
గతంలో ప్రతి చిన్న అవసరానికి బయటకు వెళ్లేవారు. ఇంట్లో గడిపే సమయం తక్కువగా ఉండేది. కానీ, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక అంతా ఆన్‌లైన్ మీదే ఆధారపడుతున్నారు. దీంతో ఇంట్లో గడిపే నాణ్యమైన సమయం పెరిగింది. ఇల్లు, పరిసర ప్రాంతాలు స్వచ్ఛమైన గాలి, వెలుతురు, ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చదనం ఉండాలని కోరుకుంటున్నారు. ఈనేపథ్యంలో నివాస సముదాయాల్లో (Residential) ల్యాండ్ స్కేపింగ్‌కు (landscaping) ఆదరణ పెరిగింది. - సాక్షి, సిటీబ్యూరో
వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న భవన నిర్మాణ సముదాయాలతో హైదరాబాద్ (hyderabad) అర్బన్ జంగిల్‌గా మారిపోతోంది. దీంతో నివాసితులకు పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం అనుభూతి కలిగించాలంటే ల్యాండ్ స్కేపింగ్ అనివార్యమైపోయింది. కనుచూపు మేర పచ్చదనం, అది కూడా సేఫ్టీ, సెక్యూరిటీ ఉండే గేటెడ్ కమ్యూనిటీలోనే ఉండాలని నేటి గృహ కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. పురుగుమందులు, రసాయనాలతో గాలి, నేల కాలుష్యం అవుతోంది. దీంతో సేంద్రీయ, సస్టెయినబుల్ గార్డెనింగ్‌కు ఆదరణ పెరుగుతోంది.
వాక్ వే, టెర్రస్‌లలో..
సువాసన, ఆకర్షణీయమైన పూల మొక్కలు, చెట్లు, గడ్డితో నివాస సముదాయంలో వాక్, రన్ వే, డెక్‌లు, టెర్రస్ వంటి ప్రాంతాల్లో ల్యాండ్ స్కేపింగ్‌లను చేపడుతున్నారు. విశ్రాంతి తీసుకోవడానికి, సమావేశాల కోసం వినూత్న లైట్లతో ప్రత్యేకమైన థీమ్‌లతో అందంగా అలంకరిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన ల్యాండ్ స్కేపింగ్‌తో బార్బిక్యూ వంటి ఔట్‌డోర్ ఈవెంట్లు, పార్టీలను చేసుకునేందుకు ఆహ్లాదకరమైన వేదికగా ఉంటుంది.
ఇదీ చదవండి: వెస్ట్ హైదరాబాద్.. వామ్మో ఎంత ఎత్తో..
విద్యుత్ బిల్లు ఆదా..
గ్లోబల్ ల్యాండ్ స్కేపింగ్ సర్వీస్ మార్కెట్ 2024లో 330.8 బిలియన్ డాలర్లుగా ఉందని, 2024 నుంచి 2030 నాటికి 6.7 శాతం వృద్ధి రేటు ఉంటుందని పరిశ్రమ వర్గాల అంచనా. వేసవి వచ్చిదంటే చాలు భానుడి ప్రతాపం 43 డిగ్రీలు దాటుతోంది. ఎండ, ఉక్కపోతతో ఇంట్లో ఉండలేని పరిస్థితి. ఏసీ, కూలర్లు ఉన్నా కృత్రిమమే. దీంతో ల్యాండ్ స్కేపింగ్ ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. ల్యాండ్ స్కేపింగ్ ప్రాజెక్ట్‌లలో ఉష్ణోగ్రతలు 2–3 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. సాధారణ ఇళ్లతో పోలిస్తే ల్యాండ్ స్కేపింగ్ గృహాల్లో విద్యుత్ బిల్లు రూ.700 నుంచి రూ.వెయ్యి వరకు ఆదా అవుతుంది.
ఇంటి విలువ 20 శాతం వృద్ధి..
ల్యాండ్ స్కేపింగ్‌తో ఇల్లు, పరిసర ప్రాంతాల రూపరేఖలు మారిపోతాయి. సహజ సౌందర్యం, ఆకర్షణీయంగా ఉంటుంది. అందమైన ల్యాండ్ స్కేపింగ్‌తో ఇంటి విలువ దాదాపు 20 శాతం వరకు పెరుగుతుంది. నిరంతరం గ్రీనరీ చూస్తుండటంతో మనిషిలో ఒత్తిడి తగ్గడంతో పాటు సృజనాత్మకత పెరుగుతుంది. ల్యాండ్ స్కేపింగ్‌తో పరిసర ప్రాంతాల్లో గాలి కాలుష్యం తగ్గుతుంది. అలాగే గడ్డి, పొదలతో కూడిన ల్యాండ్ స్కేపింగ్ మట్టిని బలంగా ఉండేలా చేస్తుంది. దీంతో వరదలు, వర్షం వంటి వాటితో భూమి కోతలను నివారిస్తుంది. అంతేకాకుండా సీతాకోకచిలుకలు, చిన్న పక్షలు వంటి స్థానికంగా జీవవైవిధ్యానికి ల్యాండ్ స్కేపింగ్ ఆసరాగా నిలుస్తుంది.

క్లబ్ హౌస్‌లో కో–వర్కింగ్ ప్లేస్..
కరోనా తర్వాతి నుంచి వర్క్ ఫ్రం హోమ్ విధానం అలవాటయ్యింది. ఉద్యోగుల ఆసక్తి, నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటం, మెరుగైన
ఉత్పాదకత కారణంగా ఇప్పటికీ కొన్ని బహుళ జాతి కంపెనీలు ఇంటి నుంచి పని విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇంట్లో ప్రత్యేకంగా
కొంత స్పేస్ ఆఫీస్ కోసం వినియోగిస్తే ఒప్పుకోవడం లేదు. ఇంట్లో పిల్లల అల్లరి, పెద్దల అవసరాలు, బంధువులు వస్తే హడావుడి తదితర కారణాలతో ఇంట్లోనే ఆఫీస్ స్పేస్ ఇస్తే ఇష్టపడటం లేదు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో అక్కడ.. కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!
క్లబ్‌హౌస్‌లో ప్రత్యేకంగా కో–వర్కింగ్ స్పేస్ ఇస్తున్నారు. హై నెట్‌వర్క్ స్పీడ్‌తో వైఫై సేవలను అందిస్తున్నారు. కూర్చునేందుకు వీలుగా మంచి కుర్చీలు, ఇతరత్రా ఏర్పాట్లను చేస్తున్నారు. దీంతో ఆయా నివాస సముదాయంలో వర్క్ ఫ్రం హోమ్ చేసుకునే నివాసితులందరూ ఒకే చోట పనిచేసుకునే వీలు కలుగుతుంది. దీంతో ఇంట్లో ఎలాంటి అంతరాయం కలగదు. పైగా అత్యవసర సమయంలో వెంటనే ఇంటికి చేరుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment