
నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం
‘ఆ రోజుల్లో’ ‘మా రోజుల్లో’ అంటూ పిచ్చుకలను తలచుకుంటూ బాధపడితే ఏం లాభం? సొంత లాభం కొంత మానుకొని ‘నా ఇల్లు... నా పక్షులు’ అనుకుంటే పిచ్చుకలు పూర్వకళతో సందడి చేస్తాయి. పిచ్చుకలు కనిపించడం అరుదైన దృశ్యం కావడం హైదరాబాద్‌కు చెందిన భావన శ్రీనివాస్‌ను బాధించింది. ఆ బాధే పిచ్చుకల సంరక్షణను ఉద్యమ స్థాయిలో చేసేలా చేస్తోంది.
సమాజంలో పర్యావరణం పట్ల పెరుగుతున్న నిర్లక్ష్యం భావన శ్రీనివాస్‌ను ఆలోచనలో పడవేసింది. సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలనే ఆలోచనే ‘జాగృతి అభ్యుదయ సంఘం’కు బీజం వేసింది. ఈ సంస్థ పక్షుల సంరక్షణ, మొక్కల పెంపకం, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణలాంటి అంశాలపై పనిచేస్తుంది.
ప్రతి ఇంటికి ఒక గూడు
ఇంటి చుట్టుపక్కల, తోటల్లో, రహదారుల పక్కన కనిపించే పిచ్చుకలు ఇప్పుడు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తున్నాయి. చెట్లు కొట్టివేయడం, ఆధునిక నిర్మాణాల వల్ల వాటికి గూళ్లు లేకుండా పోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని భావన శ్రీనివాస్ ‘పిచ్చుక గూళ్ల సంరక్షణ’ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఇంట్లో కనీసం ఒక మట్టిగూడు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో వేల సంఖ్యలో మట్టి గూళ్లను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
విద్యార్థులే వెన్నెముకగా...
గూళ్ల తయారీని గ్రామీణ మహిళలకు అప్పగించి వారికి ఉ పాధి కల్పిస్తున్నారు. వేసవికాలంలో పిచ్చుకలు దాహంతో బాధపడకుండా, ప్రతి ఇంటిముందు చిన్న నీటి తోగులు (నీటి గిన్నెలు) పెట్టేలా అవగాహన కలిగిస్తున్నారు. చెట్లు, బడులు, వృద్ధాశ్రమాలలో కూడా ఈ తోగులను ఏర్పాటు చేస్తున్నారు. పిచ్చుకల ప్రాముఖ్యతపై బడులలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘ఒక ఇంట్లో ఒక గూడు’ అనే ఉద్యమాన్ని విద్యార్థుల సహకారంతో ముందుకు తీసుకెళుతున్నారు. ఇప్పటికే వేలాది కుటుంబాలు పక్షుల సంరక్షణ ఉద్యమంలో భాగమయ్యాయి.
చదవండి : Sunita William Gujarat Home: పూర్వీకుల ఇల్లు ఇదే! వైరల్ వీడియో
పిచ్చుకలు ఎందుకు కనిపించడం లేదో తెలుసా?
నగరీకరణ: కొత్త కాంక్రీట్ భవనాల నిర్మాణం, చెట్ల కొట్టివేత వల్ల పిచ్చుకలకు గూళ్లు కట్టుకునే అవకాశం తగ్గిపోయింది.
ప్లాస్టిక్ వినియోగం: మనం విసిరేసే ప్లాస్టిక్ వ్యర్థాలలో పక్షులు చిక్కుకుని మరణించడం పెరిగిపోయింది.

రసాయనాల ప్రభావం: వ్యవసాయ రంగంలో అధికంగా ఉపయోగించే రసాయనిక ఎరువుల వల్ల పురుగులతో పాటు చిన్నపాటి పక్షులు చనిపోతున్నాయి.
నీటి కొరత: ప్రత్యేకించి వేసవిలో పిచ్చుకలకు తాగేందుకు నీరు దొరకక పోవడం వాటి మనుగడకు కష్టంగా మారింది.
అవిగో పిచ్చుకలు!
రకరకాల కారణాల వల్ల పిచ్చుకల సంఖ్య తగ్గిపోతోంది. వాటిని రక్షించుకోవాలని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పక్షి విభాగం శాస్త్రవేత్త వాసుదేవరావుతో మాట్లాడాను. అట్టపెట్టెలతో చేసిన పిచ్చుక గూళ్లు ఇచ్చారు. మంచి మట్టితో తయారుచేసిన గూళ్లు ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయి అనే ఆలోచనతో ఒక కుమ్మరి కళాకారుడికి నా కాన్సెప్ట్ చెప్పాను. అతను చేసి ఇచ్చాడు. సక్సెస్ అవుతామా లేదా తెలుసుకోడానికి ముందు మా ఇంట్లోనే పెట్టాము. సూపర్ సక్సెస్ అయ్యాం. ఇప్పుడు మా ఇంటి చుట్టూ వెయ్యి వరకు పిచ్చుకలు ఉన్నాయి. పిచ్చుకలను ఎవరు తీసుకెళ్లినా ఇతరులలో స్ఫూర్తి నింపడానికి ఆ విషయాన్ని వాట్సాప్ గ్రూపులో పెట్టండి అని చెబుతుంటాను. – భావన శ్రీనివాస్
– శిరీష చల్లపల్లి
Comments
Please login to add a commentAdd a comment