సాక్షి, ముంబై: ఇటీవల రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) ఘోర పరాజయం వెనక పెద్ద కుట్ర జరిగిందని ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఆరోపించారు. ఓటమికి గల కారణాలపై విశ్లేషణ పనులు దాదాపు పూర్తికావచ్చయని త్వరలో పూర్తి వివరాలు బయటపెడతానని రాజ్ అన్నారు.
ప్రస్తుతం ఆయన రాష్ట్ర పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మొదటిరోజు శనివారం అహ్మద్‌నగర్ జిల్లా పాతర్థి తాలూకాలో పర్యటించిన విషయం తెలిసిందే. అనంతరం షిర్డీ సమీపంలో పర్యటించిన తర్వాత విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ ఓటమికి గల కారణాలు అంతర్గత విబేధాలు కావచ్చని తొలుత భావించామని అన్నారు. కాని ఓటమికి- పదాధికారులు, కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదని విశ్లేషణలో తేలిందన్నారు.
దీని వెనక కుట్ర జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి ఆదాయం రాకుండా తాము అడ్డుకుంటున్నామని కొన్ని పార్టీలు చేసిన దుష్ర్పచారం చేయడం వల్ల తమ పార్టీ చాలా నష్టపోయిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాలను మూసివేయాలని తామెన్నడూ డిమాండ్ చేయలేదన్నారు. ‘రాష్ట్రంలో అనేక రహదారులు బీఓటీ పద్ధతిలో నిర్మించారు.. అందుకు వెచ్చించిన వ్యయాన్ని వాహనదారుల నుంచి వసూలు చేసేందుకు టోల్ ప్లాజాలు ఏర్పాటు చేశారని మాకు తెలుసు.. ఒప్పందం ప్రకారం వెచ్చించిన డబ్బులు వసూలైన టోల్‌ప్లాజాలను మాత్రమే ఎత్తివేయాలని మేం డిమాండ్ చేశామ’ని ఆయన అన్నారు.
‘ప్రతీరోజు ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి..? వాటి ద్వారా కాంట్రాక్టర్‌కు ఎంత మేర ఆదాయం వస్తుంది..తదితరవివరాలు ఎవరి వద్దా లే వు. ప్రభుత్వం వద్ద కూడా వాటికి సంబంధించిన వివరాలు, ఆధారాలు లేవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని క్యాష్ లెస్ వ్యవహారాన్ని చేపట్టాల’ని తాముడిమాండ్ చేశామన్నారు. ఈ పద్ధతి ద్వారా రహదారులపై నిత్యం ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి... వాటి ద్వారా ఎంత మేర డబ్బులు వసూలవుతున్నాయి...అవకతవకలేమైనా జరుగుతున్నాయా... ఇలా అనేక వివరాలు బయటపడతాయని ఆయన వివరించారు.
దీన్ని బట్టి సంబంధిత కాంట్రాక్టర్‌కు గడువు పెంచివ్వాలా..? వద్దా అనేది నిర్ణయించేందుకు వీలుపడుతుందని తాము భావించామని చెప్పారు. ఎన్నికలకు ముందు తమ పార్టీ చేపట్టిన ఆందోళనల వల్ల అనేక టోల్ ప్లాజాలను ప్రభుత్వం మూసివేసిందని గుర్తుచేశారు. కొందరు నాయకులు ఈ ఆందోళనను అడ్డుపెట్టుకుని ప్రజలకు తప్పుడు సమాచారం చేరవేశారని ఆరోపించారు. ఆదాయం లేనిదే అభివృద్ధి పనులు జరగవని, దీన్ని ఎమ్మెన్నెస్ అడ్డుకుంటోందని కొన్ని పార్టీలు పనిగట్టుకుని ప్రచారం చేశాయని, దీని వల్ల తమ పార్టీ ఘోర పరాజయం పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు.
పరాజయం వెనుక కుట్ర
Published Mon, Nov 3 2014 12:07 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement