ఇంతకంటే ఏం చేయాలి?
శివసేనతో జతకట్టడంపై రాజ్‌ఠాక్రే
సాక్షి, ముంబై: బీజేపీతో పొత్తు విచ్ఛిన్నమైన తర్వాత తాను శివసేనతో జత కట్టేందుకు శాయశక్తులా కృషి చేశానని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే వెల్లడించారు. ఓ మీడియా చానల్‌కు గురువారం ఇచ్చిన ముఖాముఖి కార్యక్రమంలో రాజ్ మాట్లాడుతూ..... ఇరు పార్టీలు విడిపోగానే పొత్తుకు సంబంధించిన చర్చలు జరిపామన్నారు. చర్చలు పూర్తవుతాయనే ఆశతో నామినేషన్ పత్రాల పంపిణీని కూడా కొద్ది గంటలపాటు నిలిపివేయాల్సి వచ్చిందని, ముందు చర్చలకు ముందుకొచ్చి, ఆ తర్వాత ఉద్ధవ్ స్పందించక పోవడంతో శివసేన-ఎమ్మెన్నెస్ ఏకం కావడం సాధ్యం కాలేదన్నారు.
దీంతో పరిస్థితులన్నీ తారుమారయ్యాయని రాజ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అవసరమైతే తామిద్దరం కలిసి పని చేస్తామని బుధవారం రాజ్ సంచలనాత్మక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని రాజ్ మరోసారి బహిరంగంగా ప్రకటించారు. శివసేనతో పొత్తు గురించి ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
వివరాలు ఆయన మాటల్లోనే...
‘మహాకూటమి విచ్ఛిన్నమైన తరువాత సామ్నా దినపత్రిక డిస్ట్రిబ్యూటర్ బాజీరావ్ దాంగట్ నా ఇంటికి వచ్చారు. మీరిద్దరు ఒకటి కావాలి.... తాను ఉద్ధవ్‌తో మాట్లాడతానన్నారు. అందుకు నేను సరేనన్నాను. అదేరోజు రాత్రి దాంగట్ ఫోన్ నుంచి ఉద్ధవ్ ఫోన్ చేశారు. కుశల ప్రశ్నలు అడిగాకా.. ఉద్ధవ్ స్వయంగా బీజేపీ అంశాన్ని లేవనెత్తారు. మోసం జరిగిపోయిందన్నారు. బయటున్న నాకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి.... వారితో కలిసి ఉండి కూడా నీకెలా తెలియలేదని ప్రశ్నించాను. జరిగిందేదో జరిగిపోయిందని.. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావని అడిగాను. అందుకు ఉద్ధవ్ నా ముందు మూడు ప్రత్యామ్నాయ మార్గాలు ఉంచారు.
ఒకటి మనిద్దరి మధ్య చర్చలు జరిగాలి.... రెండోది ఎన్నికల సమయంలో ఒకరిపై మరొకరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం మానుకోవాలి. మూడోది ఎన్నికల తరువాత ఏం నిర్ణయం తీసుకోవాలనే విషయమై నిర్ణయానికి రావాలని చెప్పారు. నామినేషన్లు దాఖలు చేయడానికి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. మొదటి ప్రత్యామ్నాయ మార్గంపై చర్చలు జరిపేందుకు నేను వెంటనే బాలానందగావ్కర్, నితిన్ సర్‌దేశాయ్ పేర్లు సూచించాను. అలాగే ఉద్ధవ్ కూడా అనిల్ దేశాయ్, మరొకరి పేరు సూచించారు. అనిల్ దేశాయ్ బాలా నందగావ్కర్‌కు ఫోన్ చేస్తారని ఉద్ధవ్ చెప్పారు. అయితే ఎంతకీ ఫోన్ రాకపోవడంతో బాలా ఫోన్ చేయగా అనిల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. కొద్ది సేపు ప్రయత్నించగా చివరకు అనిల్ ఫోన్ రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు తాను నామినేషన్ వేయడానికి వెళ్తున్నానని, మూడు గంటల తరువాత ఫ్రీ అవుతానని చెప్పారు. అందుకు బాలా.. మీ పనులు పూర్తికాగానే మీరే ఫోన్ చేయండని అన్నారు.
దీంతో మేమంతా ఆ ఫోన్ కోసం వేచిచూశాం. అప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మా పార్టీ అభ్యర్థులందరూ ఏ బీ ఫారాల కోసం నా ఇంటి ముందు గుమిగూడారు. చర్చలు జరుగుతాయేమోనని ఆశిస్తూ వాటిని ఎవరికీ అందజేయకుండా అలాగే ఉండిపోయాను. దీనిపై పార్టీ కార్యకర్తలు అనే విధాలుగా చర్చించుకోవడం మొదలుపెట్టారు. సాయంత్రం నాలుగు గంటలైనా అనిల్ దేశాయ్ నుంచి ఫోన్ రాలేదు. చివరకు ఆశ వదులుకున్నాన’ని రాజ్ చెప్పారు. ‘నన్ను ఇరకాటంలో పెట్టి, ఎమ్మెన్నెస్ కార్యకర్తల్లో అనుమానాలు రేకెత్తించాలని శివసేన వ్యూహం పన్నినట్లుగా అర్థం చేసుకున్నాను. ఇంత మోసం చేస్తారనుకోలేదు. ఇంతకంటే ఇంకేం చేయాలి? శివసేన, ఎమ్మెన్నెస్ ఒకతాటిపైకి వచ్చేందుకు అహంకారం అడ్డువస్తోందని కొందరంటున్నారు. నేను ఇలాంటి ఈగోలను పట్టించుకోను.
ఏదైన ఉంటే బహిరంగంగా, స్పష్టంగా చర్చించాలన్నదే నా పాలసీ. ఒకపక్క బీజేపీ వెన్నుపోటు పొడిచింది. అయినా కేంద్రంలో మంత్రి పదవులకు రాజీనామాలు చేయడం లేదు. మహానగర పాలక సంస్థ (బీఎంసీ)లో పొత్తు కొనసాగుతూనే ఉంది. దీని అర్ధమేంటి? ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ ఆఠవలేకు రాష్ట్రంలో ప్రాబల్యం లేదు. రాజకీయాల్లో బలహీన పడిపోయారు. అలాంటి నాయకుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు ఉద్ధవ్ సిద్ధపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంచిపట్టున్న రాజ్‌ఠాక్రేతో చర్చలు జరిపేందుకు ఎందుకు ముందుకు రావడం లేద’ని నిలదీశారు.