హైదరాబాద్ నగరంలో హైరైజ్ నిర్మాణాలు (High rise apartments)ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో పాతిక ఫ్లోర్ల భవనం అంటే.. వామ్మో అనుకునే పరిస్థితి. కానీ, ఇప్పుడు 50 అంతస్తులపైనే నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. స్కై స్క్రాపర్లలో (skyscrapers) నివాసం అనేది స్టేటస్ సింబల్‌గా మారిపోవడంతో ప్రవాసులు, ఎంటర్‌ప్రెన్యూర్లు, బ్యూరోక్రాట్ల అభిరుచి మేరకు డెవలపర్లు పోటాపోటీగా ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్నారు.
దీంతో పశ్చిమ హైదరాబాద్‌లో (hyderabad) తలెత్తి చూస్తే తప్ప అపార్ట్‌మెంట్ కనిపించని పరిస్థితి! దేశంలో హైరైజ్ ప్రాజెక్ట్‌లకు పెట్టింది పేరు ముంబై. ఇక్కడ భూమి లభ్యత తక్కువ కాబట్టి వర్టికల్ నిర్మాణాలు సహజమే. కానీ, హైదరాబాద్‌లో భూమి లభ్యత ఉన్నప్పటికీ అధిక ధరల కారణంగా డెవలపర్లు హైరైజ్ ప్రాజెక్ట్‌లను చేయక తప్పని పరిస్థితి. మరోవైపు అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులున్న ప్రాంతంలో నివాసం ఉండేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తుండటంతో ఎత్తయిన గృహ సముదాయాలు వెలుస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో
వెస్ట్‌లోనే ఎక్కువ..
షేక్‌పేట, రాయదుర్గం, మదీనాగూడ, ఖాజాగూడ, పుప్పాలగూడ, గండిపేట, కోకాపేట, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోనే ఎక్కువగా హైరైజ్ ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి. ప్రవాసులు, హెచ్‌ఎన్‌ఐలు సెకండ్ డెస్టినేషన్‌గా హైదరాబాద్‌లో లగ్జరీ అపార్ట్‌మెంట్ ఉండాలని కోరుకుంటున్నారు. అధిక అద్దెలు, ఆస్తుల విలువల పెంపు కారణంగా పెట్టుబడిదారులు ఇలాంటి ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటున్నారు. దీంతో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులున్న పశ్చిమ హైదరాబాద్‌లోనే ఆకాశహర్మ్యాలు ఎక్కువగా వస్తున్నాయి. భవనం ఎత్తు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం పెరుగుతుంది కాబట్టి హైరైజ్ ప్రాజెక్ట్‌లలో అపార్ట్‌మెంట్ల ధరలు ప్రీమియంగానే ఉంటాయి.
బాల్కనీలోంచి సిటీ వ్యూ..
ప్రస్తుతం నగరంలో 200 మీటర్ల ఎత్తు అంటే 50 నుంచి 59 అంతస్తుల హైరైజ్ ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి. ప్రవాసులు, హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్, ఎంటర్‌ప్రెన్యూర్లు, ఐటీ, ఫార్మా రంగాల్లోని ఉన్నతోద్యోగులు ఎక్కువగా ఆకాశహర్మ్యాలలో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. హైరైజ్ ప్రాజెక్ట్‌ల ఎంపికకు మరో ప్రధాన కారణం సిటీ వ్యూ.. 200 మీటర్ల ఎత్తులోని ఫ్లాట్‌లోంచి చూస్తే సిటీ మొత్తం కనిపిస్తుంది. ఉదయం, సాయంత్రం సమయాల్లోని నగరంలోని పరిసరాలను ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా హైఎండ్ కుటుంబాలు, అభిరుచులు కలిగిన నివాసితులు ఒకే చోట ఉండటంతో వారి మధ్య సామాజిక బంధం మరింత బలపడుతుంది. జీవన నాణ్యత మెరుగవుతుంది.
స్వచ్ఛమైన గాలి, వెలుతురు
అత్యంత ఎత్తులో ఫ్లాట్ ఉంటుంది కాబట్టి వాహనాల ధ్వని, వాయు కాలుష్య సమస్యలూ ఉండవు. ఏకాంతం కోరుకునేవారికి అనువైన గృహాలివే. పైగా ఇంట్లోకి ధారాళమైన గాలి, వెలుతురు, సూర్యరశ్మి వస్తాయి. ఈ ప్రాజెక్ట్‌లకు చేరువలోనే అంతర్జాతీయ విద్యా, వైద్య సంస్థలు, వినోద కేంద్రాలు, నిత్యావసరాలు అన్నీ లభ్యమవుతాయి. ఇంట్లో ఉన్నంత సేపు కుటుంబ, వృత్తి, కెరీర్ వంటి వ్యాపకాలపై ఫోకస్ చేయవచ్చు. వీటిల్లో క్లబ్ హౌస్‌తో పాటు వాకింగ్, జాగింగ్ ట్రాక్‌లు, స్విమ్మింగ్ పూల్, జిమ్, డే కేర్ సెంటర్, మెడిటేషన్ హాల్స్, వెయిటింగ్ రూమ్స్ వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
ఉంటాయి.
మరింత మౌలిక వసతులు కల్పించాలి
పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు గృహాలను అందించాలంటే హైరైజ్ నిర్మాణాలే సరైనవి. కాకపోతే ప్రజల జీవన నాణ్యత మెరుగు పరిచేందుకు అవసరమైన రహదారులు, నీటి సరఫరా, మురుగు నీటి వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలి.
– ప్రశాంత్‌రావు, డైరెక్టర్, పౌలోమీ ఎస్టేట్స్
Comments
Please login to add a commentAdd a comment