పక్షి వెంట ప్రయాణం...
నేడు వరల్డ్ స్పారో డే!
వేకువజామున మనల్ని మేల్కొల్పడానికి ‘కిచ్..కిచ్..’ మంటూచెట్ల కొమ్మల్లో సందడి మొదలవుతుంది. ఆ సుమధుర గాన ం చేసేది ఎవరో కాదు... చిలకమ్మలు, పిచుకమ్మలు, కాకమ్మలు.. ఇంకా ఎన్నో.. ఎన్నెన్నో... వందల, వేల సంఖ్యలో పక్షిరాజాలు. మనిషిగా మనమేంటో తెలుసుకోవాలంటే రకరకాల పక్షుల వెంట మనమూ ప్రయాణించాలి. ‘వరల్డ్ స్పారో డే’ సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసం...
- నిర్మలారెడ్డి
చిట్టి చిట్టి ముక్కులతో పక్షులు పొడుచుకుని తినే పండ్లను రసాయనాలమయం చేసేశాం. గింజలను వాటి నోటికి అందకుండా కాంక్రీట్ వనాలను నిర్మించుకున్నాం. మనం కట్టుకున్న ఇంటి చూరును తన నివాసంగా మలుచుకున్న పక్షిని ఆధునికత పేరుతో వెళ్లగొట్టాం. అందుకే పక్షికి-మనకు అంతరం పెరిగిపోతోంది. ఆ విధంగా ప్రకృతికి - మనకు దూరం పెరిగిపోయింది.
మనమే రప్పిద్దాం...
భరించలేనన్ని ఒత్తిడులు, అనారోగ్యాలు, ఆందోళనలు ప్రకృతితో మమేకం కాకపోవడంతో వచ్చిన చిక్కులు. మనమే ఏర్పరుచుకున్న అంతరాలను మనమే చెరిపేసుకోవాలంటే పక్షిని వెతుక్కుంటూ మనమే బయల్దేరాలి. పక్షి మన ఇంటి చూరులో గూడుకట్టుకునే నమ్మకాన్ని మనమే పెంచాలి. కాలుష్యకారకాలను నిరోధించాలి. మన ఊరు చెరువు నుంచి మొదలైన ఆ ప్రయాణం పట్టణాల హద్దులు దాటి ప్రయాణి స్తూ పక్షి రెక్కల చప్పుడు వినడానికి ఇప్పుడే సిద్ధమైపోవాలి.
తెలుగు రాష్ట్రాలలో...
పక్షుల సౌందర్యాన్ని తిలకించడానికి మన దగ్గర అద్భుతమైన సహజసిద్ధ వనాలు, సరస్సులు, నదీ తీరాలు ఉన్నాయి. మనకు లేనిదల్లా అవి కాలుష్యానికి లోనుకాకుండా చూడాల్సిన బాధ్యత. మన దగ్గర వలస పక్షులకు విడిదిగా ఉన్న ప్రాంతం కొల్లేరు. ఈ పక్షి కేంద్రం పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరుకు దగ్గరలో ఉంది. కొల్లేరు చెరువు నీటిలో ఓలలాడే పక్షులు, అక్కడి చెట్లపై కనులకు విందు చేసే పక్షులు ఎన్నో. అలాగే కర్నూలు జిల్లాలో నందికొట్కూరుకు దగ్గర గల రోళ్లపాడు పక్షి కేంద్రం అద్భుతమైన పక్షివిహారానికి పెట్టింది పేరు. కర్నూలు నుంచి బస్సు సదుపాయమూ ఉంది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలోని నేలపట్టు నీటి పక్షులకు ఆవాసం. ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరంలోనే సూళ్లూరుపేటలో రైల్వేస్టేషన్ ఉంది. తెలంగాణలో మంజీర పక్షి కేంద్రం మెదక్‌జిల్లా సంగారెడ్డికి దగ్గరలో ఉంది. హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి బస్సు సదుపాయాలూ ఉన్నాయి. అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఎన్నో వలసపక్షులు, మనవైన జాతి పక్షుల గుంపులతో ఈ ప్రాంతాలన్నీ కళకళలాడుతుంటుంటాయి.
భారతావనిలో...
ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌లో ప్రత్యేకమైన పక్షులకు భరత్‌పూర్ పక్షి కేంద్రం పెట్టింది పేరు. ప్రపంచంలోనే అతి గొప్ప పక్షి కేంద్రాలలో ఇది పేరెన్నికగన్నది. హర్యానా రాష్ట్రంలోని గుర్‌గావ్ జిల్లాలో సుల్తాన్‌పూర్ పక్షి కేంద్రం వన్యప్రాణులకు, రాబందులకు పెట్టింది పేరు. స్థానిక పక్షుల అందాలను తిలకించాలంటే మాత్రం గోవాలోని సలీమ్ అలీ పక్షి కేంద్రాన్ని సందర్శించాల్సిందే! ప్రకృతి సోయగాలకే కాదు, పక్షుల ఆవాసాలకు నిలయమైన ప్రాంతం కేరళ. ఇక్కడ కుమరకోమ్ పక్షి కేంద్రంలో వందల రకాల పక్షులు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఇదేవిధంగా కర్నాటకలో కావేరీ నదీ తీరాన మైసూరుకు 20 కిలోమీటర్ల దూరంలో రంగనాథిట్టు పక్షి కేంద్రం చూడముచ్చట గొలుపుతుంది. అస్సాంలోని కజిరంగా, అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఈగల్ నెస్ట్ పక్షి కేంద్రాలకు పెరెన్నికగన్నవి. ప్రతి రాష్ట్రానికి నాలుగైదు పక్షి కేంద్రాలు ప్రత్యేకంగా ఉన్నాయి. గుజరాత్‌తో పాటు ఉత్తరాది రాష్ట్రాల పర్యాటకశాఖలు పక్షి విహారాన్ని ప్రోత్సహిస్తూ ప్రత్యేక ప్యాకేజీలను కూడా అందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో పక్షి కేంద్రాలు అధిక సంఖ్యలో ఉన్నా ఈ సౌలభ్యం మాత్రం ఇంకా అందుబాటు లోకి రాలేదు.
పిల్లలకోసం పక్షి లోకం...
ముందుతరాలలో ప్రకృతిని, తద్వారా పక్షులను కాపాడాలనే ఆలోచనను పెంపొందించాలంటే ముందుగా వారికి పక్షి లోకాన్ని పరిచయం చేయాలి. వీడియోగేమ్‌లు, పుస్తకాలతో కిక్కిరిసిన చిన్నారి బుర్రలను ప్రకృతితో మమేకం చేయాలంటే ‘పక్షి’ ఒక మంచి సాధనం. కొత్త కొత్త పక్షుల గురించి, వాటి పేర్లు, జీవనశైలి గురించి తెలుసుకుంటున్నకొద్దీ వారి మెదళ్లు చురుకుగా మారుతాయి. పక్షుల పేర్లు, వాటి వివరాలు ఎక్కువగా లాటిన్ భాషలో లభిస్తాయి. ఆ విధంగా కొత్త భాషను నేర్చుకునే సౌలభ్యమూ ఉంటుంది. పక్షులను వెతుక్కుంటే వెళ్లే క్రమంలో కాళ్లకు పని పెరుగుతుంది. ఫలితంగా శరీరానికి మంచి వ్యాయామం కలిగి, అధిక బరువు సమస్యే దరిచేరదు. ప్రకృతికి దగ్గరగా ఉండటం వల్ల ఆరోగ్యప్రాప్తి కలుగుతుంది.