నువ్వూ నేనూ.. భాయీ భాయీ!
ఒకప్పుడు ఆ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే ఎవరూ అంటించాల్సిన అవసరం లేకుండానే భగ్గుమనేది. ఒకరికొకరు ఎదురుపడితే చాలు.. చంపుకోవాలన్నంత కోపం ఇద్దరి మధ్య ఉండేది. అలాంటిది ఉన్నట్టుండి ఇద్దరూ ఆప్త మిత్రులు అయిపోయారు. ఆరోగ్యం ఎలా ఉంది అన్నా అంటూ తమ్ముడు పలకరించాడు. నీలాంటి తమ్ముడు ఉండగా నాకు ఢోకా ఏముంది అంటూ అన్న సంతోషించాడు. ఇప్పుడు ఇద్దరూ ఒకటైపోయే లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. అవును.. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటివరకు వేరుకుంపట్లు పెట్టుకుని కూర్చున్న రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే ఇప్పుడు ఒకటే గూటికి చేరారు. బీజేపీ - శివసేన పార్టీల మధ్య పొత్తు చెడిపోవడంతో మహారాష్ట్ర నవనిర్మాణ సేన పేరిట ఇప్పటికే వేరుకుంపటి పెట్టుకున్న రాజ్ ఠాక్రే.. తనకు వరుసకు అన్నయ్య అయ్యే ఉద్ధవ్ ఠాక్రేకు చాలా రోజుల తర్వాత దగ్గర అయ్యారు.
2012లో బాలాసాహెబ్ ఠాక్రే మరణించినప్పుడు మాత్రమే ఒకేచోట కనిపించిన ఈ ఇద్దరు సోదరులు మళ్లీ ఇన్నాళ్లకు కలిశారు. అన్నదమ్ములిద్దరి మధ్య వారంలో రెండుసార్లు ఎస్ఎంఎస్లు షేర్ అయ్యాయట. ఎటూ కాంగ్రెస్-ఎన్సీపీల మధ్య కూడా పొత్తు లేదు కాబట్టి, మహారాష్ట్రలో బాల్ ఠాక్రేకు ఉన్న పేరు ప్రఖ్యాతులను క్యాష్ చేసుకోడానికి ఇద్దరూ చేతులు కలపాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అయితే.. మహారాష్ట్ర కేవలం మరాఠీలదేనంటూ అక్కడున్న బీహారీలు, ఇతర ఉత్తర భారతీయులను తరిమి కొట్టడానికి కూడా ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఒకప్పుడు గట్టిగానే ప్రయత్నాలు చేశారు. వాస్తవానికి మహారాష్ట్రలో.. అందునా ముంబైలో అన్ని ప్రాంతాల వాళ్లు ఉంటారు. కేవలం మరాఠీలను మాత్రమే నమ్ముకున్నా.. వాళ్ల ఓట్లన్నీ గంపగుత్తగా శివసేన-ఎంఎన్ఎస్లకు పడతాయన్న నమ్మకం కూడా లేదు. ఇలాంటి తరుణంలో అన్నదమ్ములు చేతులు కలిపినా ఏమాత్రం ప్రయోజనం ఉంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.