
కాకినాడ, సాక్షి: చిత్రాడ.. మొన్నటిదాకా కాలుష్యం అనే పదానికి అల్లంత దూరాన ఉన్న గ్రామం. ఎప్పుడైతే జనసేన, ఆ పార్టీ కార్యకర్తలు అడుగు మోపారో.. ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి!!. పొరపాటున అభివృద్ధి విషయంలో అనుకునేరు!!. విపరీతమైన కాలుష్యం, ఎటు చూసినా చెత్తాచెదారం.. ఫ్లెక్సీలతోనే ఆ మార్పు అంతా!!.
మొన్నీమధ్యే జరిగిన జనసేన ఆవిర్భావ సభ.. చిత్రాడ(పిఠాపురం)కు విపరీతమైన కాలుష్యాన్ని మిగిల్చింది. అందుకు కారణం.. అక్కడి చెత్తను తరలించకపోవడం ఒకటైతే.. దానిని అక్కడికక్కడే పోగేసి కాల్చేయడం. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చపోగా.. పైగా బోనస్‌గా కాలుష్యాన్ని అంటగట్టారంటూ జనసేనను తిట్టిపోస్తున్నారు చుట్టుపక్కల ప్రజలు.
జనసేన సభ తర్వాత.. ఇవాళ్టికి అక్కడి రోడ్లపై ఇంకా జనసేనవారి ఫ్లెక్సీలు, వెల్‌కమ్ బ్యానర్లు.. ఆఖరికి భారీ ఆర్చ్‌లు కూడా అలాగే ఉండిపోయాయి. వాటిని తొలగించడానికి ఏర్పాటు చేసిన పార్టీ కమిటీ ముసుగేసి పడుకుంది. దీంతో పవన్ పర్యవేక్షణలో ఉన్న ఓ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఉపాధి హామీ కూలీలతో ఆ చెత్త ఏరివేయించారు.
నాదెండ్ల స్వయంగా ప్రకటించి..
తమది చాలా క్రమశిక్షణ గల పార్టీ అని, సభ తరువాత సభా ప్రాంగణాన్ని శుద్ది చేస్తామని జనసేన సీనియర్, మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ప్రకటించారు. సభ అనంతరం ప్రాంగణాన్ని శుద్ది చేసి..ఫ్లెక్సీలు తొలగించాలని తమ అధినేత పవన్ ఆదేశించినట్లు చెప్పారాయన. ఈ క్రమంలోనే..
కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారాయన. అయితే మరుసటి రోజు జనసేన నేతలు సభా ప్రాంగణానికి వచ్చారు. శుద్ధి చేస్తున్నట్లు ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. అదయ్యాక అక్కడి నుంచి గాయబ్ అయ్యారు. ఈలోపు.. పవన్ సొంత శాఖలోని ఉపాధి హమీ కూలీలు ఆ ప్లాస్టిక్ వ్యర్ధాలను డంపింగ్ యార్డుకు తరలించకుండా.. అక్కడే గుట్టలుగా పోసి దగ్ధం చేశారు. దీంతో విపరీతమైన కాలుష్యంతో ఆ ప్రాంతమంతా ఉక్కిరి బిక్కిరి అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment