ఉల్లికో విధానం
- ముసాయిదాను సిద్ధం చేసిన ఆస్కి
- విత్తన సబ్సిడీ 75 శాతం పెంచే ప్రతిపాదన
- రాయితీ కోసం ఇప్పటికే రూ.కోటి విడుదల
సాక్షి, హైదరాబాద్: సాగు విస్తీర్ణం, పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడంతో రాష్ట్రంలో ఏటా ఉల్లి కొరత ఏర్పడుతోంది. వినియోగదారులపై భారం తగ్గించేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి ఉల్లిని సేకరించి, సబ్సిడీపై పంపిణీ చేయడం ప్రభుత్వానికి భారంగా మారింది. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి ‘ప్రత్యేక ఉల్లి విధానం’ శ్రేయస్కరమని ప్రభుత్వం భావిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో ఉల్లి సాగులో అనుసరిస్తున్న మెళకువలపై ఇప్పటికే రాష్ట్ర మార్కెటింగ్, ఉద్యానవన శాఖ అధికారులు నివేదిక సమర్పించారు.
దీని ఆధారంగా ఉల్లి పాలసీ విధి విధానాల రూపకల్పనపై ఉద్యానవన శాఖ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కి) సహకారాన్ని తీసుకుంటోంది. ఆస్కి ముసాయిదాను సిద్ధం చేసి ఉద్యానవన శాఖకు సమర్పించింది. వారం రోజుల్లో దీనికి తుది రూపునిచ్చే అవకాశముందని మార్కెటింగ్ శాఖ వర్గాలు వెల్లడించాయి. నూతన విధానంలో ఉల్లి సాగును ప్రోత్సహించడం లక్ష్యంగా రైతులకు పలు రాయితీలను ప్రకటించనున్నట్లు సమాచారం. ఉల్లి దిగుబడులను ఎక్కువ కాలం పాటు నిల్వ చేసేలా గోదాముల నిర్మాణం, రైతులకు శిక్షణ, విత్తన సబ్సిడీ తదితరాలపై అందులో స్పష్టత ఇవ్వనున్నారు.
విత్తనాలపై భారీ సబ్సిడీ
ఇప్పటివరకు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్‌కేవీవై) ద్వారా ఉద్యానవన శాఖ 50 శాతం సబ్సిడీపై ఉల్లి విత్తనాలను సరఫరా చేస్తోంది. 2014-15లో 50 శాతం సబ్సిడీపై ఉల్లి విత్తనాలు రైతులకు ఇవ్వగా.. ఇప్పుడు దీన్ని 75 శాతానికి పెంచాలని నిర్ణయించారు. ఇందులో ఆర్‌కేవీవై 50 శాతాన్ని, 25 శాతాన్ని మార్కెటింగ్ శాఖ భరిస్తుంది. 2015-16లో 14 వేల ఎకరాలకు సరిపడేలా ఉల్లి విత్తనాల సరఫరాకు రూ.4.20 కోట్లు అవసరమవుతాయని అంచ నా వేశారు. 75 శాతం సబ్సిడీ కింద రూ.3.15 కోట్లు భరించాల్సి ఉండగా, మార్కెటింగ్ శాఖ తన వంతు వాటాగా ఇప్పటికే రూ.1.05 కోట్లు విడుదల చేసింది.