సాక్షి, ముంబై: బీజేపీ నాయకుడు నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్య క్షుడు రాజ్ ఠాక్రే గురువారం అమరావతిలో రహస్యంగా సమావేశమయ్యారు. అయితే వీరిద్దరిమధ్య ఏ అంశాలపై చర్చలు జరిగాయనేది గోప్యంగా ఉంచారు. మూడు రోజుల కిందట ముంబైలోని ఠాకూర్ విలేజ్‌లో జరిగిన బహిరంగ సభలో బీజేపీ వైఖరిపై రాజ్ ధ్వజమెత్తారు.
కాని గడ్కరీతో రహస్య భేటీ కావడం అనుమానాలకు తావిస్తోంది. శివసేన, బీజీపీకి చెందిన మహాకూటమి చీలిపోవడంతో చిన్న పార్టీల ప్రాబల్యం మరింత పెరిగిపోయింది. అవసరమైతే బీజేపీ చిన్న పార్టీల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో గడ్కరీతో రాజ్ సమావేశమై ఉండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
‘మహా’ కూటమికి బీటలు పవార్ పుణ్యమే..
నాగపూర్: గత 25 యేళ్లుగా కొనసాగుతున్న బీజేపీ- శివసేన కూటమి ఈ ఎన్నికల్లో విడిపోవడానికి ఎన్సీపీ నేత శరద్ పవార్ ప్రధాన కారణమని ఎమ్మెన్నెస్ అధినేత రాజ్‌ఠాక్రే విమర్శించారు. ‘శివసేనతో మీరు విడిపోతే.. మీకు మేం మద్దతు ఇస్తామంటూ పవార్ బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరికి హామీ ఇచ్చాడు..’ అంటూ రాజ్ ఆరోపించారు. బుధవారం రాత్రి జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్షం వైఫల్యం వల్లే గత 15 యేళ్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలో కొనసాగగలిగిందని విమర్శించారు.
తనకు ఒకసారి అవకాశమిస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఒకవేళ ప్రజల ఆకాంక్షలను తీర్చలేకపోతే తాను రాజకీయాలనుంచి శాశ్వతంగా వైదొలగిపోతానని ఆయన స్పష్టం చేశారు. ఓటర్ల సెంటిమెంట్లను అన్ని పార్టీలు క్యాష్ చేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలను రద్దుచేసి ప్రభుత్వ హయాంలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
గడ్కరీతో రాజ్‌ఠాక్రే రహస్య భేటీ
Published Thu, Oct 2 2014 10:54 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement