డీఎఫ్‌లోనూ వేరుకుంపటి
ముంబై: ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఈ ఎన్నికల్లో ఒంటరిగానే తన బలాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది. గత పదిహేనేళ్లుగా మిత్రపక్షమైన కాంగ్రెస్ తమను చిన్న చూపు చూస్తోందని ఆరోపిస్తూ ప్రజాస్వామ్య కూటమికి వీడ్కోలు పలికింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కన్నా రెట్టింపు సీట్లు గెలుచుకున్నామన్న ధీమాతో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ ఒరవడిని కొనసాగించగలమని భావిస్తోంది.
ఈ ఎన్నికల్లో రెండు పార్టీలూ తలా 144 సీట్లలో పోటీ చేయాలని ఎన్సీపీ ప్రతిపాదించింది. దీనికి నిరాకరించిన కాంగ్రెస్ ఎన్సీపీకి 124 సీట్లు మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది. సీట్ల సర్దుబాటుపై గత శనివారం ఎన్సీపీ 24 గంటల గడువు విధించినప్పటికీ కాంగ్రెస్ గురువారం వరకూ స్పందించలేదు. తిరిగి అధికారంలోకి వస్తే రెండున్నర సంవత్సరాల పాటు తమకు ముఖ్యమంత్రి పదివిని ఇవ్వాలన్న ప్రతిపాదనను కూడా కాంగ్రెస్ బేఖాతరు చేసింది. దీనిపై ఎన్సీపీ నాయకుడు ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ, ‘‘గత పదిహేనేళ్లలో ప్రతిసారి కాంగ్రెస్‌కు చెందిన వారే ముఖ్యమంత్రులుగా ఉన్నారు.
ఈసారి శరద్ పవార్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి, ఎన్సీపీ పొత్తును కొనసాగించాలనుకుంటుందని చెప్పారు. అధికారంలో తమకు సమాన భాగస్వామ్యం కావాలని అడిగారు’’ అని చెప్పారు. ఇంతకాలం వారే సీఎం పదవిని అనుభవించారు, ఇప్పుడు పంచుకుంటే తప్పేమిటని పటేల్ ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రజల్లో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకత తమకన్నా కాంగ్రెస్‌పైనే అధికంగా ప్రభావం చూపిందని ఎన్సీపీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ ధోరణి కొనసాగితే తాము మెజారిటీ స్థానాలు సాధించగలమని అంచనా వేస్తోంది. మరోవైపు బీజేపీ, శివసేనల పొత్తు కూడా విచ్ఛిన్నం కావడంతో తమ అవకాశాలు మరింత మెరుగుపడగలవని ఎన్సీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.