ఐటీ రంగంలో దాదాపు 80 శాతం వరకు హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. అక్కడకు సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉండాలంటే.. కోకాపేట ప్రాంతం చూసుకుంటే అక్కడ చదరపు అడుగు ధర దాదాపు రూ.12–14 వేల వరకు ఉంటోంది. మిగిలిన ప్రాంతాలన్నీ ఇప్పటికే బాగా రద్దీగా ఉంటున్నాయి. దాంతో ఇప్పుడు చాలామంది బాలానగర్ వైపు చూస్తున్నారు. - సాక్షి, సిటీబ్యూరో
ఒకప్పుడు బాలానగర్ అంటే పారిశ్రామికవాడ అని, భూగర్భ జలాలు కలుషితం అయ్యాయని, గాలి కూడా కాలుష్యంతో ఉంటుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి అభిప్రాయాలు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నవి.. కేవలం నైఫర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్సీ), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు మాత్రమే.
ఒకప్పుడు ఇక్కడ ఉండే ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ (ఐడీపీఎల్) వంటి కంపెనీలు కొన్ని వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించినా, అది చాలాకాలం క్రితమే మూతపడింది. పైపెచ్చు, ఈ కంపెనీకి చెందిన 100 ఎకరాల భూముల్లో పచ్చదనం విస్తరించింది. ఇంతకుముందు బాలానగర్ దాటి చింతల్, గుండ్లపోచంపల్లి ప్రాంతాల వరకు గేటెడ్ కమ్యూనిటీలు విస్తరించాయి గానీ, బాలానగర్‌లో ఇంతకుముందు రాలేదు.
లగ్జరీ నిర్మాణాలు షురూ..
ఇప్పుడిప్పుడే బాలానగర్ వైపు కూడా లగ్జరీ నిర్మాణాలు మొదలవుతున్నాయి. కోకాపేటతో సహా ఇతర ప్రాంతాల్లో లభించే సదుపాయాలన్నీ ఇక్కడ కూడా లభిస్తున్నాయి. కానీ, కోకాపేటలో చదరపు అడుగు దాదాపు రూ.12–14 వేలు ఉండగా, ఇక్కడ దాదాపు రూ.6 నుంచి రూ.7 వేలకే లభ్యమవుతున్నాయి. అంటే ఇంచుమించు కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హైటెక్ సిటీకి బాలానగర్ ప్రాంతం కూడా దాదాపు 12–13 కిలో మీటర్ల దూరంలోనే ఉంది. అయితే, ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు వంటి మౌలిక సదుపాయాలు రావడంతో అర గంటలోపే బాలానగర్ నుంచి హైటెక్ సిటీకి చేరుకోవచ్చు. పైగా ఈ ప్రాంతంలో మంచి పెద్ద పెద్ద స్కూళ్లు, ఇంజినీరింగ్ కాలేజీలు కూడా ఇక్కడ ఉండటంతో పిల్లల చదువుల గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. మాల్స్, మల్టీప్లెక్సులు కూడా ఉండటంతో వినోదం, విహారానికి కూడా మంచి అవకాశాలున్నాయి.
బాలానగర్ వైపు..
మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో లగ్జరీ ఫ్లాట్లు కావాలంటే ఎంత లేదన్నా కనీసం రూ.6 నుంచి రూ.7 కోట్లకుపైగా పెట్టాలి. అదే బాలానగర్‌లో లగ్జరీ ఫ్లాటు అంటే దాదాపు 2 వేల చ.అ. విస్తీర్ణం ఉండే ఫ్లాటు అన్ని సౌకర్యాలతో కలిపి కూడా సుమారు రూ.కోటిన్నర– రెండు కోట్లలోపే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైటెక్ సిటీకి సమీపంలో ఇంత తక్కువ ధరలో, అన్ని సదుపాయాలు ఉన్న ప్రాంతంలో దొరకడం దాదాపు ఇంకెక్కడా లేదు. కాబట్టి, ఐటీ జనాలు క్రమంగా ఇప్పుడు బాలానగర్ వైపు చూస్తున్నారు. గతంలో వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసినా, చివరకు హైదరాబాద్ వచ్చి స్థిరపడాలని అనుకుంటున్నవారు కూడా బాలానగర్ ప్రాంతం వైపు మొగ్గు చూపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment