సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) మహాకూటమిలో కలిసేందుకు ఆసక్తి చూపడం లేదా? ఆ పార్టీ అధినేత రాజ్‌ఠాక్రే వైఖరి చూస్తుంటే ఇదే అభిప్రాయం కలగకమానదు. లోక్‌సభ ఎన్నికలకు ఒంటరిగా వెళ్లేందుకే ఆయన ఆసక్తి చూపుతున్నారని, అందుకే బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీపై ఘాటైన వ్యాఖ్యలు చేసి ఆ పార్టీతో వైరం పెంచుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిన్నమొన్నటి వరకు మోడీని ప్రశంసల్లో ముంచెత్తిన రాజ్ ఒక్కసారిగా తన పంథా మార్చుకోవడం వెనుక ఇదే వ్యూహం దాగుందంటున్నారు. ఒంటరిగా బరి లోకి దిగినా నాలుగైదు స్థానాల్లో ఎమ్మెన్నెస్ విజయం సాధిస్తుందని, అంతగా కావాలనుకుంటే మోడీ ప్రధాని అయ్యేందుకు అవకాశాలుంటే అప్పుడు తమ ఎంపీలు మద్దతు పలుకుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఒంటరిగా బరిలోకి దిగితేనే ఎమ్మెన్నెస్ బలమెంతో తెలుస్తుందని, ఆ ఫలితాల ఆధారంగా అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిలో చేరాలా? వద్దా? అనేది నిర్ణయిం చుకోవచ్చనేది వ్యూహంగా చెబుతున్నారు. ఇటీవల నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు నాసిక్‌కు వచ్చిన రాజ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షాల ఓట్లను రాబట్టుకునేందుకు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రాజ్ చేసిన ఈ ప్రకటన.. ఆ పార్టీ లోక్‌సభ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్తుందనే విషయాన్ని స్పష్టం చేసిందని చెబుతున్నారు.
ఇదిలాఉండగా మోడీకి వ్యతిరేకంగా రాజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. నాసిక్‌తోపాటు ఇతర కార్పొరేషన్లలో ఎమ్మెన్నెస్, బీజేపీ కూటమి అధికారంలో ఉన్నాయి. వివాదస్పద వ్యాఖ్యలవల్ల ఎమ్మెన్నెస్‌తో తెగతెం పులు చేసుకునేందుకు బీజేపీ వర్గాలు దాదాపుగా సిద్ధమయ్యాయని చెబుతున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలా కూటముల మధ్య చిచ్చు రాజుకుంటే కాంగ్రెస్, ఎన్సీపీలు లాభం పొందుతాయనే అభిప్రాయంతోనే బీజేపీ వర్గాలు కొంత మెతక వైఖరితో ఉన్నట్లు రాజకీయ పండితులు చెబుతున్నారు.
‘రాజ్’బాట మారిందా?
Published Thu, Jan 16 2014 12:03 AM | Last Updated on Mon, Oct 29 2018 8:16 PM
Advertisement
Advertisement