Holi 2025, బోసిపోయిన రహదారులు.. కిటకిటలాడిన వైన్‌ షాపులు | Holi 2025 Celebrations in Maharashtra | Sakshi
Sakshi News home page

Holi 2025, బోసిపోయిన రహదారులు.. కిటకిటలాడిన వైన్‌ షాపులు

Published Sat, Mar 15 2025 2:30 PM | Last Updated on Sat, Mar 15 2025 3:16 PM

Holi 2025 Celebrations in Maharashtra

 ముంబై సహా రాష్ట్రవ్యాప్తంగా  కోలాహలంగా హోలీ సంబరాలు 

గురువారం కామదహనంతో మొదలైన వేడుకలు  

చిన్నా,పెద్దా తేడా లేకుండా రంగుల్లో మునిగితేలిన ప్రజలు  

పలు ప్రాంతాల్లో హోలీ ఉత్సవాల్లో రాజకీయ నాయకుల సందడి

ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా హోలీ పండుగ ఘనంగా జరిగింది. చిన్నపెద్ద వయసుతో తేడా లేకుండా అందరూ ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ జరుపుకుని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. గతేడాది కంటే ఈసారి హడావుడి కొంత తగ్గినప్పటికీ రాబోయే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల దృష్ట్యా అనేక మంది రాజకీయ నాయకులు తమతమ ప్రాంతాల్లో జరిగిన హోలీ ఉత్సవాలలో పాల్గొన్నారు. ముంబై, నవీముంబై, థానే పుణే, సోలాపూర్‌లో వీధివీధినా సంబరాలు అంబరాన్ని తాకాయి. కొన్ని ప్రాంతాల్లో లౌడ్‌స్పీకర్లు, బ్యాండు మేళాలతో నృత్యాలు చేస్తూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగ జరుపుకున్నారు. పలుచోట్ల గురువారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు జరిపి, పూరన్‌ పోలీ (పూర్ణంతో తయారుచేసిన తీపి రొట్టెలు, బూరెలు) నైవేద్యంగా సమరి్పంచి, కాముని దహనం చేశారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రంగుపంచమి (రంగులు చల్లుకునే) ఉత్సవాలను జరుపుకున్నారు. ముఖ్యంగా కోళీ ప్రజలు తమ సాంప్రదాయ పద్దతిలో హోళీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా శుక్రవారం కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో గురువారం సాయంత్రం నుంచే యువతీ యువకులు, పిల్లలు, అందరు వేడుకలను ప్రారంభించారు. కొందరు ఫోన్‌లలో, మరికొందరు ప్రత్యక్షంగా కలుసుకుని ఒకరికొకరు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. 

గట్టి పోలీసు బందోబస్తు..... 
హోలీ ఉత్సవాల్లో ఎటువంటి అనుచిత సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు నిర్వహించింది. బహిరంగ ప్రదేశాల్లో , బాటసారులపై రంగులు చల్లి ఇబ్బందులు పెట్టకుండా నగర రహదారులపై గస్తీ నిర్వహించారు. పండగ నేపథ్యంలో అనేక మంది పోలీసుల వారంతపు సెలవులు రద్దు చేశారు. హోలీ రోజున మద్యం సేవించేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. దీంతో ప్రధాన కూడళ్ల వద్ద బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపినవారిపై చర్యలు తీసుకున్నారు.  

కిటకిటలాడిన బీచ్‌లు.. 
హోలీ పండుగ సందర్భంగా ముంబైలోని బీచ్‌లన్నీ కిటకిటలాడాయి. పండుగ అనంతరం సముద్ర స్నానాలు చేసేందుకు యువతీ, యువకులు పెద్దసంఖ్య లో బీచ్‌లకు చేరుకున్నారు. ముఖ్యంగా చరి్నరోడ్, లో టస్, వర్లీ సీ ఫేస్, శివాజీపార్క్, మాహిం, బాంద్రా, అక్సాబీచ్‌ తదితర బీచ్‌లు సందర్శకులతో నిండిపోయాయి. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా జలాశయాలు, చెరువుల పరిసరాల్లో కూడా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మద్యం సేవించి ఇతరుల ను ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకున్నారు.  

బోసిపోయిన రహదారులు.. 
నిత్యం వాహనాలతో రాకపోకలతో రద్దీగా కనిపించే ముంబై రహదారులన్నీ శుక్రవారం బోసిపోయి కనిపించాయి. శుక్ర, శని, ఆదివారం...ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అధిక శాతం ప్రజలు గురువారం రాత్రి నుంచే పర్యాటక ప్రాంతాలకు, రిసార్టులకు, పిక్నిక్‌ పాయింట్లకు తరలిపోయారు. దీంతో హోలీ పండుగనాడు ప్రధాన రహదారులు సైతం బోసిపోయి కనిపించాయి. అయితే విహారప్రాంతాలకు వెళ్లే రోడ్లపై ముఖ్యంగా పుణే ఎక్స్‌ప్రెస్‌ హైవే, గోవా మార్గంతోపాటు పలు మార్గాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు ట్రాఫిక్‌ కొంత పెరిగింది. శుక్రవారం ‘బెస్ట్‌’బస్సులు కూడా పూర్తిస్థాయిలో రోడ్లపైకి రాలేదు. అదే విధంగా ఉదయం నుంచి రాత్రి వరకు ప్రయాణికులతో కిక్కిరిసి తిరిగే లోకల్‌ రైళ్లు కూడా ఖాళీగానే కనిపించాయి. నగరంలో ట్యాక్సీలు, తూర్పు, పశి్చమ ఉపనగరాలలో ఆటోలు కూడా అనుకున్నంత మేర తిరగకపోవడంతో రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి.  

వైన్‌ షాపుల వద్ద రద్దీ.. 
హోళి పండుగ నేపథ్యంలో శుక్రవారం ముంబైతోపాటు థాణే జిల్లాలోని వైన్‌ షాపుల వద్ద మద్యం కొనుగోలు కోసం మందుబాబులు పెద్దఎత్తున బారులు తీరారు. చేసేందుకు పెద్ద ఎత్తున బారులు తీరి కనిపించారు. మటన్, చికెన్‌ కొనుగోళ్లకు కూడా జనం పోటెత్తారు. గురువారంతోపాటు శుక్రవారం మధ్యాహ్నం దాకా ఈ రద్దీ కొనసాగింది.      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement