‘తేడా’ చూపిస్తే అనుమతి కట్..
శాకాహారులకే ఫ్లాట్లు అమ్ముతామనే బిల్లర్డపై ఎమ్మెన్నెస్ ఆగ్రహం
సాక్షి, ముంబై: కేవలం శాకాహారులకే ఫ్లాట్లు విక్రయిస్తామని పెత్తనం చలాయించే బిల్డర్ల ఆగడాలకు ముకుతాడు వేయాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) డిమాండ్ చేసింది. మాంసాహారులకు ఫ్లాట్లు విక్రయింంచేందుకు నిరాకరించే బిల్డర్లు కొత్తగా నిర్మించే భవనాలకు అనుమతి ఇవ్వకూడదని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) సభాగృహంలో జరిగిన సమావేశంలో ఎమ్మెన్నెస్ కార్పొరేటర్లు ప్రతిపాదించారు. దీంతో శాకాహారులకు ప్రాధాన్యత ఇచ్చే బిల్డర్ల గుండెల్లో దడ మొదలైంది. నగరంలో గత కొంతకాలంగా శాకాహారులకే ఫ్లాట్లు విక్రయిస్తున్నారు.
ముఖ్యంగా గుజరాతీ, మార్వాడి తదితర కులాల ప్రజలుంటున్న సొసైటీలలో, బహుళ అంతస్తుల భవనాల్లో మాంసాహారులకు చోటు దొరకడం లేదు. అందులో ఫ్లాటు అద్దెకు ఇవ్వాలన్నా, విక్రయించాలన్నా శాకాహారులకే ఇస్తున్నారు. ఇలా కొన్ని ప్రత్యేక కులాలు బృందాలుగా ఏర్పడి కొత్తగా నిర్మించే భవనాల్లో ఫ్లాట్లు బుకింగ్ చేసుకుంటారు. ఇందులో మాంసాహారులకు అవకాశమివ్వరు. వారు విధించే షరతులకు బిల్డర్లు కూడా తలొగ్గి మాంసాహారులకు ఫ్లాట్లు విక్రయించడం లేదు. దీంతో కుల, మత, భాషలతోపాటు భోజనం అలవాట్లపై ఆరాతీసి బిల్డర్లు ఇల్లు, ఫ్లాట్లు విక్రయిస్తున్నారు. దీని కారణంగా మాంసాహారులు ఫ్లాట్లు కొనుగోలు చేసుకోలేకపోతున్నారు. ఇలాంటి బిల్డర్లపై ఫిర్యాదులు నమోదుచేసినప్పటికీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
ఇలా కుల, మతాలను విభజించే బిల్డర్లకు నూతన భవనాల అనుమతి ఇవ్వకూడదని ఎమ్మెన్నెస్‌కు చెందిన గట్ నాయకుడు సందీప్ దేశ్‌పాండే ప్రతిపాధించారు. దేశ్‌పాండే చేసిన ప్రతిపాదన ఈ నెలాఖరులో జరిగే స్థాయీ సమితి సమావేశంలో చర్చకు రానుంది. ఒకవేళ సమావేశంలో ఈ ప్రతిపాదనకు మంజూరు లభిస్తే అభిప్రాయ సేకరణ జరగనుంది. ఆ తర్వాత బీఎంసీ పరిపాలన విభాగం తుది నిర్ణయం తీసుకుంటుంది.
కొత్త భవనాలకు అనుమతి ఇచ్చేముందు అన్ని వర్గాల ప్రజలకు ఇళ్లు, ఫ్లాట్లు విక్రయించాలని బిల్డర్లకు షరతులు విధిస్తారు. భవన నిర్మాణ పనులు ప్రారంభించాలంటే బీఎంసీ నుంచి ‘ఐఓడీ’ జారీ అవుతుంది. ఈ ఐఓడీలో కొత్త నియమాలు పొందుపరిస్తే బిల్డర్ నుంచి అఫిడవిట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సదరు బిల్డరు కొనుగోలుదారులకు ఫ్లాట్లు విక్రయించేందుకు నిరాకరిస్తే నియమ, నిబంధనల ప్రకారం అతడిపై చర్యలు తీసుకునేందుకు అవకాశముంటుంది.