special policy
-
ఫామ్‌హౌస్ పాలసీ అవసరమే!
కరోనా మొదలయ్యాక అందరిలోనూ పర్యావరణ స్పృహ పెరిగింది. వర్క్ ఫ్రం హోమ్ కావచ్చు.. వీకెండ్ కావచ్చు కారణమేదైనా సరే సమయం దొరికితే సిటీకి దూరంగా పచ్చని ప్రకృతిలో కాసేపు సేద తీరాలని కోరుకుంటున్నారు. అందుకే సామాన్య, మధ్యతరగతి వాసులు కూడా ఫ్లామ్ప్లాట్లు, ఫామ్‌హౌస్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో 2 వేల గజాలపైన ఉన్న ఫామ్ప్లాట్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని పురపాలక శాఖ ఆదేశించింది. పెద్ద సైజు ప్లాట్లను కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేకపోవటంతో సామాన్యులు పర్యావరణానికి దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో అర్బన్ ఫార్మింగ్, ఫామ్‌హౌస్‌లకు ప్రత్యేక పాలసీ అవసరం ఉందని ల్యాండ్‌స్కేపింగ్ ఆర్కిటెక్ట్, అర్బన్ ఫార్మింగ్ నిపుణులు సూచిస్తున్నారు. గతంలో బడా బాబులకే పరిమితమైన ఫామ్‌హౌస్ కల్చర్.. నేడు సామాన్యులు కోరుకుంటున్నారు. ఫామ్‌హౌస్‌లకు గిరాకీని దృష్టిలో పెట్టుకొని డెవలపర్లు వందల ఎకరాలలో ఈ తరహా లేఅవుట్లను చేస్తున్నారు. సిటీకి దూరంగా 4, 5 గుంటల స్థలంలో పండ్ల మొక్కల పెంపకం, సేంద్రియ వ్యవసాయం పేరిట ప్లాట్లను విక్రయిస్తున్నారు. కొందరు డెవలపర్లు అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున ఫామ్‌ప్లాట్స్ లేఅవుట్లను చేస్తున్నారు. ధర తక్కువగా ఉండటంతో సామాన్యులు క్రయవిక్రయాలు జరుపుతున్నారు. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నల్లగొండ, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలలో ఎక్కువగా ఈ తరహా వెంచర్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫామ్‌హౌస్/ప్లాట్ల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే ప్రత్యేక పాలసీని తీసుకొస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో ఫామ్ప్లాట్లకు క్రమబద్ధీకరణ కోసం స్కీమ్‌ను తీసుకురావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు. 20 ఎకరాలు ఉంటేనే... కనీసం 20 ఎకరాల స్థలం ఉంటేనే అర్బన్ ఫార్మింగ్ పాలసీ పరిధిలోకి వస్తాయి. ఇందులో వ్యక్తిగత ఫామ్‌ప్లాట్ల విస్తీర్ణం 9 మీటర్ల వెడల్పుతో కనీసం 500 చ.మీ. ఉండాల్సిందే. ప్రాజెక్ట్‌కు అప్రోచ్ రహదారి వెడల్పు, అంతర్గత రోడ్లు కూడా 9 మీటర్లు ఉండాలి. సెంట్రల్ ప్లాజాకు 60 అడుగుల వెడల్పు రహదారులు ఉండాలి. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రదేశం ఉండాలి. గ్రూప్ హౌసింగ్ నిర్మాణాల వలే అర్బన్ ఫార్మింగ్ ప్రాజెక్ట్‌లో నిర్మాణాలకు కూడా సెట్‌బ్యాక్స్ ఉంటాయి. మొత్తం సైట్ ఏరియాలో 20 శాతానికి మించి నిర్మాణాలు ఉండకూడదు. అర్బన్ ఫార్మింగ్ పరిధిలోకి ఏమొస్తాయంటే? వ్యవసాయం, హార్టికల్చర్, ఫ్లోరికల్చర్, మెడిసినల్ ప్లాంట్స్, ఆర్బోరికల్చర్, పండ్ల తోటలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ సంబంధిత కార్యకలాపాలు, హైడ్రోపోనిక్స్, ఆక్వాపోనిక్స్ వంటివి అర్బన్ ఫార్మింగ్ కిందికొస్తాయి. పశువుల షెడ్లు, స్టోరేజ్ షెడ్లు, గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్ వంటి వాటిని మొత్తం ప్రాజెక్ట్ స్థలంలో 5 శాతం వరకు నిర్మించుకోవచ్చు. కాకపోతే ఇవి ఎత్తయినవిగా ఉండకూడదు. ఆయా నిర్మాణాలు సహజ వాతావరణానికి భంగం కలిగించకూడదు. నీటి వనరులు, కొండలను తొలగించడం వంటివి చేయకూడదు. ప్రాజెక్ట్‌లో సాధ్యమైనంత వరకు నీటి పునర్వినియోగం, ల్యాండ్‌స్కేపింగ్ వంటివి చేపట్టాలి. క్లబ్‌హౌస్ వసతుల కోసం.. మొత్తం ఫామ్ప్లాట్ విస్తీర్ణంలో గరిష్టంగా 2 శాతం స్థలంలో మాత్రమే సెంట్రల్ స్క్వేర్/క్లబ్‌హౌస్, ప్లాజా వంటి నిర్మాణాలకు అనుమతి ఉంటుంది. వీటి ఎత్తుపై ఎలాంటి పరిమితులు ఉండవు కానీ జీవో నంబర్ 168 హైరైజ్ బిల్డింగ్ నిబంధనలకు లోబడి ఉండాలి. ఉద్యోగులు, నిర్వహణ సిబ్బంది నిర్మించే గృహాలతో పాటు సెంట్రల్ ప్లాజాలో రైతు మార్కెట్లు, బజార్, హాట్, స్థానిక కార్యాలయాలు, హస్తకళల ఎంపోరియం, మేళా, జాయ్ రైడ్స్, ఎగ్జిబిషన్ స్పేస్ మొదలైన వాటి ప్రదర్శన వంటివి ఉంటాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద విద్యా, ఆరోగ్య, సాంస్కృతిక కార్యకలాపాల కోసం మొత్తం ప్రాజెక్ట్ ఏరియాలో 5 శాతం స్థలం వినియోగానికి అనుమతులుంటాయి. అయితే ఆయా నిర్మాణాలకు ఎంట్రీ, ఎగ్జిట్ కోసం 12 మీటర్ల వెడల్పుతో ప్రత్యేకమైన రహదారులుండాలి. నాలా అవసరం లేదు.. ఫామ్‌ప్లాట్స్ ప్రాజెక్ట్‌ల అనుమతులు, నిర్వహణ, నియంత్రణ అన్ని కూడా హెచ్ఎండీఏ పరిధిలో ఉంటాయి. ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) పరిధిలో మినహాయించి అన్ని భూ వినియోగ జోన్లలో అర్బన్ ఫార్మింగ్ ప్రాజెక్ట్‌లను చేపట్టవచ్చు. కాకపోతే ఆయా జోన్ నిబంధనలకు లోబడే ఉండాలి. ఫామ్‌ప్లాట్ల ఫీజులు, డెవలప్మెంట్ చార్జీలు బిల్టప్ ఏరియా ప్రాంతానికి మాత్రమే ఉంటాయి. అవి కూడా రెసిడెన్షియల్ సైట్లతో సమానంగా ఉంటాయి. 50 ఎకరాల లోపు ఫామ్ప్లాట్లకు స్క్రూట్నీ ఫీజుగా రూ.20 వేలు, ఆ పైన వాటికి రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుంది. ఫామ్‌ప్లాట్స్ ప్రాజెక్ట్‌లకు వ్యవసాయేతర భూ మార్పిడి (నాలా) అనుమతులు అవసరం లేదు. ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అంటే ఆ సమయం వరకు భూమిని ఇతరత్రా అవసరాలకు వినియోగించకూడదన్నమాట. నిర్మాణాలు ఎలా ఉండాలంటే.. వ్యక్తిగత లేదా లీజు/అద్దెకు తీసుకునే ఫ్లామ్ప్లాట్ 10 శాతం స్థలంలో మాత్రమే ఫామ్‌హౌస్ నిర్మాణానికి అనుమతులుంటాయి. గరిష్టంగా జీ+1 లేదా 7 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణం ఉండాలి. మిగిలిన స్థలాన్ని అర్బన్ ఫార్మింగ్ కోసం వినియోగించాలి. వ్యవసాయ థీమ్ పార్క్స్, అగ్రికల్చర్ టూరిజం, రిసార్ట్ టూరిజం, స్టూడియో అపార్ట్మెంట్, కొంత కాంక్రీట్ వినియోగించి నిర్మించే వెర్నాక్యులర్ హోమ్స్, గ్రామీణ జీవనశైలిని తెలిపే థీమ్ సెట్టింగ్స్ నిర్మాణాలకు కూడా అనుమతులు ఇస్తారు. ఫామ్ఫ్లాట్ల ప్రాజెక్ట్‌లలో నీటి అవసరాల కోసం గ్రిడ్ లేదా పబ్లిక్ వాటర్ సప్లయి వ్యవస్థను వినియోగించడానికి వీలు లేదు కాబట్టి సొంతంగా నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. – సాక్షి, హైదరాబాద్ -
ఈ పాలసీలు... వర్షాలకు పనికొస్తాయ్
♦ డెంగీ, మలేరియా తరహా వ్యాధులకు ప్రత్యేక పాలసీలు ♦ మోటారు వాహనాలకూ వర్షాలతో నష్టమే ♦ తక్కువ ప్రీమియంతోనే వీటికి కవరేజీ వర్షాకాలం వ్యాధుల సీజన్. దోమల సంతతి బాగా పెరిగేది ఈ కాలంలోనే. వీటికి తోడు వైరస్ల రూపంలో ఎన్నో వ్యాధులు తరుముకొస్తుంటాయి. ఈ సమయంలో ఆస్పత్రి పాలైతే బిల్లు కూడా భారీగానే ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఆర్థికంగా దెబ్బతీసే కొన్ని వ్యాధులకు ప్రత్యేకమైన పాలసీలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే, వర్షాకాలం మోటారు వాహనాలకు కూడా నష్టాలు తెచ్చే కాలమే. ఈ తరహా నష్టాల నుంచి రక్షణ కల్పించేందుకు మోటారు వాహన పాలసీలు సైతం ఉన్నాయి. పెరుగుతున్న డెంగీ, మలేరియా క్లెయిమ్‌లు ఏటా వర్షకాలంలో డెంగీ కేసులు చెప్పుకోతగ్గ సంఖ్యలోనే నమోదవుతున్నాయి. బీమా కంపెనీలకొచ్చే డెంగీ క్లెయిమ్‌లు కూడా పెరిగిపోతున్నాయి. ఒక్క ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ వరకే చూసుకుంటే 2013–14లో 34 క్లెయిమ్‌లు రాగా, 2016–17లో వీటి సంఖ్య 943కు పెరిగింది. మలేరియా, డెంగీ లేదా మరొకటి కావచ్చు... ఈ తరహా ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉంటున్నాయని, వీటికి సంబంధించి క్లెయిమ్‌లు కూడా పెరిగిపోతున్నాయని బీమా కంపెనీలు చెబుతున్నాయి. అసలు డెంగీ, మలేరియా తదితర వ్యాధులక్కూడా సాధారణ ఆరోగ్య బీమా పాలసీలు కవరేజినిస్తుంటే ప్రత్యేకమైన పాలసీల అవసరమేంటన్న సందేహం రావచ్చు. కవరేజి ఉంటుంది కానీ... వీటికి కనీసం 24 గంటల పాలు ఆస్పత్రిలో చేరాలి వంటి నిబంధనలుంటాయి. ఔట్ పేషెంట్ విభాగంలో వైద్య సలహా పొంది మందులతో చికిత్స తీసుకుంటే ఈ తరహా పాలసీలద్వారా పరిహారం దక్కదు. అటువంటి సమయాల్లో విడిగా ప్రత్యేకమైన వ్యాధులకు కవరేజినిచ్చే పాలసీలు ఉపయోగకరంగా ఉంటాయి. వైద్య బీమా పాలసీల్లో కొన్ని ఔట్ పేషెంట్ చికిత్సలకూ కవరేజి ఇస్తున్నాయి. ఒకవేళ మీరు ఈ తరహా పాలసీ తీసుకుని ఉంటే విడిగా ప్రత్యేక పాలసీ అవసరం పడదు. డెంగీ కేర్ అపోలో మ్యునిచ్ ‘డెంగీ కేర్’ పాలసీ డెంగీ కారణంగా ఆస్పత్రి పాలైతే రూ.50,000 వరకు... ఔట్ పేషెంట్‌గా తీసుకునే చికిత్సలకు రూ.10,000 వరకు పరిహారం చెల్లిస్తోంది. ప్రీమియం రూ.444 మాత్రమే. ఏ వయసు వారికైనా ఇంతే. వయసు, ఇతర అంశాల ఆధారంగా ప్రీమియంలో మార్పు లేదు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, కన్సల్టేషన్ ఫీజులు, ఇంట్లో తీసుకునే నర్సింగ్ సేవలు, ఫార్మసీ వ్యయాలకు పరిహారాన్ని గరిష్ట బీమా పరిమితి మేరకు చెల్లిస్తుంది. ఆస్పత్రిలో షేర్డ్ రూమ్ ఆప్షన్ ఎంచుకుంటే వైద్యేతర వ్యయాలను కూడా చెల్లిస్తుంది. రూ.లక్ష కవరేజీ పాలసీని కూడా అందిస్తోంది. దీనికి ప్రీమియం రూ.578. డెంగీ షీల్డ్ డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా లైఫ్ ఇన్సూరెన్స్ డెంగీ షీల్డ్ కవరేజి కూడా ఇలాంటిదే. డెంగీ ఫీవర్ వచ్చిందని పరీక్షల్లో నిర్ధారణయితే ఏకమొత్తంగా పరిహారాన్ని చెల్లించేస్తుంది. ప్లేట్లెట్ కౌంట్ 1,00,000 కంటే తక్కువకు పడిపోవడం, హెమటోక్రిట్ సాధారణ స్థాయికి 20 శాతానికి పైగా పెరిగిపోవడం, డెంగీ వచ్చినట్టు ఫిజీషియన్ నిర్ధారించడం వంటి కొన్ని షరతులకు లోబడి పరిహారం చెల్లిస్తుంది. అదే సమయంలో కనీసం 48 గంటల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాలన్న షరతులు కూడా ఉన్నాయి. రూ.25,000 కవరేజికి ఆన్లైన్లో పాలసీ తీసుకుంటే ప్రీమియం రూ.365. ప్రత్యేకమైన ఈ తరహా పాలసీలు చౌకగా ఉండడంతోపాటు పరిహారం కోసం క్లెయిమ్ ప్రక్రియ సులభంగా ఉంటుందనేది డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా ఎండీ అనూప్పబ్బి మాట. వాహనాలకు వర్షాకాల బీమా వర్షాకాలంలో రహదారులు చెరువుల మాదిరిగా కనిపించే దృశ్యాలు నగరాల్లోని వారికి అనుభవమే. రోడ్లపై రెండు మూడు అడుగుల మేర నీరు ప్రవహించడం వల్ల వాహనాల ఇంజన్లలోకి నీరు వెళ్లి నష్టం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక, భారీ గాలి వాన సమయాల్లో చెట్లు విరిగి వాహనాలపై పడితే... వర్షంలో ముం దున్న వాహనం సరిగా కనిపించక వెనుక నుంచి ఏ కారో, లారీయో వచ్చి ఢీకొట్టడం వల్ల కూడా వాహనానికి నష్టం ఏర్పడొచ్చు. నిజానికి ఈ తరహా క్లెయిమ్స్ బీమా కంపెనీలకు ఎక్కువగా వస్తుంటాయి. అటువంటి సందర్భాల్లో ఇంజన్ ప్రొటెక్ట్ అక్కరకు వస్తుంది. కాకపోతే ఇందులో కొన్ని షరతులు కూడా ఉంటాయి. వాహనం పూర్తిగా నీటిలో మునిగి ఇంజన్ ఆగిపోతే... స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించకూడదు. దీనివల్ల ఇంజన్ దెబ్బతిని పూర్తిగా మార్చాల్సి వస్తుంది. ఇది భారీ వ్యయంతో కూడుకున్నది. అందుకే ఈ షరతులను కంపెనీలు విధిస్తుంటాయి. వర్షపు నీరు కారణంగా ఇంజన్‌కు, ఇంజన్ భాగాలకు వాటిల్లే నష్టానికి ఇంజన్ ప్రొటెక్ట్ పాలసీలో పరిహారం లభిస్తుంది. ఈ పాలసీకి ప్రీమియం వాహనం విలువలో 0.2 శాతం నుంచి 1 శాతం వరకు ఉంటుంది. వాహనం వయసు, బ్రాండ్‌ను బట్టి ఎంత శాతమన్నది కంపెనీ నిర్ణయిస్తుంది. కారు పాడైతే మొత్తం విలువ వర్షపు నీటిలో మునిగి తిరిగి రిపేర్ చేయడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడితే వాహనం కొనుగోలు విలువ ఎంత ఉంటే ఆ మేర చెల్లించే పాలసీలు కూడా ఉన్నాయి. రహదారిపై ఆగిపోతే... తరచూ ప్రయాణాలు చేసే వారికి రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవరేజి పాలసీ ఉపయుక్తంగా ఉంటుంది. వాహనం ఉన్నట్టుండి ఆగిపోతే, ఆ ప్రదేశానికే వచ్చి సర్వీస్ అందించడం ఇందులోని సౌలభ్యత. బ్యాటరీ జంప్‌స్టార్ట్, టైర్ మార్పిడి, ఇంధనం నింపడం తరహా సేవలూ పొందొచ్చు. అక్కడికక్కడే సరి చేయలేని సమస్య అయితే ప్రత్యామ్నాయంగా మరో కారును ఏర్పాటు చేయడం లేదా రిపేర్ చేసే వరకూ హోటల్లో విడిది ఏర్పాటు చేయడం వంటి సేవలను అందుకోవచ్చు. కాంప్రహెన్సివ్ మోటారు పాలసీలు కొన్ని రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌తో కలిసి వస్తున్నాయి. ప్రీమియం ఎంత..? ఉదాహరణకు... హోండా అమేజ్ ఈఎంటీ 2016 మోడల్‌కు ఢిల్లీలో ఈడీవీ (ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ) రూ.4,06,324గా ఉంటే, హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ కాంప్రహెన్సివ్ మోటారు ఇన్సూరెన్స్ పాలసీలో ఎటువంటి యాడాన్స్ లేకుండా రూ.11,423 ప్రీమియం చార్జ్ చేస్తోంది. యాడాన్స్ కూడా కలిపితే ఇది రూ.14,910 అవుతోంది. రోడ్డు సైడ్ అసిస్టెన్స్, జీరో డిప్రీసియేషన్, ఇంజన్ ప్రొటెక్ట్ అన్నవి యాడాన్స్. అదే బజాజ్ అలయాంజ్లో అయితే యాడాన్స్ లేకుండా ప్రీమియం రూ.13,117 కాగా, యాడాన్స్ కూడా కలుపుకుంటే రూ.17,567కు పెరుగుతోంది. -
చేనేత, వస్త్ర పాలసీలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: చేనేత, వస్త్ర పరిశ్రమలకు ఊతమిచ్చే లక్ష్యంతో రూపొందించిన ప్రత్యేక పాలసీల ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. ఈ పాలసీలను రాష్ట్ర పరిశ్రమలు, టెక్స్‌టైల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు శనివారం విడుదల చేయనున్నారు. చేనేత, వస్త్ర, రెడీమేడ్ దుస్తుల తయారీ పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు, చేనేత పరిశ్రమల స్థాపనలో సింగిల్ విండో విధానంలో అనుమతులు తదితర అంశాలను ఈ పాలసీల్లో చేర్చారు. టీఎస్ ఐపాస్‌లో పేర్కొన్న రాయితీలే కాకుండా అదనపు రాయితీలు, ప్రోత్సాహకాలనూ నూతన పాలసీల్లో చేర్చినట్లు తెలిసింది. దారం తయారీ మొదలుకొని వస్త్రాల ఉత్పత్తి, మార్కెటింగ్, పరిశోధన, శిక్షణ తదితర సౌకర్యాలన్నీ ఒకేచోట అందుబాటులో ఉండేలా వరంగల్ జిల్లాలో ‘కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు’ ఏర్పాటును నూతన పాలసీల్లో భాగంగా చేర్చినట్లు సమాచారం. చేనేత రంగంలో పరిశోధన, నైపుణ్యానికి పెద్దపీట వేస్తూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పరిశోధన, శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చేనేత, టెక్స్టైల్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు టీఎస్ ఐపాస్‌కు అనుబంధంగా ప్రత్యేక డెస్క్ ఏర్పాటును ప్రతిపాదించారు. వీటితోపాటు అంతర్జాతీయ ఎగుమతులకు అనువైన రీతిలో వస్త్ర ఉత్పత్తుల నాణ్యత కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నూతన పాలసీల్లో ప్రతిపాదించినట్లు సమాచారం. ఇరు రంగాలకూ సమ ప్రాధాన్యత... వ్యవసాయం తర్వాత ఉపాధి, ఉత్పత్తి, ఆదాయపరంగా చేనేత, వస్త్ర పరిశ్రమలకు రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత వుంది. రాష్ట్రంలో ఏటా 60 లక్షల బేళ్ల పత్తి దిగుబడి వస్తుండగా ఇందులో కేవలం 10 శాతాన్ని మాత్రమే రాష్ట్రంలో వినియోగిస్తున్నారు. పత్తి లభ్యతకు అనుగుణంగా కాటన్ ఆధారిత అనుబంధ పరిశ్రమలు రాష్ట్రంలో లేకపోవడం చేనేత రంగం అభివృద్ధికి అవరోధంగా మారింది. రాష్ట్రంలో చేనేత రంగానికి ఆదరణ తగ్గడంతోపాటు ఇప్పటికే ఏర్పాటైన చేనేత పార్కులు ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేనేత పాలసీ రూపకల్పనపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో చేనేత పరిశ్రమల స్థితిగతులపై అధికారులు నివేదిక రూపొందించి దాని ఆధారంగా ‘తెలంగాణ చేనేత, వస్త్ర ఉత్పత్తుల పాలసీ 2015-2020’ (టీ టాప్)ను సిద్ధం చేశారు. ముసాయిదా ప్రతిని గతేడాది డిసెంబర్లో సీఎం కేసీఆర్ పరిశీలనకు సమర్పించగా ఆమోదానికి నోచుకోలేదు. దీంతో అధికారులు చేనేత, టెక్స్టైల్ రంగాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ వేర్వేరు పాలసీలను రూపొందించారు. పాలసీల విధి విధానాలపై చేనేత సంఘాల ప్రతినిధులతో జూలైలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో గద్వాల, పోచంపల్లి తదితర ప్రాంతాల నేత కార్మికుల నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు. -
ఉల్లికో విధానం
- ముసాయిదాను సిద్ధం చేసిన ఆస్కి - విత్తన సబ్సిడీ 75 శాతం పెంచే ప్రతిపాదన - రాయితీ కోసం ఇప్పటికే రూ.కోటి విడుదల సాక్షి, హైదరాబాద్: సాగు విస్తీర్ణం, పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడంతో రాష్ట్రంలో ఏటా ఉల్లి కొరత ఏర్పడుతోంది. వినియోగదారులపై భారం తగ్గించేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి ఉల్లిని సేకరించి, సబ్సిడీపై పంపిణీ చేయడం ప్రభుత్వానికి భారంగా మారింది. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి ‘ప్రత్యేక ఉల్లి విధానం’ శ్రేయస్కరమని ప్రభుత్వం భావిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో ఉల్లి సాగులో అనుసరిస్తున్న మెళకువలపై ఇప్పటికే రాష్ట్ర మార్కెటింగ్, ఉద్యానవన శాఖ అధికారులు నివేదిక సమర్పించారు. దీని ఆధారంగా ఉల్లి పాలసీ విధి విధానాల రూపకల్పనపై ఉద్యానవన శాఖ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కి) సహకారాన్ని తీసుకుంటోంది. ఆస్కి ముసాయిదాను సిద్ధం చేసి ఉద్యానవన శాఖకు సమర్పించింది. వారం రోజుల్లో దీనికి తుది రూపునిచ్చే అవకాశముందని మార్కెటింగ్ శాఖ వర్గాలు వెల్లడించాయి. నూతన విధానంలో ఉల్లి సాగును ప్రోత్సహించడం లక్ష్యంగా రైతులకు పలు రాయితీలను ప్రకటించనున్నట్లు సమాచారం. ఉల్లి దిగుబడులను ఎక్కువ కాలం పాటు నిల్వ చేసేలా గోదాముల నిర్మాణం, రైతులకు శిక్షణ, విత్తన సబ్సిడీ తదితరాలపై అందులో స్పష్టత ఇవ్వనున్నారు. విత్తనాలపై భారీ సబ్సిడీ ఇప్పటివరకు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) ద్వారా ఉద్యానవన శాఖ 50 శాతం సబ్సిడీపై ఉల్లి విత్తనాలను సరఫరా చేస్తోంది. 2014-15లో 50 శాతం సబ్సిడీపై ఉల్లి విత్తనాలు రైతులకు ఇవ్వగా.. ఇప్పుడు దీన్ని 75 శాతానికి పెంచాలని నిర్ణయించారు. ఇందులో ఆర్కేవీవై 50 శాతాన్ని, 25 శాతాన్ని మార్కెటింగ్ శాఖ భరిస్తుంది. 2015-16లో 14 వేల ఎకరాలకు సరిపడేలా ఉల్లి విత్తనాల సరఫరాకు రూ.4.20 కోట్లు అవసరమవుతాయని అంచ నా వేశారు. 75 శాతం సబ్సిడీ కింద రూ.3.15 కోట్లు భరించాల్సి ఉండగా, మార్కెటింగ్ శాఖ తన వంతు వాటాగా ఇప్పటికే రూ.1.05 కోట్లు విడుదల చేసింది.