శివసేన, ఎమ్మెన్నెస్ మధ్య ‘చెరువు’ జగడం
సాక్షి, ముంబై : ఓపెన్ ఎయిర్ జిమ్‌పై కాంగ్రెస్, శివసేన యువ నాయకుల మధ్య వాగ్వివాదం మరువకముందే తాజాగా మరో వివాదం తెరమీదకు వచ్చింది. భాండూప్ ప్రాంతంలో మహానగర పాలక సంస్థ (బీఎంసీ) చేపట్టిన చెరువు సుందరీకరణ పనులపై శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) మధ్య వివాదం ముదురుతోంది. చెరువు సుందరీకరణ తమ ప్రయత్నం వల్లే జరిగిందని ఇరు పార్టీలు వాదించుకుంటున్నాయి. రెండు పార్టీల మధ్య వివాదం ఎక్కువవుతుండటంతో చెరువు ప్రారంభోత్సవం ఎవరి చేతులమీదుగా జరుగుతుందనే విషయం ఆసక్తిగా మారింది.
పశ్చిమ భాండూప్‌లోని 108 వార్డులోని శివాజీ (కొలను)లో 25 ఏళ్లుగా బురద, చెత్త పేరుకుపోవడంతో కొలను పరిస్థితి దారుణంగా తయారైంది.దీంతో చెరువును సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ఎమ్మెన్నెస్ మాజీ ఎమ్మెల్యే శిశీర్ షిండే, ఎమ్మెన్నెస్ కార్పొరేటర్లు రూపేశ్ వాయంగన్కర్, వైష్ణవి సర్ఫరే, అనిషా మాజ్గావ్కర్ పలుమార్లు డిమాండ్ చేశారు. తర్వాత బీఎంసీ రూ.రెండు కోట్లతో కొలను సుందరీకరణ పనులు చేపట్టింది. దీంతో తమ వల్లే చెరువు సుందరీకరణ సాధ్యమైందని ఎమ్మెన్నెస్ నాయకులు వాదిస్తున్నారు.
సేన ప్రమేయంతోనే..: కార్పొరేటర్ రమేశ్
దీనిపై భాండూప్ ప్రాంతానికి చెందిన శివసేన సీనియర్ కార్పొరేటర్ రమేశ్ కోర్గావ్కర్ మాట్లాడుతూ.. చెరువు సుందరీకరణ పనులకోసం శివసేన బడ్జెట్‌లో నిధులు కేటాయించిందని చెప్పారు. పార్టీ అభివృద్ధి నిధి నుంచి అదనంగా రూ. 50 లక్షలు అందించినట్లు కూడా పేర్కొన్నారు. పనుల్లో జాప్యం జరగకుండా తరచూ బీఎంసీ కమిషనర్, మేయర్‌తో సేన సంప్రదింపులు జరిపిందన్నారు. సకాలంలో పనులు పూర్తి చేసేందుకు అనేక సమావేశాలు నిర్వహించామని చెప్పారు.
చెరువు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న తరుణంలో చెరువు సుందరీకరణ పనుల కీర్తి దక్కించుకునేందుకు ఎమ్మెన్నెస్ ఈవిధమైన వ్యాఖ్యలు చేస్తోందని ఆరోపించారు. కాగా, చెరువు సుందరీకరణ పనులు పూర్తయిన నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే చేతులు మీదుగా జరగాలని ఎమ్మెన్నెస్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే చేతుల మీదుగా జరగాలని బీఎంసీ కమిషనర్‌కు లేఖ రాశారు. దీంతో ప్రారంభోత్సవం ఎవరి చేతుల మీదుగా జరుగుతుందని స్థానికుల్లో ఉత్కంఠ నెలకొంది.