కరోనా మొదలయ్యాక అందరిలోనూ పర్యావరణ స్పృహ పెరిగింది. వర్క్ ఫ్రం హోమ్ కావచ్చు.. వీకెండ్ కావచ్చు కారణమేదైనా సరే సమయం దొరికితే సిటీకి దూరంగా పచ్చని ప్రకృతిలో కాసేపు సేద తీరాలని కోరుకుంటున్నారు. అందుకే సామాన్య, మధ్యతరగతి వాసులు కూడా ఫ్లామ్‌ప్లాట్లు, ఫామ్‌హౌస్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో 2 వేల గజాలపైన ఉన్న ఫామ్‌ప్లాట్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని పురపాలక శాఖ ఆదేశించింది. పెద్ద సైజు ప్లాట్లను కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేకపోవటంతో సామాన్యులు పర్యావరణానికి దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో అర్బన్ ఫార్మింగ్, ఫామ్‌హౌస్‌లకు ప్రత్యేక పాలసీ అవసరం ఉందని ల్యాండ్‌స్కేపింగ్ ఆర్కిటెక్ట్, అర్బన్ ఫార్మింగ్ నిపుణులు సూచిస్తున్నారు.
గతంలో బడా బాబులకే పరిమితమైన ఫామ్‌హౌస్ కల్చర్.. నేడు సామాన్యులు కోరుకుంటున్నారు. ఫామ్‌హౌస్‌లకు గిరాకీని దృష్టిలో పెట్టుకొని డెవలపర్లు వందల ఎకరాలలో ఈ తరహా లేఅవుట్లను చేస్తున్నారు. సిటీకి దూరంగా 4, 5 గుంటల స్థలంలో పండ్ల మొక్కల పెంపకం, సేంద్రియ వ్యవసాయం పేరిట ప్లాట్లను విక్రయిస్తున్నారు. కొందరు డెవలపర్లు అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున ఫామ్‌ప్లాట్స్ లేఅవుట్లను చేస్తున్నారు. ధర తక్కువగా ఉండటంతో సామాన్యులు క్రయవిక్రయాలు జరుపుతున్నారు. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నల్లగొండ, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలలో ఎక్కువగా ఈ తరహా వెంచర్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫామ్‌హౌస్/ప్లాట్ల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే ప్రత్యేక పాలసీని తీసుకొస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో ఫామ్‌ప్లాట్లకు క్రమబద్ధీకరణ కోసం స్కీమ్‌ను తీసుకురావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు.
20 ఎకరాలు ఉంటేనే...
కనీసం 20 ఎకరాల స్థలం ఉంటేనే అర్బన్ ఫార్మింగ్ పాలసీ పరిధిలోకి వస్తాయి. ఇందులో వ్యక్తిగత ఫామ్‌ప్లాట్ల విస్తీర్ణం 9 మీటర్ల వెడల్పుతో కనీసం 500 చ.మీ. ఉండాల్సిందే. ప్రాజెక్ట్‌కు అప్రోచ్ రహదారి వెడల్పు, అంతర్గత రోడ్లు కూడా 9 మీటర్లు ఉండాలి. సెంట్రల్ ప్లాజాకు 60 అడుగుల వెడల్పు రహదారులు ఉండాలి. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రదేశం ఉండాలి. గ్రూప్ హౌసింగ్ నిర్మాణాల వలే అర్బన్ ఫార్మింగ్ ప్రాజెక్ట్‌లో నిర్మాణాలకు కూడా సెట్‌బ్యాక్స్ ఉంటాయి. మొత్తం సైట్ ఏరియాలో 20 శాతానికి మించి నిర్మాణాలు ఉండకూడదు.
అర్బన్ ఫార్మింగ్ పరిధిలోకి ఏమొస్తాయంటే?
వ్యవసాయం, హార్టికల్చర్, ఫ్లోరికల్చర్, మెడిసినల్ ప్లాంట్స్, ఆర్బోరికల్చర్, పండ్ల తోటలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ సంబంధిత కార్యకలాపాలు, హైడ్రోపోనిక్స్, ఆక్వాపోనిక్స్ వంటివి అర్బన్ ఫార్మింగ్ కిందికొస్తాయి. పశువుల షెడ్లు, స్టోరేజ్ షెడ్లు, గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్ వంటి వాటిని మొత్తం ప్రాజెక్ట్ స్థలంలో 5 శాతం వరకు నిర్మించుకోవచ్చు. కాకపోతే ఇవి ఎత్తయినవిగా ఉండకూడదు. ఆయా నిర్మాణాలు సహజ వాతావరణానికి భంగం కలిగించకూడదు. నీటి వనరులు, కొండలను తొలగించడం వంటివి చేయకూడదు. ప్రాజెక్ట్‌లో సాధ్యమైనంత వరకు నీటి పునర్వినియోగం, ల్యాండ్‌స్కేపింగ్ వంటివి చేపట్టాలి.
క్లబ్‌హౌస్ వసతుల కోసం..
మొత్తం ఫామ్‌ప్లాట్ విస్తీర్ణంలో గరిష్టంగా 2 శాతం స్థలంలో మాత్రమే సెంట్రల్ స్క్వేర్/క్లబ్‌హౌస్, ప్లాజా వంటి నిర్మాణాలకు అనుమతి ఉంటుంది. వీటి ఎత్తుపై ఎలాంటి పరిమితులు ఉండవు కానీ జీవో నంబర్ 168 హైరైజ్ బిల్డింగ్ నిబంధనలకు లోబడి ఉండాలి. ఉద్యోగులు, నిర్వహణ సిబ్బంది నిర్మించే గృహాలతో పాటు సెంట్రల్ ప్లాజాలో రైతు మార్కెట్లు, బజార్, హాట్, స్థానిక కార్యాలయాలు, హస్తకళల ఎంపోరియం, మేళా, జాయ్ రైడ్స్, ఎగ్జిబిషన్ స్పేస్ మొదలైన వాటి ప్రదర్శన వంటివి ఉంటాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) కింద విద్యా, ఆరోగ్య, సాంస్కృతిక కార్యకలాపాల కోసం మొత్తం ప్రాజెక్ట్ ఏరియాలో 5 శాతం స్థలం వినియోగానికి అనుమతులుంటాయి. అయితే ఆయా నిర్మాణాలకు ఎంట్రీ, ఎగ్జిట్ కోసం 12 మీటర్ల వెడల్పుతో ప్రత్యేకమైన రహదారులుండాలి.
నాలా అవసరం లేదు..
ఫామ్‌ప్లాట్స్ ప్రాజెక్ట్‌ల అనుమతులు, నిర్వహణ, నియంత్రణ అన్ని కూడా హెచ్‌ఎండీఏ పరిధిలో ఉంటాయి. ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) పరిధిలో మినహాయించి అన్ని భూ వినియోగ జోన్లలో అర్బన్ ఫార్మింగ్ ప్రాజెక్ట్‌లను చేపట్టవచ్చు. కాకపోతే ఆయా జోన్ నిబంధనలకు లోబడే ఉండాలి. ఫామ్‌ప్లాట్ల ఫీజులు, డెవలప్‌మెంట్ చార్జీలు బిల్టప్ ఏరియా ప్రాంతానికి మాత్రమే ఉంటాయి. అవి కూడా రెసిడెన్షియల్ సైట్లతో సమానంగా ఉంటాయి. 50 ఎకరాల లోపు ఫామ్‌ప్లాట్లకు స్క్రూట్నీ ఫీజుగా రూ.20 వేలు, ఆ పైన వాటికి రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుంది. ఫామ్‌ప్లాట్స్ ప్రాజెక్ట్‌లకు వ్యవసాయేతర భూ మార్పిడి (నాలా) అనుమతులు అవసరం లేదు. ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అంటే ఆ సమయం వరకు భూమిని ఇతరత్రా అవసరాలకు వినియోగించకూడదన్నమాట.
నిర్మాణాలు ఎలా ఉండాలంటే..
వ్యక్తిగత లేదా లీజు/అద్దెకు తీసుకునే ఫ్లామ్‌ప్లాట్ 10 శాతం స్థలంలో మాత్రమే ఫామ్‌హౌస్ నిర్మాణానికి అనుమతులుంటాయి. గరిష్టంగా జీ+1 లేదా 7 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణం ఉండాలి. మిగిలిన స్థలాన్ని అర్బన్ ఫార్మింగ్ కోసం వినియోగించాలి. వ్యవసాయ థీమ్ పార్క్స్, అగ్రికల్చర్ టూరిజం, రిసార్ట్ టూరిజం, స్టూడియో అపార్ట్‌మెంట్, కొంత కాంక్రీట్ వినియోగించి నిర్మించే వెర్నాక్యులర్ హోమ్స్, గ్రామీణ జీవనశైలిని తెలిపే థీమ్ సెట్టింగ్స్ నిర్మాణాలకు కూడా అనుమతులు ఇస్తారు. ఫామ్‌ఫ్లాట్ల ప్రాజెక్ట్‌లలో నీటి అవసరాల కోసం గ్రిడ్ లేదా పబ్లిక్ వాటర్ సప్లయి వ్యవస్థను వినియోగించడానికి వీలు లేదు కాబట్టి సొంతంగా నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.
– సాక్షి, హైదరాబాద్
ఫామ్‌హౌస్ పాలసీ అవసరమే!
Published Sat, Aug 7 2021 2:30 AM | Last Updated on Sat, Aug 7 2021 2:30 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment