ఇదేం పారిశ్రామిక విధానం?
అసెంబ్లీలో కాంగ్రెస్ మండిపాటు
- టీఎస్‌ఐపాస్ అమలులో పారదర్శకత ఏది?
- ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలేవీ?
- పాత పరిశ్రమలు మూతపడుతున్నా పట్టించుకోరేమి?
- లక్షలాది ఉద్యోగాల మాటలేమయ్యాయి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పారిశ్రామికాభి వృద్ధిపై ప్రభుత్వం చెపుతున్న మాటలు వాస్తవ దూరాలని కాంగ్రెస్ ఆరోపించింది. టీఎస్ ఐపాస్ అమల్లో పారదర్శకత కనిపిం చడం లేదని, ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అను కూలంగా వ్యవహరించడంలో, వారికి తగిన ప్రోత్సాహకాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడింది. సోమవారం అసెంబ్లీలో టీఎస్‌ఐపాస్, సులభతర వ్యాపార విధానంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ప్రభుత్వ ప్రకటనపై కాంగ్రెస్ పక్షాన ఆ పార్టీ సభ్యులు సంపత్‌కుమార్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. తొలుత సంపత్.. పారిశ్రామిక విధానంలో ప్రభుత్వ లోటుపాట్లను ఎత్తి చూపారు. ఏటా 2వేల కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి వస్తే వెయ్యి పాత పరిశ్రమలు మూత పడేలా ప్రభుత్వ విధానాలున్నాయని, దీనివల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. పాత పరిశ్రమలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.49 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి తన ప్రకటనలో చెప్పారని, అయితే అందులో రూ.21 వేల కోట్ల వరకు విద్యుత్ రంగంలో వచ్చినవేనని, విద్యుత్ రంగ పెట్టుబడులను వీలున్నంత తగ్గించాలని కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ స్వయంగా పార్లమెంటులో చెప్పారన్నారు. టీఎస్‌ఐపాస్ ద్వారా సత్వర అనుమతులు వస్తున్నాయని ప్రభుత్వం చెపుతుంటే వేలాది పరిశ్రమలు అనుమతుల కోసం ఎందుకు ఎదురుచూస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. తుక్కుగూడ సమీపంలోని పారిశ్రామిక సెజ్ లో రక్షణ శాఖకు చెందిన ఉత్పత్తుల కోసం ఏర్పాటు చేయనున్న పరిశ్రమ కోసం ఎకరాకు రూ.48లక్షల వరకు వసూలు చేసి.. మైక్రో మ్యాక్స్ అనే ప్రైవేట్ కంపెనీకి అంతకన్నా తక్కువకు భూమి ఇవ్వడంలో ఆంతర్యం ఏమి టన్నారు. టీఎస్‌ఐపాస్‌లో స్థానిక యువతకు అవకాశం కల్పించడం లేదన్నారు. ఐటీఐఆర్ ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తామన్న మాటలేమయ్యాయని ప్రశ్నించారు.
వాటి కింద ఒక్క రూపాయి అయినా ఇచ్చారా..?
టీప్రైడ్ కింద ఎస్సీలకు రూ.200 కోట్లు, ఎస్టీలకు రూ.100 కోట్ల బడ్జెట్‌ను ఇస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. క్రెడిట్ గ్యారెంటీకి ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ.100 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ.50 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. అసలు ఈ విషయంలో కనీసం నిబంధనలు రూపొందిం చారా అని ప్రశ్నించారు. పెట్టుబడి మొత్తంపై ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు ఇస్తామన్న 35 శాతం సబ్సిడీ, 100 శాతం వ్యాట్ మినహాయింపు, స్కిల్ అప్‌గ్రేడేషన్ నిధులు, రోడ్లు, విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పనలో 50 శాతం రాయితీలాంటి అంశాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన బిల్లులో పేర్కొన్న ఖాజీపేట రైల్‌కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్‌ఫ్యాక్టరీలను కూడా పట్టించు కోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో బియ్యం పరిశ్రమ సంక్షోభంలో ఉన్నా ఆదుకోవడం లేదన్నారు.
తెలుగులో మాట్లాడిన ఎంఐఎం సభ్యుడు
పారిశ్రామిక విధానంపై జరిగిన చర్చలో కౌసర్ (ఎంఐఎం), చింతల రామచంద్రా రెడ్డి(బీజేపీ), రేవంత్‌రెడ్డి (టీడీపీ), సున్నం రాజయ్య (సీపీఎం) కూడా మాట్లాడారు. ఎంఐఎం సభ్యుడు కౌసర్ తెలుగులో మాట్లాడడం విశేషం. కొంత తడబాటుకు గురయినా దాదాపు ఐదారు నిమిషాలు తెలుగులోనే ప్రసం గాన్నంతా చదివారు. మంత్రి కేటీఆర్ ఆంగ్లంలో ప్రకటన చేసిన సందర్భంలోనే ప్రతిపక్ష సభ్యులు గొడవ చేశారు. తెలు గులో మాట్లాడాలన్నారు. కౌసర్ మాట్లా డిన తర్వాత రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి తనకొచ్చిన భాషలో సమాధా నం చెప్పినా ఎంఐఎం సభ్యుడు తెలుగు లో మాట్లాడి తెలంగాణ భాషకు గౌరవం తెచ్చారన్నారు. అంతకుముందు కాంగ్రెస్ సభ్యుడు సంపత్ మాట్లాడుతూ మంత్రి అమెరికాలో చదువుకుని ఇంగ్లిష్ లో మాట్లాడారని, తాను తెలంగాణలో చదువుకున్నా ఇంగ్లిష్ నేర్చుకున్నానని అన్నారు.