ముంబయ్ నుంచి సైకిల్ యాత్ర
- 15 రాష్ట్రాల్లో పర్యటన
- కర్నూలులోని ఇంటికి చేరిన ఇంజినీరింగ్ విద్యార్థి తేజేశ్వర్
కల్లూరు (రూరల్) : వివిధ ప్రాంతాల్లోని ప్రకృతి అందాలు, సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించి ఫొటో డాక్యుమెంటరీ రూపొందించాలనే లక్ష్యంతో ఓ బీటెక్ విద్యార్థి సైకిల్ దేశవ్యాప్త పర్యటనకు బయలుదేరాడు. ఆగస్టు 6, 2016న ముంబయి నుంచి సైకిల్‌పై బయలుదేరాడు. 10 నెలల కాలంలో 15 రాష్ట్రాలను చుట్టేశాడు. వింతలు, విశేషాలు, ఆచార వ్యవహారాలకు సంబంధించి ఫొటోలను తీస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అతడే కర్నూలు నెహ్రూనగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు ఎం.శ్రీనివాసులు, ఎం.పార్వతి కుమారుడు తేజేశ్వర్. గుజరాత్, రాజస్థాన్, ధిల్లీ, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గోవా మీదుగా 25వేల కిలోమీటర్లు సైకిల్‌పై పర్యటించి ఆదివారం కర్నూలు చేరుకున్నాడు.
జమ్మూకాశ్మీర్‌లో జరుగుతున్న అల్లర్లు, పాకిస్తాన్ ముష్కరులు జవాన్లపై చేసిన దాడులు, అక్కడ పరిస్థితులపై ఫొటోలు తీసినట్లు తెలిపాడు. మొదట ఒంటరిగా బయలుదేరాడు. జైపూర్ వెళ్లాక ఓ కుక్కపిల్లను కొన్నాడు. దాన్ని వెంటబెట్టుకుని అన్ని ప్రదేశాలను చుట్టేశాడు. ఆదివారం కర్నూలు చేరిన తేజేశ్వర్‌కు మాజీ కార్పొరేటర్ నరసింహులు, ఆర్‌ఎస్‌వైఎఫ్ నగర అధ్యక్షుడు విల్సన్, పారిశ్రామిక వేత్త రాజేష్‌పటేల్, ఎంఎస్‌ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పరమేశ్వర్ సత్కరించారు. రెండు రోజుల విరామం తర్వాత బెంగుళూరు బయలుదేరి కేరళ, తమిళనాడు, విశాఖపట్టణం, ఒరిస్సా మీదుగా మహారాష్ట్ర, హైదరాబాద్‌కు చేరుకుని అక్కడి నుంచి నేరుగా కర్నూలు చేరతానని తెలిపాడు.