సీఎం ఎంపికపై రెండుగా చీలిన ఎమ్మెల్యేలు!
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థి ఎంపికపై బీజేపీలో తర్జనభర్జనలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి పదవి ఎంపిక విషయంలో ఎమ్మెల్యేలు రెండు వర్గాలు విడిపోయారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్ర బీజేపీ చీఫ్ దేవేంద్ర ఫడ్నావిస్ ల పేర్లు తెరపైకి వచ్చాయి.
బీజేపీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు నాగపూర్ లోని గడ్కరీ నివాసంలో సమావేశమైనట్టు తెలుస్తోంది. 40 మంది ఎమ్మెల్యేలు గడ్కరీకి మద్దతు తెలిపినట్టు వార్తలు వెలువడుతున్నాయి. గడ్కరీనే ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలంటూ మహారాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు సుధీర్ ముంగటివార్ డిమాండ్ చేశారు. ఇప్పటికే దేవేంద్ర ఎంపికపై పార్టీ అధిష్టానం సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. గతంలో ముఖ్యమంత్రి పదవి రేసులో తాను లేదని వ్యాఖ్యానించిన గడ్కరీ.. ఆ పదవిపై ఆశలు పెంచుకోవడంపై బీజేపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.