చేనేత, వస్త్ర పాలసీలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: చేనేత, వస్త్ర పరిశ్రమలకు ఊతమిచ్చే లక్ష్యంతో రూపొందించిన ప్రత్యేక పాలసీల ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. ఈ పాలసీలను రాష్ట్ర పరిశ్రమలు, టెక్స్‌టైల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు శనివారం విడుదల చేయనున్నారు. చేనేత, వస్త్ర, రెడీమేడ్ దుస్తుల తయారీ పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు, చేనేత పరిశ్రమల స్థాపనలో సింగిల్ విండో విధానంలో అనుమతులు తదితర అంశాలను ఈ పాలసీల్లో చేర్చారు. టీఎస్ ఐపాస్‌లో పేర్కొన్న రాయితీలే కాకుండా అదనపు రాయితీలు, ప్రోత్సాహకాలనూ నూతన పాలసీల్లో చేర్చినట్లు తెలిసింది.
దారం తయారీ మొదలుకొని వస్త్రాల ఉత్పత్తి, మార్కెటింగ్, పరిశోధన, శిక్షణ తదితర సౌకర్యాలన్నీ ఒకేచోట అందుబాటులో ఉండేలా వరంగల్ జిల్లాలో ‘కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు’ ఏర్పాటును నూతన పాలసీల్లో భాగంగా చేర్చినట్లు సమాచారం. చేనేత రంగంలో పరిశోధన, నైపుణ్యానికి పెద్దపీట వేస్తూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పరిశోధన, శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చేనేత, టెక్స్‌టైల్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు టీఎస్ ఐపాస్‌కు అనుబంధంగా ప్రత్యేక డెస్క్ ఏర్పాటును ప్రతిపాదించారు. వీటితోపాటు అంతర్జాతీయ ఎగుమతులకు అనువైన రీతిలో వస్త్ర ఉత్పత్తుల నాణ్యత కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నూతన పాలసీల్లో ప్రతిపాదించినట్లు సమాచారం.
ఇరు రంగాలకూ సమ ప్రాధాన్యత...
వ్యవసాయం తర్వాత ఉపాధి, ఉత్పత్తి, ఆదాయపరంగా చేనేత, వస్త్ర పరిశ్రమలకు రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత వుంది. రాష్ట్రంలో ఏటా 60 లక్షల బేళ్ల పత్తి దిగుబడి వస్తుండగా ఇందులో కేవలం 10 శాతాన్ని మాత్రమే రాష్ట్రంలో వినియోగిస్తున్నారు. పత్తి లభ్యతకు అనుగుణంగా కాటన్ ఆధారిత అనుబంధ పరిశ్రమలు రాష్ట్రంలో లేకపోవడం చేనేత రంగం అభివృద్ధికి అవరోధంగా మారింది. రాష్ట్రంలో చేనేత రంగానికి ఆదరణ తగ్గడంతోపాటు ఇప్పటికే ఏర్పాటైన చేనేత పార్కులు ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేనేత పాలసీ రూపకల్పనపై దృష్టి సారించింది.
ఇందులో భాగంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో చేనేత పరిశ్రమల స్థితిగతులపై అధికారులు నివేదిక రూపొందించి దాని ఆధారంగా ‘తెలంగాణ చేనేత, వస్త్ర ఉత్పత్తుల పాలసీ 2015-2020’ (టీ టాప్)ను సిద్ధం చేశారు. ముసాయిదా ప్రతిని గతేడాది డిసెంబర్‌లో సీఎం కేసీఆర్ పరిశీలనకు సమర్పించగా ఆమోదానికి నోచుకోలేదు. దీంతో అధికారులు చేనేత, టెక్స్‌టైల్ రంగాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ వేర్వేరు పాలసీలను రూపొందించారు. పాలసీల విధి విధానాలపై చేనేత సంఘాల ప్రతినిధులతో జూలైలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో గద్వాల, పోచంపల్లి తదితర ప్రాంతాల నేత కార్మికుల నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు.