Natural Resource
-
వొద్దు అన్నోళ్లే వావ్ అంటున్నారు!
సునీత ఐపీఎస్ అవ్వాలనుకున్నారు. అమ్మా నాన్నా చనిపోయిన నేపథ్యంలో ఎంబీఏ చదువుకొని హైదరాబాద్‌లో కొంతకాలం ప్రైవేటు ఉద్యోగం చేశారు. రసాయనిక అవశేషాలున్న ఆహారం, వాయుకాలుష్యం కారణంగా అనారోగ్యం పాలయ్యారు. సొంతూరుకు తిరిగొచ్చి.. వారసత్వంగా సంక్రమించిన మూడెకరాల బంజరు భూమిని చదును చేసి మాగాణిగా మార్చి.. గత మూడేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరి సాగు చేస్తున్నారు. సులువుగా బ్యాంకు రుణాలివ్వడంతోపాటు.. చిన్న కమతాల మహిళా రైతులు స్వయంగా ఉపయోగించుకోగలిగేలా పవర్ టిల్లర్లను, కలుపుతీత యంత్రపరికరాలను ప్రత్యేకంగా రూపొందించి అందించడానికి ప్రభుత్వం, శాస్త్రవేత్తలు కృషి చేయాలని ఆమె కోరుతున్నారు. ‘ఇదో పిచ్చిది, దీనికేం పనిలేదు..హైద్రాబాద్‌లో మంచిగా ఉద్యోగం చేసుకోక, ఇక్కడ వ్యవసాయం చేస్తానని వచ్చింది. మాతోని కానిది గీ పిల్లతో ఏం అయితది..’ అని కొందరు గ్రామస్తులు ముఖం మీదే చెప్పినా సునీత అధైర్య పడలేదు. పట్టుదల పెంచుకుంది. స్కూటీపై ఇంటి నుంచి రోజూ పొలం వద్దకు వెళ్లి జీవామృతంతో మంచి దిగుబడులు సాధిస్తున్నారు. దీంతో, గ్రామరైతులు సునీతను చూసి ఆశ్చర్యపడుతున్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని ముక్కెట్రావుపేట గ్రామానికి చెందిన సింగరేణి ఉద్యోగి కొప్పుల ధర్మయ్య, శాంతమ్మల ఏడుగురు సంతానంలో చివరి సంతానం సునీత(30). తోడబుట్టిన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. హైద్రాబాద్‌లో ఎంబిఎ వరకు చదివారు. ఐపీఎస్ అధికారి కావాలన్నది ఆమె కల. కానీ, తల్లీదండ్రులు కాలం చేశారు. కుటుంబ పరిస్థితులు కలసి రాలేదు. ఆ నేపథ్యంలో హైదరాబాద్‌లోనే ప్రైవేటు ఉద్యోగంలో చేరారు. వచ్చే జీతం ఖర్చులకు సరిపోయేవి. కానీ, ఏదో తెలియని వెలితి. హాస్టల్లో అంతా రసాయనిక అవశేషాలున్న ఆహారమే. దీనికి వాయుకాలుష్యం తోడుకావడంతో అనారోగ్యం పాలయ్యారు. మందులు వాడుతున్నా ఆరోగ్యం మరింత దిగజారింది. బంజరును మాగాణిగా మార్చి.. ఈ నేపథ్యంలో ఐదారేళ్ల క్రితం సునీత దసరా పండుగకు సొంతరు వెళ్లారు. పచ్చని పొలాలు, బంధుమిత్రుల అనుబంధాలు కాలుష్యం లేని గ్రామీణ వాతావరణం ఆమెను కట్టిపడేసాయి. ఆ విధంగా సొంత ఊరులోనే జీవనాన్ని సాగించాలని ఆమె నిర్ణయించుకున్నారు. అక్కడుండి ఏమి చేయాలో పాలుపోలేదు. చేతిలో డబ్బు లేదు కానీ.. తండ్రి సంపాయించిన 3 ఎకరాల భూమి మాత్రం ఉంది. అది రాళ్లు, రప్పలతో నిరూపయోగంగా ఉన్న బంజరు భూమి. వ్యవసాయాన్నే వృత్తిగా చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే, వ్యవసాయంలో ఆమెకు ఓనమాలు తెలియదు. అయినా, సంకల్పంతో ముందడుగు వేశారు. సంప్రదాయ దుస్తులు వదిలేసి.. ప్యాంటు, షర్ట్ ధరించి భూమిలోకి కాలు పెట్టింది. గ్రామస్తుల ఎగతాళి మాటలు ఆమె పట్టుదల ముందు ఓడిపోయాయి. స్నేహితులు ఇచ్చిన తోడ్పాటుతో నిధులు సమకూర్చుకొని రూ 3.50 లక్షల ఖర్చుతో నిరూపయోగంగా ఉన్న భూమిని చదును చేయించి, మాగాణి పొలంగా ఉపయోగంలోకి తీసుకువచ్చారు. భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ‘సాగుబడి’ కథనాల స్ఫూర్తితో.. ‘సాక్షి’లో ‘సాగుబడి’ కథనాల ద్వారా, యూట్యూబ్ వీడియోల ద్వారా సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయం గురించి సునీత తెలుసుకొని ఆ దిశగా అడుగులు వేశారు. పాలేకర్ శిక్షణా శిబిరాలకు హాజరయ్యారు. పాలేకర్ పుస్తకాలు, ‘గడ్డిపరకతో విప్లవం’ వంటి పుస్తకాలు చదివి.. ప్రకృతికి వ్యవసాయానికి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని, రసాయనాలతో అనర్థాలను అర్థం చేసుకున్నారు. 2016 ఖరీఫ్ నుంచి ప్రకృతి వ్యవసాయ పద్దతిలో మూడు ఎకరాల్లో వరి సాగు చేయడం ప్రారంభించారు. ఆవును సమకూర్చుకొని జీవామృతం, ఘనజీవామృతం స్వయంగా తయారు చేసుకొని వాడుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్‌ను మోటారుతో తోడుకొని ఏటా రెండు పంటలూ సాగు చేస్తున్నారు. పొలం దున్నేటప్పుడు ఆవుల పేడను పొలమంతా చల్లటం, నాటు వేసే సమయంలో ఘనజీవామృతాన్ని అందించింది. తర్వాత, నాటు వేసి జీవామృతాన్ని ప్రతి 20 రోజులకొకసారి పొలానికి అందిస్తున్నారు. ఎకరానికి రూ. 2 లక్షల నికరాదాయం వచ్చే ఖరీఫ్ నుంచి పాలేకర్ ఐదంస్థుల సాగు చేపట్టి, క్రమంగా కొన్ని సంవత్సరాల్లో తన 3 ఎకరాలను జీవవైవిధ్యంతో కూడిన ఆహార అడవిగా మార్చుకోవాలని సునీత కృతనిశ్చయంతో ఉన్నారు. ఎకరానికి తొలి ఏడాది 28 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రస్తుతం బీపీటీ రకాన్ని మూడు ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఎకరానికి 33 బస్తాల వరకు దిగుబడి రావచ్చని ఆశిస్తున్నారు. ఎకరానికి రెండు పంటలు కలిపి రూ. 2 లక్షల మేరకు నికరాదాయం వస్తున్నదన్నారు. సామాజిక సేవ ప్రజల ఆరోగ్యం రైతుల చేతుల్లోనే ఉందని నమ్మే సునీత.. రైతులు విపరీతంగా రసాయనిక ఎరువులు, పురుగుమందులు వేయడం వల్ల సమాజం అనారోగ్యకరంగా మారే ప్రమాదం ఉందంటారు. పరిసర గ్రామాల్లో రైతులకు ప్రకృతి వ్యవసాయం నేర్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నానని తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజంతో పాటు, అవినీతి లేని సమాజాన్ని నిర్మించడంలోనూ రైతులు తమదైన పాత్ర నిర్వహించాలన్నది ఆమె భావన. ఎవరికి అన్యాయం జరిగిందని తెలిసినా వారికి అండగా నిలుస్తున్నారు. స్వయానా తన అన్న ఆ గ్రామ సర్పంచ్‌గా అవినీతికి పాల్పడ్డాడంటూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి, అతని చెక్ పవర్‌ను రద్దు చేయించటం సునీత చిత్తశుద్ధికి నిదర్శనం. – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్, ఫొటోలు: ఎలేటి శైలేందర్ రెడ్డి సులభ రుణాలు, మహిళలు నడపగలిగే ప్రత్యేక పవర్ టిల్లర్లు తయారుచేయాలి సమాజంలోని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా, సుఖంగా ఉండాలన్నదే నా అభిమతం. అడ్డంకులను అధిగమించినప్పుడే జీవితంలో తృప్తి. మనం చేసే పని నీతి, నీజాయితిగా ఉండాలి. అవాంతరాలు రావచ్చు. పట్టుదలతో నిలదొక్కుకుంటే సమాజం ఆ తర్వాత గుర్తించి విలువనిస్తుంది. 5 ఎకరాల లోపు భూమి ఉన్న మహిళా రైతులు తమ సాగు భూముల్లో తాము స్వయంగా నడుపుకోగలిగేలా అనువుగా ఉన్న పవర్ టిల్లర్లు, వీడర్లు అందుబాటులో లేవు. తక్కువ వైబ్రేషన్స్ ఉండేలా వీటిని ప్రత్యేకంగా రూపొందించి ప్రభుత్వం, శాస్త్రవేత్తలు మహిళా రైతులకు అందించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మహిళా రైతులకు భూమిని తనఖా పెట్టుకొని సులువుగా బ్యాంకు రుణాలు అందించేలా ప్రభుత్వం శ్రద్ధతీసుకోవాలి. మహిళా రైతులు పండించిన సేంద్రియ వ్యవసాయోత్పత్తులను అమ్ముకోవడానికి పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వం స్టాళ్లు ఏర్పాటు చేయాలి లేదా ప్రత్యేక రుణాలను అందించాలి. – కొప్పుల సునీత(79890 45496), యువ మహిళా రైతు, ముక్కెట్రావుపేట, వెల్గటూర్ మండలం, జగిత్యాల జిల్లా keerthisk999@gmail.com ఆవులతో సునీత -
ప్రకృతినే హ్యాండిల్ చేశాం..
సాక్షి, అమరావతి: ప్రకృతిని హ్యాండిల్ చేయగలుగుతున్నా కూడా పొలిటికల్‌గా హ్యాండిల్ చేయలేకపోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో ఒక జాతీయ పార్టీ అన్యాయం చేస్తే ఇప్పుడు మరో పార్టీ సహాయ నిరాకరణ చేయడంతో పాటు భయాందోళనకు గురిచేస్తోందన్నారు. జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మన హక్కుల గురించి డిమాండ్ చేస్తే దాడులు చేసే పరిస్థితి ఉందని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికాదని, ఐటి దాడులు చేయడం ద్వారా బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కక్ష సాధింపు వైఖరి సరికాదు, న్యాయం, ధర్మం, మంచి పనులే శాశ్వతంగా ఉంటాయన్నారు. అప్పుడు కేంద్రంలో ఓ పార్టీ ఒకరకంగా ఇబ్బంది పెడితే ఇప్పుడు మరో జాతీయ పార్టీ మరోరకంగా ఇబ్బంది పెడుతోందన్నారు. సాంకేతికత, అభివృద్ధితో విపత్తులను అధిగమిస్తున్నామని, దివిసీమ, తూర్పుగోదావరి తుపాన్లలో ప్రాణనష్టం అత్యధికమని, కానీ హుద్ హుద్, తిత్లీ తుపాన్లలో ప్రాణ నష్టం నివారించగలిగామన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి వచ్చేదాకా విశ్రమించకూడదన్నారు. పోలవరం పునరావాసం పనులు వేగవంతం చేయండి పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సోమవారం ఉండవల్లి ప్రజావేదిక నుంచి పనుల పురోగతిని వర్చువల్ రివ్యూ ద్వారా ఆయన సమీక్షించారు. వచ్చే వారానికి కాఫర్ డ్యామ్ పునాది(జెట్ గ్రౌంటింగ్) పనులు పూర్తవుతాయని అధికారులు వివరించారు. ప్రాజెక్టు కోసం పశ్చిమగోదావరి జిల్లాలో భూసేకరణ పూర్తికాగా, తూర్పుగోదావరి జిల్లాలో ఇంకా 55,858.6 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. హీరమండలం రిజర్వాయర్ నుంచి ఇచ్ఛాపురం వరకు చేపట్టిన హైలెవల్ కెనాల్ నిర్మాణంతో వంశధార–బహుదా అనుసంధానం పూర్తవుతుందని చెప్పారు. వైకుంఠపురం బ్యారేజ్, గోదావరి–పెన్నా అనుసంధానం ఫేజ్ 1 టెండర్ల ప్రక్రియ చివరిదశకు వచ్చిందని వివరించారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకే అవార్డులు సాక్షి ప్రతినిధి ఒంగోలు: విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకే ప్రతిభా అవార్డులు ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 7,010 మంది విద్యార్థులకు ప్రకాశం జిల్లా ఒంగోలులోని మినీ స్టేడియంలో సోమవారం ఏర్పాటు చేసిన సభలో ప్రతిభా అవార్డులను సీఎం అందచేశారు. ఈ సందర్భంగా యన మాట్లాడుతూ కృషి, పట్టుదల, సంకల్పం ఉంటే ఏదైనా సాధించ వచ్చన్నారు. కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులను యంత్రాల్లా పనిచేయిస్తుండడం సరికాదన్నారు. అందుకే ప్రభుత్వం కళాశాలలు, పాఠశాలల్లో ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. ప్రతిభా అవార్డు కింద ఒక్కొక్కరికి రూ.20 వేలు నగదు, అవార్డు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతిభా అవార్డు పొందిన విద్యార్థులు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు పొందితే వారి పదవీకాల సమయం ఓ ఏడాది అధికంగా ఇస్తామన్నారు. అబ్దుల్ కలాం స్ఫూర్తి ప్రదాత అని, ఆయన జీవితం యువతకు ఆదర్శమని సీఎం అన్నారు. నాడు వాజ్‌పేయ్ ప్రభుత్వంలో అబ్దుల్ కలాం దేశ అధ్యక్షుడిగా ఉండాలని తాను ప్రతిపాదించానని చెప్పారు. 2022 నాటికి రాష్ట్రం దేశంలో 3వ స్థానానికి చేరుకుంటుందని, 2029కి నంబర్–1 అవుతుందని, 2050కి ప్రపంచంలోనే అత్యున్నత స్థానానికి చేరుకుంటుందన్నారు. జ్ఞానభేరి పెట్టి జిల్లాకు రూ.10 కోట్లు నిధులు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు, గంటా శ్రీనివాసరావు, శిద్దా రాఘవరావు, బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. -
20–22 తేదీల్లో మహారాష్ట్రలో పాలేకర్ క్షేత్ర సందర్శన
మహారాష్ట్రలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగువుతున్న ఉత్తమ పత్తి, పసుపు, మునగ, మిరప, పూలు, బత్తాయి తోటల సందర్శన కార్యక్రమం ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు జరగనుంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ స్వయంగా హిందీ/ఇంగ్లిష్‌ల ఈ క్షేత్రాల ఉత్పాదకత గురించి రైతులకు వివరిస్తారు. నాగపూర్ నుంచి 20న ఉ. 8.30 గంటలకు ప్రారంభవమయ్యే యాత్ర వివిధ జిల్లాల్లో 3 రోజులు కొనసాగుతుంది. పాల్గొనదలచిన వారు భోజన, వసతి, రవాణా ఖర్చుల నిమిత్తం రూ. 1,200 చెల్లించాల్సి ఉంటుంది. వివరాలకు.. మనోజ్ జానియల్– 98225 15913, సచిన్ జడె–88050 09737 -
సల్లంగ బతుకమ్మ
తెలంగాణలో కొన్ని పండుగలకు తరతరాల చరిత్ర ఉంది. కొన్ని పండుగలు ప్రజల సంబురాల నుండి పుట్టి, జీవన గమనంలో భాగంగా మారాయి. తెలంగాణ అంతటా గ్రామ గ్రామాల్లో మార్మోగిపోయే సంబరంగా చేసుకునే పండగ బతుకమ్మ పండుగ. ఆటపాటలతో, ఆనందంగా ప్రజలు తమ సంతోషాన్ని ఇతరులతో పంచుకునే ఒక సామాజిక జీవన సంరంభం ఈ పండుగ. బతుకమ్మ అనగానే మనకు ఒక సామాజిక వ్యవస్థగా, సమాజంలో జరిగిన సంఘటనలకు స్పందించి, చైతన్యాన్ని కల్పించే దిశగా పాట రూపంలో, ఆటల రూపంలో సామాజికులు తీర్చిదిద్దుకున్న ఒక అపురూపమైన కళారూపం ఈ బతుకమ్మ. వర్షాకాలం చివరి రోజుల్లో తెలంగాణ ప్రాంతమంతా ఎక్కడ చూసినా విరబూసే తంగేడు పూలతో సింగారించుకున్న పల్లెపడుచులా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎక్కడ చూసినా అలుగులు పారే చెరువులూ, నిండుకున్న కుంటలూ, ఆపైన గట్లమీద పూసే వెండిజిలుగుల గునుగుతో పల్లెలు అందాలు సంతరించుకుకుంటాయి. పూరిగుడిసెల మీద, పందిరిమీద, పొదలమీద, పెరట్లోనూ, విరగబూసిన బీరపూలూ, గుమ్మడిపూలు, కట్లపూలు, బంతిపూలతో పసిడి పూసినట్లుగా హరివిల్లులా– కనిపిస్తాయి గ్రామీణ కుటీరాలు. పూరిగుడిసెలకు ఇంత అందం ఎక్కడినుంచి వచ్చింది, ఎవరిచ్చారూ అని ఆలోచిస్తే, మన బతుకమ్మగాక మరెవరు అంటారు కల్మషమెరుగని నైజాం ప్రాంత ప్రజానీకం. పొలం గట్ల మీదకు ఇంద్రధనుస్సు దిగివచ్చిందా అన్నట్లు బతుకమ్మ పూలతో నిండుగా నవ్వుతూ స్వాగతం పలుకుతాయి.మగవారు పూలు కోసుకురావాలి. ఇక ఆ తర్వాత హడావుడి అంతా ఆడవారిదే మరి. తెలంగాణ సంస్కృతికీ, వైభవానికీ ప్రతీకగా నిలిచే ఈ తొమ్మిదిరోజుల పండుగరోజుల్లో భక్తిశ్రద్ధలు అడుగడుగునా కనిపిస్తాయి. మహాలయ పక్ష అమావాస్య రోజు మట్టితో చేసిన బొడ్డెమ్మలను సాగనంపి, ఆ తెల్లవారినుంచి, ప్రతిరోజూ సాయంత్రం అందంగా అలంకరించుకున్న ఆడపడచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి లయబద్ధంగా ఆడతారు. చివరిరోజున అనగా దుర్గాష్టమి రోజున పెద్దగా పేర్చిన బతుకమ్మను ఇంటిముందు వాకిట్లో, వీధిలో కూడలిలో ఉంచి ఆడపడచులంతా కలిసి సామూహికంగా పాటలు పాడుతూ– లయబద్ధంగా చేతులు కలుపుతూ, అడుగులో అడుగు వేస్తూ, బతుకమ్మ ఆడతారు. ఇక బతుకమ్మ పాటలన్నీ ఎంతో హుషారు గొలిపిస్తాయి. ఆ పాటలు లక్ష్మీదేవి, గౌరమ్మ, పార్వతి, శివుడు, బతుకమ్మ మీదనే ఎక్కువగా ఉంటాయి. ఆడపిల్ల అత్తగారింట్లో ఎలా నడుచుకోవాలో కూడా తెలియజేస్తూ, ఇక తదితర ఆడపిల్లలకు సంబంధించిన విషయాలమీదే ఎక్కువగా ఉంటాయి. జాము రాతిరి దాకా ఆడి చివరకు బతుకమ్మను చెరువులోనో, వాగులోనో నిమజ్జనం చేస్తారు. ముల్తైదువలు ఒకరికొకరు పసుపు కుంకుమలను ఇచ్చి పుచ్చుకుంటారు. తీపిపదార్థాలు తినిపిస్తారు. ఆ సమయంలో ఊరు ఊరంతా చెరువు గట్టు మీదకు తరలి వచ్చిందా అన్నట్లుగా ఉంటుంది.బతుకమ్మ పండుగ విషయంలో పలుకథలు ప్రచారంలో ఉన్నాయి. చాలా ప్రాచీనమైన కథను చెప్పుకుందాం. శివుని అర్ధాంగి, జగన్మాత పార్వతీదేవి తన పుట్టింటివారు పిలవకున్నా, తండ్రి దక్షుడు చేస్తున్న యజ్ఞానికి వెళ్లి అవమానం పొంది, యాగాగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకుందని, అది చూసి సహించలేని ప్రజలు, భక్తులూ ముక్తకంఠంతో బతుకమ్మ బతుకమ్మ అంటూ హృదయవిదారకంగా విలపిస్తూ భక్తితో పాటలు పాడగా పార్వతీదేవి ప్రత్యక్షమైందనీ, ఆనాటినుండి ప్రజలు బతుకమ్మ పండుగను చేసుకుంటున్నారని ఒక కథ ప్రచారంలో ఉంది. పుట్టినపిల్లలు పురిటిలోనే చనిపోతుంటే వారికి ‘బతుకమ్మ’ అని పేరు పెట్టే ఆచారం ఈనాటికీ తెలంగాణలో ఉంది. బతుకమ్మ అంటూ ఆ జగన్మాత పేరు పెడితే పిల్లలు బతుకుతారన్న గట్టి నమ్మకం ఈనాటికీ తెలంగాణలో ఉంది. సిరిలేని సురులతో ఉయ్యాలో సంతోషమొందిరి ఉయ్యాలో జగతిపై బతుకమ్మ ఉయ్యాలో శాశ్వతంబుగ నిలిచె ఉయ్యాలో అంటూ బతుకమ్మ కథలను పాడుతూ ఉండడం కనిపిస్తుంది. బతుకమ్మ పాటలు నేటికీ వింటున్నామంటే అందుకు కారణం జనబాహుళ్యం వీటిని బతికించుకుంటూ రావడమే. ప్రకృతిలో పనికిరానిది ఏదీ లేదన్న సందేశం మనకు ఈ పండుగ ద్వారా అందుతుంది. ఈ ఆటపాటల వలన ఆడపిల్లల్లో ఐకమత్యం, అందరితో కలిసి మెలిసి అందరితో కలిసి మెలిసి ఉండాలనే మనస్తత్వం అలవాట్లలో మంచి మార్పు, ఇతరులకు సహాయం చేసే గుణం, ఓర్పు, నేర్పు అలవడతాయి. కులం, వర్గం అనే భేదాలు లేకుండా అందరూ కలిసి మెలిసి ఆడుకునే పాడుకునే ఒక అద్భుతమైన పండుగ ఈ బతుకమ్మ పండుగ. గౌరికి తల తల్లి నీటి మీద తేలే విధంగా వరమిచ్చిందట. గౌరి గౌరమ్మగా, బతుకమ్మగా మారి నీటిమీద తేలేలా సాధించుకుంటుందన్న కథను కూడా చెబుతారు. బతుకమ్మను పేర్చిన స్త్రీలు చివరి రోజున శివుడు మెచ్చిన గంగ గౌరీలను కలిపి చేసిన పసుపు ముద్దను ఒకరికొకరు పంచుకుంటారు. ఇంకొక ముఖ్యమైన కథ కూడా ప్రచారంలో ఉంది. ఇది అన్నా చెల్లెళ్లకు సంబంధించినది. చెల్లిని అన్నయ్య ప్రాణప్రదంగా చూసుకుంటుంటే సహించలేని వదినలు ఆమెకు పాలలో విషం కలిపి చంపేసి పాతిపెడతారు. ఆమె అక్కడ తంగేడై మొలుస్తుంది. తమ చెల్లెలిని చంపారన్న కోపంతో, భార్యలను చంపడానికి బయలుదేరిన అన్నలను బతుకమ్మ మీ చెల్లెలిని తంగేడునై పుట్టాను. వదినెల చేత బతుకమ్మను చేయించి ప్రతి ఏటా నన్ను సాగనంపమంటుంది. అందుకే బతుకమ్మకు తంగేడును శ్రేష్ఠంగా చెబుతారు. మరొక కథ– వేల ఏళ్ల కిందట బతుకమ్మ ఒక సామాన్య రైతుకుటుంబంలో పుట్టింది.పెరిగి పెద్దది కాగానే వివాహం చేశారు. అత్తవారింట్లో అందరి మనసులెరిగి మసలుకుంటుంది. సుమంగళిగా తనువు చాలించాలని గౌరీదేవిని పూజించేది. ఆమె పూజలకు మెచ్చిన గౌరీదేవి బతుకమ్మగా వెలసి స్త్రీల కోర్కెలు తీర్చమంటూ దీవించింది. –చోళరాజైన ధర్మాంగదునికి వందమంది కుమారులు. వారందరూ యుద్ధంలో మరణిస్తారు. చాలాకాలం తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహంతో వారికి ఆడపిల్ల కలుగుతుంది. ఆ పిల్లకు బతుకమ్మ అని పేరు పెట్టి పెంచుకుంటారు. ఇలా పలు కథలున్నాయి. స్త్రీలపండుగగా ప్రసిద్ధికెక్కిన బతుకమ్మగా తల్లి వారి కటుంబాన్ని చల్లగా చూస్తుందని గట్టి నమ్మకం.పిల్లాపాపలకు ఆరోగ్యాన్ని, ఆడపిల్లలకు ముత్తయిదువతనాన్ని ఇస్తుందని భావించే బతుకమ్మ– సర్వజనులనూ రక్షించాలని ప్రార్థిద్దాం. – డా. పులివర్తి కృష్ణమూర్తి -
తేరుకోని ఇండోనేసియా
ఇండోనేసియాలో భూకంపం, సునామీ ధాటికి పూర్తిగా ధ్వంసమై మరుభూమిని తలపిస్తున్న పలూ పట్టణం. ఈ ప్రకృతి విలయంలో సజీవసమాధి అయినవారి సంఖ్య తాజాగా 1,200కు చేరిందని అనధికార వార్తలొచ్చాయి. దాదాపు 1,91,000 మంది తక్షణ అవసరం కోసం ఎదురుచూస్తున్నారని సోమవారం ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. సహాయకచర్యలను ముమ్మరంచేశారు. మరోవైపు, అసువులుబాసిన వందలాది మందిని ఒకేచోట ఖననంచేసేందుకు పలూ పట్టణంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఎంత కష్టం!
సినిమాకు రకరకాల సవాళ్లు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి షూటింగ్ లొకేషన్లో ఏర్పడే మనస్పర్థల వల్ల, ఆర్టిస్టుల డేట్స్ విషయంలోనూ, ప్రకృతి వల్ల కూడా అనుకోని ఇబ్బందులు వస్తుంటాయి. ఇప్పుడు అలాంటి అనూహ్య ఇబ్బందిలోనే చిక్కుకుంది ‘దేవ్’ టీమ్. కార్తీ, రకుల్ జంటగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ను హిమాచల్ ప్రదేశ్‌లోని కులూమనాలిలో ప్లాన్ చేసి, యూనిట్ అక్కడకు చేరుకుంది. సడెన్‌గా కుండపోతగా వర్షం కురవడంతో వరదలు వచ్చాయి. దాంతో షూటింగ్ ప్రదేశమంతా బీభత్సంగా తయారవ్వడంతో పాటు సుమారు 140 మంది యూనిట్ మెంబర్స్ అక్కడ చిక్కుకుపోయారట. ఈ విషయాన్ని కార్తీ షేర్ చేస్తూ – ‘‘మంచు పడుతున్న సీన్స్ షూట్ చేద్దామని హిమాచల్ ప్రదేశ్ వచ్చాం. మాకు అనుగుణంగానే లొకేషన్ ఉండటంతో షూటింగ్ సజావుగా జరుగుతుందనుకున్నాం. హఠాత్తుగా భారీ వర్షం మొదలైంది. కొండ మీదున్న రాళ్లు జారి రోడ్డు మీద పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. షూటింగ్ లొకేషన్లో (కొండ మీద) చిక్కుకుపోయిన వాళ్లతో కమ్యూనికేషన్ లేదు. సేఫ్టీ కోసం నన్ను కొండ కింద ఊర్లోనే ఉండ మన్నారు’’ అన్నారు. ఈ ప్రకృతి వైపరీత్యం నిర్మాతకు సుమారు కోటిన్నరకు పైనే నష్టం మిగిల్చిందట. అలాగే గత 23 ఏళ్లలో హిమాచల్ ప్రదేశ్‌లో ఇంతటి బీభత్సాన్ని చూడలేదని ప్రభుత్వం ప్రకటించింది. -
ఇళ్లలో చెట్లు కాదు.. చెట్ల మధ్య ఇళ్లుండాలి
సాక్షి, తిరుపతి: ‘ఇళ్లలో చెట్లు కాదు.. చెట్ల మధ్యలో ఇళ్లు ఉండాలి. ఊర్లో చెట్లు కాదు.. చెట్ల మధ్యలో ఊర్లు ఉండాలి. ఒకప్పుడు టెక్నాలజీని ప్రమోట్ చేశాను. ఇప్పుడు ప్రకృతిని ప్రమోట్ చేస్తున్నాను. మీరు తినే తిండి యూరియా. ఆ తిండితో అనారోగ్యం పాలువుతున్నారు. భూములు నిస్సారమయ్యాయి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తిరుపతి పర్యటనలో భాగంగా శనివారం ఆయన అలిపిరి మార్గంలోని కపిలతీర్థం వద్ద నిర్మించిన నగర వనాన్ని ప్రారంభించి మొక్కను నాటారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా మహతి ఆడిటోరియానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ‘పచ్చదనం పరిశుభ్రత’ను కాంక్షిస్తూ నెహ్రూ మున్సిపల్ మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు. మధ్యలో నెహ్రూ నగర్ వద్ద డిజిటల్ డోర్ నెంబర్లకు శ్రీకారం చుట్టారు. అనంతరం మున్సిపల్ మైదానంలో నిర్వహించిన బహిరంగసభలో సీఎం ప్రసంగించారు. మెడికల్, ఎడ్యుకేషన్ హబ్‌గా తిరుపతి డిజిటల్ డోర్ నెంబర్ల వ్యవస్థతో ఎన్నో ప్రయోజనాలున్నాయని.. ప్రభుత్వ సేవలు ఏ సమయానికి ఎలా అందుతున్నాయో తెలుసుకునే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. ప్రపంచస్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని తిరుపతిలో అమలుచేస్తామని తెలిపారు. తిరుపతిని ఒక మెడికల్, ఎడ్యుకేషన్ హబ్‌గా తయారుచేసి దేశంలోనే నంబర్–1గా తీర్చిదిద్దుతానన్నారు. అలాగే, తిరుపతిని అనేక జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాయలసీమకు కేంద్రంగా దీనిని తయారుచేస్తానన్నారు. త్వరలో తిరుమలకు ఎలక్ట్రికల్ వాహనాలు రానున్నాయని చంద్రబాబు తెలిపారు. జపాన్‌లో ఎవరూ రోడ్లపై కాగితాలు వేయరని, ఇక్కడ మాత్రం కాగితాలు, ఇతర చెత్త ఇష్టా రాజ్యంగా వేస్తున్నారన్నారు. ప్రకృతి సేద్యంతో లాభాల పంట ప్రకృతి సేద్యం ద్వారా ఆరోగ్యంతో పాటు పంట దిగుబడి లాభాలు కూడా పెరుగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 5 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి యువనేస్తం కార్యక్రమాన్ని అక్టోబరు 2న ప్రారంభించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, అమరనాథ్‌రెడ్డి, మున్సిపల్ శాఖ కార్యదర్శి కన్నబాబు, చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, జెడ్పీ చైర్మన్ గీర్వాణి, ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
29–30 తేదీల్లో సమీకృత ప్రకృతి సేద్యంపై నారాయణరెడ్డి శిక్షణ
సెంటర్ ఫర్ ట్రెడిషినల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ప్రసిద్ధ సమీకృత ప్రకృతి వ్యవసాయ నిపుణుడు ఎల్. నారాయణరెడ్డి ఈ నెల 29, 30 తేదీల్లో బెంగళూరుకు సమీపంలోని దొడ్డబళ్లాపూర్, మరలెనహళ్లి, శ్రీనివాసపురం గ్రామంలో గల తన వ్యవసాయ క్షేత్రంలో రైతులకు తెలుగులో శిక్షణ ఇస్తారు. రిజిస్ట్రేషన్ వివరాల కోసం.. 94495 96039, 83101 99215, 99017 30600. -
16న కొర్నెపాడులో జీవన ఎరువులపై శిక్షణ
సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అన్ని పంటల్లో జీవన ఎరువుల వాడకం, రైతు స్థాయిలో వాటి తయారీపై ఉ. 10 గం.ల నుంచి సా. 5 గం.ల వరకు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు తెలిపారు. కరీంనగర్ జిల్లా రైతు కొక్కు అశోక్‌కుమార్ శిక్షణ ఇస్తారు. అనంతరం ఉచితంగా మదర్ కల్చర్ పంపిణీ చేస్తారు. వివరాలకు..8367535439, 0863–2286255. -
వక్క లెక్కే వేరు!
ప్రయోగ శీలి అయిన రైతే కొండంత ధైర్యంతో సరికొత్త పంటలను పలకరించగలడు. అటువంటి విలక్షణ రైతే వేమూరి కోటేశ్వరరావు. ఒక్కసారి నాటితే 25–30 ఏళ్ల దిగుబడినిచ్చే వక్క, జాజి, మిరియం వంటి అరుదైన పంటలను శ్రద్ధతో సాగు చేస్తూ.. గణనీయమైన నికరాదాయాన్ని పొందుతున్నారు. వేసవి పగటి ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా నమోదయ్యే జిల్లాల్లో వక్క దిగుబడి కొంత తక్కువగా ఉంటుందని.. జాజి, మిరియాల దిగుబడి బాగానే వస్తుందంటున్నారాయన. ప్రకృతి వ్యవసాయదారుడు కోటేశ్వరరావు అనుభవ పాఠాలు ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం.. ఉద్యాన తోటల సాగును కొత్తపుంతలు తొక్కిస్తున్న అన్నదాత వేమూరి కోటేశ్వరరావు. ఆయన ప్రకృతి వ్యవసాయ క్షేత్రం కొత్త పంటలకు, ఔషధ పంటలకు నిలయం. కృష్టా జిల్లా పమిడిముక్కల మండలం పడమట లంకపల్లి గ్రామం నుంచి∙1999లో విజయనగరం జిల్లా మక్కువ మండలం మార్కొండపుట్టి పంచాయితీ బట్టివలస గ్రామానికి కోటేశ్వరరావు వలస వచ్చి స్థిరపడి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వక్కతోపాటు ఔషధ మొక్కలను కలిపి సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ రైతు అవార్డును అందుకున్నారు. మొదట్లో చేదు అనుభవం... కర్ణాటకలోని శృంగేరీలో వక్క పంట సాగు పద్ధతులను తెలుసుకున్నారు. అక్కడి నుంచి మంగళ, సుమంగళ, శ్రీమంగళ, మెహిత్‌నగర్ రకాల విత్తనాన్ని తెప్పించారు. అస్సాం రాష్ట్రానికి చెందిన మెహిత్‌నగర్ రకం అధిక దిగుబడినిస్తుంది. 2003లో ఆయిల్‌పామ్ తోటలో అంతరపంటగా వక్క సాగు ప్రారంభించారు. కానీ, ఆ విధానం వల్ల రెండు పంటలూ దెబ్బతిన్నాయి. దీంతో వక్క తీసేశారు. 2009లో మళ్లీ రెండెకరాల్లో వక్క సాగు మొదలు పెట్టారు. ఐదు సంవత్సరాలకు ఫలసాయం రావటం మొదలైంది. ఆ ఉత్సాహంతో మరో ఐదెకరాల్లో వక్క మొక్కలు వేశారు. అలా ఏటా పెంచుకుంటూ వెళ్లి ప్రస్తుతం 14 ఎకరాల్లో వక్క సాగు చేస్తున్నారు. సాధారణంగా ఐదున్నరేళ్లకు తొలి దిగుబడినిచ్చే వక్క పంట ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తున్న కోటేశ్వరరావు పొలంలో నాలుగున్నరేళ్లకే ఫలసాయాన్ని అందిస్తున్నది. అరటి+ వక్క+మిరియం+జాజి... వక్క సాగు కొత్త కావటంతో కోటేశ్వరరావు తొలుత సాళ్లమధ్య, మొక్కల మధ్య 6 అడుగుల దూరంలో వక్క నాటారు. చెట్లు పెరిగేటప్పటికి బాగా వత్తుగా అయి, ఎత్తు పెరిగిపోతున్నాయి. పొలం మొత్తాన్నీ 7.5 అడుగుల దూరంలో బోదెలు తోలుకొని.. రెండు వరుసలు ఎటు చూసినా 7.5 అడుగుల దూరంలో వక్క నాటుకోవాలి. మూడో వరుసలో జాజి మొక్కలు నాటుకోవాలని కోటేశ్వరరావు తెలిపారు. వక్క ఎత్తు పెరిగాక మిరియం తీగలు పాకించాలి. మొదట్లోనే వక్క మొక్కలు నాటకూడదు. ఎండకు తట్టుకోలేవు. మొదట అరటి మొక్కలు నాటి నాలుగైదు అడుగుల ఎత్తు పెరిగిన తర్వాత వక్క మొక్కలు నాటుకోవాలి. విజయనగరం జిల్లా వాతావరణానికి వచ్చినంతగా కృష్ణా తదితర జిల్లాల్లో వక్క దిగుబడి రాదు. మార్చిలో వక్క పిందె వస్తుంది. ఎండలకు పిందె కొంత రాలుతుంది కాబట్టి దిగుబడి తగ్గుతుంది. మిరియం, జాజి దిగుబడి ఆ జిల్లాల్లోనూ బాగానే వస్తున్నదంటున్నారని కోటేశ్వరరావు వివరించారు. వక్క ఆదాయం ఎకరానికి రూ. లక్షన్నర ఒక చెట్టు నుంచి రెండు కేజీల వక్క కాయలు ఏటా లభ్యమవుతాయి. వక్క, జాజి చెట్లు ఒక్కసారి నాటితే 25–30 ఏళ్ల వరకు ఆదాయాన్నిస్తాయి. కేజీ వక్క రూ.120 నుంచి రూ.200 వరకు ధర పలుకుతుంది. ఎకరా పొలంలో 750 వరకూ వక్క మొక్కలు నాటుకోవచ్చు. అంతర పంటలు లేకుంటే వెయ్యి మొక్కలు నాటుకోవచ్చు. దగ్గరగా వేస్తే ఎత్తుగా పెరుగుతుంది. దానివల్ల గెలలు కోయడానికి ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఏడాదికి ఎకరాకి రూ.1.5 లక్షలకు పైబడి ఆదాయం లభిస్తుంది. అంతరపంటగా వేసిన జాజి, మిరియం కూడా మంచి ఆదాయాన్నిస్తుంది. వక్కలో ఏడేళ్ల తర్వాత దిగుబడి పెరుగుదల నిలిచిపోతుంది. జాజిలో ప్రతి ఏటా దిగుబడి పెరుగుతుందని కోటేశ్వరరావు అంటున్నారు. రసాయనిక ఎరువులకు బదులుగా జీవామృతాన్ని, వేస్ట్ డీ కంపోజర్ ద్రావణాన్ని సాగుకు వినియోగిస్తున్నారు. వ్యవసాయంతో పాటు ఆయన సాగుచేస్తున్న ఔషధ మొక్కలతో పలువురు రోగులకు వైద్యాన్ని అందిస్తున్నారు. మండలంలో ఎవరికైనా పాము కరిస్తే ముందు గుర్తుచ్చేది కోటేశ్వరరావే. ఉల్లిపాము(రక్తపింజరి) కాటుకు ఆయుర్వేద మందును కోటేశ్వరరావు ఉచితంగా అందిస్తుంటారు. మిశ్రమ పంటల సాగు లాభదాయకం వక్క పంట విత్తనాలను మొక్కలుగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం, అంబాజీపేట వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. వారు మన రాష్ట్రంతో పాటుæ హైదరాబాద్, కర్ణాటక పట్టణాలకు తరలిస్తున్నారు. వ్యాపారులు ఒక్కో మొక్క రూ.16 నుంచి రూ.20 చొప్పున కొనుగోలు చేసి తీసుకువెళుతున్నారు. వక్క చెట్టు మట్టల(జంటలు)తో చక్కని పేపరు ప్లేట్లు తయారు చేసుకోవచ్చని ఆయన అంటున్నారు. ఈ పంట అధికంగా కర్ణాటకలో సాగులో ఉంది. ఇందులో మిశ్రమ పంటలు వేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. అంతే కాకుండా ఆయుర్వేదిక్ మార్కెట్లో గిరాకి కలిగిన అతిమధురం, సరస్వతి, నేలవేము, దుంపరాష్ట్రం తదితర ఔషధ పంటలతో పాటు మిరియాలు వంటి సుగంధ ద్రవ్య పంటలను కూడా సాగు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం లేదు! ఉత్తరాంధ్రలో వక్క పంటను ప్రత్యేకంగా సాగు చేస్తున్నది నేనొక్కడినే. వక్క పంట సాగుకు ప్రత్యేక వాతావరణం అవసరం. ఈ మొక్కలు అత్యల్ప, అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేవు. నేలలో తేమ మాత్రమే ఉండాలి. నీరు నిల్వ ఉండకూడదు. మక్కువ మండలంలో ఇలాంటి వాతావరణం ఉండటం వల్ల వక్క సాగుకు అనుకూలత ఏర్పడింది. దీంతో ఇతర జిల్లాలతో పోలిస్తే మన దగ్గర దిగుబడి బాగుంటుంది. కుళ్లిన అరటి చెట్ల ఆకులు, గోమూత్రం, పేడ సేంద్రియ ఎరువులుగా ఉపయోగపడుతున్నాయి. అంతర పంటల ఆదాయంతో పెట్టుబడి ఖర్చులు తీరిపోతాయి. వక్కలో అంతరపంట మిరియాలతో వచ్చిన ఆదాయంతో వక్క పంటకు వెచ్చించిన ఖర్చు వచేస్తుంది. ఈ ఏడాది జాజికాయ, నల్ల మిరియాల పంటల సాగు ప్రారంభించాలనుకుంటున్నాను. ఇతర రాష్ట్రాల్లో వక్క పంట సాగుకు ప్రభుత్వ రాయితీలున్నాయి. మన రాష్ట్రంలో అలాంటివేమీ లేవు. దాంతో, ఎంతగా అవగాహన కల్పించినా వక్క సాగు చేసేందుకు మన రైతులు ఆసక్తి కనబరచడం లేదు. ఉభయగోదావరి జిల్లాల్లో ఇటీవలే జాజికాయ సాగు మొదలుపెట్టారు. ఉత్తరాంధ్ర జిల్లాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వక్క మొక్కల నర్సరీ ఆకు ముడత రానివ్వదు! ఇది సిక్కిం రాష్ట్రానికి చెందిన దేశవాళీ మిరప రకం. ఆకు ముడతను దరి చేరనివ్వకపోవడం, ఒకసారి నాటితే అనేక సంవత్సరాలు దిగుడినివ్వటం (బహువార్షిక రకం), చక్కని వాసన కలిగి ఉండటం.. ప్రత్యేకతలు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు బాలరాజు(98663 73183) దీన్ని ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. ఇతర వివరాలకు సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త డా. జి. రాజశేఖర్– 83329 45368. చీడపీడల నివారణలో.. చేతిని మించిన సాధనం లేదు! కాకర ఆకుల మీద పసుపు రంగు నల్లులు చేరి పత్రహరితాన్ని తింటాయి. ఆకులన్నీ అస్థిపంజరాల వలె అవుతాయి. నివారణ ఏ మందులూ అవసరం లేదు. చీడపీడల నివారణలో, చేతిని మించిన సాధనం లేదు! ఆకులపై నల్లులు కనిపిస్తే చేతి వేళ్లతో నలిపేయాలి. అలా వరుసగా రెండు, మూడు రోజులు చెయ్యాలి. ఈ పని చేస్తే నల్లుల సమస్య సునాయాసంగానే పోతుంది. – తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దె తోట నిపుణులు – వేమూరి కోటేశ్వరరావు (94407 45555), వక్క రైతు, బట్టివలస, మక్కువ మండలం, విజయనగరం జిల్లా దివంగత వైఎస్సార్ నుంచి అవార్డు స్వీకరిస్తున్న కోటేశ్వరరావు వక్కల చెట్లకు పాకిన మిరియాల పాదులు – బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, విజయనగరం ఫొటోలు: బత్తెన శాంతీశ్వరరావు, మక్కువ -
వానకు ముందే విత్తనం..!
సాధారణంగా తొలకరిలో మంచి వర్షం పడిన తర్వాత మెట్ట భూములను దుక్కి చేసి, మళ్లీ వర్షం పడినప్పుడు విత్తనాలు వేస్తుంటారు. అయితే, దుక్కి చేసిన తర్వాత విత్తనాలు వేయడానికి పదునయ్యే అంత వర్షం పడక పోతే..? ఆశతో రైతులు వరుణుడి రాక కోసం రోజులు, వారాలు, నెలలు ఎదురు చూడటం తప్ప చేయగలిగేదేమీ లేదు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో ఇటువంటి విపత్కర దుర్భిక్ష పరిస్థితులే ఏర్పడ్డాయి.. అయినా, పొలాలన్నీ, రోజులన్నీ ఒకేలా ఉండవు. అనంతపురం జిల్లాలో కొన్ని గ్రామాల్లో ప్రయోగాత్మక వర్షాధార జీవవైవిధ్య ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు ఈ ఏడాదే ప్రారంభమయ్యాయి. ఒకటికి పది రకాల పచ్చని పంటలతో అలరారుతున్నాయి. తొలకరికి ముందే విత్తనాలు వేయటం వల్ల 70 రోజులుగా పంటలు అలరారుతున్నాయి. ఈ పొలాలు పచ్చని పంటలతో అలరారుతూంటే.. పరిసర పొలాలు మాత్రం ఖరీఫ్ సాగుకు వర్షం కోసం ఎదురుచూస్తూ బావురుమంటున్నాయి..! కరువు పరిస్థితులను అధిగమించాలంటే అనంతపురం తదితర కరువు ప్రాంత రైతులు వేరుశనగ లాంటి ఒకే పంట వేసే అలవాటుకు, రసాయనిక వ్యవసాయానికి పూర్తిగా స్వస్తిపలకడమే ఉత్తమం. ఒక ఎకరా పొలం ఉన్నా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజ పంటల మిశ్రమ సాగుకు ఉపక్రమించడమే మేలని తాజా అనుభవాలు చాటిచెబుతున్నాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో రుతువులు, వర్షాలు గతితప్పడంతో పంటల సాగు సమయంలో కూడా మార్పు తప్పనిసరిగా మారుతోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ(జెడ్బీఎన్ఎఫ్) పద్ధతిలో అనంతపురం జిల్లాలో వ్యవసాయశాఖ అధికారులు ముందస్తు ఖరీఫ్ పంటల సాగు (ప్రీ మాన్సూన్ క్రాప్ సోయింగ్) చేపట్టారు. జెడ్బీఎన్ఎఫ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. టి.విజయకుమార్ సారథ్యంలో డీపీఎం వి.లక్ష్మానాయక్, టెక్నికల్ ఏవో ఎల్.లక్ష్మానాయక్ పర్యవేక్షణలో ప్రయోగాత్మకంగా తొలకరికి ముందే సాగు సాగుతోంది. మే నెల లోనే విత్తనం.. అనంతపురం జిల్లాలో సాధారణంగా ఖరీఫ్ సాగు అనగానే జూన్ 15 నుంచి జూలై 31 వరకు పంటల సాగుకు సరైన సమయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఒక నెల ముందే మే నెల మూడో వారంలో వర్షాలు పడక ముందే విత్తనాలు వేసే ముందస్తు ముంగారు(ఖరీఫ్) సాగు ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఎంపిక చేసిన తొమ్మిది క్లస్టర్ల పరిధిలో ఒక్కో గ్రామంలో ఒక ఎకరా విస్తీర్ణంలో మే మూడో వారంలో 12 నుంచి 15 రకాల చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజ పంటలు కలిపి విత్తారు. భూమిని రైతుల నుంచి అధికారులు మూడేళ్ల కాలపరిమితితో దత్తత తీసుకుని ముందస్తు పంటలు వేశారు. కళ్యాణదుర్గం మండలం పాలవాయి, కుందుర్పి మండలం బండమీదపల్లి, వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి, రాప్తాడు మండలం మరూరు, అమడగూరు మండలం గాజులవారిపల్లి, సోమందేపల్లి మండలం గుడిపల్లి, మడకశిర మండలం నీలకంఠాపురం, అదే మండలం గుండుమల, కూడేరు మండలం జయపురం గ్రామాల్లో ముందస్తు ఖరీఫ్ పంటల సాగవుతున్నాయి. ఇందుకోసం ఒక్కో క్లస్టర్‌కు వ్యవసాయ/ఉద్యాన విద్యావంతులను నాచురల్ ఫార్మింగ్ ఫెలో(ఎన్ఎఫ్ఎఫ్)గా నియమించారు. ఈ ఫెలో తనకు కేటాయించిన క్లస్టర్ గ్రామంలోనే నివాసం ఉంటున్నారు. ఒక ఎకరాలో పంటల వైవిధ్యంతో ముందస్తు ఖరీఫ్ సాగుతోపాటు 36 సెంట్లలో ప్రత్యేకంగా ఫైవ్ లేయర్(ఐదంచెల వ్యవసాయ) పద్ధతిలో ఆకుకూరల నుంచి అన్ని రకాల వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగు చేయిస్తున్నారు. కరువు పరిస్థితుల్లో కూడా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు, అధిక ఆదాయం సాధించేలా పంటలు పండించి రైతులకు చూపాలన్నది లక్ష్యం. ఒక ఎకరాకు ఆవుపేడ, మూత్రం, బెల్లం, సున్నం, పప్పుదినుసుల పిండి, పుట్టమన్నుతో తయారు చేసిన 400 కిలోల ఘన జీవామృతం పొడిని పొలంలో వెదజల్లారు. మరుసటి రోజు ఒక ఎకరాకు 12 నుంచి 15 రకాల విత్తనాలు కలిపి 17 నుంచి 20 కిలోల వరకు పొలంలో వెదజల్లారు. రాగి, జొన్న, సజ్జ, కొర్ర, మొక్కజొన్న, పెసర, అలసంద, అనుములు, మినుములు, కంది, రెండు రకాల చిక్కుడు, నువ్వులు, ఆముదం తదితర విత్తనాలు కలిపి వెదజల్లారు. వానల్లేకపోయినా.. విత్తే ముందు గోమూత్రం, బూడిద, ఇంగువతో తయారు చేసిన ‘బీజరక్ష’ ద్రావణంతో విత్తన శుద్ధి చేశారు. విత్తిన తర్వాత వేరుశనగ పొట్టు, వరిపొట్టు లాంటి వ్యవసాయ వ్యర్థపదార్థాలను ఎకరాకు రెండు ట్రాక్టర్ల వరకు వెదజల్లి.. ఒక అంగుళం ఎత్తున మల్చింగ్(ఆచ్చాదన) చేశారు. ఒట్టి నేలల్లో విత్తనం వేసిన తర్వాత ఒకట్రెండు సార్లు తేలికపాటి తుంపర్లు పడ్డాయి. అనుకున్న విధంగా మొలకలు బాగానే వచ్చాయి. జూన్ మొదటి వారంలో ఒక మోస్తరు వర్షం పడింది. ఆ తర్వాత రెండు నెలల పాటు వాన చినుకే లేదు. అయినా, ముందస్తు ఖరీఫ్ పంటలు పచ్చగా ఏపుగా పెరుగుతున్నాయి. విత్తనాలు మొలకెత్తిన 20 నుంచి 30 రోజుల మధ్యలో గోమూత్రంతో తయారు చేసిన ద్రవజీవామృతాన్ని పిచికారీ చేశారు. ఆగస్టు 11 నాటికి ఆముదం గెల వేయగా, జొన్న, మొక్కజొన్న, రాగి, కొర్ర కంకులు ఏర్పడి గింజ పట్టాయి. పెసర, అలసంద కాయలు వచ్చాయి. ఇతర పంటలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. సజ్జ లాంటి పంటలు ఐదారు పక్కకొమ్మలతో గుబురుగా ఆరోగ్యంగా ఉండటం విశేషం. వాటి నుంచి మరో ఐదారు కంకులు వచ్చే అవకాశం ఉంది. ఎకరానికి రూ. పది వేల పెట్టుబడి ఎకరానికి విత్తనాలకు రూ.1,500 వరకు ఖర్చయింది. వేరుశనగ పొట్టు, వరిపొట్టు లాంటి వ్యవసాయ వ్యర్థాలతో ఆచ్చాదన కోసం ఎకరానికి రూ.4 వేల వరకు ఖర్చయింది. ఎకరానికి ఘన, ద్రవ జీవామృతం తయారీకి రూ.1,000 నుంచి రూ.1,200 వరకు ఖర్చయింది. దుక్కి, కూలీలతో కలిపి ఎకరాకు రూ.10 వేల లోపు పెట్టుబడి పెట్టారు. ఎకరానికి అన్ని పంటల ద్వారా కనీసం రూ.25 వేలు విలువ చేసే దిగుబడులు వస్తాయని ఆశిస్తున్నారు. దీనితోపాటు, 36 సెంట్ల భూమిలో ఐదంచెల వ్యవసాయం చేపట్టారు. వివిధ ఎత్తుల్లో పెరిగే పండ్ల చెట్లు, 20–30 రకాల పంటలు కలిపి సాగు చేసేలా ప్రణాళిక తయారు చేశారు. రక్షణ కవచంగా మిత్రపురుగులు ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకపోవడంతోపాటు ఏకదళ, ద్విదళ పంటలు కలిపి సాగు చేస్తుండడంతో ఈ పొలాల్లో మిత్రపురుగులు ఎక్కువ కనిపిస్తున్నాయి. అక్షింతల పురుగు, గొల్లబామ, సాలె పురుగులు, చీమలు, కందిరీగలు, తేనెటీగలు, పెంకు పురుగులు కనిపించాయి. ఇవి శత్రుపురుగుల దాడి నుంచి పంటలకు రక్షణ కల్పిస్తున్నాయి. ఘన, ద్రవజీవామృతం వాడటం వల్ల మట్టిలో వానపాములు, సూక్ష్మజీవులు అభివృద్ధి చెందాయి. గాలిలో ఉండేæ తేమను, నత్రజని సంగ్రహించి భూమికి అందిస్తున్నాయి. మట్టిలో సేంద్రియ కర్బన శాతం పెరుగుతున్నదని, పంటలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయని జెడ్బీఎన్ఎఫ్ అధికారులు విశ్లేషిస్తున్నారు. క్రిమిసంహారక మందులు వాడక పోవడంతో తేనెటీగలు తుట్టెలు కడుతున్నాయి. పక్షల గూళ్లు అల్లుకోవడం కూడా కనిపించింది. ‘ముందస్తు ఖరీఫ్ కు విత్తనాలు వేస్తున్నప్పుడు కొందరు ఎగతాళి చేసినా మేం వెనుకడుగు వేయలేదు. ఇపుడు రైతులు ఆసక్తిగా ఈ పంటలు చూస్తున్నారు..’ అని జెడ్బీఎన్ఎఫ్ డీపీఎం వి.లక్ష్మానాయక్ (8886614354), టెక్నికల్ ఏవో ఎల్.లక్ష్మానాయక్ సంతోషంగా చెబుతున్నారు. పంటలను పరిశీలిస్తున్న విజయకుమార్ తదితరులు ముందస్తు ఖరీఫ్ పంటల చుట్టూ ఖాళీ పొలాలే – రామలింగారెడ్డి, సాక్షి, అనంతపురం అగ్రికల్చర్ -
బతుకు పంట!
ఆ రైతు వయసు 73 ఏళ్లు... చేసేది ముప్పాతిక ఎకరం (75 సెంట్లు)లో వ్యవసాయం. ఏడాదికి ఆదాయం అక్షరాలా రూ.1.50 లక్షలపైనే. సేంద్రియ పద్ధతులను అనుసరిస్తూ, పాలేకర్ సూచించిన, అయిదు అంతస్తుల సేద్య విధానానికి రూపకల్పన చేసుకుంటూ వచ్చారు. ఫలితంగా ఆ వ్యవసాయ క్షేత్రం కొబ్బరి, వివిధ రకాల పండ్లు, కూరగాయలు, పూలచెట్లతో అడవిని తలపిస్తుంటుంది. నిత్య ఫలసాయం, ప్రతిరోజూ సంపాదన తో అటు ఆరోగ్యం, ఇటు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. రోజువారీ పండ్లు, కూరగాయలు దిగుబడి వచ్చేలా ప్రణాళికాబద్ధంగా సాగు చేయటమే కాదు, ఆ వయసులోనూ కొబ్బరి చెట్లను అవలీలగా ఎక్కుతూ, గెలలను దింపుతూ, స్వయంగా బజారులో అమ్ముకుంటూ తానే ఒక సైన్యంలా శ్రమిస్తున్నాడు. ఫలితంగానే నిత్య ఫలసాయం, ప్రతిరోజూ సంపాదనతో అటు ఆనందం, ఇటు ఆరోగ్యంతో శ్రమైక జీవన సౌందర్యాన్ని చాటుతున్నాడు. ఎందరో రైతులకు ఆదర్శంగా జీవిస్తున్నారు. ఆ నిత్య కృషీవలుడు నామని రోశయ్య ఆదర్శ జీవన సేద్యంపై ‘సాగుబడి’ కథనం.. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండల గ్రామం అత్తోట.. రోశయ్య స్వస్థలం. ఊరివెలుపల మాగాణి పొలాల్లో గుబురుచెట్లతో అడవిలా కనిపించేదే ఆయన వ్యవసాయక్షేత్రం. చుట్టూ వరి పండించే మాగాణి భూముల మధ్య ఇదొక్కటే మెట్ట చేను. వాస్తవానికి ఒకప్పుడది మాగాణి భూమే. సేద్యాని కనుగుణంగా మెట్టగా మార్చుకున్నారు రోశయ్య. పెద్దల్నుంచి సంక్రమించిన ఆ భూమికి చుట్టూ గట్లపై కొబ్బరి చెట్లు నాటారాయన. వాటిపై వచ్చే ఆదాయంతో ఏటా 10 సెంట్ల చొప్పున మెరక చేసుకుంటూ ఏడెనిమిదేళ్లలో మొత్తం భూమిని మెట్టగా మార్చేసుకుంటూ ఏటా కొన్ని కొబ్బరి చెట్లు నాటుతూ వచ్చారు. వాటితోపాటు వివిధ రకాల పండ్ల చెట్లు, కూరగాయలు, దుంప పంటలు, పూలచెట్లతో సహా 23 రకాల మొక్కలు/ చెట్లు కాపునిస్తున్నాయి. కొబ్బరి సహా 23 రకాల పండ్ల చెట్లు ప్రస్తుతం రోశయ్య వ్యవసాయ క్షేత్రంలో కొబ్బరిచెట్లు–70, నిమ్మచెట్లు–60, జామచెట్లు–8, సీతాఫలం–20, బత్తాయి–4, నారింజ–1, అరటి– 25, దానిమ్మ–2, ఉసిరి–2, నేరేడు–4, మామిడి–4తో సహా సపోటా, బొప్పాయి, మునగ చెట్లతోపాటు 3 నుంచి 5 సెంట్ల విస్తీర్ణం చొప్పున కంద, బెండ, వంగ వంటి కూరగాయల తోటలున్నాయి. ఒక వరుసలో పసుపు విత్తారు. 10 సెంట్లలో పశువుల మేత పెరుగుతోంది. వావిలి, వేప, నల్లేరు, తులసి, ఆముదం, కుంకుడు, రబ్బరు, ఉమ్మెత్త వంటి ఔషధ మొక్కలు, కొన్నిరకాల పూలమొక్కలు ఉన్నాయి. అంతర పంటల సాగులో రోశయ్య మేటి అనిపించుకుంటున్నారు. మినుము, పెసర, పసుపు, కంద పంటలను మూడునాలుగేళ్ల కాలవ్యవధిలో సాగుచేస్తూ వచ్చారు. మినుము పంట చేతికొచ్చాక, బంతి పూల సాగుకెళతారు. ఆ పంట తర్వాత మళ్లీ అపరాలు, మరోసారి పసుపు సేద్యం, ఇంకోసారి మొక్కజొన్న...ఇలా పంటల వైవిధ్యం పాటిస్తూ ఏడాదిలో 365 రోజులు పంట చేతికొచ్చేలా రూపొందించుకొనే ప్రణాళిక లాభసాటి వ్యాపారి వ్యవహారంలా అనిపిస్తుంది. నాలుగేళ్ల క్రితం వేసిన నిమ్మతోట ఇప్పుడు బ్రహ్మాండంగా కాపునిస్తోంది. కొబ్బరి చెట్లు ఎత్తు తక్కువ ఉన్నపుడు అరటి ఎక్కువగా సాగుచేశారు. గతేడాది వరకు 20 సెంట్లలో పండించిన పసుపుకు మార్కెట్ ధర ఆశాజనకంగా లేదని ఈ సంవత్సరం విరమించుకున్నారు. ఆ విస్తీర్ణంలో అలోనేరేడు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. రోజుకు రూ.500 కనీస ఆదాయం.. రోశయ్య వ్యవసాయ క్షేత్రంలో కొబ్బరి చెట్లకు 28 ఏళ్ల వయసు. రోజుకు ఒక్కో చెట్టు నుంచి మూడేసి గెలలను దింపుతారు. కొబ్బరి బోండాలను సైకిలుకు కట్టుకుని, అత్తోట గ్రామ సెంటరులో విక్రయిస్తారు. కొబ్బరి బోండాలను విడిగా, సీసాల్లోనూ కోరినవిధంగా ఇస్తారు. అత్తోట, దగ్గర్లోని గ్రామాల్లో అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా కొబ్బరి నీళ్లు అవసరమైన వారు నిశ్చయంగా రోశయ్య ఇంటి తలుపుతడతారు. నిమ్మ చెట్లు కాపునిస్తున్నాయి. కొబ్బరి బోండాలతో రూ.400, నిమ్మకాయలతో రూ.100 చొప్పున రోజుకు రూ.500 ఆదాయాన్ని కళ్లచూస్తున్నట్టు రోశయ్య ఒకింత గర్వంగా చెప్పారు. ఏడాదిలో కనీసం 10 నెలలపాటు ఈ రెండింటిపైనే రూ.1.50 లక్షల ఆదాయం సమకూరుతోందని చెప్పారు. ఇతర పండ్లు, కూరగాయలను సొంతానికి వినియోగించుకుంటూ మిగిలినవి మార్కెట్ చేస్తుంటారు రోశయ్య, ఆవిధంగా తన రెక్కల కష్టానికి తగిన ఆదాయాన్ని పొందుతున్నట్టు చెప్పారు. 5 సెంట్ల స్థలంలో వేసిన గజేంద్ర రకం కంద గతేడాది 400 కిలోల దిగుబyì నీ, రూ.6000 ఆదాయాన్నిచ్చింది. 20 సెంట్ల స్థలంలో పసుపు సాగుతో 300 కిలోల ఎండు పసుపు కొమ్ములు వచ్చాయి. దీనితో క్వింటాలు రూ.6,000 చొప్పున రూ.18 వేలకు అమ్మగలిగారు. ఉసిరికాయలపై ఏటా రూ.1,500 వస్తాయి. పచ్చిగడ్డిని ఆవుకు మేతగా వినియోగిస్తున్నారు. చక చకా కొబ్బరి చెట్లు ఎక్కేస్తున్నారు... కొబ్బరి చెట్టు ఎక్కడం అంత సులువు కాదని తెలిసిందే. కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు దింపేవారు లేక చాలామంది వాటిని చెట్లకే వదిలేస్తుంటారు. ఒకవేళ ఎవరైనా అందుబాటులో వున్నా, కూలీ ఖర్చు ఎక్కువ అడుగుతారు. రోశయ్యకు ఈ ఇబ్బందులేం లేవు సుమా! 73 ఏళ్ల వయసులో కొబ్బరి చెట్టును ఇట్టే ఎక్కేస్తున్నారు. మోకాళ్ల నొప్పి వస్తుందనే భావనతో ఇటీవలే చిన్న నిచ్చెన తెచ్చుకున్నారు. నిచ్చెనతో సగం దూరం వెళ్లాక, అక్కడ్నుంచి కాళ్లకు బంధం తాడు, మొలలో కొడవలి, నోట్లో మోకుతో చెట్టు మొదల్లోకి సునాయాసంగా వెళతారు. ఒక్కో గెలను నరికి, మోకుకు తగిలించి, కిందకు జారవిడుస్తాడు. తర్వాత మరో గెల...మొత్తం పది, పదిహేను నిముషాల్లో కొబ్బరి గెలల దింపుడు పూర్తిచేసి దిగొచ్చాడు. పాలేకర్ సూచనలతో సేంద్రియంలోకి.. అనుకోకుండా 2008లో ఒకరోజు పాలేకర్ సమావేశాలకు హాజరైన రోశయ్య, అప్పట్నుంచి సేంద్రియ పద్ధతులను అనుసరిస్తూ వస్తున్నారు. ప్రకతి వ్యవసాయానికి కీలకమైన ఆవును కొనుగోలు చేశారు. మూడేళ్ల తర్వాత దూడలతో సహా వేరొకరికి లాభానికి విక్రయించారు. మళ్లీ ఒంగోలు జాతి ఆవును కొనుగోలు చేశారు. ప్రస్తుతం ‘నంది’ని పోలిన రెండు ఆవులను పోషిస్తున్నారు. ఆవు వ్యర్థాలను సేకరించుకొని వాటితో జీవామృతం, ఘనజీవామృతం, పంచగవ్య, నామాస్త్రం, అగ్నాస్త్రం, దశపర్ణి కషాయం, ఇంగువ ద్రావణం వంటి కషాయాలను సొంతం తయారుచేసుకుని పంటలకు వినియోగిస్తున్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, తరచూ ఈ క్షేత్రాన్ని సందర్శిస్తూ రోశయ్య తగిన సలహాలనిస్తున్నారు. ఐదు అంతస్తుల వ్యవసాయ క్షేత్రం.. పాలేకర్ సూచించిన అయిదు అంతస్తుల సేద్యం లక్ష్యంగా వ్యవసాయం చేస్తున్నట్టు రోశయ్య చెప్పారు. భూమిలోపల దుంప పంటలు, పైన ఎత్తు తక్కువలో కూరగాయలు, తర్వాత నిమ్మ, బొప్పాయి వంటి పంటలు, ఆపైన మామిడి, మునగ వంటివి, చివరగా కొబ్బరి చెట్లతో తన వ్యవసాయక్షేత్రాన్ని ఆ విధానానికి అనుగుణంగా తీర్చిదిద్దినట్టు చెప్పారు. చుట్టూ సరిహద్దులో, మరో వరుసలో కొబ్బరి చెట్లు ఉంటే, మధ్యలో ఒకవైపు కూరగాయలు, దుంప పంటలు, కూరగాయలు పెంచుతున్నారు. మరోవైపు పశుగ్రాసాన్ని సాగుచేస్తున్నారు. మధ్యలో వివిధ రకాల పండ్ల మొక్కలు పెరుగుతూ ఫలాలను అందిస్తున్నాయి. వ్యవసాయశాఖ ఎన్‌పీఎం దుకాణాన్ని రోశయ్యకు మంజూరు చేశారు. వివిధ రకాల కషాయాలను తయారుచేసి రైతులకు అందించటం రోశయ్య విధి. ప్రస్తుతం ఇది ప్రారంభంలోనే ఉంది. లీటరుకు రూ.2 మిగులుతున్నట్టు చెప్పారు. ‘ఇద్దరు పిల్లలూ సెటిలయ్యారు.. నాకూ ఆ ఇంటామెకు ఈ 75 సెంట్ల క్షేత్రం ఉంచుకున్నాం. ఆరోగ్యకరమైన çపండ్లు, కూరగాయలు పండిస్తున్నాం. మేము తింటూ నలుగురికి అందిస్తున్నాం...ఇంతకన్నా కావాల్సిందేముంది’ అంటూ చిరునవ్వు నవ్వారు రోశయ్య. శారీరక శ్రమ గురించి అడిగితే, కష్టపడితేనే కదా! ఫలితం వచ్చేది’ అంటూ ప్రశ్నించి, నేటి తరానికి రోశయ్య (96665 32921) కర్తవ్య నిర్దేశం చేస్తున్నారు!! స్వయంగా చెట్టెక్కికొబ్బరి కాయలు దింపుతున్న 73 ఏళ్ల రైతు రోశయ్య, చెట్లకు నిండుగా నిమ్మకాయలు – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
పిచ్చి మొక్కే కదా అని పీకేస్తే...
దొగ్గలి ఆకు... తెల్ల గర్జల ఆకు... చెన్నంగి ఆకు... పప్పు కూర ఆకు... గునుకు ఉత్తరేణి ఆకు... వీటి పేర్లు విన్నారా? తోటకూర, గోంగూర, పాలకూర ఇవి మాత్రమే ఆకు కూరలని, వీటిని మాత్రమే తినాలని అనుకోవడం వల్ల వచ్చిన చిక్కు ఇది!ప్రకృతిలో చాలా ఆకుకూరలున్నాయి. తెలిసిన వారికి అవి మంచి కూరలు. తెలియని వారికి పిచ్చి కూరలు. ఈ ‘పిచ్చి’ మొక్కలకు ఉన్న రుచి ఏమిటో చూడండి. పప్పు కూర పకోడీ కావలసినవి: పప్పు కూర – రెండు కప్పులు; సెనగ పిండి – ఒక కప్పు; ఉప్పు – తగినంత; ధనియాల పొడి – అర టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; అల్లం + వెల్లుల్లి + ఉల్లి పేస్ట్ – ఒక టీ స్పూను; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ∙పప్పుకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి ∙ఒక పాత్రలో తరిగిన పప్పు కూర వేసి, నూనె మినహా మిగిలిన పదార్థాలన్నీ జత చేసి పకోడీల పిండిలా కలుపుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె బాగా కాగిన తరవాత ఈ పిండిని పకోడీల మాదిరిగా వేసి పేపర్ న్యాప్కిన్ మీదకు తీసుకోవాలి ∙వేడి వేడి పప్పు కూర పకోడీ సిద్ధమైనట్లే. గునుగు/ ఉత్తరేణి కిచిడీ కావలసినవి: గునుగు/ఉత్తరేణి ఆకు కూర – ఒక కట్ట (రెండు కప్పుల ఆకు); మెంతి కూర – పావు కప్పు; పాల కూర – పావు కప్పు; కరివేపాకు – 3 రెమ్మలు; కొత్తిమీర – అర కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 6; పచ్చి మిర్చి – 5; పెసర పప్పు – ఒక కప్పు; పుదీనా – అర కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; పల్లీలు – అర కప్పు; బియ్యం – ఒక కప్పు; ఉప్పు – తగినంత; టొమాటో తరుగు – ఒక కప్పు; నీళ్లు – తగినన్ని తయారీ: ∙ఆకుకూరలను శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి ∙బియ్యాన్ని శుభ్రంగా కడగాలి ∙ఒక పాత్రలో బియ్యం, పప్పులు, పల్లీలు, ఆకు కూరల తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు, ఉల్లి తరుగు, ఉప్పు, తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి మూత పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి ∙మూత తీసి, కొత్తిమీరతో అలంకరించాలి ∙ఉల్లిపాయ పెరుగు పచ్చడితో అందించాలి. చెన్నంగి పచ్చడి కావలసినవి: చెన్నంగి ఆకు – మూడు కప్పులు; చింతపండు – నిమ్మకాయంత; ఉప్పు – తగినంత; ఎండు మిర్చి – 10; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; నూనె – 3 టీ స్పూన్లు; కొత్తిమీర – కొద్దిగా తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక తరిగి ఉంచుకున్న చెన్నంగి ఆకు వేసి పచ్చి దనం పోయేవరకు వేయించి తీసి పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరసగా వేసి దోరగా వేయించి తీసి చల్లారనివ్వాలి ∙చల్లారిన పోపును మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ∙వేయించి ఉంచుకున్న ఆకు, ఉప్పు జత చేసి మరోమారు మెత్తగా గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి ∙కొత్తిమీరతో అలంకరించాలి ∙రొట్టెలు, అన్నంతో కలిపి తింటే రుచిగా ఉంటుంది. గురుమడి ఆకు వేపుడు కావలసినవి: గురు మడి ఆకు – రెండు కప్పులు; పెసర పప్పు – అర కప్పు (రెండు గంటలు నానబెట్టాలి); కరివేపాకు – రెండు రెమ్మలు; ఉల్లి తరుగు – పావు కప్పు; పసుపు – కొద్దిగా; ఉప్పు – తగినంత; నూనె – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙గురుమడి ఆకును ఉప్పు వేసిన గోరు వెచ్చని నీటిలో శుభ్రంగా కడగాలి ∙సన్నగా తరగాలి ∙ స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక గురుమడి ఆకు వేసి బాగా కలిపి మూత పెట్టాలి ∙ కొద్దిసేపయ్యాక నానబెట్టిన పెసరపప్పు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి ∙ ఆకు బాగా వేగిందనిపించాక ఉల్లి తరుగు, కరివేపాకు, పసుపు వేసి బాగా కలిపి మగ్గిన తరవాత దింపేయాలి. ఆకుకూర సజ్జ/జొన్న రొట్టె కావలసినవి: మనకు ఇష్టమైన ఆకు కూర తరుగు – రెండు కప్పులు; జొన్న పిండి లేదా సజ్జ పిండి – నాలుగు కప్పులు; ఉప్పు – తగినంత; నూనె – రొట్టెలు కాల్చడానికి తగినంత తయారీ: ∙ముందుగా ఆకుకూరలను శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆకు కూర వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ఆకు కూర బాగా చల్లారాక సజ్జ పిండి లేదా జొన్న పిండి, ఉప్పు జత చేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి ∙కొద్దికొద్దిగా పిండి తీసుకుంటూ చేతితో రొట్టె మాదిరిగా తయారుచేసి, పెనం మీద వేసి కాల్చాలి. తెల్ల గలిజేరు ఆకు పప్పు కావలసినవి: తెల్ల గలిజేరు ఆకు – ఒక కప్పు; కందిపప్పు లేదా పెసర పప్పు – రెండు కప్పులు; పచ్చి మిర్చి – 6; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; ఉల్లి తరుగు – పావు కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 5; ఇంగువ – కొద్దిగా. పోపు కోసం... ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి); నూనె – ఒక టేబుల్ స్పూను; కొత్తిమీర – కొద్దిగా. తయారీ: ∙ముందుగా తెల్ల గలిజేరు కూర ఆకును శుభ్రంగా కడిగి, సన్నగా తరిగి పక్కన ఉంచాలి ∙ కంది పప్పు లేదా పెసర పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి మెత్తగా ఉడికించాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఇంగువ, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరుసగా వేసి వేయించాలి ∙వెల్లుల్లి రెబ్బలు వేసి మరోమారు వేయించాలి ∙తరిగి ఉంచుకున్న తెల్ల గలిజేరు కూర ఆకు, ఉప్పు వేసి బాగా కలిపి మూత ఉంచాలి ∙ఆకు కూర బాగా మగ్గిన తరవాత ఉడికించిన పెసర పప్పు/కందిపప్పు, పసుపు, కరివేపాకు వేసి బాగా కలిపి దించేయాలి ∙కొత్తిమీరతో అలంకరించాలి ∙వేడి వేడి అన్నంలోకి, జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలలోకి ఈ పప్పు రుచిగా ఉంటుంది. దీనినే పునర్నవ అని కూడా అంటారు. - నిర్వహణ వైజయంతి పురాణపండ -
కలబంద ద్రావణంతో పంటలకు మేలు
ప్రకృతి నేర్పిన పాఠాలను ఆకళింపు చేసుకొని ప్రకృతి/సేంద్రియ సేద్యాన్ని ఔపోశన పట్టి, నేర్చుకున్న విషయాలను పదుగురు రైతులకు తెలియజెపుతూ చక్కని దిగుబడులు రాబడుతున్నారు మహిళా రైతు అప్పన్నగారి యశోదమ్మ. కలబంద వంటి అనేక మొక్కల ద్రావణాలతో ఆరోగ్యకరమైన పంటలు పండిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా చిన్నమండెం మండలం చిన్ననర్సుపల్లె గ్రామానికి చెందిన యశోదమ్మ స్వతహాగా రైతు. పెట్టుబడిలేని ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విభాగంలో క్లస్టర్ రిసోర్సు పర్సన్‌గా పనిచేస్తున్నారు. వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుము, పత్తి, టమాటా, వంగ, బెండ, మిరప, సొర, బీర తదితర కూరగాయ పంటలు, మామిడి, అరటి, బొప్పాయి వంటి పండ్ల తోటలను ఆశించే పలు రకాల పురుగులు, తెగుళ్ల నివారణకు కలబంద ద్రావణం చక్కటి పరిష్కార మార్గమని ఆమె అనుభవపూర్వకంగా చెబుతున్నారు. కలబంద ద్రావణం తయారీ ఇలా.. 2 కిలోల కలబంద ఆకులను దంచి పెట్టుకోవాలి. అలాగే, పావు కిలో కుంకుడు కాయలను పొడి చేయాలి. 5 లీటర్ల ఆవు మూత్రాన్ని, 5 కిలోల ఆవు పేడను సేకరించాలి. వీటిలో ఆవుపేడ తప్ప మిగతా అన్నిటినీ 200 లీటర్ల నీరుపట్టే డ్రమ్ములో వేసి.. తర్వాత ఎంతపడుతుందో అంత నీరు పోయాలి. ఆవు పేడను ఒక పలుచటి గొనె సంచిలో మూటకట్టి నీళ్ల డ్రమ్ములో వేలాడదీయాలి. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్ద కర్రతో కలియతిప్పాలి. వారం రోజులకు బాగా మురిగితే కలబంద ద్రావణం తయారవుతుంది. ద్రావణం పిచికారీ చేసే సమయంలో 20 లీటర్ల పిచికారీ డ్రమ్ములో 200 మిల్లీ లీటర్ల ద్రావణంతోపాటు 150 గ్రాముల పసుపు పొడి, 150 గ్రాముల రాళ్ల సున్నం వేసి మిగిలిన భాగం నీరు పోసుకొని.. పంట లేత ౖపైరు నుంచి మొగ్గ దశ వరకు ఏ పంటపై అయినా పిచికారీ చేసుకోవచ్చు. పూత సమయంలో పిచికారీ వద్దు పైరు మొలక దశలో 20 లీటర్ల నీటికి 150 మిల్లీ లీటర్లు, పూత దశకంటే ముందు 20 లీటర్ల నీటికి 200 మిల్లీ లీటర్లు, పిందె సమయంలో 20 లీటర్ల నీటికి 300 లీటర్ల ద్రావణాన్ని కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పూత విచ్చుకున్న సమయంలో ఎట్టి పరిస్థితిలోనూ ద్రావణం పిచికారీ చేయవద్దని ఆమె హెచ్చరిస్తున్నారు. పచ్చపురుగు, తెల్లదోమ, రెక్కల పురుగులు, ముఖ్యంగా వరిలో పొడ తెగులు, దోమపోటు, ఉల్లికోడు తెగుళ్లను ఈ ద్రావణం నివారిస్తుంది. మిత్ర పురుగుల సంతతి పెరుగుతుంది.. పంటకు మేలు చేసే మిత్ర పురుగుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ ద్రావణం మిత్ర పురుగులను ఆకర్షిస్తుంది. కందిరీగలు, తూనీగలు, తేనెటీగలు ఇతర మిత్ర పురుగులు పైరు పైకి వచ్చి చేరతాయి. పంటలో పూత నిలబడేలా దోహదపడుతుంది. íపిందె రాలడం తగ్గుతుంది. టమాటా పంట మూడు నెలలు ముగియగానే పాత మొక్క కింద మళ్లీ కొత్తగా చిగుర్లు వచ్చి యధావిధిగా పంటను ఇస్తుంది. రసాయనిక పురుగు మందులు వాడిన పంటలకంటే అధిక దిగుబడి వస్తుందని యశోదమ్మ(88979 31488) ధీమాగా చెబుతున్నారు. – మాచుపల్లె ప్రభాకరరెడ్డి, సాక్షి, వ్యవసాయం, వైఎస్సార్ జిల్లా కలబంద ద్రావణం -
ఒకే పంట సరికాదు! ఏ పంటైనా దిగుల్లేదు!
ఘనజీవామృతం, జీవామృతం, నీమాస్త్రం.. వీటితో ఏ పంటలోనైనా నిస్సందేహంగా మంచి నికరాదాయం పొందడం సాధ్యమేనా? అని అంటే.. ముమ్మాటికీ సాధ్యమేనంటున్నారు యువ రైతు శ్రీనివాసరెడ్డి. ఏడేళ్ల అనుభవం ఆయనకు ఇచ్చిన భరోసా ఏమిటంటే.. ఏదో ఒక పంటకే రైతు పరిమితం కాకూడదు. మార్కెట్ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు పంటల/తోటల సరళిని మార్చుకుంటూ వెళ్లడమే ఉత్తమ మార్కెటింగ్ వ్యూహమని అంటున్నారు శ్రీనివాసరెడ్డి. మార్కెట్ ఒడిదుడుకుల్లోనూ కరివేపాకు సాగులో.. ఏడాదికి ఎకరానికి కనీసం రూ. లక్షన్నర నికరాదాయం సాధిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఏ పంటనైనా పండించొచ్చన్న భరోసాతో ఈ యువ రైతు గొప్ప ఆశావహ జీవితాన్ని నిర్మించుకోవడంపై ‘సాగుబడి’ కథనం. ప్రకాశం జిల్లా దర్శి మండలం చలివేంద్ర గ్రామానికి చెందిన రైతు బాదం మల్లారెడ్డి, పద్మల కుమారుడైన శ్రీనివాసరెడ్డి బీకాం చదివి మట్టినే నమ్ముకొని జీవితాన్ని పండించుకుంటున్నాడు. తాతల కాలం నాటి 18 ఎకరాల సొంత భూమిలో ఏడేళ్లుగా మనసుపెట్టి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆచరిస్తూ ఉద్యాన పంటల్లో స్థిరమైన ఆదాయాన్ని పొందుతున్నారు. పాలేకర్ శిక్షణా తరగతుల్లో పాల్గొనడం.. యూట్యూబులో వీడియోలు చూడటం, ప్రకృతి వ్యవసాయ పుస్తకాలు చదవడం ద్వారా నేలతల్లి ఆరోగ్యమే రైతు, దేశ సౌభాగ్యమని గుర్తించి తదనుగుణంగా ధైర్యంగా ఏడేళ్ల క్రితమే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఐదెకరాల్లో కరివేపాకు, 11 ఎకరాల్లో దానిమ్మ, ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. కివీ పండ్ల సాగుపై తాజాగా దృష్టిసారిస్తున్నారు. కరివేపాకులో ఎకరానికి రూ. లక్షన్నర ఎకరంలో ఏడేళ్ల క్రితం కరివేపాకు నాటి జీవామృతం, ఘనజీవామృతంతో సాగు ప్రారంభించిన తొలి ఏడాదే సత్ఫలితాలు రావడంతో క్రమంగా విస్తరించారు. ప్రస్తుతం ఐదెకరాల్లో సాగు చేస్తున్నారు. బోదె పద్ధతిలో కరివేపాకు సాగు చేపట్టిన శ్రీనివాసరెడ్డి క్రమంగా పదెకరాలకు విస్తరించారు. అయితే, కరివేపాకుకు మార్కెట్ విస్తరించకపోవడంతో గత మూడేళ్లుగా దానిమ్మ వైపు దృష్టి మరల్చారు. కరివేపాకు ఏటా 3 కోతల్లో ఎకరానికి మొత్తం 18 టన్నుల దిగుబడి వస్తుంది. శీతాకాలంలో అత్యధికంగా కిలోకు రూ. 25 ధర పలుకుతుంది. ఎండాకాలంలో హాస్టళ్లు మూతపడతాయి, ఆకు పెరుగుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి అసలు అడిగే వారే ఉండరు. ఏదేమైనా మొత్తంగా సగటున కిలోకు రూ. పది ధర పలుకుతుందని, ఎకరానికి ఏటా రూ. లక్షన్నర వరకు నికరాదాయం పొందుతున్నానని శ్రీనివాసరెడ్డి తెలిపారు. రసాయనిక సేద్యంలో రూ. 50 వేలు అధికంగా ఖర్చవుతుందన్నారు. 11 ఎకరాల్లో దానిమ్మ సాగు దానిమ్మలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న శ్రీనివాసరెడ్డిని కొందరు రైతులు దానిమ్మ పంటకు ప్రకృతి వ్యవసాయంలో దిగుబడి రాదని నిరాశపరిచారు. అయితే, నిరాశ చెందకుండా మూడేళ్ల క్రితం 4 ఎకరాల్లో దానిమ్మ నాటాడు. ఏడాదిన్నర క్రితం 3 ఎకరాలు, 2 నెలల క్రితం 4 ఎకరాల్లో దానిమ్మ నాటాడు. రసాయనిక మందులు వాడకుండా జీవామృతం, ద్రావణాలు, కషాయాలతోనే రెండు కోతల్లో ఖర్చులు వచ్చాయి. ఈ దఫా మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాడు. బోర్లు అడుగంటి, బావి నీరు కూడా చాలకపోవడంతో మూడు కిలోమీటర్ల దూరంలో రెండెకరాలు కొనుగోలు చేసి బోర్లు వేసి పైప్‌లైన్ ద్వారా బావిలోకి ఆ నీటిని తరలించి.. బావి నుంచి 18 ఎకరాలకు డ్రిప్ ద్వారా నీటి తడులు పెడుతున్నారు. రైతులకు సూచనలు, సలహాలు శ్రీనివాసరెడ్డి వద్ద ఆరు దేశీ ఆవులున్నాయి. కరివేపాకుకు 15 రోజులకోసారి జీవామృతం డ్రిప్ ద్వారా ఇస్తారు. వారానికోసారి వేపనూనె, నీమాస్త్రం.. 20 రోజులకోసారి ముడినూనెల పిచికారీ చేయడం వల్ల కరివేపాకు మంచి నాణ్యత, రంగు వస్తున్నాయని తెలిపారు. తండ్రి మల్లారెడ్డి ఆవుల సంరక్షణ బాధ్యతలు చూస్తూ కుమారునికి సూచనలు, సలహాలు అందిస్తుంటారు. ఏడేళ్లుగా ప్రకృతి సాగు వల్ల భూసారం పెరిగింది. పొలంలో ఎక్కడ మట్టి తీసి చూసినా తమ విసర్జితాలతో భూసారం పెంచే వానపాములు కనిపిస్తాయి. ఆవుల మూత్రం, పేడతో తానే కాక ఇతరులకు ద్రావణాలు, కషాయాలు తయారు చేసి ఇస్తున్నాడు. ఎప్పుడూ ఒకే ఉద్యాన పంటపై ఆధారపడటం కన్నా అనేక పంటలపై దృష్టిపెట్టడం రైతుకు శ్రేయస్కరమని ఆయన విశ్వాసం. ఏడాది క్రితం ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ నాటారు. ఇప్పుడు కివీ పండ్ల సాగుపై దృష్టిసారిస్తున్నానన్నాడు. శ్రీనివాసరెడ్డి వద్ద నుంచి రైతులు స్వయంగా వచ్చి, సోషల్ మీడియా ద్వారా కూడా సలహాలు తీసుకుంటూ ఉండటం విశేషం. – మేడగం రామాంజనేయరెడ్డి ,సాక్షి, దర్శి, ప్రకాశం జిల్లా డ్రాగన్ ఫ్రూట్ తోటలో శ్రీనివాసరెడ్డి.. బావిలోకి బోరు నీరు.. పొలం వానపాముల మయం -
ప్రకృతితో దోస్తీ.. మంచిదే!
ప్రకృతికి దగ్గరగా ఉండటం ఆరోగ్యానికి మంచిదని చాలాకాలంగా తెలుసు. ఈ విషయాన్ని ఈస్ట్ ఆంగ్లియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిర్ధారించారు. పచ్చటి చెట్ల మధ్య ఎక్కువ కాలం గడపడం గుండెజబ్బులతోపాటు, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులను అడ్డుకోగలదని, ఒత్తిడిని దూరం చేయగలదని తాము దాదాపు 29 కోట్ల మంది వివరాలను విశ్లేషించడం ద్వారా తెలుసుకున్నామని ఈస్ట్ ఆంగ్లియా యూనివర్శిటీ శాస్త్రవేత్త కామీ ట్వోహిగ్ బెన్నెట్ తెలిపారు. ఇప్పటికే జరిగిన దాదాపు 140 అధ్యయనాలను మరోసారి సమీక్షించడం ద్వారా తమకు ఈ విషయం అర్థమైందని చెప్పారు. సహజసిద్ధమైన లేదా పార్కుల్లాంటి మానవ నిర్మిత పచ్చటి ప్రాంతాలు రెండింటి ద్వారా మన ఆరోగ్యానికి అందే లాభం ఒకేలా ఉందని వీరు తేల్చి చెప్పారు. చెట్లు, పచ్చదనం అందుబాటులో లేనివారి ఆరోగ్యాన్ని ఇతరులతో పోల్చి చూసినప్పుడు ఎంతో తేడా కనిపించిందని బెన్నెట్ అన్నారు. ప్రకృతికి దగ్గరగా ఉన్న వారి రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం, ఒత్తిడి కూడా చాలా తక్కువగా ఉన్నట్లు తమ అధ్యయనంలో తెలిసిందని వివరించారు. పచ్చదనానికి దగ్గరగా ఉన్న వారి ఎంగిలిలో ఒత్తిడిని సూచించే కార్టిసాల్ రసాయనం తక్కువగా ఉందని తెలిపారు. -
మొక్కలే అతడి ప్రాణం..
నెక్కొండ: మండలంలోని పెద్దకొర్పోలు గ్రామానికి చెందిన ఓ వన ప్రేమికుడు అనువుగాని చోట పెరుగుతున్న చెట్లను సంరక్షిస్తున్నాడు. వివరాలలోకి వెళ్తే... గ్రామానికి చెందిన పరుపాటి ఇంద్రసేనారెడ్డికి చెట్లంటే ప్రాణం. ఈ మేరకు అనువుగాని చోటైన తాటి చెట్ల కొమ్మల్లో పెరుగుతున్న చెట్లకు ప్రాణం పోస్తున్నాడీ వనప్రేమికుడు. పాము చంద్రయ్య, అమ్మ వెంకన్నల సహాయంతో 20 చెట్లను వేర్లతో తీసి అనువైన ప్రదేశాలలో నాటేందుకు సిద్ధపడ్డాడు. అందులో భాగంగానే గ్రామంలోని ప్రధాన వీధుల వెంట, కస్తూర్భాగాంధీ గురుకులం, ప్రభుత్వం పాఠశాల ఆవరణ, పంచాయతీ కార్యాలయాలలో నాటించారు. ఆయన కృషిని గుర్తించిన గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అటు సేంద్రియ పంటలు ఇటు ఇంటిపంటలు!
‘సాక్షి సాగుబడి’ పేజీలో ‘ఇంటిపంట’, ప్రకృతి వ్యవసాయ కథనాలతో స్ఫూర్తిపొందిన యలమంచి వంశీ అనే యువరైతు గత రెండేళ్లుగా రసాయనాలు వాడకుండా వరి, మిర్చి సాగుతోపాటు మిద్దె తోటను సాగు చేస్తూ కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. తమ కుటుంబానికే కాకుండా బంధుమిత్రులకూ రసాయనిక అవశేషాల్లేని ఆరోగ్యదాయకమైన పంటలు అందిస్తూ ఇతరులకు స్ఫూరినిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలోని ఆంధ్రకేసరి కాలనీ నివాసి అయిన వంశీ.. తన తండ్రి హయాంలో 23 ఏళ్ల క్రితం నిర్మించిన నివాస భవనంపైన రెండేళ్ల క్రితం సిమెంటు బెడ్స్ నిర్మించి మిద్దె తోట పెంచుతూ ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలు తింటున్నారు. 1400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న టెర్రస్‌పైన 17 మడులను ఇటుకలతో నిర్మించి సిమెంటు ప్లాస్టింగ్ చేయించారు. టెర్రస్ మీద ఒక అడుగు ఎత్తున ఖాళీ ఉంచి మడులు నిర్మించారు. 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పున మడి నిర్మించారు. అడుగు లోతున మట్టి, పశువుల ఎరువు, కొబ్బరి పొట్టు మిశ్రమాన్ని నింపి కూరగాయలు పండిస్తున్నారు. ప్రస్తుతం వంగ, బెండ, దొండ దిగుబడి వస్తోంది. క్యాబేజి, బీట్రూట్ కూడా ఉన్నాయి. ఆపిల్ బెర్ తదితర పండ్ల మొక్కలు కూడా వేశారు. పంచగవ్య, వేస్ట్‌డీకంపోజర్, జీవామృతం, కషాయాలతో వరి, మిర్చి సాగు చేస్తున్న వంశీ మిద్దె తోటను కూడా శ్రద్ధగా సాగు చేస్తున్నారు. మారుమూల పల్లెటూర్లో సేంద్రియ వ్యవసాయం చేయడంతోపాటు ఇంటిపైన కూరగాయలు పెంచడం పలువుర్ని ఆకర్షిస్తోంది. సేంద్రియ వరి బియ్యాన్ని, మిర్చి పొడిని హైదరాబాద్‌లోని ఆర్గానిక్ షాపులకు ఇస్తున్నారు. సేంద్రియ ఉత్పత్తులను రుచి చూసిన వారు మళ్లీ అడుగుతుండటంతో మరింత ఉత్సాహం కలుగుతోందని, ఈ ఏడాది ఎకరంలో మిర్చితోపాటు 9 ఎకరాల్లో వరిని సాగు చేస్తున్నానని వంశీ తెలిపారు. గ్రామాల్లో సైతం మిద్దె తోటలు నిర్మించుకుంటే ఎండాకాలం ఇల్లు చల్లగా ఉంటుంది. మిద్దెతోట కూరగాయలను తమ కుటుంబ సభ్యులు ఇష్టంగా తింటున్నారని వంశీ (99089 97969) తెలిపారు. -
అవుట్డోర్తో ఆ వ్యాధులకు చెక్..
లండన్ : పచ్చని తోటల్లో ఆహ్లాదకర వాతావరణంలో విహరిస్తే మానసిక ఉల్లాసమే కాదు మధుమేహం, గుండెజబ్బులు, అధిక రక్తపోటు సహా చివరికి ఒత్తిడీ దరిచేరదని తాజా అథ్యయనం తేల్చిచెప్పింది. కలివిడిగా ఉండటం మానసిక, శారీరక ఆరోగ్యాలపై పెనుప్రభావం చూపుతుందని ఈ భారీ సర్వేలో వెల్లడైందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అథ్యయనం నేపథ్యంలో పచ్చని వాతావరణంలో గడపాలని రోగులకు ఇక వైద్యులు సూచించే అవకాశం ఉంది. అమెరికా, బ్రిటన్‌తో పాటు దాదాపు 20 దేశాలకు చెందిన కోట్లాది మందిపై జరిపిన పరిశోధన అనంతరం యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా శాస్త్రవేత్తలు ఈ అంశాలను నిగ్గుతేల్చారు. ప్రకృతి సహజమైన పచ్చిక బయళ్లలో సమయం గడపడం ద్వారా అంతులేని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని తమ సర్వేలో వెల్లడైనట్టు పరిశోధకులు తెలిపారు. ప్రకృతి ఒడిలోఅధిక సమయం వెచ్చించడం ద్వారా టైప్ టూ డయాబెటిస్, గుండె జబ్బులు, అకాల మరణం ముప్పును నిరోధించవచ్చని, నిద్ర లేమిని నివారించవచ్చని అథ్యయన రచయిత కోమి బెన్నెట్ పేర్కొన్నారు. పార్కులు, ఉద్యానవనాలు, పచ్చికబయళ్లతో కూడిన సహజమైన ప్రకృతితో సహవాసం హృదయ స్పందనలను సమన్వయం చేయడంతో పాటు ఒత్తిడినీ దూరం చేస్తుందన్నారు. ప్రకృతి ఒడిలో సేదదీరే వారు సహజంగానే శారీరక శ్రమతో పాటు నలుగురితో కలివిడిగా ఉంటారని ఇది వారి ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నారు. సహజసిద్ధమైన వాతావరణంలో ఉండే వైవిధ్య బ్యాక్టీరియాలు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు వాపులను నిరోధిస్తాయన్నారు. ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ జర్నల్‌లో తాజా అథ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. -
కందకాలతో నీటి లభ్యత పెరిగింది!
కందకాలు తవ్వించుకోమని చెబితే వినిపించుకుని అనూహ్యమైన రీతిలో సాగు నీటి భద్రత సాధించిన సొంత భూముల రైతులు చాలా మంది కనిపిస్తున్నారు. అయితే, కౌలు రైతులు కూడా కందకాలు తవ్వించుకోవడం అరుదైన విషయం. రామిశెట్టి వెంకటేశ్వరరావు(95020 50975), డా. కంచర్ల ప్రవీణ్(87128 45501).. అనే మిత్రులు చాలా సంవత్సరాలు విదేశాల్లో ఉద్యోగాలు చేసి స్వదేశం వచ్చేసి ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం షారాజిపేటలో 12 ఎకరాల భూమిని పదేళ్ల పాటు కౌలుకు తీసుకున్నారు. 3 బోర్లు వేస్తే 2 ఇంచుల నీళ్లు వచ్చాయి. అయితే, ఇసుకపాళ్లు ఎక్కువగా ఉన్న ఎర్ర నేల కావడంతో మంచి దిగుబడులు తీయాలంటే వాన నీటి సంరక్షణ ద్వారా సాగు నీటి భద్రత సాధించడం అతిముఖ్యమని భావించారు. గూగుల్ సెర్చ్ చేస్తే.. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం, సాక్షి ఆధ్వర్యంలో సాగు భూమిలో అంతటా కందకాలు తవ్వుకునే పద్ధతి గురించి తెలిసింది. సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి(99638 19074)ని సంప్రదించి.. 2017 మే/జూన్‌లో ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో మీటరు లోతు, మీటరు వెడల్పున కందకాలు తవ్వించారు. పుష్కలంగా వర్షాలు పడడంతో అనేకసార్లు కందకాలు నిండాయి. ఆరు నెలల్లో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. కలబంద+ఉల్లి, ఆపిల్ బెర్, చెరకు, మునగాకు, పందిరి కూరగాయలను సాగు చేస్తున్నారు. ‘అంతకుముందు డ్రిప్ ద్వారా 3 వాల్వులకు సరిపోని నీటి ప్రెజర్, 6–7 వాల్వులకు పెరిగింది. పక్క తోటల వాళ్లను అడిగితే తమకు తేడా లేదన్నారు. అప్పుడు మాకు అర్థమైంది. కందకాలు తవ్వి వర్షపు నీటిని ఇంకింపజేయడం వల్లనే ప్రెజర్ రెట్టింపైంది. డ్రిప్ నీటి ప్రెజర్ ఈ ఎండాకాలంలో కూడా తగ్గలేదు..’ అని వెంకటేశ్వరరావు ఇటీవల ‘సాగుబడి’తో చెప్పారు. -
ఏనుగుల ప్రవృత్తి ఇలా ఉందేం?!
ప్రకృతిలో కనిపించే కొన్ని ప్రతిచర్యలూ, ప్రవృత్తులు వింతగా అనిపిస్తుంటాయి. ఇదేమిటి.. ఇలా జరుగుతుందేమిటి అనే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఉదా : అడవి పచ్చగా లేనప్పుడు ఆహారం కోసం ఏనుగులు అలమటిస్తూ ఉంటాయి. వర్షాలు మొదలై చెట్లు పచ్చబారగానే ఆ లేత చిగుళ్లు తినేటప్పుడు వాటి ప్రవర్తన ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. చిగురిస్తూ పక్కలకు పెరిగే ఆ కొమ్మల్ని అడ్డంగా విరిచేస్తుంటాయవి. కొన్నిసార్లయితే కొన్ని మొక్కలకు మొక్కల్నే పెరికి అవతల పారేస్తుంటాయి. వేసవిలో ఆహారం అంతగా దొరకనప్పుడు అంతకంతకూ అలమటించిపోయాయి కదా.. మరి ఇప్పుడు హాయిగా ఆ లేత చిగుర్ల మేతను మేయవచ్చు కదా. మనిషి మరో ముద్ద ఎక్కువ తిన్నట్టు... కావాలంటే ఏనుగూ మరో కొమ్మ ఎక్కువ తినవచ్చు. కానీ ఏమిటీ వృథా? అందునా ఏనుగులు చాలా తెలివైనవి. ఒక్కసారి తాము పడిన కష్టాన్నీ... ఒక్కసారి తమకు దొరికిన నీటి వనరును ఎన్నడూ మరచిపోవు. ఎప్పుడూ గుర్తుంచుకుంటాయి. ఆ కష్టకాలపు అనుభవంతో రాటుదేలి, మరో సీజన్‌కు అదే కష్టం రాకుండా జాగ్రత్తపడతాయి. మరి ఇంతటి జాగ్రత్తపరుల చేత ఈ దుందుడుకు వ్యవహారాన్ని ఎందుకు చేయిస్తుంది ప్రకృతి? ఎందుకంటే.. మరుసటి ఏడాదికి మరో తరం పుట్టుకొస్తుంది. అవి ఏనుగులు మాత్రమే కాదు... మరెన్నో జీవరాశుల సంతానాలు! వాటన్నింటికీ తగినన్ని చెట్లూ, ఆకులూ, తద్వారా వచ్చే పండ్లూ ఫలాలూ కావద్దూ?! అందుకే ఏనుగులు చిన్నా చితకా చెట్లను పీకిపారేస్తాయి. అలా మరిన్ని అదనపు చెట్లకు అవసరమైన నేలను తయారు చేస్తాయి. సూర్యకాంతికి అడ్డొస్తున్న పక్కలకు పాకే కొమ్మలను విరిచేస్తాయి. తద్వారా ఆ కాంతి సువిశాలమైన స్థలంలోకి ధారాళంగా వచ్చేలా చేస్తాయి. ఇలా మరిన్ని ఫలవంతమైన వృక్షాలకు అనువైన నేలను తయారు చేస్తాయి. తమతో పాటు మరిన్ని జీవులకు అవసరమైన ఆహారం కోసం... అదనపు ఫలాల కాపుకు రంగం సిద్ధం చేస్తాయి. విధ్వంస ప్రక్రియల్లోను, విరిచేసే ప్రక్రియల్లోనూ మరెన్నో జీవరాశులకు మేలు చేసే గుణాన్ని ఇన్స్టింక్ట్ ద్వారా దేవుడు ఏనుగు లాంటి జంతువులకు ఇచ్చాడు. విధ్వంసం సరే... మరి నిర్మాణాత్మకమైన పనులు చేస్తాడన్న పేరున్న మనిషికి ఇచ్చిన విచక్షణ ఏమిటి? దాంతో అతడు చేస్తున్నదేమిటి? ఆలోచించాలి. ఒక చెట్టును నరికేముందు వంద చెట్ల మొక్కలను నాటేందుకు ఆలోచించే పనేముంది?! -
కట్నంగా 1001 మొక్కలు
కేంద్రపర (ఒడిషా): ఒడిషాలోని కేంద్రపర జిల్లాలో ఓ ప్రకృతి ప్రేమికుడు కట్నానికి బదులుగా 1001 మొక్కలు అమ్మాయి తల్లిదండ్రుల నుంచి అందుకున్నాడు. 33 ఏళ్ల సరోజ్కాంత బిశ్వాల్ అనే ఈ స్కూల్ టీచర్ ఈ విధంగా ప్రకృతిపై తన ఇష్టాన్ని చాటుకున్నాడు. కట్నానికి తాను బద్ధ వ్యతిరేకినని, దానికి బదులుగా తనకు ఈ పండ్ల మొక్కలు ఇవ్వాలని వధువు తరఫు వారిని కోరినట్లు బిశ్వాల్ చెప్పారు. శనివారం ఆయన వివాహం జరిగింది. బిశ్వాల్ వివాహం టపాసులు కాల్చడం లాంటి ఆడంబరాలు లేకుండా జరిగిందని వధువు గ్రామస్తులు చెప్పారు. కట్నం నిరాకరించి, ఇలా మొక్కలు తీసుకోవడం తన భార్య రష్మిరేఖకు చాలా సంతోషం కలిగించిందని బిశ్వాల్ చెప్పారు. రష్మిరేఖ కూడా ఉపాధ్యాయురాలే. -
నాన్ బీటీ.. నాదే విత్తనం!
విత్తనమే లేకుంటే వ్యవసాయమే లేదు. పది వేల సంవత్సరాల క్రితం నుంచీ రైతులు తాము పండించిన పంటలో నుంచే మెరుగైన విత్తనాన్ని సేకరించి దాచుకుని.. తర్వాత సీజన్లో విత్తుకుంటున్నారు. అంతేకాదు, ఇతర రైతులతో విత్తనాలు ఇచ్చి పుచ్చుకుంటున్నారు. అమ్ముతున్నారు. ఇది రైతుకున్న హక్కు. విత్తన సార్వభౌమత్వమే రైతు స్వాతంత్య్రానికి ప్రాణాధారం. అయితే, విత్తనం కంపెనీల సొత్తుగా మారిపోయిన ఆధునిక కాలంలోనూ.. విత్తనం కోసం అంగడికి పోకుండా.. తమదైన సొంత విత్తనాన్ని అపురూపంగా కాపాడుకుంటున్న రైతు కుటుంబాలు లేకపోలేదు. వరి వంటి పంటల్లో సొంత విత్తనాన్నే వాడుకుంటున్న రైతులు చాలా చోట్ల కనిపిస్తారు. అయితే, ఆశ్చర్యకరమేమిటంటే ఏళ్ల తరబడీ పత్తి, మిర్చి పంటల విత్తనాలూ సొంతవే వాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అధిక దిగుబడులు తీస్తున్న కుటుంబాలు చాలా అరుదనే చెప్పాలి. అటువంటి అరుదైన రైతు దంపతులు లావణ్య, రమణారెడ్డి! రమణారెడ్డి, లావణ్య దంపతుల స్వగ్రామం కారువంక(నాగర్‌కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం). ఇతర పంటలతోపాటు గత 29 ఏళ్లుగా పత్తి పండిస్తున్న కుటుంబం ఇది. గత ఎనిమిదేళ్లుగా పత్తి, మిర్చి పంటలకు సొంత విత్తనాలనే వాడుకుంటూ రైతు లోకానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. పత్తిని వర్షాధారంగా, మిర్చిని డ్రిప్‌తో సాగు చేస్తున్నారు. పంట ఏదైనా కుటుంబ సభ్యులందరూ నిమగ్నమై పొలం పనులు చేసుకోవడం వీరి అలవాటు. 2010 నుంచి సుభాష్ పాలేకర్ చూపిన బాటలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. నాన్ బీటీ సూటిరకం లోకల్ పత్తి విత్తనాన్నే గత ఎనిమిదేళ్లుగా వాడుతున్నారు. తమ పత్తి పంటలో 2,3 విడతల తీతల్లో నాణ్యత ఉన్న చెట్ల నుంచి దూదిని సేకరించి విత్తనం కోసం వేరుగా పక్కన పెట్టుకుంటారు. దగ్గర్లోని జిన్నింగ్ మిల్లులో ఆ పత్తిని జిన్నింగ్ చేయించి, గింజలను శుద్ధి చేయించి ఇంటికి తెచ్చుకుని తర్వాత పంట కాలంలో విత్తుకుంటారు. క్వింటా పత్తి నుంచి 65 కిలోల వరకు విత్తనాలు వస్తాయని, వాటిని శుద్ధి చేయించి ప్రతి ఏటా విత్తుకుంటున్నామని రమణారెడ్డి తెలిపారు. మార్కెట్లో కంపెనీలు అమ్మే జన్యుమార్పిడి పత్తి విత్తనాలను కొనుగోలు చేయకుండా పత్తిని సైతం తన సొంత నాన్‌బీటీ సూటి విత్తనంతోనే సాగు చేస్తున్నామని తెలిపారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు.. ఏవీ వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే సాగు చేస్తున్నారు. ఆవులు, ఎద్దులన్నీ కలిపి 16 ఉన్నాయి. ఎకరానికి ఘనజీవామృతం మొత్తం 600 కిలోలు, 400 లీ. ద్రవ జీవామృతం, అవసరం మేరకు కషాయాలు వాడుతున్నారు. ప్రతి పది పత్తి సాళ్లకు ఒక సాలు కందిని విత్తుతున్నారు. ఘనజీవామృతం దుక్కి ఎకరానికి వంద కిలోలు వేస్తారు. జీవామృతాన్ని నెలకోసారి పది రెట్లు నీటితో కలిపి మొక్కకు పోస్తారు, నెలకోసారి పిచికారీ చేస్తారు. దీపావళి రోజుల్లో పత్తిలో ఆవాలను అంతరపంటగా చల్లుతారు. తమ పత్తి పంటకు గులాబీ రంగు పురుగు బెడద అసలు లేకపోవడం విశేషం. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఎకరానికి వర్షాధారంగా 12–15 క్వింటాళ్ల పత్తి దిగుబడి పొందుతున్నారు. గత ఏడాది 18 ఎకరాల్లో అధిక వర్షాల కారణంగా కొంత నష్టం జరగడంతో 219 క్వింటాళ్ల (ఎకరానికి 12 క్వింటాళ్ల చొప్పున) పత్తి దిగుబడి వచ్చిందని రమణారెడ్డి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. ఈ ఏడాది 10 ఎకరాల్లో నాన్ బీటీ పత్తిని ఇప్పటికే విత్తామని, మరో పదెకరాల్లో త్వరలో విత్తబోతున్నామని చెప్పారు. రోహిణీ కార్తెలోనే విత్తుకోవడం..! రోహిణీ కార్తెలో వర్షానికి ముందే తాము ఎకరానికి 3 కిలోల విత్తనాన్ని సాళ్లుగా విత్తుకుంటామని, అధిక దిగుబడి పొందడానికి ఇదే ముఖ్యకారణమని రమణారెడ్డి చెబుతున్నారు. ఒక వేళ వర్షాలు సరిగ్గా లేక విత్తనంలో సగం మొలిచినా మంచి దిగుబడే వస్తున్నదని, ఇది గత ఎనిమిదేళ్లుగా తమ అనుభవమని ఆయన అంటున్నారు. తమ సొంత విత్తనమే కాబట్టి పూర్తిగా మొలవకపోయినా మళ్లీ విత్తనం వేసుకోవచ్చన్న భరోసా వీరిలో కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు తమకు ఆ అవసరం ఎప్పుడూ రాలేదని అంటున్నారాయన. ఆరుద్రలో మిరప, వరి నారు.. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఎండు మిరపను డ్రిప్‌తో సొంత విత్తనంతో సాగు చేస్తూ.. ఎకరానికి 30–36 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందుతూ రమణారెడ్డి, లావణ్య తమ ప్రత్యేకత చాటుతున్నారు. నాగపూర్‌లో ఒక రైతు నుంచి గత 14 ఏళ్ల క్రితం హర్షవర్ధిని మిరప విత్తనాన్ని తెచ్చారు. 2,3 కోతల్లో మంచి నాణ్యతతో ఉన్న కాయలను విత్తనానికి పక్కన పెట్టుకుంటూ.. ఇప్పటికీ అదే వంగడం వాడుకుంటున్నామని తెలిపారు. 9 నెలల పంటకాలంలో 5 విడతలుగా ఎకరానికి 2 నుంచి 4 టన్నుల వరకు ఘనజీవామృతం వేస్తారు. 5 విడతల్లో ఎకరానికి వెయ్యి లీ. ద్రవజీవామృతం ఇస్తున్నారు. గత ఏడాది 3 ఎకరాల్లో ఎండు మిరప సాగు చేశారు. ఆరుద్ర కార్తెలో మిరప, వరి నార్లు పోసుకుని నాటు వేస్తారు. మొదట్లోనే మిర్చి పొలం చుట్టూ ఎర పంటగా ఆవాలు చల్లడం ద్వారా పురుగుల తాకిడిని అదుపు చేస్తున్నారు. మొక్కనాటిన 3 నెలల తర్వాత ధనియాలు, మెంతులు, గోధుమలు, పప్పుశనగ వంటి స్వల్పకాలిక అంతర పంటల విత్తనాలు చలుతున్నారు. గత ఏడాది ఎకరానికి 30 క్వింటాళ్ల ఎండు మిర్చి దిగుబడి తీశామని రమణారెడ్డి(99513 41819) వివరించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పూర్తిస్థాయిలో అనుసరిస్తే నాన్‌బీటీ సూటిరకం పత్తి, మిరప పంటలను కూడా నిశ్చింతగా సాగు చేసి మంచి దిగుబడులు పొందవచ్చని ఈ రైతు దంపతులు చెబుతున్నారు. ఇదేమి చోద్యం?! రమణారెడ్డి, లావణ్య గత 8 ఏళ్లుగా ప్రకృతి సేద్యంలో చేస్తున్న సఫల ప్రయోగాలపై వ్యవసాయ విశ్వవిద్యాలయం, స్పైసెస్ బోర్డు పట్టించుకున్న దాఖలాల్లేవు. అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే ముఖ్యమైన వాణిజ్య పంటలపై 8 ఏళ్ల క్షేత్రస్థాయి ఆదర్శ సేద్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం విడ్డూరం! -
వెరైటీగా ఉంది.. సెహ్వాగ్ వీడియో వైరల్
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సెలబ్రిటీలలో టీమిండియా మాజీ క్రికెటర్, విధ్వంసకర ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఒకరు. ప్రకృతి గురించి ఆలోచించాలంటూ ప్రభుత్వాలతో పాటు పలువురు సెలబ్రిటీలు తరచుగా చెబుతుంటారు. ఈ క్రమంలో సెహ్వాగ్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చెక్క(కట్టె)తో రూపొందించిన బైక్‌పై వెళ్తుండగా ఈ వీడియో తీశారు. బైకు మీద వెళ్తున్న వ్యక్తికి తన బైక్‌తో పాటు ప్రకృతి అంటే కూడా చాలా ఇష్టమంటూ ట్వీట్ చేశారు. కచ్చితంగా వాడాల్సిన పార్ట్స్ మినహా ఇతర బైక్ విడి భాగాలు చెక్కతో తయారు చేశారు. ప్రకృతితో కలిసి ఉంటున్న భావన కలగాలని అతడు ఈ బైక్ వాడుతున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా, చెట్లను కొట్టివేసి బైకును తయారుచేశారు కదా అని మరికొందరు ట్వీట్లు మొదలుపెట్టారు. Bike se pyaar , Nature se bhi pyaar ! pic.twitter.com/Qxn0ckGrea — Virender Sehwag (@virendersehwag) 8 June 2018 -
చెక్క బైక్‌పై సెహ్వాగ్
-
యూట్యూబ్ సేద్యం
తాము బాగుండాలి. భూమి బాగుండాలి. సమాజం అంతా ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో యువ రైతు సోదరులు దండవేని నరేష్, సురేష్ నడుము బిగించారు. జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలంలోని అల్లీపూర్ వారి స్వగ్రామం. 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గతంలో తల్లిదండ్రులు తోటి రైతుల మాదిరిగానే విరివిగా రసాయనిక ఎరువులు వాడటంతో భూమి తేమను నిలుపుకునే శక్తిని కోల్పోయింది. దీనికి తోడు వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో నీళ్లు లేక పంటలు పండలేదు. దీంతో, ఇంటి అప్పులు వడ్డీలతో కలిపి రూ.16 లక్షలకు పెరిగాయి. డిగ్రీ చదివిన అన్న నరేష్ దుబాయ్ వెళ్లాడు. కానీ, రెండు, మూడేళ్ల తర్వాత స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. తమ్ముడు సురేష్ పదో తరగతి పూర్తి చేసి, రసాయన ఎరువులు వాడుతూ వ్యవసాయం చేస్తుండేవాడు. తదనంతరం ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకొని, ఆ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న రైతుల పొలాలను సందర్శించి అవగాహన పెంచుకున్నారు. దీనికి తోడు యూట్యూబ్ ద్వారా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తెలుసుకొని ఆచరించడం మొదలుపెట్టారు. పిచ్చోడని ఇంట్లో వాళ్లే తిట్టారు..! ప్రకృతి సాగు పద్ధతిలో తొలి రెండేళ్లు అంతంతమాత్రంగానే పంట పండింది. ఆ ఏడాది పంటలకు ధరలు బాగున్నాయి. దీంతో, ఇంట్లోవాళ్లు ఇదేం పద్దతి, పంట కూడా రావడం లేదని, ఇద్దరు అన్నదమ్ములు పిచ్చోళ్లమాదిరిగా తయారయ్యారు అంటూ తిట్టారు. మా ఊరోళ్లు అయితే, ఈ పద్దతిలో మీరు వ్యవసాయం చేస్తే ఉన్న భూమి అమ్ముడు ఖాయం అంటూ ముఖం మీదే చెప్పడం చేసారు. అయినప్పటికి, మేము చేసే పనులను మేము చేసుకుంటూ పోయేవాళ్లం. గత రెండేళ్ల నుండి మిగత రైతులు పొలాలకు ఏదో ఒక జబ్బు వచ్చి పంట పోయేది. కానీ మా పొలంలో ఎప్పుడూ దెబ్బతినలేదు. ఇది చూసిన తర్వాత మా మీద నమ్మకం కుదిరి కుటుంబసభ్యులు సహకరించడం మొదలుపెట్టారు. పందిళ్ల కింద కూడా తోటలు.. గత నాలుగేళ్లుగా 2 ఎకరాలలో మామిడి, 4 ఎకరాలలో వరి, 2 ఎకరాలలో కూరగాయలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. మూడు ఆవుల మూత్రం, పేడతో ఘనజీవామృతం, జీవామృతం తయారు చేస్తున్నారు. తెగుళ్లు, పురుగుల నివారణకు అగ్నిస్త్రం, నీమాస్త్రం, దశపర్ణ కషాయం వాడతున్నారు.బీరకాయ, సొరకాయ, కాకర కాయలను పందిరి పద్దతిలో సాగు చేస్తున్నారు. ఆ పందిళ్ల కింద పాలకూర, తోటకూర, టమాట, బెండ, గోరు చిక్కుడు సాగు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ దుకాణం ఏర్పాటు చేసి మార్కెట్ రేటు కంటే 20 శాతం అదనపు ధరకు అమ్ముతున్నారు. బియ్యం, కందిపప్పు, శనగలు, పసుపు, కారం, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, నువ్వులను కూడా విక్రయిస్తున్నారు. వాకింగ్ క్లబ్‌ల వద్ద కూడా రసాయన అవశేషాల్లేని తమ ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్నారు. మట్టి ద్రావణం.. సీవీఆర్ పద్ధతిలో భూమి పై నుంచి సేకరించిన 7 కిలోల మట్టి, భూమి 2 అడుగుల లోతు నుంచి తీసిన 7 కిలోల మట్టిని 200 లీటర్ల నీటిలో కలపాలి. కొంత సేపటి తర్వాత, గుడ్డతో ఆ మట్టి ద్రావణాన్ని వడపోసి పంటలపై పిచికారీ చేస్తే, మొక్కలకు అవసరమైన పోషకాలు అందుతాయి. ఇలా తయారు చేసిన మట్టి ద్రావణాన్ని వరి, కూరగాయలు, పండ్ల తోటలకు పిచికారీ చేస్తున్నారు. ఫిష్ అమినోయాసిడ్ ద్రావణం: కిలో చేపల(పనికిరాని వ్యర్థాల)ను చిన్న ముక్కలు చేసి, వీటికి కిలో బెల్లం కలిపి డ్రమ్ములో మురగబెట్టాలి. ఉదయం, సాయంత్రం కలుపుతూ ఉండాలి. 15 రోజుల తర్వాత గుడ్డలో వడపోసి, వచ్చిన ద్రావణాన్ని కూరగాయలు, వరి పొలానికి పిచికారీ చేస్తున్నారు. మొక్కల పెరుగుదలకు ల్యాబ్ కుండలో బియ్యం కడిగిన నీరు ఒక లీటరుకు 3 లీటర్ల అవు పాలను కలిపి.. నాలుగు రోజుల పాటు చల్లని ప్రదేశంలో ఉంచాలి. దీనివల్ల పైన పెరుగు గడ్డలాగా పేరుకుంటుంది. దాన్ని తీసివేసి కింది ద్రావణాన్ని మొక్కలకు పిచికారీ చేస్తున్నారు. లాక్టిక్ యాసిడ్ బాక్టీరియా(లాబ్) అంటారు. ఇది మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. కూరగాయల సాగు ఇలా.. ఆవు పేడ, ఆవు మూత్రంతో తయారు చేసిన ఘనజీవామృతాన్ని ఎకరానికి వంద కిలోల చొప్పున దుక్కిలో చల్లారు. కూరగాయ çపంటలపై ప్రతి 15 రోజుల కొకసారి జీవామృతాన్ని పిచికారీ చేస్తున్నారు. నీమాస్త్రం, అగ్నిస్త్రం, దశపత్ర కషాయాలతో తెగుళ్లను నియంత్రించారు. మొక్కల పెరుగుదలకు ‘ల్యాబ్’ను ఉపయోగించడంతో కూరగాయలు ఏపుగా పెరుగుతున్నాయి. వరి పంట కోసం... వరి పొలం దుక్కిలో ఘనజీవామృతం వాడారు. ప్రతి 15 రోజుల కొకసారి జీవామృతాన్ని నీటితో కలిపి ఇస్తున్నారు. నెల రోజుల తర్వాత ఫిష్ అమినోయాసిడ్‌ను పిచికారీ చేశారు. మొక్కల పెరుగుదలకు చాలా ఉపయోగపడింది. మొగి పురుగు నివారణకు నీమాస్త్రం, అగ్నిస్త్రం వాడారు. వరి పొట్ట దశలో సీవీఆర్ పద్ధతిలో మట్టి ద్రావణంతో పాటు పుల్లటి మజ్జిగను పిచికారీ చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయి. మామిడి పంటకు.. ప్రతి 20 రోజుల కొకసారి డ్రిప్ ద్వారా జీవామృతం ఇస్తున్నారు. పూత దశలో జీవామృతాన్ని పిచికారీ చేశారు. ముందస్తు జాగ్రత్తగా తెగుళ్లు, పురుగుల నివారణకు అగ్నిస్త్రం, దశపర్ణ కషాయం, వరి పిండి ద్రావణాన్ని పిచికారీ చేశారు. మామిడి చెట్ల మొదళ్ల దగ్గర తేమ త్వరగా ఆరిపోకుండా ఉండేందుకు పసుపు ఆకును ఆచ్ఛాదనగా వేశారు. పసుపు ఆకు తేమను కాపాడటంతో పాటు నెమ్మదిగా కుళ్లి సేంద్రియ ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. మా తోట వద్దకు వచ్చి చూడమంటాం! గతంలో రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడి చేతులు కాల్చుకున్నాం. మూడు ఆవులను కొనుగోలు చేసి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. పండించిన కూరగాయలు, బియ్యం తదితర ఉత్పత్తులను నేరుగా జనం వద్దకే వెళ్లి అమ్ముకుంటున్నాం. రసాయనాలు వాడకుండా పండించినవేనా అన్న అనుమానం ఉంటే.. వచ్చి మా తోటను చూడండని చెబుతుంటాం. ప్రతి రైతూ కొద్ది భాగంలోనైనే ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరించడం మొదలు పెట్టాలి. ఇది భూమికి, రైతుకు.. అందరికీ మంచిది. ఆరోగ్యకరమైన సమాజమే మా లక్ష్యం. – దండవేని నరేష్, సురేష్ (96409 63372) అల్లీపూర్, రాయికల్ మండలం, జగిత్యాల జిల్లా – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి అగ్రికల్చర్, జగిత్యాల, ఫొటో: ఏలేటి శైలేందర్ రెడ్డి -
చందనపు చల్లన
వేసవి ఊపు మీద ఉంది. సూరన్న శివాలూగుతున్నాడు. రానున్న రెండు మూడు వారాలు కీలకమైనవి. జాగ్రత్త పడాల్సినవి. సూర్యుడి వేడి ప్రకృతికి ఒక సహజ అవసరం. ఈ సహజ అవసరంలోని తీవ్ర క్షణాలను సహజ రక్షణ కవచాలతోనే మనం ఎదుర్కోవాలి. అందుకు ఏం చేయాలి. వినండి.ఇంట్లోనే ఉన్నాం కదా అని సరిగా నీళ్లు తాగకుండా ఉండకూడదు. నీళ్లు తాగకపోవడం వలన డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. తగినన్ని నీళ్లు తాగకపోతే నిద్ర లేమి, అజీర్తి సమస్యలు కూడా తలెత్తుతాయి. కీర దోస, పుచ్చకాయ, నిమ్మరసం, కొబ్బరి బొండాలు, పండ్ల రసాలు, రాగి జావ వంటివి తీసుకుంటూ, కాఫీ, టీలను తగ్గించాలి. నిల్వ ఉన్న ఆహారం కాకుండా తాజాగా ఉండే పదార్థాలకు ప్రాధాన్యమివ్వాలి. ఎండగా ఉన్నప్పుడు చల్లని పండ్ల రసాలు గొంతులోకి దిగుతుంటే, చల్లగా హాయిగా అనుభూతి కలుగుతుంది. అలాగని ఏవి పడితే అవి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. సోడా నీరు, శీతల పానీయాలు, ఐస్‌క్రీముల జోలికి పోకూడదు. పండ్లు కొనేటప్పుడు వాటి మీద క్రిమిసంహారక మందు ఎంత ఉందో పరిశీలించాలి. ఉదాహరణకు ద్రాక్ష పండ్ల వంటివి. తినడానికి ముందు వాటిని ఉప్పు నీటిలో రెండు సార్లు నానబెట్టి, శుభ్రపరచుకోవాలి. ప్రకృతి సహజసిద్ధంగా ప్రసాదించిన శీతల పానీయం కొబ్బరిబొండం. కొబ్బరి నీళ్లలో చిటికెడు ఉప్పు, పంచదార కలుపుకుని తాగితే డీ హైడ్రేషన్ సమస్య ఉండదు. ఎండలో బయట నుంచి ఇంటికి వచ్చాక, ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకుని కొబ్బరి నీళ్లతో ముఖం కడుక్కుంటే, ఎండవల్ల నల్లగా మారిన చర్మం తాజాదనాన్ని పొందుతుంది. గ్లాసుడు నీళ్లలో టీ స్పూను నిమ్మరసం, టీ స్పూను తేనె వేసి బాగా కలిపి తాగడం వల్ల శరీర వేడి తగ్గుతుంది.నారింజ లేదా కమలాపండ్ల రసం తీసి, అందులో కొద్దిగా పంచదార, తేనె కలిపి తాగితే కడుపు చల్లగా అవుతుంది. వేడి వాతావరణంలో కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. కీర దోసకాయ రసం తీసి, చెంచాడు తేనె, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే మంచిది.గుప్పెడు పుదీనా ఆకులు, చెంచాడు తేనె, రెండు చెంచాల నిమ్మరసం కలిపి మెత్తగా చేసి స్మూతీలా తీసుకుంటే మంచిది. నాలుగు పుచ్చకాయ ముక్కలను జ్యూస్‌గా తీసి అలాగే తాగడం మంచిది. ∙ జామకాయ రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల దీనిని వేసవికాలంలో తీసుకోవడం మంచిది. రసం తీసేటప్పుడు విత్తనాలను తొలగించడం మంచిది. ∙ అన్నిటి కంటె మంచినీళ్లు తాగడం చాలా ముఖ్యం. రోజూ కనీసం మూడు లీటర్ల నీళ్లు తీసుకోవాలి. జీవనశైలిని బట్టి, మరింత ఎక్కువగా నీళ్లు తాగాలని ఆయుర్వేదం చెబుతోంది. వేసవిని ఆయుర్వేదం ఆదాన కాలం అంటుంది. ఈ కాలంలో సూర్యుడు ప్రాణుల నుంచి శక్తిని తీసుకుంటాడు కాబట్టి దానికి ఆ పేరు. ఈ శక్తిని మళ్లీ సమకూర్చుకోవడం ఎలాగో ఆయుర్వేదం చెబుతుంది. ఈ కాలంలో వచ్చే మూత్రంలో మంట, అతిసారం లాంటి అనేక వ్యాధుల్ని వాటి నివారణను సూచిస్తుంది.పళ్లరసాలు తాగిన వెంటనే వాటి దోషాల నివారణగా కొద్దిగా వేడి నీళ్లలో శొంఠి, మిరియాల పొడి (ఒక్కొక్కటి చిటికెడు) కలిపి తాగాలి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లవలసి వస్తే టోపీ కాని గొడుగు కాని వాడాలి.షడంగ పానీయంచందనం (మంచి గంధం), ముస్తా (తుంగ ముస్తలు), ఉశీరం (వట్టి వేరు) ఉదీచ్య (కురువేరు) నాగర (శొంఠి), పర్పాటక... వీటిని దంచి కషాయం కాచుకోవాలి. ఇలా తయారు చేసుకున్నకషాయాన్ని 30 మి.లీ. తీసుకుని అందులో కొంచెం పటికబెల్లం (మిశ్రి) కలిపి రోజూ తాగాలి.జంబీర పానీయం: గ్లాసుడు నీటిలో (300 మి.లీ.) చెంచాడు అల్లం రసం, ఒక చెంచాడు నిమ్మరసం, నాలుగు చెంచాల శర్కర, చిటికెడు ఉప్పు కలిపి తాగాలి.తక్ర పానీయం: పులుపు లేని మజ్జిగను పలుచగా చేసి కొద్దిగా నిమ్మరసం, అల్లం, ఉప్పు, కరివేపాకు, పుదీనా కలిపి వడగొట్టి రోజుకి రెండు మూడుసార్లు తాగాలి. – వి. ఎల్. ఎన్. శాస్త్రి ఆయుర్వేద వైద్య నిపుణులు -
‘ఇంటిపంట’ స్ఫూర్తితో బడిపంట!
పిల్లలకు రసాయనిక ఎరువులు లేకుండా, పురుగుమందులు లేకుండా సేంద్రియ సేద్యమనేది ఒక కల్టివేషన్ మెథడ్‌గా చెబితే.. భవిష్యత్తులో ఈ పిల్లలే బడులుగా మారిపోతారు! ఇన్నాళ్లూ రసాయనాలతో వ్యవసాయం చేస్తూ నష్టపోతున్న పెద్దలు..ఆ బడుల్లో పాఠాలు నేర్చుకుంటారు.. వ్యవసాయం బాగుపడుతుంది.. దేశం బాగుపడుతుందన్న మంచి ఆలోచనతో ‘ఇంటిపంట’ స్ఫూర్తితో మొదలు పెట్టిన ఈ కార్యక్రమం.. ‘బడిపంట’గా మొదలయ్యింది. వర్థిల్లాలి. అందుకే ఈ కథనం.. ‘సాక్షి’ దినపత్రికలో గత ఏడేళ్లుగా ప్రచురితమవుతున్న ‘ఇంటిపంట’ కథనాల స్ఫూర్తితో గుంటూరు నల్లచెరువులోని కలాం థెరిస్సా ఐడియల్ స్కూల్ తన విద్యార్థులకు సేంద్రియ ‘బడిపంట’లపై పాఠాలు చెబుతూ వారిలో సామాజిక స్పృహను పెంపొందిస్తోంది. ప్రాథమికోన్నత, ఉన్నత తరగతుల విద్యార్థులకు రసాయనిక అవశేషాల్లేని ప్రకృతి ఆహారం ప్రాధాన్యతను తెలియజెప్తూ ‘బడిపంట’లను సాగు చేస్తున్నది. భవనం టెర్రస్ మీద గ్రోబ్యాగ్స్‌లో మట్టి, ఘనజీవామృతం, జీవామృతంతో బడిపంటల సాగుకు గత ఏడాది ఖరీఫ్‌లో శ్రీకారం చుట్టారు. మొదట్లో ఆకుకూరలు, కూరగాయలను విద్యార్థులతో స్కూలు భవనంపైనే గ్రోబ్యాగ్స్, బియ్యం బస్తాలలో సాగు చేయించారు. ఈ ఏడాది కూరగాయలతోపాటు మొక్కజొన్న, కొర్ర, సామలు, ఊదలు, అరికలు వంటి సిరిధాన్యాలను సైతం సాగు చేయిస్తున్నారు. 6–9 తరగతుల విద్యార్థులకు ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా కొన్ని గ్రోబ్యాగ్స్‌ను, విత్తనాలు ఇచ్చి వారి ఇళ్ల దగ్గర ఇంటిపంటలు పెంచేలా ప్రోత్సహిస్తున్నారు. పెంచిన పంటలను విద్యార్థులకే పంచిపెడుతున్నారు. వ్యవసాయ విశ్రాంత విస్తరణాధికారి సత్యనారాయణ మూర్తి(94915 82181) మార్గదర్శకత్వంలో స్కూలు కరస్పాండెంట్ షేక్ మస్తాన్ ‘బడిపంట’ కార్యక్రమాన్ని చేపట్టారు. కొర్ర వంటి సిరిధాన్యాలను తాము ఇంతకుముందెన్నడూ చూడలేదని విద్యార్థులు మురిసిపోతూ చెప్పారు. అంతేకాదు.. పంట పొలాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 20 మంది అన్నదాతలను ఆహ్వానించి గత ఏడాది ఘనంగా సత్కరించడం ద్వారా అన్నదాతల్లో, విద్యార్థులలో స్ఫూర్తిని నింపడం విశేషం. పద్మశ్రీ పాలేకర్ ప్రశంసలు అందుకున్న ఈ స్కూలులో ‘బడిపంట’లను పలు స్కూలు యాజమాన్యాలు సందర్శించాయని మూర్తి తెలిపారు. ఇటీవల స్కూలు వార్షికోత్సవంలో ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, పప్పులు, కూరగాయలతోనే విందు ఏర్పాటు చేయడం శుభపరిణామం. స్కూలు యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులకు జేజేలు! మా ఇంటిపంటల రుచి బాగుంది! ఇంటిదగ్గర 11 గ్రోబ్యాగ్స్‌లో కొర్రలు, అలసందలు, మొక్కజొన్నలు పండిస్తున్నా. ఇంతకుముందు ఆకుకూరలు పండించి, వండుకు తిన్నాం. రుచి బాగుంది. పదిరోజులకోసారి స్కూల్లోనే జీవామృతం తయారు చేసుకొని తెచ్చి పోస్తున్నా. మంచి పని చేస్తున్నారు, మున్ముందు ఈ అనుభవం పనికొస్తుంది. బాగా చెయ్యమని మా అమ్మానాన్న అంటున్నారు. తర్వాత వంకాయలు పండిస్తా. అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతా. – షేక్ సల్మా, 9వ తరగతి, నల్లచెరువు, గుంటూరు తన ఇంటిపంటలకు నీరు పోస్తున్న సల్మా ఇంటి పైన సామ,కొర్ర పండిస్తున్నా.. స్కూల్లో గ్రోబ్యాగ్స్‌లో మిరపకాయలు, బెండకాయలు, టమాటాలు, మొక్కజొన్న పండించాం. ప్రాజెక్టులో భాగంగా ఇంటిదగ్గర సామ, కొర్ర, అరికలు వంటి సిరిధాన్యాలు ఇప్పుడు కొన్ని గ్రోబ్యాగ్స్‌లో వేశాను. కంకులు వచ్చాయి. పురుగుమందులు, ఎరువులు వేయకుండా పంటలు పండిస్తే ఆరోగ్యకరమని తెలుసుకున్నాను. మా అమ్మానాన్నా కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇక ముందు కూడా ఇంటిపంటలు పండిస్తాను. – వీర్ల ప్రభు, 9వ తరగతి, నల్లచెరువు, గుంటూరు తమ ఇంటి మేడపైన కొర్ర కంకులు చూపుతున్న ప్రభు ఈ కాయగూరలు తింటే ఆరోగ్యం జీవామృతంతో పండిస్తే కాయగూరలు విషపూరితం కాకుండా ఉంటాయని మా బడిపంట ద్వారా తెలుసుకు న్నాను. వీటిని తింటే ఆరోగ్యం బాగుంటుంది. మంచిది. హేమంత్ సాయి భార్గవ్,6వ తరగతి, నల్లచెరువు, గుంటూరు ఎప్పటికీ ఇంటిపంటలు పండిస్తా! మెంతి విత్తనాలు వేస్తే వారంలో మెంతి కూర వచ్చింది. అందరికీ ఇచ్చా. తోటకూర కూడా జీవామృతం వేసి పెంచాను. మా స్కూల్లో చెప్పటం వల్ల రోగాలు రాకుండా పంటలు ఎలా పెంచాలో తెలిసింది. పెద్దయ్యాక కూడా వేస్తా. ఎస్.యామిని, 7వ తరగతి, నల్లచెరువు, గుంటూరు చైతన్యం కోసమే ‘బడిపంట’! సాక్షి ఇంటిపంట, సాగుబడి కథనాల స్ఫూర్తితో రెండు సీజన్ల నుంచి సేంద్రియ ‘బడిపంట’ల సాగును మా విద్యార్థులకు పరిచయం చేస్తున్నాం. మొదట ఆకుకూరలు, కూరగాయలతో ప్రారంభించాం. వ్యాధులను సైతం నయం చేయగల సిరిధాన్యాలను కూడా ఇప్పుడు స్కూల్లోను, పిల్లల ఇళ్ల దగ్గర కూడా గ్రోబ్యాగ్స్‌లో సాగు చేయిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను సత్కరించాం. పిల్లలకు పంటల సాగు సులువేనని తెలియజెప్పడంతోపాటు ప్రకృతి ఆహారంపై చైతన్యం కలిగించాలన్నదే మా ప్రయత్నం. షేక్ మస్తాన్ (70360 29365), కరస్పాండెంట్,కలాం థెరిస్సా ఐడియల్ స్కూల్, నల్లచెరువు, గుంటూరు నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
అడవిలో చల్లని తల్లి!
ఆమె చేయి చలవ. ఎంత చలవంటే.. ఎంతటి విషమైనా కళ్లు తేలేయాల్సిందే! ఆకులను రెండు చేతులతో నలిపి రసం పిండిందంటే.. ఏ జబ్బయినా ఇట్టే తట్టా బుట్టా సర్దేయాల్సిందే. అది కేవలం ఆమె నిండు మనసుతో ఇచ్చే మందు శక్తి మాత్రమే కాదు. ఆమె నోటి నుంచి జాలువారే చల్లని మాటలు రోగులకు కొండంత ధైర్యాన్నిస్తాయి. తాము త్వరలోనే కోలుకుంటామన్న భరోసానిస్తాయి. అందుకే అందరూ ఆమెను ‘అడవిలో అమ్మ’ అని ఆప్యాయంగా పిలుస్తుంటారు. ఆమె అసలు పేరు లక్ష్మీ కుట్టి. 75 ఏళ్లు. కేరళలోని తిరువనంతపురం జిల్లా కల్లార్ అటవీ ప్రాంతంలో కొండకోనల్లో తాటాకు గుడిసే ఆమె నివాసం.పురుగో, పుట్రో, పామో, తేలో కుట్టిందంటే.. ఎక్కడెక్కడి నుంచో కొండలు ఎక్కి మరీ లక్ష్మీ కుట్టి దగ్గరకు వస్తుంటారు కేరళవాసులు. లక్ష్మీ కుట్టికి అడవి అన్నా, ఔషధ మొక్కలన్నా పంచప్రాణాలు. 50వ దశకంలో చదువుకున్న తొలి గిరిజన బాలిక ఆమే. తండ్రి చదువెందుకన్నా.. పట్టుపట్టి బడికెళ్లింది. రోజూ పది కిలోమీటర్లు నడిచి వెళ్లి కష్టపడి చదువుకుంది. ఆ బడిలో 8వ తరగతి వరకే ఉండటంతో అక్కడితో చదువు ఆగిపోయింది. తల్లి దగ్గర్నుంచి వైద్యం అడవిలోని కనీసం 500 రకాల వ్యాధులు, రుగ్మతలకు మూలికా వైద్యం చేయటం లక్ష్మీ కుట్టి ప్రత్యేకత. అయితే, పాము లేదా తేలు కుట్టిన సమస్యలతోనే ఎక్కువ మంది తన దగ్గరకు వస్తున్నారని ఆమె అంటారు. తన తల్లి దగ్గరి నుంచే ఈ వైద్యం నేర్చుకున్నానని, ఒక్కటి కూడా మరచిపోలేదంటారు. అయితే, ఈ వందలాది ఔషధ మొక్కల గుణగణాల గురించి, వైద్య పద్ధతుల గురించి ఇప్పటి వరకు ఎక్కడా రాసి పెట్టలేదు. ఇది గమనించిన కేరళ అటవీ శాఖ అరుదైన ఈ సంప్రదాయ వైద్య విజ్ఞానాన్ని గ్రంధస్థం చేయాలని ప్రయత్నిస్తోంది. అందుకు లక్ష్మీ కుట్టి సహకారం తీసుకుంటోంది. ప్రకృతి నుంచి ఫార్మసీ ఈ అడవి బామ్మను వెతుక్కుంటూ అవార్డులు వచ్చాయి. 1995లో తొలిగా ‘నాటు వైద్య రత్న’ అవార్డుతో కేరళ ప్రభుత్వం సత్కరించింది. ఈ అవార్డు వచ్చిన తర్వాత దూర ప్రాంతాల నుంచి కూడా జనం ఆమె వద్దకు వైద్యం కోసం వస్తున్నారు. అవార్డుల పరంపరలో తాజాది భారతీయ జీవవైవిధ్య కాంగ్రెస్ అవార్డు(2016). తనతోపాటు రోజూ బడికి వచ్చి చదువుకున్న మేనబావ మతన్ కానిని 16వ ఏట ఆమె పెళ్లాడింది. ‘నేను తీసుకున్న నిర్ణయాల్లో, సాధించిన విజయాలన్నిటిలోనూ ఆయన నాకు తోడు నీడగా ఉన్నాడు. నేను లేకపోయినా నువ్వు ఇవన్నీ సాధించేదానివే. ఎందుకంటే నువ్వు అంతటి ధీర వనితవు అని అంటూ ఉండేవాడు. ‘‘గత ఏడాది చనిపోయే వరకు నాకు సరైన జీవిత భాగస్వామిగా ఉన్నాడు’ అందామె. వారికి ముగ్గురు మగ సంతానం. విషాదం ఏమిటంటే పెద్ద కొడుకును ఏనుగు చంపేసింది. చిన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో అకాల మరణం పాలయ్యాడు. (రెండో కొడుకు రైల్వే చీఫ్ టిక్కెట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు). అయినా ఆమె కుంగిపోలేదు, అడవినీ, వైద్యాన్నీ వదల్లేదు. వ్యంగ్య రచయిత్రి కూడా! లక్ష్మీ కుట్టి మూలికా వైద్యురాలిగా మాత్రమే కాదు, వ్యంగ్యం పండించిన కవిగా, రచయిత్రిగా కూడా కేరళలో ప్రసిద్ధి పొందారు! గిరిజన సంస్కృతీ సంప్రదాయాల గురించి, అడవుల ప్రాముఖ్యత గురించి ఆమె వ్యాసాలు రాశారు. వీటి సంకలనం ప్రచురితమైంది. ‘వీటిని గిరిజన భాషలో కాదు, మళయాళంలోనే రాశాను. అలతి పదాలనే వాడాను. పామరులైనా సులువుగా పాడుకునేలా’ అంటారామె. ‘ఈ అడవే నా ప్రపంచం. బయటి ప్రపంచం నాకు చాలానే ఇచ్చింది. అవార్డులు, సత్కారాలతోపాటు పుస్తకాలనూ ఇచ్చింది. అయినా, నేను అడవిని వదలి బయటికి రాలేను. అడవిలో జీవించాలంటే, ధైర్యం ఉండాలి’ అంటున్నది ఒంటరిగానే అడవిలోనే ఉంటున్న ఈ బామ్మగారు. – పంతంగి రాంబాబు -
భేరుండ బ్రహ్మాండ
గండ భేరుండం అంటే చాలా పెద్దది.. గొప్పది అని అర్థం.పట్టు, డిజైనర్ చీరల మీద.. ఆభరణాల మీదగండభేరుండ చిహ్నం గొప్ప లుక్‌ని, గ్రాండ్‌నెస్‌ని తీసుకొస్తుంది.రాచరికపు హంగు ఈ చిహ్నం సొంతం. అందుకే ఇప్పుడు ఫ్యాషన్ ఆకాశంలో గండభేరుండం ఎగురుతోంది.కొన్నిసార్లు జీవితంలో అంతగా పట్టింపులేని, పట్టించుకోని అంశాల వెనుక ఓ పెద్ద చరిత్ర ఉంటుంది. వాటి పూర్వాపరాలు తెలుసుకునే ప్రయత్నంలో కళాకారుల సృష్టి వెనక దాగున్న ఎన్నో నిజాలు తెలుస్తాయి. ఆ కోవకి చెందినదే గండభేరుండ. వస్త్రాల మీద, ఆభరణాల పైనా గ్రాండ్‌గా కొలువు దీరుతోంది. ఒక శరీరం రెండుతలలు గండభేరుండ అనేది రెండుతలల పక్షి. ఈ పక్షి ప్రాచీనకాలంలో ఉన్నట్లు రుజువులు లేవు. ఇదొక పౌరాణిక గాధ అని చెబుతారు. వేల ఏళ్ల క్రితం గండభేరుండకు సంబంధించి కథనాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో– రాక్షసుడైన హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహస్వామిని శాంతింపజేయడానికి శివుడు శరభ మృగ రూపం ధరించాడని, దానిని ఎదిరించేందుకు నరసింహస్వామి అయిన విష్ణువు రెండుతలలతో, విశాలమైన రెక్కలతో, పదునైన కోరలతో, నల్లని రూపంతో గండభేరుండంలా అవతరించాడని.. అది గరుత్మంతునికన్నా బలమైనదని కథనాలు ఉన్నాయి. కర్నాటకలోని బేలూర్‌లో గల చెన్నకేశవాలయంలో గల గండభేరుండ శిల్పాకృతి ప్రకృతిలోని జీవులన్నింటిలో గండభేరుండం బలమైనదని చాటుతుంది. గ్రాండ్‌గా ఆవిష్కరించారు దక్షిణభారతదేశంలో గండభేరుండకు గల ఘనమైన ఖ్యాతి చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. దేవాలయాల మీద, చారిత్రక కట్టడాల మీద రాచరికానికి హంగుగా ఉన్న భేరుండాన్ని పట్టుదారాలతో చీరల మీద చిత్రించారు నేతకారులు. అపారమైన దైవశక్తికి ప్రతీకగా ఉండే గండభేరుండం డిజైన్‌తో పల్లూ మొత్తం నింపేశారు. మోటిఫ్స్‌గా చిన్న చిన్న భేరుండ బొమ్మలను తీసుకున్నారు. ఆభరణాలలో భేరుండం స్వర్ణకారుల ఆభరణాలలోనూ గండభేరుండం అందంగా అమరింది. ముత్యాలు, రత్నాలతో ముచ్చటైన రూపం సంతరించుకుంది. ఘన చరిత గల గండభేరుండ డిజైన్ ఉన్న చీర ఒక్కటైనా∙వార్డ్‌రోబ్‌లో ఉండాలని, తమ ఆభరణాలలో చిన్న రూపుగా అయినా కావాలని కోరుకుంటున్నారు. ప్రాచీన కళలోని గ్రాండ్‌నెస్‌ను ఇష్టపడుతున్నారు కనుకే గండభేరుండ గ్రాండ్‌గా వెలిగిపోతోంది. రాచరికపు హంగు కర్నాటకలోని వొడయార్ రాజుల పాలనలో తమ రాజ్యశక్తికి గండభేరుండ చిహ్నాన్ని వాడేవారు. స్వాతంత్య్రానంతరం కర్నాటక ప్రభుత్వం గండభేరుండ పక్షిని తమ రాష్ట్ర అధికారిక చిహ్నంగా తీసుకుంది. మైసూర్ప్యాలెస్ ద్వారం మీదా ఈ పక్షి రూపం చూడచ్చు. తెలుగునాట కాకతీయుల చారిత్రక కట్టడాల మీద, రామేశ్వరం, బృహదీశ్వరం వంటి ప్రాచీన దేవాలయాల మీదా ఈ పక్షి రూపాన్ని తిలకించవచ్చు. విజయనగర సామ్రాజ్యాధీశులు 500 ఏళ్లక్రితమే భేరండ చిహ్నాన్ని తమ అధికారక నాణేల మీద వాడినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. - నిర్వహణ: ఎన్.ఆర్. -
పరిమళం తగ్గుతోంది!
ఇదివరకటి కాలంలో వసంతం వచ్చిందంటే చాలు, పూల వనాలు పరిసరాలను పరిమళ భరితం చేసేవి. ఇప్పటి కాలంలో వసంతమైతే వస్తోంది గాని, పూల వనాలు ఇదివరకటి స్థాయిలో పరిమళించడం లేదు. ప్రకృతి ధర్మసూత్రాలకు లోబడి వసంతంలో మొక్కలకు ఆకులు చిగురించి, పూలు పూస్తూనే ఉన్నా, పూల పరిమళంలోని గాఢత మాత్రం క్షీణిస్తూ వస్తోందని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌కు చెందిన బ్రిటిష్ శాస్త్రవేత్త డాక్టర్ రాబర్ట్ గర్లింగ్ చెబుతున్నారు. డీజిల్‌తో నడిచే వాహనాల నుంచి వెలువడే వాయువుల ప్రభావం వల్ల పూలలో పరిమళం తగ్గిపోతోందని ఆయన వెల్లడిస్తున్నారు. రాయల్ హార్టికల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనలో వాయు కాలుష్యం ఫలితంగా పూల పరిమళం గణనీయంగా తగ్గిపోతున్నట్లు తేలింది. లావెండర్, డఫోడిల్స్, మల్లెలు, గులాబీలు వంటి పూల పరిమళం ఇదివరకటి కాలంలో చాలా దూరం నుంచే నాసికకు తెలిసేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధన వివరాలను ‘న్యూ సైంటిస్ట్’ జర్నల్‌లో ప్రచురించారు. -
వాన నీరే స్వచ్ఛమైన తాగునీరు!
నీరు.. మనుగడకు ప్రాణావసరం. మారుమూల గ్రామీణులు సైతం క్యాన్ నీటిని కొనుక్కొని తాగుతున్న పరిస్థితులున్న కాలం ఇది. ఇక ఎండాకాలం వచ్చిందంటే తాగు నీటి కోసం పడని పాట్లుండవు. అయితే, చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఒక కుటుంబం కేవలం తమ ఇంటిపైన కురిసిన వాన నీటినే పట్టుకొని తాగుతున్నది. ఒకటి కాదు, రెండు కాదు.. గత ఆరేళ్లుగా వాన నీటినే పట్టుకొని, శుద్ధి చేసి, భూగర్భ ట్యాంకులో దాచుకొని ఏడాదంతా తాగుతూ పూర్తి ఆరోగ్యంగా ఉంటున్నదో కుటుంబం. అంతేకాదు.. ప్రతి కుటుంబమూ ఇలాగే వాన నీటిని ఒడిసిపట్టుకొని ఏడాదం తా తాగితే నీటి సమస్య తీరడంతోపాటు ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండడమూ సాధ్యమేనని ప్రచారం చేస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా.. ఇది నిజం.., ఎం.సి.వి. ప్రసాద్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. 70 ఎకరాల ఆసామి. ప్రకృతి వ్యవసాయదారుడు. మదనపల్లి సమీపంలోని ‘ప్రకృతివనం’ వారి వ్యవసాయ క్షేత్రం. బోర్‌వెల్స్‌లో నీటి మట్టం అట్టడుగుకు వెళ్లేకొద్దీ టీడీఎస్ (టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్) పెరిగిపోవడం వల్ల తాగడానికి పనికిరాకుండా పోతూ ఉంటాయి. మదనపల్లి ప్రాంతంలో భూగర్భ జలం లోతు టీడీఎస్ 1,500 నుంచి 3,000 మధ్యలో ఉంటుంది. పోనీ క్యాన్లలో అమ్మే ఆర్.ఓ.(రివర్స్ ఆస్మోసిస్ పద్ధతిలో శుద్ధి చేసిన) నీరు కొనుక్కొని తాగుదామా అంటే.. ఆర్.ఓ. నీటిలో టీడీఎస్ మరీ తక్కువగా(20 నుంచి 35) ఉంటున్నాయి. పి.హెచ్. 5–6 వరకు ఉండటం వల్ల ఆమ్ల గుణాన్ని సంతరించుకొని ఉంటూ.. ఆరోగ్యానికి హానికరంగా తయారయ్యాయని ప్రసాద్ భావించారు. అటువంటి పరిస్థితుల్లో నిపుణులను సంప్రదించి.. తగు జాగ్రత్తలు తీసుకుంటూ వాననీటిని దాచుకొని తాగుతున్నారు. రాయలసీమవాసులకే కాదు, ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ ప్రాంత వాసులకే కాదు... ప్రపంచవ్యాప్తంగా ఎవరికైనా ఆరోగ్యదాయకమైన తాగు నీరు వాన నీటి సంరక్షణ ద్వారానే సాధ్యమని ప్రసాద్ చెబుతున్నారు. వాన నీటిని పట్టుకొనేదిలా... రాయలసీమలో 500 మి.మీ. వర్షం కురుస్తుంది. డాబా ఇంటి పైకప్పు మీద ప్రతి చదరపు అడుగుకు 50 లీటర్ల చొప్పున వాన నీటిని ఒడిసిపడుతున్నారు. ఇంటిపై నుంచి పైపుల ద్వారా కిందికి వచ్చే నీరు తొలుత రెయిన్ ఫిల్టర్ ద్వారా ప్రవహించి మట్టి, ఆకులు, చెత్త లేకుండా క్లీన్ అవుతాయి. వాన నీరు స్వచ్ఛమైనది. అయితే, అందులో లవణాలు ఉండవు. కానీ, లవణాలతో కూడిన నీరే ఆరోగ్యదాయకమైనది కాబట్టి, ఆ నీటికి లవణాలు కలపాలి. అదీ సులభమే. వాన నీటిని మినరలైజేషన్ ట్యాంకులో నుంచి ప్రవహించేలా ఏర్పాటు చేసుకుంటే సరి. సున్నపురాయి, కుండ పెంకులు, బొగ్గులు, ఇసుక, గులకరాళ్లను పొరలుగా వేసి ఉండడం వల్ల ఈ ట్యాంకులో నుంచి ప్రవహించే నీరు ఆరోగ్యదాయకమైన తాగు నీరుగా మారతాయి. ఆ నీటిని భూమిలో నిర్మించుకున్న ట్యాంకులోకి పంపి నిల్వ చేసుకుంటున్నారు. అలా నిల్వ చేసుకునే నీటిని మోటారు ద్వారా లేదా చేతి పంపు ద్వారా ప్రతి రోజూ పంప్ చేసుకొని తాగునీరుగా ఉపయోగించుకుంటున్నారు. భూగర్భ ట్యాంకులో నిల్వ ఉండే తాగునీటికి గాలి, వెలుతురు తగలకుండా జాగ్రత్తపడితే చాలు... నాచు పట్టదు. నీరు పాడవదు. ఇలా ప్రతి ఏటా 40 వేల లీటర్ల వాన నీటిని పట్టుకొని, శుద్ధి చేసుకొని, జాగ్రత్త చేసుకున్న నీటినే ఏడాది పొడవునా ప్రసాద్ కుటుంబంలోని ఆరుగురు, ప్రకృతివనంలో పనిచేసే 50 మంది పనివారు, అతిథులు పిల్లాపాపలతో సహా నిరభ్యంతరంగా తాగుతూ ఆరేళ్లుగా ఆరోగ్యంగా ఉన్నారు. తొలుత బెంగళూరులోని కర్ణాటక ప్రభుత్వ మహిళా శిశుసంక్షేమ శాఖ వద్ద, ఇటీవల ఎస్సెన్ అండ్ కో లోనూ పరీక్షలు చేయించి నీటి నాణ్యతను నిర్థారించుకున్నామని ప్రసాద్ తెలిపారు. తాము తాగే నీటిని పరీక్షిస్తే టీడీఎస్ 208, పి.హెచ్. 7.13 మధ్య ఉందని, ఇది ఆరోగ్యదాయకమైన ఆల్కలైన్ వాటర్ అన్నారు. ఇంతకీ ఎంత ఖర్చవుతుంది? వాన నీటిలో నుంచి డస్ట్ క్లీన్ చేసే రెయిన్ ఫిల్టర్ రూ. 7,500, మినరలైజేషన్ ట్యాంకు స్టీల్దైతే రూ. 10 వేలు(సిమెంటుదైతే రూ. 4 వేలు) ఖర్చవుతుంది. భూగర్భంలో నీటి నిల్వ ట్యాంకు నిర్మాణానికి లీటరుకు రూ. 4–5 ఖర్చవుతుంది. 1500 చదరపు అడుగుల ఇంటి కప్పు నుంచి వాన నీటిని సేకరించి నిల్వ చేసుకోవడానికి సుమారు రూ. 50,000 వరకు ఖర్చవుతుంది. ఆ తర్వాత ఏ ఖర్చూ లేకుండానే.. మబ్బుల్లో నుంచి వచ్చే స్వచ్ఛమైన, అమూల్యమైన చెలమ నీటిని తాగొచ్చని ప్రసాద్ అనుభవపూర్వకంగా చెబుతున్నారు. సొంత ఇల్లు లేక లేదా మరే ఇతర కారణంగానైనా ఆర్.ఓ. నీటిని తాగే వారు కూడా.. ఆరోగ్యదాయకమైన ఆల్కలైన్ వాటర్ స్వంతంగా తయారు చేసుకొని తాగడానికీ మరో మార్గం ఉందని ప్రసాద్ అంటున్నారు. ఆర్.ఓ. వాటర్‌ను మినరలైజేషన్ ట్యాంకులో పోసుకొని.. 4 గంటల తర్వాత.. ఆ నీటిని పట్టుకొని తాగవచ్చని, ఈ నీరు కూడా ఆరోగ్యదాయకమైన అల్కలైన్ వాటరేనని ప్రసాద్ చెబుతున్నారు. మినరలైజేషన్ ట్యాంకును 30–50 లీటర్లు పట్టే స్టెయిన్లెస్ స్టీల్ పాత్రతో లేదా మట్టి పాత్రతో ఎవరికి వారు తయారు చేసుకోవచ్చు. ఈ విషయంలో ఎవరికైనా సందేహాలున్నా తీర్చడానికి, వీడియో కాల్ చేస్తే ‘ప్రకృతివనం’లో తాము వాడుతున్న ఫిల్టర్లను చూపడానికి కూడా సంసిద్ధంగా ఉంటామని ప్రసాద్ తెలిపారు. ఆసక్తి గల వారు వెంకట్‌రెడ్డి– 89198 96367, ఎం.సి.వి. ప్రసాద్– 94401 68816 నంబర్లలో సంప్రదించవచ్చు. -
మన్య దీపిక!
రైతులు.. అందులోనూ గిరిజనులు.. ఇక చెప్పేదేముంది! దిగుబడులు వస్తున్నాయంటే.. దళారుల పంట పండినట్లే కదా!! కానీ, రోజులన్నీ ఒకేలా ఉండవు.. కాలంతోపాటు శ్రీకాకుళం జిల్లా సీతంపేట ప్రాంత అమాయక గిరిజన రైతులూ ఇప్పుడు తెలివి తెచ్చుకుంటున్నారు. రసాయనాల్లేకుండా ప్రాణానికి ప్రాణంగా సాగు చేసిన తమ పంటలకు ఇప్పుడు తామే ధర నిర్ణయించుకుంటున్నారు. ‘మన్య దీపిక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ’ని ఏర్పాటు చేసుకున్నారు. తమ ప్రతి ఒక్కరి తలరాతను కలసికట్టుగా తిరగరాసుకుంటున్నారు. కల్లాకపటం లేని ఆ గిరిజన రైతు కలల కంపెనీకి వెలుగుబాట చూపుతున్న మార్గదర్శి.. పడాల భూదేవి! ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చైతన్య దీప్తికి ‘సాగుబడి’ నుంచి జేజేలు! కొండకోనల్లో, ప్రకృతి ఒడిలో కపటం లేని జీవించే గిరిజన రైతులు అవగాహన లేక, దారిచూపేవారు లేక, ఐక్యత లేక, దళారుల దోపిడీ వల్ల అనాదిగా పేదరికంలో మగ్గిపోతున్నారు. అయితే, శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలోని హిర, సీతంపేట, ఎల్‌ఎన్‌పేట, కొత్తూరు, వీరఘట్టం మండలాల్లో రైతుల సంగతి వేరు. ఈ మండలాల్లో చిన్నయ్య ఆదివాసీ వికాస్ సంఘం ఆధ్వర్యంలో సుమారు 4 వేల మంది గిరిజన రైతులు సంఘటితమై భూమి హక్కులను సాధించుకోవడం ద్వారా పేదరికాన్ని అధిగమిస్తున్నారు. ఉమ్మడి భూమి హక్కులు సాధించుకున్నారు. మెరుగైన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అందిపుచ్చుకొని, స్వల్ప ఖర్చుతోనే అధికోత్పత్తి సాధిస్తున్నారు. అంతేకాదు.. నాబార్డు సహాయంతో 10 నెలల క్రితం ‘మన్య దీపిక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్’ను ఏర్పాటు చేసుకొని తాము పండించిన పంటకు తామే ధర నిర్ణయించుకొని పడాల భూదేవి నేతృత్వంలో అధిక నికరాదాయాన్ని పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గిరిజన నేత, తన తండ్రి దివంగత చిన్నయ్య అడుగుజాడల్లో నడుస్తూ భూదేవి గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆధునిక పోకడలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరచుకుంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించే పంటకు అధికాదాయం పొందవచ్చని గిరిజన రైతులను చైతన్య పరచి ఆమె ముందుకు నడిపిస్తున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న తీరు.. భూదేవి మాటల్లోనే.. ఎకరానికి 13 క్వింటాళ్ల చిరుధాన్యాల దిగుబడి గత 13 సంవత్సరాలుగా సేంద్రియ సాగు విధానాన్ని మా గిరిజన రైతులకు అలవాటు చేశాం. ఇదే క్రమంలో చిరుధాన్యాలు సాగు ప్రారంభించాం. వ్యవసాయ యాంత్రీకరణ, సాగులో ఆధునిక విధానాలు అలవాటు చేస్తున్నాం. రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాలను పాత పద్ధతిలో కేవలం ఎకరాకు మూడు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే సాధించేవారు. కొత్త పద్ధతులు అలవాటు చేసిన తరువాత మొక్కలు నాటే ‘గులి’ పద్ధతిలో సాగు చేసి, ఎకరానికి 13 క్వింటాళ్ల దిగుబడి సాధించే స్థాయికి చేరుకున్నారు. సీతంపేట ఐటీడీఏ, నాబార్డు, ఆత్మ, వ్యవసాయశాఖలతో పాటు మరి కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో చిరుధాన్యాలు, సేంద్రియ సాగుతో లాభాల బాట పడుతున్నాం.. దాదాపు 3 వేల ఎకరాల్లో రెండు వేల మంది గిరిజన రైతులు చిరుధాన్యాల సాగు చేస్తున్నారు. ఏటా రాగి వంద టన్నులు, కొర్రలు 50, జొన్న 35, సజ్జ 25 టన్నుల వరకూ దిగుబడి వస్తోంది. సొంత విత్తనాలనే వాడుకుంటున్నారు. ఈ సంవత్సరం ఏపీ సీడ్స్ సంస్థకు 9 టన్నుల రాగి విత్తనాలు కిలో రూ.36 చొప్పున పంపిణీ చేశాం. 11 మంది డైరెక్టర్లలో ఆరుగురు మహిళలు ఈ ప్రాంతంలో గిరిజన రైతులు ఎక్కువగా చిరుధాన్యాలను, పప్పుధాన్యాలను సాగు చేస్తున్నారు. వారి ఉత్పత్తులను దళారులకు, లేదా స్థానిక సంతల్లో వచ్చిన ధరకు అమ్మేసుకుంటూ ఉండటం వల్ల ఎంతో ఆదాయాన్ని నష్టపోతుండేవారు. రైతు ఉత్పత్తిదారుల కంపెనీని ఏర్పాటు చేసుకున్నాక తాము నిర్ణయించుకున్న గిట్టుబాటు ధరకు అమ్ముకోగలుగుతున్నాం. ఇందులోని 11 మంది డైరెక్టర్లలో నాతో పాటు ఆరుగురం మహిళా గిరిజన రైతులమే. మన్య దీపిక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసుకున్న తర్వాత తమ ఉత్పత్తులకు మేమే ధర నిర్ణయిస్తున్నాం. ఐటీడీఏ సమకూర్చిన గోదాములో సుమారు రూ.5–6 లక్షల ఖరీదైన ప్రాసెసింగ్ యంత్రాలను నెలకొల్పాం. కంపెనీలో సీఈవోతోపాటు పార్ట్‌టైమ్ సిబ్బంది సహా 30 మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. చిరుధాన్యాల నుంచి బిస్కెట్ల వరకు.. కొర్ర బియ్యం, సామ బియ్యం, ఊద బియ్యం, జొన్నలు, సజ్జలు, రాగులు వంటి చిరుధాన్యాలు.. కంది పప్పు, మినప్పప్పు, ఉలవలు, చీపుర్లు, చింతపండు.. వంటి 25 రకాల సరుకులను శుద్ధి చేసి, చక్కగా ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నాం. శ్రీకాకుళం రైతుబజారులో, సీతానగరం ఐటీడీఏ ఆవరణలో ప్రత్యేక స్టాల్స్‌ను నిర్వహించడంతోపాటు.. విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంతోపాటు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలకు కూడా సరుకును నేరుగా వినియోగదారులకు, దుకాణదారులకు విక్రయిస్తున్నాం. అంతకుముందు కుంచం(3 కిలోలు) సేంద్రియ కందులు రూ.90లకు రైతులే స్థానికంగా అమ్ముకునేవాళ్లు. ఇప్పుడు రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ద్వారా రూ. 120కు బయట మార్కెట్లలో అమ్మగలిగాం. కొర్ర ధాన్యాన్ని రైతు నుంచి కిలో రూ. 40కు కొనుగోలు చేసి, శుద్ధిచేసి ప్యాకెట్లలో నింపి రిటైల్‌గా కిలో రూ. 80కు విక్రయిస్తున్నాం. గత పది నెలల్లో 325 మంది రైతులు తమ ఉత్పత్తులను రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ద్వారా విక్రయించారు. ఇప్పటికి నెలకు రూ. 4 లక్షల టర్నోవర్ జరుగుతున్నది. విదేశీ మార్కెట్ల కోసం అన్వేషణ.. మా సేంద్రియ ఉత్పత్తులను మొదట మేము తింటున్నాం. ఉత్పత్తులను మా ప్రాంత హాస్టల్ పిల్లలకు, వివిధ రాష్ట్రాల ప్రజలకు అందిస్తున్నాం. ఇక్కడ మార్కెట్‌కు ఇవ్వగా మిగిలే ఉత్పత్తులను విదేశీ మార్కెట్లలో అమ్మేందుకు కూడా మార్గాలను అన్వేషిస్తున్నాం. పీజీఎస్ సర్టిఫికేషన్ పొందే దశలో ఉన్నాం. అడవి తల్లి ఒడిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగైన మా ఉత్పత్తులను వ్యక్తులు, సంస్థలు ఎవరైనా నేరుగా కొనుగోలు చేయవచ్చు. ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపుతాం. (వివరాలకు.. మన్య దీపిక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ–హిరమండలం, శ్రీకాకుళం జిల్లా– డైరెక్టర్ పడాల భూదేవి: 73820 98533, సీఈఓ కైలాస్ సాహు: 88978 65521) హాస్టళ్లకు రాగి పిండి, చిరుధాన్యాల బిస్కెట్లు.. శ్రీకాకుళం జిల్లాలోని 47 గిరిజన సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావ కోసం ఏడాది కాలంగా నెలకు 9 టన్నుల రాగి పిండిని అందిస్తున్నారు. గిరిజన కుటుంబాల్లో వివిధ కారణాల వల్ల అనేక మంది ఒంటరి మహిళలుగా మిగిలిపోతున్నారు. వీరిలో 15 మందికి ఉపాధి కల్పించేందుకు చిరుధాన్యాలతో రుచికరమైన వంటకాల తయారీని ప్రారంభించాం. చిరుధాన్యాల పిండితో బిస్కెట్లు, కేక్, జంతికలు, మిక్చర్, పకోడి, రాగిపిండితో అంబలి, సంగటి, అట్లు, రొట్టెలు, లడ్డూలు తయారు చేస్తున్నాం. వాటిని రైతుబజార్లతో పాటు ప్రైవేట్ దుకాణాలకు సరఫరా చేస్తున్నాం. వాసన్ స్వచ్ఛంద సంస్థ, కృషి విజ్ఞాన కేంద్రం సాంకేతిక సహకారంతో చిరుధాన్యాలతో నెలకు రూ. 5 లక్షల బిస్కెట్లను తయారు చేస్తున్నాం. ఐటీడీఏ సహకారంతో రోజుకు 11 వేల బిస్కెట్లు గిరిజన విద్యార్థులకు అందిస్తున్నాం. – అల్లు సూరిబాబు, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం ఫొటోలు: కుప్పిలి జయశంకర్, సాక్షి ఫొటో జర్నలిస్టు. -
అమ్మా! మియ్యావ్
ప్రకృతిని కూడా పుస్తకాల్లోనే చూసి నేర్చుకోవడం అలవాటైపోయింది! అయితే పుస్తకాలు తెరవకముందే పిల్లల ఆలోచనల్ని తెరిపిస్తుంది ప్రకృతి. ‘‘బుక్‌లో ఏమేమున్నాయి? చూద్దామా కృతి బంగారూ’’ గారంగా కూతుర్ని ఒళ్లోకి తీసుకుంది అమ్మ.అమ్మ చేతిలోని ‘మై ఫస్ట్ ఎబిసి’ బుక్ లాక్కుని తనే ఓపెన్ చేసింది కృతి. సి పేజీ ఓపెన్ అయింది.క్యాట్ అని చెప్పాలా... మాతృభాషలో పిల్లి అని నేర్పించాలా... తల్లికి మీమాంస.‘‘అమ్మా! మియ్యావ్’’ అంటూ రెండు చేతులను గొంతు కిందకు చేర్చి కళ్లు పెద్దవి చేసి మూతిని సున్నాలా చుట్టింది ఒకటిన్నర ఏళ్ల కృతి.పేజీలు తిప్పుతున్నారిద్దరూ. హెచ్ పేజీలో కోడి ఉంది. ‘హెన్’ పలకడం ఈజీ, మాటలు పూర్తిగా నేర్చుకున్న తర్వాత ‘కోడి’ అని నేర్పించవచ్చు... అనుకునే లోపే...‘‘అమ్మా! బోబు... బో బ్బో బ్బో... కొక్కొక్కో...’’ రెక్కలు విచ్చినట్లు చేతుల్ని చాచి చెప్పింది కృతి. తల్లి మురిపెంగా చూసింది కృతిని.పిల్లలకు తల్లే తొలి గురువు. తల్లి కంటే ముందు ప్రకృతే గురువు. ఆ తల్లికి చిన్నప్పుడు నేర్పించింది కూడా ప్రకృతే. పెద్దయ్యాకే పుస్తకాలు నేర్పించాయి. పుస్తకాలతో నేర్చుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి ప్రకృతిని కూడా ప్రకృతిలో కాకుండా పుస్తకాల్లోనే నేర్చుకోవడం అలవాటైపోయింది! అయితే పుస్తకాలు తెరవకముందే పిల్లల ఆలోచనల్ని తెరిపిస్తుంది ప్రకృతి.ప్రకృతిలో భాగంగానే నేర్పేవారు ఉంటారా లేక ప్రకృతే నేర్పుతుందా అని వర్డ్స్ వర్త్ ఓ చోట సంశయపడతాడు. నేర్పేవారు ఎవరైనప్పటికీ నేర్చుకోవడం అన్నది మనిషి ప్రవృత్తి. ఆ ప్రవృత్తే మనిషిని ప్రకృతి దగ్గరకు తీసుకెళుతుంది. ఆ తర్వాతే పుస్తకాలు. గురువర్యులు. -
ఉద్యోగం కన్నా ప్రకృతి సేద్యం మిన్న
ఇంటికి దూరంగా వెళ్లి చిన్నా చితకా ఉద్యోగాలు చేయటం కన్నా ఇంటి పట్టునే ఉండి సొంత భూమిలో ప్రకృతి వ్యవసాయం చేసుకోవడమే మిన్న అని భావించాడా యువకుడు. అతని పేరు కె. వేణుగోపాలనాయుడు. విజయనగరం జిల్లా సీతానగరం మండలం కె. సీతారాంపురం గ్రామం అతని స్వస్థలం. వ్యవసాయ కుటుంబానికి చెందిన వేణు మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసిన తర్వాత వైజాగ్‌లో ఆర్నెల్లు ఉద్యోగం చేశారు. ఈ లోగా తమ లచ్చయ్యపేటలోని చెరకు ఫ్యాక్టరీ ఆవరణలో సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా తరగతులు జరగడంతో తండ్రి రత్నాకర్‌తో కలసి ఆసక్తిగా హాజరయ్యారు. ఆ తర్వాత ఉద్యోగం మానేసి తండ్రికి తోడుగా ఉంటూ ప్రకృతి వ్యవసాయం చేయాలని వేణు నిర్ణయించుకున్నారు. ఆ విధంగా 9 నెలల క్రితం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో 4 ఎకరాల్లో కో–4, కో–3 పశుగ్రాసం, ఎకరంలో వరి, 15 సెంట్లలో యాపిల్ బెర్ను సాగు చేయడం ప్రారంభించారు. పశుగ్రాసం సాగుకు ప్రభుత్వం నుంచి సహాయం పొందారు. సాళ్ల మధ్య 2.5 అడుగులు, మొక్కల మధ్య అడుగు దూరంలో పశుగ్రాసం నారును 4 నెలల క్రితం నాటారు. వారం, పది రోజులకోసారి స్వయంగా తానే తయారు చేసుకునే జీవామృతాన్ని డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. ఎకరంలో పెంచే పశుగ్రాసాన్ని ఇతర రైతులకు చెందిన 8 పాడి పశువులకు పచ్చిమేతగా కిలో రూ.1 చొప్పున విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ఏటా ఎకరానికి రూ. 9వేల కౌలు, రూ. 40 వేలను ప్రోత్సాహకంగా అందజేస్తున్నదని తెలిపారు. రెండేళ్ల వరకు ఇలా రైతులకు పచ్చిమేత ఇవ్వాల్సి ఉంటుందని, పదేళ్ల వరకు పచ్చిగడ్డి వస్తూనే ఉంటుందని వేణు తెలిపారు. తెలిసిన రైతు దగ్గర నుంచి 40 ఆపిల్ బెర్ మొక్కలు తెచ్చి ఎటు చూసినా 8 అడుగుల దూరంలో 15 సెంట్లలో నాటుకున్నారు. తొలి కాపుగా చెట్టుకు 3–5 కిలోల నాణ్యమైన ఆపిల్ బెర్ పండ్ల దిగుబడి వచ్చింది. జీవామృతం క్రమం తప్పకుండా డ్రిప్ ద్వారా ఇస్తున్నారు. పురుగు కనిపించినప్పుడు అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం పిచికారీ చేశారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయడం వల్ల ఈ పండ్లు రుచిగా ఉన్నాయన్నారు. తొలి పంట కాబట్టి అందరికీ పంచిపెట్టానని తెలిపారు. నీలగిరి మొక్కల వల్ల పొలం పాడవుతున్నదని గ్రహించి, ఆ మొక్కలను పీకించి చెరువు మట్టి తోలించారు. ఎకరంలో వరిని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. ప్రకృతి సేద్యంలో తొలి పంట కావడంతో 18 (80 కిలోలు) బస్తాల ధాన్యం దిగుబడి వచ్చిందని వేణు తెలిపారు. ఇతరులు ఎరువులు, పురుగుమందులకు ఎకరానికి రూ. 7–8 వేలు ఖర్చు చేశారని, తనకు రూ. వెయ్యి వరకు ఖర్చయిందని తెలిపారు. మొత్తం మీద ప్రకృతి వ్యవసాయం తొలి ఏడాది కూడా తమకు లాభదాయకంగానే ఉందని, మున్ముందు దిగుబడులు మరింత పెరుగుతాయని భావిస్తున్నట్లు యువ రైతు వేణు(96403 33128) సంతృప్తిగా తెలిపారు. – పోల కోటేశ్వరరావు, సాక్షి, సీతానగరం, విజయనగరం జిల్లా -
సిరిధాన్యాల విత్తనాలు ఉచితం!
అరిక.. 5 నెలల పంట. దీన్ని ఖరీఫ్‌లో ఆరుద్ర కార్తెలో మాత్రమే విత్తుకోవాలి. కొర్ర, అండుకొర్ర, ఊద, సామ, బరిగలు 3 నెలల పంటలు. వీటిని ఖరీఫ్‌లోను, రబీలోనూ సాగు చేసుకోవచ్చని డా.వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన రైతు శాస్త్రవేత్త విజయకుమార్ వివరించారు. ఆయన ‘సాగుబడి’కి అందించిన వివరాలు.. ► ఎకరానికి 3 కిలోల విత్తనం అవసరం. పొలాన్ని మడులుగా విభజించి.. ఈ చిరుధాన్యాలన్నిటినీ ఒక ఎకరంలో సాగు చేసుకోవచ్చు. అవి కలిసిపోకుండా కందిని సరిహద్దు పంటగా వేసుకోవచ్చు. ► మూడు తడులు ఇవ్వడానికి నీటి సదుపాయం ఉంటే.. ఎకరానికి 8 క్వింటాళ్ల వరకూ సేంద్రియ సిరిధాన్యాలను పండించుకోవచ్చు. ఎకరానికి రూ. 2,300 ఖర్చు అవుతుంది. ► సాలు దున్నిన తర్వాత సిరిధాన్యాలు విత్తుకొని, విత్తనాలపైకి మట్టి పడేలా ఇరవాలు దున్నాలి. 5 సెం.మీ. లోతు దున్నితే చాలు. అంతకంటే లోతులో పడిన సిరిధాన్య విత్తనాల మొలక పైకి రాలేదు. ► విత్తిన వెంటనే తడి ఇవ్వాలి. రెండో తడి 30 రోజులకు, మూడో తడి 60 రోజులకు ఇస్తే చాలు. డ్రిప్, స్ప్రింక్లర్, పారించడం.. ఏ పద్ధతిలోనైనా తడి ఇవ్వొచ్చు. ► వరి కోసిన పొలాల్లో, వేరుశనగ పీకిన పొలాల్లో, కూరగాయలు పండించిన పొలాల్లో.. ఎటువంటి భూమి అయినా.. పంటల మార్పిడి కోసం ఈ రబీలో సిరిధాన్యాలను సాగు చేసుకోవచ్చు. కోతలు పూర్తయిన తర్వాత మోళ్లను భూమిలో కలియదున్నితే భూమి సారవంతమవుతుంది. ► సిరిధాన్యాల పంట నుంచి ఎకరానికి రెండు ట్రాక్టర్ల నాణ్యమైన, పశువులు బాగా ఇష్టపడే గడ్డి వస్తుంది. ► సిరిధాన్యాలను నూర్చే టప్పుడు ప్లాస్టిక్ బరకాలను ఉపయోగించి, ఇసుక, మట్టి కలవకుండా జాగ్రత్తపడాలి. ► అరిక, కొర్ర, అండుకొర్ర, ఊద, సామ, బరిగల ప్రత్యేకత ఏమిటంటే.. పొట్టు తీయని ధాన్యాలను రెండేళ్ల వరకు నిల్వ చేసుకోవచ్చు. పురుగు రాదు. రెండేళ్లు నిల్వ ఉన్నవి కూడా విత్తనానికి నిక్షేపంగా పనికొస్తాయి. విత్తనాలను గోనె సంచుల్లోనే గాలి, వెలుతురు తగిలే చోట నిల్వ చేయాలి. ప్లాస్టిక్ సంచుల్లో నిల్వచేస్తే.. ఉక్కిపోయి మొలక శాతం తగ్గవచ్చు. ► సిరిధాన్యాల బియ్యానికి మాత్రం రెండు, మూడు నెలల తర్వాత సన్న పురుగు వస్తుంది. మిక్సీతో అవసరం ఉన్నప్పుడు పొట్టు తీసుకునే మెలకువ తెలిసింది కాబట్టి, ఒకేసారి ఎక్కువ మొత్తంలో మిల్లు పట్టించుకొని అమ్ముకోలేక తిప్పలు పడాల్సిన అవసరం లేదు. ► సిరిధాన్యాలను రైతులు వెంటనే అమ్మేయకుండా.. నిల్వ చేసుకోవాలి. మిక్సీతో శుద్ధి చేసి తయారు చేసిన బియ్యాన్ని రైతు కుటుంబాలు ఇంటిల్లపాదీ అన్ని వయసుల వారూ తిని పూర్తి ఆరోగ్యవంతులుగా మారాలి. తమ గ్రామాలు, దగ్గర్లోని పట్టణాలు, నగరాల్లో వినియోగదారులకు ఏడాది పొడవునా నేరుగా అమ్ముకునే ఏర్పాట్లు చేసుకుంటే.. రైతులు అధిక నికరాదాయం పొందవచ్చు. ► రసాయనిక ఎరువులు వాడనవసరం లేదు. యూరియా ఎక్కువ వేస్తే పంట అతిగా పెరిగి పడిపోతుంది. పడిపోయిన పంటను కోయటం అధిక శ్రమ, ఖర్చుతో కూడిన పని. పైగా పడిపోయిన కంకుల్లో నుంచి గింజలను అన్ని రకాల పక్షులూ సులువుగా తినేస్తాయి. కాబట్టి రైతుకు చేతికి వచ్చే దిగుబడి బాగా తగ్గిపోతుంది. ► నిలబడి ఉన్న చిరుధాన్య పంట గింజలను జీనిగ, బుల్బుల్ వంటి అతి చిన్న పిట్టలు మాత్రమే తినగలవు. ఇవి ఎంత ఎక్కువ తిన్నా ఎకరానికి క్వింటాకు మించి తినలేవు. 7 క్వింటాళ్ల దిగుబడి మనకు వస్తుంది. ► వర్షాకాలపు పంటలో జొన్న, కొర్రలకు ఎర్రదిమ్మ తెగులు వస్తుంది. కానీ, రబీలో ఇవేవీ రావు. వరికి వచ్చే కాండం తొలిచే పురుగు, తెల్లమచ్చ(మజ్జిగ) తెగులు సిరిధాన్య పంటల జోలికి రావు. ► డ్వాక్రా మహిళా సంఘాలు, చిరు వ్యాపారులు సిరిధాన్యాలతో టిఫిన్లు, రకరకాల పిండివంటలు తయారు చేసి అమ్ముకుంటే మంచి పౌష్టికాహారాన్ని జనానికి అందించినట్టవుతుంది. మంచి ఆదాయమూ పొందవచ్చు. సిరిధాన్య వంటలకు వరిపిండి, శనగపప్పు పిండితో చేసే పిండివంటలకు ఖర్చయ్యే నూనెలో సగం సరిపోతుంది. ► రాబోయే ఖరీఫ్ కోసమైతే.. ఎకరానికి 2.5 కిలోల సిరిధాన్యాల విత్తనాలు, అరకిలో నాటు రకం కంది విత్తనాలను రైతులకు ఉచితంగా ఇప్పుడే ఇస్తాను. 2019 నాటికి తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఊళ్లలో ఐదారు రకాల సిరిధాన్యాలు పండాలి. అందరూ తినాలి. ఆసుపత్రులు వద్దు.. సిరిధాన్యాలు ముద్దు.. ► సిరిధాన్యాల ఉచిత విత్తనాలు, సాగు మెలకువల కోసం విజయకుమార్ (వెలమవారిపాలెం, వేంపల్లె మండలం, డా.వైఎస్సార్ కడప జిల్లా)ను సంప్రదించాల్సిన ఫోన్: 98496 48498. సేకరణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ‘మిక్సీ.. సిరిధాన్యాల మిల్లు’ కథనానికి విశేష స్పందన ‘మిక్సీ.. సిరిధాన్యాల మిల్లు’ శీర్షికతో గత మంగళవారం ‘సాగుబడి’లో ప్రచురించిన కథనానికి రైతుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సిరిధాన్యాలను సాగు చేసినప్పటికీ తగిన ప్రాసెసింగ్ మిల్లులు అందుబాటులో లేక నానా ఇబ్బందులు పడుతున్న రైతులకు అందుబాటులో ఉండే మిక్సీ ప్రత్యామ్నాయం గొప్ప ఊరట కలిగింది. కేవలం మిక్సీ ద్వారా సిరిధాన్యాల బియ్యాన్ని ఇంటిపట్టునే కావాలనుకున్నప్పడు సిద్ధం చేసుకునే అవకాశం ‘బుచ్చి పద్ధతి’ ద్వారా అందుబాటులోకి వచ్చినందుకు చాలా మంది రైతులు సంబరపడుతున్నారు. సిరిధాన్యాలలోని విశిష్ట ఔషధ గుణాల గురించి డాక్టర్ ఖాదర్ ప్రచారం చేస్తుండడంతో వినియోగదారుల్లో వీటి పట్ల ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో సిరిధాన్యాల శుద్ధికి మిక్సీ ఉంటే చాలన్న సమాచారం రైతుల్లో పెద్ద సంచలనమే కలిగించింది. డాక్టర్ ఖాదర్, బాలన్, మహబున్నీలకు అనేక మంది ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కొర్ర తదితర ఐదు రకాల సిరిధాన్యాల విత్తనాలు కావాలని, ఈ రబీలోనే సాగు చేస్తామని రైతులు ముందుకు వస్తుండటం విశేషం. అటవీ వ్యవసాయ పద్ధతిలో సిరిధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు, బుచ్చి పద్ధతిలో సిరిధాన్యాల శుద్ధిపై సంక్రాంతి తర్వాత తెలుగునాట రైతు శిక్షణా శిబిరం నిర్వహిస్తామని, విత్తనాలను అందుబాటులోకి తెస్తామని బాలన్ తెలిపారు. ఇదిలాఉండగా, ఎకరంలో విత్తడానికి సరిపోయే 3 కిలోల సిరిధాన్యాల విత్తనాలను రైతులకు ఉచితంగా ఇస్తానని డా. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన రైతు శాస్త్రవేత్త విజయకుమార్ ప్రకటించారు. ఎంత మంది రైతులకైనా ఎకరానికి విత్తనం ఉచితంగా ఇస్తానని, అంతకు మించి కావాలనుకుంటే కిలో రూ. 40కి ఇస్తాననటం విశేషం. -
ప్రకృతి సేద్యానికి కేరాఫ్ ఏపీ
సాక్షి, అమరావతి బ్యూరో: ‘‘ప్రకృతి సేద్యానికి కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్. దేశానికే కాదు మొత్తం ప్రపంచానికే చిరునామాగా నిలుస్తుంది’’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ ప్రాంతంలో ఆదివారం ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’పై రాష్ట్రస్థాయి శిక్షణ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 2018 సంవత్సరాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ప్రకృతి సేద్య నామ సంవత్సరంగా నామకరణం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయంలో పాత పద్ధతులకు స్వస్తి పలకాలని, ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాలని రైతులకు సూచించారు. సుభాష్ పాలేకర్ వద్ద మంచి ప్రాజెక్టు ఉందని, తాను మార్కెట్ మేనేజర్‌గా మారి దాన్ని ప్రమోట్ చేస్తానని బాబు వివరించారు. ప్రకృతి సేద్యంతో అధిక దిగుబడులు రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు ఏకైక మార్గం ప్రకృతి వ్యవసాయమేనని పద్మశ్రీ సుభాష్ పాలేకర్ తెలిపారు. ప్రకృతి సేద్యం ద్వారా సాగు చేసిన పంటలు వైపరీత్యాలను తట్టుకుని మంచి దిగుబడులు ఇస్తున్నాయని చెప్పారు. మూడేళ్లలో ప్రకృతి వ్యవసాయంలో ప్రపంచంలో ఏపీ రోల్‌మోడల్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రగతే నా ధ్యాస రాష్ట్ర ప్రగతి, ప్రజలందరి పురోగతే తన నిరంతర ధ్యాస అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అందరి శ్రేయస్సు, సంక్షేమం, సర్వతోముఖ వికాసానికి తాను దీక్ష తీసుకున్నానని, రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ నమూనాగా నిలపాలన్నదే తన ఆకాంక్ష అని వెల్లడించారు. కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా బాబు ఆదివారం రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. సమాచార పౌరసంబంధాల శాఖ ద్వారా లేఖను విడుదల చేశారు. తెలుగువారు ఎక్కడున్నా ఈ పండక్కి వచ్చి సొంతగడ్డ రుణం తీర్చుకోవాలని కోరారు. తెలుగు ప్రజలందరికీ సీఎం చంద్రబాబు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. -
ఓ విహంగ వీక్షణం
చాలా ముద్దుగా కూడా ఉండి ఉంటుంది, ఆ పక్షి. పసుపు రంగు మెడతో ఉన్న బుజ్జి పక్షి. ఆ పిల్లవాడి తుపాకీ దెబ్బకి రాలిపోయింది. అప్పుడు ఆలోచించాడా అబ్బాయి, ఈ పక్షి పేరేమై ఉంటుందని! ఏ జాతిదై ఉంటుందని! ఆ మృత విహంగాన్నే తీసుకుని వెళ్లి మేనమామను అడిగాడు. ఆయన ప్రకృతిని ప్రేమించేవాడే. పక్షులని వేటాడుతూ ఉండేవాడే. కానీ ఆయనకీ తెలియలేదు. మేనల్లుడి ప్రశ్నల ధాటికి తట్టుకోలేక అంతో ఇంతో పరిచయం కలిగిన బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ కార్యదర్శి డబ్లు్య ఎస్ మిల్లార్డ్ దగ్గరకు తీసుకుపోయాడు. ఆ పిల్లవాడి ఆసక్తి చూసి మిల్లార్డ్ కొంత చెప్పాడు. మిల్లార్డ్కీ ముచ్చట తీరలేదు. తను సేకరించిన పక్షుల బొమ్మలను చూపించాడు. నిజానికి వాటికి ప్రాణం లేదు. పట్టుకున్న తరువాత వాటి లోపలి మాంసాన్ని తొలగించి, దూది కుక్కి మళ్లీ నిండుగా తయారుచేసే స్టఫ్డ్ పక్షులు. ఎన్ని జాతులు! ఎన్ని రంగులు! ఎన్ని పరిమాణాలు! వాటిని చూశాకే ఆ అబ్బాయిలో పక్షుల మీద ఉన్న ఆసక్తికి హఠాత్తుగా రెక్కలు వచ్చాయి. అలా ప్రపంచ పక్షిశాస్త్రానికి కొత్త వెలుగును ఇచ్చిన ఒక శాస్త్రవేత్త పుట్టాడు. ఆయనే డాక్టర్ సలీం అలీ (నవంబర్ 12, 1896– జూలై 27, 1987). ఆ పిచ్చుక అలీ జీవితం మీద ఎంత ప్రభావం చూపిందో చెప్పలేం. తన జీవిత చరిత్రకు, ‘ఒక పిచ్చుక పతనం’ అని పేరు పెట్టారాయన. ‘నువ్వు ఎగిరిపోవాలనుకుంటే, అన్నీ వదిలిపెట్టెయ్! అప్పుడే బరువు తగ్గుతుంది’ అంటాడొక తత్వవేత్త. సలీం అలీ చేసింది అదే. ఇదే విషయాన్ని తన వాస్తవ అనుభవంతో ఇంకాస్త లోతుగా చెప్పారు అలీ– ‘నీవు పక్షుల మీద దృష్టి కేంద్రీకరించినప్పుడు చాలా విషయాలను పట్టించుకోకుండా వదిలిపెట్టాలి’. పక్షులతో ఆయన అనుబంధం ఇలా ఒక తాత్విక స్థాయికి చేరుకుంది. జీనత్ ఉన్నిసా, మొయిజుద్దీన్ దంపతుల తొమ్మిది మంది సంతానంలో నాలుగో సంతానమే సలీం. మూడో ఏటకే అమ్మానాన్న కన్నుమూశారు. ‘గోరొంక గూటికే చేరావు చిలుక’ అన్నట్టు మేనమామ అమీరుద్దీన్ తాయబ్జీ ఆయనను పెంచుకున్నాడు. ఆయనకీ పిల్లలు లేరు. ప్రకృతి అన్నా, వేట అన్నా మహా ఇష్టం. మేనల్లుడిని తాయబ్జీ మొదట జనానా బైబిల్ మెడిసిన్ మిషన్ గరల్స్ హైస్కూలులో చేర్చాడు. తరువాత సెయింట్ జేవియర్ హైస్కూలుకు మార్చాడు. ఇలా స్కూలుకి వెళ్లడం బొత్తిగా నచ్చలేదు సలీంకి. అందుకే 1913లో బొంబాయి యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ పట్టా తీసుకోగలిగాడు. అప్పుడు బీయస్సీలో చేరాడు. కానీ అల్జీబ్రా, లాగర్దమ్స్ అంటే బొత్తిగా సరిపడలేదు. మొదటి సంవత్సరంతోనే ఆగిపోయింది డిగ్రీ చదువు. మళ్లీ పక్షుల వీక్షణానికి అనుకోకుండా అవకాశం వచ్చింది. చదువు పట్ల ఏ మాత్రం శ్రద్ధ లేని సలీంని బర్మాలో ఉంటున్న అతని కుటుంబం దగ్గరికి పంపించాడు మేనమామ. అప్పటికే పెళ్లి కూడా అయింది. ఆమె పేరు తెహమినా బేగం. బర్మాలో (నేటి మైన్మార్) తేవీ అనేచోట వారి కుటుంబానికి కలప, గనుల వ్యాపారం ఉండేది. అంటే మళ్లీ అటవీ ప్రాంతానికే. కాబట్టి పక్షులను చూస్తూ కాలం గడపవచ్చు. ఏడేళ్లు చేసిన పని అదే. ఆ తరువాత భారతదేశానికి వచ్చేశాడు. మళ్లీ కాలేజీలో చేరాలని అనిపించింది. దావర్స్ కాలేజీలో వాణిజ్యశాస్త్రం చదవడానికి చేరాడు. కానీ పద్దులు కాదు, పక్షులే కళ్ల ముందు కదిలేవి. శ్రద్ధ పెట్టలేకపోయాడు. దీనిని గమనించి అప్పటి ప్రిన్సిపాల్ ఫాదర్ ఎథెల్బర్ట్ బ్లాటర్ ఉదయం పూట వాణిజ్యశాస్త్రం చదవడానికీ, సాయంత్రం జంతుశాస్త్ర తరగతులకు హాజరు కావడానికీ అనుమతించాడు.సలీం అలీ కళ్లెప్పుడూ పక్షుల కోసమే వెదుకుతూ ఉండేవన్న మాట నిజం. ఆయన వేకువనే లేచేవారు. చుట్టూ చెట్లు చేమలు, వాటి మధ్య వారి ఇల్లు ఉండేది. ఆ చెట్ల మీద గిజిగాడి గూళ్లు ఉండేవి. పోర్సిలిన్ పూలకుండీ అంతటి కళాత్మకతను గడ్డిపోచల అల్లికతోనే సాధించిన ఆ పక్షుల ప్రతిభ విస్మయ పరిచేది. ప్రతి చెట్టుకూ గూడే. అన్ని గూళ్లు ఎందుకు కడతాయి? అన్నది కూడా ఆయన శోధిం^è దలిచాడు. డాక్టర్ అలీ చాలా చిత్రమైన విషయం కనుగొన్నాడు. గిజిగాడి గూళ్లను మగ పక్షులు నిర్మిస్తాయి. గూడు సిద్ధమైన తరువాత ఆడపక్షి వచ్చి గుడ్లు పెట్టి పొదుగుతుంది. పెంచుతుంది. ఇంతలో ఆ మగపక్షి అక్కడే ఇంకో కొమ్మకు మరో గూడు కడుతుంది. కానీ ఈసారి పాత ఆడపక్షి కాదు, మరొక ఆడపక్షి వచ్చి గుడ్లు పెడుతుంది. ఈ విషయాన్నే ఆయన మొదటిసారి ఒక అంతర్జాతీయ సైన్సు పత్రికలో ప్రచురించాడు. మొదట చర్చ వచ్చినా, తరువాత అంతా అంగీకరించారు.సాయం వేళ చదువుతో జంతుశాస్త్రంలో డిగ్రీ తెచ్చుకున్నాడు సలీం. కానీ ఎంఎస్సీ లేదా పీహెచ్డీ పట్టా లేదు కాబట్టి బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీలో ఉద్యోగం రాలేదు.దేశంలో అప్పటికి ఏ విశ్వవిద్యాలయంలోను పక్షిశాస్త్రం లేదు. అప్పటికే ఒంటరి పోరాటంలో ఉన్న అలీకి తన పనిలో కొత్తదనం కనిపించలేదు. అప్పుడే బెర్లిన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఇర్విన్ స్ట్రెస్మాన్ ఆహ్వానించాడు. అలీ జర్మనీ వెళ్లాడు. అక్కడే చాలామంది పక్షిశాస్త్రవేత్తలతో కలసి తిరిగాడు. మళ్లీ 1930లో స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. ఒక విదేశీ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొంది వచ్చినా వలస భారతంలో ఆయనకు అనుకున్న ఉద్యోగం రాలేదు. బొంబాయి దగ్గరే ఉన్న కిహిమ్ అనే గ్రామానికి వెళ్లాడు. అక్కడ పక్షుల మీద పూర్తి స్థాయిలో పరిశోధన చేశాడు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ సారథ్యం ఆయనకే అప్పగించారు. వందేళ్ల చరిత్ర ఉన్నప్పటికీ అప్పటికే కడగండ్లతో కాలం గడుపుతున్న ఆ సొసైటీని డాక్టర్ సలీం కాపాడారు. భారత ప్రభుత్వం ఎంతో సహకరించింది. పక్షిశాస్త్రవేత్తగా (ఆర్నిథాలజీ) డాక్టర్ సలీం సేవలు అసమానమైనవి. ఆయన రాసిన పుస్తకాలు, ప్రచురించిన వ్యాసాలు ఈ విషయాన్ని నిస్సందేహంగా నిరూపిస్తాయి. పక్షుల జీవన సరళిని పరిశీలించడం కూడా శాస్త్రంలో భాగమేనని తేల్చారు. ఆయన పరిశోధనలో పక్షుల అలవాట్లు, ఆహారం, గుడ్లు, పిల్లల పోషణ ప్రధానంగా చోటు చేసుకున్నాయి. జీవావరణ పరిస్థితులనే ఆయన ఎక్కువ అధ్యయనం చేశారు. భారతదేశంలో పక్షుల వర్గీకరణ అనేది ఆయన వచ్చిన తరువాత మరింత శాస్త్రీయతను సంతరించుకోవడం విశేషం. ఆయన పరిశోధన వల్ల జరిగిన మేలు అసాధారణమైనది. ప్రపంచంలో దాదాపు 8,580 జాతుల పక్షులు ఉన్నాయని అంటారు. ఇందులో 1,200 జాతులు భారతదేశంలో నివసిస్తున్నాయన్న సంగతి మనకు చెప్పినవారు డాక్టర్ అలీయే. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భరత్పూర్ పక్షి సంరక్షణ కేంద్రం కొనసాగిందంటే అందుకు కారకుడు డాక్టర్ సలీం అలీ. 250 ఏళ్ల చరిత్ర కలిగిన భరత్పూర్ పక్షి రక్షణ కేంద్రం ఒక అద్భుతం. రాజస్థాన్‌లో ఇది ఉంది. దీనికే కియోలదేవ్ (స్థానికంగా శివుడిపేరు) ఘానా జాతీయ సంరక్షణ కేంద్రంగా తరువాత నామకరణం చేశారు. అక్కడ ఉన్న కియోలదేవ్ ఆలయం కారణంగా ఆ పేరు వచ్చింది. భరత్పూర్ సంస్థానంలో ఘానా అనేచోట ఇది సహజంగా ఏర్పడింది. దాదాపు 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉంది. శీతాకాలంలో కొన్నివేల పక్షులు వస్తాయి. స్థానికంగా 250 రకాలు ఎప్పుడూ ఉంటాయి. 1938లో అప్పటి వైస్రాయ్ లిన్లిత్గో ఆ ఏడాది 4,273 పక్షులను వేటాడాడు. 1958 ప్రాంతంలో స్థానికులు ఈ పక్షి కేంద్రాన్ని వ్యవసాయ క్షేత్రంగా మార్చడానికి ప్రయత్నం చేశారు. దీనితో సలీం అలీ నేరుగా నెహ్రూను కలసి పక్షి రక్షణ కేంద్రంగా ప్రకటింపచేశారు. 1971లో దీనికి ప్రపంచ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు వచ్చింది. కేరళలోని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కు రక్షణలో కూడా ఆయన కృషి ఉంది. ఇది కూడా ఒక అద్భుత పక్షి కేంద్రమే. 1847లో దీనిని గుర్తించారు. 90 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించుకొని ఉంది. 1970 దీనికి సమీపంలో ఒక జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించాలని యోచించారు. దీనితో సేవ్ సైలెంట్ వ్యాలీ ఉద్యమం మొదలయింది. చివరికి ప్రభుత్వం ఆ ప్రాజెక్టు ప్రతిపాదనను విరమించుకుంది. ఈ పార్కుతో డాక్టర్ అలీకి విశేష అనుబంధం కూడా ఉంది. ‘బర్డ్స్ ఆఫ్ కేరళ’ అని ఆయన ప్రత్యేకంగా ఒక పుస్తకమే రాశారు. మరొక పుస్తకం ‘ది బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్’. పక్షుల గురించి శోధనకు వెళ్లినప్పుడు అలీకి ఇంకేమీ పట్టేది కాదు. ఆయన విహంగాలను వెతుక్కుంటూ ప్రపంచమంతా తిరిగారు. ఇబ్బంది కలిగించే వాతావరణం గాని, కొండలూ కోనలూ గాని ఆయన గవేషణకు అడ్డం కాలేకపోయాయి. భారతదేశం నలుమూలలా కూడా ఆయన అన్వేషణ సాగింది. పక్షుల కోసం వెతుకుతున్నప్పుడు ఆయన కళ్లు డేగ కళ్లయిపోతాయని మిత్రులు చమత్కరించేవారు. ఖాకీ యూనిఫారమ్‌లో, ఆకుపచ్చ టోపీతో నెరిసిపోయిన జుట్టుతో, చిరుగెడ్డంతో కనిపించేవారాయన. ఇంకో మిత్రుడు ‘తెల్ల వెంట్రుకల బుల్బుల్ వస్తోంది!’ అనేవాడు. ‘నేను బాగా పాడతాను కాబట్టి, ఆ పేరు సరిగానే ఉంది. కానీ నాకు రాబందు అన్న పేరైతే బావుంటుంది’ అని డాక్టర్ అలీ చెప్పేవారు. మెడలోఒక బైనాక్యులర్ వేసుకుని, చేతిలో పేజీలు నలిగిన చిన్న డైరీతో అడవుల వెంట, కొండల వెంట, చెట్ల మధ్య నుంచి ఆయన మైళ్ల తరబడి నడిపోతున్న దృశ్యం మిత్రులకు నిరంతరం ఆశ్చర్యంగా అనిపించేంది. ఎనిమిది పదులు దాటిన తరువాత కూడా ఆయనలో అదే తృష్ణ కనిపించేది. రెక్కలు సాచి విహాయసంలో ఎగిరే పక్షిని చూస్తూ ఉండడం ఆయనకొక వ్యసనం. ఆయన పక్షుల మనస్తత్వం ఎంత బాగా గ్రహించారో చూస్తే వింతనిపిస్తుంది. చాలా విమానాశ్రయాలకు పక్షుల బెడద మొదలైంది. ఈ విషయం ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. పక్షులు అక్కడికి ఎందుకు వస్తున్నాయో దర్యాప్తు చేయండని సలహా ఇచ్చారు. నిజమే, అంత గడబిడ ఉన్నచోటకి ఆ చక్కని ప్రాణులు ఎందుకు వస్తాయి? పరిశోధించిన అధికారులకు ఒక విషయం తెలిసింది. ఇలాంటి ఫిర్యాదు వచ్చిన విమానాశ్రయాలకు సమీపంలో కబేళాలు ఉన్నాయి. అందుకే పక్షులు అక్కడికి చేరుతున్నాయి. వాటి తప్పు కాదు. ఆయన 91వ ఏట కన్నుమూశారు. అప్పటికి మూడేళ్ల ముందు కూడా ఆయన ఒడిశాలోని తూర్పు కనుమలలో తిరిగారు. నల్లమెడ కొంగను చూడడం కోసం లద్ధాక్ చలిలో తిరిగారు. ఫ్లెమింగో పక్షి గూడును చూడ్డానికి ఏం చేశారో తెలుసా? రాణ్ ఆఫ్ కచ్‌లో ఒంటె మీద పదిగంటల పాటు ప్రయాణించారు. కానీ ఆ గూడును చూడడం సాధ్యపడలేదు. అయినా నిరుత్సాహపడలేదు. భారత్,పాక్ దేశపు పక్షులు అన్న అంశంతో ఆయన చేసిన పరిశోధనను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రెస్ వారు 1968, 1974 సంవత్సరాల మధ్య పది వాల్యూమ్లుగా ప్రచురించారు. ఏడు దశాబ్దాల పాటు పక్షుల గురించి అన్వేషించి, ఒక శాస్త్రాన్ని మథించినా జీవితపు చరమాంకంలో ఆయన అన్న మాట అందరినీ విస్తుపోయేటట్టు చేస్తుంది. ‘నాకు ఇంత కీర్తిప్రతిష్టలు రావడం బాగానే ఉంది కానీ, పక్షిశాస్త్ర శోధనలో ఇక్కడ దాదాపు ఏమీ జరగలేదనే అనుకుంటాను. నేను నూతిలో కప్పలాంటి వాడిని. లేదంటే, అందరూ గుడ్డివాళ్లే ఉన్నచోట ఒంటికన్నువాడిని’ అని సవినయంగా చెప్పుకున్నారు. ప్రఖ్యాత జీవావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ మాత్రం అలీ గురించి గొప్ప మాట అన్నాడు. ‘ఈ 20వ శతాబ్దంలో జీవజాలం మీద ఏ ఒక్కరు చేయనంత కృషి ఆయన ఒక్కరే చేశారు.’ చివరికి ఆ పక్షిప్రేమికుడు కేన్సర్ వ్యాధికి గురయ్యారు. 91వ ఏట హంస ఎగిరిపోయింది. ∙డా. గోపరాజు నారాయణరావు -
'నేను చిన్న చీమలా ఉన్నా'
ప్రకృతి ఎవరినైనా అలరిస్తుంది. అందునా హిమాలయాల అంచున ఉన్న ధర్మశాల ప్రకృతి అందాలకు ఎవరినా ఫిదా అవ్వాల్సిందే. భారత కోచ్ రవిశాస్త్రి సైతం ఇందుకు అతీతుడు కాదు. ధర్మశాల చుట్టూ ఉన్న ప్రకృతి ఆయను విపరీతంగా నచ్చిందంట. అంతే ఇంకేముంది సోషల్ మీడియా ట్విట్టర్లో ధర్మశాల, పక్కనే ఉన్న హిమాలయాలను పొగుడుతూ పోస్టుపెట్టేశాడు. చుట్టూ ఉన్న భారీ అందాల మధ్య తానో చిన్న చీమగా ఉన్నానంటూ వ్యాఖ్యానించాడు. హిమాలయాల అందాలు అద్భుతంగా ఉన్నాయని, క్రికెట్‌కు చాలా అనుకూలంగా ఉందంటూ ధర్మశాలను పొగడ్తలతో ముంచెత్తాడు. ఇక భారత్-శ్రీలంకల మధ్య జరగున్న మొదటి వన్డే మ్యాచ్‌కు రంగం సిద్ధమౌతోంది. ఇప్పటికే 1-0 తేడాతో టెస్టు సిరీస్ గెలుకున్న విరాట్ సేన వన్డేల్లోను తన సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకోసం హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ ఇప్పటికే ధర్మశాలలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. Feel like an ant with the giant in the background. THE MIGHTY HIMALAYAS. What a setting for #cricket #TeamIndia pic.twitter.com/hPoseRuo6H — Ravi Shastri (@RaviShastriOfc) December 8, 2017 Breathe easy in Dharamsala #TeamIndia #INDvSL pic.twitter.com/DpvQZ7KQfq — Ravi Shastri (@RaviShastriOfc) December 8, 2017 -
అటవీ జంతువుల ఆత్మీయ క్షేత్రం!
వన్యప్రాణులతో సామరస్యపూర్వక జీవనానికి ఈ క్షేత్రం నిలువుటద్దం. పండించే పైరు, నేలలో జీవరాశిని ఇన్నాళ్లు రైతు నేస్తాలంటున్నారు. సమీప జనావాసాలపై విరుచుకుపడే అటవీ జంతువులు కూడా ప్రకృతిసేద్యం పుణ్యమాని ఇప్పుడు రైతు మిత్రులుగా మారాయి. ప్రకృతి సేద్యం గొప్పతనాన్ని ఇదీ అని ప్రపంచానికి ఎలుగెత్తి చాటుతున్నాయి. ప్రకృతిసేద్యంలో నేల బాగుపడటమే కాదు పర్యావరణ వ్యవస్థ యావత్తూ పదికాలాల పాటు పదిలంగా ఉంటుందనటానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ తేయాకు క్షేత్రం. అటవీ జంతువులకు ముఖ్య విహారయాత్రా స్థలంగా మారిన ఆ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సృష్టించిన ఆ అభ్యుదయ రైతు టెన్జింగ్ బోడోసా. అస్సాంలోని ఉదలగురి జిల్లా కచిబారీ అతని స్వగ్రామం. ప్రకృతి సేద్యంలో పర్యావరణ వ్యవస్థ సమతుల్యత ఏర్పడుతుందనటానికి తన పొలాన్ని ప్రత్యక్ష ఉదాహరణగా నిలిపాడు. తండ్రి చనిపోవటంతో ఆరో తరగతిలో చదువు మానేసి మలేసియాకు చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీలో పనికి కుదిరాడు. 2006లో తిరిగి ఇల్లు చేరి రసాయన సేద్యంలో టీ తోటల సాగు చేపట్టాడు. పురుగుమందుల పిచికారీతో తరచూ అస్వస్థతకు గురవ్వటం, కుంటలోని చేపలు చనిపోవటం అతన్ని ఆలోచనలో పడేశాయి. ప్రతి ఒక్కరూ టీతోనే తమ రోజును ప్రారంభిస్తారు. అలాంటి వారికి టీతో పాటు కాస్త విషం కూడా ఇస్తున్నామా అని అంతరాత్మ నిలదీసినట్టనిపించేది. కొంత అంతర్మథనం తరువాత సేంద్రియ పద్ధతుల్లో టీ తోటలను సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. 2007లో సేంద్రియ తేయాకు తోటల పెంపకాన్ని ప్రారంభించి అనతికాలంలోనే నాణ్యమైన పంటను అధిక దిగుబడిని సాధించాడు. అస్సాం రాష్ట్రంలోనే తొలి సేంద్రియ తేయాకు రైతుగా గుర్తింపు పొందాడు. శ్రమకోర్చి అమెరికా, జర్మనీ వంటి పలు దేశాలకు సేంద్రియ తేయాకును ఎగుమతి చేశాడు. ఏటా రూ. 60–70 లక్షల ఆదాయం ఆర్జించే స్థాయికి చేరుకున్నాడు. 30 వేల మంది రైతులకు సేంద్రియ తేయాకు తోటల సాగులో టెన్జింగ్ శిక్షణ ఇచ్చారు. అంతేకాదు ప్రపంచంలోనే తొట్టతొలి ఏనుగుల స్నేహపూర్వక వ్యవసాయ క్షేత్రాలుగా టñ న్జింగ్ టీ తోటలు గుర్తింపు పొందాయి. అటవీ జంతువులకు ఆటపట్టు అక్కడ తేయాకు తోటల రైతులు ఏనుగుల మందలను పొలాల్లోకి రాకుండా బెదర గొట్టేందుకు చెట్లను నరికి మంటలు వేయటం, కంచె వేయటం చేసేవారు. టెన్జింగ్ పొలం అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉంది. అతను అటవీ జంతువులతో వైరానికి బదులు చెలిమిని పెంచుకున్నాడు. 7 ఎకరాల్లో సేంద్రియ తేయాకుతో పాటు రకరకాల పండ్లు, కూరగాయ పంటలను కలిపి మిశ్రమ పంటలుగా సాగుచేయటం ద్వారా పర్యావరణ సమతుల్యం ఏర్పడింది. అనుకూలమైన వాతావరణం ఏర్పడటంతో అనేక అటవీ జంతువులు, పక్షులకు అతని పొలం ఆవాసంగా మారింది. అడవి పందులు, నెమళ్లు, జింకలకు అది ఇష్టమైన విహార స్థలం. అక్కడ జంతువులు అడవిలో ఉన్నట్టే ప్రవర్తిస్తాయి. తోటలో స్వేచ్ఛగా సంచరిస్తాయి. వచ్చిపోయే అటవీ జంతువులతో పొలం కళకళలాడుతుంది. బారులు తీరుతున్న పర్యాటకులు ఏనుగులకయితే టెన్జింగ్ పొలం ముఖ్య విహార యాత్రా స్థలం గా మారింది. అవి ఇష్టంగా తినే వెదురు చెట్లను పొలం చుట్టూ నాటాడు. అక్కడ గడపటాన్ని ఏనుగులు అమితంగా ఇష్టపడతాయి. కొన్నిసార్లు 70–80 ఏనుగుల మందలు గుంపులు గుంపులుగా కలసి తోటలో తిరుగుతుంటాయి. అప్పుడప్పుడు వాటి తొక్కిసలాటల్లో కొంతమేర పంట నష్టం జరుగుతుంది. ఒకసారి అవి ఇంటిని కూడా నాశనం చేశాయి. ‘అయితే అడవి జంతువుల కోసం కూడా నేను పంటలను సాగు చేస్తున్నానని భావిస్తా.. అవి నా జీవితంలో సంతోషం నింపాయి’ అని మురిసిపోతారాయన. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రపంచ దేశాల నుంచి ఏటా వందల మంది పర్యాటకులు వస్తారు. కొందరు నెలల తరబడి అక్కడే ఉంటారు. రెండేళ్ల క్రితం పొలంలో ఏనుగులమధ్య పోట్లాట జరిగింది. ఒక ఏనుగు చనిపోవటంతో టెన్జింగ్ పొలం వార్తల్లోకి వచ్చింది. ‘వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్’ సంస్థ అధికారులు పొలాన్ని సందర్శించి.. ఆ తోటలో ఏనుగులు స్వేచ్ఛగా సంచరించటాన్ని చూసి సంతోషించారు. ప్రపంచంలోనే తొలి ఏనుగుల స్నేహపూర్వక వ్యవసాయ క్షేత్రంగా టెన్జింగ్ తేయాకు తోటను ధ్రువీకరించారు. మనుషుల సుఖసంతోషాలకు దగ్గరి దారి ప్రకృతిని గౌరవించటం మాత్రమే అని టెన్జింగ్ తరచూ చెబుతుంటారు. ఆయన నమ్మకాన్ని అక్కడి అటవీ జంతువులు అనుక్షణం నిజం చేస్తుండటం ప్రకృతి సాక్షిగా ఒక అద్భుతం! – సాగుబడి డెస్క్ . -
ప్రకృతి ప్రేమికుడు వైఎస్ఆర్
సింహాద్రిపురం : ప్రకృతి ప్రేమికుడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అని.. ప్రకృతి విధ్వంసకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని వైఎస్సార్సీపీ రైతు విభాగపు రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన సింహాద్రిపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతుల పాలిట ప్రకృతి జగనన్న అని, సకాలంలో సరిపడా వానలు కరుణిస్తేనే రైతాంగం సులువుగా బయటపడుతారన్నారు. ఇంతకమునుపు చంద్రబాబు పాలనలో ప్రకృ తి వైఫరీత్యాలు రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయన్నారు. వైఎస్సార్ హయాంలో ప్రకృతి కరుణించి సకాలంలో వర్షాలు కురిసి మంచి పంటలు పండాయని, లాభసాటి ధరలతో రైతాంగం సంతోషంగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో గత మూడేళ్లు వర్షాలు లేక కరువు కాటకాలతో రాయలసీమ ప్రజలు పక్క రాష్ట్రాలకు వలస వెళ్లే దుస్థితి నెలకొందన్నారు. ఈ ఏడాది అధిక వర్షాల వల్ల ఖరీఫ్‌లో చాలావరకు పంటలు దెబ్బతిన్నాయన్నారు. ప్రకృతి ప్రేమికులైన వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ పాదయాత్ర మొదలయ్యే తెల్లవారుజామున భారీ వర్షం కురవడం ఇందుకు నిదర్శనమన్నారు. ప్రకృతి దేవత స్వాగతం పలికందన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ ఎక్కడ కార్యక్రమం చేపట్టినా ప్రకృతి వర్షం ద్వారా స్వాగతిస్తూనే ఉందన్నారు. ప్రకృతి కరుణవల్ల వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యమన్నారు. రాబోవు రోజుల్లో తిరిగి వైఎస్సార్ పాలన చూస్తారన్నా రు. అంతకముందు వైఎస్ విగ్రహానికి ఆయన పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రైతు విభాగపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అరవిందనాథరెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి, కర్నూలు జిల్లా రైతు విభాగపు అధ్యక్షుడు శివరామిరెడ్డి, కర్నూలు జిల్లా రైతు విభాగపు జనరల్ సెక్రటరీ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయదారుల సమ్మేళనం
గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి రెండో సమ్మేళనం అక్టోబర్ 14వ తేదీ(శనివారం)న విజయవాడలో జరగనుంది. మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఫార్మసీ కాలేజీ ఆవరణలో జరిగే ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి ప్రకృతి వ్యవసాయదారులు తరలిరావాలని ఏపీ గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం అగ్ర నేత కుమారస్వామి(94401 27151) పిలుపునిచ్చారు. సిరిధాన్యాల ‘అటవీ కృషి’పై డా. ఖాదర్ శిక్షణ అరిక, సామ, కొర్ర తదితర సిరిధాన్యాలను ‘అటవీ కృషి’ పద్ధతుల్లో సాగు చేయడం, శుద్ధి చేయడం, సిరిధాన్యాలను ప్రధాన ఆహారంగా తినడం ద్వారా జబ్బులను పారదోలడంపై కర్ణాటకకు చెందిన స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ మైసూర్ సమీపంలోని తన సిరిధాన్య క్షేత్రంలో రైతులకు, ఔత్సాహికులకు సెప్టెంబర్ 30 – అక్టోబర్ 1 తేదీల్లో శిక్షణ ఇస్తారు. ‘అటవీ చైతన్యం’ అనే ప్రకృతి సేద్య ద్రావణాన్ని తయారు చేసుకోవడం, వాడటం ఎలాగో నేర్పిస్తారు. ఈ పద్ధతిలో సాగయ్యే మిశ్రమ పంటల క్షేత్రాన్ని చూపిస్తారు. 28వ తేదీలోగా పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. ప్రవేశ రుసుము: రూ. 2 వేలు. వివరాలకు 097422 58739 నంబరులో వాట్సప్/మెసేజ్ ద్వారా సంప్రదించవచ్చు. గో ఆధారిత ప్రకృతిసేద్యంపై అక్టోబర్ 10న బసంపల్లిలో శిక్షణ అనంతపురం జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు తాడిమర్రి నాగరాజు దేశీ గో ఆధారిత ప్రకృతిసేద్యంపై రైతులకు ప్రతి నెలా మొదటి సోమవారం శిక్షణ ఇస్తున్నారు. అక్టోబర్ 10న సీకే పల్లి మండలం బసంపల్లి గ్రామంలో ఉదయం 9 గం. నుంచి సా. 4.30 వరకు శిక్షణ ఇస్తారు. ఆసక్తి గల రైతులు ముందుగా ఫోన్ చేసి పేర్లు నమోదు చేయించుకోవాలి. ప్రవేశ రుసుము రూ. 100. ఇతర వివరాలకు నాగరాజు (94407 46074) పార్థసారధి (96633 67934)లను సంప్రదించవచ్చు. 1న వరి, కూరగాయల సాగుపై శిక్షణ రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులో అక్టోబర్ 1న వరి, కూరగాయల ప్రకృతి సేద్యంపై ఉద్యాన అధికారి రాజా కృష్ణారెడ్డి, రైతు ధర్మారం బాజీ శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666, 0863 2286255 నంబర్లలో సంప్రదించవచ్చు. -
కువకువల సంధ్యారాగం
ఎర్రటి సూరీడు నల్లటి మబ్బుల మాటుకు జారుకుంటున్న వేళ..నీలాకాశం కాషాయం కాటుక దిద్దుకుని మెరిసిపోతుంటే.. పగలంతా అలసిసొలసిన గువ్వలు ఆ ప్రకృతి కాన్వాస్‌పై ఒక్క చోట చేరి ఆత్మీయ సరాగాలు ఆలపిస్తున్నట్లుంది కదూ ఈ చిత్రం. ఈ మనోహర దృశ్యం ప్రత్తిపాడు సమీపంలోని పాత మద్రాసు రోడ్డు వెంబడి శుక్రవారం కనువిందు చేసింది. –ప్రత్తిపాడు -
సహజ ఎరువుపై శ్రద్ధలేదు!
అన్ని జిల్లాల్లో మొక్కుబడిగా సాగుతున్న కంపోస్టు పిట్స్‌ల నిర్మాణం ♦ మంజూరైన కంపోస్టు పిట్స్ 1,68,725 ♦ నిర్మాణంలో ఉన్నవి 19,631 ♦ నిర్మాణాలు పూర్తయినవి5,669 ♦ ప్రారంభానికి నోచుకోనివి1,43,425 పశువుల పేడ, వ్యర్థా ల కోసం నిర్మించు కునే కంపోస్టు పిట్ల కోసం ఒక్కో రైతుకు రూ.4,040 చొప్పున చెల్లిస్తున్నారు. ఇక ప్రత్యేకంగా నిర్మించే వర్మీ/నాడెప్ కంపోస్టు పిట్స్‌ల కోసం రూ.12 వేలు చెల్లిస్తున్నారు. వీటిని తమ ఇంటి ఆవరణలో గానీ, వ్యవ సాయ భూమి వద్ద గానీ నిర్మించు కునే వెసులుబాటు కల్పించారు. జనగామ నుంచి ఇల్లందుల వెంకటేశ్వర్లు : వ్యవసాయ రంగానికి చేయూత అందించేందుకు ప్రవేశపెట్టిన పథకాలు నిర్వీర్యమవుతున్నాయి. పథకం ప్రారంభంలో చూపిన శ్రద్ధ చివరివరకు కొనసాగకపోవడంతో ఈ పథకాలు అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోతున్నాయి. సహజ ఎరువు తయారీని ప్రోత్స హించి రైతులకు పెట్టుబడిని తగ్గించడానికి తీసుకొచ్చిన ‘వర్మీ/ నాడెప్ కంపోస్టు పిట్స్’ నిర్మాణం ముందుకు సాగడం లేదు. వీటి తయారీపై రైతులకు అవగాహన కల్పించకపోవడం, అధికారులు శ్రద్ధ చూపకపోవడంతో ఈ పథకం కాగితాలకే పరిమితమైంది. ప్రచారం లేక పురోగతి శూన్యం.. రైతులు ఇంటి ఆవరణలో సహజ ఎరువులు తయారు చేసుకోవడా నికి ఏర్పాటు చేసుకునే నిర్మాణాలకు ప్రభుత్వమే నిధులు సమకూ రుస్తున్నదన్న విషయం రైతులకు తెలియజేయడంలో అధికారులు విఫలమయ్యారు. ఈ కారణం వల్లే ఆయా జిల్లాలకు కేటాయించిన నిధులు సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. నిర్మాణాల కోసం నిధులు.. సాధారణంగా రైతులు పశువుల పెంటను ఎరువుగా ఉపయోగిస్తారు. దీన్ని పెరట్లోనో, ఇంటి సమీపంలోనో ఏర్పాటు చేసుకుంటారు. అయి తే దీని చుట్టూ గోడ లాంటి నిర్మాణం ఏర్పాటు చేసి ఓ పద్ధతి ప్రకారం పెంటను ఎరువుగా మార్చుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధు లను మంజూరు చేస్తోంది. అయితే ఈ విషయం రైతులకు తెలీదు. నిర్మాణాలు అంతంత మాత్రమే.. కంపోస్టు పిట్స్‌ల నిర్మాణాల్లో వరంగల్ రూరల్ జిల్లా మొదటి స్థానంలో ఉండగా రంగారెడ్డి, జోగులాంబ, ఖమ్మం జిల్లాలు చివరి స్థానాల్లో ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లాకు 10,878 కంపోస్టు పిట్స్ మంజూరైతే 1,224 కంపోస్టు పిట్స్‌ను మాత్రమే నిర్మించారు. ఇక రంగారెడ్డి, జోగులాంబ, ఖమ్మం జిల్లాల్లో ఒక్క నిర్మాణం కూడా పూర్తి కాలేదు. జయశంకర్, వరంగల్ అర్బన్, కొమురం భీం, మహబూబా బాద్, భద్రాద్రి, మేడ్చల్, నిర్మల్, వనపర్తి, సిరిసిల్ల, కరీంనగర్, పెద్ద పల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల, వికారాబాద్ జిల్లాలు కంపోస్టు పిట్స్ నిర్మాణాల్లో బాగా వెనుకబడి ఉన్నాయి. -
‘సిరి’ధాన్యాలే నిజమైన ఆహార పంటలు!
► కర్ణాటకలో సంప్రదాయ ప్రకృతి సేద్య పద్ధతి ‘అటవీ కృషి’ (కాడు కృషి) పునరుద్ధరణ ► ‘కాడు చైతన్యం’ పేరిట ద్రవరూప ఎరువే అటవీ కృషికి మూలాధారం ► రసాయనాల్లేకుండా వర్షాధారంగానే చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల మిశ్రమ సాగే అసలైన వ్యవసాయమని ప్రచారోద్యమం ► కొర్రలు, అండుకొర్రలు, అరికలు, ఊదలు, సామలు వంటి సిరిధాన్యాలు తింటే కేన్సర్, మధుమేహం తదితర జబ్బులన్నీ వాటికవే నయమవుతాయంటున్న అరుదైన స్వతంత్ర శాస్త్రవేత్త ► అమెరికాలో పెద్ద ఉద్యోగం వదిలి వచ్చి మైసూరు ప్రాంతంలో స్థిర నివాసం.. ► 20 ఏళ్లుగా ఊరూరా తిరిగి ప్రచారం చేస్తూ జన్మ సార్థకం చేసుకుంటున్నడాక్టర్ ఖాదర్ స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. వ్యక్తి కాదు.. శక్తి!! ప్రజల ఆహారపు అలవాట్లను, రైతుల సాగు పద్ధతిని రసాయన రహితంగా, పంటల సరళిని అత్యంత ఆరోగ్యదాయకమైన రీతిలోకి, ప్రకృతికి అనుగుణమైన పద్ధతుల్లోకి మార్చేందుకు గత రెండు దశాబ్దాలుగా విశేష కృషి చేస్తున్నారు డాక్టర్ ఖాదర్. వర్షాధారంగా కొద్దిపాటి నీటి(200 ఎం.ఎం.)తో పండే చిరుధాన్యాలే అసలైన ఔషధ విలువలున్న ఆహార పదార్థాలని, మానవాళిని పీడిస్తున్న ఈ కాలపు సకల రోగాలకు ఈ ‘సిరి’ధాన్యాలే ప్రకృతి మనకు ప్రసాదించిన సంపూర్ణ ఆహారమంటూ డాక్టర్ ఖాదర్ ప్రచారోద్యమం చేపట్టారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో పేద కుటుంబంలో జన్మించినప్పటికీ శ్రద్ధగా చదువుకొని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో స్టెరాయిడ్స్పై పీహెచ్డీ పూర్తి చేశారు. అమెరికా వెళ్లి పర్యావరణ సంబంధమైన అంశాలపైన, రసాయనాలకు విరుగుడు కనుగొనే అంశాలపైన వివిధ కంపెనీలలో పదేళ్ల పాటు పనిచేశారు. ఆధునిక మానవ సమాజం తినకూడనివి తింటూ దారుణమైన రోగాల పాలు కావడంతోపాటు.. భూమాతను రసాయనిక వ్యవసాయంతో నాశనం చేసుకుంటూ ఉండటం ఆయనను అమెరికాలో నిలువనీయకుండా చేసింది. 1997లో తిరిగి వచ్చి మైసూరులో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. పురాతన భారతీయ ప్రకృతి సేద్య పద్ధతి అయిన ‘అటవీ కృషి’ (కాడు కృషి)ని పునరుద్ధరించి, కాలికి బలపం కట్టుకొని ఊరూరా తిరిగి రైతులకు, గిరిజనులకు పరిచయం చేస్తున్నారు. 2009 నుంచి స్వయంగా 7 ఎకరాల్లో కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, సామలు, అరికలు వంటి సిరిధాన్యాలతోపాటు నూనెగింజలు, పప్పుధాన్య పంటలను కలిపి పండిస్తూ ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. మధుమేహం, కేన్సర్, థైరాయిడ్ తదితర దీర్ఘకాలిక జబ్బులతోపాటు రైతుల ఆత్మహత్యలను సైతం పారదోలే వజ్రాయుధాలు ‘సిరిధాన్యాలే’నని ఎలుగెత్తి చాటుతున్నారు! వేలాది మంది రైతులు, రోగులకు ఆపద్బాంధవుడిగా మారారు. ఇటీవల విజయవాడ విచ్చేసిన డా. ఖాదర్‌తో ‘సాగుబడి’ ముఖాముఖిలో ముఖ్యాంశాలు.. ► శాస్త్రవేత్తగా అమెరికాలో పదేళ్లు పని చేసి, కర్ణాటకలోని మైసూరుకు తిరిగి వచ్చి ‘కాడు కృషి’ అనే అటవీ వ్యవసాయ పద్ధతికి రూపకల్పన చేశారు. అంతరించిపోతున్న ‘సిరి ధాన్యాలను స్వయంగా సాగు చేస్తూ.. ప్రచారోద్యమం నిర్వహిస్తున్నారు కదా.. వీటి గురించి వివరిస్తారా..? భారతదేశంలో మానవులంతా వెయ్యేళ్ల క్రితం నుంచే మన ముందు తరాల వాళ్లు అద్భుతమైన ‘సిరిధాన్యాల’ను రోజువారీ ప్రధాన ఆహారంగా తింటూ వచ్చారు. కొర్రలు, అండు కొర్రలు, ఊదలు, సామలు, అరికలు.. ఈ ఐదూ దేవుడు ప్రసాదించిన అత్యద్భుతమైన నిజమైన ఆహార ధాన్యాలు. అందుకే వీటికి నేను ‘సిరి ధాన్యాలు’ అని పేరుపెట్టాను. ఇవే పండించుకొని మరీ తింటున్నాను. కర్ణాటకలోని గ్రామాల్లో తిరిగి రైతులను స్వయంగా కలిసి వారికి వీటి విత్తనాలు ఇచ్చి, పండించమని ప్రోత్సహిస్తున్నాను. కనీసం వెయ్యి చోట్లకు వెళ్లి మీటింగ్‌లు పెట్టి చెప్పాను. ఇప్పుడు కర్ణాటక అంతటా సిరిధాన్యాలు పెంచడం, వాడకం పెరిగాయి. మానవులు ఆధునికత పేరిట ఇవ్వాళ కంపెనీల మాటలు విని తినకూడనివి తింటున్నారు. ఇవ్వాళ మధుమేహం, కేన్సర్, ఊబకాయం, మోకాళ్ల నొప్పులు, థైరాయిడ్ వంటి ఎన్నో జబ్బులు ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నాయి. పండించకూడని పంటలు రసాయనిక పద్ధతుల్లో పండిస్తున్నారు. హరితవిప్లవం వల్ల 48 శాతం పంట భూములు పూర్తిగా నిర్జీవమై నిస్సారమై మరుభూములుగా మారిపోతున్నాయి. అమెరికాలో శాస్త్రవేత్తగా పనిచేస్తూ నిశితంగా అధ్యయనం చేసి.. తినే తిండికి కొత్త జబ్బులకు ప్రత్యక్ష సంబంధం ఉందని గ్రహించాను. ఈ గ్రహింపు వచ్చినదే తడవుగా ‘నేను చేయాల్సింది ఉద్యోగం కాదు స్వదేశంలో రైతులు, ప్రజలతో కలిసి పనిచేయాలి’ అనిపించింది. అంతే.. ఉద్యోగం వదిలేసి వచ్చి 20 ఏళ్లుగా మైసూరు ప్రాంతంలో స్వతంత్రంగా పనిచేస్తున్నాను. అంతరించిపోతున్న సిరిధాన్యాల విత్తనాలను సేకరించి రైతులకిచ్చి సాగుచేయించాను. 2009లో 7.5 ఎకరాల బంజరు కొని నేను కూడా ‘అటవీ కృషి’ చేస్తున్నాను. ► సిరిధాన్యాల ప్రాధాన్యం ఏమిటి? సిరిధాన్యాలు మన దేశంలో మాత్రమే ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. బ్రిటిష్ వాళ్లు మన దేశానికి వచ్చిన తర్వాత వీటిని చిన్నచూపు చూడడం ప్రారంభమైంది. చిరుధాన్యాలని, తృణధాన్యాలని అంటూ వీటిని తినాల్సిన అవసరం లేదన్న భావన కల్పించడం వల్ల ఈ పంటలు అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది. కేవలం 128 ఏళ్ల నుంచి మాత్రమే మనం వరి బియ్యం తింటున్నాం. నీటి వసతి బాగా ఉన్న దగ్గరే వరి, గోధుమ పండేవి. మొదట్లో అడపాదడపా పండుగలకో పబ్బాలకో తినే వాళ్లం. వరి, గోధుమలు, చెరకు వంటి అధికంగా నీరు అవసరమయ్యే పంటలను రసాయనాలతో పండిస్తున్నాం. కిలో వరి బియ్యం పండించడానికి 8 వేల లీటర్ల నీరు అవసరం. అడవుల నరికివేత కారణంగా నదులు, రిజర్వాయర్లు ఖాళీ అయిపోతున్నాయి. ఇంకెన్నాళ్లీ దుర్గతి? కానీ, కిలో కొర్రలు పండించడానికి 200 లీటర్ల నీరు చాలు. నాలుగు వర్షాలు పడితే చాలు 3 నెలల్లో పంట పండుతుంది. అండు కొర్రలు 75 రోజుల్లోనే పంట చేతికొస్తుంది. ► మీ ‘అటవీ వ్యవసాయం’ ప్రత్యేకత ఏమిటి? కన్నడలో కాడు అంటే అడవి అని అర్థం. వ్యవసాయం అనే మాట నాకు ఇష్టం లేదు. అడవిని నాశనం చేసి వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయం పేరుతో, ఆధునిక పద్ధతుల పేరుతో వాణిజ్య పంటలను కంపెనీల మాటలు విని రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు కుమ్మరించి సాగు చేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదన ఆశ చూపించి బీటీ పత్తి, చెరకు, వరి, గోధుమ వంటి అధిక నీరు అవసరమయ్యే ఏక పంటలను రైతుల చేత సాగు చేయిస్తున్నారు. భూమి తల్లిని సర్వనాశనం చేస్తున్నాం, మనల్ని మనం సర్వనాశనం చేసుకుంటున్నాం. ఇప్పటికే 38 శాతం సాగు భూములు మరుభూములుగా మారాయి. భూమి తల్లి ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఇది అందరూ తెలుసుకోవాలి. అందుకే వ్యవసాయం అనే మాట నాకు ఇష్టం లేదు. అటవీ కృషి అని అంటున్నాను. నిజమైన ఆహార పంటలు పండించుకుంటూనే భూమి తల్లిని, జంతుజాలాన్ని కాపాడుకోవడానికి అటవీ కృషిని ప్రారంభించాం. గుప్పెడు అడవి మట్టితో తయారు చేసి వాడుకునే ‘అటవీ చైతన్యం’ అనే ద్రవరూప ఎరువు.. ప్రతి రైతూ తన సాగు భూమిలో కనీసం 20% విస్తీర్ణంలో పొలం పక్కనే అడవిని పెంచడం.. ఆకులు, అలములు పొలంలో వేసుకోవటం ముఖ్యమైన విషయాలు. ఒకే పంటను పండిస్తే చీడపీడల సమస్యలు తలెత్తుతాయి. కొర్రలు తదితర 5 రకాల సిరిధాన్యాలు (ఏకదళ పంటలు), పప్పుధాన్యాలు (ద్విదళ పంటలు), నూనె గింజ పంటలను మిశ్రమ సేద్యం చేయాలి. మా పొలంలో 12 పంటలు కలిపి పండిస్తున్నాం. చీడపీడల సమస్యే రాలేదు. ► ప్రతి రైతూ పొలం పక్కనే 20 శాతం విస్తీర్ణంలో తానే అడవిని పెంచుకోవాలని మీరు చెబుతున్నారు. కేవలం ఎకరం, రెండకరాలున్న రైతులకు ఇదెలా సాధ్యం? 7.5 ఎకరాల బీడు భూమిని 2009లో కొనుగోలు చేసి, 3 ఎకరాల్లో అడవిని, 4.5 ఎకరాల్లో పంటలను పెంచుతున్నాను. 3 ఎకరాల అడవి 10 ఎకరాల్లో పంటను కాపాడుతుంది. అడవిలో చెట్లకు రాలే ఆకులు, రెమ్మలను ఏరి ఎండాకాలంలో తెచ్చి పొలంలో వేసుకోవాలి. అడవిలో చెట్ల ఆధారంగా కొన్ని పక్షులు, చిన్నా చితకా జంతువులు కూడా పెరుగుతాయి. ఆకులు అలములను వీటి మలమూత్రాల్లోని సూక్ష్మజీవులు సహజ ఎరువుగా మార్చుతాయి. అందుకే దీన్ని ‘అటవీ ప్రసాదం’ అంటున్నాం. దీన్ని తెచ్చి వేసవిలో పొలంలో వేసుకోవాలి. సిరిధాన్య పంటలు పొలంలో వేస్తే కంకులు కోతకొచ్చే సమయంలో 15 రోజులపాటు పక్షుల గుంపులు మన పొలంలోకి పిలవని అతిథులుగా వచ్చేస్తాయి. కొంతమేరకు పంటను అవి తినేస్తాయి. అయినా, పర్వాలేదు. ఎందుకంటే.. అవి తినే గింజల ఖరీదు కన్నా అవి మన పొలంలో వేసే రెట్టలు ఎంతో విలువైన పోషకాలతో భూమిని సారవంతం చేస్తాయి. ఎక్కడో ఒక రైతు సిరిధాన్యాలు పండిస్తే పక్షుల వల్ల నష్టం ఎక్కువగానే ఉంటుంది. కానీ, ఆ ప్రాంతంలో కొందరు రైతులు సిరిధాన్యాలు వేస్తే రైతుకు నష్టం తెలియనంత తక్కువగా ఉంటుంది. పొలంలో అక్కడక్కడా చిన్న, చిన్న నీటి కుంటలు తవ్వుకుంటే.. అందులోకి చేరే నీటిలోకి ఈ పక్షుల రెట్టల్లోంచి వచ్చి చేరే సూక్ష్మజీవరాశి ఆ నీటిని పోషక జలంగా మార్చేస్తాయి. పక్షులు పురుగులను ఏరుకొని తినేస్తాయి. అడవి పక్కన ఉండే పొలంలో చీడపీడల బెడదే ఉండదు. ఎకరం, రెండెకరాలున్న చిన్న రైతులు కూడా తమ భూమిలో కనీసం 20 శాతం విస్తీర్ణంలోనైనా అడవిని కూడా పెంచుకోవాలి. అప్పుడు అడవిని ప్రత్యేకంగా ఎక్కడో పెంచాల్సిన అవసరం ఉండదు. ప్రకృతిలో పరస్పరాధారిత జీవనచక్రాన్ని మనమే తెంపేశాం. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు వాడకుండా దీన్ని తిరిగి మనమే నిర్మించుకోవాలి. ‘అటవీ కృషి’ పద్ధతి మూలసూత్రం ఇదే. కర్ణాటకలో వందల వేల రైతులు ఈ పద్ధతిలో ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. ► సిరిధాన్యాల సాగు రైతుల ఆత్మహత్యలు ఆపగలదా? సిరిధాన్యాల సాగు చాలా సులువు. తెలుగు రైతులు సిరిధాన్యాల సాగును పెద్ద ఎత్తున చేపట్టినా తగినంత మార్కెట్ ఉంది. కేవలం ఆహారం వల్లనే హైదరాబాద్‌లో నూటికి 38 మందికి మధుమేహం వచ్చింది. వచ్చే ఐదేళ్లలో ఇది 60 శాతానికి చేరుతుంది. వీరికి సిరిధాన్యాల గురించి తెలిస్తే బ్రహ్మాండమైన మార్కెట్ ఇక్కడే ఏర్పడుతుంది. పేద రైతులు పండించే సిరిధాన్యాలను మంచి ధరకు పట్నవాసులు కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యలు ఎలా ఆగుతాయి? ప్రభుత్వాలు కంపెనీలతో కలసి పనిచేస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాల మీద ఆధారపడితే రైతులు స్వావలంబన దిశగా ముందుకు వెళ్లలేరు. కొన్నాళ్లకు ప్రభుత్వ వ్యవస్థలో కూడా మార్పు వస్తుంది. ∙ (డాక్టర్ ఖాదర్‌ను 094485 61472, , musk123rt@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. ఆయన సాధారణంగా రైతుల సమావేశాల్లో, హోమియో వైద్యంలో బిజీగా ఉంటారు..) సిరిధాన్యాలకు ఆ ఔషధ గుణాలెలా వచ్చాయి? జొన్నలు, సజ్జలు, రాగులు ఈ పరిధిలోకి రావా? ఏదైనా ఒక ఆహారపదార్థం ఎంత ఆరోగ్యకరమైనది, ఎంత ఔషధగుణం కలిగినది అనేది చూడాలంటే.. అందులో పీచుపదార్థం (ఫైబర్) ఎంత ఉంది? పిష్టపదార్థం (కార్బోహైడ్రేట్లు) –పీచుపదార్థం మధ్య నిష్పత్తి ఎంత ఉంది? అనే విషయాలు చూడాలి. వరి బియ్యం, గోధుమలు తింటూ ఉంటే ఆరోగ్యం బాగుపడదు. వరి బియ్యంలో పీచు 0.2 శాతం. పిష్టపదార్థం 79 శాతం. పీచుపదార్థం – పిష్టపదార్థం నిష్పత్తి 385. ముడిబియ్యం తిన్నా ఈ నిష్పత్తిలో పెద్దగా తేడా ఉండదు. 5 రకాల సిరిధాన్యాల్లో పీచు 8 నుంచి 12.5 శాతం వరకు.. పిష్టపదార్థం 60 – 69 శాతం వరకు ఉంది. వీటి నిష్పత్తి 5.5 నుంచి 8.8 మధ్యలో ఉంటుంది. ఇది 10 కన్నా తక్కువగా ఉంటే రోగాలను సైతం తగ్గించే శక్తిగల ఆహారంగా భావించాలి. తిన్న తర్వాత నెమ్మదిగా 6–8 గంటల్లో సమతుల్యంగా గ్లూకోజ్‌ను రక్తంలోకి విడుదల చేస్తాయి. అవసరానికి మించి గ్లూకోజ్ రక్తంలోకి విడుదల చేయకపోవడం, అనేక సూక్ష్మపోషకాలు, ప్రొటీన్లు కలిగి ఉండటం వీటి విశిష్టత. సిరిధాన్యాలను తిన్న వారికి వ్యాధి తీవ్రతను బట్టి.. మధుమేహం, కేన్సర్, ఊబకాయం వంటి మొండి జబ్బులు కూడా 6 నెలల నుంచి 2 ఏళ్లలోగా వాటంతట అవే తగ్గిపోతాయి. సిరిధాన్యాలు పోషకాలను పుష్కలంగా అందించడమే కాకుండా దేహంలో నుంచి రోగకారకాలను తొలగించి శుద్ధి చేస్తాయి. సిరిధాన్యాల్లో పీచు ఎక్కువ కాబట్టి కనీసం 2 గంటలు నానబెట్టి వండుకొని తినాలి. ఈ 5 రకాల సిరిధాన్యాలను రోజుకు ఒక రకం చొప్పున మార్చి మార్చి తింటే చాలు. 2 గంటలు నానబెట్టడం వల్ల సిరిధాన్యాల బియ్యంతో అన్నం బాగా ఒదుగుతుంది. కిలో వండితే పది మందికి సరిపోతుంది. జొన్నలు, రాగులు, సజ్జలు తటస్థ ధాన్యాలు. వీటిల్లో పీచు శాతం 4–6 శాతం. తిన్న 2 గంటల్లోనే గ్లూకోజ్ రక్తంలో కలిసిపోతుంది. అందువల్ల ఆరోగ్యసిరినిచ్చే సిరిధాన్యాలే నిజమైన ఆహారం. ‘అటవీ చైతన్యం’ ద్రావణం తయారీ ఎలా? ‘అటవీ చైతన్యం’ తయారీకి కావలసిన పదార్థాలు: 1. అభయారణ్యంలో నుంచి తెచ్చిన గుప్పెడు మట్టి 2. ఐదు రకాల సిరిధాన్యాల పిండి పావు కిలో 3. పప్పుధాన్యాల పిండి పావు కిలో 4. తాటి బెల్లం 50 గ్రాములు 5. 30 లీటర్ల నీరు మట్టి కుండను కుతిక వరకు నేలలో పాతిపెట్టి.. అందులో 30 లీటర్ల నీటిని పోసి మట్టి, పిండి, తాటిబెల్లం కలిపి.. కుండపై మూత పెట్టాలి. కుండపై నేరుగా ఎండ పడకుండా నీడను కల్పించాలి. రోజూ కలియదిప్పాల్సిన పని లేదు. 5 రోజులకు అటవీ చైతన్యం వాడకానికి సిద్ధమవుతుంది. 6వ రోజు నుంచి 21వ రోజు వరకు దీన్ని వాడుకోవచ్చు. అప్పటి వరకు సూక్ష్మజీవరాశి పుష్కలంగా ఉంటుంది. అటవీ చైతన్యం తయారీ కోసం ప్రతిసారీ అభయారణ్యంలోకి వెళ్లి మట్టి తేనవసరం లేదు. అటవీ చైతన్యం ద్రావణాన్ని ఒక లీటరు తీసి పక్కన పెట్టుకొని.. 21 రోజుల లోగా.. మళ్లీ తయారు చేసుకోవాలి. మట్టికి బదులు ఈ ద్రావణాన్ని కుండలో వేసుకోవాలి. అంటే సిరిధాన్యాల పిండి, పప్పుల పిండి, తాటి బెల్లం మళ్లీ కలుపుకొని.. ఈ లీటరు అటవీ చైతన్యం ద్రావణాన్ని కలుపుకుంటే చాలు. 5 రోజుల తర్వాత అది వాడకానికి సిద్ధమవుతుంది. ఇలా ఎన్ని సంవత్సరాలైనా జీవితాంతం తిరిగి కలుపుకుంటూ ఉండవచ్చు. మైసూరు దగ్గరలోని మా క్షేత్రాన్ని సందర్శించే వారికి ఒక లీటరును ఉచితంగా ఇస్తున్నాం. పిచికారీ పద్ధతి: ద్రవ రూప ఎరువు ‘అటవీ చైతన్యం’ ఒక లీటరు తీసుకొని 20 లీటర్ల నీటిలో కలిపి.. ఆ ద్రావణాన్ని ఎకరం పొలంలో మట్టిపైన, సూర్యాస్తమయం సమయంలో, పిచికారీ చేయాలి. కొత్త స్ప్రేయర్‌తో పిచికారీ చేయవచ్చు లేదా చేతితోనైనా చల్లవచ్చు. వారానికి రెండు సార్లు చల్లాలి. ఇలా 6 వారాలు చేస్తే.. భూమి సారవంతమై పంటల సాగుకు అనువుగా మారుతుంది. రసాయనిక వ్యవసాయం వల్ల బాగా పాడైపోయిన భూమిని కూడా ఇలా తిరిగి పునరుజ్జీవింపచేసుకోవచ్చు. ఎటువంటి రసాయనిక ఎరువులు, కలుపుమందులు చల్లకుండా.. వరుసగా రెండేళ్లు అటవీ చైతన్యాన్ని ఇలా పిచికారీ చేస్తే ఇక ఆ భూమిలో చల్లకపోయినా పర్వాలేదు. భూమిని సారవంతం చేయడానికే కాదు.. పంటలపైన పిచికారీ చేసినా సరిపోతుంది. వందల ఎకరాలు సాగు చేసే రైతులు అందుకు అవసరమైనన్ని కుండల్లో అటవీ చైతన్యాన్ని తయారు చేసుకోవచ్చు. తొలి దశలో నాగలితో భూమిని దున్నాలి. భూమి గుల్లబారిన తర్వాత నేలను కుళ్లగించే చేతి పరికరాలతో నేలను తవ్వితే సరిపోతుంది. అటవీ చైతన్యాన్ని క్రమం తప్పకుండా చల్లుతూ ఉంటే 3 నుంచి 6 నెలల్లోగా ఎటువంటి బీడు భూమినైనా పంటల సాగుకు అనువుగా మార్చుకోవచ్చు. – ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటో: కందుల చక్రపాణి, ఫొటో జర్నలిస్టు, విజయవాడ -
దేశీ విత్తనం.. ఆరోగ్యం.. ఆదాయం!
రసాయన సేద్యం చేసేటప్పుడు అప్పుల కోసం తిరిగి తిరిగి అనునిత్యం అనుభవించిన వేదనను అధిగమించి ప్రకృతి సేద్యంలో దేశీ వరి వంగడాల సాగు ద్వారా ప్రశాంత జీవనానికి బాటలు వేసుకున్న ఆ యువ రైతు బైరపాగ రాజు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం గుమ్మకొండ ఆయన స్వగ్రామం. పదో తరగతి వరకు చదివి 2004లో కుటుంబ సేద్యం చేపట్టాడు. బలం వీర్యవృద్ధికి దోహదం చేసే మాప్లా సాంబ, సాధారణ ప్రసవం కోసం కూల్కర్ రకం, పలు ఔషధ విలువలున్న మైసూర్ మల్లిగ వంటి వందలాది దేశీ వరి రకాలను ఆయన సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది మార్చిలో రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని చినజీయర్ ఆశ్రమంలో జరిగిన పాలేకర్ శిబిరంలోనే రాజు తొలిసారి శిక్షణ పొందాడు. అనేక సంవత్సరాలుగా సాక్షి ‘సాగుబడి’ పేజీలో పెట్టుబడిలేని ప్రకృతి సేద్యంపై వచ్చే కథనాలను ఆసక్తిగా చదివి ఆకళింపు చేసుకుంటున్నాడు. ఆ కథనాల స్ఫూర్తితో 2014 ఖరీఫ్‌లో తొలిసారిగా ప్రకృతి సేద్య విధానంలో 25 సెంట్లలో ఆర్ఎన్ఆర్ –15048 రకం వరిని ప్రయోగాత్మకంగా సాగుచేశాడు. ఖరీఫ్‌లో ఆరు, రబీలో 8 బస్తాల దిగుబడి వచ్చింది. 2015 ఖరీఫ్‌లో అరెకరంలో 12 బస్తాల దిగుబడి వచ్చింది. దీంతో రాజుకు ప్రకృతి సేద్యంపై గురి కుదిరింది. 2016లో ‘సాగుబడి’ పేజీలో వార్తను చూసి హైదరాబాద్ రామకృష్ణ మఠంలో ‘సేవ్’ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన దేశీ విత్తన పంపిణీ కార్యక్రమానికి హాజరై 70 రకాల దేశీ విత్తనాలను రాజు తెచ్చుకున్నాడు. ఖరీఫ్‌లో రెండెకరాల్లో సాగు చేశాడు. నారుమడిని భాగాలుగా చేసి ఒక్కో భాగంలో ఒక్కో రకం విత్తనాన్ని పోసుకున్నారు. అట్టముక్కలపై రకాల పేర్లు రాసి సూచికలు ఏర్పాటు చేశారు. తొలుత బీజామృతంతో విత్తన శుద్ధి చేశారు. రెండుసార్లు నీటి ద్వారా జీవామృతం అందించారు. నాటుకునే ముందు నారును కట్టలుగా కట్టి బీజామృతంలో ముంచి శుద్ధి చేశారు. దమ్ములో ఎకరాకు 100 కిలోల ఘన జీవామృతం వేశారు. మడికి 4 రకాల చొప్పున నాట్లు వేశారు. రకానికి రకానికి మధ్యన 3 అడుగుల ఎడం కాలిబాటలు వదిలారు. నాట్లు వేసిన 10, 35, 65, 100 రోజుల దశలో ఎకరాకు 200 లీటర్ల చొప్పున జీవామృతాన్ని నీటి ద్వారా అందించారు. చీడపీడల నివారణకు అగ్నిఅస్త్రం చల్లారు. దేశీ విత్తనాలకు ఎలాంటి తెగుళ్లు ఆశించలేదు. నాట్లు,కోత దశలో కొంచెం శ్రమ పెరిగింది. ఎకరాకు 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. విత్తన వరి మడుల మధ్య దూరం వదిలేయడం వల్ల కొంత భూమి వృథా అయ్యిందని, అందువల్ల ఎక్కువ రకాల విత్తనోత్పత్తి చేసినప్పుడు దిగుబడి తక్కువగా ఉంటుందని రాజు చెప్పారు. విత్తనాలను కిలో రూ. 50 చొప్పున రైతులకు విక్రయించారు. అయినా, సాగు ఖర్చు తక్కువ కాబట్టి, ఎకరాకు రూ. 20 వేల నికరాదాయం లభించింది. ప్రకృతిసేద్యంలో నేల గుల్లబారటం వల్ల కలుపు సులభంగా చేతికొస్తుంది. శ్రమతో పాటు కూలి ఖర్చు సగం తగ్గింది. పొలంలో సాలీళ్లు, ఆరుద్ర పురుగులు, సీతాకోక చిలుకలు, తేనెటీగలతో పాటు పలు రకాల మిత్ర పురుగులు, వానపాముల సంఖ్య పెరిగింది. మైసూర్ మల్లిగ, కాలాబట్టిపై ప్రత్యేక శ్రద్ధ ఈ ఖరీఫ్‌లో ఒక ఎకరంలో మైసూర్ మల్లిగ (సన్నరకం), మరో ఎకరంలో కాలాబట్టి (దొడ్డు రకం.. నల్ల బియ్యం) రకాలను.. మరో ఎకరంలో బాసుమతి, కులాకర్, మాపిళ్లై సాంబ, ఇల్లప్సాంబ, కె5, నవార రకాలను రాజు సాగు చేస్తున్నాడు. కాలాబట్టి నాటిన 40 రోజుల్లో మనిషి ఎత్తున ఎదిగింది. మైసూర్ మల్లిగ 40 బస్తాల ధాన్యం దిగుబడితో మంచి ఆదాయమూ వస్తుందని రాజు ఆశిస్తున్నారు. మహిళలకు, ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు రోజువారీ తినడానికి ఈ రకం బాగుంటుంది. కాలాబట్టి దొడ్డు రకం నల్లబియ్యం రకం. పాయసం వండుకోవడానికి ఇది శ్రేష్టమైనది. తన కుటుంబ సభ్యులు పిండి (రసాయనిక ఎరువులు) వేయకపోతే లాభం ఎక్కువ రాదని అంటున్నారని, ప్రకృతి వ్యవసాయంలోనే ఈ ఏడాది మంచి దిగుబడితోపాటు అధిక నికరాదాయం సాధించి వారికి కూడా పూర్తిస్థాయి సంతృప్తి కలిగించగలనన్న భరోసా ఇటీవలి వర్షాల వల్ల కలిగిందని రాజు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఉత్సాహంతో కూరగాయలను సైతం సాగు చేసేందుకు రాజు సిద్ధమవుతున్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం.. ప్రత్యేక ఔషధ గుణాలకు తాతల కాలం నాటి దేశీ వరి వంగడాలు పెట్టింది పేరు. పోషక విలువలు పుష్కలంగా కలిగి ఉండటంతోపాటు వీటిని సేవ్ సంస్థ విజయరామ్, శివప్రసాద రాజుల ప్రోత్సాహంతో శ్రద్ధగా సాగు చేస్తున్నా. రైతులకు విత్తనాలు, ప్రజలకు బియ్యం అందిస్తున్నా. ఆరోగ్యవంతమైన సమాజం కోసమే ప్రకృతి సేద్యం చేస్తున్నా. హేళన చేసిన వారే మెచ్చుకుంటున్నారు. – బైరపాగ రాజు (81868 86807), గుమ్మకొండ, నాగర్ కర్నూల్ – చింతకింది లింగం, సాక్షి, తిమ్మాజీపేట, నాగర్ కర్నూల్ జిల్లా -
వీటితో స్వైన్ ఫ్లూకు దూరంగా ఉండండి..
సాక్షి, హైదరాబాద్: దేశంలో స్వైన్ ఫ్లూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది దేశవ్యాప్తంగా 25,864 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఇది గతేడాది నమోదైన కేసులకన్నా 14 రెట్లు ఎక్కువ. ఇక 2016లో 1,786 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ విషయం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఈ వ్యాధితో మరణించే వారి సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. స్వైన్‌ఫ్లూ శ్వాసకోస వ్యాధి కావండంతో త్వరగా విస్తరిస్తోంది. వ్యాధిని గుర్తించడంలో నిర్లక్ష్యం వహించడం, సకాలంలో వైద్యం అందకపోవడంతో ఈ వ్యాధి మరణాల సంఖ్య పెరుగుతోంది. వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడంతోనే స్వైన్ ఫ్లూకు దూరంగా ఉండవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. సహజంగా లభించే ఆహార పదార్థాలతో వ్యాధినిరోధక శక్తి పెంచుకోవచ్చు. ఇది చల్లని వాతవారణంలో త్వరగా వ్యాప్తి చెందుతోంది కాబట్టి ఈ మన్సూన్ సీజన్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ కింది వాటితో వ్యాధినిరోధక శక్తి పెంచుకోవచ్చు.. ♦వేడి నీరు, నిమ్మ రసం, తేనేల మిశ్రమాన్ని ఉదయాన్నే పడిగడుపున తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు, వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవచ్చు. ♦ హెర్బల్ టీలతో కూడా వ్యాధినిరోధక శక్తి పెంచుకోవచ్చు. దీంతో ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండవచ్చు. తులసి, అల్లం, నిమ్మ, బ్రాహ్మి టీలతో ఈ వ్యాదికి దూరంగా ఉండవచ్చు. ♦ఉసిరి జ్యూస్‌లో తేనేను కలిపి తాగడం వల్ల కూడా వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవచ్చు. ఇందు యాంటీ ఆక్సిడెంట్స్, మైక్రో న్యూట్రిన్లు పుష్కలంగా ఉంటాయి. ♦పసుపు మానవ శరీరానికి మంచి ఔషదంలా పనిచేస్తోంది. యాంటి బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ గా పనిచేస్తూ వ్యాధినిరోధక శక్తిని పెంపోందిస్తుంది. ఇది మనం వంటలలో రోజు వాడేదే. ♦ నల్లమిరియాలు శరీరంలో వేడిమిని తగ్గించడమే కాకుండా వ్యాధినిరోధక శక్తి పెంపొందిస్తాయి. మిరియాలను కూడా మన ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తాం. ♦ దాల్చిన చెక్కతో జలుబు, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పిలను తగ్గించడమే కాకుండా ఎలాంటి వైరస్లు ధరిచేరకుండా చేస్తోంది. దాల్చిన చెక్క పౌడర్‌ను తేనేలో కలుపుకొని తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. -
చిన్న రిక్వెస్ట్ బాస్!
మా కోరికలేవీ పెద్దవి కావు బాస్. చిన్న చిన్న విఘ్నాలు తొలగిస్తే చాలు. ఫ్యామిలీ ఫ్యామిలీ నీకు ఉండ్రాళ్లు పెడుతూ తరిస్తాం. విపత్తులు, ఉత్పాతాలు, విలయాలు... వాటి పని మీరే చూసుకుంటారు. చికాకులు, చిర్రుబుర్రులు, చివాట్లు, చిక్కులు... ఇవి మా ప్రాబ్లమ్స్. ఇవే విఘ్నాలు. నిన్ను దేవుడూ అని పిలుస్తూ ఎక్కడో దూరంగా ఉంచాలని లేదు. మనసుకు దగ్గరగా ఉంటావ్... బాగా క్లోజ్‌గా అనిపిస్తావ్. ఏదైనా చెప్పేసుకోవచ్చు... అన్నంత క్లోజ్‌గా అనిపిస్తావ్ బాస్. మా విన్నపం మన్నించండి. కొంచెం కన్సిడర్ చేయండి బాస్. ఇది ఓ ఫ్యామిలీకి కంబైన్డ్‌గా వచ్చిన కల. వినాయకుణ్ణి ఏం కోరుకున్నారో సరదాగా చదవండి. పత్రితో నీకు పూజలు చేస్తాం. పచ్చగా ఉండే ఇళ్లను ఇవ్వు. గొడుగు నీకు అమరుస్తాం. ప్రకృతి గొడుగు గతి తప్పకుండా చూడు. ఉండ్రాళ్లు సమర్పిస్తాం. ఆకలిగొన్న కడుపు ఒక్కటీ లేకుండా చూడు. అత్తగారు ఊరి నుంచి ఆవకాయతో దిగుతుంది. తెల్లారి లేచే సరికి కొడుకు కిచెన్‌లో కేరెట్ తరుగుతుంటాడు. ‘అదేమిటే అమ్మాయ్. అబ్బాయి చేత కూరగాయలు తరిగిస్తున్నావ్. రేపటి నుంచి విమ్ సోప్ చేతిలో పెట్టి అంట్ల ముందు కూర్చోబెడతావా ఏంటి? వాడు ఉద్యోగానికి వెళ్లొద్దూ?’ అంటుంది అత్తగారూ. ‘నేనూ బేవార్సుగా లేను కదా అత్తయ్యా. నేనూ జాబ్‌కు వెళ్లాలి కదా. ఇంట్లో ఆ మాత్రం సాయం చేయకపోతే పనులెలా అవుతాయ్’ అంటుంది కోడలు. అక్కడి నుంచి ఆ ఇంట్లో శాంతికి విఘ్నం. అలా కాకుండా అత్తగారు కిచెన్‌లో కష్టపడుతున్న కోడలిని చూసి ‘ఏరా అబ్బాయ్. అమ్మాయి ఒక్కత్తే ఎంత పనని చేసుకుంటుంది. కూర్చుని పేపర్ చదువుకోకపోతే ఆ కేరెట్ కాస్త కట్ చేసి పెట్టరాదూ’ అనంటే ఎంత బాగుంటుంది.నువ్వు స్నానానికి వెళ్లమ్మాయ్. ఈలోపు నేను కేరేజీ కట్టేస్తానుగా’ అంటే ఎంత బాగుంటుంది. ‘సాయంత్రం ఉరుకులు పరుగుల మీద వచ్చేయకండి. కలిసి సినిమాకెళ్లి హోటల్లో ఏదైనా తినేసి రండి. నాదేముంది ఈ పూట శనివారం. నేను ఉపవాసం. వస్తూ నాకేదైనా లైట్‌గా పట్రండి’ అంటే ఎంత బాగుంటుంది. అలా అని ఆశీర్వదించు స్వామీ. పిల్లలు పిడుగులు. తండ్రి ఆఫీసుకు వీరభక్తుడు. ఆదివారం పూటైనా కృష్ణకాంత్ పార్క్‌కు వెళ్లి కోన్ ఐస్‌క్రీమ్ తినిపించు డాడీ’ అని వాళ్ల మారాము. మా బాస్ కొంటె కృష్ణుడు. పెండింగ్ వర్క్ పూర్తి చేయకపోతే మెమోతో ముద్దిస్తాడు’ అని తండ్రి హైరానా. పిల్లల అలక. తండ్రి ఆగ్రహం. తల్లి పీచుపీచు. ఇక ఆ ఇంటి మనశ్శాంతికి విఘ్నం. అలా కాకుండా ఆ బాస్‌ను ఏ అండమానో చెక్కేసేలా చేస్తే ఎంత బాగుంటుంది. డాడీగారు జాంజామ్మని సాయంత్రానికే ఇల్లు చేరుకుని బైక్ మీద ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని జి.వి.కె మాల్లో మాలామాల్ చేయిస్తే ఎంత బాగుంటుంది. మళ్లీ రెండు వారాల దాకా అడక్కుండా ఉండేలా ఫన్ జోన్లో ఆడించి, ఫుడ్ కోర్ట్‌లో తినిపించి, బిగ్ స్క్రీన్ మీద మహేశ్‌బాబు మాస్ మూవీ చూపించి తెస్తే ఎంత బాగుంటుంది. అలా అని ఆశీర్వదించు స్వామీ. భర్తగారికి ఊరుకూరికే ఆకలేస్తుంటుంది. భార్యగారికి చీటికి మాటికి నిద్ర కమ్ముకొస్తోంది. షుగరా అని భర్తకు డౌటు. థైరాయిడ్డేమో అని భార్య నలుగుబాటు.శనివారం ఎర్లీమార్నింగ్ ల్యాబ్‌లో బ్లడ్ శాంపిల్స్ ఇచ్చినప్పటి నుంచి రిపోర్ట్సు వచ్చేంత వరకూ అనుక్షణంఆత్మశాంతికి విఘ్నం. ఆనందానికి విఘ్నం. ఆలోచనకు విఘ్నం.అలా కాకుండా అది షుగరూ కాదూ పాడూ కాదు మనిషి గుమ్మటంలా ఉన్నావ్ అని రిపోర్టు వస్తే? థైరాయిడ్డు లేదూ ఏమీ లేదు మనిషి దంగల్ లేడీలా ఉందని కౌంట్ తేల్చి చెప్తే?ఎంత హాయిగా ఉంటుంది. మరెంత హొయలుగా అనిపిస్తుంది. వానాకాలంలో జలుబు, ఎండాకాలంలో కాసిన్ని చెమటకాయలు, చలికాలంలో చుండ్రు తప్ప జీవితంలో ఎప్పుడూ ఏ అనారోగ్యం రాకుండా ఉంటే? అలా అని కరుణించు స్వామీ. ఈ లైఫ్‌ను హాస్పిటల్ మెట్లక్కనీయకుండా ఆశీర్వదించు స్వామీ. జూబ్లీహిల్స్‌లో కలిగిన వారి కల్యాణానికి వెళ్లాం. బెంగుళూరు నుంచి వచ్చిన చిట్టిరోజాలతో కట్టిన మండపం. ఒక సెల్ఫీ. ఒక మూలగా మద్రాస్ అయ్యంగార్ వయొలిన్ కన్సర్ట్. ఒక సెల్ఫీ. ఆహూతులలో సన్నాసన్నని తమన్నా. ఒక సెల్ఫీ. బఫే దగ్గర డబుల్ బిరియానీతో ఒక సెల్ఫీ. ఆలూ అల్బత్తాతో ఒక సెల్ఫీ. ఇవన్నీ తీసుకుని ఇంటి కొచ్చి ‘ఫ్యామిలీ గ్రూప్’లో వాట్సప్ చేసి వాట్ యార్ అని పోజు కొడదామంటే వైఫై పని చేయకపోతే? దేర్ ఈజ్ నో ఇంటర్నెట్ కనెక్షన్ అని మెసేజ్ చూపిస్తుంటే? ఆ యొక్క అతిశయానికి ఆ యొక్క ప్రదర్శనానందానికి ఎంతటి విఘాతం. మరెంతటి విఘ్నం. అలా కాకుండా ఆల్వేస్ వైఫై పని చేసేలా ఉంటే? నట్టింట నెట్ కళకళలాడుతుంటే?అలా అని హండ్రెడ్ ఎంబిపిఎస్తో ఆశీర్వదించు స్వామీ. అబ్బాయికి మీసం కర్వ్ తిరిగే ఏజ్ వచ్చింది. అమ్మాయికి ఊరికూరికే నవ్వొచ్చే ప్రాయం వచ్చింది. అబ్బాయి ఎక్కడ తిరుగుతాడో తెలియదు.అమ్మాయిని ఎవరు తనవైపు తిరిగేలా చేసుకుంటారో తెలియదు. అది కాదూ..’ అని తల్లి ఏదో చెప్పబోతుంది. నీకేం తెలియదు ఊర్కో’ అని విసురు.అది కాదురా’ అని తండ్రి ఏదో అనబోతాడు. నస ఆపు డాడీ’ అని రుసురు.ఏ వయసు ముచ్చట ఆ వయసులో ఉండాల్సి వున్నా అది హద్దు అదుపుల్లో ఆరోగ్యకరమైన అంచుల్లో లేకపోతే మరి ఆ తల్లిదండ్రులకు ఎంతటి ఘాతం. మరెంత విఘాతం.అలా కాకుండా పిల్లలు తమ మంచి చెడ్డలను తల్లిదండ్రులతో పంచుకుంటే ఎంత బాగుంటుంది. వారిని తమ జర్నీలో తోడుగా ఉంచుకుంటే మరెంత అందంగా ఉంటుంది. అలా అని ప్రతి సంతానానికీ వారి కన్నవారికీ వెలుగు పంచు స్వామీ.నలుగురి హృదయాలలో ఆనందాన్ని వెలిగించు స్వామీ. ఒక భర్తగారికి వాటర్ అలెర్జీ. అతను వైన్ షాప్‌లో దొరికేదానినే వాటర్ అనుకుని పుచ్చుకుంటూ ఉంటాడు. ఒక హజ్బెండ్ గారికి ఇల్లంటే రోత. వారు పేకాట క్లబ్బునే తన ఆవాసం చేసుకుంటూ ఉంటారు. ఒక మొగుడు మహాశయునికి కరెన్సీయే ఆక్సిజన్. దాని వేటలో ఇంటికే రారు. ఒక పురుషుడు వేళ్లతో వాట్సప్‌లో ఎవరెవరితోనో మాట్లాడటం తప్ప ఇంట్లో నోరు తెరవడు. ఒక మగ అతనికి నిలువెల్లా అనుమానం. మరో మగపురుగుకి చేయి దురుసు జాస్తి.ఏ ఇంటికైనా ఇంతకు మించిన విఘ్నం ఉంటుందా?ఆ ఇంటి ఇల్లాళ్లకు పిల్లలకు అంతకు మించిన విఘాతం ఉంటుందా?సరదాలు వ్యసనాలుగా మారని, విసుగులు ఉత్పాతాలుగా రూపాంతరం చెందని, అసంతృప్తులు ఆజ్యంగా మారి పైకప్పులను తగలబెట్టని ఇళ్లు కావాలి. దంపతులు మార్నింగ్ పూట కలిసి చిర్నవ్వుతో టీ సేవించే, పిల్లలు నవ్వుకుంటూ స్కూలు విషయాలు చెబుతూ ఒడిలో కూర్చునే, అమ్మానాన్నలూ తరుచూ వచ్చిపోయే లేదంటే పిల్లల దగ్గరే ఉండిపోయే, నెలకోసారైనా ఆత్మీయులు చేయి కడిగే, ఆనందానికి తప్ప దుఃఖానికి చెమర్చని కళ్లు ఉండే, ఇరుగు పొరుగులతో సామరస్యం ఉండే, చక్కని వంట కుదిరే, పండే పక్క కుదిరే, తృప్తిగా నిదుర పట్టే, నిర్మలమైన వేకువ తట్టి లేపే ఇళ్లు ఉంటే ఎంత బాగుంటుంది?అలాంటి ఇళ్లను కటాక్షించు స్వామీ.బయట జోళ్ళు, ఇంట్లో వెచ్చాలు, అవసరాలు తీర్చగల డబ్బు ఉండే ఏటీఎం కార్డులు, బాల్కనీలో పూలు పూసే కుండీలు, అవసరానికి సాయం చేసే చేతులు, దేవుని ఆశీర్వాదాలు, చెదరని దరహాసాలు... ఇవి ఉండే ఇళ్లను ప్రసాదించు స్వామీ. పత్రితో నీకు పూజలు చేస్తాం.పచ్చగా ఉండే ఇళ్లను ఇవ్వు.గొడుగు నీకు అమరుస్తాం.ప్రకృతి గొడుగు గతి తప్పకుండా చూడు.ఉండ్రాళ్లు సమర్పిస్తాం.ఆకలిగొన్న కడుపు ఒక్కటీ లేకుండా చూడు.నిన్ను చల్లగా నిమజ్జనం చేస్తాం.సకల అసంతృప్తులను అసమానతలను అమానవీయ ఆలోచనలను ఏటిలో కలుపు.అస్తు దేవా. తథాస్తు గణేశా. – కె -
నాకు క్యూటీ కావాలి!
పిట్ట కథ ఓ పదిహేను రోజులక్రితం... టైం ఎనిమిదవుతుంది... నేనింకా నిద్రలోనే ఉన్నా.. బాల్కనీ గోడ పక్కన ఓ కొత్త సవ్వడి.. ఇంతకు ముందు విన్నపక్షుల సవ్వడిలా లేదు. బలవంతంగా నిద్రలేచి తలుపు తీసి చూశాను. ఏం కనిపించలేదు. కానీ ఆ కొత్త సవ్వడి మాత్రం వినిపిస్తూనే ఉంది. మొహం కడుక్కుని స్నానం చేసేలోపు ఓ ఐదారుసార్లు వినిపించింది ఆ సౌండ్ పిట్ట మాత్రం కనిపించలేదు. ఇలా కాదని జాగ్రత్తగా సీతాఫలం చెట్టు ఆకుల మధ్యలోంచి నెమ్మదిగా చూశాను.. అప్పుడు కనిపించింది.. నేను ఊహించినట్టే ఓ కొత్త పక్షి. చాలా చిన్నగా... పిచ్చుకలో సగం సైజే ఉంది. బూడిదరంగు శరీరం... తోకమాత్రం భలే అందంగా ఉంది. నెమలీకను బీడీ సైజ్ లో కట్ చేసి అతికించినట్టుంది. అది సీతాఫలం చెట్టు ఆకు వెనకాల దాక్కుంది.. ఆ ఆకు దానిని పూర్తిగా కవర్ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. అదెంత ఉందో. కానీ చూడ్డానికి మాత్రం భలే ముద్దుగా ఉంది. అరుపు కూడా ప్రత్యేకంగా ఉంది కాబట్టి నాకు ఆసక్తి పెరిగింది. రెండోరోజు చూస్తే సీతాఫలం చెట్టు మీదే చిన్న గూడు కట్టుకుంది.. అసలా గూడు చూస్తే హాశ్చర్యపోతారు. కేవలం మూడంటే మూడే ఆకులతో ఎంత చక్కగా గూడు కట్టిందంటే, భలే ముచ్చటగా ఉందిలే. వెంటనే మా ఆవిడను పిలిచి చూపించాను. ముచ్చటగా కట్టుకున్న దాని ఇల్లు చూసి ముక్కున వేలేసుకుంది. మా అబ్బాయికయితే ప్రపంచ వింత చూస్తున్నంత సంబరం. వాడు స్కూల్లో టాంటాం వేశాడు తనకు కొత్త ఫ్రెండ్ అని, దాని పేరు క్యూటీ అనీ, దాని గూడు బాగుందనీ ఇలా... క్యూటీతో చిక్కేంటంటే.. అలికిడి వినిపిస్తే గూట్లోంచి ఎగిరిపోయేది.. అందుకే మెల్లగా.. బెడ్ రూం డోర్ తీసి మెత్తగా అడుగులు వేస్తూ చిన్నగా మెడ పైకెత్తి చూస్తే దాని గూడు కనిపించేది. అందులో తలపైకెత్తి పడుకునేది. చిన్న మొహం.. పూసల్లాంటి కళ్లు.. చిన్నముక్కు.. పదేపదే చూడాలనిపించేది కానీ సెకనులో వెయ్యోవంతులో ఎగిరిపోయేది. కొన్ని రోజులు ఇదే తంతు. మేమైతే భలే ఎంజాయ్ చేస్తున్నాం ఇదంతా.. వారం రోజుల్లోనే దాంతో చిన్న అటాచ్మెంట్ పెరిగింది. దానికి కూడా నమ్మకం కుదిరిందేమో. ఇంతకు ముందులా మరీ వేగంగా పారిపోవడం లేదు. లేకపోతే చప్పుడు చేయకుండా చూడడం నాకు అలవాటయిందో మరి.. చెట్ల ఆకుల మధ్యలో కూర్చుని ఆ చిన్న అందమైన తోకని బోరింగ్ కొట్టినట్టు పైకీ, కిందకీ ఊపుతూ బోలెడు పాటలు పాడేది. మేం జాగ్రత్తగా తలుపు కొంచమే తెరిచి దానిని చూస్తుండేవాళ్లం. వేడివేడి టీకప్పుతో కిటీకీ దగ్గర నిల్చుని బయట దానిని చూడడం నాకు గొప్పగా అనిపించేది.ఆ మధ్య రెండు రోజులు వర్షం పడింది.అర్ధరాత్రి మెలకువొచ్చింది.. జోరున వర్షం పడుతున్న శబ్దం నా మనసులో ఏదో అలజడి. పే...ద్ద గాలి వాన. మా తలుపు సందులోంచి సన్నగా నీళ్లు లోపలికి వస్తున్నాయ్. అమ్మో.. ఇంత గాలివాన.. క్యూటీ ఎలా ఉందో... సిమెంట్‌తో కట్టిన ఇంట్లోకే నీళ్లొస్తున్నాయ్.. దాని ఆకుల గూడు ఎలా ఉందో! మనసులో ఒకటే దడదడ. ఫోన్లో టార్చ్ ఆన్ చేసుకుని నెమ్మదిగా డోర్ తెరిచి ఆకుల మధ్యలోంచి లైట్ వేసి చూశాను. ఆశ్చర్యం.. దాని గూడు ఏమాత్రం తడవలేదు.. గాలికి దాని గూడు ఊగుతుంటే ఊయల ఊగినట్టు.. లోపల హాయిగా నిద్రపోతుంది. ఈసారి మాత్రం ఎగిరిపోలేదు.. దానిని అంత స్పష్టంగా చూడడం అదే మొదలు. ఇక నాకు ఇదే అలవాటైపోయింది.. పొద్దున్నే వాటి సవ్వడితో లేవడం... ఓసారి దాని గూట్లోకి తొంగిచూడడం.. బయటికెళ్లి రాగానే దాన్నోసారి పలకరించడం... ఆ చిన్న పిట్ట పుణ్యమాని మా ఇంట్లోనూ చిన్న చిన్న మార్పులు... ‘‘ఇదిగో, పొరపాటున కూడా ఆ గోడ పక్కన ఏదీ విసిరేయకు.. దాని గూడుకి తగిలితే కష్టం. నీళ్లు.. గింజలు పెట్టావా? మరిచిపోయావా? వాడిమీద అరిచేటప్పుడు కాస్త హాల్లోకి వెళ్లు.. ఆ చిన్నప్రాణం భయపడితే కష్టం...’’ ఇలా ఉండేవి నా హెచ్చరికలు..మొత్తానికి నిద్రలేవడం మొదలు.. అర్ధరాత్రి దాకా దాని గురించి బోలెడు మాటలు. ఓ కుక్కనీ, పిల్లిని, చిలుకను పెంచుకునే వాళ్లలాగ మాకు ఓ బుజ్జి పిట్ట..! ఇలా ఇరవై రోజులు గడిచాయి.మూడు రోజుల క్రితం పొద్దున్నే దాని అలికిడి లేదు! ఏదో పోగొట్టుకున్నట్టుంది. లేచి బాల్కనీలోంచి తొంగిచూశాం. గూడు ఖాళీగా ఉంది.. ఏమైంది? పొద్దున్నే వెళ్లిపోయింటుందా?ఆ రోజు ఇలా నాలుగైదు సార్లు చూసినా ఎప్పుడూ గూడు ఖాళీగానే కనిపిస్తోంది. నా మనసేమో కాస్త సున్నితం. అందుకే దిగులుగా ఉంది.. ఇక మా అబ్బాయి నాలుగు రోజులుగా ఒకటే ప్రశ్న ‘‘నాన్నా.. క్యూటీ ఎక్కడికి వెళ్లిందీ’’ అని. వారమైనా పత్తాలేదు.. రోజు రోజుకు నాకు దిగులు పెరిగిపోతోంది. ఇలా లాభంలేదని ఓ కర్ర తీసుకొచ్చి నెమ్మదిగా ఆ గూడును కదిపి చూశాం. ఒక్కసారిగా గుండె ఝల్లుమంది. లోపల క్యూటీ నిర్జీవంగా పడుంది. తలెత్తి మిటుకు మిటుకు మంటూ చూస్తే తల పక్కకు వాలిపోయి ఉంది... జాగ్రత్తగా గమనించాను.. గూట్లో తెల్లగా పౌడర్.. చెట్టునిండా.. ఆకుల మీదకూడా. ఏం జరిగుంటుంది..? ఎవరైనా పిండి పడేసుంటారా? ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోయింది. మా ఆవిడ రాగానే అడిగాను ఆ తెల్లపౌడర్ ఏంటని? గుర్తు చేసుకుని చెప్పింది. నాలుగు రోజుల క్రితం మూడు ఇళ్ల అవతల ఒకరోజంతా బోర్ వేశారు.. నీళ్లు పడలేదు సరికదా.. పెద్ద శబ్దం. కింద బండ ఉందేమో.. తెల్లటి పౌడర్ కాలనీ అంతా. తను చెబుతూనే ఉంది.. బాల్కనీ తలుపుమీద.. కిటికీమీద, నేలమీద...ఒక ఇంచు మేర ఆ బూడిద పరుచుకుందనీ.. అదంతా కడిగేసరికి తల ప్రాణం కాళ్లకొచ్చిందనీ.నాకు విషయం అర్థమైపోయింది.. ఆ పేద్ద శబ్దాలు, విపరీతంగా రేగిన బూడిద దెబ్బకు ఈ చిన్న ప్రాణం తట్టుకోలేకపోయిందనీ, ఊపిరాడక ఉన్నచోటే ప్రాణమొదిలేసిందనీ... జడివానకు, సుడిగాలికి తట్టుకునేలా గూడు నిర్మించుకుందనుకుందిగానీ, పిచ్చిది. మనుషుల సంగతి దానికేం తెలుసు? తప్పెవరిది? అమాయకంగా మా మధ్యలోకొచ్చిన ఆ చిన్ని ప్రాణానిదా? మనలాంటి జీవులు కూడా ఈ ప్రకృతిలో భాగమేనని ఆలోచించని మనుషులదా? - వాసవీ మోహన్ -
పర్యావరణంలో మనిషి బంధం పెంచుకోవాలి
-
సూరజ్.. యంగ్ ఫార్మర్.. ద గ్రేట్!
♦ చిన్నప్పటి నుంచే పెరటి తోటల సాగుపై మక్కువ ♦ అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతూనే.. పన్నెండెకరాల్లో ప్రకృతి సేద్యం ♦ పాలేకర్ శిక్షణ పొందాక పూర్తిస్థాయి సేద్యం ♦ సూరజ్‌ను ప్రకృతి సేద్య ప్రచారకర్తగా ప్రకటించిన కేరళ ప్రభుత్వం వయసు మళ్లిన వారు, మహిళలు తప్ప యువకులు వ్యవసాయంలో కొనసాగడం అరుదై పోతున్న ఈ కాలంలో కేరళ రాష్ట్రంలో ఒక విద్యార్థి సరికొత్త ఆశలు రేకెత్తిస్తున్నాడు. కేరళ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు సేంద్రియ పెరటి తోటలు, టెర్రస్ గార్డెన్ల సాగులో గత కొన్నేళ్లుగా శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. సి. ఎస్. సూరజ్ అనే విద్యార్థి ఇంటి పెరట్లో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలను మక్కువతో చిన్నప్పటి నుంచే సాగు చేస్తూ.. ప్రకృతి వ్యవసాయదారుడిగా మారాడు. కేరళ – తమిళనాడు సరిహద్దులోని వాయనాడ్ జిల్లా చిరకంబాత్ ఇల్లం ఇరవయ్యేళ్ల సూరజ్ స్వస్థలం. తాతల నాటి ఐదున్నర ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఎదురుగానే వాళ్ల ఇల్లు ఉంటుంది. తండ్రి కాంట్రాక్టర్ కావడంతో వ్యవసాయం కుంటుపడింది. అయితే, సూరజ్ తన తల్లి తోడ్పాటుతో ఇంటిపంటల సాగును కొనసాగించాడు. చిన్నప్పటి నుంచి అతని ఆలోచనలు వ్యవసాయం చుట్టూనే తిరిగేవట. అటువంటి పరిస్థితుల్లో ఐదేళ్ల క్రితం.. పదిహేనేళ్ల ప్రాయంలో సూరజ్ ఇంటర్మీడియెట్‌లో చేరాడు. ఆ కొత్తలోనే తమకు దగ్గరలోని సుల్తాన్ బతేరి పట్టణంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు సుభాష్ పాలేకర్ శిక్షణా శిబిరం జరిగింది. ఆ ఐదు రోజుల శిబిరంలో సూరజ్ శ్రద్ధగా పాల్గొని వ్యవసాయాన్ని ప్రకృతికి అనుగుణంగా, స్వల్పఖర్చుతో ఎలా చేయాలో కూలంకషంగా తెలుసుకున్నాడు. తన జీవన గమ్యానికి మార్గం సుగమం అయినట్లు, స్పష్టత వచ్చినట్లు తోచింది. తమ పొలంలో ప్రకృతి వ్యవసాయాన్ని రెట్టించిన ఉత్సాహంతో చేపట్టాడు. తల్లిదండ్రులు వెన్ను తట్టడంతో చదువు కొనసాగిస్తూనే చక్కని దిగుబడులు తీస్తున్నాడు. వ్యవసాయ విద్య.. ప్రకృతి సేద్యం.. పాలేకర్ వద్ద శిక్షణ పొందిన తర్వాత ఏడాది తొలిగా ఎకరాలో శ్రీ పద్ధతిలో సూరజ్ వరిని సాగుచేసి 4 టన్నుల ధాన్యం దిగుబడి పొందాడు. ఆ ప్రాంతంలో అప్పటి సగటు దిగుబడికి ఇది రెట్టింపు కావడంతో సూరజ్ స్పీడు పెంచాడు. తన ఇంటికి 200 కిలోమీటర్ల దూరంలోని త్రిస్సూర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. వారాంతాల్లో ఇంటికి వెళ్లి వ్యవసాయ పనులు చక్కబెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఎకరంలో దేశీ వరి వంగడాలను సాగు చేస్తున్నాడు. 10 ఎకరాల్లో 15 రకాల కూరగాయలు, పండ్లను సాగు చేస్తున్నాడు. త్రివేండ్రం, కాలికట్, కొచ్చి వంటి నగరాల్లో ఆర్గానిక్ షాపులు, సూపర్ మార్కెట్లకు సరఫరా చేస్తున్నాడు. ఇందులో 4 ఎకరాల్లో కాఫీ, మిరియాలు, లిచి, అవకాడో, బొప్పాయి, అరటి, ప్యాషన్ ఫ్రూట్ తదితరాలను మిశ్రమ సాగు చేస్తున్నాడు. మిగతా పొలంలో టమాటా తదితర కూరగాయలను, ఔషధ మొక్కలను సాగు చేస్తున్నారు. మొత్తం మీద ఏడాదికి రూ. 7 నుంచి 8 లక్షల నికరాదాయం పొందుతున్నట్లు సూరజ్ ‘సాగుబడి’ ప్రతినిధితో చెప్పారు. రెండుసార్లు కేరళ అసెంబ్లీలో ప్రసంగం చదువుకుంటూనే ప్రకృతి వ్యవసాయం కొన సాగిస్తున్న సూరజ్ ద్వారా యువతను వ్యవసాయంలోకి ఆకర్షించే లక్ష్యంతో కేరళ ప్రభుత్వం 2015కు ముందే ప్రచారకర్త (బ్రాండ్ అంబాసిడర్)గా ప్రకటించింది. వ్యవసాయ శాఖ, కృషి విజ్ఞాన కేంద్రాలు నిర్వహించే ప్రచార, రైతు శిక్షణా శిబిరాల్లో సూరజ్ పాల్గొని ప్రకృతి వ్యవసాయం చేసే పద్ధతుల గురించి వివరిస్తుంటారు. 2015లో, 2016 డిసెంబర్లో రెండుసార్లు కేరళ అసెంబ్లీలో ప్రసంగించాడు. ‘స్టూడెంట్ ఫార్మర్’ అవార్డు, కేరళ ప్రభుత్వ ‘కర్షక ప్రతిభ’ అవార్డును పొందాడు. చిక్కుడు గింజలతో ‘కునపజలం’! సూరజ్ పంటలకు పంచగవ్య, జీవామృతం, కునపజలం వాడుతున్నాడు. మాంసానికి బదులు చిక్కుడు గింజలను వాడుతూ ‘వెజిటేరియన్ కునపజలం’ తయారు చేసి వివిధ పంటలపై విస్తృతంగా వాడుతున్నాడు. 200 లీటర్ల నీటిలో 2 లీటర్ల కునప జలాన్ని కలిపి.. నెలకు ఒకసారి పిచికారీ చేస్తున్నారు. పంచగవ్యను భూసారం పెంపొందించడానికి ఏటా రెండు సార్లు ఇస్తున్నారు. 4సార్లు పిచికారీ చేస్తున్నారు. జీవామృతాన్ని ఏటా రెండుసార్లు భూమికి ఇస్తున్నారు. ఏటా ఎకరానికి ఒక ట్రాక్టర్ పశువుల ఎరువు చల్లుతున్నారు. పంటలపై చీడపీడల బెడద పెద్దగా లేదని, కషాయాలతోనే కంట్రోల్ చేస్తున్నామని సూరజ్ తెలిపాడు. తనను చూసి కనీసం 20 మంది యువ రైతులు పూర్తిస్థాయిలో వ్యవసాయం చేపట్టారని, తరచూ తనను సంప్రదిస్తుంటారన్నారు. (సూరజ్‌ను 085475 70865,smartsooraj2@gmail.com ద్వారా సంప్రదించవచ్చు) – సాగుబడి డెస్క్ -
16న పండ్ల తోటలు, పాలీహౌస్‌లలో కూరగాయల ప్రకృతి సేద్యంపై శిక్షణ
రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులో ఈనెల 16న ప్రకృతిసేద్యంలో పండ్లతోటలు, పాలీహౌస్‌ల్లో కూరగాయల సాగుపై రైతులకు శిక్షణ ఇస్తారు. పండ్ల తోటలు, పాలీహౌస్‌ల్లో కూరగాయల సాగుపై హైదరాబాద్‌కు చెందిన ప్రకృతి వ్యవసాయదారు హరిబాబు, చీమకుర్తికి చెందిన శ్రీధర్ బాబు, ఉద్యానశాఖ అధికారి రాజా కృష్ణారెడ్డి, హేమంత్ రైతులకు శిక్షణ ఇస్తారు. శిక్షణ పొంద దలచిన రైతులు ముందుగా పేర్ల నమోదుకు 97053 83666, 0863 – 2286255 నంబర్లలో సంప్రదించవచ్చు. -
దున్నకుండా ముప్పయ్యేళ్లుగా సేద్యం!
రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా వ్యవసాయం చేస్తున్నారంటే ఇప్పుడెవరూ ఆశ్చర్యపోవడం లేదు. కానీ.. ఎద్దులతోనో, ట్రాక్టరుతోనో దున్నే పనే లేకుండా ప్రకృతి వ్యవసాయం చేయొచ్చంటే.. చెప్పినోడికి వ్యవసాయం తెలియదని నవ్విపోతారు. అయితే, మధ్యప్రదేశ్‌కు చెందిన రైతు రాజు టైటుస్ మాత్రం ఇలాగే వ్యవసాయం చేస్తున్నారు. పొలాన్ని అసలు దున్నకుండా, రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా గత 30 ఏళ్లుగా ఫుకుఓకా బాటలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ♦ రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా.. పొలాన్ని దున్నకుండా 30 ఏళ్లుగా సేద్యం చేస్తున్న మధ్యప్రదేశ్ రైతు ♦ జపాన్ ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు ఫుకుఒకా సందర్శించిన అద్భుత వ్యవసాయ క్షేత్రం మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌కు చెందిన ‘రాజు టైటుస్’ ప్రభుత్వోద్యోగి. అయినా కుటుంబ వారసత్వంగా వచ్చిన 12 ఎకరాల పొలాన్ని సాగు చేయటం మానలేదు. 70వ దశకంలో అందరిలానే ఆయనా ‘హరిత విప్లవం’ ఒరవడిలో రసాయన ఎరువులు, కీటకనాశనులు వాడటం మొదలుపెట్టారు. మొదట్లో దిగుబడులు పెరిగి ఆదాయం వచ్చినా పదిహేనేళ్లు తిరిగేసరికి పంట భూమి నిస్సారమయింది. దిగుబడులు తగ్గి నష్టాల పాలయ్యి పొలం అమ్మేయాలని నిశ్చయించుకున్నాడు. ఇది జరిగింది 1984లో. రాజు నిర్ణయంతో తల్లి హతాశురాలయింది. గాంధేయవాదులు నడిపే స్వచ్ఛంద సంస్థ ‘ఫ్రెండ్స్ రూరల్ సెంటర్’ కార్యకర్తలతో ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. వారు ఆమె చెప్పినదంతా విని జపాన్ దేశానికి చెందిన ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు ఫుకుఒకా రాసిన ‘గడ్డిపరకతో విప్లవం’ (ఒన్ స్ట్రా రివల్యూషన్) పుస్తకాన్ని ఇచ్చి మీ సమస్యకు ఈ పుస్తకం పరిష్కారాన్ని చూపుతుందని చెప్పారు. కలుపు తీయకుండా.. దుక్కిదున్నకుండా.. ఎరువులు వేయకుండా.. పురుగు మందులు పిచికారీ వంటి పద్ధతులు అనుసరించకుండానే పంటలను సాగు చేసే పద్ధతుల గురించి పుకుఒకా ఆ పుస్తకంలో వివరించారు. ఈ పుస్తకాన్ని చదివిన రాజు సాగులో తను అనుసరిస్తున్న పద్ధతులు అనర్థ హేతువులని అర్థం చేసుకున్నారు. అవహేళనలను అధిగమించి.. 15 ఏళ్లుగా రసాయన ఎరువులు వేస్తూ పంటభూమిని ధ్వంసం చేస్తున్నానని అర్థం చేసుకున్న రాజు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాడు. 1985 నుంచి పుకుఒకా చెప్పిన పద్ధతులను అనుసరించి వ్యవసాయం చేయటం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి నేలను దున్నటం, ఎరువులు, పురుగుమందుల వాడకం ఆపేశాడు. రకరకాల గడ్డి, చెట్ల విత్తనాలను పొలంలో వెదజల్లి అవి పెరిగాక కత్తిరించి ఆచ్ఛాదనగా వాడతాడు. దీనివల్ల వర్షపు నీరు బయటకు వెళ్లకుండా పొలంలోనే ఇంకింది. దీనివల్ల మట్టి గుల్లబారటంతో పాటు తేమను పట్టి ఉంచింది. 80వ దశకం చివరికల్లా రసాయన ఎరువుల వాడకం తార స్థాయికి చేరింది. వాటిని వాడకుండా సేద్యం చేయటం అసాధ్యమనే అభిప్రాయం రైతుల్లో బలంగా నాటుకుపోయింది. అట్లాంటి పరిస్థితుల్లో రాజు చేస్తున్న ప్రయత్నం ఆ గ్రామస్తుల మోములపై నవ్వులు పూయించింది. రైతులు కలుపు మొక్కలను పంట మొక్కలకు శతృవులుగా భావించి నిర్మూలిస్తారు. అలాంటిది కలుపు, గడ్డి మొక్కలను పంటలతో పాటు పెంచటమనే విషయం వినగానే పడీపడీ నవ్వేవారు. అవహేళనలే కాదు సాటి రైతుల నుంచి రాజుకు పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎత్తుగా పెరిగిన సుబాబులు చెట్ల నీడ తమ పొలాల మీద పడి పంటలు పండటంలేదని వాటిని నరికివేయాలని పొరుగు రైతులు ఫిర్యాదు చేసేవారు. మరోవైపు రాజు పొలంలో బాగా పెరిగిన గడ్డితో గ్రామస్తుల పశువులు మంచి విందు చేసుకునేవి. పక్క పొలాల్లో రైతులు తగులబెట్టిన పంట వ్యర్థాల నుంచి నిప్పు రాజు పొలంలోకి పాకి గడ్డి తగులబడేది. ఇలాంటి అడ్డంకులను అధిగమించి రాజు ప్రకృతిసేద్యం దిశగా వడివడిగా అడుగులు వేశారు. విత్తన బంతులతో పంటల సాగు! అంకితభావంతో అతను చేసిన కృషి ఫలితాన్నిచ్చింది. 1988 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొనటానికి ఇండియా వచ్చిన ఫుకుఒకా ప్రకృతిసేద్యం చేస్తున్న రాజు గురించి తెలుసుకొని ఆయన పొలాన్ని సందర్శించాడు. ఫుకుఒకా సలహాలు సూచనలను అనుసరించి రెట్టించిన ఉత్సాహంతో రాజు సాగుకు ఉపక్రమించాడు. పుకుఒకా సూచన మేరకు పంటను విత్తుకోవటానికి బదులు.. ఒక పాలు సోయా విత్తనం, ఏడు పాళ్లు మట్టి కలిపి క్రికెట్ బాల్ పరిమాణంలో ఉండే ‘విత్తన బంతుల’ ను తయారు చేశాడు. భార్య శాళిని సహకారంతో.. అడుగుకో బంతి చొప్పున.. పొలంలో వేశాడు. దీనివల్ల మొలకెత్తినప్పటి నుంచే మొక్కలు పోషకాలను, సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహించి ఏపుగా ఎదుగుతాయి. ఆ ఏడాది దిగుబడి బావుండటంతో పాటు నాణ్యమైన పంట వచ్చింది. ఎత్తుగా పెరిగిన గడ్డిని కత్తిరించి భూమిపైన ఆచ్ఛాదన కల్పించారు. దీనివల్ల పంటలకు మేలు చేసే వానపాములు, మిత్రపురుగులు, సూక్ష్మజీవులకు ఆశ్రయం లభిస్తుంది. పంటలకు హానిచేసే శతృ పురుగులను ఇవి నిర్మూలిస్తాయి. దీనివల్ల రసాయనిక ఎరువులు, కీటకనాశనుల అవసరం తప్పుతుంది. ఇవి నేలలో చేసే బొరియల వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది. వేర్లు లోతుకంటా చొచ్చుకుపోయి తేమను పోషకాలను గ్రహిస్తాయి. నేల గుల్లబారి భూ సారం పెరిగి మంచి పంట దిగుబడులు వస్తాయి. నేలను దున్నాల్సిన అవసరం లేకపోవటం వల్ల ట్రాక్టరు.. ఎద్దుల కోసం రైతులకు అప్పు చేయాల్సిన అగత్యం తప్పుతుంది.రాజు పొలంలో నత్రజనిని స్థిరీకరించేందుకు సుబాబుల్ చెట్లను సాగు చేస్తున్నాడు. దీనివల్ల యూరియా రూపంలో రసాయన ఎరువును అందించాల్సిన అవసరం ఉండదని ఆయన అంటారు. సుబాబుల్ ఆకులు మేకలకు మంచి మేతగా ఉపయోగపడుతున్నాయి. ఈ చెట్ల కలప, మేకల విక్రయం ద్వారా ఆదాయం లభిస్తోంది. ఇప్పుడాయన వయసు 71. గత 30 ఏళ్లుగా పొలాన్ని దున్నకుండానే సేద్యం చేస్తూ సమృద్ధిగా పంటలు పండిస్తూ దేశవ్యాప్తంగా పేరుపొందారు. దేశ విదేశాల నుంచి వచ్చే వేలాది మంది రైతులకు స్ఫూర్తినిస్తున్న ఈ రాజు నిజంగా ప్రకృతి వ్యవసాయానికి రారాజే! సారవంతమైన పొలమే మూలాధారం వినియోగదారులు కూడా ఆరోగ్యకరమైన ఆహారం కోసం డిమాండ్ చేసినప్పుడే రైతులు రసాయన ఎరువులు వాడటం మానేస్తారు. ఆరోగ్యకరమైన నేల ద్వారానే ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తి సాధ్యమనే విషయాన్ని గుర్తిస్తారు. భారతదేశంలో ప్రజలకు సోకుతున్న పలు జబ్బులకు మూలకారణం ఆహార పంటల సాగులో వాడుతున్న యూరియా. దీనివల్ల తొలుత మధుమేహం సోకి పలు దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీస్తుంది. నాకు పక్షవాతం వచ్చింది. నా భార్య గుండెజబ్బు వ్యాధిగ్రస్తురాలు. అయినా మేం కోలుకోవటానికి ప్రకృతిసేద్య పంట ఉత్పత్తులే కారణం. మా కుటుంబ అవసరాల కోసం ప్రస్తుతం ఎకరా పొలంలో ధాన్యం, పండ్లు, కూరగాయలను సాగు చేస్తున్నాం. ఖరీఫ్‌లో గోధుమ, వరి, మొక్కజొన్న, రబీలో పెసరను సాగు చేస్తున్నాం రోజురోజుకు వ్యవసాయంలో పెరుగుతున్న ఖర్చులే రైతు ఆత్మహత్యలకు కారణం. ఫుకుఒకా విధానంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ సేద్యం మూలసూత్రాలను ఒంటబట్టించుకుంటే ఏ రైతైనా పొలాన్ని దున్నకుండానే సేద్యం చేయవచ్చు. – రాజు టైటుస్ (091797 38049), హోషంగాబాద్, మధ్యప్రదేశ్ rajuktitus@gmail.com – దండేల కృష్ణ, సాగుబడి డెస్క్ -
బంగ్లాదేశ్‌పై ప్రకృతి కన్నెర్ర!
కొండచరియలు విరిగిపడి 68 మంది మృతి బంగ్లాదేశ్‌పై ప్రకృతి కన్నరెచేసింది. భారీ వర్షాల ప్రభావంతో వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 68 మంది మృతిచెందారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా బంగ్లాదేశ్‌లోని ఢాకా, చిట్టగాంగ్ నగరాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలు సంభవించి.. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. రంగమతిలో 10 మంది, బందర్బాన్‌లో ఏడుగురు, చిట్టగ్యాంగ్‌లో 8 మంది కొండచరియల కింద సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు అధికంగా ఉన్నారు. అప్రమత్తమైన అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. 2010లోనూ బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు కురిశాయి. ఆ సమయంలో వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. -
చిత్ర తేజం..దృశ్యకావ్యం
- సైకిల్‌పై 6వేల కి.మీ యాత్ర – 16 రాష్ట్రాల్లో పర్యటన – కెమెరాతో వేలాదిగా ప్రకృతి చిత్రాలు – కర్నూలు యువకుని ప్రతిభ కర్నూలు(హాస్పిటల్): ప్రకృతిలో ఎన్నెన్నో వింతలు..వాటిని రెండు కళ్లతో చూడటం అందరికీ సాధ్యం కాదు. అందుకే కెమెరా కళ్లను కూడా మనిషి జతచేసుకున్నాడు. ఆ ‘కళ్ల’తో ఈ ప్రకృతిని మరింత అందంగా చూపించాలనే ప్రయత్నం నిత్యం చేస్తూనే ఉన్నాడు. ఆ కెమెరా కళ్ల ద్వారా వచ్చిన దృశ్యాలు నిత్యం మనకు మేగజైన్లు, పత్రికల్లో, టీవీ చానళ్లు, సినిమాలలో అద్భుతంగా కనిపిస్తుంటాయి. కర్నూలుకు చెందిన కుర్రాడు తేజేశ్వర్ ఇదే పని చేస్తున్నాడు. కెమెరా భుజాన వేసుకుని దేశంలోని 16 రాష్ట్రాల్లో సైకిల్‌పై సాహస యాత్ర చేశాడు. సుమారు 6వేల కిలోమీటర్లు ప్రయాణించి అద్భుత చిత్రాలు బంధించాడు. కర్నూలు నగరంలోని నెహ్రూనగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు శ్రీనివాసులు, పార్వతికి ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడైన మద్దికెర తేజేశ్వర్ బీటెక్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌ను హైదరాబాద్‌లోని జేబీఐఈటీ కాలేజిలో చదివాడు. తనకు చిన్నతనం నుంచి ఫొటోగ్రఫీ, ప్రయాణం అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే చదువు మధ్యలో మూడు నెలల పాటు ముంబయిలోని ఫ్యాషన్ ప్రో సంస్థలో శిక్షణ తీసుకున్నాడు. ఫైన్ ఆర్ట్స్ ఫొటోగ్రఫి, సెల్ఫ్ న్యూడ్ ఫొటోగ్రఫి, స్ట్రీట్ ఫొటోగ్రఫి, నేచర్ ఫొటోగ్రఫిలో తర్ఫీదు పొందాడు. ఆ సమయంలో అక్కడి అధ్యాపకురాలు ప్రాచీ చపేకర్ సూచనలు ఆయనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. శిక్షణ తర్వాత కొన్నాళ్ల పాటు మోడరన్ ఇండియా మేగజైన్లో ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేశాడు. ప్రకృతి అందాల ఫోటోల కోసం సైకిల్ యాత్ర ఈ ప్రకృతి, అందమైన ప్రపంచాన్ని తన కెమెరాలో బంధించాలని తేజేశ్వర్ కలలు కనేవాడు. ఆ కలలకు రూపాన్ని కల్పించేందుకు గత సంవత్సరం ఆగష్టు 6వ తేదిన ముంబయి నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించాడు. అక్కడ నుంచి గుజరాత్, మహారాష్ట్ర, రాజస్తాన్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణా, పూణే, కర్నాటక, గోవా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సైకిల్ యాత్ర చేశాడు. తనకు చిన్నతనం నుంచి ఇష్టమైన ప్రయాణం, ఫొటోగ్రఫి అనే ఇష్టాలను ఆయన ఈ విధంగా తీర్చుకున్నాడు. యాత్రలో కనిపించిన ప్రతి అందమైన దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. ఇప్పటి వరకు 6వేలకు పైగా కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేశాడు. నేచర్ ఫోటోగ్రఫి కోసం, సోషల్ డాక్యుమెంటరీ కోసం ఈ యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపాడు. ‘జాంటీ’ తోడుగా కష్టం ఇష్టంగా...! –తేజేశ్వర్, నేచర్ ఫొటోగ్రాఫర్ సైకిల్ యాత్ర చేస్తున్న సమయంలో ఒకానొక సమయంలో తీవ్ర అలసట, అయిష్టం ఏర్పడేది. కొన్నిసార్లు ముందుకు సాగబుద్ధి అయ్యేది కాదు. నా కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవాలంటే తోడు అవసరమని భావించాను. ఈ మేరకు జైపూర్‌లో రూ.8వేలు వెచ్చించి జర్మన్ షెప్పర్డ్ అనే జాతి కుక్కపిల్లను కొనుగోలు చేశాను. దానిని వెంట బెట్టుకుని యాత్ర ప్రారంభించాను. ఆ మరునాడు జైపూర్ రోడ్డుపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటిరోడ్స్ కనిపించాడు. ఆయన స్నేహితురాలు సమంత నాలాగే ఒక మంచి ఉద్దేశంతో 8వేల కిలోమీటర్ల పరుగు చేస్తోంది. వారిద్దరూ జైపూర్ రోడ్డుపై నన్ను చూసి ఆపారు. నా గురించి, నేను చేస్తున్న పని గురించి తెలుసుకున్నారు. నా వద్ద ఉన్న కుక్కపిల్లను చూసి ముచ్చటపడ్డారు. దీనికి ఏం పేరు పెట్టావని అడిగారు. ఇంకా పేరు పెట్టలేదన్నాను. వెంటనే సమంత దీనికి ‘జాంటిరోడ్స్’ అని పేరు పెట్టాలని సూచించారు. వారి సూచన మేరకు కుక్కపిల్లకు ఆ పేరే పెట్టాను. అప్పటి నుంచి ఆ కుక్కపిల్ల నన్ను విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతోంది. -
పచ్చని ప్రపంచం కోసం...
ప్రకృతి కోసం... ‘ప్రణామం ప్రణామం ప్రణామం... సమస్త ప్రకృతికే ప్రణామం’ అని ఇటీవలి సినిమాలో ఓ హిట్ పాట. ప్రతి ఏటా జూన్ 5న వచ్చే ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ కూడా ఈ మాటనే అంటుంది. దానిని మొదలెట్టిన ఐక్యరాజ్య సమితి తన సభ్యులైన 143 దేశాలతో అదే మాటను అనిపిస్తుంది. సముద్ర జల కాలుష్యం, అధిక జనాభా, వన్యమృగాల పట్ల క్రూరత్వం తదితర అంశాలతో 1974లో మొదటిసారిగా మొదలైన పర్యావరణ దినోత్సవం ఏ ఏడాదికా ఏడాది ప్రపంచ దేశాల చైతన్యంతో పర్యావరణం పట్ల విశిష్ణ స్పృహను కలిగేలా చేస్తోంది. ప్రతి సంవత్సరం ఒక థీమ్‌తో సాగే ఈ దినోత్సవానికి ఈ సంవత్సరం ఆతిథ్య దేశం కెనడా ‘కనెక్టింగ్ పీపుల్ టు నేచర్’ అనే థీమ్‌ను నిర్థారించింది. ఈ థీమ్‌ను అనుసరించి వివిధ దేశాలతో పాటు భారతదేశంలో కూడా సోమవారం అనేక కార్యక్రమాలు జరిగాయి.ముఖ్యంగా యువత ఉత్సాహంగా మొక్కలు నాటడం, ప్రదర్శనలు ఇవ్వడం చేసింది. పశ్చిమ బెంగాల్లో ఈ సందర్భంగా పర్యావరణ స్పృహను కలిగించే పోస్టల్ ఎన్వలప్‌ను విడుదల చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని మురాదాబాద్‌లో కాలేజీ యువతీ యువకులు పార్కులో లతలూ తీగలతో యోగా చేసి ఆకట్టుకున్నారు. గౌహతీ సమీపంలో ఉన్న దీవుల్లో కొత్తగా మొక్కలు నాటారు. గాలి, నీరు, నింగి అన్నీ మనిషి జీవనానికి ముఖ్యమైనవి. వాటిని కాపాడుకోవడానికి ఏదో ఒక రోజు చైతన్యంతో పని చేయడం కాదు... అనునిత్యం అనుక్షణం చేయాలి. అప్పుడు భవిష్యత్ తరాలకు ఈ అందమైన భూమిని అందివ్వగలం. -
బంగారు తల్లి!
‘తల్లిపాలు అమృతంతో సమానం’ అంటారు. ఆ అమృతానికి కొరత ఏర్పడింది. మన దేశంలో తక్కువ సంఖ్యలో ‘తల్లిపాల కేంద్రాలు’ ఉన్నాయి. వీటి గురించి కూడా తక్కువ మందికే తెలుసు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తల్లిపాల గొప్పదనం గురించి ప్రచారం చేయడమే కాదు... స్వయంగా బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు చెన్నైకి చెందిన శరణ్య గోవిందరాజులు. తాను గర్భవతిగా ఉన్న సమయంలో ‘నేచురల్ పేరెంటింగ్’ అనే ఫేస్బుక్ కమ్యూనిటీలో చేరారు శరణ్య, ఈ కమ్యూనిటీ ద్వారా ‘బ్రెస్ట్‌మిల్క్ డొనేషన్’తో పాటు ఎన్నో విలువైన విషయాలు తెలుసుకోగలిగారు.‘బ్రెస్ట్‌మిల్క్ డొనేషన్’ శరణ్యను ఆకట్టుకుంది. తాను కూడా చేయాలనుకున్నారు. ఈ సమయంలోనే వాహిదాలాంటి బ్రెస్ట్‌మిల్క్ డోనర్లు శరణ్యకు మార్గదర్శకంగా నిలిచారు. ప్రోత్సహించారు. పాలను దానం చేయడానికి ‘కంచి కామకోఠి చైల్డ్స్ ట్రస్ట్ హాస్పిటల్’ను ఎంచుకున్నారు శరణ్య. పాలదానం చేసే క్రమంలో హాస్పిటల్‌కు వెళుతున్నప్పుడు ‘బ్రెస్ట్ మిల్క్బ్యాంక్లు’ ‘బ్రెస్ట్‌మిల్క్ డొనేషన్’ అనేవి ఎంత ప్రాధాన్యత కలిగిన విషయాలో మరింత బాగా తెలిసింది.‘‘పాలదానం విషయంలో నా కుటుంబ సభ్యులు అండగా నిలవడం ఆనందాన్ని ఇస్తుంది’’ అంటున్నారు శరణ్య.ఒకసారి శరణ్య హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు ఒక తల్లి... ‘‘ఏమ్మా... పాలను ఇవ్వడానికి ఎంత డబ్బు తీసుకుంటావు?’’ అని అడిగింది. ఆశ్చర్యపోవడం శరణ్య వంతైంది. ఆ ఆశ్చర్యం నుంచి తేరుకొని తాను ఉచితంగా పాలదానం చేస్తున్నానని చెప్పారు. ఆ సమయంలో ఆ తల్లి కంట్లో వెలుగు కనిపించింది.‘బ్రెస్ట్ మిల్క్ డొనేషన్’ గురించి కొందరికి అపోహలు ఉండవచ్చు. కొందరికి అవగాహన లేకపోవచ్చు.... ఇలాంటి వారికి శరణ్య గోవిందరాజులు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. శరణ్యతో ఒక్కసారి మాట్లాడితే చాలు... ‘బ్రెస్ట్‌మిల్క్ డొనేషన్’ అనేది మనసుకు ఎంత తృప్తిని ఇచ్చే పనో తెలుసుకోగలుగుతున్నారు.‘బ్రెస్ట్ మిల్క్ డొనేషన్’ గురించి ఎంత అవగాహన కలిగిస్తే...అన్ని ‘మిల్క్‌బ్యాంకు’లు ఏర్పాటు చేసే అవకాశాలు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. శరణ్యలాంటి వాళ్లు మరింత మంది పూనుకుంటే ఆ అవగాహన విస్తృతి మరింత వేగంగా పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. -
సూక్ష్మజీవులే సేద్యానికి ప్రాణం!
వ్యవసాయ సంక్షోభం పైకి ఆర్థిక సంక్షోభంలా కనిపిస్తున్నప్పటికీ.. దీని మూలాలు పంట భూమిలో అనంత కోటి సూక్ష్మ జీవరాశి వినాశనంలో దాగి ఉంది. రసాయనిక, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల వల్ల పంట భూములు నిర్జీవమై, నిస్సారమై ఉత్పాదక శక్తిని కోల్పోతున్నాయి. సేద్యాన్ని తిరిగి ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్లడం ఒక్కటే మార్గం. అంటే భూమిలో సూక్ష్మజీవరాశిని,వానపాములను కంటికె రెప్పలా కాపాడుకునే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతి(జడ్.బి.ఎన్.ఎఫ్.)ని చేపట్టడమే మేలైన మార్గమని జడ్.బి.ఎన్.ఎఫ్. పితామహుడు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ స్పష్టం చేస్తున్నారు. ఈ నెల 13 నుంచి 21 వరకు రంగారెడ్డి జిల్లా ముచ్చింతలలోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో ‘సేవ్’ తదితర సంస్థలు సుమారు 3 వేల మంది యువ రైతు కుటుంబాలకు ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరం సందర్భంగా పాలేకర్ ‘సాగుబడి’తో ముచ్చటించారు. పాలేకర్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు.. పంటల సాగులో భూమిలోని సూక్ష్మజీవరాశి, వానపాముల ప్రాధాన్యం ఏమిటి? బియ్యాన్ని మనం నేరుగా తినలేం, అన్నం వండుకొని తినాల్సిందే. అదేవిధంగా పంట భూమిలో ఉండే పోషకాలు కూడా మొక్కలు, పంటల వేర్లు నేరుగా గ్రహించగలిగే రూపంలో ఉండవు. వాటిని వేర్లు గ్రహించగలిగే రూపంలోకి మార్చగలిగేది మట్టిలో ఉండే కోటానుకోట్ల సూక్ష్మజీవరాశే. అందువల్లనే పంట భూమిలో ఉండే లెక్కకు అందనన్ని జాతుల సూక్ష్మజీవులు, వానపాముల పాత్ర పంటల సాగులో అధిక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అయితే, రసాయనిక ఎరువులు, కలుపు మందుల వాడకంతో భూమిలోని సూక్ష్మజీవరాశి సర్వ నాశనం అవుతున్నది. రసాయనిక ఎరువులు, కలుపుమందులు మాత్రమే కాదు సేంద్రియ ఎరువులు కూడా మట్టిలోని సూక్ష్మజీవరాశిపై విషతుల్యమైన ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. అందువల్లనే ఈ రెండు పద్ధతుల్లో వ్యవసాయం చేసే రైతులు ప్రతి పంటకూ ఎరువులను మార్కెట్లో కొని వేయక తప్పని పరిస్థితి వచ్చింది. ఇదొక కుట్ర. కానీ, భూమిలోని సూక్ష్మజీవరాశిని పెంపొందిస్తూ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో నిక్షేపంగా దిగుబడి సాధిస్తున్నాం. అదెలాగో వివరించండి..? దేశీ ఆవులను మనం వేల సంవత్సరాలుగా పూజిస్తున్నాం. కాబట్టి ఈ ఆవుల పేడ, మూత్రం, పాల వల్ల ఉపయోగకరమైన ప్రత్యేక గుణాలు లేకపోతే ఎందుకు పూజిస్తున్నట్లు? ఈ ఆలోచనతో దేశంలోని 35 గోజాతుల పేడ, మూత్రంలను లేబరేటరీలో పరీక్ష చేయించా. గ్రాము నాటు ఆవు పేడలో 300 కోట్లకుపైగా మేలుచేసే సూక్ష్మజీవులు ఉన్నాయని తెలుసుకున్నా. అనేకానేక జాతుల సూక్ష్మజీవులున్నాయి. కానీ, జెర్సీ, హోలిస్టీన్ పేడలో 70 లక్షలకు మించి లేవు. అందువల్ల దేశీ ఆవు పేడ, మూత్రంతో జీవామృతాన్ని తయారు చేశా. భూమిలో సూక్ష్మజీవుల సంఖ్యను ఇబ్బడిముబ్బడిగా పెంపొందించే కల్చర్ (తోడు)గా జీవామృతాన్ని వాడుతున్నాం. సూక్ష్మజీవరాశిని పెంపొందించే తోడును పంట భూమికి అందిస్తే చాలు, ఎటువంటి ఎరువులూ బయటి నుంచి తెచ్చి వేయాల్సిన అవసరమే లేదు. కానీ, చివికిన పశువుల ఎరువు (దిబ్బ ఎరువు) ను, రసాయనిక ఎరువులను పంటలకు ఆహారంగా వాడాలని వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతులను తప్పుదారి పట్టిస్తున్నాయి. పంటలకు కావాల్సింది ఎరువు కాదు, భూమిలో ఇప్పటికే ఉన్న సకల పోషకాలను అందుబాటులోకి తేవడానికి సూక్ష్మజీవరాశిని పెంపొందించే తోడు (మైక్రోబియల్ కల్చర్)ను పొలాల్లో వేస్తే చాలు. ఈ తోడును తయారు చేయడానికి అవసరమైన సూక్ష్మజీవరాశి దేశీ ఆవు పేడ, మూత్రంలో పుష్కలంగా ఉన్నాయి. పది కిలోల దేశీ ఆవు పేడలో 30 లక్షల కోట్ల మేలుచేసే సూక్ష్మజీవులుంటాయి. దీనితో జీవామృతం కలిపితే అందులోని సూక్ష్మజీవులు 20 నిమిషాలకోసారి రెట్టింపు అవుతూ ఉంటాయి. 48 గంటల్లో సూక్ష్మజీవుల సంఖ్య ఎంతకు పెరుగుతుందో చెప్పాలంటే సూపర్ కంప్యూటర్ కావాలి. జీవామృతం, ఘనజీవామృతం తయారు చేయించి వాడటంతో భూసారం పెరిగి, అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. దేశంలో 50 లక్షల మంది రైతులు పెట్టుబడి లేని ప్రకృతి సేద్యం చేస్తూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. పంట భూమిలో సూక్ష్మజీవరాశిని పెంపొందిస్తే చాలా? కాదు, భూమిలో సూక్ష్మజీవుల జీవవైవిధ్యాన్ని పెంపొందించడంతోపాటు.. భూమి పైన పొలంలో అనేక రకాల అంతర పంటలు సాగు చేయడం ద్వారా పంటల జీవవైవిధ్యాన్ని కూడా పెంపొందించాలి. నేను ఇదే చెబుతున్నా. ప్రధాన పంట మధ్యలో సుమారు 20 రకాల అంతర పంటలు వేయిస్తున్నా. అన్ని ఎక్కువ రకాల అంతర పంటలు విధిగా సాగు చేయాల్సిన అవసరం ఏమిటి? ఎందుకంటే, అనేక పంటలు ఉంటే అనేక రకాల మిత్ర పురుగులను ఆకర్షిస్తాయి. ఎన్ని రకాల అంతర పంటలు వేస్తే అన్ని ఎక్కువ రకాల బాక్టీరియా, పక్షులు, మిత్రపురుగులను మన పంట పొలంలోకి ఆహ్వానించగలుగుతాము. మిత్రపురుగులు, పక్షులు వచ్చి శత్రుపురుగులను తినేస్తాయి. కాబట్టి పంటలకు చీడపీడల బెడద ఉండదు. పగటి ఉష్ణోగ్రతతోపాటు పంట భూమిలో ఉష్ణోగ్రత కూడా పెరుగుతోంది. పంటలు, తోటలు కూడా ఎండిపోతున్నాయి. ప్రకృతి వ్యవసాయంలో ఏమైనా పరిష్కారం ఉందా? పంటల దిగుబడి సజావుగా రావాలంటే పంట భూమిలో జీవనద్రవ్యం (హ్యూమస్) చాలినంత తయారు కావటం చాలా ముఖ్యం. పంట భూమిలో ఉష్ణోగ్రత బాగా పెరిగినప్పుడు జీవనద్రవ్యం తరిగిపోతుంది. రసాయనిక, సేంద్రియ సేద్యం చేసే భూముల్లో హ్యూమస్ ఏర్పడదు. ఇది కూడా కుట్రే. అయితే, ప్రకృతి వ్యవసాయంలో పంట వ్యర్థాలు, గడ్డీ గాదంతో ఆచ్ఛాదన (స్ట్రా మల్చింగ్) చేస్తాం కాబట్టి, ఉష్ణోగ్రత పెరిగినా హ్యూమస్ దెబ్బతినదు. పంటలు అధిక ఉష్ణోగ్రతకు తట్టుకుంటాయి. ప్రకృతి సేద్యం జరిగే తోటల్లో కూడా గడ్డీ గాదంతో ఆచ్ఛాదన అంతగా చేస్తున్నట్లు లేదు..? పండ్ల తోటల్లో గడ్డీ గాదంతో ఆచ్ఛాదన చేయడం తప్పనిసరి. ఒక వేళ ఇది సాధ్యం కాకపోతే పప్పు ధాన్య (ద్విదళ) పంటలను అంతర పంటలు (లైవ్ మల్చింగ్)గా సాగు చేయాలి. వేసవిలో అంతర పంటలు కూడా ఉండవు. కాబట్టి.. పొలంలో పైపాటు చేయించాలి. 4.5 అంగుళాల కన్నా ఎక్కువ లోతుగా దున్నకూడదు. పైపొర మట్టి 4.5 అంగుళాల వరకే ప్రాణవాయువు అందుతుంది. సూక్ష్మజీవరాశి కూడా ఈ పైపొర మట్టిలోనే ఉంటుంది. అంతకన్నా కింద మట్టిని దున్నితే కార్బన్ డయాక్సయిడ్ వాతావరణంలోకి విడుదలవుతుంది. భూతాపోన్నతికి ఇది కారణమవుతుంది. కాబట్టి, ఖాళీ భూముల్లో వేసవి దుక్కులుగా గానీ, పండ్ల తోటల్లో, వార్షిక పంటల్లో గానీ లోతు దుక్కి చేయడం ప్రమాదకరం. ప్రకృతి వ్యవసాయంలో ట్రాక్టర్ వాడకుండా అరక, గొర్రులతో పైపైన మట్టిని లేవదున్నాలి. అంతే తప్ప పైపొర 4.5 అంగుళాల మట్టి లోపలికి తిరగబడేలా ఎట్టిపరిస్థితుల్లోనూ లోతు లోతుగా దుక్కి చేయకూడదు. ప్రకృతి సేద్యం చేసే పొలాల్లో ఉండే వానపాములు నిరంతరం బొరియలు చేస్తుంటాయి. అందువల్ల వాన నీటి సంరక్షణ పూర్తిస్థాయిలో జరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతల్లోనూ పంట తట్టుకుంటుంది. దీన్ని రుజువు చేశాం. హైడ్రోపోనిక్స్ సేద్యం గురించి మీ అభిప్రాయం? ఇది పూర్తిగా పిచ్చి పని. దేశవ్యాప్తంగా లక్షలాది ఎకరాల పంట భూములు ఖాళీగా ఉన్నాయి. మట్టి అవసరం లేని హైడ్రోపోనిక్స్ సేద్యం పేరిట.. ద్రవరూప రసాయనిక ఎరువులను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. రైతుల సొమ్మును దోచుకోవడానికి ఇది మరో రకమైన కుట్ర. చలి దేశాల్లో 7 నెలలు మంచు కురుస్తుంది కాబట్టి వాళ్లు ఏడాదంతా పంటలు సాగు చేసుకోవడానికి పాలీహౌస్‌లలో హైడ్రోపోనిక్స్ అని మరొకటని వాళ్ల బాధలు వాళ్లు పడుతున్నారు. మనకు హైడ్రోపోనిక్స్ గానీ, పాలీహౌస్‌లు గానీ బొత్తిగా అవసరం లేదు. రైతులను భారీ అప్పుల ఊబిలోకి దింపడానికి బ్యాంకర్లు, దళారులు పన్నిన కుట్రే పాలీహౌస్ సేద్యం. గాలివానలకు, వడగళ్లవానలకు పాలీహౌస్‌లు నాశనమై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పెట్టుబడి లేని ప్రకృతి సేద్యంలో ఎండాకాలంలోనూ 10% నీటితో, 10% విద్యుత్‌తో పూలు, కూరగాయ పంటలు చక్కగా పండించి చూపిస్తున్నాం.. ఇవేవీ అవసరం లేదు. జన్యుమార్పిడి ఆవాలు విత్తనాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనుందన్న వార్తలు వినవస్తున్నాయి. ప్రకృతి సేద్యానికి జీఎం విత్తనాలు పనికొస్తాయా? ప్రకృతి వ్యవసాయంలో దేశీ వంగడాలు అధిక దిగుబడినిస్తున్నాయి. దేశీ పత్తి వంగడాలే బీటీ పత్తి కన్నా అధిక దిగుబడినిస్తున్నాయి. చీడపీడలను తట్టుకుంటున్నాయి. బీటీ పత్తి వల్ల లక్షలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆవాలతోపాటు ఏ పంటలోనూ జన్యుమార్పిడి విత్తనాల అవసరమే లేదు. అంతర్జాతీయ దోపిడీ వ్యవస్థ హరిత విప్లవం తర్వాత మార్కెట్లోకి తెచ్చిన మరో ముదనష్టపు టెక్నాలజీ ఇది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎం పంటలకు అనుమతి ఇవ్వకూడదు. రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే మార్గం ఏమిటి? రసాయనిక, సేంద్రియ వ్యవసాయాలతోపాటు చీడపీడలు, వరదలు, కరువు కాటకాలు, గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల రుణాలు తీర్చలేక ఇప్పటికి 7 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 50 లక్షల మంది రైతులు ఈ దుస్థితి నుంచి విముక్తమయ్యారు. నాణ్యమైన, పోషక విలువలు, ఔషధ విలువలతో కూడిన సహజాహారాన్ని పండించే రైతులు తమ ఉత్పత్తులకు తామే ధర నిర్ణయించుకొని, నేరుగా వినియోగదారులకు అమ్మితే వ్యవసాయ సంక్షోభం పరిష్కారమవుతుంది. ప్రభుత్వాలు ఇందుకు దోహదపడేలా విధాన నిర్ణయాలు తీసుకోవాలి. రసాయనిక, సేంద్రియ వ్యవసాయాలను నిషేధించాలి. ఇంటర్వ్యూ : పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ పశువుల ఎరువు పంట పొలాలకు బలం అని మన రైతులు అనాదిగా భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు కూడా ప్రోత్సహిస్తున్నారు. కానీ, మీరు ఇది ప్రమాదకరం అంటున్నారు..? దేశీ ఆవులు లేదా ఇతర పశువుల పేడతో తయారైన దిబ్బ ఎరువు గానీ, వర్మీ కంపోస్టు గానీ, బయోడైనమిక్ పద్ధతిలో తయారైన ఆవు కొమ్ము ఎరువు గానీ వాడటం అత్యంత ప్రమాదకరం. వీటిలో 46% సేంద్రియ కర్బనం ఉంటుంది. వీటిని పంట పొలాల్లో చల్లినప్పుడు లేదా ఆ తర్వాత గానీ పగటి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా పెరగగానే.. ఈ ఎరువుల్లోని కర్బనం విడుదలై వాతావరణంలో కలవడం ప్రారంభమవుతుంది. ఉష్ణోగ్రత 36 డిగ్రీలకు పెరిగినప్పుడు కర్బనం పూర్తిగా విడుదలై, వాతావరణంలోని ఆక్సిజన్‌తో కలిసి, కార్బన్ డయాక్సయిడ్‌గా మారుతుంది. కార్బన్ డయాక్సయిడ్, మిథేన్, నైట్రస్ ఆక్సయిడ్ వంటి హరిత గృహ వాయువుల వల్ల భూతాపం పెరిగిపోతున్న సంగతి మనకు తెలుసు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిందేమిటంటే.. చెట్లు, పంటలు 98% పోషకాలను సూర్యరశ్మి నుంచి, వాతావరణం నుంచే గ్రహిస్తాయి. ఎక్కడో తయారు చేసిన రసాయనిక/ సేంద్రియ ఎరువులను తెచ్చి వేయాల్సిన అగత్యమే లేదు. చల్లని వాతావరణం ఉన్న ప్రాంతాల్లో కూడా వీటి అవసరం లేదు. భూమి అన్ని పోషకాలున్న అన్నపూర్ణ. ఉన్న పోషకాలను మొక్కల వేళ్లు ఉపయోగించుకునే రూపంలోకి మార్చేది సూక్ష్మజీవరాశి. వాటిని పెంపొందించే జీవామృతం, ఘన జీవామృతం ఇచ్చి.. వీలైన పద్ధతిలో ఆచ్ఛాదన చేస్తే చాలు. ఇదే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతి విశిష్టత. -
ముంబయ్ నుంచి సైకిల్ యాత్ర
- 15 రాష్ట్రాల్లో పర్యటన - కర్నూలులోని ఇంటికి చేరిన ఇంజినీరింగ్ విద్యార్థి తేజేశ్వర్ కల్లూరు (రూరల్) : వివిధ ప్రాంతాల్లోని ప్రకృతి అందాలు, సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించి ఫొటో డాక్యుమెంటరీ రూపొందించాలనే లక్ష్యంతో ఓ బీటెక్ విద్యార్థి సైకిల్ దేశవ్యాప్త పర్యటనకు బయలుదేరాడు. ఆగస్టు 6, 2016న ముంబయి నుంచి సైకిల్‌పై బయలుదేరాడు. 10 నెలల కాలంలో 15 రాష్ట్రాలను చుట్టేశాడు. వింతలు, విశేషాలు, ఆచార వ్యవహారాలకు సంబంధించి ఫొటోలను తీస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అతడే కర్నూలు నెహ్రూనగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు ఎం.శ్రీనివాసులు, ఎం.పార్వతి కుమారుడు తేజేశ్వర్. గుజరాత్, రాజస్థాన్, ధిల్లీ, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గోవా మీదుగా 25వేల కిలోమీటర్లు సైకిల్‌పై పర్యటించి ఆదివారం కర్నూలు చేరుకున్నాడు. జమ్మూకాశ్మీర్‌లో జరుగుతున్న అల్లర్లు, పాకిస్తాన్ ముష్కరులు జవాన్లపై చేసిన దాడులు, అక్కడ పరిస్థితులపై ఫొటోలు తీసినట్లు తెలిపాడు. మొదట ఒంటరిగా బయలుదేరాడు. జైపూర్ వెళ్లాక ఓ కుక్కపిల్లను కొన్నాడు. దాన్ని వెంటబెట్టుకుని అన్ని ప్రదేశాలను చుట్టేశాడు. ఆదివారం కర్నూలు చేరిన తేజేశ్వర్‌కు మాజీ కార్పొరేటర్ నరసింహులు, ఆర్‌ఎస్‌వైఎఫ్ నగర అధ్యక్షుడు విల్సన్, పారిశ్రామిక వేత్త రాజేష్‌పటేల్, ఎంఎస్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పరమేశ్వర్ సత్కరించారు. రెండు రోజుల విరామం తర్వాత బెంగుళూరు బయలుదేరి కేరళ, తమిళనాడు, విశాఖపట్టణం, ఒరిస్సా మీదుగా మహారాష్ట్ర, హైదరాబాద్‌కు చేరుకుని అక్కడి నుంచి నేరుగా కర్నూలు చేరతానని తెలిపాడు. -
మా కుక్కనే పొయ్యద్దంటావా... డిష్యూం!
ఉత్తరప్రదేశ్‌లోని బరేలి జిల్లాలో చిన్న విషయమై చెలిరేగిన వివాదం కాల్పుల వరకు వెళ్లి.. నలుగురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పూరన్ లాల్ అనే వ్యక్తి బజరియా పట్టణంలోని అన్నపూర్ణాదేవి గుడికి వెళ్లాడు. అతడు తన స్కూటీని ఆలయం వెలుపల పార్కింగ్ చేశాడు. మున్నాయాదవ్ అనే వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క.. అటువైపుగా వెళ్తూ ఆ స్కూటీ మీద మూత్రం పోసింది. దాంతో పూరన్ లాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అలా ఎలా చేస్తారంటూ మున్నాను అడిగారు. దాంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దాంతో కోపం వచ్చిన మున్నా, అతడి కొడుకు కలిసి కాల్పులు మొదలుపెట్టారు. ఆ కాల్పులలో పూరన్ లాల్, అతడి కొడుకులు విజయ్ కుమార్, ముకేష్ కుమార్‌లతో పాటు రాంకిశోర్ శర్మ అనే మరో వ్యక్తి గాయపడ్డారు. వాళ్లందరినీ వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆ నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఘటన జరిగిన వెంటనే నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. -
భూతాపానికి విరుగుడు ప్రకృతి సేద్యమే!
- ప్రకృతి సేద్యంలో రాణిస్తున్న బస్ కండక్టర్ బాజి, అతని కుటుంబం - ఎకరా వరిలో 26 బస్తాల దిగుబడి.. రూ. 50 వేల నికరాదాయం - నాలుగేళ్లలో భూమిలో 0.5 నుంచి 2.5కు పెరిగిన సేంద్రియ కర్బనం ప్రకృతి సేద్య పద్ధతులను అనుసరించటం ద్వారా వాతావరణ మార్పులను తట్టుకొని మంచి దిగుబడులు పొందొచ్చని పచ్చనాకు సాక్షిగా రుజువు చేస్తున్నాడు ధర్మారం భాజీ. గుంటూరు జిల్లా శావల్యపురం మండలం కారుమంచి ఆయన స్వగ్రామం. 2012లో సా„ దినపత్రిక ‘సాగుబడి’ పేజీ ద్వారా పాలేకర్ శిక్షణ గురించి తెలుసుకొని హాజరయ్యారు. అప్పటి నుంచి ఆర్టీసీ బస్ కండక్టర్‌గా పనిచేస్తూనే ప్రకృతి సేద్యంలో వరి, కూరగాయ పంటలను సాగు చేస్తున్నారు. ఎకరానికి 26 బస్తాల ధాన్యం దిగుబడి.. రూ. 50 వేల నికరాదాయం 2012లో తొలిసారిగా 18 ఎకరాల్లో వరిని సాగు చేశారు. తొలి ఏడాది అదునులో పనులు చేయలేకపోయారు. ఎకరాకు 12–14 బస్తాల దిగుబడి మాత్రమే వచ్చింది. దీంతో ఆ ఏడాది అప్పుల పాలయ్యారు. అయినా పట్టు విడవకుండా మరుసటి ఏడాది 12 ఎకరాల్లో వరిని సాగు చేశారు. విశ్రాంత వ్యవసాయ విస్తరణాధికారి ఎ.సత్యనారాయణ మూర్తి (94915 82181) సలహాలు, సూచనలు తీసుకున్నాడు. దుక్కిలో ఎకరాకు 200 కిలోల ఘన జీవామృతం వేశారు. ప్రతి పదిహేను రోజులకోసారి ఎకరాకు 200 లీటర్ల జీవామృతాన్ని నీటి ద్వారా అందించారు. 70 లీటర్ల నీటికి 70 లీటర్ల జీవామృతం కలిపి 15 రోజులకోసారి ఎకరా పైరుపై పిచికారీ చేసేవారు. ఈ ద్రావణానికి నెలకోసారి 7 లీటర్ల పుల్లటి మజ్జిగను కలిపి పిచికారీ చేసేవారు. 3 లీటర్ల దశపత్ర కషాయం 120 లీటర్ల నీటిలో కలిపి 60 రోజుల దశలో ఎకరా పైరుపై పిచికారీ చేశారు. ఆ ఏడాది ఎకరానికి 18 బస్తాల దిగుబడి సాధించారు. దిగుబడి పెరగటంతో అప్పటి నుంచి ఏటా వరి సాగులో ఇవే పద్ధతులను అనుసరిస్తున్నారు. 2015లో ఖరీఫ్, రబీల్లో నాలుగున్నర ఎకరాల్లో వరిని సాగు చేశారు. ఎకరాకు 22 బస్తాల దిగుబడి సా«ధించారు. 2016 ఖరీఫ్‌లో ఆరెకరాల్లో బీపీటీ రకం వరిని సాగు చేశారు. దిగుబడి ఎకరాకు 26 బస్తాలకు పెరిగింది. ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యంగా మార్చి విక్రయించారు. బస్తాకు 50 కిలోల బియ్యం వచ్చాయి. కిలో రూ. 60 చొప్పున విక్రయించారు. ధాన్యానికి బస్తాకు రూ. 3వేల చొప్పున ఎకరాకు రూ. 78 వేల నికరాదాయం వచ్చింది. ట్రాక్టరు దుక్కి, కలుపు, నూర్పిడి ఇతర ఖర్చులు రూ. 18 వేలు.. కౌలు రూ. 9 వేలు కలిపి మొత్తం ఎకరా వరి సాగుకు రూ. 27 వేల ఖర్చయింది. ఎకరాకు రూ. 50 వేల నికరాదాయం లభించింది. మూడెకరాల్లో కూరగాయల సాగు..30 కుటుంబాలకు కిలో రూ.30కి సరఫరా.. పలు రకాల కూరగాయలు, ఆకుకూరల పంటలను మూడెకరాల్లో సాగు చేస్తున్నారు. తొలుత దుక్కిలో ఎకరాకు 200 కిలోల ఘన జీవామృతం వేస్తారు. అందుబాటులో ఉండే దేశీ విత్తనాలనే వాడతారు. బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తారు. జీవామృతం, నీరు సమపాళ్లలో కలిపి ప్రతి పదిహేను రోజులకోసారి పైరుపై పిచికారీ చేస్తారు. కూరగాయలను గ్రామంలోని 30 కుటుంబాలకు విక్రయిస్తున్నారు. మార్కెట్ ధరతో సంబంధం లేకుండా కిలో రూ. 30 చొప్పున విక్రయిస్తున్నారు. తల్లిదండ్రులు మీరావలి, జాన్బీలు.. తమ్ముడు నాగూర్ వలీలు భాజీతోపాటు ప్రకృతి వ్యవసాయ పనుల్లో పూర్తిగా నిమగ్నమవుతూ సహకరిస్తున్నారు. వాతావరణ మార్పులకు ధీటైన జవాబు! రసాయన సేద్యంలో వరి సాగులో విస్తృతంగా రసాయన ఎరువులు వాడుతున్నారు. దీనివల్ల విడుదలయ్యే అమ్మోనియా వాయువు ఓజోన్ పొరను దెబ్బతీస్తోంది. ఉష్ణోగ్రతలు పెరగటంతో పంటలకు చీడపీడల తాకిడి పెరుగుతోంది. యూరియాకు బదులు ఆవుపేడ, మూత్రం వాడటం వల్ల గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించొచ్చంటారు బాజీ. అలాగే గాడుపు నుంచి పైర్లను కాపాడేందుకు జొన్న, మొక్కజొన్న, సజ్జ వంటి పైర్లను కంచెపంటగా సాగు చేస్తున్నారు. వాతావరణంలో పెరిగిన రేడియో ధార్మికత పరపరాగ సంపర్కం ప్రక్రియను దెబ్బతిస్తోంది. కూరగాయ పంటల్లో అయితే మగపూలు ఎక్కువగా వచ్చి దిగుబడి తగ్గుతుంది. పంట గింజ పోసుకోదు. వరిలో తాలు గింజ పోసుకుంటుంది. రేడియో ధార్మికతను తట్టుకుని దిగుబడి నిచ్చే శక్తి ఉన్న నాటు రకాలను సాగు చేయటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చంటారాయన. దీంతో పాటు 2 లీటర్ల కొబ్బరి నీరు కలిపి గింజ పాలు పోసుకునే దశలో పిచికారీ చేస్తున్నట్టు భాజీ తెలిపారు. నీటి కరువుకు ప్రకృతి సేద్యమే విరుగుడు వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయానికి సంభవించిన అనేక ఇబ్బందుల్లో తీవ్రమైనది కరువు. తోటి రైతులందరూ నీటి ఎద్దడితో వరి సాగును మానుకున్నా గడ్డు పరిస్థితుల్లోను ప్రకృతి సేద్య పద్ధతిలో వరిని సాగు చేయవచ్చని నిరూపించారు బాజీ. రసాయన సేద్యం చేసిన భూమి ఉపరితలంలో ఉండే చిన్నపాటి రంధ్రాలు పూడుకుపోవటం వల్ల కురిసిన నీరు భూమిలోకి ఇంకి ఆవిరయిపోతుంది. ప్రకృతి సేద్యంలో జీవామృతం వాడటం వల్ల వానపాములు చేసే బొరియల ద్వారా నీరు భూమి అడుగు పొరల్లోకి చేరి భూగర్భజలాలు పెరుగుతాయి. కరువులో జీవామృతం పైరుపై పిచికారీ చేస్తే చాలు. పోషకాలు అందుతాయి. పంట వ్యర్థాలు, ఎండుగడ్డి, ధనియాల పంటలతో ఆచ్ఛాదన చేసి కూరగాయ పంటల్లో తేమను పట్టి ఉంచుతున్నారు. ఇవ్వాళ్టి పరిస్థితుల్లో భూతాపాన్ని అదుపు చేయటం ఏ ఒక్కరి చేతుల్లోనూ లేదంటారు భాజీ. దీనివల్ల చీడపీడల పెరుగుదల. రసాయన కీటకనాశనులు విచక్షణ లేకుండా పిచికారీ చేయటంతో పంటలకు మేలు చేసే సాలీడు, కప్పలు, అక్షంతల పురుగులు, మిడతలను నిర్మూలిస్తున్నాయి. జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. అదే ప్రకృతి సేద్యంలో వాడే కషాయాలు మిత్ర పురుగులను మాత్రమే కాదు శతృ పురుగులను సైతం చంపవు. దీనివల్ల జీవావరణం, జీవవైవిధ్యానికి ఎలాంటి హాని లేదు. 4 ఏళ్లలో 2.5కి పెరిగిన సేంద్రియ కర్బనం తుఫానులు, వరదల తాకిడికి చేతికొచ్చే పంటలు మట్టి కొట్టుకుపోయి రైతును నట్టేట ముంచుతున్నాయి. దీనికి ప్రకృతి సేద్యమే సమర్థవంతమైన పరిష్కారం అంటారు భాజీ. సంకరజాతి వంగడాల వాడకంతో మొక్కలు సత్తువను కోల్పోతున్నాయి. జీవామృతం వాడకం వల్ల పైరు బలంగా పెరుగుతుంది. గాలి వానలకు ఎదురొడ్డి నిలుస్తుంది. నీటి ముంపుకు గురయినా పైరు తట్టుకుంటుంది. బాజీ వ్యవసాయ క్షేత్రంలో 2011లో గుంటూరు లాం ఫారం శాస్త్రవేత్తలు మట్టి నమూనాలను సేకరించి పరీక్షించగా మట్టిలో సేంద్రీయ కర్బనం 0.5 శాతం ఉన్నట్టు తేలింది. 2015లో జరిపిన మట్టి పరీక్షల్లో ఎలాంటి రసాయన అవశేషాలు లేవని.. సేంద్రియ కర్బనం 2.5 శాతానికి పెరిగినట్టు పరీక్షల్లో తేలింది. 2014లో ఉత్తమ రైతు అవార్డును అందుకున్నారు.ప్రకృతి వ్యవసాయం చేయటం ప్రారంభమైనప్పటి నుంచి భాజీ జీవనశైలిలోనూ మార్పు వచ్చింది. గడ్డి కప్పిన పూరింటిలో నివసిస్తున్నాడు. విద్యుచ్ఛక్తితో నడిచే వాహనాన్ని వాడుతున్నారు. మట్టికుండల్లోనే వంట చేసుకుంటున్నారు. – కంచి శ్రీనివాస్, సాక్షి, శావల్యాపురం, గుంటూరు జిల్లా రసాయనిక ఎరువులు వాడకుండాl లాభదాయకంగా వ్యవసాయం చేస్తున్నా..! ఒక వైపు కండక్టర్ ఉద్యోగం చేస్తూనే.. కుటుంబ సభ్యుల తోడ్పాటుతో విజయవంతంగా ప్రకృతి సేద్యం చేస్తున్నాను. ఒక్క గ్రాము రసాయనిక ఎరువు, పురుగుల మందు, కలుపు మందు వాడకుండా ఘనజీవామృతం, జీవామృతం, కషాయాల ద్వారానే వ్యవసాయం లాభసాటిగా చేయడం నేర్చుకున్నాను. మనసు పెట్టి నిమగ్నమై చేస్తే ఏ రైతైనా ఈ సేద్యాన్ని సులభంగా నేర్చుకొని చేయవచ్చు. వాతావరణ మార్పులను అధిగమించి వ్యవసాయం లాభసాటి చేయలన్నా, భవిష్యత్ తరాల మనుగడ బాగుండాలన్నా రైతులందరూ ప్రకృతి సేద్యం చేపట్టాల్సిందే. రుతు పవనాల మీద ఆధారపడి చేసే సేద్యం బాగుండాలంటే భూతాపం (గ్లోబల్ వార్మింగ్) తగ్గాలి. అప్పుడే సకాలంలో వర్షాలు కురుస్తాయి. అది జరగాలంటే రైతు చేయాల్సింది ప్రకృతి సేద్యం చెయ్యడం ఒక్కటే. – ధర్మారం బాజీ (96525 58884), యువ ప్రకృతి వ్యవసాయదారు, కారుమంచి, శావల్యాపురం మండలం, గుంటూరు జిల్లా. -
నులి పురుగులతో పెను కష్టం!
నులిపురుగులు.. మట్టి జీవులు. కంటికి కనిపించవు. సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్)లో చూస్తే.. ఏమీ ఎరుగని సన్నని దారాల్లా ఉంటాయి.. కానీ, అదీ ఇదని లేకుండా అన్ని రకాల పంటలనూ నాశనం చేస్తున్నాయి. రైతుల నోటి దాకా వచ్చిన పంటను నిలువునా ఎండగడుతున్నాయి. నులిపురుగులు పంట మొక్కలు, పండ్ల చెట్ల వేళ్లను ముక్కుతో పొడిచి రసం పీల్చుకుంటూ.. ఆ వేళ్ల చుట్టూ తెగ బలిసిపోతాయి. అవి పెరిగేకొద్దీ నేలపైన ఎంత ఎత్తున ఉన్న పండ్ల చెట్టయినా, మొక్కయినా, తీగయినా.. నీళ్లు, పోషకాలు అందక వాడిపోయి.. కొద్ది నెలల్లోనే నిలువునా ఎండిపోవాల్సిందే! అది వాటి పవర్!! ఈ నులిపురుగులను చంపే రసాయనిక మందును ఇప్పటివరకూ కనిపెట్టలేదు. కానీ, విషగుళికలు వాడి కొంత అదుపు చేయగలుగుతున్నారంతే. పోషకాలు చాలడం లేకనో, నీరు చాలడం లేకనో పంటలు ఇలా అయిపోతున్నాయని భ్రమింపజేసి.. తలపండిన రైతులను, సీనియర్ శాస్త్రవేత్తలను సైతం బోల్తా కొట్టించడంలో నులిపురుగులు ఆరితేరిపోయాయి. చెల్క/ మెట్ట పొలాల్లో ఆరుతడి పంటలు వేసుకొని పొట్టపోసుకునే చిన్న, సన్నకారు రైతులే కాదు.. లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి పాలీహౌస్‌లు ఏర్పాటు చేసుకున్న హైటెక్ రైతులు కూడా విలవిల్లాడిపోతున్నారు. పెట్టుబడులు ఎక్కువైనా వెచ్చించి కార్నేషన్, జెర్బర వంటి ఖరీదైన పూలు, అనేక రకాల కూరగాయ పంటల్లో అధికోత్పత్తి సాధించాలనుకున్న పాలీహౌస్ రైతుల భారీ ప్రణాళికలన్నీ నులిపురుగుల ధాటికి తల్లకిందులైపోతున్నాయి. ఒకటి, రెండు పంటలయ్యే సరికి ఆ పాలీహౌస్‌లలో బెడ్లతోపాటు వాటి కింది నేల కూడా పంటల సాగుకు సుతరామూ పనికిరానంతగా పాడైపోతోంది. దారీ తెన్నూ తెలీక కొంత మంది రైతులు పాలీహౌస్‌లలో సేద్యం అంటేనే భయపడిపోతున్నారు. అధికోత్పత్తిని ఆశించి తైవాన్, థాయ్‌లాండ్, చైనా, బంగ్లాదేశ్ దేశాల నుంచి పింక్, వైట్ పెద్ద జామ రకాల మొక్కలు పశ్చిమ బెంగాల్ మీదుగా య«థేచ్ఛగా దిగుమతి అవుతున్నాయి. కోటి ఆశలతో వీటిని సాగు చేస్తున్న రైతుల జామ తోటలు అనేక జిల్లాల్లో కునారిల్లుతున్నాయి లేదా నిలువునా ఎండిపోతున్నాయి. గోరు చుట్టుపై రోకటిపోటులా.. ఈ మొక్కలతోపాటు మనకు తెలియని విదేశీ జాతి నులిపురుగులు కూడా దిగుమతి అయ్యాయి కూడా. స్పెయిన్ నుంచి కార్నేషన్ అంట్లతోపాటు మరో రకం విదేశీ జాతి నులిపురుగులు వచ్చి మన భూముల్లోకి చేరిపోయాయి. ఎయిర్‌పోర్టులు, సీపోర్టుల్లో ముందస్తు పరీక్షలు చేసే నెమటోడ్ నిపుణుల కొరతతో క్వారంటైన్ నిబంధనలను అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడమేనని చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని అనేక జిల్లాల్లో గత మూడేళ్లుగా నులిపురుగులు విజృంభిస్తుండడంతో రైతుల ఆశలు అడియాసలవుతున్నాయి. సుమారు 300 మంది రైతుల పొలాలు, పాలీహౌస్‌ల నుంచి డాక్టర్ సునంద నమూనాలు సేకరించి, ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని జాతీయ వృక్షారోగ్య యాజమాన్య సంస్థ (ఎన్.ఐ.పి.హెచ్.ఎం.)లో నులిపురుగులపై జాతీయ సమన్వయ పరిశోధనా స్థానం కొద్ది నెలల క్రితమే ఏర్పాటైంది. ఈ స్థానం సారథిగా డా. సునంద సేవలందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పంటలను ఆశించే నులిపురుగులపై పనిచేస్తున్న పరిశోధనా స్థానం ఇదొక్కటే. దేశవ్యాప్తంగా ఏటా జామ సహా ఉద్యాన తోటల్లో నులిపురుగుల వల్ల 10–12 శాతం దిగుబడి దెబ్బతింటున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. రూ. 2,100 కోట్ల మేర రైతులకు ఆర్థిక నష్టం కలుగుతోంది. ఐ.సి.ఏ.ఆర్. – ఎ.ఐ.సి.ఆర్.పి. సర్వే ప్రకారం తాజాగా రూపొందించిన నెమటోడ్స్ అట్లాస్‌లో ఈ వివరాలు పొందుపరిచారు. ఈ నేపథ్యంలో ‘సాగుబడి’ పాఠకుల కోసం నులిపురుగుల బెడదపై కొన్ని సంగతులు.. విదేశాల నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా తైవాన్, వి.ఎన్.ఆర్. బిహి జామ రకాల దిగుమతి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రధాన పండ్ల జాతుల్లో జామ ముఖ్యమైనది. తాజా అంచనాల ప్రకారం 12 వేల హెక్టార్లకన్నా ఎక్కువ విస్తీర్ణంలోనే జామ తోటలున్నాయి. అయితే, గత రెండేళ్లుగా జామ తోటల్లో కొన్ని మొక్కలు నిలువునా ఎండిపోతున్నాయి. రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, నల్లగొండ, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. పోషకాల లోపమా? నీరు లోపమా? అని తర్జన భర్జన పడే లోపే జామ తోటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. నులిపురుగుల బారిన పడిన జామ తోటల్లో పంట నష్టం 30 నుంచి 60 శాతం వరకు ఉందంటే.. తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్థం అవుతుంది. కొన్ని నర్సరీల్లో అయితే నులిపురుగుల సోకిన జామ మొక్కల శాతం 90 నుంచి 100% వరకూ ఉందని ఎన్.ఐ.పి.హెచ్.ఎం.లో నెమటోడ్స్ విభాగం సారధి డా. సునంద అన్నారు. విదేశాల నుంచి జామ మొక్కలను దిగుమతి చేసుకునేటప్పుడు ఎయిర్‌పోర్టులు, సీపోర్టుల్లో తెగుళ్లు, పురుగులతోపాటు నులిపురుగుల సమస్య లేదని పరీక్షల ద్వారా నిర్ధారించుకోవాలి. అయితే, నులిపురుగుల నిపుణులు లేకపోవడం వల్ల ఈ పరీక్ష చేయకుండానే యధేచ్ఛగా తైవాన్, చైనా, థాయ్‌లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా మన దేశంలోకి మొక్కల దిగుమతి జరిగిపోతోంది. ఆ మొక్కలతోపాటు మన దేశంలోకి వచ్చిన మట్టి మిశ్రమం ద్వారా విదేశీ జాతుల నులిపురుగులు మన భూముల్లోకి చేరుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఆ విధంగా.. తైవాన్, వి.ఎన్.ఆర్. బిహి రకాలకు చెందిన పింక్, వైట్ జామ మొక్కలతో పాటు అనే విదేశీ జాతి నులిపురుగులు తెలుగు రాష్ట్రాల పొలాల్లోకి వచ్చేశాయి. ఎన్.ఐ.పి.హెచ్.ఎం.లో నులిపురుగుల శాస్త్రవేత్త డా. సునంద తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో ఎండిపోతున్న తైవాన్, వి.ఎన్.ఆర్. బిహి రకాల జామ తోటల్లో నమూనాలు సేకరించి పరీక్షించారు. మోలోయిడోగైన్ ఎంటెరోలోబి (M్ఛlౌజీఛీౌజyn్ఛ ్ఛn్ట్ఛటౌlౌbజీ) అనే విదేశీ జాతి నులిపురుగు సోకినట్లు గుర్తించారు. తొలుత 2013లో తమిళనాడులోని దిండిగల్‌లో జామ తోటలో దీన్ని కనుగొన్నారు. 2015లో తెలంగాణలో తొలిసారి బయటపడింది. అయితే, దేశీ జామ రకాలైన అలహాబాద్ సఫేద్, లక్నో 49 రకాల జామ తోటల్లో ఈ నులిపురుగుల సమస్య లేదని డా. సునంద చెప్పారు. ఈ విదేశీ జాతి నులిపురుగు జామ ఒక్క పంటనే కాదు.. మట్టి లేదా అంట్ల ద్వారా ఏ పంటనైనా ఆశిస్తుంది. చివరకు గడ్డి మొక్కల వేళ్లపై కూడా బతికేస్తుందన్నారు. తైవాన్, వి.ఎన్.ఆర్. బిహి వంటి విదేశీ జామ రకాలను దిగుమతి చేసుకొని తూర్పు గోదావరి జిల్లా కడియంలోని నర్సరీ రైతులకు ఇస్తున్నాయని, వీటి ద్వారా విదేశీ జాతి నులిపురుగులు వ్యాప్తి చెందుతున్నాయన్నారు. ఈ నులిపురుగుల వ్యాప్తి వేగంగా జరుగుతున్నందున అరికట్టకపోతే ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించి రైతాంగానికి తీవ్ర ఆర్థిక నష్టం కలిగించే ప్రమాదం ఉందని డా. సునంద హెచ్చరిస్తున్నారు. నాలుగో నెల నుంచే నులిపురుగుల సమస్య ప్రకృతి వ్యవసాయంతోనే తోటను నిలబెట్టుకుంటా! ప్రకృతి వ్యవసాయదారుడు కొచ్చెర్లపాటి రవికిరణ్‌కు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అరూర్ గ్రామపరిధిలో నాలుగు ఎకరాల భూమి ఉంది. పాలేకర్ శిక్షణ పొంది, పుస్తకాలు చదివి ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తెలిసిన ఒక రైతు వద్ద నుంచి తైవాన్ పింక్ జామ 1,800 మొక్కలను తెచ్చి.. ఏడాదిన్నర క్రితం నాటారు. కడియం నుంచి సూద మొక్కలు(రూట్ స్టాక్) తెప్పించి, దానిపై తైవాన్ పింక్ కొమ్మలను గ్రాఫ్టింగ్ చేసిన మొక్కలను ఒక రైతు వద్ద నుంచి కొని నాటారు. 4 నెలలు గడిచేటప్పటికి ఆకులు పసుపు రంగుకు పాలిపోవడం, ఎదుగుదల లేకపోవడం వంటి సమస్యలు కనిపించాయి. ఎన్.ఐ.పి.హెచ్.ఎం.కు చెందిన డా. సునందను సంప్రదించారు. పరీక్షలు చేసి నులిపురుగులు సోకాయని నిర్థారించారు. రసాయనిక మందులు వాడమని సలహా ఇచ్చారు. అయితే, రవికిరణ్ మాత్రం ప్రకృతి వ్యవసాయంపై నమ్మకంతో తన మార్గంలోనే ముందుకెళ్తున్నారు. భూమిలో సేంద్రియ పదార్థం పెంచితే మొక్కలు తిరిగి పుంజుకుంటాయని నమ్ముతున్నారు. జీవామృతం, పంచగవ్య, పుల్లమజ్జిగ.. ఇస్తున్నారు. మేకల ఎరువుకు జీవామృతం కలిపి 3 నెలలు పులియబెట్టి, దానికి జీవన ఎరువులను కలిపి మొక్కల చుట్టూ పోసి మల్చింగ్ చేస్తున్నారు. జామ మొక్కల దగ్గర్లో బంతి మొక్కలు వేశారు. బంతి మొక్కల వేళ్ల నుంచి వెలువడే స్రావం నులిపురుగుల నియంత్రణకు ఉపయోగపడుతోందన్నారు. తనతోపాటు 30–40 ఎకరాల్లో తైవాన్ జామ వేసిన రైతులు రసాయనాలు వాడి, చాలా నష్టపోయి తోటలు పూర్తిగా తీసేశారని రవికిరణ్ తెలిపారు. తన పొలంలో ఒక రెండెకరాల్లో జామ పక్కనే మునగ మొక్కలు వేసి, కొమ్మలు నరికి మల్చింగ్ చేస్తున్నానని, ఆ ప్రాంతంలో నులిపురుగుల నష్ట తీవ్రత తక్కువగా ఉందన్నారు. ఓపికగా ప్రకృతి వ్యవసాయం కొనసాగిస్తున్న రవికిరణ్ (99636 12578) అభినందనీయుడు. సేంద్రియ సేద్యంలో నులిపురుగుల సమస్య తక్కువే: డా. సునంద నులిపురుగుల సమస్య తీవ్రత సేంద్రియ సేద్యం చేసే పొలాల్లో రసాయనిక వ్యవసాయం చేసే పొలాలతో పోల్చినప్పుడు తక్కువగానే ఉంటుందని ఎన్.ఐ.పి.హెచ్.ఎం.లో నులిపురుగుల నిపుణురాలు డా. సునంద తెలిపారు. అయితే, ఇటీవల సంవత్సరాల్లో సేంద్రియ సేద్యం చేపట్టిన పొలాల్లో పెద్ద తేడా కనిపించలేదని, సుదీర్ఘకాలం నుంచి సేంద్రియ సేద్యం చేసే పొలాల్లో కచ్చితంగా ఈ తేడా ఉంటుందన్నారు. సేంద్రియ వ్యవసాయంలో వినియోగించే జీవన ఎరువుల ప్రభావం వల్ల నులిపురుగులు అదుపులో ఉండే అవకాశం ఉందన్నారు. ప్రధాన పంట మొక్కల పక్కన బంతి మొక్కలు, ఆవాల మొక్కలు సాగు చేయడం ద్వారా నులిపురుగుల బెడదను నివారించవచ్చని ఆమె తెలిపారు. ఈ మొక్కలు వేళ్ల ద్వారా స్రవించే ద్రవాలు నులిపురుగులను నిరోధిస్తాయన్నారు. అనేక రకాల పంటలను కలిపి ఒకే పొలంలో పండించడం, ఎర పంటలను సాగు చేయడం ద్వారా కూడా ఈ సమస్యను అదుపులో ఉంచుకోవడం సులభమవుతుందని డా. సునంద వివరించారు. నులిపురుగుల సమస్య ఎదుర్కొంటున్న రైతులు నమూనాలు తెస్తే ఉచితంగా పరీక్ష చేసి, తగిన సూచనలు ఇస్తామన్నారు. నులిపురుగుల సమస్యపై రైతులకు ఎన్.ఐ.పి.హెచ్.ఎం. శిక్షణ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైతులు లేదా రైతు బృందాలు నులిపురుగుల సమస్యపై హైదరాబాద్‌లోని ఎన్.ఐ.పి. హెచ్.ఎం. 3 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తుంది. వసతి ఉచితం. భోజనం ఖర్చు రైతులే భరించుకోవాలి. ఆసక్తి కలిగిన వారు ఎన్.ఐ.పి. హెచ్.ఎం. డైరెక్టర్ జనరల్‌కు ఫ్యాక్స్ (040–24015346) ద్వారా లేఖ రాయవచ్చు. శిక్షణకు రావలసిన తేదీలను రైతులకు తదుపరి తెలియ జేస్తారు. డా. సునందను 89787 78707 నంబరులో గాని, ఈమెయిల్ patilsunanda722@gmail.com ద్వారా గాని సంప్రదించవచ్చు. -
ప్రకృతి సేద్యంపై మే 9–10 తేదీల్లో బెంగళూరులో అంతర్జాతీయ సదస్సు
‘ప్రకృతి వ్యవసాయం – ప్రపంచ ప్రజలకు పౌష్టికాహారం, ఆహార భద్రత సాధనకు వినూత్న మార్గం’ అనే అంశంపై ఈ ఏడాది మే 9,10 తేదీల్లో అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సుకు బెంగళూరులోని రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమం వేదిక కానుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్యాత్మిక సంస్థ అయినప్పటికీ దేశీ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా రసాయన రహిత సహజాహారోత్పత్తిని ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ‘శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ట్రస్టు’ (ఎస్.ఎస్.ఐ.ఎ.ఎస్.టి.) ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఎస్.ఎస్.ఐ.ఎ.ఎస్.టి. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రైతులకు శిక్షణ ఇస్తోంది. ఈ ట్రస్టు చైర్మన్‌గా హైదరాబాద్‌కు చెందిన పులిమామిడి రామకృష్ణారెడ్డి ఇటీవల బాధ్యతలు చేపట్టిన తర్వాత అంతర్జాతీయ సదస్సు నిర్వహించతలపెట్టారు. చిన్న, సన్నకారు రైతుల స్థాయిలో దేశీ ఆవు పేడ, మూత్రం తదితరాలతో తయారు చేసిన ఉత్పాదకాలతోనే భూసారాన్ని గణనీయంగా, కచ్చితంగా పెంచుకునే వినూత్న పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. త్రికరణశుద్ధిగా చేస్తే ప్రకృతి వ్యవసాయంలో సులువుగా తొలి ఏడాదే అధిక దిగుబడి సాధించడం ముమ్మాటికీ సాధ్యమేనని రైతులతో పనిచేస్తున్న క్రమంలో గ్రహించామని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా విధాన నిర్ణేతలు, శాస్త్రవేత్తలు, వినియోగదారులు, రైతులకు భారతీయ ప్రకృతి వ్యవసాయం అద్భుత ఫలితాలను చాటిచెప్పడమే ఈ సదస్సు లక్ష్యమని ట్రస్టు చైర్మన్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘రుషి – కృషి’ పేరిట అనేక రాష్ట్రాల్లో తమ వద్ద ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ పొందిన రైతుల్లో కనీసం సగం మంది ఈ సాగుపద్ధతిని అనుసరిస్తున్నారని ఆయన వివరించారు. మే 9–10 తేదీల్లో జరిగే శిఖరాగ్ర సదస్సుకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, శాస్త్రవేత్తలు, పలువురు దేశ విదేశీ నిపుణులు, ప్రముఖులు ఈ సదస్సులో ప్రసంగిస్తారని రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ సదస్సుకు హాజరుకాదలచిన వారు ముందుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వివరాలకు agriconference.artofliving.org చూడండి.ఈ–మెయిల్: agriconference@artofliving.org, ఫోన్స్: 080–67612310, శ్రీమతి మరియమ్మ 098493 70809, శ్రీమతి సునీల 098490 00196 ప్రకృతి సేద్యంపై 7 నుంచి కొల్లాపూర్‌లో శిక్షణ శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో ‘రుషి–కృషి’ పేరుతో ప్రకృతి వ్యవసాయ శిక్షణ నిర్వహించనున్నారు. ట్రస్టు అధినేత పులిమామిడి రామకృష్ణారెడ్డి, ఉమామహేశ్వరి రైతులకు శిక్షణ ఇస్తారు. కొల్లాపూర్‌లోని ఫంక్షన్‌హాలులో శిక్షణ ఉంటుంది. భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి ప్రకృతి సేద్యం చేపట్టిన సతీష్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఆసక్తి గల రైతులు ఆయనను 95027 31861 నంబర్లో సంప్రదించి ముందుగా పేర్లు నమోదు చేయించుకోవచ్చు. ఏప్రిల్ 9, 18 తేదీల్లో చెన్నమరాజుపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై గంగిరెడ్డి శిక్షణ ప్రకృతి సేద్యంలో అనుభవజ్ఞుడు, వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన మన్నేటి గంగిరెడ్డి తన స్వగ్రామం పెండ్లిమర్రి మండలం చెన్నమరాజుపల్లి (కడప నుంచి 18 కి.మీ. దూరం)లో ఏప్రిల్ 9, 18వ తేదీల్లో రైతులకు శిక్షణ ఇస్తారు. గోమాత పంచామృత కషాయాల ఆశ్రమంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు శిక్షణ ఇస్తారు. తన వ్యవసాయ పనులు చూసుకుంటూనే నెలకు 10 రోజులు వివిధ గ్రామాలకూ వెళ్లి రైతులకు శిక్షణ ఇచ్చేందుకు సమయం కేటాయిస్తున్నానని గంగిరెడ్డి తెలిపారు. మహారాష్ట్రలో రైతులకు రెండేళ్ల పాటు శిక్షణ ఇచ్చిన అనుభవం ఆయనకు ఉంది. గంగిరెడ్డిని 95021 47401 నంబరులో సంప్రదించవచ్చు. 6న మిర్యాలగూడలో, 9న కొర్నెపాడులో శిక్షణ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వివిధ పంటల సాగుపై రైతునేస్తం ఫౌండేషన్ ఏప్రిల్ 6న మిర్యాలగూడలో రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రకృతి వ్యవసాయదారులు శ్రీమతి లావణ్యారెడ్డి, శ్రీమతి శశికళ, జి. సతీష్‌రెడ్డి, కొక్కు అశోక్‌కుమార్ రైతులకు శిక్షణ ఇస్తారు. ఏప్రిల్ 9న గుంటూరు జిల్లా కొర్నెపాడులో ప్రకృతి సేద్యం చేసే వరి, పత్తి, మిరప, ఉద్యాన తోటల రైతులకు వర్తించే పథకాలపై శిక్షణ ఇస్తారు. ఉద్యాన అధికారి రాజా కృష్ణారెడ్డి, రైతులు ధర్మారం బాజి, శ్రీమతి లావణ్యా రమణారెడ్డి శిక్షణ ఇస్తారు. వివరాలకు 83744 22599, 96767 97777 నంబర్లలో సంప్రదించవచ్చు. విశాఖలో దేశీ విత్తనోద్యమకారుల సమ్మేళనం భారత్ బీజ్ స్వరాజ్ మంచ్(బి.బి.ఎస్.ఎం.) ఆధ్వర్యంలో దేశీ విత్తనాలు సాగు చేస్తూ పరిరక్షిస్తున్న సేంద్రియ రైతులు, మేలైన వంగడాలను రూపొందించే రైతులు, దేశీ విత్తన పరిరక్షణోద్యమ కార్యకర్తల జాతీయ సమ్మేళనం ఏప్రిల్ 8 – 9 తేదీల్లో విశాఖపట్నంలో జరగనుంది. వివరాలకు.. కృష్ణప్రసాద్ – 098808 62058, దేవుళ్లు –98492 05469. prasadgk12@gmail.com -
ప్రకృతికి పుట్టిన రోజు పండుగ ఉగాది
–మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు –ఘనంగా ఉగాది విశిష్ఠ సేవాపురస్కారాల కార్యక్రమం రాజమహేంద్రవరం రూరల్ : ఉగాదిని హిందువుల పండువగా భావించరాదని, ప్రకృతికి ఉగాది పుట్టినరోజు పండుగలాంటిదని, అన్ని మతాల వారు ఈ మధుమాసాన్ని ఆచరించాలని మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు అన్నారు. సోమవారం హేవిళంబి నామ ఉగాదిని పురస్కరించుకుని ఫిలాంత్రోఫిక్ సొసైటీ, తెలుగువిశ్వవిద్యాలయ భాగస్వామ్యంతో తెలుగు విశ్వవిద్యాలయ సెమినార్ హాలులో ఉగాది విశిష్ట సేవాపురస్కారాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు మాట్లాడుతూ చైత్రమాసంలో వసంత రుతువు అనాదిగా మానవజాతికి మరువలేని తీపి గురుతన్నారు. తెలుగువిశ్వవిద్యాలయ పీఠాధిపతి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ మాట్లాడుతూ ఉగాదిని గుర్తు చేసే కోయిల పాట వింటే ప్రాణం లేచివస్తుందని, జగమంతా వసంతాలు పూయు ఉగాది ఒకటి చాలని అన్నారు. తెలుగుభాషా రక్షణ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ ప్రజల్లో విశ్వవిద్యాలయాల్లో సామాజిక చైతన్యాన్ని తీసుకువచ్చేలా ఫిలాంత్రోఫిక్ సొసైటీ వివిధ విశ్వవిద్యాలయాలతో చేస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలు అభినందనీయమన్నారు. సభలో ఆదికవినన్నయ్య విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు డాక్టర్ పి.విజయనిర్మల జ్యోతిప్రజ్వలన చేయగా, సీనియర్ జర్నలిస్టు, ఏపిడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండేలా శ్రీరామ్మూర్తి, నన్నయ్యవిశ్వవిద్యాలయం తెలుగు విభాగ కన్వీనర్ డాక్టర్ తరపట్ల సత్యనారాయణ, ఫిలాంత్రోఫిక్ సొసైటీ వ్యవస్థాపకులు అద్దంకి రాజయోనా మాట్లాడారు. తెలుగు బాష కమ్మదనంపై కె.వాణి పాడిన గీతం, డాక్టర్ పుట్ల హేమలత వాఖ్యానం ఆహుతులను అలరించాయి. ఉగాది కవితతో అందరి మదిని దోచారు కవి నూజెళ్ల శ్రీనివాసరావు. కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, పుదుచ్ఛేరి రాష్ట్రాలకు చెందిన సాహిత్య, సామాజిక, సాంస్కృతిక రంగాలలో విశిష్ట ప్రతిభ కనబరిచిన 22మందికి ఉగాది విశిష్ట సేవా పురస్కార్ అవార్డులు అందించి, ఘనంగా సన్మానించారు. పురస్కారాలు పొందినవారు వీరే సాహిత్యం విభాగంలో డాక్టర్ బి.ప్రభాకరరావు(రెక్టర్, జేఎన్టీయూ, కాకినాడ), డాక్టర్ జనపాల కాళేశ్వరరావు(కవి, రచయిత, సామాజికవేత్త), మల్లెమొగ్గల గోపాలరావు(కవి, రచయిత), యడవల్లి శ్రీనివాసరావు(కవి, సామాజికవేత్త), బత్తుల మురళీకృష్ణ(కవి, రచయిత), సాంస్కృతిక రంగంలో తురగా సూర్యారావు(నటుడు, సామాజికవేత్త), డాక్టర్ కేవీఎం లాల్ నెహ్రూ(నృత్యం, సామాజిక రంగం), డాక్టర్ రవిపరస(నఖ చిత్రలేఖనం), సామాజిక రంగాల్లో డీజే సుధాకరరాజు, డాక్టర్ ఒమ్మి రఘురాం, డాక్టర్ మనికిరెడ్డి సత్యనారాయణ, మల్లాడి సత్యనారాయణ, చింతా వెంకటరమణి, డాక్టర్ కట్టా నళిని, డాక్టర్ రాయవరపు సత్యభామ, కె.వాణి, మల్లెపూల నిర్మలకుమారి, డాక్టర్ యంగలశెట్టి సాయికుమార్, డాక్టర్ కె.కృష్ణంరాజు, గుంపుల వెంకటేశ్వరరావు, రెవ.జోసఫ్ పాలంగి, గరికపర్తి నమశ్శివాయ -
‘ప్రకృతి’ ఉత్పత్తులకు విశేష ఆదరణ
- నంద్యాల రైతు శిక్షణ కేంద్రం డీడీఏ సంధ్యారాణి కర్నూలు(అగ్రికల్చర్): పురుగు మందులు, రసాయన ఎరువుల వాడకుండా.. ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటలకు విశేష ఆదరణ లభిస్తోందని నంద్యాల రైతు శిక్షణ కేంద్రం డీడీఏ సంధ్యారాణి, వ్యవసాయశాఖ డీడీఏ మల్లికార్జునరావు అన్నారు. నంద్యాల రైతు శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాల శిబిరాన్ని సోమవారం.. కర్నూలు సీక్యాంప్ రైతు బజార్లో వీరు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బండి ఆత్మకూరు, నంద్యాల, బనగానపల్లె, బేతంచెర్ల, వెలుగోడు మండలాల్లో 8 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 299 మంది రైతులు 350 హెక్టార్లలో ఈ వ్యవసాయం చేస్తున్నారన్నారు. ప్రదర్శనలో బియ్యం, జొన్నలు, జొన్నపిండి, కందిపప్పు, రాగులు, కొర్ర బియ్యం, నువ్వులు, పసుపుతో పాటు మామిడి కాయలు, పండ్ల, ఇతర కూరగాయలను విక్రయానికి ఉంచారు. వినియోగదారులు పోటీ వీటిని పడి కొనుగోలు చేశారు. మంగళవారం కూడా ప్రదర్శన ఉంటుంది. ఎన్‌పీఎం డీపీఎం నాగరాజు, నంద్యాల రైతు శిక్షణ కేంద్రం ఏడీఏ అరుణకుమారి, వ్యవసాయాధికారులు నాగసరోజ, నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హెల్త్ టిప్స్
ప్రకృతి ప్రసాదించిన వనమూలికలతో అద్భుతమైన వైద్యం చేయవచ్చని నిరూపించారు భారతీయ వైద్యులు. వీటిలో అల్లం ప్రాధాన్యం మరీ ఎక్కువ. ముఖ్యంగా పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ. పిల్లలకు అజీర్తి, కడుపునొప్పి వస్తే ఒక స్పూను అల్లం రసం కాని చిటికెడు శొంఠి పొడి కాని ఇవ్వాలి. పెద్దవాళ్లు కూడా మోతాదు పెంచి తీసుకోవచ్చు.జలుబు, ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నప్పుడు తేనెలో అల్లం ముక్కలు కాని, శొంఠి పొడి కాని కలిపి తీసుకోవాలి. తలనొప్పి, జ్వరం ఉన్నప్పుడు అల్లం రసం కాని, అల్లం టీ కాని తాగితే ఉపశమనం కలుగుతుంది. పైత్యంతో వాంతులవుతుంటే శొంఠిని తేనెతో కలిపి చప్పరించాలి. వేవిళ్ళ సమయంలో అయ్యే వాంతుల నివారణకు కూడా అల్లం బాగా పని చేస్తుంది. నోరు రుచి లేనట్లు ఉండడాన్ని పోగొడుతుంది. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు రోజుకు మూడుసార్లు అల్లంతో తయారైన హెర్బల్ టీని తాగచ్చు. అయితే రోజులో నాలుగుసార్లకు మించి అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు. మరీ ముఖ్యంగా కడుపులో అల్సర్ ఉన్న వాళ్లు అసలు తాగకూడదు. అల్లం టీ తాగినప్పుడు కడుపులో వికారం వస్తే డాక్టర్ని సంప్రదించాలి. -
పిల్లలు ప్రకృతి ప్రేమికులు ఎలా!
టోరంటో: ఇంటి వెలుపల క్రీడలు ఆడే పిల్లలకు ప్రకృతిపై ప్రేమ ఎక్కువగా ఉంటుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా ఓక్నాగన్కి చెందిన ప్రొఫెసర్లు జరిపిన పరిశోధనలో ఈ విషయం స్పష్టమైంది. చిన్నతనంలో ఇంటి బయట ఆడుకున్న 18 నుంచి 25 సంవత్సరాల వయసున్న యువతని ప్రొఫెసర్లు ప్రశ్నించగా.. తాము ప్రకృతిని అమితంగా ఇష్టపడతామని, పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తామని వారు తెలిపారు. ఈ తరహాలో అలోచించే పిల్లలు చిన్నప్పుడు వివిధ పర్యావరణ సంబంధిత సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు. అందుకే వారు ప్రకృతిపై ఇష్టాన్ని పెంపొందించుకున్నారని వర్సిటీ ప్రొఫెసర్ బూన్ విశ్లేషించారు. బయట ఆడుకునే సమయంలో పిల్లలు ప్రకృతిని ఆస్వాదిస్తారన్నారు. అందుకే పెద్ద అయిన తరువాత వారికి ప్రకృతిపై సానుకూల దృక్పథం ఏర్పడుతుందని వర్సిటీకి చెందిన మరో ప్రొఫెసర్ కేథరీన్ వివరించారు. పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడు వారానికి నాలుగుసార్లైనా అవుట్ డోర్ గేమ్స్ (బయట ఆడుకునే క్రీడలు) ఆడితే పిల్లల్లో ప్రకృతిపై ప్రేమ, గౌరవం పెరుగుతుందని చెప్పారు. ఈ అధ్యయన వివరాలను ఆస్ట్రేలియాకి చెందిన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే జర్నల్‌లో ఇటీవల ప్రచురించారు. -
పీడ ఫీలింగ్
పడుతుంటే పట్టుకోవాల్సిన పిల్లలను పడతొక్కేవాళ్లుంటారా? పీడకలలొస్తే లాలించే పెద్దలే ఓ పీడకలవుతారా? ఇక పిల్లల్ని ఎవరి అండకు వదలాలి? ఇక పిల్లల్ని ఏ భరోసాకి అప్పజెప్పాలి? చీదర పుడుతోంది... కాదు కాదు కంపరం పుడుతోంది... పట్టలేనంత కోపం వస్తోంది! గొంతు పట్టుకోవాలన్నంత ఆవేశం పొంగుతోంది!! కాని... చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. వీళ్లను మనం కొట్టకూడదు... చట్టమే తాట తీస్తుంది!! పెడోఫీలియా... పిల్లలను లైంగికంగా వేధించే ఉన్మాద ప్రవర్తన!! ఈ పీడ ఫీలింగ్ నుంచి సమాజాన్ని కడిగేయాలనే ఈ ప్రయత్నం!! పేరెంట్స్ నీడ్ టు నో! తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలను ‘పెద్దలకు ’ అప్పజెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లీజ్ బి కేర్‌ఫుల్!! చిన్నపిల్లలను లైంగికంగా వేధించే ప్రవృత్తిని ఒక మానసిక స్థితిగా కాకుండా దాన్నొక రాక్షస చర్యగా పరిగణించాలి. ‘హలో.. సరిత గారూ... నిహారిక క్లాస్ టీచర్ని మాట్లాడుతున్నానండీ..!’‘హలో.. చెప్పండి మామ్!’‘మీ పాపకు జ్వరం. ఒళ్లు కాలిపోతోంది. వచ్చి తీసుకెళ్తారా...’‘అయ్యో.. ఉదయం స్కూల్‌కి పంపేప్పుడు బాగానే ఉంది కదా..’ కంగారుగా బదులిచ్చింది సరిత.‘ఏమోనండీ మరీ.. అసెంబ్లీకి కూడా అటెండ్ అవకుండా క్లాస్ రూమ్‌లోనే పడుకుని ఉండిపోయింది. అటెండెన్స్ తీసుకుంటుంటే తన పక్కన ఉండే పిల్లలు చెప్పారు... నిహారికకు జ్వరమని. వెళ్లి చూస్తే ఒళ్లు కాలిపోతోంది. అందుకే వెంటనే కాల్ చేస్తున్నాను’ వివరించింది క్లాస్ టీచర్. ‘వచ్చేస్తున్నానండీ’.. ఇందాకటి కంగారే కంటిన్యూ అయింది సరిత గొంతులో. ‘సరిత గారూ.. ఇంకో విషయమండీ... రెండు రోజుల కిందటే మీకు ఫోన్ చేద్దామనుకున్నాను. ఎందుకో ఈ మధ్య నిహారిక చాలా డల్‌గా కనపడుతోంది. పిల్లలతో కలవట్లేదు. లంచ్ కూడా సరిగ్గా తినట్లేదల్లే ఉంది. ఏమైందో కనుక్కోవడానికి యాజ్ ఏ టీచర్ నా ప్రయత్నం నేను చేశాను. గమ్మున ఉంటోంది తప్ప పెదవి విప్పట్లేదు. మీరూ వర్కింగ్కదా.. బహుశా మిమ్మల్ని మిస్ అవుతుందేమో... చూడండి...’ అని టీచర్ సజెస్ట్ చేసింది. కూతురు కళ్లల్లో భయం ఫోన్ కాల్ కట్ అయ్యాక ఆఫీస్‌కి సగం దూరంలో ఉన్న సరిత స్కూల్‌కి రూట్ మార్చుకుంది. దారంతా నిహారిక గురించిన ఆలోచనలే చుట్టుముట్టాయి ఆమెను. నిజమే.. తనూ గమనిస్తోంది! తను సాయంకాలం ఇంటికి రాగానే గట్టిగా వాటేసుకుంటోంది. తన వెన్నంటే తిరుగుతోంది. రాత్రి స్నానానికి వెళితే కూడా బాత్రూమ్ డోర్ దగ్గరే నిలబడి ఉంటోంది. ఆరేళ్ల పిల్ల అంతలా అంటిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. పాపకు ఊహ తెలిసినప్పటి నుంచే తను, ప్రకాష్ ఇద్దరూ నిహారికను ప్రిపేర్చేశారు... వర్కింగ్ పేరెంట్స్ చైల్డ్‌గా ఎలా ఉండాలో... తన పని తాను ఎలా చేసుకోవాలో... ఇంట్లో ఎవరూ లేకపోతే భయపడకుండా ఎలా ఉండాలో... ఫోన్లో ఎలా మాట్లాడాలో... తన వివరాలు ఎలా చెప్పాలో... అన్నీ నేర్పించారు. సహజంగానే చురుకుదనం ఉన్న పిల్ల. ఇన్ని రోజులుగా దేనికీ భయపడలేదు. ఇప్పుడీ సడెన్ ఛేంజ్ ఏంటీ? నిజంగానే అమ్మానాన్న తనతో గడపట్లేదని దిగులు పడుతోందా? స్కూల్లో ఏమన్నా స్ట్రెస్ ఫీలవుతోందా? అన్నీ ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో ఒక్కర్ని కంటేనే చక్కగా పెంచగలమని నిహారిక ఒక్కతే చాలనుకున్నారు. బహుశా తనకు తోడులేక ఏమన్నా ఒంటరితనం ఫీలవుతోందా? విషయాన్ని ప్రకాశ్‌కి చెప్పి పాప దిగులు, భయం, డల్‌నెస్ వెనక కారణం కనుక్కోవాల్సిందే అని నిర్ణయించుకుంది సరిత. ఆ ఆలోచనలకు, తన ప్రయాణానికి బ్రేక్ వేసింది స్కూల్ రావడంతో! నానమ్మకు కబురు ‘ప్రకాశ్... దాన్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. సంభాళించడం నా వల్ల కాదు. మీ అమ్మను పిలువ్ ప్లీజ్’.. ఎంతో కష్టమ్మీద కూతుర్ని నిద్రపుచ్చి మంచం మీదే కూర్చున్న ప్రకాశ్ భుజమ్మీద తలవాల్చింది సరిత బేలగా. ‘ఏమయిందంటావ్?’ ఓ చేత్తో సరితను పొదివి పట్టుకుంటూ మరో చేత్తో కూతురి తల నిమురుతూ అన్నాడు ప్రకాశ్. ‘తెలియట్లేదు. ఎంత అడిగినా నోరు విప్పదు. చూస్తున్నావ్‌గా రెండు రోజుల్నుంచి నా ఒళ్లు దిగలేదు. గట్టిగా హత్తుకుని ఉంటోంది. ఏమైందమ్మా అంటే చెప్పదు. దాన్ని మామూలు పిల్లను ఎలా చేయాలో అర్థం కావట్లేదు. అత్తయ్యను పిలిపించు ప్రకాశ్’ అంటూ ఒక్కసారిగా ఏడ్చేసింది సరిత. కథలు... గోరుముద్దలు కొడుకు, కోడలి నుంచి ఫోన్ రాగానే హుటాహుటిన బయలుదేరింది వసంత. అత్తను చూడగానే బోరుమంది కోడలు. మనవరాలి మొహం చాటంతయింది. కూతురి మొహంలోని చిరునవ్వును చూసి అమ్మను పిలిపించడం మంచి పనే అయింది అనుకున్నాడు ప్రకాశ్. తెల్లవారి నుంచే ఆఫీస్‌లకు హాజరవ్వడం మొదలుపెట్టారు ఆ ఆలుమగలు. పాపకు ఇంకో వారం సెలవు పొడిగించారు. చక్కటి కథలతో కమ్మటి గోరుముద్దలు తినిపించసాగింది వసంత. ఆట, పాటతో రెండు రోజుల్లోనే మనవరాలి మనసులో బెరుకు పోగొట్టింది. ఆ పసిదాని భయానికి కారణమేమై ఉంటుందా అని ఆలోచించసాగింది. ఆమె దృష్టి ముందుగా నిహారిక స్కూల్‌కి వెళ్లే ట్రాన్స్‌పోర్టేషన్ మీద పడింది. స్కూల్ బస్‌లో వెళ్తుంది. 30 మంది పిల్లల మధ్య వెళ్తుంది. కొలిక్కిరాని ఆలోచనలు ‘ఏమ్మా..! స్కూల్ బస్‌లో వెళ్తుంటే పిల్లలతో నువ్వేమైనా గొడవ పడ్డావా?’ అడిగింది ఒకరోజు రాత్రి అన్నం తినిపిస్తూ! ‘ఉహూ’ చెప్పింది నిహారిక. ‘మరి స్కూల్లో టీచర్లు, నీ ఫ్రెండ్స్ ఏమన్నా అంటున్నారా?’ ప్రశ్నించింది. దానికి తల అడ్డంగా ఊపింది అమ్మాయి. అన్నం తినిపించడం అయిపోయాక మనవరాలి మూతి కడిగి పడుకోబెడుతూ ఇంటి పరిసరాల మీదకు తన ధ్యాసను మళ్లించింది నానమ్మ. ఇండిపెండెంట్ హౌజ్. కొడుకు, కోడలు, మనవరాలు, ఆ ఇంటిని ఇరవైనాలుగ్గంటలూ కాపలాకాసే వాచ్‌మన్. అతని వయసు యాభై ఏళ్లు. నమ్మకస్తుడే. ‘ఇంట్లోకి దోమను కూడా దూరనివ్వడు. పిల్లను కంటికి రెప్పలా కాచుకుంటాడు’ అని చెప్పారు కొడుకు, కోడలు. ఇక పనిమనిషి. ఈ పిల్ల వెళ్లిపోయాక వస్తుంది. దీన్ని బెదిరించి, భయపెట్టే ఆస్కారమే లేదు. ఆమె ఈ ఆలోచనల్లో సీరియస్‌గా ఉన్నప్పుడే... నిహారిక మూలుగు వినిపించింది. బాత్రూమ్లోంచి. ఎప్పుడు వెళ్లిందో బాత్రూమ్లోకి... ఆ మూలుగుతో ఈ లోకంలోకి వచ్చింది వసంత. గభాల్న బాత్రూమ్లోకి పరిగెత్తింది. వెక్కివెక్కి ఏడ్చిన చిన్నారి ‘నానమ్మా... నొప్పి’ అంటూ విలవిల్లాడసాగింది పిల్ల. ‘అయ్యో.. తల్లీ.. ఎక్కడే. కడుపునొప్పా?’ అంటూ పొట్ట చూసింది. ‘కాదు నానమ్మా.. ’ అంటూ నొప్పి ఎక్కడో చూపించింది. తొడల దగ్గర ఏ చీమ అయినా కుట్టిందేమో అంటూ కలవర పడింది వసంత. ‘నానమ్మా.. పాస్‌కి వెళ్లినప్పుడల్లా నొప్పెడుతోంది’ అంటూ కన్నీళ్లతో చెప్పింది నిహారిక. ఏమీ అర్థంకాక అయోమయంలో పడింది వసంత. చూద్దామని పరీక్షించి గాభరా పడిపోయింది. తొడల దగ్గర ప్రాంతం కందిపోయింది. వెనక భాగమంతా గాట్లు! వసంతకు వణుకు వచ్చేసింది. తను వచ్చిన దగ్గర్నుంచీ చూస్తోంది. బాత్రూమ్కి వెళ్లి వచ్చినప్పుడల్లా పిల్ల మొహం పాలిపోయి ఉంటోంది. కళ్లల్లో ఏదో బాధ. ఇప్పుడర్థమైంది. బెడ్రూమ్లోకి వచ్చి పాపను ఒళ్లోకి తీసుకొని హత్తుకుంది. ‘ఏమైంది నాన్నా.. ’ అంటూ అనునయించింది. అంతే ఆ పాప గట్టిగా నానమ్మను వాటేసుకొని వెక్కివెక్కి ఏడ్చింది. విషయమంతా చెప్పింది. ‘నేను వచ్చేసాను కదా.. నీకింకేం భయంలేదు. ఇంక అలా జరగదు’ అంటూ ఆ పిల్లకు అభయమిచ్చి పడుకోబెట్టింది. నిశ్చేష్టులైన తల్లిదండ్రులు! కొడుకు, కోడలి గది తలుపు కొట్టింది. సరిత తలుపు తీసింది. ఎదురుగా ఉన్న అత్తగారిని చూసి... ‘ఏమైందత్తయ్యా... పాప మళ్లీ ఏమైనా భయపడుతోందా?’ అడిగింది కంగారుగా. ‘కాదు, భయమేస్తోంది అంటూ... లోపలికి వెళ్లి మనవరాలు చెప్పిన విషయాన్ని వాళ్ల చెవిన వేసింది. హతాశులయ్యారు భార్య, భర్త. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు ప్రకాశ్. ఆవేశంగా వాకిట్లోకి నడిచాడు. వాచ్‌మన్ గదిలోకి వెళ్లి వాచ్‌మన్‌ను బరబరా బయటకు లాక్కొచ్చాడు. ‘రాస్కెల్ మా సొంత మనిషివని నమ్మి స్కూల్ నుంచి రాగానే పాప బాధ్యతను నీకు అప్పగిస్తే నువ్ చేసేది ఇదా?’ అంటూ కొట్టబోయాడు. వసంత అడ్డుకుంది. దుఃఖంతో కుంగిపోయాడు ప్రకాశ్. తేరుకొని పోలీస్కంప్లయింట్ ఇవ్వడానికి వెళ్లాడు. పెడోఫిలియా అంటే? అమ్మానాన్న ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావడంతో పరిచితుల వికృతచేష్టలకు పిల్లలు బలికావడం ఎక్కువైంది. మన ఇంట్లో సొంత వ్యక్తులు మొదలు... బాగా తెలిసినవారు, ఇంట్లోకి చొరవగా చొచ్చుకుపోయేవారు, తరచుగా వచ్చే స్నేహితుల వరకు... ఎవరో ఒకరి నుంచి పిల్లలు లైగింక వేధింపులు ఎదుర్కొంటున్న ఘటనలు ఎక్కువయ్యాయి. కాబట్టి అపరిచితులనే కాదు, పరిచితులను కూడా బాగా గమనించాలి. వాళ్లలో కొంతమంది ‘పెడోఫిలియా’ అనే మానసిక రుగ్మతను కలిగి ఉండొచ్చు. అలాంటి వాళ్లు పసిపిల్లలను హింసిస్తూ లైంగికానందాన్ని పొందుతారు. పై కేస్‌లో వాచ్‌మన్ చేసింది ఇదే. ఇలాంటి హింస వల్ల పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతిని వాళ్ల ఎదుగుదల మీద ప్రభావం చూపెడుతుంది. అందుకే ఈ నేరాల నుంచి పిల్లలను సంరక్షించేందుకు 2012లో పోక్సో యాక్ట్ (లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం) తెచ్చారు. దీని ప్రకారం నేరస్తుడికి ఏడేళ్లు జైలు శిక్ష, కొన్నిసార్లు యావజ్జీవ కారాగారశిక్ష పడుతుంది. ఇంకొన్నిసార్లు ఈ శిక్షలతో పాటు జరిమానా కూడా విధించవచ్చు. – ఇ. పార్వతి, అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్, parvathiadvocate2015@ gmail.com – సరస్వతి రమ -
ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహిద్దాం
- అదనపు క్లస్టర్లను గుర్తించండి - రాయలసీమ కన్సల్టెంటు సుబ్బారావు సూచన కర్నూలు(అగ్రికల్చర్): వచ్చే ఖరీప్ సీజన్లో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రకృతి వ్యవసాయం రాయలసీమ జిల్లాల కన్సల్టెంటు సుబ్బారావు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని డ్వామా సమావేశ మందిరంలో సీఏలు, సీఆర్పీలు, ఆత్మ బీటీఎం, ఏటీఎంలతో ఆయన సమావేశమయ్యారు. ప్రకృతి వ్యవసాయం చేపట్టేందుకు ముందుగా వేసవిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వేసవి దుక్కులను ప్రోత్సహించాలని, ఇందువల్ల పంటలకు హాని చేసే పురుగులను చాలావరకు నివారించుకోవచ్చన్నారు. వాలుకు అడ్డంగా దున్నుకునేలా రైతులకు సూచనలు ఇవ్వాలన్నారు. ఇందువల్ల వర్షపు నీరు భూమిలోకి బాగా ఇంకిపోతుందన్నారు. ఖరీప్ సీజన్లో గత ఏడాది కంటే మరింత సమర్థవంతంగా ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టాలన్నారు. ఇంత వరకు జిల్లాలో 11 క్లస్టర్లలోనే ఈ వ్యవసాయాన్ని చేపడుతున్నామని, వచ్చే ఖరీప్‌లో మరిన్ని క్లస్టర్లలో చేపట్టాలని తెలిపారు. రసాయన ఎరువులు, పురుగు మందులు విచ్చలవిడిగా వాడుతున్నందునా పెట్టుబడి వ్యయం పెరుగుతోందని, పండిన పంటల్లో పురుగు మందుల అవశేషాలు ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ కారణంగా వ్యవసాయ దిగుబడులకు మార్కెట్లో ఆశించిన ధరలు లభించడం లేదని వివరించారు. ప్రకృతి వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగుమందులకు తావులేదని, కేవలం ద్రవ,ఘన జీవామృతాలు, కషాయాలతో పంటలు పండించడం జరుగుతోందని తెలిపారు. సమావేశంలో ఆత్మపీడీ రవికుమార్, డీడీఏలు మల్లికార్చునరావు, గణపతి, డీపీఎం నాగరాజు, నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తులు తదితరులు పాల్గొన్నారు. -
గల్ఫ్ ఆఫ్ అలస్కాలో మిరాకిల్ సీ
-
ప్రకృతి ‘పొత్తు’ పొడిచింది!
ఖర్చు తగ్గి.. దిగుబడి పెరిగింది! విత్తన మొక్కజొన్న ప్రకృతి సేద్యంలో అద్భుత ఫలితాలు తొలి ఏడాదే ఎకరాకు 3 టన్నుల దిగుబడి జీవామృతం, పంచగవ్య, కషాయాల వాడకంతో భారీగా తగ్గిన ఖర్చు ప్రకృతి సేద్యంతో పెరిగిన నికరాదాయం రసాయన సేద్యంతో నికరాదాయం క్షీణించిన తరుణంలో లాభసాటి వ్యవసాయానికి పెట్టుబడి లేని ప్రకృతి సేద్య పద్ధతులే మేలని భావించాడు రైతు గుండుగొలను రవి. సీడ్ మొక్కజొన్న సాగులో ఖర్చు భారీగా తగ్గించుకోవటంతో పాటు తొలి ఏడాదే అధిక దిగుబడి సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం సాగిపాడు ఆయన స్వగ్రామం. మొక్కజొన్నను 2015లో రెండెకరాల్లో రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తే ఖర్చు తడిసి మోపెడైనప్పటికీ దిగుబడి మాత్రం టన్నుకు మించలేదు. తీవ్రంగా నష్టపోయిన పరిస్థితుల్లో వ్యవసాయ అధికారుల సూచనల మేరకు ప్రకృతి సేద్యంలో విత్తన మొక్కజొన్న సాగుకు శ్రీకారం చుట్టారు. 2016 అక్టోబర్ 15న రెండెకరాల్లో మొక్కజొన్న పంటను విత్తుకున్నారు. దుక్కిలో ఎకరాకు క్వింటా ఘనజీవామృతం వేసుకున్నారు. నెల రోజుల దశలో కూలీలతో కలుపు తీయించారు. డ్రిప్పు ద్వారానే సాగు నీటితో పాటు జీవామృతం అందించారు. ఎకరాకు 200 లీటర్ల చొప్పున ఐదుసార్లు ఇచ్చారు. అయితే, పొత్తు పొడవు పెరగటానికి, గింజ బరువు రావటానికి ఒకసారి పంచగవ్యను వాడారు. 200 లీటర్ల నీటికి 6 లీటర్ల పంచగవ్య కలిపి ఇచ్చారు. చీడపీడల నివారణ కు 6 లీటర్ల నీమాస్త్రం, 20 లీటర్ల్ల పుల్లమజ్జిగ, అర ‡లీటరు కోడిగుడ్డు, నిమ్మరసం ద్రావణం 200 లీటర్ల నీటిలో కలిపి పైరుపై పిచికారీ చేశారు. ఖర్చు తగ్గి.. దిగుబడి పెరిగింది! రసాయన సేద్యంతో పోల్చితే ప్రకృతి సేద్యంలో ఖర్చు సగానికి తగ్గింది. అంతేకాదు, దిగుబడి తగ్గకపోగా పెరిగింది. ప్రకృతి సేద్యం ప్రారంభించిన తొలి ఏడాది కూడా దిగుబడి ఏమాత్రం తగ్గకపోవటం విశేషం. తోటి రైతులకు రసాయన సేద్యంలో ఎకరా సాగుకు రూ. 23 వేలు ఖర్చయింది. 28 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రకృతి సేద్యంలో మొక్కజొన్న సాగుకు ఎకరానికి సేంద్రియ ఎరువులు, కషాయాలకు రూ. 2 వేలతోపాటు మొత్తం రూ. 12 వేలు ఖర్చు అయింది. 2 క్వింటాళ్లు అదనంగా 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. టన్ను రూ. 16 వేల చొప్పున ధర పలికింది. రసాయన సేద్యం చేసిన మొక్కజొన్న రైతులకు ఎకరాకు రూ. 20 వేల నికరాదాయం లభించగా.. ప్రకృతి సేద్యం చేసిన రవికి సుమారు రూ. 35 వేల నికరాదాయం లభించడం విశేషం. కషాయాలను విక్రయించే షాపును ఏర్పాటు చేయడం ద్వారా తోటి రైతులను ప్రకృతి సేద్యం వైపు మళ్లించేందుకు ఆయన తన వంతు కృషి చేస్తున్నారు. – వైవీఎస్ రామచంద్రరావు, సాక్షి,కామవరపుకోట, పశ్చిమ గోదావరి జిల్లా ప్రకృతి సేద్యంపై నమ్మకం కుదిరింది! గతేడాది సీడ్ మొక్కజొన్న సాగులో ఎకరాకు రూ. 25 వేల వరకు ఖర్చు చేసినా తగినంత దిగుబడి రాక నష్టపోయా. ప్రకృతి సేద్యంపై నమ్మకం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో సొంత పొలంలో ఈ ఏడాది ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేపట్టా. ఖర్చు సగానికి తగ్గింది. దుక్కి, కూలీలు తదితర ఖర్చులన్నీ కలిపి రూ. 12 వేలు ఖర్చు అయింది. తొలి ఏడాదే 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దీంతో నమ్మకం కుదిరింది. తోటి రైతులు కూడా ఈ విధానంతో బాగుపడాలని కోరుకుంటూ జీవామృతం, కషాయాలను తయారు చేసి రైతులకు విక్రయిస్తున్నా. – గుండుగొలను రవి (97041 70606),ప్రకృతి వ్యవసాయదారుడు, సాగిపాడు,కామరపుకోట మండలం, పశ్చిమ గోదావరి జిల్లా రసాయన సేద్యంలో ఎకరాకు రూ. 25 వేల ఖర్చు నా సొంత పొలం రెండెకరాల్లో సీడ్ మొక్కజొన్న సాగు చేశాను. 15 బస్తాల రసాయనిక ఎరువులు వాడా. పురుగుమందులకు బాగా ఖర్చయింది. ఎకరాకు రూ. 25 వేల ఖర్చు వచ్చింది. 28 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. – బి. వెంకటేశ్వరరావు(89788 05492), రసాయనిక వ్యవసాయదారుడు, సాగిపాడు, కామరపు కోట మం.,ప. గో. జిల్లా -
ప్రకృతి..వికృతి
- ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహకాలు ఇవ్వని ప్రభుత్వం - శిక్షణల పేరుతో రూ.50 లక్షలకు పైగా వృథా వ్యయం - దేశవాళి ఆవులు లేవు.. ఎన్‌పీఎం షాపులూ లేవు - ప్రభుత్వ చర్యలతో నీరుగారుతున్న రైతుల ఉత్సాహం కర్నూలు(అగ్రికల్చర్): ప్రకృతి వ్యవసాయం పేరుతో ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అయితే రైతులకు మాత్రం ఎలాంటి చేయూత ఇవ్వడం లేదు. వ్యవసాయ సీజన్ ముగిసినా 2016–17 సంవత్సరానికి సంబంధించి ప్రోత్సాహకాలు అందించలేదు. పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయంపై జిల్లాలో రైతులు ఆసక్తి చూపుతున్నారు. సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా 100 మంది అన్నదాతలు అద్భుత దిగుబడులు సాధిస్తున్నారు. ఈ విషయం తెలిసి ప్రభుత్వం కూడా రైతులను ప్రోత్సహించేందుకు పూనుకుంది. జిల్లాలోని ఏడు మండలాల్లో 11 క్లస్టర్లు ఏర్పాటు చేసింది. ఒక్కో క్లస్టర్లో 300 మంది రైతులతో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టింది. జిల్లా స్థాయిలో డీపీఎం, క్లస్టర్‌కు ఒక అసిస్టెంట్‌ను నియమించింది. ఆత్మ సిబ్బంది కూడా ప్రకృతి వ్యవసాయం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రైతులకు చేయూత ఇవ్వాల్సింది ఇలా.... ప్రకృతి వ్యవసాయంలో దేశవాళి ఆవు కీలకం. ఆవు మూత్రం, పేడలతో ద్రవ, ఘన జీవామృతాలు తయారు చేసుకుంటారు. ప్రతి క్లస్టర్‌కు 30 దేశవాళి ఆవులు సబ్సిడీపై పంపిణీ చేయాల్సి ఉంది. ఒక్కో ఆవుకు ప్రభుత్వం రూ.10వేలు సబ్సిడీ ఇస్తుంది. ప్రతి క్లస్టర్లో ఐదు ఎపీఎం షాపులు ఏర్పాటు చేయాల్సి ఉంది. రైతులు.. జీవామృతం, ఇతర కషాయాలను స్వంతంగా తయారు చేసుకోలేకపోతున్నందున నామమాత్రపు ధరలతో వీటిని పంపిణీ చేయాలనే ఎన్‌పీఎం షాపులను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి రూ.50వేలు ప్రకారం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ప్రకృతి వ్యవసాయంలో సాంకేతికత జోడించేందుకు ప్రతి క్లస్టర్‌కు ఒక కస్టమ్ హయరింగ్ సెంటరును ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో రోటోవేటర్ తదితర ఆధునిక వ్యవసాయ పరికరాలు ఉంటాయి. వీటికి రూ.5 లక్షలు సబ్సిడీ ఇస్తుంది. అందని ప్రోత్సాహకాలు.. వ్యవసాయశాఖ.. ప్రకృతి వ్యవసాయానికి 2015–16లోనే ప్రణాళికలను సిద్ధం చేసుకొని 2016–17లో అమలులోకి తీసువచ్చింది. ఈ ఏడాది వ్యవసాయ సీజన్ కూడా పూర్తి అయింది. 2017–18 వ్యవసాయ సీజన్‌కు కూడ రైతులు సిద్ధం అవుతున్నారు. కాని 2016–17 సంవత్సరానికి సంబంధించి రైతులకు అందించిన ప్రోత్సాహం సున్నానే... దేశవాళి ఆవులు లేవు, ఎన్‌పీఎం షాపుల జాడే లేదు. కస్టమ్ హయరింగ్ సెంటర్లు లేవు. ఈ పరిస్థితుల్లో రైతులు ప్రకృతి వ్యవసాయంలో ఏ విధంగా రాణిస్తారో వ్యవసాయ యంత్రాంగానికే తెలియాలి. ప్రతి క్లస్టర్లో 300 మంది రైతులతో ప్రకృతి వ్యవసాయ చేపట్టాలని నిర్ణయించినా అది సాధ్యం కాలేదు. వచ్చే ఏడాది ఇవే క్లస్టర్లలో 750 మంది రైతులతో ఈ వ్యవసాయం చేపట్టాలని నిర్ణయించారు. ఎలాంటి ప్రోత్సాహాలు ఇవ్వకపోవడంతో రైతులు ఆసక్తి చూపడం లేదు. శిక్షణలకు రూ.50 లక్షల పైమాటే... క్షేత్ర స్థాయిలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేపట్టిన రైతులకు ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వకపోయినా.. శిక్షణల పేరుతో అడ్డుగోలుగా నిధులు వ్యయం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇందుకు రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. నిధులు భారీగా దుర్వినియోగం అవుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ప్రతి నెలా ప్రకృతి వ్యవసాయం పేరుతో శిక్షణ కార్యక్రమాలు జరుగుతునే ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో రైతులకు మాత్రం చేయూత కరువు అవుతోంది. చర్యలు తీసుకుంటాం: నాగరాజు, డీపీఎం దేశవాళి ఆవులు కొనుగోలు చేసినట్లు పశువైద్యులు, ఏడీఏలు ధ్రువీకరించాల్సి ఉంది. వీరి దగ్గరి నుంచి తగిన నివేదికలు వస్తే సబ్సిడీ విడుదల చేస్తాం. ఎన్‌పీఎం షాపుల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. 2016–17కు సంబంధించి మాత్రం ఇంతవరకు రైతులకు సబ్సిడీలు విడుదల కాలేదు. ప్రోత్సాహకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటాం. -
ఓర్వకల్లు మండలంలో ప్రకృతి వ్యవసాయం
కర్నూలు(అగ్రికల్చర్): ఓర్వకల్లు మండలాన్ని మొత్తాన్ని ప్రకృతి వ్యవసాయం కిందకు తీసుకొస్తున్నట్లు జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ, ఓర్వకల్లు మండల ఐక్య సంఘం గౌరవ అధ్యక్షురాలు విజయభారతితో కలసి మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టనున్నట్లు వివరించారు. జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ దత్తత తీసుకున్న దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామంలోనూ రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయించనున్నట్లు తెలిపారు. -
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం
- క్లస్టర్ అసిస్టెంట్లకు డీపీఎం ఆదేశాలు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ నాగరాజు సూచించారు. వ్యవసాయశాఖ సమావేశ మందిరంలో మంగళవారం క్లస్టర్ అసిస్టెంట్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఖరీప్‌లో ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంగా చేపట్టాలని, అందుకోసం ఇప్పటి నుంచే రైతులను చైతన్య పరచాలన్నారు. 2016-17లో ప్రకృతి వ్యవసాయంలో సాధించిన ప్రగతిని ఇతర రైతులకు వివరించి అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో వ్యవసాయాధికారి శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి అందాల తీరం సూర్యలంక
ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్నివాస్ గోయిల్ బాపట్ల: సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు సూర్యలంక కేరాఫ్ అడ్రస్‌గా ఉంటుందని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్నివాస్ గోయిల్ అన్నారు. శనివారం రాత్రి ఢిల్లీ ఎమ్మెల్యేలతో కలిసి సూర్యలంక తీరానికి చేరుకున్న స్పీకర్ ఆదివారం ఉదయం తీరంలో పర్యటించారు. స్పీకర్‌ను హరితా రిసార్ట్స్‌లో బాపట్ల ఎంపీపీ మానం విజేత మర్యాద పూర్వకంగా కలిసి దుశ్శాలువాలతో సత్కరించారు. తీరంలో పర్యటించిన వారిలో ఢిల్లీ ఎమ్మెల్యేలు అల్కాలంబ, పరిమళచూసెస్, భావనగౌరే, టీడీపీ రాష్ట్ర నాయకుడు మానం బ్రహ్మయ్య ఉన్నారు. -
పదో వంతు ఖర్చుతోనే ప్రకృతి సేద్యం!
కూరగాయలు, బొప్పాయి, అరటి సాగులో రాణిస్తున్న గుంటూరు జిల్లా రైతు జీవామృతం, కషాయాలతోనే సేద్యం.. ప్రకృతి సేద్యంతో భారీగా తగ్గిన సాగు ఖర్చు అభ్యుదయ పంథాలో అలుపెరగని ఆయన సేద్య ప్రస్థానానిది మూడు దశాబ్దాల చరిత్ర.ఉన్నత చదువులు చదివి వారసత్వంగా వ్యవసాయాన్ని చేపట్టిన ఆయన అమృత హస్తాల్లో పలు పంటలు చివుర్లు తొడిగాయి. పెరిగిన ఖర్చులు తరిగిన దిగుబడులతో రేపిన ఆలోచన ఆయనను ప్రకృతి సేద్యం చేసేందుకు ప్రేరేపించాయి. ప్రకృతి సేద్యంలో కూరగాయల సాగుతో వినియోగదారులకు ఆత్మబంధువుగా మారారు ఆరుమళ్ల సాంబిరెడ్డి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి ఆయన స్వగ్రామం. డిగ్రీ వరకు చదివి వారసత్వంగా వ్యవసాయాన్ని చేపట్టారు. స్వీట్‌కార్న్, కీరదోస వంటి పంటలను ఈ ప్రాంతంలోనే తొలిసారిగా సాగు చేసిన ఘనత సాంబిరెడ్డిది. సుభాష్ పాలేకర్ తరగతులకు హాజరై పుడమికి, మనిషికి ప్రకృతి సేద్యమే రక్ష అని తెలుసుకున్నారు. గత మూడేళ్లుగా ఆరెకరాల తన నల్లరేగడి పొలంలో తోటకూర, గోంగూర, పాలకూర, బచ్చలి, చుక్కకూర, మెంతి, పుదీనా, కొత్తిమీర వంటి ఆకుకూరలను... సొర, వంగ వంటి కూరగాయలు... బొప్పాయి, అరటి వంటి పండ్లతోటలను సాగు చేస్తున్నారు. సొర, వంగలో అంతర పంటలుగా ఆకుకూరలు సొర, వంగ పంటలను సాంబిరెడ్డి ఎకరంలో సాగు చేస్తున్నారు. రెండు విడతలుగా పంట చేతికొచ్చేలా 25 సెంట్ల మడుల్లో సాగు చేస్తున్నారు. తొలకరిలో పశువుల ఎరువు వేసి పొలాన్ని సిద్ధం చేసుకొని ముందుగా ఆకుకూరల విత్తనాలు చల్లుతారు. తరువాత సొర, వంగ విత్తనాలను బీజామృతంతో విత్తనశుద్ధి చేసుకుంటారు. బోదెల మధ్య 8, మొక్కల మధ్య నాలుగు అడుగుల ఎడం ఉండేలా విత్తుకొని, పొలమంతా తడిచేలా నీటి తడి ఇస్తారు. ప్రతి 15 రోజులకోసారి 200 లీటర్ల జీవామృతం నీటి ద్వారా అందిస్తారు. చీడపీడల నివారణకు 20 లీ. నీటికి 50 మి. లీ. దశపత్ర కషాయం పిచికారీ చేస్తారు. శిలీంధ్ర నాశనిగా 20 లీటర్ల నీటికి పావు లీటరు పులిసిన మజ్జిగను కలిపి పిచికారీ చేస్తున్నారు. పావు ఎకరాలో 5 వేల సొరకాయలు కాస్తున్నాయి. పావు ఎకరాలో సాగుకు రూ. 5 వేలు ఖర్చవుతోంది. కాయ రూ. 10– 15 చొప్పున రూ. 50 –70 వేల వరకు ఆదాయం లభిస్తోంది. వంగలో పావు ఎకరాలో పంటకు 13 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. కిలో రూ. 20–30 చొప్పున విక్రయిస్తున్నారు. సాగు ఖర్చులు రూ. 5 వేలు పోను రూ. 25 వేల వరకు నికరాదాయం లభిస్తోంది. అంతర పంటలుగా సాగుచేసిన ఆకుకూరల ద్వారా రూ. 10 వేలు అదనపు ఆదాయంగా సమకూరుతోంది. బొప్పాయి, అరటిలో సగానికి తగ్గిన ఖర్చు.. హైబ్రిడ్ బొప్పాయి పంటను సాంబిరెడ్డి రెండెకరాల్లో సాగు చేస్తున్నారు. గతేడాది జూలైలో మొక్కలు నాటుకున్నారు. సాళ్ల మధ్య ఆరడుగులు, మొక్కల మధ్య ఏడడుగులు ఉండేలా ఎకరాకు వెయ్యి మొక్కలు నాటుకున్నారు. 15 రోజులకోసారి డ్రిప్ ద్వారా మొక్కలకు నీరందిస్తున్నారు. తడి ఇచ్చినప్పుడు పాదుల్లో మొక్కకు అర లీటరు చొప్పున జీవామృతం పోస్తారు. 20 లీటర్ల నీటికి 2 లీటర్ల జీవామృతం కలిపి పిచికారీ చేస్తారు. ప్రస్తుతం కాయదశలో ఉంది. గతేడాది జూలైలో హైబ్రిడ్ అరటి కర్పూరం, చక్రకేళిని సాలు విడిచి సాలు పద్ధతిలో నాటుకున్నారు. ప్రస్తుతం పంట గెలల దశలో ఉంది. గతంలో రసాయన ఎరువులు, పురుగుమందులకు ఎకరాకు రూ. 70 వేలు ఖర్చయ్యేది. ప్రకృతి సేద్యంలో రూ. 30 వేలకు తగ్గిందని సాంబిరెడ్డి చెప్పారు. ఏటా ఎకరానికి రూ. లక్ష నికరాదాయం ఎకరంనర పొలంలో వివిధ రకాల ఆకుకూరలను ఆయన సాగు చేస్తున్నారు. ముందుగా పొలాన్ని దుక్కి చేసుకొని పశువుల ఎరువు వేస్తారు. 80 గజాల విస్తీర్ణంలో మడులు చేసుకుంటారు. విత్తనాలను మడుల్లో చల్లి చేతిగొర్రుతో మట్టిలో కలిసేలా దున్ని తడి ఇస్తారు. ఆకుకూరలకు వారం వ్యవధితో నీటి తడులిస్తారు. ఎకరాకు 200–400 లీటర్ల జీవామృతం నీటిద్వారా ఇస్తారు. 15 రోజులకు లీటరు నీటికి 100 ఎం. ఎల్ జీవామృతం, 3 మి.లీ.వేపనూనెను కలిపి ఆకుకూరలపై పిచికారీ చేస్తారు. దోమ నివారణకు గ్రీజు పూసిన పసుపు రంగు అట్టలు వాడతారు. నెల రోజులకు పంట కోతకొస్తుంది. రూ. 5 చొప్పున కట్టలు కట్టి విజయవాడలోని సేంద్రియ కూరగాయలు విక్రయించే షాపులకు అమ్ముతారు. ఎకరా ఆకుకూరల సాగుకు రూ. 20–25 వేల ఖర్చవుతుంది. రూ. 30 వేల వరకు నికరాదాయం లభిస్తుంది. రసాయన సేద్యంలో ఎరువులు, పురుగుమందులకు ఏటా రూ. 3 లక్షల వరకు ఖర్చయ్యేదని.. ప్రకృతిసేద్యంలో రూ. 30 వేలకు మించి అవ్వటం లేదని సాంబిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇలా ఏడాదికి ఐదు పంటల ద్వారా ఎకరాకు రూ. లక్షకు తగ్గకుండా నికరాదాయం పొందుతున్నారు సాంబిరెడ్డి. కూరగాయల నాణ్యత బావుండటం.. పొలం హైవేకు దగ్గరగా ఉండటంతో నిత్యం 200 మంది వినియోగదారులు వాహనాల్లో వచ్చి నేరుగా కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. సాంబిరెడ్డి ప్రకృతి సేద్యం చేస్తున్న తోటి రైతులందరితో కలిసి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఏర్పాటు చేసి విజయవాడలో దుకాణం నిర్వహిస్తున్నారు. – బి.ఎల్. నారాయణ, సాక్షి, తెనాలి, గుంటూరు జిల్లా మూడో ఎడాదికి దిగుబడి పెరిగింది మందుకట్టలు కొని పొలంలో చల్లితే పోయేదానికి ఇంత చాకిరీ చేయాలా అనుకుంటున్నారు కొందరు రైతులు. ప్రకృతి సేద్యంలో మొదటి రెండేళ్లు దిగుబడి తగ్గింది. మూడో ఏడాది రసాయన సేద్యంలో సాగు చేసిన దానికన్నా ఎక్కువ దిగుబడి వచ్చింది. పొలం గుల్లబారింది. నేలలో వానపాములు, తేనెటీగల సంఖ్య పెరిగింది. రసాయన సేద్యం చేసేటప్పుడు వీటి జాడే లేదు. ఖర్చు ఎకరాకు రూ. 20–25 వేల వరకు తగ్గింది. మంచి కూరగాయలు పండిస్తున్నారని కొనుగోలు దారులు అభినందిస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. – ఆరుమళ్ల సాంబిరెడ్డి (94939 21929),కుంచనపల్లి, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా -
చెరకు ప్రకృతి సేద్యంతో బతుకు తియ్యన!
8’ గీ 2’ దూరంలో చెరకు నాటాలి..ఆకులన్నిటికీ ఎండ తగిలితేనే అధిక దిగుబడి సాధ్యం ఆచ్ఛాదన, జీవామృతంతో చక్కని దిగుబడి! ఎకరానికి 40 నుంచి 80 టన్నుల చెరకు దిగుబడి ఖాయం రికవరీ కూడా 9% నుంచి 14%కు పెరుగుతుంది అంతర పంటలతో ఏడాదంతా అదనపు ఆదాయం తెలుగు నాట చెరకు రైతులకు సుభాష్ పాలేకర్ మార్గదర్శనం సాగునీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్న పంటగా వరి తర్వాత స్థానాన్ని చెరకు పంట ఆక్రమిస్తున్నది.కరువు పరిస్థితుల్లో చెరకు సాగు కనాకష్టంగా మారింది. ఈ నేపథ్యంలో చెరకు సాగును ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోకి మార్చుకోవడమే మేలన్న భావన వేళ్లూనుకుంటున్నది. విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలోని ఎన్.సి.ఎస్. సుగర్స్ ఎం.డి. నారాయణం నాగేశ్వరరావు వేలాది మంది రైతులకు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు పద్మశ్రీ డా. సుభాష్ పాలేకర్ చేత ఇటీవల శిక్షణ ఇప్పించారు.ఆయన బొబ్బిలి వచ్చి రెండు రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయంలో చెరకు దిగుబడి ఎకరానికి 40 టన్నుల నుంచి 80 టన్నులకు పెరగడం ఖాయమని పాలేకర్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తున్న చెరకు తోటలు దిగ్విజయంగా ఎకరానికి వంద టన్నులకు పైగా దిగుబడినిస్తున్నాయన్నారు. చెరకు వరుసల మధ్య 8 అడుగుల దూరం పెట్టి.. ఏడాది పొడవునా అనేక అంతర పంటలు సాగు చేయవచ్చు అంటున్నారు. పాలేకర్ చెరకు సాగు పద్ధతి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చెరకు రైతులకు ఉపకరిస్తుందన్న భావనతో.. పాలేకర్ మాటల్లోనే సవివరంగా అందిస్తోంది ‘సాగుబడి’..! చెరకు ‘గ్రామీణి’ కుటుంబంలో గడ్డి జాతికి చెందిన బహువార్షిక మొక్క. గడ్డి మొలిచే ఏ భూముల్లోనైనా చెరకును సాగు చేయొచ్చు. పొలంలో ఒక్కసారి నాటితే వందేళ్లయినా కార్శి తోటలు తీసుకోవచ్చు. మూడేళ్లకే నరికేయాల్సిన పని లేదు. ఇది స్వప్నం కాదు, వాస్తవం. మహారాష్ట్రలో ప్రకృతి వ్యవసాయంలో 12వ కార్శి తోటలు ఉన్నాయి. కావాలనుకుంటే వెళ్లి చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో రైతులు ఎకరానికి 4 టన్నుల చెరకు విత్తనం వాడుతున్నారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో ఎకరానికి కేవలం 240 కిలోల విత్తనం సరిపోతుంది. ఎకరానికి 4.5 క్వింటాళ్ల పంచదారను ఉత్పత్తి చేయగలిగేంత చెరకు విత్తనాన్ని వృథాగా నేలపాలు చేస్తున్నారు. ఇది అర్థం లేని పని. వరుసల మధ్య ఎడాన్ని బట్టి దిగుబడి! చెరకు ‘ఫొటో సింథటిక్’ మొక్క. ప్రతి ఆకుకూ (8,500 నుంచి 12,000 ఫుట్ క్యాండిళ్ల) పూర్తి స్థాయిలో సూర్యరశ్మి అవసరం. మే, జూన్‌లో 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎండనూ తట్టుకొని చెరకు ఆకులు ఆహారోత్పత్తి చేసుకుంటాయి. నీడ పనికిరాదు. చదరపు అడుగులోని చెరకు ఆకులు రోజుకు 12.5 కిలో కేలరీల సౌరశక్తిని గ్రహించగలవు. తద్వారా 2.25 గ్రాముల మేరకు చెరకు గడ పెరుగుతుంది. ఈ విధంగా ఎకరంలో ఏడాదికి 160 కోట్ల కిలో కేలరీల సౌరశక్తిని చెరకు ఆకులు గ్రహిస్తే.. 240 టన్నుల వరకు చెరకు దిగుబడి వస్తుంది. మీరిప్పుడు వరుసల మధ్య రెండు, మూడు అడుగుల దూరం పాటిస్తున్నారు. వరుసల మధ్య 3 అడుగుల దూరం పెడితే 33 శాతం ఆకులపైనే ఎండ పడి, ఎకరానికి 20 టన్నుల దిగుబడి వస్తుంది. 5 అడుగుల దూరం పెడితే 40 టన్నుల దిగుబడి వస్తుంది. 8 అడుగుల దూరం పెడితే కింది ఆకులపైన కూడా పూర్తిగా ఎండపడి, ఎకరానికి 60 టన్నుల దిగుబడి వస్తుంది. 8‘“ 8‘ దూరంలో నాటితే అత్యధిక దిగుబడి వస్తుంది. అయితే, 8’“ 8’ దూరం మరీ ఎక్కువ అనిపిస్తే.. 8‘“ 2‘ దూరంలో నాటుకోండి. ఇందుకోసం ఎకరానికి 2,722 కన్నుల విత్తనం సరిపోతుంది. ఎకరానికి 4 టన్నులకు బదులు 44 గడలను విత్తనంగా వాడితే రూ.11 వేల ఖర్చు తగ్గుతుంది. ఆచ్ఛాదన, జీవామృతంతో చక్కని దిగుబడి! 160 కోట్ల కిలో కేలరీల సౌరశక్తిని ఉపయోగించుకొని ప్రకృతి సేద్యంలో ఎకరంలో ఏడాదికి 240 టన్నుల చెరకు దిగుబడి తీయాలంటే.. భూమిలో సేంద్రియ కర్బనం 2.5% ఉండాలి. కర్బనం, నత్రజని 10:1 నిష్పత్తిలో ఉండాలి. కానీ, మన దేశంలో భూములు రసాయనిక ఎరువుల వల్ల నిస్సారంగా మారాయి. సేంద్రియ కర్బనం 0.07% మాత్రమే ఉంది. భూమిలో సేంద్రియ కర్బనాన్ని పెంచుకునే కొద్దీ పంటల దిగుబడి పెరుగుతుంది. దీన్ని 1%కి పెంచితే ఎకరానికి వంద టన్నుల చెరకు దిగుబడి సాధించవచ్చు. సేంద్రియ కర్బనం జీవనద్రవ్యం (హ్యూమస్) ద్వారా నేలకు అందుతుంది. జీవనద్రవ్యమే భూమికి సారం, దిగుబడి శక్తి, ఉత్పాదక శక్తి. ఆకులు, గడ్డీ గాదం వంటి పంటల అవశేషాలను భూమిలో కలిసి కుళ్లిపోయేలా చేస్తే జీవనద్రవ్యం పెరుగుతుంది. చెరకు ఆకులను తగులబెట్టవద్దు. చెరకు ఆకును పొలంలో వరుసల మధ్య ఖాళీలో వేస్తేనే మట్టిలో జీవనద్రవ్యం తయారవుతుంది. ఆచ్ఛాదన వేయకపోతే జీవనద్రవ్యం తయారు కాదు. మట్టిలో జీవనద్రవ్యం రకరకాల మేలు చేసే సూక్ష్మజీవుల ద్వారా తయారవుతుంది. నాటు ఆవు పేడలో ఇవి పుష్కలంగా ఉన్నాయి. గ్రాము దేశీ ఆవు పేడలో 300 కోట్ల మేలు చేసే సూక్ష్మజీవులున్నాయి. టన్నుల కొద్దీ పేడ ఎరువు అవసరం కూడా లేదు. ఎకరానికి నెలకు 10 కిలోల దేశీ ఆవు పేడతో జీవామృతం తయారు చేసి వాడితే చాలు. పంటల అవశేషాల ద్వారా నేలకు కర్బనం ఎక్కువగా అందుతుంది. గాలిలో 78.6% ఉన్న నత్రజనిని గ్రహించి 36 రకాల సూక్ష్మజీవులు నేలకు అందిస్తాయి. అపరాల పంట వేళ్లలో ఉండే సూక్ష్మజీవులు జీవనద్రవ్యం తయారీకి ఉపకరిస్తాయి. అందువల్ల, చెరకు పొలంలో వరుసల మధ్య ఆకులు, కొమ్మరెమ్మలు, గడ్డీ గాదాన్ని ఆచ్ఛాదనగా వేయడంతోపాటు.. పప్పుధాన్యాలను అంతర పంటలుగా తప్పకుండా వేయాలి. అప్పుడే పంట దిగుబడులనందించే జీవనద్రవ్యం తయారవుతుంది. చెట్లకు కావాల్సిన పోషకాలలో 98.5% గాలి, ఎండ, బ్రహ్మాండ శక్తి (కాస్మిక్ ఎనర్జీ), తేమ ద్వారా ప్రకృతిసిద్ధంగా అందుతున్నాయి. మిగతా 1.5% పోషకాలను ఖనిజాల రూపంలో మొక్కలు మట్టి నుంచి తీసుకుంటున్నాయి. పంచభూతాలు, సూక్ష్మజీవులు, దేశీ ఆవు పేడ ఉంటే చాలు.. మార్కెట్లో వేటినీ కొనకుండానే నిశ్చింతగా ప్రకృతి సేద్యం చేయవచ్చు. చెరకు సాగులో 90% సాగు నీరు ఆదా! పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చెరకు సాగులో డ్రిప్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోకుండానే 90% సాగు నీటిని పొదుపు చేయవచ్చని సుభాష్ పాలేకర్ తెలిపారు. అదెలాగో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. చెరకు సాళ్ల మధ్య 8 అడుగుల దూరం ఉంచాలి. సాళ్ల మధ్యలో 2 అడుగులకు ఒకటి చొప్పున 4 కాలువలు తవ్వుకొని అంతర పంటలు సాగు చేసుకోవాలి (వివరాలకు బొమ్మ చూడండి). చెరకు నాటిన తర్వాత మొదటి 3 నెలల పాటు సాళ్ల మధ్య ఉన్న ఈ 4 కాలువల్లోనూ నీటిని పారించాలి. చెరకు నాటిన 3 నెలల తర్వాత 1వ కాలువకు నీరివ్వడం పూర్తిగా ఆపేయాలి (ఈ కాలువలోనే చెరకు మొక్క నాటి ఉంటుంది). 2, 3, 4 కాలువలకు మామూలుగానే నీరివ్వాలి. – చెరకు నాటిన 6 నెలల తర్వాత.. 2, 4 కాలువలకు కూడా నీరివ్వడం ఆపేసి, 3వ కాలువకు మాత్రమే నీరివ్వాలి. ఇలా చేయడం వల్ల పంట మొక్కల వేళ్లు నీటి తేమ ఉండే 3వ కాలువ వైపే చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేస్తాయి. అప్పుడు వేరు పొడవు పెరుగుతుంది. ఆకుల సంఖ్యతో పాటు ఆహారోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. కాండం పొడవు, చుట్టుకొలత, బరువు పెరుగుతాయి. దిగుబడి పెరుగుతుంది. చెరకు నరకడానికి నెల రోజుల ముందే ఆ ఒక్క కాలువకూ నీరివ్వడం ఆపేయాలి. తద్వారా చక్కెర / బెల్లం దిగుబడి పెరుగుతుంది. 3 కాలువలకు నీరు ఆపేయడంతో 75% సాగు నీరు ఆదా అయ్యింది. ఆచ్ఛాదన ద్వారా మరో 15% తేమ వాతావరణం నుంచి మొక్కలకు అందుతుంది. ఇలా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో 10% నీటి ఖర్చుతోనే పంటల సాగు పూర్తవుతుంది. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ చెరకు, అంతర పంటల సాగు పద్ధతి భూమిని దున్ని సిద్ధం చేసిన తర్వాత చెరకును 8‘ “ 2‘ దూరంలో నాటుకోండి. అతి కొద్ది స్థలంలో 8‘ “ 4‘, 8‘ “ 8‘ దూరంలోనూ నాటుకొని ప్రయోగాత్మకంగా సాగు చేసి చూడండి. తేడా మీకే తెలిసివస్తుంది. చెరకు విత్తనంగా ఒక కన్ను ముచ్చెను నాటుకుంటే చాలు. కన్ను ఆకాశం వైపు చూసేలా నాటాలి. వర్షాధారంగా చెరకు సాగు చేస్తుంటే.. వర్షాకాలం ప్రారంభమయ్యాక జూన్‌లో నాటాలి. సాగు నీరుంటే అక్టోబర్ – నవంబర్, జనవరి – ఫిబ్రవరి తదితర నెలల్లో వీలువెంబడి నాటుకోవచ్చు. చెరకు సాళ్ల మధ్య 8 అడుగుల దూరం తప్పనిసరి. 8 అడుగుల దూరంలో ఉన్న చెరకు సాళ్ల మధ్య.. అంతరపంటల సాగు కోసం 2 అడుగులకు ఒకటి చొప్పున 4 కాలువలు తీసుకోవాలి. పంట ఏదైనా స్థానిక / దేశవాళీ సూటి వంగడాలనే ఎంపిక చేసుకోవాలి. ఇవైతేనే ప్రకృతి సేద్యంలో అధిక దిగుబడినిస్తాయి. విత్తనాలు గానీ, నారు గానీ కచ్చితంగా బీజామృతంతో శుద్ధిచేసిన తర్వాతే నాటాలి. 1వ కాలువ : ఎడమ కింది వైపు ఒంటి కన్ను చెరకు ముచ్చెను నాటుకోవాలి. పైన ఎడమ, కుడి వైపు ఉల్లి / వెల్లుల్లి వేసుకోవాలి. 2వ కాలువ : పైన ఎడమ వైపు పప్పుధాన్యాలు (శనగ, కంది, పొట్టి కంది, పెసర, మినుము, ఉలవ, బీన్స్, చెట్టు చిక్కుడు వంటి ద్విదళ జాతి కూరగాయ పంటలు) విత్తుకోవచ్చు. పైన కుడి వైపున కూరగాయ పంటలు, నూనె గింజలు విత్తుకోవచ్చు. 3వ కాలువ : ఎడమ, కుడి వైపులలో ఏకదళ పంటలైన వరి (సుగంధ వరి వంటి ఔషధ గుణాలున్న దేశీ వంగడాలు వేసుకోవాలి), రాగులు (తైదలు /చోళ్లు) నాటుకోవచ్చు. 4వ కాలువ : ఎడమ వైపు పైన ద్విదళ పంటలైన కూరగాయ పంటలు (మిరప, పసుపు, అల్లం, వంగ, టొమాటో, క్యాలీఫ్లవర్, క్యాబేజి, గోరుచిక్కుడు, చెట్టు చిక్కుడు, బెండ, ఆకుకూరలు), నూనెగింజలు (వేరుశనగ, పొద్దుతిరుగుడు, కుసుమ, నువ్వు, లిన్సీడ్, ఆవాలు, సోయాబీన్స్) విత్తుకోవచ్చు లేదా నాటుకోవచ్చు. కుడి వైపు పైన పప్పుధాన్య పంటలు విత్తుకోవచ్చు. ఆచ్ఛాదన, అంతర పంటల మార్పిడి! చెరకు పంటలో మొదటి రెండు సాళ్ల మధ్య ఆచ్ఛాదన వేస్తే.. తర్వాత రెండు సాళ్ల మధ్య అంతరపంటలు పండించాలి. చెరకు ఒక సీజన్ పూర్తయ్యాక.. గతంలో ఆచ్ఛాదన వేసిన సాలులో ఈ దఫా అంతర పంటలు వేయాలి. గతంలో అంతర పంటలు పండించిన సాలులో ఈ దఫా చెరకు ఆకులు, పిలకలతో ఆచ్ఛాదన చేయాలి. ఆచ్ఛాదనగా వేసే గడ్డీ గాదంలో 25 శాతం పప్పు ధాన్య పంటల వ్యర్థాలు, 75 శాతం వరి, చిరుధాన్యాల పంటల గడ్డి కలిసి ఉండేలా చూస్తే ఉత్తమ ఫలితం ఉంటుంది. మెట్ట పొలాలకు ఘనజీవామృతం మెట్ట పంటల సాగులో ద్రవ జీవామృతాన్ని నేలకు ఇవ్వడం కష్టం కాబట్టి ఘనజీవామృతాన్ని నేలకు ఇవ్వొచ్చు. అనంతపురం జిల్లాలో కరువు కాలంలోనూ వేరుశనగ వర్షాధార సాగులో ఘనజీవామృతం అద్భుత ఫలితాలనిచ్చింది. మన దేశంలోనే కాదు దక్షిణాసియా, ఆఫ్రికా దేశాల్లో ఘన జీవామృతంతో వర్షాధార సేద్యంలో సత్ఫలితాలొచ్చాయి. ఘనజీవామృతం తయారీ పద్ధతి... నాటు ఆవు పేడను ఎండబెట్టి పొడిగా చేసి జల్లెడ పట్టాలి. 200 కిలోల పేడ పొడిని ఒక ప్లాస్టిక్ పట్టాపై పరచి.. దానిపై 20 లీటర్ల ద్రవ జీవామృతాన్ని చల్లాలి. నిలువుగా, అడ్డంగా పారతో కలియదిప్పాలి. ఈ మిశ్రమాన్ని నీడలో 48 గంటల పాటు నిల్వ ఉంచాలి. ఎండ, వాన పడకుండా జాగ్రత్త వహించాలి. కలిపిన 48 గంటల తర్వాత ఘనజీవామృతాన్ని ఎండలో పల్చగా పరచి ఎండబెట్టాలి. రోజుకు 2,3 సార్లు కలియదిప్పుతూ బాగా ఎండేలాæ చూడాలి. తేమ పూర్తిగా ఎండిన తర్వాత.. ఒక చెక్కతో ఉండలన్నింటినీ చితిపి పొడిగా మార్చాలి. గోనె సంచిలో నింపి నిల్వ చేసుకోవాలి. ఘనజీవామృతాన్ని ఏడాది వరకు వాడుకోవచ్చు. చెరకు తోటకు ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతాన్ని దుక్కిలో వేసి కలియదున్నాలి. సీజనల్ పంటలకైతే ఎకరానికి 200 కిలోల చొప్పున వేసుకుంటే చాలు. జీవామృతాన్ని 15 రోజుల వరకు వాడొచ్చు! రసాయనిక ఎరువులే కాదు, పేడ ఎరువు, కంపోస్టు, వర్మీ కంపోస్టు, సూక్ష్మపోషక ఎరువులు వంటివి అసలు వాడకుండానే ప్రకృతి వ్యవసాయం చేయవచ్చు. ఘనజీవామృతం, జీవామృతంలను సొంతంగా రైతులే తయారు చేసి వాడుకుంటే చాలు.. చక్కని పంట దిగుబడులు పొందవచ్చు. జీవామృతం ఎరువు కాదు. మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్యను పంట భూముల్లో ఇబ్బడిముబ్బడిగా పెంపొందించే సంవర్ధనమే (మదర్ కల్చర్ – తోడు) ద్రవ జీవామృతం. జీవామృతాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత 15 రోజుల వరకు వాడుకోవచ్చని సుభాష్ పాలేకర్ ఇటీవల బొబ్బిలిలో చెరకు రైతుల శిక్షణా తరగతుల్లో చెప్పారు.. వివరాలను ఆయన మాటల్లోనే ఇక్కడ పొందుపరుస్తున్నాం.. జీవామృతం తయారీ పద్ధతి పంట ఏదైనా ఎకరానికి ఒక విడతకు 200 లీటర్ల జీవామృతం సరిపోతుంది. ప్లాస్టిక్ డ్రమ్ము లేదా సిమెంటు తొట్టెను నీడలో ఉంచి.. 200 లీటర్ల నీరు పోయాలి. 10 కిలోల దేశీ ఆవు తాజా పేడ కలపాలి (సగం నాటు ఆవు పేడ కచ్చితంగా వాడాలి. సగం నాటు ఎద్దు పేడ వాడొచ్చు. మొత్తం నాటు ఎద్దు పేడ వాడొద్దు). 5–10 లీటర్ల నాటు లేదా దేశీ ఆవు మూత్రం కలపాలి (శాకాహారి అయిన మనిషి మూత్రం కూడా కొంత కలపవచ్చు). కిలో నల్లబెల్లం కలపాలి (నల్ల బెల్లం కాకపోతే ఎర్రటి / పసుపు రంగు బెల్లం వాడొచ్చు. తెల్లని చక్కెరను మాత్రం జీవామృతం తయారీలో వాడొద్దు. బెల్లానికి బదులు తీపి పండ్ల గుజ్జు వాడొచ్చు లేదా 3 లీటర్ల చెరకు రసం లేదా 4 కిలోల చెరకు ముక్కలు వాడొచ్చు). కిలో పప్పుధాన్యాల పిండి కలపాలి. పిడికెడు చేను గట్టు మీద మట్టి లేదా అడవిలోని మట్టి కలపాలి (జీవామృతంలో సూక్ష్మజీవరాశిని పెంపొందించేందుకు మట్టిని కలపాలి). ఇవన్నీ కలిపిన తర్వాత 48 గంటలకు జీవామృతం వాడకానికి సిద్ధమవుతుంది. అప్పటి నుంచి 15 రోజుల వరకు పంటలకు వాడుకోవచ్చు. రోజూ ఉదయం, సాయంత్రం ఒక నిమిషం పాటు కుడి వైపునకు తప్పకుండా కర్రతో కలపాలి. సూక్ష్మజీవరాశి పెంపొందడానికి ఇది చాలా అవసరం. చెరకు తోటలో జీవామృతాన్ని పోసే పద్ధతి నీటిపారుదల సదుపాయం ఉన్న చెరకు తోటలో జీవామృతాన్ని ఎకరం పొలానికి 200 లీటర్ల చొప్పున నెలకు కనీసం ఒకసారి లేదా రెండుసార్లు ఇవ్వాలి. మధ్య మధ్యలో రెండు, మూడుసార్లు ఎకరానికి నెలకు 400 లీటర్ల జీవామృతం ఇవ్వాలి. ప్రకృతి వ్యవసాయంలోకి మారిన తొలి ఏడాది ఎన్ని ఎక్కువ సార్లు జీవామృతాన్ని భూమికి ఇస్తే అంత మంచి ఫలితాలు కనిపిస్తాయి. చెరకు 8‘ “ 8‘ (సాళ్లు, మొక్కల మధ్య 8 అడుగుల దూరం) తోటలో నెలకు ఒకటి లేదా రెండు సార్లు మొక్కకు లీటరు చొప్పున జీవామృతం (నేల మీద పోసేటప్పుడు జీవామృతానికి నీరు కలిపి పలచన చేయాల్సిన అవసరం లేదు) పోయాలి. 8‘ “ 2‘ దూరం పెట్టినప్పుడు నెలకు ఒకటి లేదా రెండు సార్లు మొక్కకు పావు లీటరు చొప్పున పోయాలి. నీటి వసతి లేని మెట్ట పంటలో కూడా జీవామృతం పోసి అద్భుత ఫలితాలు పొందవచ్చు. చెరకుపై జీవామృతం పిచికారీ పద్ధతి 1వ పిచికారీ : చెరకు కన్ను నాటిన తర్వాత 21 రోజులకు మొదటి విడత పిచికారీ చేయాలి. ఎకరానికి 100 లీటర్ల నీటిలో 5 లీటర్ల జీవామృతాన్ని కలిపి పిచికారీ చేయాలి. చెరకు పంటతోపాటు అంతరపంటలపై కూడా పిచికారీ చేయాలి. 2వ పిచికారీ : 1వ పిచికారీ తర్వాత 21 రోజులకు ఎకరానికి 150 లీటర్ల నీటిలో 10 లీటర్ల వడకట్టిన జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. 3వ పిచికారీ : 2వ పిచికారీ తర్వాత 21 రోజులకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 20 లీటర్ల వడకట్టిన జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. 4వ పిచికారీ : 3వ పిచికారీ తర్వాత 200 లీటర్ల నీటిలో 5 లీటర్ల పుల్ల మజ్జిగ కలిపి పిచికారీ చేయాలి. 5వ పిచికారీ : 4వ పిచికారీ తర్వాత 30 రోజులకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 20 లీటర్ల వడకట్టిన జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. 6వ పిచికారీ : 5వ పిచికారీ తర్వాత 30 రోజులకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 20 లీటర్ల వడకట్టిన జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. 5 నెలల తర్వాత మనిషి వెళ్లే ఖాళీ ఉండదు కాబట్టి జీవామృతం పిచికారీ సాధ్యపడదు. -
పల్లె–నగరం మధ్య తేడాలు
నగర గీతం అందమైన సహజ ప్రకృతి.. పల్లె – కృతకమైన అందాల ముల్లె.. పట్నం. పల్లె ఆత్మీయతల సంగమం – నగరంలో ఎవరికి వారే ఏకాకి. పల్లెలో స్వచ్ఛమైన ప్రకృతి – నగరంలో సమస్తం కలుషిత భరితం. పల్లెల్లోని మనుషుల మనసుల్లో మలినం లేదు – నగరాల్లో కుట్రలు, దగాలు, వంచనలు. పల్లెల్లో పరిమళించే మానవత్వం – నగరంలో అంతా యాంత్రికత. పల్లెల్లో డబ్బులేకున్నా పరిచయాలతో పనులు సమకూరుతాయి. నగరంంలో పైసా లేకుండా ఏ పనీ జరగదు. పల్లెల్లో పరస్పర గౌరవ మర్యాదలు – నగరంలో ఎవరూ ఎవ్వరినీ లక్ష్యపెట్టరు. నగర జీవికి తీరిక దొరకదు, కోరిక చిక్కదు. ఇక్కడ జీవితం చాలా ఖరీదైంది. ఎంత సంపాదించినా చాలదు. ఎంత డబ్బున్నా అంతకు మించిన విలాసవంతమైన జీవితం ఊరిస్తూ ఉంటుంది. అందుకే ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకొని డబ్బు సంపాదించాలనుకుంటారు. దీంతో తీరిక సమయం దొరకదు. ఏ కోరికలు నెరవేర్చుకోవడానికి అంత కష్టపడుతుంటారో ఆ అవకాశాలు మాత్రం ఎప్పటికీ అందని ద్రాక్షలాగే ఉండిపోతాయి. ఖరీదైన జీవనశైలి ఇక్కడి మనుషులకు పెను సవాలుగా నిలుస్తుంది. నగర జీవితంలోని ప్రతికూలాంశాలు – కఠిన వర్ణన: జగిత్యాలలో స్వేచ్ఛగా జీవిస్తూ తనకిష్టమైన కవిత్వం, కళారాధనలో హాయిగా గడిపే అలిశెట్టి ప్రభాకర్.. నగర జీవితంలో ఇరుక్కుపోయారు. పేదరికాన్ని, దీనస్థితినే కడుపారా అనుభవించిన ఈ యువ కవి తన అనుభవాలను అక్షరాయుధాలుగా చేసి కవితలు రాశారు. అందుకే ఆయన అనుభవాల్లో నగరంలోని ప్రతికూలాంశాలే ఎక్కువగా ఉన్నాయి. అవి ‘సిటీలైఫ్’ కవితల్లో ప్రతిఫలించాయి. నగరంలో జీవన విధానం: నగరంలో మనిషి జీవితం అంతుచిక్కని అయోమయం. కాలుష్యం కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతుంటుంది. నిరంతరం ప్రమాదాల అంచున ప్రయాణం. ఎప్పుడు, ఎక్కడి నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో చెప్పలేం. కాలంతో పోటీపడుతూ ఉరుకులు–పరుగులు పెట్టడం ఇక్కడి ప్రత్యేకత. ఎవరికీ తీరిక చిక్కదు. తీరని కోరికల చిట్టా పెరుగుతూనే ఉంటాయి. సహజమైన ఆనందం దుర్లభం. అంతా కృత్రిమం, యాంత్రికం, వంచనలమయం. అంతుచిక్కని రసాయనశాల లాంటి నగరంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఒకసారి ఈ పద్మవ్యూహం లాంటి నగరంలో ప్రవేశిస్తే బయటపడటం కష్టం. నగరజీవనం సంక్లిష్టంగా మారడానికి కారణాలు: శరవేగంగా పెరుగుతున్న జనాభా వల్ల సౌకర్యాలు సరిపడకపోవడం, అవసరాలు పెరిగిపోవడంతో జీవనవ్యయం ఖరీదవుతోంది. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి తగినంత డబ్బు సంపాదించడం అవసరమవుతోంది. ఎంత సంపాదించినా చాలడం లేదు. అందుకే పోటీతత్వం పెరుగుతోంది. మనుషుల మధ్య ఆత్మీయతలకు బదులు అంతరం పెరిగిపోతుండటం వల్ల పరస్పరం మర్యాద, నమ్మకం స్థానంలో నిర్లక్ష్యం, వంచన పెరిగిపోతున్నాయి. సంపాదించే యంత్రాలుగా మారుతున్న మనుషుల్లో సున్నితత్వం, సహృదయత కొరవడి అకారణ ద్వేషాలు, పగలు–ప్రతీకారాలు అధికమవుతున్నాయి. ఎవరికి వారే యమునా తీరే. ఒకే కుటుంబంలోని మనుషుల మధ్య కూడా ఆత్మీయతలు లేవు. మమతాభిమానాలు కొరవడ్డాయి. నిర్లక్ష్యం, వేగం, అలసత్వం, బేఖాతరు లాంటి కారణాల వల్ల నిరంతరం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాల బారినపడ్డవాళ్లను పలకరించి, పట్టించుకునేవారు కరువయ్యారు. అందరూ కలిసి జీవిస్తున్నా, ఒకరిపై మరొకరికి నమ్మకం లేకపోవడంతో అందరూ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఇన్ని వైవిధ్యాల నడుమ గడిచే సిటీ జీవితం ఒక రసాయనశాలగా, పద్మవ్యూహంలా నానాటికీ అంతుచిక్కకుండా సంక్లిష్టంగా తయారవుతోంది. పై అంశాల ఆధారంగా ఏ ప్రశ్న వచ్చినా చక్కగా ఆలోచించి జవాబు రాసేందుకు విద్యార్థులు సంసిద్ధం కావాలి. మాదిరి ప్రశ్నలు 1.నగరగీతం పాఠం ఆధారంగా నగర జీవనంలోని మంచి, చెడులను విశ్లేషించండి? (6 మార్కులు) 2.పల్లె ప్రజలు నగరబాట పట్టడానికి కారణాలేమిటి? (3 మార్కులు) 3.పల్లె.. తల్లి ఒడి, పట్టణం.. ఇనప్పెట్టె. ఈ వాక్యాన్ని సమర్థించండి. 3 మార్కులు) 4.నగర గీతం పాఠం ద్వారా అలిశెట్టి ప్రభాకర్ ఏం చెప్పదలచుకున్నారు? (6 మార్కులు) 5.నగరంలోని ప్రతి మనిషీ పఠనీయ గ్రంథం అని కవి పేర్కొనడంలో అంతరార్థమేమిటి? (3 మార్కులు) 6.నగరాన్ని పద్మవ్యూహమని, రసాయనశాల అని కవి ఎందుకు అన్నాడో వివరించండి. (6 మార్కులు) -
చెంగు చెంగున
అమ్మాయి పరికిణీ ఓణీ వేసుకుని ఇల్లంతా పరుగులు తీస్తుంటే... జింకపిల్లలా చెంగుచెంగున గెంతులేసినట్లే అనిపిస్తుంది. లేడికి లేచిందే పరుగు అంటారు. అవునవును. సంక్రాంతికి ఎంగ్ లేడీస్ హాఫ్ శారీ కడితే... ఫుల్లుగా చెంగులే చెంగులు! తమ్ముళ్లు, చెల్లాయిలు ఆ చెంగులు పట్టుకుని పరుగెడుతుంటే పండగ కళ వచ్చేసినట్టే. ► అల్లరి ఆటల ఆనందంలో హరివిల్లుల సోయగం అమ్మాయి లంగాఓణీ రూపం. ► నింగిని వదిలి నేలకు దిగిన దేవకన్యల పరవశం లంగాఓణీ ముస్తాబు సొంతం. ►గడపకు పసుపు– కుంకుమలా, గుమ్మానికి తోరణంలా పండగ సింగారమంతా లంగాఓణీయే చుట్టేసుకుంటుంది. చూపులను కట్టేసుకుంటుంది. ► పెద్దంచు పట్టు పరికిణీ.. అంచు రంగులో ఓణీ ధరిస్తే పరవశాల ప్రకృతి సిగలో ముద్దబంతిలా వెలిగిపోవాల్సిందే! ►ఆకాశంలో పతంగులు రంగవల్లులు అల్లే వేళ అమ్మాయి అద్దాల లంగా ఓణీలో ప్రత్యక్షమైతే పుడమిన హరివిల్లు పూచినట్టే! ►లంగాఓణీ హంగులు అమ్మాయి నవ్వులతో పోటీపడితే పండగ సంబరాలు సింగారపు కళను అద్దుకున్నట్టే. ► నింగిన చందమామ నట్టింటికి వచ్చిందంటే అది లంగాఓణీ ధరించిన అమ్మాయే అయ్యుంటుంది. రెండు కళ్లు సరిపోనంత వెన్నెల పట్టపగలే కురిపించేస్తుంది. -
కర్నూలులో మయన్మార్ బృందం
ప్రకృతి వ్యవసాయ పద్ధతుల పరిశీలన కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లాలో వ్యవసాయ శాఖ పెద్ద ఎత్తున చేపట్టిన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మయన్మార్ దేశ ప్రతినిధుల బృందం మంగళవారం పరిశీలించింది. మయన్మార్ నుంచి పది మంది అధికారులు కలిగిన బృందం కర్నూలు చేరుకుంది. ముందుగా కల్లూరు మండలం బొల్లవరంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేశారు. అనంతరం కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీలోని భూసార పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రం ఏడీ శేషారెడ్డి భూసార పరీక్ష కేంద్రాల్లో చేపట్టే మట్టి, నీళ్ల పరీక్షల గురించి వివరించారు. మయన్మార్ ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు బాగా ఉన్నాయని, వీటిని మరింత అధ్యయనం చేసి మయన్మార్‌లో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.