World Sparrow Day
-
పది వేల ఏళ్లనుంచి కాపాడుతోంది..మరి మనం ఏం చేస్తున్నాం..?
ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 20న జరుపుకుంటారు. పొద్దున్నే మన కిటికీ దగ్గరో, పెరడులోని చెట్టుపైనో పిచ్చుక కిచకిచలు వింటూ ఆనందంగా కళ్లు తెరిచిన క్షణాలు గుర్తున్నాయా? ఆ మధుర స్వరాలు గుర్తున్నాయా అని అనుకోవడంలోనే నానాటికి కనుమరుగైపోతున్న పిచ్చుకల పరిస్థితి అర్థం అవుతుంది. అందుకే వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ, పిచ్చుకల పరిరక్షణపై అవగాహన పెంచడానికి ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపుకుంటాం. వరల్డ్ స్పారో డేని 2010లో నేచర్ ఫరెవర్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. ప్రతీ ఏడాది ఏదో ఒక ధీమ్ ఉంటుంది. "ఐ లవ్ స్పారోస్" ఇదే. ప్రపంచ పిచ్చుక దినోత్సవం 2024 అధికారిక థీమ్. ఇది పిచ్చుకలు, మనుషుల మధ్య ప్రేమను, పర్యావరణ పరిరక్షణలో పిచ్చుకల బాధ్యతను గుర్తు చేస్తుంది. పిచ్చుకలను రక్షించడం అంటే మనల్ని మనల్ని కాపాడుకోవడమే. హాయి గొలిపే, ఉత్సాహపరిచే పిచ్చుకల కిలకిలారావాలు రాబోయే తరాలకు అందించిన వారమవుతాం. పదివేల సంవత్సరాలుగా పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ముఖ్యపాత్ర పోషించిన చిన్ని జీవి పిచ్చుక. పిచ్చుకల సంఖ్య తగ్గిపోవడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లో ఇవి కనిపించడం లేదు.నగరీకరణ, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విపరీతంగా చెట్లను నరికివేయడం, ఎక్కడబడితే అక్కడ సెల్ టవర్ల నిర్మాణం తదితర కారణాలు పిచ్చుకల పాలిట పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయి. పిచ్చుకలు-వాస్తవాలు ప్రపంచవ్యాప్తంగా 60 రకాల పిచ్చుక జాతులు ఉన్నాయి. పిచ్చుకలు స్వతహాగా స్వతంత్రంగా ఉంటాయి. సొంతంగా అందమైన గూళ్ళను నిర్మించుకుంటాయి. పిచ్చుకల సగటు వయస్సు 4 నుండి 5 సంవత్సరాలు, పిచ్చుకలు చూడ్డానికి బుల్లిపిట్లలే కానీ, పర్యావరణ వ్యవస్థలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. బుజ్జి బుజ్జి ముక్కులతో తెగులు కీటకాలను ఏరిపారేసి (తినేసి), మొక్కల్ని తెగుళ్లు, చీడపీడలనుంచి కాపాడతాయి. మొక్కల పెరుగుదలకు సహాయపడే విత్తనాలను వ్యాప్తి చేస్తాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) నివేదిక ప్రకారం, భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలో వీటి సంఖ్య దాదాపు 80 శాతం తగ్గింది. తీర ప్రాంతాల్లో 70 నుంచి 80 వరకు తగ్గగా, ఇతర ప్రాంతాల్లో 20 శాతం తగ్గుదల కనిపించింది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) పిచ్చుకను అంతరించిపోతున్న జాతిగా (రెడ్ లిస్ట్) పేర్కొంది. కొన్ని పట్టణ ప్రాంతాల్లో 99 శాతం వరకు వీటి సంఖ్య తగ్గిపోవడం గమనార్హం. అందుకే బాల్కనీల్లో, ఇంటి పెరడులో వాటి కోసం కాసిన్ని నీళ్లు పెడదాం. బర్డ్ ఫీడర్‌ను ఉంచి వాటిల్లో కొన్ని బియ్యం గింజలు, లేదంటే మనకు అందుబాటులో ఉన్న ఇతర తృణధాన్యాల్ని వాటికి ఆహారంగా అందిద్దాం.హే పిచ్చుక..గూడు కట్టుకో అని ఆహ్వానిద్దాం! -
ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో వరల్డ్ స్పారో డే
మణికొండ: హైదరాబాద్ వాసులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, వినోదాన్ని పంచేందుకు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో ఆదివారం వరల్డ్ స్పారో డే సందర్భంగా బర్డ్ వాక్‌ను నిర్వహించారు. దాంతో తరలివచ్చిన పక్షి ప్రేమికులు వాటిని వీక్షించటంతో పాటు ఫొటోలను తీసుకున్నారు. మొదటి సారిగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని టీఎస్‌టీడీసీ, ఎకో టూరిజం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి.స్కైలాబ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కును.. ఎంతో ఆకర్షణీయంగా, పక్షుల ఆవాసానికి అనువుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. పార్కును వీక్షించేందుకు వచ్చే వారికి ట్రెక్కింగ్ రూట్స్, వాకింగ్పాత్, గజేబోలు, రచ్చబండలు, ఓపెన్‌జిమ్ లాంటి సౌకర్యాలను కల్పిం చామన్నారు. వైస్ చైర్మెన్, ఎండీ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తమ అటవీశాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న ప్రతి పార్కులో పక్షులు, జంతువులకు ఆవాసంగా తీర్చిదిద్దటంతో పాటు విజిటర్స్‌కు అనుగుణంగా అనేక సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో బాగా నీడను ఇచ్చే మొక్కలనే ఎక్కువగా నాటామన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎఫ్డీసీ, ఎకో టూరిజం ప్రాజెక్ట్ మేనేజర్ కె. సుమన్, రేంజ్ అధికారులు లక్ష్మారెడ్డి, మధు, సూపర్వైజర్లు శ్రీకాంత్, బర్డింగ్ పాల్స్ కల్యాణ్, విజయ్, స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 30 రకాల పక్షులను వాకర్స్ గుర్తించారు. -
World Sparrow Day 2023: పిచ్చుకల జీవిత కాలమెంతో తెలుసా?
వేకువ జామున కిలకిలారావాలతో మేలుకొలుపు పాడే పిచ్చుకలను చూస్తే మనసుకు కాసింత హాయి.. చూరుకు వేలాడదీసిన వరి కంకులు తింటూ ‘కిచ కిచ’ మంటూ గోల చేసే చిట్టి పిట్టలు కలిగించే ఉత్సాహం మాటల్లో చెప్పలేం.! ఇసుక, మట్టిలో పొర్లాడే దృశ్యాలు.. అద్దంలో తనను తాను చూసుకుని మురిసిపోతూ పిట్టలు సందడి చేసిన క్షణాలు ఎంతో మందికి తీపి జ్ఞాపకాలు. మనిషికి దగ్గరగా ఉంటూ మన కుటుంబంలో ఒకరుగా ఉన్న పిచ్చుకలు.. మానవజాతి చేస్తున్న తప్పిదాలకు బలైపోతున్నాయి. ప్రపంచంలో వేగంగా అంతరిస్తున్న పక్షుల జాబితాలో తొలి స్థానంలో ఉన్న పిచ్చుకలను రక్షించుకోకపోతే జీవవైవిధ్యానికి పెనుముప్పుగా పరిణమించే అవకాశాలున్నాయి. నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా వాటి విశేషాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. పూర్వం మధ్యదరా ప్రాంతంలో ఆవాసముండే పిచ్చుకలు కాలక్రమంలో ప్రపంచమంతటా విస్తరించాయి. అడవుల్లో కాకుండా మానవులకు దగ్గరగా ఉండేందుకే అవి ఇష్టపడతాయి. గూడుకు ముప్పు వస్తుందనుకుంటే ఇతర జాతుల పక్షులపై దాడి చేసేందుకూ వెనుకాడవు. మగ, ఆడ పిచ్చుకలు అదే వర్గానికి చెందిన పక్షులపై మాత్రమే దాడి చేయడం ఇక్కడ విశేషం. ►65 ఏళ్ల క్రితం అంటే 1958లో చైనా పాలకుడు మావో జెడాంగ్ పిచ్చుకలపై బ్రహ్మస్త్రం సంధించాడు. పంటలు నాశనం చేస్తున్నాయనే నెపంతో లక్షల సంఖ్యలో పిట్టలను కాల్చిపడేయించాడు. పంటల వద్ద పళ్లేలతో చైనీయులు చేసిన శబ్ధాల ధాటికి పిచ్చుకలు బతుకుజీవుడా అనుకుంటూ దూరంగా వెళ్లి తలదాచుకున్నాయి. ►ఆ తర్వాత పంటలను చీడపీడలు ఆశించడంతో తిండిగింజలు కరువయ్యాయి. రెండేళ్లలోనే తాము చేసిన తప్పు చైనీయులకు తెలిసొచ్చింది. పిట్టలు బతికుంటేనే పంటకు రక్ష అని గుర్తించిన చైనీయులు వాటిని సంరక్షించడం మొదలుపెట్టారు. జీవవైవిధ్యానికి పిచ్చుకలు ఎంతలా దోహదపడతాయో తెలిపేందుకు ఇదొక ఉదాహరణ. ఖండాలు దాటి వచ్చే చిన్ని పిచ్చుక.. ►చూడటానికి పిచ్చుకల్లా ఉండే ఈ పక్షులు ఏటా శీతాకాలంలో పశ్చిమ దేశాల నుంచి నల్లమల అభయారణ్యానికి లక్షల సంఖ్యలో వలస వస్తుంటాయి. వీటితోపాటు వలస వచ్చే హారియర్స్ అనే గద్ద జాతి పక్షులు గ్రేటర్ షార్ట్ టోడ్ లార్క్లను వేటాడి తింటాయి. ►పిచ్చుకలు అంతరించిపోతుండటానికి కారణాలు అనేకం. భూతాపోన్నతి నుంచి రక్షణ కోసం మానవ జాతి వినియోగిస్తున్న అన్లెడెడ్ పెట్రోల్ అందులో ఒకటి. ఈ పెట్రోల్‌ను మండించినప్పుడు విడుదలయ్యే మిౖథెల్ నైట్రేట్.. చాలారకాల క్రిమికీటకాలకు విషంలా మారుతోందని, ఫలితంగా పిచ్చుకలకు ఆహారం దొరకకుండా పోతోందని ఆర్నితాలజిస్టులు(పక్షి శాస్త్రవేత్తలు) తమ పరిశోధనల ద్వారా గుర్తించారు. ►పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణ శైలి మారడంతో పిచ్చుకలకు గూళ్లు కట్టుకునే అవకాశాలు తగ్గాయి. పెరటి తోటలు అంతంతమాత్రంగా ఉండటం, వాహనాల రణగొణధ్వనులు, సెల్ టవర్ల రేడియేషన్, పంటల సాగులో రసాయనాలు అధికంగా వినియోగించడం తదితర కారణాలు పిచ్చుకల జీవనానికి ముప్పుగా పరిణమించాయి. ►ప్రపంచంలో ఏటా పిచ్చుకల సంఖ్య తగ్గిపోతుండటంతో ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ తయారు చేసిన రెడ్‌లిస్ట్ జాబితాలోకి పిచ్చుకలను చేర్చింది. మన దేశంలోనూ పిచ్చుకల్ని సంరక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని స్వచ్ఛంద సంస్థలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ►పిచ్చుకల జీవిత కాలం నాలుగు నుంచి ఐదేళ్లు. ► బరువు 35 నుంచి 40 గ్రాములు. ►ఎగిరే వేగం గంటకు 38.5 నుంచి 50 కి..మీ. ►ఐదు నుంచి ఎనిమిది గుడ్లు పెడతాయి. 10 నుంచి 15 రోజుల్లో పొదుగుతాయి. ►ప్రత్యర్థుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు నీళ్లలో ఈదగలదు. ►ఆడ పిచ్చుకల్ని ఆకర్షించేందుకు మగ పిచ్చుకలే గూళ్లు కడతాయి. -
ఎక్కడున్నావమ్మా.. ఓ పిచ్చుకమ్మా..?
సీతంపేట (విశాఖ ఉత్తర): ఒకప్పుడు మనం నిద్రలేవగానే మన కళ్ల ముందు కనిపించే చిన్ని నేస్తం పిచ్చుక. పెరట్లో చెట్లపై ఎన్నో రకాల పక్షులు కిలకిల రావాలు చేసినా ఇంటి చూరుల్లో, గోడల నెర్రెల్లో గూడు కట్టుకుని కళ్లు తెరవగానే కనిపించే ఈ జంట చిట్టి గువ్వలు చేసే కిచ కిచలు నేడు కరువయ్యాయి. అరచేతిలో ప్రపంచాన్ని ఇముడ్చుకోవాలనే తాపత్రయంలో ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చేస్తున్న సెల్‌టవర్లు ఈ చిన్నారి నేస్తాలకు మరణ శాసనాన్ని రాస్తున్నాయి. చదవండి: అద్భుతాలు సృష్టించి.. వాటికే బలై.. ఆ శాస్త్రవేత్తలు ఎవరో తెలుసా? పర్యావరణాన్ని తన శక్తిమేరకు కాపాడే పిచ్చుకలను రక్షించేందుకు పక్షుల ప్రేమికులు ప్రత్యేకంగా వీటికోసం అన్వేషించే పరిస్థితులు ఏర్పడ్డాయంటే ఎంతో బాధాకరం. మన ఇంట్లో మనతో పాటు ఉండే ఈ చిట్టి గువ్వలు ఇంట్లో క్రిమికీటకాలు కనిపించాయంటే గుటుక్కున మింగేసి మనల్ని వీటిబారి నుంచి కాపాడతాయి. గుప్పెడు గింజలు వేస్తే చాలు కలకాలం తోడుంటామని మన చెంతనే ఉంటాయి. పర్యావరణాన్ని కాపాడే ఈ పిచ్చుకల జాతిని సంరక్షించుకునేందుకు ప్రత్యేకంగా నడుం బిగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మనిషి తన మనుగడ తాను చూసుకుంటూ మిగతా పరిసరాలను, జీవజాలాన్ని విస్మరిస్తున్నాడు. పిచ్చుకమీద మనం ప్రయోగిస్తున్న బ్రహా్మ్రస్తాలతో పక్షి జాతి నిర్వీర్యమవుతోంది. పిచ్చుకల జాతిని పరిరక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా 2010 నుంచి మార్చి 20 తేదీన ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఒకకొత్త థీమ్‌తో పిచ్చుకల పరిరక్షణపై అవగాహన కలి్పస్తున్నారు, ఏ ఏడాది ‘ఐ లవ్ స్పారో’ థీమ్‌తో వరల్డ్ స్పారో డే నిర్వహిస్తున్నారు. వీటి పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా పాఠశాలలు ,కళాశాలల్లో అవేర్నెస్ క్యాంపైన్స్, , వ్యాసరచన, సమావేశలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. 23 ఏళ్లుగా కృషి చేస్తున్నాం పట్టణీకరణ, కాలుష్యం, రేడియేషన్ కారణంగా సున్నితమైన పిచ్చుక సంతంతి నానాటికీ తగ్గిపోతోంది. పిచ్చుకలు మానవాళికి ఎంతో ప్రయోజకరమైనవి. పిచ్చుకల పరిరక్షణకు 2000 సంవత్సరంలో గ్రీన్ క్లైమేట్ సంస్థను స్థాపించి 23 ఏళ్లుగా వాటి పరిరక్షణకు కృషి చేస్తున్నాం. సభలు, సమావేశాలు నిర్వహించడం, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి పిచ్చుకల ఆవశ్యకత, పర్యావరణ పరిరక్షణ, పిచ్చుకల పరిరక్షణకు చెయ్యాల్సిన కర్తవ్యాన్ని వివరిస్తున్నాం. ఈ విధంగా గ్రీన్ క్లైమేట్ టీం వేలాది మంది విద్యార్థులకు , యువతకు, స్వచ్ఛంద సంస్థలకు, మహిళలకు అవగాహన కల్పిస్తోంది. పాఠశాలలు, కళాశాలకు వెళ్లి పిచ్చుకల పరిరక్షణకు ఏం చెయ్యాలో అవగాహన కల్పించి విద్యార్థులను భాగస్వామ్యం చేశాం. పిచ్చుకలు కనిపించే ప్రాంతాలకు వెళ్లి వాటిని కాపాడటానికి గూళ్లు, ఆహారం, నీరు ఏర్పాటు చెయ్యమని చైతన్య పరిచాం. 2002లో చెక్కతో తయారు చేసిన పిచ్చుకల గూళ్లు నగర ప్రజలకు పరిచయం చేసి విరివిగా ఏర్పాటు చెయ్యాలని ప్రచారం చేశాం. అలాగే 2005లో మట్టితో చేసిన గూళ్లు నగరవాసులకు అందుబాటులోకి తెచ్చి ఇంటి పరిసరాలలో ఉంచాలని అవగాహన కల్పించాం. టీమ్ సభ్యుల సుదీర్ఘ కృషితో విశాఖనగరంలో ప్రస్తుతం 280 ప్రాంతాలలో పిచ్చుకలు దర్శనమిస్తున్నాయి. ప్రజలకు తమ ఇళ్ల బాల్కనీలు, మెట్ల కింద మట్టితో చేసిన గూళ్లు, ఆహారం, నీళ్లు ఏర్పాటు చెయ్యాలి. –జేవీ రత్నం, వ్యవస్థాపకుడు, గ్రీన్ క్లైమేట్ సంస్థ పిచ్చుకల అవసరం ఎంతో ఉంది పెదవాల్తేరు (విశాఖ తూర్పు): పిచ్చుకలను పరరిక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుందని గ్రీన్ క్లైమేట్ సంస్థ వ్యవస్థాపకుడు జేవీ రత్నం, పేర్కొన్నారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం పురస్కరించుకుని శనివారం చినవాల్తేరులో గల –జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో గ్రీన్ క్లైమేట్ టీం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది పిచ్చుకల దినోత్సవం ఇతివృత్తం ‘నేను పిచ్చుకలను ప్రేమిస్తున్నాను’ నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా పలుదేశాలలో దినోత్సవాలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం జీ.కృష్ణవేణి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం వారు పిచ్చుకలను పరిరక్షిస్తామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. పిచ్చుకల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి పిచ్చుకల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలి. జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పిచ్చుకల వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. వాటికి నివాసయోగ్యంగా ప్రజలు సౌకర్యాలు కల్పించాలి. డోడో పక్షి అంతరిస్తే జరిగిన నష్టం మనం తెలుసుకున్నాం. అందుకే మన ఇంటి చుట్టు ఉన్న పిచ్చుకలను కాపాడుకోవాలి. పిచ్చుకలవల్ల మన ఇంటికి, వ్యవసాయానికి మేలుజరుగుతుంది. –ఈయూబీ రెడ్డి, విశ్రాంత ఆచార్యులు, పర్యావరణ విభాగం ఆహారం..నీరు అందించాలి పిచ్చుకలు అంతరించిపోతే పంటలకు హానికలుగుతుందని గ్రహించాలి. మనకు, పంటలకు హానికలిగించే క్రిమి కీటకాలను నివారించే సున్నితమైన పక్షి. మనం పిచ్చుక జాతిని పరిరక్షించుకోవాలి, పిచ్చుకల ఆవశ్యకతపై పిల్లలకు అవగాహన కల్పించాలి. వాటి మనుగడకు అవసరమైన గూళ్లు, ఆహారం, నీరు ఇంటి పరిసరాలలో అందుబాటులో ఉంచాలి. ఇతర జీవుల వల్ల వాటి సంతతికి నష్టం కలగకుండా చూడాలి. – హేమలత, జువాలజీ లెక్చరర్ సంతతి తగ్గుముఖం పిచ్చుకల సంఖ్య ఘనణీయంగా తగ్గిపోయింది. పిచ్చుకల సంతతి పెరిగేలా చేపట్టాల్సిన చర్యలపై భావితరాలకు అవగాహన కలి్పంచాలి. స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వేత్తలు పాఠశాలలు, కళాశాలల స్థాయిలో జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ, పిచ్చుకల ఆవశ్యకతపై అవగాహన కలి్పంచి వాటి పరిరక్షణలో భాగస్వామ్యం చెయ్యాలి. పిచ్చుకల రక్షణ బాధ్యత పూర్తిగా మనదే అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. – సుంకరి రామకృష్ణారావు, విశ్రాంత కులపతి, కృష్ణా యూనివర్సిటీ -
పిచుకా క్షేమమా..!
అది దొరకదు. కాని అది ఉంటుంది. మనం ఇల్లు కట్టుకుంటే హక్కుగా వచ్చి దాని ఇల్లు కట్టుకుంటుంది. మనం ఒండుకుని తింటాం. రాలినవి అవి ఏరుకుని తింటుంది. వాసాల మీద వాలుతుంది. వసారాపై వాలుతుంది. బల్బ్ మీద కూచుంటుంది. నీళ్ల తొట్టి అంచు మీద ఆలోచిస్తుంది. అది మనల్ని పట్టించుకుంటుంది. అసలు మనల్నే మర్చిపోతుంది. మనిషిది కూడా పిచ్చుక ప్రాణమే. కాని ఆ పిచ్చుక ప్రాణానికి ఈ పిచుక చేసే పిచ్చిపనులే ప్రమాదం. పిల్లల కథల్లో, పాటల్లో, సామెతల్లో, పలుకుబడుల్లో, సినిమాల్లో పిచ్చుక లేకుండా ఎలా ఉంటుంది. పిచ్చుక లేకపోతే మనం ఉండగలమా? రాసుకోవద్దూ ఇవాళ దాని గురించి? ‘గురి తప్పిన బాణం వలే తిరుగాడింది పిచ్చుక’ అని రాశాడు ఒక తెలుగు కవి. గదిలోకి దూసుకు వచ్చిన పిచ్చుక ఒక్క క్షణం ఎక్కడికొచ్చానా అని తొట్రుపడి గురి తప్పిన బాణంలా గిరికీలు కొట్టి మళ్లీ బయటకు బుర్రున ఎగిరిపోయిన దృశ్యం ఆ వాక్యం చదవగానే కళ్ల ముందు మెదులుతుంది. నిజానికి ‘పిచ్చుక’ అనగానే దృశ్యాలు, జ్ఞాపకాలు, బాల్యాలు చుట్టుముట్టనిది ఎవరికి? చిలుకలు ఎప్పుడో కాని రావు. కాకులు వచ్చినా మనకు నచ్చవు. నెమళ్లు ఎక్కడుంటాయో తెలియదు. గద్దలు ప్రమాదం. పావురాళ్లు గుళ్లను మసీదులను ఇష్టపడతాయి. మరి మన ఇళ్లకి ఎవరు రావాలి? పిచ్చుకమ్మే. అది తానుగా వచ్చి లేదా మగనితో వచ్చి వరండా లో కిచకిచమని, వడ్లను పొడిచి తిని, అద్దంలో ముఖం చూసుకొని, అమ్మ చేటలో బియ్యం ఏరుతూ ఉంటే దూరాన నేల మీద గెంతుతూ ఉండి విసిరిన నూకలను నోట కరుచుకుని, బావి గట్టు మీద వాలి, గిలక మీద కాళ్లు పెట్టి, బిందె పెట్టి పెట్టి లోతుకు పోయిన సిమెంటు గుంటలో నిలిచిన నీళ్లలో స్నానాలాడి... ఈ పిచ్చుకలే కదా జీవన లిప్తలను ఇస్తాయి ఇచ్చాయి అందరికీ. అందుకే అవంటే అందరికి ఇష్టం. కసురుకోవడానికి ఇష్టపడని స్నేహం. గమనించండి అప్పటికీ ఇప్పటికీ ఎవరూ పిచ్చుకలను కసురుకోరు. అవి వస్తే ఆనందం. వచ్చి వెళ్లిపోయినా ఆనందమే. అంటీ ముట్టని చుట్టం... పిచ్చుక మనిషితోనే ఉంది. మనిషితోనే ఉంటుంది. కాని అంటదు. ముట్టదు. అంటినా ముట్టినా సహించదు. మనిషి ఆవాసాల్లోనే అది గూడు కట్టుకుంటుంది. పూరి గుడిసెల వసారాల్లో, మిద్దిళ్ల వాసాల్లో ఉండే ఖాళీల్లో, వాకిలి పైన, సీలింగ్ ఫ్యాన్ పైడొప్పలో, వెంటిలేటర్లలో, ఓపెన్ షెల్ఫ్‌లలో, బావి లోపలి గోడల్లో ఉండే రంధ్రాల్లో అవి గూడు కట్టుకుంటాయి. గడ్డి వాటి గూడుకు ముఖ్యమైన మెటీరియల్. లేకుంటే పుల్లలు పుడకలూ ఎలాగూ సేకరిస్తాయి. పిచ్చుకల గూళ్లను భారతీయులు ఏ కోశానా కూల్చరు. కూల్చడం పాపం అనుకుంటారు. వాటిలోకి తొంగి చూడటం వాటికి పుట్టిన పిల్లలను తాకడం చేయరు. అలా చేయడాన్ని పిచ్చుకలు నచ్చవు. పొదగడానికి పెట్టిన గుడ్లను తాకితే అవి వాటిని పొదగవని పిల్లలకు చెబుతారు. పిచ్చుకలు మనుషుల్లానే కుటుంబానికి విలువ ఇస్తాయి. ఆడ, మగ కలిసి కష్టపడి గూడు కట్టి పిల్లలను సాకి సంతరిస్తాయి. అందుకని కూడా మనవాళ్లకు అవంటే ఇష్టం. మగపిచ్చుక కొంచెం బొద్దుగా ఉంటే ఆడ పిచ్చుక సన్నగా స్పీడుగా ఉంటుంది. అవి రెండు ఏమిటేమిటో మాట్లాడుకుంటూ ఉంటాయి. వాటి మాటలు వినడం ఎవరికైనా సరే బాగుంటుంది. పిచ్చుకలు మూడేళ్లు బతుకుతాయి. కాని అవి ఆ మూడేళ్లను సంపూర్తిగా జీవిస్తాయి. బద్దకించవు. మెల్లగా ఉండవు. ఉత్సాహం మానుకోవు. ఎప్పుడూ బతుకు మీద ఆశతో మన బతుకు మనం బతుక్కుందాం అన్నట్టుగా ఉంటాయి. మనుషులు తినేవి కొన్ని అవి తింటాయి. అవి తినేవి కొన్ని వాటికి దొరుకుతాయి. ఇప్పుడు మనుషులు తినేవి కొన్ని వాటికి విషపూరితం. అవి తినే పురుగులు కూడా విషపూరితమైపోతున్నాయి. కథల్లో పలుకుబడిలో.... కథల్లో పిచ్చుక ఉంటే పిల్లలకు ఇష్టం. పసిపిల్లలకు గోరుముద్దలు తినిపించేటప్పుడు ‘ఇది కాకమ్మ ముద్ద... ఇది పిచ్చుకమ్మ ముద్ద’ అని తినిపిస్తారు. కొన్ని పిచ్చుక లు కథల్లో భలే తెలివి చూపిస్తాయి. కొన్ని నవ్విస్తాయి. కాకి ఉప్పుతో మేడ కట్టుకుందట, పిచ్చుక పుల్లలతో కట్టుకుందట. కాకి పిచ్చుకను చూసి ఎగతాళి చేసిందట. కాని వానొస్తే ఏముంది? ఉప్పు కరిగి కాకి దిక్కులేనిది అయ్యింది. పిచ్చుక మాత్రం వెచ్చగా తన బిడ్డలను జవురుకొని నిద్రపోయింది. పిచ్చుక సోషలిస్టు. దానికి ఎంత కావాలో అంతే తిని ఎగిరిపోతుంది. ఆశ చాలా చెడ్డది అని చెబుతుంది. గిన్నెలో మరికొన్ని గింజలను వదలడం దానికి ఇష్టం. అందుకే పల్లీయులు దానిని చేరదీస్తారు. వసారాల్లో వరి కంకులనో జొన్న కంకులనో వేళ్లాడగడతారు. అవి వచ్చి తింటే ఆ తృప్తి వేరు. ‘పిచ్చుక మొడితే మంచిది’ అని పల్లెల్లో అనుకుంటారు. అది మొట్టడం అరుదు. ‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం’ మూర్ఖత్వం పాపం అనుకుంటారు. మనుషుల్లో అలాంటి అల్పప్రాణి కనిపిస్తే కనికరించాలని పిచ్చుకను చూసి నేర్చుకున్నారు. బంగారు బాతులాగే బంగారు పిచ్చుక కూడా పోలికకు వాడతారు. ‘కాకమ్మ పిచుకమ్మ కబుర్లు’ అంటారు కాని ఉద్దేశాలు లేని హాౖయెన కబుర్లు చెప్పుకుంటే మంచిది కదా పిచ్చుకమ్మల్లాగా. అపాయం తడి చెత్త, పొడి చెత్త అని అన్నీ కవర్లలో పెట్టి పారేస్తున్నాం. బావి దగ్గర గిన్నెలు కడిగి మెతుకులు నేలన పడేసేది లేదు. బియ్యం ఏరేది లేదు. అందులో నూకను పారేసేది లేదు. శ్లాబ్ వేసి ఇళ్లు కట్టుకుంటున్నాం. కిటికీలు తెరవకుండా మూసేస్తున్నాం. బోర్లు చల్లదనాన్ని ఇవ్వవు... స్థలాన్నీ ఇవ్వవు. ఫ్యాక్టరీల ద్వారా, కార్ల ద్వారా, ఏసిల ద్వారా, ఫోన్ల ద్వారా గాలిలో హానికారమైన రసాయనాలను తరంగాలను వదులుతున్నాం. తిండి గింజల పంటలకు బదులు వ్యాపార పంటలు వేసి పిచ్చుకలు ఎంత దూరం ఎగిరినా ఏమీ దొరకని స్థితి తెస్తున్నాం. వాటిపై కొట్టిన రసాయనాలు తిని చచ్చిన పురుగులను తిని పిచ్చుకలు చచ్చిపోతున్నాయి. పిచ్చుకది పిచ్చుక ప్రాణం. తట్టుకోలేదు. అందుకే రచయితలు ‘చివరి పిచ్చుక’ అని కథలు కూడా రాశారు. పర్యావరణకారులు పిచ్చుకలను ఆదరించడానికి గూళ్లను ఏర్పాటు చేసే ప్రచారం చేస్తున్నారు. వాటికి కావాల్సిన గింజలు పెట్టమని, నీళ్లు పెట్టమని చైతన్యం కలిగిస్తున్నారు. రేడియేషన్ లేకుండా సెల్‌టవర్లను తగ్గించాలని ‘రోబో2.ఓ’ వంటి సినిమాలే వచ్చాయి. ఎంత పెద్ద భవంతి ఉన్నా దాని బాల్కనీలో మొక్కలు ఆ నీటి కుండీ పక్కన వాలేందుకు పిచ్చుకలు లేకపోతే ఆ సంపదకు అర్థమేమిటి? ఒక చిన్ని బుజ్జి పిచ్చుక ఉదయాన్నే ‘ఎలావున్నావమ్మా వొదినా’ అని ఇంట్లోకి వచ్చి నిద్ర లేపేలా మన పరిసరాలు, ఊరు, నేల, భూగోళం ఉండాలని కోరుకొని ఆ విధంగా ఉండేలా ప్రయత్నించకపోతే మనం ఎలా ఉంటున్నట్టు. ఆలోచిద్దాం ఇవాళ్టి నుంచైనా. బయట ఎండగా ఉన్నట్టుంది.. వెళ్లి కొంచెం పిచ్చుకలకు గింజలు, నీళ్లు పెడదాం పదండి. – సాక్షి ఫ్యామిలీ -
ది లాస్ట్ స్పారో
చిన్నతనంలో పిచ్చుక కనిపిస్తే మచ్చిక చేసుకోవాలన్న ఉబలాటం. అది అందీ అందకుండా తుర్రుమంటుంటే... దాంతో మనసూ ఉరకలేసేది. మరి ఇప్పుడో... ఆ పిచ్చుకలు లేక ఇంటి చూరు చిన్నబోతోంది. తన జ్ఞాపకాలతో చేదబావి బోరుమంటోంది. ఆ పికిలి పిట్టల పాదముద్రల కోసం పచ్చని చెట్లు సైతం పరితపిస్తున్నాయి. ఇప్పటి తరానికి పిచ్చుకను చూపించాలంటే గూగుల్‌ను ఆశ్రయించాల్సిందే! ఆ పిచ్చుకల కిచకిచను వినిపించాలంటే పాత టేపుల దుమ్ము దులపాల్సిందే! నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సంద ర్భంగా... - శిరీష చల్లపల్లి మనసుకు ఉల్లాసాన్నిచ్చే ప్రకృతిలో పక్షులది మొదటిస్థానం. కిచకిచమంటూ ఇంటి చూరు చుట్టూ తిరిగే పిచ్చుకలంటే ఇష్టపడనివారుండరు. గడ్డిపోచలతో అవి గూళ్లు కడుతుంటే చూడటం, గుడ్లు పెట్టాక వాటిని లెక్కపెట్టడం, ఆహారం తెచ్చి పిల్లలకు పెడుతుంటే చూసిన ఆనందం, పిచ్చుక గూడు కూలినప్పుడు... కుమిలి ఏడ్చిన అనుభవం, వ్యవసాయంలో పురుగుల మందుల వాడకం, వాతావరణంలో మార్పులు... ఏవైతేనేం పిచ్చుకలు ఎగిరిపోయాయి. అవి అల్లుకున్న గూళ్లూ చెదిరిపోయాయి. నిరాటంకంగా సాగుతున్న చెట్ల నరికివేత, తరుగుతున్న అడవులు, సెల్ టవర్ల రేడియేషన్... ఆ చిన్ని పక్షుల ఉసురు తీస్తున్నాయి. ఫలితంగా పిచ్చుకలు అంతరిస్తున్న పక్షుల జాబితాలోకి చేరుతున్నాయి. అయితే, మించిపోయిందేమీ లేదు.. ఇప్పటికైనా నిద్రలేచి పర్యావరణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే పిచ్చుకలను కాపాడుకోవచ్చంటున్నారు ఏఆర్‌పీఎఫ్ ఫౌండర్ నిహార్. మనమే కాపాడాలి... ‘సిటీలో పిచ్చుకలకే కాదు... 28 రకాల ఇతర జాతి పక్షుల మనుగడకు భారీ ముప్పు వాటిల్లుతోంది. పొల్యూషన్ వల్ల పిచ్చుకలకు ప్రధాన ఆహారమైన క్రిమికీటకాలు చనిపోతున్నాయి. నగరమంతా కాంక్రీట్ బిల్డింగ్స్ నిండి... చెట్లు లేకుండా పోవడంతో పిచ్చుకలు కూడా లేకుండా పోతున్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోగలిగితే... వాటిని కొంతమేరకైనా రక్షించుకోగలిగినవారమవుతాం. సరదాగా ఓ హాబీలాగా పనికిరాని చెక్కముక్కలు, అట్టముక్కలను గూడులాగా తయారు చేసి... ఆ బాక్సులను బంధుమిత్రులు, స్నేహితులు, ఇరుగుపొరుగుకు ఇవ్వండి. ఇంటిబయట వెంటిలేటర్కో, కిటికీల మీద పెట్టడమో, ఇంటి ముందు చెట్ల కొమ్మలకు కట్టడమో చేయమనండి. ఒక్క పిచ్చుకలకే కాదు... ఇతర పక్షుల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలి. మొక్కలు నాటమని చెప్పడం కాకుండా.. గిఫ్ట్‌గా మొక్కలనే ఇవ్వాలి. సజ్జలు, నూకలు, జొన్నలు వంటి చిరుధాన్యాలని కూడా డాబాలపైన వెదజల్లండి. చిన్నచిన్న పాత్రల్లో వాటికి నీళ్లు పోసి ఉంచండి. ఇలాంటి చిన్నచిన్న పనులతో పర్యావరణాన్ని కాపాడితే మనతోపాటు పిచ్చుకలకూ బతుకునిచ్చినట్లవుతుంది. బయోడైవర్సిటీని కొంతైనా కాపాడినవారమవుతాం’ అని చెబుతున్నారు వాయిస్‌లెస్ బర్డ్స్ అండ్ యానిమల్స్ కోసం వాయిస్‌గా మారిన నిహార్. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం 9:00 గంటల నుండి 11:00 గంటల వరకు జలగం వెంగళరావు పార్క్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
పక్షి వెంట ప్రయాణం...
నేడు వరల్డ్ స్పారో డే! వేకువజామున మనల్ని మేల్కొల్పడానికి ‘కిచ్..కిచ్..’ మంటూచెట్ల కొమ్మల్లో సందడి మొదలవుతుంది. ఆ సుమధుర గాన ం చేసేది ఎవరో కాదు... చిలకమ్మలు, పిచుకమ్మలు, కాకమ్మలు.. ఇంకా ఎన్నో.. ఎన్నెన్నో... వందల, వేల సంఖ్యలో పక్షిరాజాలు. మనిషిగా మనమేంటో తెలుసుకోవాలంటే రకరకాల పక్షుల వెంట మనమూ ప్రయాణించాలి. ‘వరల్డ్ స్పారో డే’ సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసం... - నిర్మలారెడ్డి చిట్టి చిట్టి ముక్కులతో పక్షులు పొడుచుకుని తినే పండ్లను రసాయనాలమయం చేసేశాం. గింజలను వాటి నోటికి అందకుండా కాంక్రీట్ వనాలను నిర్మించుకున్నాం. మనం కట్టుకున్న ఇంటి చూరును తన నివాసంగా మలుచుకున్న పక్షిని ఆధునికత పేరుతో వెళ్లగొట్టాం. అందుకే పక్షికి-మనకు అంతరం పెరిగిపోతోంది. ఆ విధంగా ప్రకృతికి - మనకు దూరం పెరిగిపోయింది. మనమే రప్పిద్దాం... భరించలేనన్ని ఒత్తిడులు, అనారోగ్యాలు, ఆందోళనలు ప్రకృతితో మమేకం కాకపోవడంతో వచ్చిన చిక్కులు. మనమే ఏర్పరుచుకున్న అంతరాలను మనమే చెరిపేసుకోవాలంటే పక్షిని వెతుక్కుంటూ మనమే బయల్దేరాలి. పక్షి మన ఇంటి చూరులో గూడుకట్టుకునే నమ్మకాన్ని మనమే పెంచాలి. కాలుష్యకారకాలను నిరోధించాలి. మన ఊరు చెరువు నుంచి మొదలైన ఆ ప్రయాణం పట్టణాల హద్దులు దాటి ప్రయాణి స్తూ పక్షి రెక్కల చప్పుడు వినడానికి ఇప్పుడే సిద్ధమైపోవాలి. తెలుగు రాష్ట్రాలలో... పక్షుల సౌందర్యాన్ని తిలకించడానికి మన దగ్గర అద్భుతమైన సహజసిద్ధ వనాలు, సరస్సులు, నదీ తీరాలు ఉన్నాయి. మనకు లేనిదల్లా అవి కాలుష్యానికి లోనుకాకుండా చూడాల్సిన బాధ్యత. మన దగ్గర వలస పక్షులకు విడిదిగా ఉన్న ప్రాంతం కొల్లేరు. ఈ పక్షి కేంద్రం పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరుకు దగ్గరలో ఉంది. కొల్లేరు చెరువు నీటిలో ఓలలాడే పక్షులు, అక్కడి చెట్లపై కనులకు విందు చేసే పక్షులు ఎన్నో. అలాగే కర్నూలు జిల్లాలో నందికొట్కూరుకు దగ్గర గల రోళ్లపాడు పక్షి కేంద్రం అద్భుతమైన పక్షివిహారానికి పెట్టింది పేరు. కర్నూలు నుంచి బస్సు సదుపాయమూ ఉంది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలోని నేలపట్టు నీటి పక్షులకు ఆవాసం. ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరంలోనే సూళ్లూరుపేటలో రైల్వేస్టేషన్ ఉంది. తెలంగాణలో మంజీర పక్షి కేంద్రం మెదక్‌జిల్లా సంగారెడ్డికి దగ్గరలో ఉంది. హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి బస్సు సదుపాయాలూ ఉన్నాయి. అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఎన్నో వలసపక్షులు, మనవైన జాతి పక్షుల గుంపులతో ఈ ప్రాంతాలన్నీ కళకళలాడుతుంటుంటాయి. భారతావనిలో... ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌లో ప్రత్యేకమైన పక్షులకు భరత్పూర్ పక్షి కేంద్రం పెట్టింది పేరు. ప్రపంచంలోనే అతి గొప్ప పక్షి కేంద్రాలలో ఇది పేరెన్నికగన్నది. హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్ జిల్లాలో సుల్తాన్పూర్ పక్షి కేంద్రం వన్యప్రాణులకు, రాబందులకు పెట్టింది పేరు. స్థానిక పక్షుల అందాలను తిలకించాలంటే మాత్రం గోవాలోని సలీమ్ అలీ పక్షి కేంద్రాన్ని సందర్శించాల్సిందే! ప్రకృతి సోయగాలకే కాదు, పక్షుల ఆవాసాలకు నిలయమైన ప్రాంతం కేరళ. ఇక్కడ కుమరకోమ్ పక్షి కేంద్రంలో వందల రకాల పక్షులు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఇదేవిధంగా కర్నాటకలో కావేరీ నదీ తీరాన మైసూరుకు 20 కిలోమీటర్ల దూరంలో రంగనాథిట్టు పక్షి కేంద్రం చూడముచ్చట గొలుపుతుంది. అస్సాంలోని కజిరంగా, అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఈగల్ నెస్ట్ పక్షి కేంద్రాలకు పెరెన్నికగన్నవి. ప్రతి రాష్ట్రానికి నాలుగైదు పక్షి కేంద్రాలు ప్రత్యేకంగా ఉన్నాయి. గుజరాత్‌తో పాటు ఉత్తరాది రాష్ట్రాల పర్యాటకశాఖలు పక్షి విహారాన్ని ప్రోత్సహిస్తూ ప్రత్యేక ప్యాకేజీలను కూడా అందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో పక్షి కేంద్రాలు అధిక సంఖ్యలో ఉన్నా ఈ సౌలభ్యం మాత్రం ఇంకా అందుబాటు లోకి రాలేదు. పిల్లలకోసం పక్షి లోకం... ముందుతరాలలో ప్రకృతిని, తద్వారా పక్షులను కాపాడాలనే ఆలోచనను పెంపొందించాలంటే ముందుగా వారికి పక్షి లోకాన్ని పరిచయం చేయాలి. వీడియోగేమ్‌లు, పుస్తకాలతో కిక్కిరిసిన చిన్నారి బుర్రలను ప్రకృతితో మమేకం చేయాలంటే ‘పక్షి’ ఒక మంచి సాధనం. కొత్త కొత్త పక్షుల గురించి, వాటి పేర్లు, జీవనశైలి గురించి తెలుసుకుంటున్నకొద్దీ వారి మెదళ్లు చురుకుగా మారుతాయి. పక్షుల పేర్లు, వాటి వివరాలు ఎక్కువగా లాటిన్ భాషలో లభిస్తాయి. ఆ విధంగా కొత్త భాషను నేర్చుకునే సౌలభ్యమూ ఉంటుంది. పక్షులను వెతుక్కుంటే వెళ్లే క్రమంలో కాళ్లకు పని పెరుగుతుంది. ఫలితంగా శరీరానికి మంచి వ్యాయామం కలిగి, అధిక బరువు సమస్యే దరిచేరదు. ప్రకృతికి దగ్గరగా ఉండటం వల్ల ఆరోగ్యప్రాప్తి కలుగుతుంది.