
కాకినాడ, సాక్షి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ రచ్చ.. జనసేన పార్టీలో చిచ్చు రాజేసింది. స్థానిక జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాస్‌ను వేదిక మీదకు సిబ్బంది అనుమతించకపోవడంతో మొదలైన గొడవ.. అప్పటికే వేదిక మీద ఉన్న జనసేన కోఆర్డినేటర్ వైశాలి వివరణతో మరింత ముదిరింది.
పాదగయ క్షేత్రంలో(Pada Gaya Temple) సోమవారం రాత్రి కుక్కటేశ్వర స్వామివారి దివ్యకల్యాణం జరిగింది. ఈవో జగన్మోహన్ ఆహ్వానం మేరకు జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాస్ సతీసమేతంగా ఆలయానికి వచ్చారు. అప్పటికే కల్యాణ వేదికపై ఈవో దంపతులు కూర్చుని ఉన్నారు. అయితే మర్రెడ్డి దంపతులు స్టేజ్ ఎక్కబోతుండగా.. ఆలయ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, కాబట్టి వేదిక ఎక్కేందుకు అనుమతించమని చెప్పారు. దీంతో ఆయన వర్గీయులు ఆలయంలో ఆందోళనకు దిగారు.
ఈవో భార్య వైశాలి(EO Wife Vishali) స్థానిక జనసేన పార్టీ కోఆర్డినేటర్. దీంతో ఆమెను ఎలా కూర్చోనిచ్చారంటూ జనసేన నేతలు ఆలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయితే తాను పార్టీపరంగా కాకుండా.. ఈవో భార్యగానే వేదిక మీద ఉన్నానంటూ ఆమె చెప్పారు. దీంతో ఆ వివాదం మరింత ముదిరింది. ఆ గొడవ జరుగుతుండగానే.. ఈవో దంపతులు లేచి స్వామివారి కల్యాణం మధ్యలోనే వెళ్లిపోయారు.
దీంతో.. అపచారం జరిగిందంటూ భక్తులు చర్చించుకున్నారు. మరోవైపు మర్రెడ్డి దంపతులను ఆలయ సిబ్బంది అవమానించారంటూ కాసేపు హల్‌చల్ చేసి.. కాసేపు అయ్యాక అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment