TS ipas
-
గ్రేటర్లో ఆఫీస్ స్పేస్.. హాట్ కేక్!
- ముంబై తరువాతి స్థానంలో హైదరాబాద్ - ఢిల్లీ, బెంగళూరులను వెనక్కి నెట్టిన మహానగరం - ఇండియా ఆఫీస్ మార్కెట్ వ్యూరిపోర్ట్ నివేదికలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: అవకాశాల హబ్‌గా మారిన గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పుడు ఆఫీస్ స్పేస్ (కార్యాలయ ప్రదేశం) హాట్ కేక్ అయింది. ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలను నెలకొల్పేందుకు అవసరమైన స్థలాలకు ఇటీవలి కాలంలో డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది తొలి త్రైమాసికం (జనవరి–మార్చి మధ్య)లో 31 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అవసరం కాగా... ఇందులో ముంబై తరవాత హైదరాబాద్ నగరంలో అత్యధిక డిమాండ్ ఉండడం విశేషం. ముంబైలో 12 లక్షలు, నగరంలో 11 లక్షల అడుగుల మేర ఆఫీస్ స్పేస్ అవసరముందని ‘ఇండియా ఆఫీస్ మార్కెట్ వ్యూ రిపోర్ట్–2017’తాజా సర్వేలో తెలిపింది. విస్తరిస్తున్న వాణిజ్య ప్రాంతం... ప్రధానంగా హైటెక్‌సిటీ, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, రాయదుర్గం, మణికొండ, కూకట్పల్లి ప్రాంతాల్లో డిమాండ్ అధికంగా ఉందని నివేదిక పేర్కొంది. ఈ ప్రాంతాలను సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌గా పిలవడం తెలిసిందే. ఇక నానక్‌రామ్‌గూడలో నిర్మాణంలో ఉన్న రెండు భారీ ఐటీ సెజ్‌లలో కూడా అవస రమైన స్థలాలు దక్కించుకునేందుకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. బంజారాహిల్స్ ప్రాంతంలో మధ్యతరహా ఐటీ కేంద్రాలు విస్తరిస్తుండటంతో ఈ ప్రాంతంలోనూ ఆఫీస్ స్పేస్ హాట్‌కేక్ అయింది. ప్రధానంగా డిమాండ్ ఉన్నదిక్కడే... ► ఐటీ కారిడార్: కార్వీ సంస్థ ఒక లక్ష చదరపు అడుగుల స్థలాన్ని ఇటీవల లీజుకు తీసుకుంది. ► మైహోమ్ హబ్ ఫేజ్–2: 43 వేల చదరపు అడుగుల స్థలాన్ని ప్రైమేరా మెడికల్ టెక్నాలజీస్ సంస్థ అద్దెకు తీసుకుంది. ► ఐటీ కారిడార్‌లోని వెస్ట్రన్ పెర్ల్: 38 వేల చదరపు అడుగుల స్థలాన్ని వర్క్ఫెల్లా అనే సంస్థ లీజుకు తీసుకుంది. నగరంలో అధిక డిమాండ్ ఎందుకంటే... ► నగరంలో ఐటీరంగం శరవేగంగా విస్తరిస్తుండడంతో ఐటీ కారిడార్‌లో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ అనూహ్యంగా పెరగడం ► దేశ, విదేశాలకు చెందిన పలు ఐటీ, బీపీఓ, కేపీఓ ఆధారిత పరిశ్రమలు సిటీకి క్యూ కడుతుండడం ► నూతన ఆవిష్కరణలకు నిలయంగా మారి న స్టార్టప్ కంపెనీలు గ్రేటర్‌కు వెల్లువెత్తడం ► ఐటీకారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఆఫీస్ స్పేస్‌కు ఇటీవలి కాలంలో డిమాండ్ అధికం కావడంతో ఈ ప్రాంతంలో అద్దెలు సైతం 10 శాతం మేర పెరగడం గమనార్హం. ► రియల్ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్, జీఎస్టీ విధానం కూడా వాణిజ్య భవంతుల విస్తరణకు దోహదం చేస్తున్నట్లు రియల్ఎస్టేట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ► నగరంలో వివిష్ట భౌగోళిక వాతావరణం. సునామీ, వరదలు, భూకంపాల వంటి విపత్తులకు ఆస్కారం లేకపోవడం. ► సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండడం, వేసవిలోనూ సాయంత్రం వేళ వాతావరణం ఆహ్లాదంగా మారడం. ► ఐటీ, అనుబంధ రంగాల్లో పని చేసేందుకు అవసరమైన మానవవనరులు పుష్కలంగా లభించడం. ► తెలంగాణా ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఐటీ, హార్డ్‌వేర్, టీఎస్ఐపాస్ పాలసీలు వివిధ బహుళజాతి సంస్థలను నగరానికి విశేషంగా ఆకర్షించడం. -
రాష్ట్రంలో శాంతి భద్రతలు భేష్
-
రాష్ట్రంలో శాంతి భద్రతలు భేష్
నేరాల సంఖ్య తగ్గింది: ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని, శాంతి భద్రతలు మెరుగ్గా ఉన్నాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. పోలీసు శాఖలోని పలు అంశాలపై శుక్రవారం ప్రగతి భవన్లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదీ, నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి, మిషన్ భగీరథ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎంఓ అధికారులతో సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో పోలీసు, పరిశ్రమల శాఖలు మెరుగ్గా పనిచేస్తున్నాయని, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న పలువురు అభిప్రాయపడ్డారని తెలిపారు. టీఎస్ ఐపాస్ విధానం ప్రకటించిన తర్వాత 2500కుపైగా పరిశ్రమలు ఏర్పాటై ఉత్పత్తి కూడా ప్రారంభమైందన్నారు. దీనంతటికీ ప్రదాన కారణం శాంతి భద్రతలు మెరుగ్గా ఉండటమే కారణమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నేరాల సంఖ్య భారీగా తగ్గిందని, అదే విధంగా నేరస్తుల్లోనూ మార్పు వచ్చిందన్నారు. మానవతా దృక్పథంతో పోలీసులు నేరస్తులను మారుస్తున్నారన్నారు. పోలీసు కానిస్టేబుళ్ల భర్తీ అంశం గురించి డీజీపీ అనురాగ్ శర్మ సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. -
ఇదేం పారిశ్రామిక విధానం?
అసెంబ్లీలో కాంగ్రెస్ మండిపాటు - టీఎస్ఐపాస్ అమలులో పారదర్శకత ఏది? - ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలేవీ? - పాత పరిశ్రమలు మూతపడుతున్నా పట్టించుకోరేమి? - లక్షలాది ఉద్యోగాల మాటలేమయ్యాయి? సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పారిశ్రామికాభి వృద్ధిపై ప్రభుత్వం చెపుతున్న మాటలు వాస్తవ దూరాలని కాంగ్రెస్ ఆరోపించింది. టీఎస్ ఐపాస్ అమల్లో పారదర్శకత కనిపిం చడం లేదని, ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అను కూలంగా వ్యవహరించడంలో, వారికి తగిన ప్రోత్సాహకాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడింది. సోమవారం అసెంబ్లీలో టీఎస్ఐపాస్, సులభతర వ్యాపార విధానంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ప్రభుత్వ ప్రకటనపై కాంగ్రెస్ పక్షాన ఆ పార్టీ సభ్యులు సంపత్‌కుమార్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. తొలుత సంపత్.. పారిశ్రామిక విధానంలో ప్రభుత్వ లోటుపాట్లను ఎత్తి చూపారు. ఏటా 2వేల కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి వస్తే వెయ్యి పాత పరిశ్రమలు మూత పడేలా ప్రభుత్వ విధానాలున్నాయని, దీనివల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. పాత పరిశ్రమలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.49 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి తన ప్రకటనలో చెప్పారని, అయితే అందులో రూ.21 వేల కోట్ల వరకు విద్యుత్ రంగంలో వచ్చినవేనని, విద్యుత్ రంగ పెట్టుబడులను వీలున్నంత తగ్గించాలని కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ స్వయంగా పార్లమెంటులో చెప్పారన్నారు. టీఎస్ఐపాస్ ద్వారా సత్వర అనుమతులు వస్తున్నాయని ప్రభుత్వం చెపుతుంటే వేలాది పరిశ్రమలు అనుమతుల కోసం ఎందుకు ఎదురుచూస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. తుక్కుగూడ సమీపంలోని పారిశ్రామిక సెజ్ లో రక్షణ శాఖకు చెందిన ఉత్పత్తుల కోసం ఏర్పాటు చేయనున్న పరిశ్రమ కోసం ఎకరాకు రూ.48లక్షల వరకు వసూలు చేసి.. మైక్రో మ్యాక్స్ అనే ప్రైవేట్ కంపెనీకి అంతకన్నా తక్కువకు భూమి ఇవ్వడంలో ఆంతర్యం ఏమి టన్నారు. టీఎస్‌ఐపాస్‌లో స్థానిక యువతకు అవకాశం కల్పించడం లేదన్నారు. ఐటీఐఆర్ ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తామన్న మాటలేమయ్యాయని ప్రశ్నించారు. వాటి కింద ఒక్క రూపాయి అయినా ఇచ్చారా..? టీప్రైడ్ కింద ఎస్సీలకు రూ.200 కోట్లు, ఎస్టీలకు రూ.100 కోట్ల బడ్జెట్‌ను ఇస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. క్రెడిట్ గ్యారెంటీకి ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ.100 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ.50 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. అసలు ఈ విషయంలో కనీసం నిబంధనలు రూపొందిం చారా అని ప్రశ్నించారు. పెట్టుబడి మొత్తంపై ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు ఇస్తామన్న 35 శాతం సబ్సిడీ, 100 శాతం వ్యాట్ మినహాయింపు, స్కిల్ అప్‌గ్రేడేషన్ నిధులు, రోడ్లు, విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పనలో 50 శాతం రాయితీలాంటి అంశాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన బిల్లులో పేర్కొన్న ఖాజీపేట రైల్‌కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ఫ్యాక్టరీలను కూడా పట్టించు కోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో బియ్యం పరిశ్రమ సంక్షోభంలో ఉన్నా ఆదుకోవడం లేదన్నారు. తెలుగులో మాట్లాడిన ఎంఐఎం సభ్యుడు పారిశ్రామిక విధానంపై జరిగిన చర్చలో కౌసర్ (ఎంఐఎం), చింతల రామచంద్రా రెడ్డి(బీజేపీ), రేవంత్‌రెడ్డి (టీడీపీ), సున్నం రాజయ్య (సీపీఎం) కూడా మాట్లాడారు. ఎంఐఎం సభ్యుడు కౌసర్ తెలుగులో మాట్లాడడం విశేషం. కొంత తడబాటుకు గురయినా దాదాపు ఐదారు నిమిషాలు తెలుగులోనే ప్రసం గాన్నంతా చదివారు. మంత్రి కేటీఆర్ ఆంగ్లంలో ప్రకటన చేసిన సందర్భంలోనే ప్రతిపక్ష సభ్యులు గొడవ చేశారు. తెలు గులో మాట్లాడాలన్నారు. కౌసర్ మాట్లా డిన తర్వాత రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి తనకొచ్చిన భాషలో సమాధా నం చెప్పినా ఎంఐఎం సభ్యుడు తెలుగు లో మాట్లాడి తెలంగాణ భాషకు గౌరవం తెచ్చారన్నారు. అంతకుముందు కాంగ్రెస్ సభ్యుడు సంపత్ మాట్లాడుతూ మంత్రి అమెరికాలో చదువుకుని ఇంగ్లిష్ లో మాట్లాడారని, తాను తెలంగాణలో చదువుకున్నా ఇంగ్లిష్ నేర్చుకున్నానని అన్నారు. -
ఆటోమొబైల్ రంగంపై ప్రత్యేక దృష్టి
శాసనమండలిలో మంత్రి కేటీఆర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఆటోమొబైల్ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఖమ్మం, కామారెడ్డి, మిర్యాలగూడ, మంచిర్యాల, కరీంనగర్, రామగుండంలలో ఆటోనగర్లను ప్రతిపాదించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అశోక్ లేల్యాండ్ కంపెనీ బస్‌బాడీ యూనిట్ ఏర్పాటు కోసం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందన్నారు. హైదరాబాద్–వరంగల్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధిలో భాగంగా భువనగిరి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, మణికొండ, శాయంపేట– సంగెంలలో క్లస్టర్ల ఏర్పాటుకు నిర్ణయించామని చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి సుల్తాన్‌పూర్‌లో 50ఎకరాలు కేటాయించామని, వారికి 30 శాతం రాయితీతో భూమిని కేటాయిస్తామని వెల్లడించారు. త్వరలోనే ప్లాస్టిక్ సిటీ ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. సోమ వారం శాసనమండలిలో టీఎస్ ఐపాస్, సులభతర వ్యాపార విధానంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో కేటీఆర్ మాట్లాడారు. రానున్న రోజుల్లో ‘కాస్ట్‌ఆఫ్ డూయింగ్ బిజినెస్, క్వాలి టీ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లపై దృష్టి పెట్ట నున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబ డులను రాష్ట్రానికి ఆకర్షించే లక్ష్యంతో నవం బర్లో హైదరాబాద్‌లో ప్రపంచ పెట్టుబడి దారుల సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో టీఎస్ ఐపాస్‌ను ప్రవేశపెట్టాక ఇప్పటివరకు రూ.49,463 కోట్ల పెట్టుబడితో కూడిన 2,929 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చినట్లు కేటీఆర్ చెప్పారు. వాటి ద్వారా ప్రత్యక్షంగా 1,95,290 మందికి, పరోక్షంగా మరో మూడు లక్షల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ప్రపంచస్థాయి కంపె నీలైన గూగుల్, ఆపిల్, ఫేస్బుక్, అమెజాన్లు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కార్యాలSయా లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయన్నారు. పారిశ్రామిక విధానంలో యువ పారిశ్రామికవేత్తలకు ఎంత కోటా కేటాయించారని, తెలంగాణ పారిశ్రా మిక వేత్తలు ఎంత మంది ఉన్నారని విపక్షనేత షబ్బీర్ అలీ మండలిలోప్రశ్నించారు. -
ఈజీఎంఎం ద్వారా 20 వేల ఉద్యోగాలు
వచ్చే రెండేళ్లలో కల్పిస్తాం: మంత్రి జూపల్లి హైదరాబాద్: ఎంప్లారుుమెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్(ఈజీఎంఎం) ద్వారా వచ్చే రెండేళ్లలో 20 వేలమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గతేడాది శిక్షణ పొంది వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న వారితో సోమవారం ఇక్కడ తారామతి బారాదరిలో జరిగిన ఈజీఎంఎం సమ్మేళనంలో మంత్రి కృష్ణారావు మాట్లా డారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానంతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు వస్తు న్నాయని, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న పరి శ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ నిస్తే లక్షల సంఖ్యలో ఉద్యోగాలను కల్పించవచ్చని అన్నారు. ఉద్యోగాలు పొందేందుకు ఈజీఎంఎంను తొలిమెట్టుగా భావించాలని నిరుద్యోగులకు సూచిం చారు. నిరుద్యోగులకు ఉపాధి, రాష్ట్ర ఆదాయం పెంచే లక్ష్యంతోనే నూతన పారిశ్రామిక విధానానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందని మంత్రి అన్నారు. టీఎస్ ఐపాస్ కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 50 వేల కోట్ల పెట్టుబడులు, 2-3 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో ప్రైవేట్ రంగంలో 10 లక్షల ఉద్యోగాలను కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. భవిష్యత్ లో ఈజీఎంఎం ద్వారా మరింత ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నా మన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ సరైన మార్గనిర్ధేశం లేకనే గ్రామీణ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కడం లేదన్నారు. ఈ నేపథ్యంలోనే ఈజీఎంఎం ద్వారా నిరుద్యోగులకు అవసరమైన సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువతకు కూడా వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈజీఎంఎం కృషి చేస్తోందన్నారు. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రవిబాబు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ఈజీఎంఎం పనితీరు మెరుగ్గా ఉందని ప్రశంసించారు. అనం తరం ఈజీఎంఎం ద్వారా శిక్షణ పొందిన యువకుల విజయగాథలతో రూపొందించిన 100 స్మైల్స్ పుస్త కాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఉద్యోగాలు పొందిన యువతీ యువకులతోపాటుగా వారి తల్లిదండ్రులను కూడా మంత్రి జూపల్లి ఘనంగా సన్మానించారు. సమావేశంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఈజీఎంఎం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మధుకర్ బాబు, పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
చేనేత, వస్త్ర పాలసీలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: చేనేత, వస్త్ర పరిశ్రమలకు ఊతమిచ్చే లక్ష్యంతో రూపొందించిన ప్రత్యేక పాలసీల ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. ఈ పాలసీలను రాష్ట్ర పరిశ్రమలు, టెక్స్‌టైల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు శనివారం విడుదల చేయనున్నారు. చేనేత, వస్త్ర, రెడీమేడ్ దుస్తుల తయారీ పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు, చేనేత పరిశ్రమల స్థాపనలో సింగిల్ విండో విధానంలో అనుమతులు తదితర అంశాలను ఈ పాలసీల్లో చేర్చారు. టీఎస్ ఐపాస్‌లో పేర్కొన్న రాయితీలే కాకుండా అదనపు రాయితీలు, ప్రోత్సాహకాలనూ నూతన పాలసీల్లో చేర్చినట్లు తెలిసింది. దారం తయారీ మొదలుకొని వస్త్రాల ఉత్పత్తి, మార్కెటింగ్, పరిశోధన, శిక్షణ తదితర సౌకర్యాలన్నీ ఒకేచోట అందుబాటులో ఉండేలా వరంగల్ జిల్లాలో ‘కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు’ ఏర్పాటును నూతన పాలసీల్లో భాగంగా చేర్చినట్లు సమాచారం. చేనేత రంగంలో పరిశోధన, నైపుణ్యానికి పెద్దపీట వేస్తూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పరిశోధన, శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చేనేత, టెక్స్టైల్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు టీఎస్ ఐపాస్‌కు అనుబంధంగా ప్రత్యేక డెస్క్ ఏర్పాటును ప్రతిపాదించారు. వీటితోపాటు అంతర్జాతీయ ఎగుమతులకు అనువైన రీతిలో వస్త్ర ఉత్పత్తుల నాణ్యత కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నూతన పాలసీల్లో ప్రతిపాదించినట్లు సమాచారం. ఇరు రంగాలకూ సమ ప్రాధాన్యత... వ్యవసాయం తర్వాత ఉపాధి, ఉత్పత్తి, ఆదాయపరంగా చేనేత, వస్త్ర పరిశ్రమలకు రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత వుంది. రాష్ట్రంలో ఏటా 60 లక్షల బేళ్ల పత్తి దిగుబడి వస్తుండగా ఇందులో కేవలం 10 శాతాన్ని మాత్రమే రాష్ట్రంలో వినియోగిస్తున్నారు. పత్తి లభ్యతకు అనుగుణంగా కాటన్ ఆధారిత అనుబంధ పరిశ్రమలు రాష్ట్రంలో లేకపోవడం చేనేత రంగం అభివృద్ధికి అవరోధంగా మారింది. రాష్ట్రంలో చేనేత రంగానికి ఆదరణ తగ్గడంతోపాటు ఇప్పటికే ఏర్పాటైన చేనేత పార్కులు ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేనేత పాలసీ రూపకల్పనపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో చేనేత పరిశ్రమల స్థితిగతులపై అధికారులు నివేదిక రూపొందించి దాని ఆధారంగా ‘తెలంగాణ చేనేత, వస్త్ర ఉత్పత్తుల పాలసీ 2015-2020’ (టీ టాప్)ను సిద్ధం చేశారు. ముసాయిదా ప్రతిని గతేడాది డిసెంబర్లో సీఎం కేసీఆర్ పరిశీలనకు సమర్పించగా ఆమోదానికి నోచుకోలేదు. దీంతో అధికారులు చేనేత, టెక్స్టైల్ రంగాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ వేర్వేరు పాలసీలను రూపొందించారు. పాలసీల విధి విధానాలపై చేనేత సంఘాల ప్రతినిధులతో జూలైలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో గద్వాల, పోచంపల్లి తదితర ప్రాంతాల నేత కార్మికుల నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు. -
మెగా పరిశ్రమలకు ప్రత్యేక పాలసీ
ముసాయిదా సిద్ధం చేసిన పరిశ్రమల శాఖ - రూ. 200 కోట్లకు పైబడిన పెట్టుబడులకు రాయితీలు - ఇందుకోసం ఏర్పాటు కానున్న ప్రత్యేక నిధి - సీఎం ఆమోదం తర్వాత అమలుకు పరిశ్రమలశాఖ సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రూ. 200 కోట్లకుపైగా పెట్టుబడితో కనీసం వెయ్యి మందికి ఉపాధి కల్పించే భారీ పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. అనుమతులు, మౌలిక సౌకర్యాల కల్పనకు భారీ పరిశ్రమలు వెచ్చించే మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అలాగే పరిశ్రమల ఉపాధి కల్పన, పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుని వ్యాట్ చెల్లింపులపై భారీగా మినహాయింపులను ఇవ్వనుంది. మెగా పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలపై పరిశ్రమలశాఖ ప్రత్యేక పాలసీ ముసాయిదాను కూడా సిద్ధం చేసింది. సీఎం ఆమోదం తర్వాత దీని అమలుకు పరిశ్రమలశాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేక రాయితీలకు ఉపసంఘం నిర్ణయం ఉపాధి కల్పన, ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చడంలో పారిశ్రామిక రంగ ప్రగతి అత్యంత కీలకమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ‘టీ ఐడియా’లో భాగంగా పరిశ్రమలకు స్టాంప్ డ్యూటీ, వ్యాట్ చెల్లింపు, భూమి, విద్యుత్, పెట్టుబడులు తదితర అంశాల్లో పలు రాయితీలు, ప్రోత్సాహకాలను అందిస్తోంది. అయితే రూ.200 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్న తమకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వానికి భారీ పరిశ్రమలు పలుమార్లు విజ్ఞప్తి చేశాయి. కేపిటలైజేషన్ చార్జీలు, నీటి సరఫరా చార్జీలు, సబ్స్టేషన్ల నిర్మాణ వ్యయం తదితరాలను ప్రభుత్వమే చెల్లించాలని మెగా పరిశ్రమలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో మెగా పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలపై సూచనలిచ్చేందుకు ప్రభుత్వం పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. మే 4న సమావేశమైన ఉపసంఘం మెగా పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాల్సి ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అలాగే రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న కొన్ని పరిశ్రమలు మరింత పెట్టుబడితో విస్తరించే యోచన ఉండటంతో అవి కూడా మెగా ప్రాజెక్టుల కేటగిరీలోకి వస్తాయని.. అలాంటి పరిశ్రమలకూ రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. టీఎస్ ఐపాస్ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలో ఇప్పటికే 389 మెగా ప్రాజెక్టులు ఏర్పాటైన నేపథ్యంలో మెగా పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ఉప సంఘం సూత్రప్రాయంగా నిర్ణయించింది. రాయితీల చెల్లింపులో పారదర్శకత కోసం ఏకీకృత విధానం ఉండాలని తీర్మానించింది. ఉప సంఘం సూచన మేరకు రాష్ట్రానికి మెగా పరిశ్రమలను ఆకర్షించేలా ప్రత్యేక పాలసీని పరిశ్రమలశాఖ రూపొందించింది. రాయితీల కోసం ప్రత్యేక నిధి. మెగా పరిశ్రమలతోపాటు సూపర్ మెగా (రూ. 500 కోట్ల నుంచి రూ. వెయ్యి కోట్ల పెట్టుబడి, 2-3 వేల ఉద్యోగాలు), అల్ట్రా మెగా (రూ. వెయ్యి కోట్లకు పైబడిన పెట్టుబడి, 3 వేలకుపైగా ఉద్యోగాలు) పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలకు నిధులు సమకూర్చేందుకు పారిశ్రామిక మౌలిక సౌకర్యాల అభివృద్ధి నిధి (ఐఐడీఎఫ్) ఏర్పాటు చేయాలని పాలసీ ముసాయిదాలో పరిశ్రమలశాఖ ప్రతిపాదించింది. దీని ప్రకారం పురపాలన, హైదరాబాద్ మె ట్రో వాటర్, ట్రాన్స్‌కో, డిస్కంలు తదితర ప్రభుత్వ విభాగాలకు ప్రభుత్వం కేటాయించే వార్షిక బడ్జెట్ నుంచి కొత్త మొత్తాన్ని ఐఐడీఎఫ్కు కేటాయిస్తారు. మెగా పరిశ్రమలు కోరుతున్న విధంగా మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వ సంస్థలు వెచ్చించే నిధులను ఐఐడీఎఫ్ ఖాతా నుంచి చెల్లిస్తారు. వ్యాట్పరంగా మెగా పరిశ్రమలకు 75%, సూపర్ మెగా ప్రాజెక్టులకు 100% చొప్పున ఏడేళ్లపాటు రీయింబర్స్ చేస్తారు. అల్ట్రా మెగా ప్రాజెక్టులకు పదేళ్ల పాటు 100% వ్యాట్‌ను రీయింబర్స్ చేస్తారు. మెగా ప్రాజెక్టులకు యూనిట్‌కు రూపాయి చొప్పు న ఏడేళ్లపాటు, సూపర్ మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టులకు యూనిట్‌కు రూపాయి చొప్పు న పదేళ్లపాటు విద్యుత్ చార్జీలను తిరిగి చెల్లిస్తారు. మౌలిక సౌకర్యాల కల్పన కోసం మెగా పరిశ్రమలు వెచ్చించే మొత్తంలో గరిష్టంగా రూ. 2.50 కోట్లకు మించకుండా 50 శాతం సాయాన్ని ఐఐడీఎఫ్ నుంచి అందిస్తారు. సూపర్ మెగా ప్రాజెక్టులకు గరిష్టంగా రూ. 5 కోట్లు, అల్ట్రా మెగా ప్రాజెక్టులకు గరిష్టంగా రూ. 7.5 కోట్లకు మించకుండా 50 శాతాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే రాయితీల చెల్లింపును పరిశ్రమల ప్రారంభంలో కాకుండా పనులు, ఉత్పత్తి పురోగతినిబట్టి ఇవ్వాలని నిర్ణయించారు. -
‘రిచ్’కు నిధులేవీ!
♦ టీఎస్‌ఐపాస్‌లో ప్రకటించింది రూ.100 కోట్లు.. ♦ బడ్జెట్లో కేటాయించింది రూ.5 కోట్లే.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్య, పరిశోధన సంస్థల్లో జరిగే ఆవిష్కరణలు, సాంకేతికతను పరిశ్రమలతో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్) అనే వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విద్యార్థులకు చదువుతో పాటు ఉద్యోగానికి అవసరమైన శిక్షణ కాలేజీ దశలోనే ఇప్పించాలనేది దీని ఉద్దేశం. రిచ్‌ను బలోపేతం చేసేందుకు రూ.100 కోట్లు కేటాయిస్తామని ప్రకటించినా ప్రస్తుతం బడ్జెట్లో రూ.5 కోట్లు మాత్రమే కేటాయించడంతో దీనికి ఆదిలోనే గండి కొట్టే సూచనలు కన్పిస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఇక్రిశాట్, క్రిడా, సీసీఎంబీ తదితర ప్రతిష్టాత్మక సంస్థల్లో జరిగే నూతన ఆవిష్కరణలు, సాంకేతికత, ఉత్పాదనలు, సేవలు వెలుగు చూడటం లేదు. ఈ సంస్థల్లోని ఆవిష్కరణలు, సాంకేతికతను రాష్ట్రంలోని పారిశ్రామిక రంగంతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ప్రకటించిన రూ.100తో పాటు వెంచర్ కేపిటలిస్టులు, ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి కూడా రిచ్‌కు నిధులు సమకూర్చేలా ఆర్‌ఎంఎఫ్ (రీసెర్చ్ టు మార్కెట్ ఫండ్)ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కాగా, రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు, ఐటీఐ వంటి సంస్థలను పరిశ్రమలతో అనుసంధానం చేస్తూ స్కిల్ పాలసీని రూపొందిస్తామని ప్రకటించింది. నూతన పారిశ్రామిక విధానం విడుదలై సుమారు 11 నెలలు కావస్తున్నా ఈ పాలసీకి తుది రూపునివ్వడం లేదు. మరోవైపు ‘రిచ్’కు ఈ బడ్జెట్లో రూ.5 కోట్లు మాత్రమే కేటాయించడంతో ఆర్ఎంఎఫ్కు నిధులు సమకూర్చేందుకు వెంచర్ కేపిటలిస్టులు, ఏంజెల్ ఇన్వెస్టర్లు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.