బేకరీల్లో భారీ ఎత్తున కలప వినియోగం
రోజుకు సగటున 130 కేజీల కలప వాడకం
దట్టమైన పొగతో ముంబైలో తీవ్ర వాయుకాలుష్యం
నిబంధనలను పాటించని బేకరీలపై చర్యలకు సిద్ధమైన బీఎంసీ, నోటీసుల జారీ
దాదర్: పరిశ్రమలు, బేకరీలకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిపాలన విభాగం నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా బేకరీ బట్టీలలో ఇంధనం, ఎలక్ట్రిక్ లేదా గ్యాస్‌కు బదులుగా కలపను వినియోగిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడటంతో 1,200పైగా బేకరీ యజమానులకు నోటీసులు జారీచేసినట్లు అధికారులు తెలిపారు. గత కొద్ది రోజులుగా ముంబైలో గాలి నాణ్యత వేగంగా క్షీణిస్తోంది. దీంతో ముంబైకర్లు వివిధ శ్వాససంబంధ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ సైట్లు భవన నిర్మాణ కాంట్రాక్టర్లకు బీఎంసీ అధికారులు 18 రకాల సూచనలతో కూడిన నియమావళిని జారీచేసింది. వాటిని కచి్చతంగా పాటించాల్సిందేనని నిర్ధేశించింది. కానీ బేకరీల నిర్వాహకులు నియమాలను బేఖాతరు చేస్తున్నట్లు వెలుగులోకి రావడంతో బీఎంసీ కమిషనర్ భూషణ్ గగ్రాణీ (అడ్మిన్) ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించిన అనేక మంది బిల్డర్లు, కాంట్రాక్టర్లకు నోటీసులు కూడా జారీచేసింది. అదేవిధంగా బేకరీలలో బ్రెడ్లు, కేక్‌లు, బిస్కెట్లు, ఇతర తినుబండారాల తయారీకి కలప వాడుతున్నట్లు తేలడంతో వీటిపై చర్యలు తీసుకుంది.
పదిహేను రోజుల క్రితమే హెచ్చరిక...
ముంబైలో రెండువేలకుపైగా బేకరీలున్నాయి. వీటిలో రోజుకు దాదాపు 130 కేజీల కలపను వినియోగిస్తున్నారు. వీటినుంచి వెలువడే దట్టమైన పొగవల్ల గాలి నాణ్యత క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో కలప వాడకాన్ని నిలిపివేయాలంటూ బేకరీ యజమానులను గత పదిహేను రోజుల కింద బీఎంసీ హెచ్చరించింది. దీనికి బదులుగా గ్యాస్, ఇంధనం, కరెంటును వినియోగించాలని సూచించాలని లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినప్పటికీ 1,200పైగా బేకరీల్లో నియమోల్లంఘన జరుగుతున్నట్లు తనిఖీల్లో బయటపడడంతో నోటీసులు జారీచేశారు.
నోటీసులకు మాత్రమే పరిమితం...
బేకరీల్లో కలపను వినియోగించకూడదని బీఎంసీ 2007లోనే ఆదేశాలు జారీచేసింది. బట్టీలలో కలపకు బదులుగా సీఎన్‌జీని వినియోగించాలని సూచించింది. ప్రభుత్వాలు మారడంతో బీఎంసీ కూడా ఈ విషయాన్ని అంతగా పట్టించుకోవడం మానేసింది. ఇదేకాకుండా ముంబైలో ఉన్న అన్ని బేకరీల వివరాలు బీఎంసీ వద్ద లేవు. లైసెన్స్‌డ్ బేకరీల కన్నా అక్రమంగా నడుపుతున్న బేకరీలే అధికమని తేలింది. ఈ నేపథ్యంలో బీఎంసీ కేవలం నోటీసుల జారీకి మాత్రమే పరిమితమైందని ఆరోపణలొస్తున్నాయి. దట్టమైన పొగను వెలువరించే బేకరీలతోపాటు జవేరీ బజార్, కాల్బాదేవి, గిర్గావ్ ప్రాంతాల్లో వెండి, బంగారు, గిల్టు నగలు తయారుచేసే ఫ్యాక్టరీలు వందల సంఖ్యలో ఉన్నాయి. వీటిలో వేలాది మంది కార్మికులు పనిచేస్తారు. నగలు తయారీలో బొగ్గు, రసాయనాల వినియోగం వల్ల కాలుష్యం ఏర్పడుతోంది. దీంతో స్ధానికుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న బీఎంసీ అధికారులు బంగారు, వెండి నగలు తయారుచేసే ఫ్యాక్టరీ యజమానులకు కూడా నోటీసులు జారీ చేశారు. గాలి నాణ్యత మెరుగు పడేవరకు ఇలాంటి చర్యలు తప్పవని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment