ఇంతకీ కమెడియనా.. విలనా?
కమెడియన్ కపిల్ శర్మ వ్యవహారం రోజురోజుకూ సరికొత్త మలుపులు తిరుగుతోంది. అంధేరీలోని తన బంగ్లా వద్ద మడ అడవులను కపిల్ నరికేస్తున్నాడని, అక్రమంగా కొత్త అంతస్తులు నిర్మిస్తున్నాడని మహారాష్ట్ర నవనిర్మాణ సమితి (ఎంఎన్ఎస్) ప్రధాన కార్యదర్శి షాలిని ఠాక్రే ఆరోపించారు. కపిల్‌కు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మద్దతు పలకకూడదని, అబద్ధాల కోరు అయిన శర్మ మునిసిపల్ చట్టాలను ఎలా ఉల్లంఘించాడో తాము సాక్ష్యాలు కూడా చూపిస్తామని అన్నారు. ఇప్పటికే ఉన్న జి ప్లస్ వన్ అంతస్తుకు అదనంగా మరో నిర్మాణం చేస్తుండటంతో కపిల్ శర్మకు జూలై 16న ఒక నోటీసు ఇచ్చారు. దానికి 24 గంటల్లోగా సమాధానం చెప్పాలన్నారు.
ఆగస్టు నాలుగోతేదీ వరకు కూడా అతడి నుంచి సమాధానం రాకపోవడంతో వార్డు అధికారులు అదనంగా చేసిన నిర్మాణాలను కూల్చేశారని అసిస్టెంట్ మునిసిపల్ కమిషనర్ పరాగ్ మాసుర్కర్ చెప్పారు. అయితే.. కొన్ని నెలల్లోనే బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు ఉండటంతో పార్టీలన్నీ ఈ వివాదాన్ని భుజానికి ఎత్తుకున్నాయి. కపిల్ శర్మ పాల్గొనే షూటింగులను తాము అడ్డుకుంటామని ఎంఎన్ఎస్ సినిమా విభాగం చీఫ్ అమేయ ఖోప్కర్ హెచ్చరించారు. ఎప్పుడో ఆగస్టు నాలుగో తేదీన కూల్చేస్తే.. బీఎంసీ మీద ఆరోపణలు చేయడానికి కపిల్‌కు నెల రోజులు పట్టిందా అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం బీఎంసీని భ్రష్టాచార్ మునిసిపల్ కార్పొరేషన్ అని అభివర్ణించింది.