సూరజ్‌.. యంగ్‌ ఫార్మర్‌.. ద గ్రేట్‌! | The Kerala Government has trained organic farmers in their state students | Sakshi
Sakshi News home page

సూరజ్‌.. యంగ్‌ ఫార్మర్‌.. ద గ్రేట్‌!

Published Mon, Jul 17 2017 11:52 PM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

సూరజ్‌.. యంగ్‌ ఫార్మర్‌.. ద గ్రేట్‌! - Sakshi

సూరజ్‌.. యంగ్‌ ఫార్మర్‌.. ద గ్రేట్‌!

చిన్నప్పటి నుంచే పెరటి తోటల సాగుపై మక్కువ
అగ్రికల్చర్‌ బీఎస్సీ చదువుతూనే.. పన్నెండెకరాల్లో ప్రకృతి సేద్యం
పాలేకర్‌ శిక్షణ పొందాక పూర్తిస్థాయి సేద్యం
సూరజ్‌ను ప్రకృతి సేద్య ప్రచారకర్తగా ప్రకటించిన కేరళ ప్రభుత్వం

వయసు మళ్లిన వారు, మహిళలు తప్ప యువకులు వ్యవసాయంలో కొనసాగడం అరుదై పోతున్న ఈ కాలంలో కేరళ రాష్ట్రంలో ఒక విద్యార్థి సరికొత్త ఆశలు రేకెత్తిస్తున్నాడు. కేరళ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు సేంద్రియ పెరటి తోటలు, టెర్రస్‌ గార్డెన్ల సాగులో గత కొన్నేళ్లుగా శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. సి. ఎస్‌. సూరజ్‌ అనే విద్యార్థి ఇంటి పెరట్లో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలను మక్కువతో చిన్నప్పటి నుంచే సాగు చేస్తూ.. ప్రకృతి వ్యవసాయదారుడిగా మారాడు. కేరళ – తమిళనాడు సరిహద్దులోని వాయనాడ్‌ జిల్లా చిరకంబాత్‌ ఇల్లం ఇరవయ్యేళ్ల సూరజ్‌ స్వస్థలం. తాతల నాటి ఐదున్నర ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఎదురుగానే వాళ్ల ఇల్లు ఉంటుంది. తండ్రి కాంట్రాక్టర్‌ కావడంతో వ్యవసాయం కుంటుపడింది.

అయితే, సూరజ్‌ తన తల్లి తోడ్పాటుతో ఇంటిపంటల సాగును కొనసాగించాడు. చిన్నప్పటి నుంచి అతని ఆలోచనలు వ్యవసాయం చుట్టూనే తిరిగేవట. అటువంటి పరిస్థితుల్లో ఐదేళ్ల క్రితం.. పదిహేనేళ్ల ప్రాయంలో సూరజ్‌ ఇంటర్‌మీడియెట్‌లో చేరాడు. ఆ కొత్తలోనే తమకు దగ్గరలోని సుల్తాన్‌ బతేరి పట్టణంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు సుభాష్‌ పాలేకర్‌ శిక్షణా శిబిరం జరిగింది. ఆ ఐదు రోజుల శిబిరంలో సూరజ్‌ శ్రద్ధగా పాల్గొని వ్యవసాయాన్ని ప్రకృతికి అనుగుణంగా, స్వల్పఖర్చుతో ఎలా చేయాలో కూలంకషంగా తెలుసుకున్నాడు.  తన జీవన గమ్యానికి మార్గం సుగమం అయినట్లు, స్పష్టత వచ్చినట్లు తోచింది. తమ పొలంలో ప్రకృతి వ్యవసాయాన్ని రెట్టించిన ఉత్సాహంతో చేపట్టాడు. తల్లిదండ్రులు  వెన్ను తట్టడంతో చదువు కొనసాగిస్తూనే చక్కని దిగుబడులు తీస్తున్నాడు.

వ్యవసాయ విద్య.. ప్రకృతి సేద్యం..
పాలేకర్‌ వద్ద శిక్షణ పొందిన తర్వాత ఏడాది తొలిగా ఎకరాలో శ్రీ పద్ధతిలో సూరజ్‌ వరిని సాగుచేసి 4 టన్నుల ధాన్యం దిగుబడి పొందాడు. ఆ ప్రాంతంలో అప్పటి సగటు దిగుబడికి ఇది రెట్టింపు కావడంతో సూరజ్‌ స్పీడు పెంచాడు. తన ఇంటికి 200 కిలోమీటర్ల దూరంలోని త్రిస్సూర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. వారాంతాల్లో ఇంటికి వెళ్లి వ్యవసాయ పనులు చక్కబెట్టుకుంటున్నాడు.

ప్రస్తుతం ఎకరంలో దేశీ వరి వంగడాలను సాగు చేస్తున్నాడు. 10 ఎకరాల్లో 15 రకాల కూరగాయలు, పండ్లను సాగు చేస్తున్నాడు. త్రివేండ్రం, కాలికట్, కొచ్చి వంటి నగరాల్లో ఆర్గానిక్‌ షాపులు, సూపర్‌ మార్కెట్లకు సరఫరా చేస్తున్నాడు. ఇందులో 4 ఎకరాల్లో కాఫీ, మిరియాలు, లిచి, అవకాడో, బొప్పాయి, అరటి, ప్యాషన్‌ ఫ్రూట్‌ తదితరాలను మిశ్రమ సాగు చేస్తున్నాడు. మిగతా పొలంలో టమాటా తదితర కూరగాయలను, ఔషధ మొక్కలను సాగు చేస్తున్నారు. మొత్తం మీద ఏడాదికి రూ. 7 నుంచి 8 లక్షల నికరాదాయం పొందుతున్నట్లు సూరజ్‌ ‘సాగుబడి’ ప్రతినిధితో చెప్పారు.

రెండుసార్లు కేరళ అసెంబ్లీలో ప్రసంగం
చదువుకుంటూనే ప్రకృతి వ్యవసాయం కొన సాగిస్తున్న సూరజ్‌ ద్వారా యువతను వ్యవసాయంలోకి ఆకర్షించే లక్ష్యంతో కేరళ ప్రభుత్వం 2015కు ముందే ప్రచారకర్త (బ్రాండ్‌ అంబాసిడర్‌)గా ప్రకటించింది. వ్యవసాయ శాఖ, కృషి విజ్ఞాన కేంద్రాలు నిర్వహించే ప్రచార, రైతు శిక్షణా శిబిరాల్లో సూరజ్‌ పాల్గొని ప్రకృతి వ్యవసాయం చేసే పద్ధతుల గురించి వివరిస్తుంటారు. 2015లో, 2016 డిసెంబర్‌లో రెండుసార్లు కేరళ అసెంబ్లీలో ప్రసంగించాడు. ‘స్టూడెంట్‌ ఫార్మర్‌’ అవార్డు, కేరళ ప్రభుత్వ ‘కర్షక ప్రతిభ’ అవార్డును పొందాడు.

చిక్కుడు గింజలతో ‘కునపజలం’!
 సూరజ్‌ పంటలకు పంచగవ్య, జీవామృతం, కునపజలం వాడుతున్నాడు. మాంసానికి బదులు చిక్కుడు గింజలను వాడుతూ ‘వెజిటేరియన్‌ కునపజలం’ తయారు చేసి వివిధ పంటలపై విస్తృతంగా వాడుతున్నాడు. 200 లీటర్ల నీటిలో 2 లీటర్ల కునప జలాన్ని కలిపి.. నెలకు ఒకసారి పిచికారీ చేస్తున్నారు.  పంచగవ్యను భూసారం పెంపొందించడానికి ఏటా రెండు సార్లు ఇస్తున్నారు. 4సార్లు పిచికారీ చేస్తున్నారు. జీవామృతాన్ని ఏటా రెండుసార్లు భూమికి ఇస్తున్నారు. ఏటా ఎకరానికి ఒక ట్రాక్టర్‌ పశువుల ఎరువు చల్లుతున్నారు. పంటలపై చీడపీడల బెడద పెద్దగా లేదని, కషాయాలతోనే కంట్రోల్‌ చేస్తున్నామని సూరజ్‌ తెలిపాడు. తనను చూసి కనీసం 20 మంది యువ రైతులు పూర్తిస్థాయిలో వ్యవసాయం చేపట్టారని, తరచూ తనను సంప్రదిస్తుంటారన్నారు. (సూరజ్‌ను 085475 70865,smartsooraj2@gmail.com ద్వారా సంప్రదించవచ్చు)
– సాగుబడి డెస్క్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement