొత్తగా నిర్మించే భవనాల్లో ఫ్లాట్లు బుకింగ్ చేసుకుంటారు. ఇందులో మాంసాహారులకు అవకాశమివ్వరు. వారు విధించే షరతులకు బిల్డర్లు కూడా తలొగ్గి మాంసాహారులకు ఫ్లాట్లు విక్రయించడం లేదు. దీంతో కుల, మత, భాషలతోపాటు భోజనం అలవాట్లపై ఆరాతీసి బిల్డర్లు ఇల్లు, ఫ్లాట్లు విక్రయిస్తున్నారు. దీని కారణంగా మాంసాహారులు ఫ్లాట్లు కొనుగోలు చేసుకోలేకపోతున్నారు. ఇలాంటి బిల్డర్లపై ఫిర్యాదులు నమోదుచేసినప్పటికీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇలా కుల, మతాలను విభజించే బిల్డర్లకు నూతన భవనాల అనుమతి ఇవ్వకూడదని ఎమ్మెన్నెస్‌కు చెందిన గట్ నాయకుడు సందీప్ దేశ్‌పాండే ప్రతిపాధించారు. దేశ్‌పాండే చేసిన ప్రతిపాదన ఈ నెలాఖరులో జరిగే స్థాయీ సమితి సమావేశంలో చర్చకు రానుంది. ఒకవేళ సమావేశంలో ఈ ప్రతిపాదనకు మంజూరు లభిస్తే అభిప్రాయ సేకరణ జరగనుంది. ఆ తర్వాత బీఎంసీ పరిపాలన విభాగం తుది నిర్ణయం తీసుకుంటుంది. కొత్త భవనాలకు అనుమతి ఇచ్చేముందు అన్ని వర్గాల ప్రజలకు ఇళ్లు, ఫ్లాట్లు విక్రయించాలని బిల్డర్లకు షరతులు విధిస్తారు. భవన నిర్మాణ పనులు ప్రారంభించాలంటే బీఎంసీ నుంచి ‘ఐఓడీ’ జారీ అవుతుంది. ఈ ఐఓడీలో కొత్త నియమాలు పొందుపరిస్తే బిల్డర్ నుంచి అఫిడవిట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సదరు బిల్డరు కొనుగోలుదారులకు ఫ్లాట్లు విక్రయించేందుకు నిరాకరిస్తే నియమ, నిబంధనల ప్రకారం అతడిపై చర్యలు తీసుకునేందుకు అవకాశముంటుంది. -
పరాజయం వెనుక కుట్ర
సాక్షి, ముంబై: ఇటీవల రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) ఘోర పరాజయం వెనక పెద్ద కుట్ర జరిగిందని ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఆరోపించారు. ఓటమికి గల కారణాలపై విశ్లేషణ పనులు దాదాపు పూర్తికావచ్చయని త్వరలో పూర్తి వివరాలు బయటపెడతానని రాజ్ అన్నారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మొదటిరోజు శనివారం అహ్మద్‌నగర్ జిల్లా పాతర్థి తాలూకాలో పర్యటించిన విషయం తెలిసిందే. అనంతరం షిర్డీ సమీపంలో పర్యటించిన తర్వాత విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ ఓటమికి గల కారణాలు అంతర్గత విబేధాలు కావచ్చని తొలుత భావించామని అన్నారు. కాని ఓటమికి- పదాధికారులు, కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదని విశ్లేషణలో తేలిందన్నారు. దీని వెనక కుట్ర జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి ఆదాయం రాకుండా తాము అడ్డుకుంటున్నామని కొన్ని పార్టీలు చేసిన దుష్ర్పచారం చేయడం వల్ల తమ పార్టీ చాలా నష్టపోయిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాలను మూసివేయాలని తామెన్నడూ డిమాండ్ చేయలేదన్నారు. ‘రాష్ట్రంలో అనేక రహదారులు బీఓటీ పద్ధతిలో నిర్మించారు.. అందుకు వెచ్చించిన వ్యయాన్ని వాహనదారుల నుంచి వసూలు చేసేందుకు టోల్ ప్లాజాలు ఏర్పాటు చేశారని మాకు తెలుసు.. ఒప్పందం ప్రకారం వెచ్చించిన డబ్బులు వసూలైన టోల్‌ప్లాజాలను మాత్రమే ఎత్తివేయాలని మేం డిమాండ్ చేశామ’ని ఆయన అన్నారు. ‘ప్రతీరోజు ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి..? వాటి ద్వారా కాంట్రాక్టర్‌కు ఎంత మేర ఆదాయం వస్తుంది..తదితరవివరాలు ఎవరి వద్దా లే వు. ప్రభుత్వం వద్ద కూడా వాటికి సంబంధించిన వివరాలు, ఆధారాలు లేవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని క్యాష్ లెస్ వ్యవహారాన్ని చేపట్టాల’ని తాముడిమాండ్ చేశామన్నారు. ఈ పద్ధతి ద్వారా రహదారులపై నిత్యం ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి... వాటి ద్వారా ఎంత మేర డబ్బులు వసూలవుతున్నాయి...అవకతవకలేమైనా జరుగుతున్నాయా... ఇలా అనేక వివరాలు బయటపడతాయని ఆయన వివరించారు. దీన్ని బట్టి సంబంధిత కాంట్రాక్టర్‌కు గడువు పెంచివ్వాలా..? వద్దా అనేది నిర్ణయించేందుకు వీలుపడుతుందని తాము భావించామని చెప్పారు. ఎన్నికలకు ముందు తమ పార్టీ చేపట్టిన ఆందోళనల వల్ల అనేక టోల్ ప్లాజాలను ప్రభుత్వం మూసివేసిందని గుర్తుచేశారు. కొందరు నాయకులు ఈ ఆందోళనను అడ్డుపెట్టుకుని ప్రజలకు తప్పుడు సమాచారం చేరవేశారని ఆరోపించారు. ఆదాయం లేనిదే అభివృద్ధి పనులు జరగవని, దీన్ని ఎమ్మెన్నెస్ అడ్డుకుంటోందని కొన్ని పార్టీలు పనిగట్టుకుని ప్రచారం చేశాయని, దీని వల్ల తమ పార్టీ ఘోర పరాజయం పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. -
పార్టీ ప్రక్షాళన దిశగా రాజ్‌ఠాక్రే
ఎన్నికల ఫలితాల ప్రభావం సాక్షి, ముంబై: లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే పార్టీలో భారీగా మార్పులుచేర్పులు చేపట్టాలని యోచిస్తున్నారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అంతర్గత విభేదాలే పరాజయానికి ప్రధాన కారణమంటూ రాజ్‌కు అనేక ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో భారీ మార్పులుచేర్పులు చేపట్టి త్వరలో జరగనున్న మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ఎన్నికలకు పార్టీని బలోపేతం చే యాలని రాజ్ యోచిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పరాజయంతో నిరుత్సాహానికి గురైన కార్యకర్తల్లో ఉత్తేజం కలిగించేందుకు తాను కూడా పోటీ చేస్తానంటూ శాసన సభ ఎన్నికలకు ముందు ప్రకటించారు. దీంతో కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేసింది. అయితే రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఠాక్రే కుటుంబీకులెవరూ ఎన్నికల బరిలో దిగలేదని, అందువల్ల తాను కూడా పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానంటూ ప్రకటించారు. దీంతో కార్యకర్తలు మళ్లీ నిరుత్సాహానికి గురయ్యారు. అయితే అప్పటికే పార్టీలో అంతర్గత కలహాలు అప్పటికే హద్దులు దాటాయి. ఈ నేనపథ్యంలో పార్టీలో పనిచేయాలా? లేక అంతర్గత వివాదాలను పరిష్కరించుకోవాలా? అనే విషయంలో కొందరు నాయకులు ఎటూ తేల్చుకోలేకపోయారు. మరోవైపు దాదర్ ప్రాంతంలో ఎమ్మెన్నెస్‌కు ఆరుగురు కార్పొరేటర్లు ఉన్నప్పటికీ శాసనసభ ఎన్నికల బరిలోకి దిగిన ఆ పార్టీ అభ్యర్థి పరాజయం పాలయ్యాడు. దీంతో ఆ పార్టీలో అంతర్గత వివాదాలు ఏ స్థాయిలో ఉన్నాయనే విషయం తేటతెల్లమైంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని వచ్చే బీఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా అత్యధిక శాతం మంది అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని రాజ్ యోచిస్తున్నారు. ఇందులోభాగంగా పార్టీలో భారీగా మార్పులుచేర్పులు చేయాలనే సంకల్పంతో ఉన్నారు. -
ఎమ్మెన్నెస్ గుర్తింపు రద్దయ్యేనా?
సాక్షి, ముంబై: అటు లోక్‌సభ, ఇటు శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఆ పార్టీ గుర్తింపు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క అభ్యర్థిని కూడా ఆ పార్టీ గెలిపించుకోలేక పోయింది. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేవలం ఒక్క అభ్యర్థే విజయం సాధించాడు. దీంతో ఆ పార్టీని ఓటర్లు పూర్తిగా తిరస్కరించారనే విషయం స్పష్టమైంది. ఇప్పటికే పరాజయంతో కుమిలిపోతున్న ఆ పార్టీ నాయకులకు ఎన్నికల కమిషన్ జారీచేసిన పార్టీ గుర్తింపు (ఇంజన్) రద్దయ్యే ప్రమాదంకూడా ఉంది. శాసనసభ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయానికి ప్రతిఫలంగా ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే భారీ మూల్యం చెల్లించుకోకతప్పేలా లేదు. పార్టీ ఆవిర్భావం తర్వాత 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 13 సీట్లు వచ్చాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కొత్త పార్టీకి నిర్దేశించినరీతిలో ఓట్లు రావాలి. కనీసం ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆరు శాతం ఓట్లు కచ్చితంగా రావాలి. అయితే మొన్న జరిగిన లోక్‌సభ, తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో అది సాధ్యం కాలేదు. దీంతో ఎన్నికల కమిషన్ ఆ పార్టీ గుర్తును రద్దు చేసే అవకాశముంది. 2009లో జరిగిన ఎన్నికల్లో 13 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో ప్రాంతీయ పార్టీగా ఎమ్మెన్నెస్‌కు గుర్తింపు లభించింది. రైల్వే ఇంజన్ గుర్తు అధికారికంగా లభించింది. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితం కావడంతో ఆ ఇంజన్ గుర్తును తిరిగి తీసుకునే అవకాశాలున్నాయి. -
ఎమ్మెన్నెస్.. నా‘రాజ్’..!
219 స్థానాల్లో పోటీ..ఒక సీటుతో సరి రాజ్‌ను నమ్మని ప్రజలు పట్టున్న జిల్లాల్లోనూ ఘోర పరాజయం సాక్షి, ముంబై : మహారాష్ర్ట నవనిర్మాణ్ సేనా (ఎమ్మెన్నెస్)ను మహారాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. ‘నా చేతికి అధికారమివ్వండి... అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తా.. ఒకవేళ నేను పనిచేయకుంటే రాజకీయ దుకాణాన్ని మూసివేస్తాన’ని ప్రకటించడమే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు మార్చివేస్తానంటూ ప్రచారంలో హోరెత్తించిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనా (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే పూర్తిగా చతకిలపడిపోయారు. గత శాసనసభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి పార్టీ ప్రతిష్ట మరింత దిగజారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 219 నియోజకవర్గాలలో తమ పార్టీ అభ్యర్థులను బరిలో దింపారు. ఇందులో కేవలం ఒకే ఒక అభ్యర్థి గెలవడం గమనార్హం. శివసేన నుంచి బయటపడిన రాజ్ ఠాక్రే 2006లో ఎమ్మెన్నెస్ స్థాపించారు. ఆ తర్వాత 2009లో మొదటిసారి ఎన్నికల బరిలో దిగిన ఎమ్మెన్నెస్ 143 చోట్ల తమ అభ్యర్థులను బరిలో దింపి 13 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని తమ సత్తా ఏంటో నిరూపించుకుంది. 50 పైగా స్థానాల్లో ఎమ్మెన్నెస్ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. అప్పట్లో రాజ్‌ను అన్ని పార్టీలు ప్రశంసించాయి. కాని ఈసారి 219 స్థానాల్లో పోటీచేసి కేవలం ఒకే సీటుతో సరిపెట్టుకోవల్సిన దుస్థితి వచ్చింది. ప్రచార సభల్లో రాజ్ చేసిన హామీలను బట్టి గత ఎన్నికలతో పోలీస్తే ఈసారి కనీసం 20-25 స్థానాలు వస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనవేశారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ సర్వేలో బీజేపీకీ 120-125 సీట్లు వస్తాయని వెల్లడించింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటులో ఎమ్మెన్నెస్ కీలకపాత్ర పోషిస్తుండవచ్చని భావించారు. కాని తాజా పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. నగర రాజకీయాల్లో దిగ్గజాలుగా పేరుపొందిన ప్రవీణ్ దరేకర్, నితిన్ సర్దేశాయి, బాలా నాంద్‌గావ్కర్, శిశిర్ షిండే, మంగేశ్ సాంగ్లే లాంటి ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యేలను శివసేన అభ్యర్థులు మట్టికరిపించారు. ఎమ్మెన్నెస్‌కు మంచి పట్టున్న నాసిక్‌లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇక్కడ కార్పొరేషన్లో ఎమ్మెన్నెస్ అధికారంలో ఉంది. అయినప్పటికీ 15 స్థానాల్లో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయారు. అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెన్నెస్ అభ్యర్థుల డిపాజిట్ కూడా గల్లంతయ్యాయి. గత ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ ముంబైలో ఐదుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. అదేవిధంగా బీఎంసీ ఎన్నికల్లో ఐదుగురిని బరిలో దింపినప్పటికీ ఒక్కరు కూడా గెలవలేకపోయారు. -
బీజేపీ హీరో.. ఎంఎన్ఎస్ జీరో!!
ముంబై మహానగరంలో ఒకప్పుడు మహారాష్ట్ర నవనిర్మాణ సమితి అంటే.. బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉండేది. రాజ్ ఠాక్రే స్థాపించిన ఈ పార్టీ.. ముంబై నగరం మరాఠీలకే సొంతం కావాలన్న నినాదంతో ప్రజల్లో వీరాభిమానాన్ని సంపాదించుకున్న ఎంఎన్ఎస్.. తాజాగా ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో.. ముంఖ్యంగా ముంబై మహానగరంలో పూర్తిగా చతికిలబడిపోయింది. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో అత్యధికంగా 15 సీట్లను బీజేపీ గెలుచుకుంది. 14 సీట్లతో శివసేన రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ మాత్రం ఈ రెండింటికీ చాలా దూరంగా 5 సీట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. చివరకు హైదరాబాదీ పార్టీగా పేరొందిన మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ (ఎంఐఎం) కూడా అక్కడ బోణీ కొట్టింది గానీ, ఎంఎన్ఎస్ మాత్రం ఒక్క స్థానం కూడా సంపాదించలేకపోయింది. ఎంఎన్ఎస్ ఒక్కసారిగా ఇలా చతికిలబడుతుందని వాస్తవానికి ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఒకరకంగా చెప్పాలంటే ముంబై రాజకీయ చిత్రపటం నుంచి అది పూర్తిగా మాయమైపోయింది. ఒకప్పుడు సేవ్రి, మాహిమ్, మగాథానె లాంటి ప్రాంతాలన్నీ ఎంఎన్ఎస్ కంచుకోటలు. కానీ, వాటిలో ఎక్కడా గెలవలేదు. అలాగే బాలా నందగావ్కర్, నితిన్ సర్దేశాయ్, ప్రవీణ్ దారేకర్ లాంటి మహాయోధులు కూడా మట్టికరిచారు. పైగా కేవలం ఓడిపోవడమే కాదు.. వాళ్ల మెజారిటీలలో తేడాలు కూడా చాలా ఎక్కువ. ఉదాహరణకు నందగావ్కర్ అయితే తన ప్రత్యర్థి, శివసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లలో సగం కూడా సంపాదించలేకపోయారు. ఒకప్పుడు ఆయన బ్రహ్మాండమైన నాయకుడు. కానీ ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితులలో ఆయన పరిస్థితి దారుణంగా మారింది. అలాగే ప్రవీణ్ దారేకర్ అయితే ఏకంగా మూడోస్థానానికి పడిపోయారు. ఒక్క మాహిమ్ నియోజకవర్గంలో మాత్రం అక్కడి సిటింగ్ ఎమ్మెల్యే సర్దేశాయ్ కాస్త గట్టి పోరాటం చేశారు. ఆయన కేవలం 6వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ ఇక్కడి ఓటమి ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రేకు చాలా ఇబ్బందికరమైనది. ఎందుకంటే.. మాహిమ్ స్థానం ఆ పార్టీకి చాలా ముఖ్యం. శివాజీ పార్కు లాంటి కీలక ప్రాంతాలన్నీ ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. బాలఠాక్రే కూడా ఇక్కడినుంచే తన ఉత్తేజపూరితమైన ప్రసంగాలు ఇచ్చేవారు. ఆయన మాటలు వింటేనే మరాఠీల రోమాలు నిక్కబొడుచుకునేవి. అలాంటి స్థానాన్ని కూడా పోగొట్టుకున్న ఎంఎన్ఎస్.. ఇక రాబోయే ఎన్నికల నాటికి ఏమవుతుందోనని అంతా చూస్తున్నారు. -
మహారాష్ట్ర అసెంబ్లీలో పార్టీల బలాబలాలు
ముంబై: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. 288 సీట్లు ఉన్న అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 122 సీట్లు, శివసేన 63, కాంగ్రెస్ 42, ఎన్సీపీ 41, ఎంఐఎం 2. రాష్ట్రీయ సమాజ్ పక్ష 1, బహుజన్ వికాస్ ఆఘాదీ 03, పీజెంట్స్ వర్కర్ పార్టీ 3, ఎంఎన్ఎస్ 1, సీపీఐ 1, ఇతరులు 8 సీట్లను గెలుచుకున్నాయి.